Wednesday, October 28, 2026

795. నమ్మకాలకు ఆధారం

 

నమ్మకాలకు  ఆధారం



మన కళ్ళే మనల్ని అనేక సార్లు మోసం చేస్తాయి  . . . ఎడారిలో ఒయాసిస్ ల వలే.


మనం నమ్మే  నమ్మకాల కు ఆధారం ఏముంటుంది ?


మనం భౌతిక ప్రపంచంలో అనేక విషయాలను వింటుంటాం, చూస్తుంటాం , పరిశీలిస్తూ ఉంటాం. వాటిని బట్టి నమ్మకాలు అనేవి ఏర్పరచుకుంటాం.

ఈ నమ్మకాలు అనేవి సరియైన వేనా  లేక మూఢత్వం , అంధత్వం తో ముడిపడి ఉన్నాయా అని గ్రహించే శక్తి మనకు అనేక సార్లు ఉండదు. 

అందుకే నమ్మకాల వలన కూడా మోసపోవడం చాలా సార్లు జరుగుతుంది. 

మరి,  ఒక నమ్మకాన్ని నమ్మి అనుసరించాలి, అడుగు ముందుకు వేయాలి అంటే ఎలా ?

అందుకు ఆధారం ప్రదానం . . . అవును ప్రతీ నమ్మకానికి ఒక ఆధారం కావాలి . ఎందుకంటే ఒక నమ్మకం సత్యమైనది అయితే ఆధారం తప్పని సరిగా ఉండి  తీరుతుంది. ఆధారం అంటే స్వీయ అనుభవం . నీ స్వీయ అనుభవమే నీకు నమ్మకం కలిగిస్తుంది . అనుభవం అనేది నీకు నీవు గా మనసు తో సహజం గా  పొందగలిగేది. నీ నమ్మకానికి నీ మనసే ప్రధాన సాక్షి అవుతుంది. 


అలా కాకుండా, ఎవరో ఏదో చెప్పారని, ఎక్కడో ఏదో జరిగిందని , ఎక్కడో ఏదో చూసామని ప్రతి విషయం పై నమ్మకం ఉంచడం వలన అనేక విషయాలలో, సందర్భాలలో మోసపోవడమే జరుగుతుంది. 

ఎందుకంటే ఎవరి, ఆలోచనలను బట్టి వారు నమ్మకాలను ఏర్పరుచు కుంటారు. . . కానీ ఒక నమ్మకం లో సత్యం ఉన్నప్పుడు, అది నిజమైనది గా సృష్టి లో విరాజమానమై శోభిల్లుతూ , కాలంతో పాటు శాశ్వతంగా నిలిచి ఉంటుంది . అలా కాకుండా అవి మూఢత్వం, అంధత్వం కూడిన నమ్మకాలు అయితే కొంత సమయం మాత్రమే ఉండి , నీటి బుడగలా ఆ నమ్మకం సమసిపోతుంది .


ఇక్కడ నమ్మకం అనేది ఏదైనా , ఎటువంటి దైనా కావచ్చు . నీ నమ్మకం ధృడమైన ది , సత్యమైనది అయితే అది ఒక అనుభవం గా మారి , నీతో పాటు మరోకరికి చేరుతుంది. ఒకవేళ నీ నమ్మకం దృఢం గా ఉండి అందులో సత్యత లేదంటే అనుభవం గా మారదు, మరొకరికి చేరదు . 

ఇందులో సత్యత అనే అంశాన్ని నిర్దారణ చేసేవి ప్రకృతి మరియు విశ్వం. ఎందుకంటే ఇవి పవిత్రమైన భగవత్ శక్తులు . ఈ శక్తుల ద్వారా మాత్రమే మంచి , సరియైన నమ్మకాలు అనుభవాలు గా మారి అందరినీ చేరుతాయి . 

ఇక్కడ నమ్మకం అనేది మనిషి పై మనిషి కి ఉన్నది కావచ్చు, భగవంతుని పై కావచ్చు లేదా మరే ఇతర పరిస్థితి, అంశానికి సంబంధించినది కావచ్చు . 

నమ్మకం అంటే విశ్వాసం . అనుకున్న విషయం లో అనుభవం అనుభూతి సిద్దించని నాడు , ఆ నమ్మకం లో నిజం లేదని అర్దం . తద్వారా ఆ నమ్మకం దుఃఖం మిగులుస్తుంది . 

నీకు ఉన్న నమ్మకం ఎటువంటిదో నీకు తెలియాలంటే ముందు నీ ఆలోచనలలో శుద్ది ఎంత ఉన్నది అనేది ముఖ్యం. ఎందుకంటే నీ ఆలోచనలలో శుద్ది లేకపోతే నీ ప్రతి నమ్మకం చేదు గానే మిగిలి ఉంటుంది. 


నమ్మకం అనే అంశం ప్రతి మనిషి కి ముఖ్యం. ఎందుకంటే నమ్మకం పైనే మనిషి జీవితం అడుగులు వేస్తుంది. అందుకే మన నమ్మకాల పట్ల అవగాహన అనేది చాలా అవసరం. లేదంటే మన నమ్మకాలే మనల్ని పాతాళం లోకి నెట్టి వేస్తాయి. కారణం మనం ప్రస్తుతం మాయా ప్రపంచం లో జీవిస్తున్నాం . "మాయ"   నమ్మకాలకు  మైకం కలిగిస్తుంది ,  మూఢత్వం ఆపాదిస్తుంది . మనలోని శక్తి ని నిర్వీర్యం చేస్తుంది. 


నమ్మకాలు గట్టి గా ఉండొచ్చు కానీ, ఎప్పుడూ గుడ్డిగా మాత్రం ఉండకూడదు. 

చివరిగా మనం గుర్తు పెట్టుకోవలిసింది ఒకటే . . . మన నమ్మకం మనకు భయం కలిగిస్తుందా లేదా ధైర్యం ఇస్తుందా?.


నమ్మకం లో సత్యం ఉంటే , అనగా అందులో నిజం ఉన్న నాడు మనసు కి ఏదొ ఒక మంచి అనుభవాన్ని, భౌతికంగా ఏదో ఒక ఆధారాన్ని చూపిస్తాయి . అప్పుడు ఆ నమ్మకాలు ఎన్నటికీ ఊహలు గా మిగిలి పోవు , నిర్వీర్యం కావు.


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 .

యడ్ల శ్రీనివాసరావు 28 Oct 2026 11:00 AM 

No comments:

Post a Comment

806. మౌనంగా అందరినీ వదిలేయండి-4

  మౌనంగా అందరినీ వదిలేయండి (నాల్గవ భాగం) దయచేసి . . .  మొదటి మూడు భాగాలు     (803 ,804 ,805 ) చదివిన తరువాత మాత్రమే ఈ రచన చదువగలగరు 🙏   ఇ...