Friday, November 13, 2026

806. మౌనంగా అందరినీ వదిలేయండి-4

 

మౌనంగా అందరినీ వదిలేయండి

(నాల్గవ భాగం)


దయచేసి . . .  మొదటి మూడు భాగాలు     (803 ,804 ,805 ) చదివిన తరువాత మాత్రమే ఈ రచన చదువగలగరు 🙏


 

ఇప్పుడు దీన్ని లోతుగా అర్థం చేసుకోండి. 

వదిలేయడం అంటే ఎప్పుడూ కేవలం జనాలను వదిలేయడం కాదు . కొన్నిసార్లు సోమరితనాన్ని వదిలి పెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు పనులను వాయిదా వేయడాన్ని వదిలి పెట్టాల్సి వస్తుంది. ఎల్లప్పుడూ మొబైల్ లో మునిగిపోవడాన్ని , ఎల్లప్పుడూ దుఃఖిస్తూ ఉండడాన్ని మరియు మీ పాత గుర్తింపును వదిలి పెట్టాల్సి వస్తుంది.

అందువల్ల మౌనంగా అందరిని వెనక్కి వదిలేయి అనే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి.


ఈ అందరిలోనూ మిమ్మల్ని కిందికి లాగే ఆ చెడ్డ అలవాట్లన్నీ కలిసి ఉంటాయి. మీకు ఒక విషయం తెలుసా , మీ అత్యంత మూల్యమైన ఆస్తి డబ్బు కాదు మీ సమయం .

నేటి నుండి మీ సమయాన్ని పవిత్రమైనదిగా పరిగణించండి. మీరు దాన్ని ఎవరికి ఇస్తున్నారు అనే దానిపై అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఒక్కరితో  సంభాషణ మీకు అవసరం అవదు . ప్రతి ఒక్క వాదన విలువైనది కాదు , అలాగే ప్రతి బంధాన్ని కాపాడుకోవాలనే నియమం కూడా లేదు. మీ కలలకు కేటాయించాల్సిన సమయాన్ని మీరు , పనికి రాని జనాల కోసం గడుపుతుంటే , మీరు మీ భవిష్యత్తునే తాకట్టు పెడుతున్నారని అర్థం.


ఎప్పుడూ అందరితోనూ ఉండాలనుకునే వాడు తనను తాను ఎలా కనుగొనగలడు ? జనాల గందరగోళం , అల్లరి మరియు నకిలీ సంబంధాల నుండి మీరు కొద్దిగా దూరం జరిగినప్పుడు మాత్రమే మీరు మొదటిసారి మీ నిజమైన శక్తిని అనుభవిస్తారు.


కానీ జాగ్రత్త ,  మీరు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక కష్టమైన దశ ఎదురవుతుంది. ప్రారంభంలో మీకు కొద్దిగా నొప్పి   బాధ , మీలో మీకు పెనుగులాట అనిపించవచ్చు. మీరు వదిలి వచ్చిన కొందరు వ్యక్తులు గుర్తుకు రావచ్చు. కొన్ని రాత్రులు భారంగా అనిపించవచ్చు. కొన్ని రోజులు ఖాళీ గా శూన్యం గా కనిపించవచ్చు. కానీ దయచేసి ఓపిక పట్టండి . ఇది ,  పాత చెడ్డ అలవాటును వదిలేటప్పుడు వచ్చే తపనే తప్ప మీ ఓటమి కాదు. శరీరంలో నుండి విషం బయటకు వెళ్లేటప్పుడు ఎలాగైతే అస్వస్థత  కలుగుతుందో ,  అలాగే మనం ఎంచుకున్న తప్పుడు వ్యక్తుల సంబంధాలు విరిగిపోయేటప్పుడు మనసు చంచలం అవుతుంది.


కానీ  , ఆ అశాంతి తర్వాతే అద్భుతమైన శాంతి దొరుకుతుంది.  ఆ దూరం తర్వాత నిజమైన శక్తి వస్తుంది. నియమబద్ధంగా మీ మనసు తేలిక అవుతుందని మీరే గమనిస్తారు. నిద్ర మెరుగవుతుంది. మీ లక్ష్యాలు మళ్ళీ గుర్తుకొస్తాయి. ఎందుకంటే చాలాసార్లు మానసిక  అనారోగ్యానికి కారణం మన జీవితం కాదు మనం చేరిన తప్పుడు సాంగత్యాలే .


మీరు ఎవరికీ శిక్ష వేయాల్సిన అవసరం లేదు. కేవలం మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఎవరికీ చెడు కోరకండి , కేవలం వారి నుండి దూరం పాటించండి . అపరిపక్వమైన వ్యక్తి ప్రతీకారం తీర్చుకుంటాడు. కానీ పరిపక్వమైన వ్యక్తి నిశ్చలంగా ముందుకు సాగుతాడు.

ఒకరోజు అదే జనాలు వచ్చి నువ్వు ఇంతగా ఎలా మారావు అని అడుగుతారు. అప్పుడు మీరు కేవలం మౌనం తో   ఒక చిరునవ్వు  నవ్వండి చాలు , పొడవాటి సమాధానం ఇవ్వకండి. మార్పు యొక్క చరిత్ర మాటలలో ఉండకూడదు ,  మీ వ్యక్తిత్వంలో కనిపించాలి . మీ కంటి చూపులోని శాంతే దానికి సమాధానం అవుతుంది. మీ విజయమే మీ అతి పెద్ద సమాధానం అవుతుంది. 


అందువల్ల ఎవరైతే మిమ్మల్ని వదిలి వెళ్ళారో అని దుఃఖించకండి. బదులుగా మీ జీవితంలో ఎవరెవరు స్పష్టమయ్యారో అని సంతోషించండి.

ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకోలేదో అని బాధపడకండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి సమయం దొరికిందని సంబరపడండి.


ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఇప్పటి నుండి మీ కొత్త కథను , ఆత్మ కధను రాయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఈనాడే ఈ దృఢమైన నిర్ణయాన్ని తీసుకోండి. నేను ఎవరికీ అతుక్కుని బ్రతకను నా నెమ్మదిని అమ్మి ఎవరి సాంగత్యాన్ని కొనుగోలు చేయను. నా ఆత్మగౌరవాన్ని కోల్పోయి ఏ బంధాన్ని కాపాడుకోను. భయంతో ఎవరిని పట్టుకొని ఉంచను. నేను ఒంటరిగా నడవడానికి నేర్చుకుంటాను. నేను నన్ను నేను ఎంచుకుంటాను. 

మీరు మిమ్మల్ని మీరు ఎంచుకోవడం ప్రారంభించినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. జీవితం మిమ్మల్ని ఎంచుకోవడం ప్రారంభిస్తుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సరైన జనాలు మీ వైపు ఆకర్షితులు అవుతారు. మీరు అడగకుండానే గౌరవం దొరుకుతుంది. మరియు అత్యంత అందమైన విషయం ఏమిటంటే మీరు ఇకపై ఎవరి వెనక పరిగెత్తాల్సిన అవసరమే ఉండదు. 


ఎందుకంటే మిమ్మల్ని మీరు కనుగొన్నవాడు సగం ప్రపంచాన్ని గెలిచినట్టే మిగిలిన సగం ప్రపంచం సమయం వచ్చినప్పుడు వాటంతటా అదే మీ దగ్గరకు వస్తుంది. 

మనిషి తనతో తాను అనుసంధానం (కనెక్ట్) అయినప్పుడు జీవితం అతనికి వ్యతిరేకంగా ఉండదు. బదులుగా అతని పక్షాన ప్రవహించడం ప్రారంభిస్తుంది.

కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండండి . . .

దూరం వెళ్ళిన తర్వాత కూడా చాలామంది జనాలు ఒక పెద్ద తప్పు చేస్తారు. అదేమిటో తెలుసా , వారు జనాల నుండి దూరమవుతారు కానీ బాధకి , నొప్పి కి అతుక్కుపోయి ఉంటారు. వారు సంబంధాన్ని ముగిస్తారు కానీ మనసులో పాత కథ నడుస్తూనే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి ఇటువంటిది కేవలం సగం సగం వదిలివేయడం మాత్రమే . . . 

పూర్తిగా వదిలివేయడం అంటే మీరు ఆ వ్యక్తి నుండి మాత్రమే కాదు ఆ వ్యక్తి ఇచ్చిన నొప్పి నుండి కూడా ముక్తులు కావడం . మీకు నొప్పి ఇచ్చిన వారికి ప్రతిరోజు మీ మనసులో చోటు ఇవ్వడం ఆపేయండి.

మీ విలువ తెలియని వారిని మీ ఆలోచనలలో కేంద్రంగా చేయకండి. జనాలు బయటి నుండి ఎంత హాని చేస్తారో , అంతకంటే ఎక్కువ హాని మనం వారికి మన మనసు లో చోటు ఇవ్వడం ద్వారా చేసుకుంటాము. కాబట్టి కేవలం బయటి దూరమే కాదు లోపల నుండి కూడా వారిని తుడిచివేయడం అత్యంత అవసరం.


ప్రపంచంలోనే అతి పెద్ద జైలు ఏదో తెలుసా. అది ఇనుప ఊసలతో చేసింది కాదు , బదులుగా మీ సొంత ఆలోచనలతో చేయబడినది. ఇప్పుడు మీ మనసును శుభ్రపరచడం ప్రారంభించండి. పాత విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం ఆపేయండి.

ప్రతిరాత్రి అదే దృశ్యాన్ని గుర్తు చేసుకోవడం ప్రతి ఉదయం అదే వ్యక్తి గురించి ఆలోచిస్తూ లేవడం దయచేసి ఆపేయండి. ఈ అలవాటు మిమ్మల్ని మీ గతానికి ఖైదీగా మారుస్తుంది. మీరు నిజమైన జైలులో లేరు కానీ మీ మనసు బంధీ అయింది.

గుర్తుంచుకోండి . . . 

జైలు తలుపు తెరచే ఉంది. మీరు కేవలం బయటకు అడుగు పెట్టడమే ఆలస్యం. 

మీరు తీర్చుకున్న అతి పెద్ద ప్రతీకారం ఏమిటో తెలుసా? అది మీ శాంతి. 

అతి పెద్ద గెలుపు ఏమిటి?   మీ అభివృద్ధి. 

మరియు 

అత్యంత అందమైన సమాధానం ఏమిటి? మీ ముఖంపై ఉండే చిరునవ్వు. 

ఎవరైనా మిమ్మల్ని పడగొట్టడానికి  ప్రయత్నం  చేసినపుడు , మీరు ఇంకా ఎత్తుకు ఎదిగితే అదే వారికి అతి పెద్ద సమాధానం.

ఎవరైనా మిమ్మల్ని విచ్చిన్నం చేయాలనుకుంటే , మీరు మరింత గట్టిగా మారితే అదే అతి పెద్ద గెలుపు , ఎవరైనా మిమ్మల్ని ఏడిపిస్తే మీరు జీవితానికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకుంటే. అదే వారికి ఇచ్చే సరైన సమాధానం . 


ఇప్పుడు మీ రోజుకు ఒక కొత్త దిశను ఇవ్వండి. ఉదయం లేచి మీ శరీరం మనసు మరియు ఆత్మను మేల్కొల్పండి. కొద్దిగా నడవండి , కొద్దిగా చదవండి , కొద్దిగా ధ్యానం చేయండి , కొద్దిగా మీ ఆలోచనల ను పుస్తకం లో రాయండి. ప్రతిరోజు మిమ్మల్ని మీరు శాతంలో ఒక శాతం మెరుగుపరుచుకోండి.


జనాలు రాత్రికి రాత్రే అద్భుతాలను ఆశిస్తారు. కానీ అద్భుతాలు ప్రతిరోజు చేసే , చిన్న క్రమశిక్షణ ద్వారా సృష్టించబడతాయి. కొండలు ఒక్కసారిగా లేవవు. భూమి నిదానంగా పైకి లేస్తుంది.


ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ మొత్తం జీవిత దృక్పదాన్నే మార్చివేయవచ్చు.


మౌనంగా అందరినీ వెనక్కి వదిలేయి అనేదానికి , మరో అర్థం ఏమిటంటే ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేయండి. వేరే వాళ్ళ హోదా చూసి దుఃఖ పడకండి. వేరేవాళ్ళ విజయం చూసి విరిగిపోకండి. ఎవరి పెళ్లి , ఎవరి ఉద్యోగం , ఇంకెవరి కీర్తిని చూసి మిమ్మల్ని మీరు చులకనగా అంచనా వేసుకోకండి. 

మీరు వేరే వాళ్ళ కథలోని పేజీలలో బ్రతకడం లేదు. మీ పుస్తకమే వేరు , మీ అధ్యాయమే వేరు మరియు మీ సమయమే వేరు . పోలిక అనేది ఎలాంటి శబ్దం లేకుండా మనుషుల ఆత్మవిశ్వాసాన్ని చంపేసే ఒక భయంకరమైన విషం.


గుర్తుంచుకోండి . . . 

ఈరోజు ఎవరైతే అందరికంటే వెనక ఉన్నారో వారే రేపు అందరికంటే ముందుకు రావచ్చు. జీవితం అనేది ఒక నేలసారమైన రేఖ కాదు ప్రతి మలుపులోనూ ఒక కొత్త అవకాశాన్ని దాచుకున్న ఒక అద్భుతమైన ప్రయాణం .


అనుభవాల  రాతలు 

తలరాతను  తిరిగి  రాస్తాయి.


ఒంటరిగా  ఉండడం  అంటే ఏకాకితనం కాదు . . మనతో మనం గడపడానికి  దొరికిన  అరుదైన అవకాశం.


సమాప్తం 🙏


ఓం శాంతి .

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు. 10 Nov 2026 10:00 AM. 

Thursday, November 12, 2026

805. మౌనంగా అందరినీ వదిలేయండి-3

 

మౌనంగా అందరినీ వదిలేయండి

(మూడవ భాగం)



దయచేసి ఒకటి ,రెండవ భాగాలు (803 ,804) చదివిన తరువాత మాత్రమే ఈ రచన చదువగలగరు 🙏


ఇంతవరకు మీరు ఇతరుల వెనక పరిగెడుతున్నారు. కానీ ఎప్పుడైనా మీ లోపలి గొంతును విన్నారా ? మీరు అందరికీ సమయం ఇచ్చారు కానీ మీ సొంత కలలకు ఎప్పుడైనా సమయం ఇచ్చారా ? అందరి సమస్యలను మోసారు కానీ మీ ఆత్మ మీద ఉన్న బరువును ఎప్పుడూ చూడనేలేదు. ఇప్పుడు ఈ దిశను మార్చే సమయం వచ్చింది. విరిగిపోయిన ఇల్లును ఎలాగైతే తిరిగి కట్టవచ్చో అలాగే విరిగిపోయిన మనసును కూడా కొత్తగా కట్టవచ్చు. ప్రతిరోజు ఒక ఇటుకను అమర్చాలి. ఒక కొత్త అలవాటు , ఒక కొత్త ఆలోచన , ఒక కొత్త నిర్ణయం మరియు ఒక కొత్త   క్రమశిక్షణ కానీ గుర్తుంచుకోండి ఏ పెద్ద మార్పు ఒక్క రోజులో జరగదు అది చిన్న చిన్న అడుగుల ద్వారా పుడుతుంది కాబట్టి తొందర పడకండి అలాగే ఆగిపోకండి.


ఉదయం లేచి మీతో మీరు ఇలా చెప్పుకోండి. ఈరోజు నేను నా శక్తిని వ్యర్థం చేయను. నా విలువ తెలియని వ్యక్తి గురించి ఈరోజు నేను ఆలోచించను. నన్ను చులకనగా చూసిన ప్రదేశం గురించి నేను చింతించను. ఈరోజు  నన్ను నేను నిర్మించుకుంటాను. ఇతరుల గురించి ఆలోచించడం లో వ్యర్థమవుతున్న శక్తిని ఇప్పుడు మీ భవిష్యత్తు నిర్మాణంలో పెట్టుబడి పెట్టండి. దుఃఖంలో చుట్టుకుపోతున్న శక్తిని మీ లక్ష్యం వైపు మళ్లించండి.


కానీ , మనుషుల యొక్క అత్యంత ప్రమాదకరమైన అలవాటు ఏమిటో మీకు తెలుసా . . . మీకోసం ఎప్పుడూ లభ్యం కాని  (అందుబాటులో లేని) జనుల కోసం మీరు ఎప్పుడూ లభ్యంగా (అందుబాటు లో) ఉండటం . మనుషులు పదే పదే ఇదే తప్పు చేస్తారు. ఎక్కడ గౌరవం దొరకదో అక్కడికే తిరిగి వెళ్తారు. ఎక్కడ మనసు కి బాధలు నొప్పులు దొరికాయో అక్కడే ఆశలు పెట్టుకుంటారు . ఎక్కడ విరిగి పడ్డారో అక్కడే ప్రేమను వెతుకుతారు .

దయచేసి అర్థం చేసుకోండి ఇది ప్రేమ కాదు. ఇది కేవలం ఒక పాత అలవాటు . 

మెలుకువ తెచ్చుకోండి మిమ్మల్ని పదే పదే విడగొట్టే ఆ వ్యక్తిని లేదా ఆ ప్రదేశం , ఆ సాంగత్యం . . . మీ ఇల్లు గా కావడం , సదా కాలం సాధ్యం కాదు . అందుకే, మౌనంగా అందరినీ వెనక్కి వదిలేయండి , అంటే కేవలం పాత జనాలనే కాదు మీ పాత ఆలోచనలను కూడా వదిలేయడం .


నేను ఒంటరిగా బ్రతకలేను . నా విలువను ఇతరులు నిర్ణయిస్తారు. వారు లేకుండా నేను సంతోషంగా ఉండలేను , అనే భ్రమలన్నింటిని ముందు వదిలేయండి . మనుషులు మొదట మనసుకే బంధి అవుతారు. ఆ తర్వాతే బంధాలకు . ఒకసారి మీ మనసు స్వతంత్రమైతే ప్రపంచంలోని ఏ గొలుసు కూడా మిమ్మల్ని బంధించలేదు . 


ఇప్పుడు మీ మనసు లో కొత్త స్థలాన్ని సృష్టించండి. మొదట ఎక్కడెక్కడ ఫిర్యాదులు ఉన్నాయో అక్కడ కృతజ్ఞతను తీసుకోండి. ఎక్కడ కోపం ఉందో అక్కడ అవగాహనను తీసుకోండి. ఎక్కడ బలహీనత ఉందో అక్కడ అభ్యాసాన్ని తీసుకోండి. ఎక్కడ పోలిక ఉందో అక్కడ ఆత్మవిశ్వాసాన్ని తీసుకోండి. ఎందుకంటే జీవితం ఎల్లప్పుడూ ఖాళీ స్థలంలోనే కొత్తదాన్ని నింపుతుంది . . .మీలో పాత చెత్తే , నిండి ఉంటే కొత్త వెలుతురు ఎలా ప్రవేశిస్తుంది?


కానీ కొద్దిగా ఆగండి. మీరు పాత వారిని వదిలేసినప్పుడు ఒక విచిత్రమైన ఆట మొదలవుతుంది.

మీరు వదిలి వేసిన వారు ఏం చేస్తారో తెలుసా మీరు దూరం అవుతుండగానే కొందరు వ్యక్తులు మిమ్మల్ని గుర్తు చేసుకోవడం ప్రారంభిస్తారు. ఎందుకో తెలుసా . . . ఎందుకంటే , వారికి మీరు కావాల్సి కాదు. మీ నుండి వచ్చే సౌలభ్యాలు కావాలి. వారికి మీపై ఉన్నది ప్రేమ కాదు , మీరు వారికి ఒక అవసరం. మీ లభ్యత మాత్రమే వారికి కావాలి. 

మిమ్మల్ని కోల్పోయి , కేవలం మీ సౌలభ్యాన్ని మాత్రమే ఆశించే వారు , మిమ్మల్ని ఎప్పటికీ పొందినట్లే కాదు . కాబట్టి తిరిగి వెళ్లి వారి వలలో పడకండి . కరుణ చూపడం వేరు , మళ్ళీ ఆ వలలో పడిపోవడం వేరు.  


ప్రపంచంలోని అతి పెద్ద శక్తి ఏమిటో మీకు తెలుసా? . . . మీరు ఒంటరితనంలో  ఒదిగి ఉండడం . ఇప్పుడు మీరు మీ ఒంటరితనాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకోవాలి. అక్కడ మిమ్మల్ని మీరు చదవగలరు , మీరు ఎన్నో నేర్చుకోగలరు . మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి . అపరిమితమైన సమయం లభిస్తుంది , ధ్యానం చేయండి . ప్రణాళికలు వేసుకోండి . కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి . మరియు ధర్మం గా  డబ్బు సంపాదించే మార్గాలను కనుగొనండి. 


చాలామంది జనాలు ఒంటరితనంలో కూర్చొని ఏడుస్తారు. కానీ కొందరు అదే ఒంటరితనంలో మిమ్మల్ని మీరు గట్టిగా నిర్మించుకుంటారు. ఇప్పుడు నిర్ణయం మీదే మీ మనసు నొప్పిని ఒక సాకుగా మార్చుకుంటారా లేదా ఇంధనంగా వాడుకుంటారా?

గుర్తుంచుకోండి . . . తనతో తాను సంతోషంగా ఉండటం నేర్చుకున్న వ్యక్తిని , ఈ ప్రపంచం ఎప్పటికీ నియంత్రించలేదు.  మేము నిన్ను వదిలి వెళ్ళిపోతాము అని ఎవరిని బెదిరించడానికి  ఎవరికీ సాధ్యం కాదు. 

ఎవరు ఒంటరిగా ఉండటం నేర్చుకుంటాడో అతను సగం ముక్తుడు అవుతాడు. ఎవరు ఒంటరితనాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటాడో అతను పూర్తిగా స్వతంత్రుడు అవుతాడు.


మిగిలినది నాల్గవ భాగం లో . . . 



Wednesday, November 11, 2026

804. మౌనంగా అందరినీ వదిలేయండి-2

 

మౌనంగా అందరినీ వదిలేయండి

(రెండవ భాగం)


దయచేసి మొదటి భాగం (803) చదివిన తరువాత మాత్రమే ఈ రచన చదువగలగరు 🙏


అసలైన ప్రయాణం అక్కడి నుంచే ఆరంభం అవుతుంది. 

మౌనంగా అందరినీ వెనక్కి వదిలేయడం అంటే మనసులో   ద్వేషాన్ని  పెంచుకోవడం అని అర్థం కాదు . ప్రతీకారం తీర్చుకోవడం అని అర్థం కాదు.

దీనికి స్పష్టమైన అర్థం ఏమిటంటే . . . ఎక్కడ మీ గౌరవం ఉండదో  అక్కడ మీ అస్తిత్వాన్ని(ఉనికిని) ఉంచకండి.  మీ శాంతి ఎక్కడైతే చెదిరిపోతుందో   ఆ వాతావరణానికి మళ్ళీ మళ్ళీ వెళ్ళకండి . మిమ్మల్ని ఎక్కడైతే చులకనగా చూస్తారో అక్కడ మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి నిలబడకండి . . . పడిన చోట నుంచి లేవండి , నవ్వండి , వారిని మనసు తో ఆశీర్వదించండి , వదిలేయండి మరియు మౌనం గా ముందుకు సాగండి. 


మీ జీవితంలో అతి పెద్ద తప్పు ఏమిటో మీకు తెలుసా? మీ సొంత విలువే . . . మీ అంతరంగిక స్థితి గురించి తెలియని వారి దగ్గర , మీరు మీ విలువను అడగడం , ఆశించడం . 

మీరు కలలుకనే  ముందే , అప్పటికే ఓడిపోయిన వారి చేతిలో మీ కలలను నిర్ణయించుకోనివ్వడం మీరు చేసే అతి పెద్ద తప్పు. 


ఇప్పుడు ఈ తప్పును ఆపేయండి మరియు మీ విలువను మీరే గుర్తించండి. కొందరు వ్యక్తులు , మీరు వారి ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని ఇష్టపడతారు. ఎప్పుడైతే మీరు మీ సరిహద్దులను నిర్ణయిస్తారో వారు దూరమైపోతారు. గుర్తుంచుకోండి ఇది , వారు మీపై చూపేది  ప్రేమ కాదు , కేవలం అవసరం . . . .  స్వార్ధపరులైన వ్యక్తుల నుండి దూరంగా ఉండటమే నిజమైన ఆత్మగౌరవం. మిమ్మల్ని స్వతంత్రంగా చూడడానికి ఎవరైతే సంతోషిస్తారో వారు మాత్రమే మీ వారు .   


ఇప్పుడు ఒక చివరి ప్రశ్న  మీరు ఈ ప్రపంచానికి ఇవ్వగలిగిన అత్యున్నతమైన సమాధానం ఏమిటో మీకు తెలుసా? . . . 

ఆ అందమైన సమాధానం , విజయం కాదు . మౌనం కూడా కాదు . అది మార్పు. అవును మీరు మిమ్మల్ని పూర్తిగా మార్చుకున్నప్పుడు ప్రపంచంలోని ప్రశ్నలన్నీ వాటంతటా అవే ముగిసిపోతాయి.

మిమ్మల్ని తేలికగా తీసుకునే వారు ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతారు . మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించేవారు కేవలం చూస్తూనే ఉంటారు. మిమ్మల్ని విచ్చిన్నం చేయాలనుకున్న వారు మీరు ఇంత బలంగా ఎలా మారేరో అర్థం చేసుకోలేరు. అందువల్ల ఇతరులతో వాదించడం తగ్గించండి మరియు మీలోని మార్పును ఎక్కువగా చేయండి. 


ఒకసారి ఆగి ఆలోచించండి. మీరు ప్రతిరోజు బాధపడుతున్నారా . . . ఒకవేళ అలా అయితే ఆ బాధ మీ పరిస్థితుల వల్ల వచ్చిందా లేక మీ సాంగత్యా లలో వ్యక్తుల వల్ల వచ్చిందా ?

చాలాసార్లు సమస్య మన జీవితం కాదు . మనం ఎవరితో కలిసి జీవిస్తున్నామో ఆ జనాలే సమస్యగా ఉంటారు. ఒక విషపూరితమైన వాతావరణంలో ఒక అందమైన పువ్వు కూడా వాడిపోతుంది. అలాగే తప్పుడు వాళ్ళ మధ్య ఎంత మంచి వ్యక్తి ఉన్నా సరే విరిగిపోతాడు.  విషపూరిత వ్యక్తుల  సాంగత్యాల వాతావరణాన్ని మార్చాలి అనుకోవడం  బలహీనత కాదు మీ బుద్ధి బలం. 


కానీ మిమ్మల్ని మీరు మళ్ళీ ఎలా నిర్మించుకోవాలి . 


మౌనంగా అందరిని వెనక్కి వదిలేయండి మరియు మిమ్మల్ని మీరు గట్టిగా పట్టుకోండి. ఉదయం త్వరగా లేవండి . శరీరాన్ని బలపరుచుకోండి . మనసును శాంతపరచండి. కొత్త విషయాలు నేర్చుకోండి . లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు మీ అలవాట్లను మెరుగుపరుచుకోండి.


ఇతరులను మెప్పించడానికి మీరు వృధా చేస్తున్న అదే శక్తిని ఇప్పుడు మీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఉపయోగించండి.

కేవలం కొద్ది నెలల్లోనే మీ ముఖ కవళికలు పూర్తిగా మారిపోతాయి. కళ్ళలో కొత్త మెరుపు ఉంటుంది. మాటలలో స్థిరత్వం ఉంటుంది. మరియు నడిచే తీరులో అద్భుతమైన ఆత్మవిశ్వాసం వస్తుంది. మీరు అందరికీ ఎందుకు దూరమయ్యారో  ప్రతిసారి ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకునే వారు , మీరు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవడానికి ఇష్టపడని వారికి వంద కారణాలు చెప్పినా తక్కువే .


ఒకవేళ ఈరోజు మీరు అలసిపోయి ఉంటే , విరిగిపోయి ఉంటే , మరియు పదే పదే గాయపడి ఉంటే , గుర్తుంచుకోండి ఇదే సరైన సమయం మౌనంగా అందరినీ వెనక్కి వదిలేసి మిమ్మల్ని మీరు కొత్తగా పుట్టించుకోవడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే మనుషులు పూర్తిగా విరిగిపోయిన తర్వాతే జీవితం గురించి మరింత లోతుగా ఆలోచించడం ప్రారంభిస్తారు. తను గాయపడిన తర్వాతే ఎవరు నిజంగా తనవారో మరియు ఎవరు కేవలం నాటకాలు ఆడుతున్నారో అతనికి అర్థంవుతుంది.


అందువల్ల మీ జీవితంలో జరిగిన దాన్ని దురదృష్టం అని పిలవకండి. అది మిమ్మల్ని నిద్ర నుండి మేల్కొలపడానికి వచ్చిన ఒక సువర్ణ అవకాశంగా భావించండి . . . ఒకరోజు తప్పకుండా వస్తుంది , అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసి ఇలా అంటారు. నేను కొందరిని కోల్పోవడం చాలా మంచిదే అయింది. కొన్ని తలుపులు శాశ్వతంగా మూసుకుపోవడం మంచిదే అయింది. అందరినీ జతలో ఉంచుకోవాలనే ఆ పట్టుదలను నేను వదిలేయడం చాలా మంచిదే అయింది. ఎందుకంటే వారందరూ మీతోనే ఉండి ఉంటే మీరు ఎప్పటికీ మిమ్మల్ని మీరు కనుగొనేవారే కాదు. మీ నిజమైన శక్తి మీకు తెలిసేదే కాదు. 


అందువల్ల ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి . ఎలాంటి శబ్దం చేయకండి . ఎలాంటి ప్రకటనలు చేయకండి మరియు ఎవరిని దోషిగా చూపకండి . కేవలం మీ లోపలి నుండి లేచి నిలబడండి. మిమ్మల్ని కిందకు లాగే వారి నుండి , మిమ్మల్ని చులకనగా చూసే వారి నుండి , మిమ్మల్ని వాడుకునే వారి నుండి , మరియు మీ శాంతిని కదిలించే వారి నుండి దూరం పాటించండి. తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతం జరిగి తీరుతుంది.


తప్పుడు జనాలు మీ జీవితం , సమీపం నుంచి  వెళ్ళిపోయినప్పుడు సరియైన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. చెడ్డ శబ్దాలు ఆగిపోయినప్పుడు మీలోని మధురమైన సంగీతం వినిపిస్తుంది. నకిలీ సంబంధాలు విరిగిపోయినప్పుడు ఆత్మలతో ఆత్మలకు (ఒకరితో మరొకరికి ఆత్మ దృష్టి తో )  నిజమైన సంబంధాలు పెరుగుతాయి. గుంపు చెదిరిపోయినప్పుడు కొత్తదారులు తెరుచుకుంటాయి.

అందువల్ల భయపడకండి.


కొన్నిసార్లు కోల్పోవడమే పెద్దదాన్ని పొందడం అవుతుంది. కొన్నిసార్లు వదిలివేయడమే ముందుకు సాగడం అవుతుంది . కొన్నిసార్లు ఒంటరిగా నడవడమే సరైన జనాలను చేరుకునే మార్గం అవుతుంది. ఎప్పుడూ గుర్తుంచుకోండి మీరు ఎవరిని వదిలి పెట్టడం లేదు బదులుగా మీరు మిమ్మల్ని మీరు ఎంచుకుంటున్నారు .


మరియు ఏరోజు మనుషులు తనను తాను ఎంచుకుంటారో , అదే రోజు అతని కొత్త జీవితం ప్రారంభంవుతుంది. అదే క్షణంలో మీలో ఏదో మారిపోతుంది. మీ నడక అలాగే ఉంటుంది ముఖం అలాగే ఉంటుంది. ప్రపంచం కూడా దాదాపు అలాగే ఉంటుంది. కానీ మీరు చూసే దృక్పదం మాత్రం పూర్తిగా మారిపోయి ఉంటుంది. ఇదే నిజమైన మార్పు మరియు ఇదే అతి పెద్ద అద్భుతం.

మనుషులు , తనను తాను ఎంచుకున్నప్పుడు అతని అతి పెద్ద లోటు వేరే జనాలు కాదని బదులుగా తనకు తాను దూరమైపోయాడనే నిజాన్ని అతను మొదటిసారి అర్థం చేసుకుంటున్నాడని తెలుస్తుంది.


మిగిలినది మూడవ భాగం లో . . . 



Tuesday, November 10, 2026

803 . మౌనంగా అందరినీ వదిలేయండి -1

 

మౌనంగా అందరినీ వదిలేయండి 

(మొదటి భాగం)


జీవితంలో ప్రశాంతంగా ఉండటం ఎలా ?  

మనం ఎవరినైనా ఒక్కసారిగా దూరం పెట్టినప్పుడు నిజంగా ఏం జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

దీని ఫలితం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.

మౌనంగా అందరినీ వెనక్కి వదిలేయడం . ఇది కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు , భరించి భరించిన తరువాత కలిగిన ఒక లోతైన మరియు నిజమైన అవగాహన . 

ఇది పారిపోవడం కాదు తనను తాను రక్షించుకోవడం . ఇది  ద్వేషం కాదు  ఆత్మగౌరవం . చాలాసార్లు ఇతరులను పట్టుకొని ఉండే ప్రయత్నంలో మనుషులు తమకు తాముగా దూరమైపోతారు. అందరినీ మెప్పించే ఈ పరుగులో వారు తమ  శాంతిని  మరియు  తమ సత్యాన్ని రెండింటిని  కోల్పోతారు . ప్రతి ఒక్కరికీ వివరిస్తూ వివరిస్తూ  తన  శక్తంతా  కోల్పోయి ఒకరోజు అలసిపోయి తను తాను ప్రశ్నించుకుంటాడు , నేను ఎక్కడున్నాను అని. . . . మరియు అదేరోజు లోపలి నుండి  ఒక నిశ్శబ్దమైన గాలి , శక్తివంతమైన గొంతు వినిపిస్తుంది. ఇప్పుడు నిశ్శబ్దంగా అందరినీ వెనక్కి వదిలేయ్  అని . 

కానీ ఇది అంత సులువా అనిపిస్తుంది . కానీ మును ముందు జరగబోయేది మీ జీవితాన్నే పూర్తిగా మార్చి వేస్తుంది. 

గుర్తుంచుకోండి . . .  ప్రతి ఒక్కరిని మీ జోలి లో తీసుకువెళ్ళడం మీ పని కాదు. ప్రతి ఒక్కరి ముందు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం మీ బాధ్యత కాదు. ప్రతి ఒక్కరూ ఇష్టపడడానికి , మీరు మార్కెట్ లో అమ్మకానికి ఉండే ఏ వస్తువు కాదు . మీరొక అద్భుతమైన శక్తి మరియు ఈ అమూల్యమైన శక్తి తప్పుడు మనుషుల చేతులకు వెళ్ళినప్పుడు అది ఆరిపోవడం  ప్రారంభిస్తుంది . అందువల్ల మీ శక్తి ని కాంతిని లాక్కునే వారి నుండి దూరంగా ఉండటమే తెలివైన పని. 

కొందరు మీ జీవితంలోకి వచ్చి మీలో కొత్త ఆనందాన్ని జాగృతం చేస్తారు. వారితో మీకు సరైన మార్గం దొరుకుతుంది. కానీ మరికొందరు ఉంటారు. వారు దగ్గరకు రాగానే మీ శక్తినంతా పీల్చేస్తారు . మొదట గుర్తించండి , ఎవరు మిమ్మల్ని పైకి లేపుతారు మరియు ఎవరు కిందకు తోస్తారు అని . 


మిమ్మల్ని కిందకు లాగే వారిని నిశబ్దంగా వెనక్కి వదిలేయండి. అపుడు జనాలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీ పై రకరకాల కథలు అల్లవచ్చు , మీ ఉద్దేశాలను ప్రశ్నించవచ్చు మరియు మీ మౌనాన్ని మీ బలహీనతగా భావించవచ్చు. కానీ వారికి మళ్ళీ మళ్ళీ , మీ గురించి వివరించడానికి కూర్చోకండి.  మీరు మౌనంగా ఉంటే కాలమే , వారికి అత్యుత్తమమైన సమాధానం ఇస్తుంది. మాటలతో పోరాటం చేయకండి . కాలం , మౌనం ఈ రెండింటి కంటే పెద్ద వాదం వేరేదీ  ఏదీ లేదు. మారుతున్న మీ జీవితమే , వారికి అతి పెద్ద సమాధానం అవుతుంది. 



కానీ . . . మనం తప్పుడు వాళ్ళను ఎందుకు వదిలి పెట్టలేము . అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?  

దీని వెనక ఉన్న అసలు కారణం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.

ప్రతి బంధము కాపాడుకునే యోగ్యతను కలిగి ఉండదని మీరు నేర్చుకోవాలి.  కొన్ని బంధాలు కేవలం ఒక అలవాటుగా మారతాయి , ప్రేమతో కాదు .  కొన్ని బంధాలు కేవలం భయంతో నిలిచిపోతాయి  గౌరవంతో కాదు. మరియు కొన్ని బంధాలు  ప్రతిరోజు మీ ఆత్మను కొద్ది కొద్దిగా గాయపరుస్తాయి. అటువంటి బంధాలతో అతుక్కుని ఉండటం పుణ్యం కాదు మూర్ఖత్వం. వాటిని వదిలివేయడం పాపం కాదు మీకు మీరే ఇచ్చుకునే చికిత్స. 


అనేకమందికి  ఒంటరితనం అంటే భయం ఉంటుంది. అందుకే వారు ఇతరులను వదిలి పెట్టలేరు. వారు గుంపులో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఒంటరిగా ఉంటూ మిమ్మల్ని మీరు కొత్తగా నిర్మించుకోవడానికి ఒప్పుకోరు. 


గుర్తుంచుకోండి . . . ఒంటరితనం మీ శత్రువు కాదు .ఇక్కడే మీరు మొదటిసారి మిమ్మల్ని మీరు కలుసుకుంటారు. గుంపులో మీరు ఇతరుల గొంతు వింటారు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీ అసలైన గొంతు వినిపిస్తుంది. గుంపులో మీరు కేవలం ఒక పాత్రను అభినయిస్తారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మీరు పూర్తిగా మీలాగే ఉంటారు. కాబట్టి కొద్దిసేపు ఒంటరిగా నడవడానికి భయపడకండి. 

అసలైన ప్రయాణం అక్కడి నుంచే ప్రారంభంవుతుంది.



 మిగిలినది  రెండవ భాగం లో . . . 




Sunday, November 8, 2026

802. దీపం

 

 దీపం 


దీపం చీకటి ని పారద్రోలుతుంది . వెలుగు నింపుతుంది . ఆ వెలుగు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇల్లు చీకటిగా ఉన్నప్పుడు అంతా అంధకారం అనిపిస్తుంది . కానీ అదే ఇంటిలో దీపం వెలిగితే ఎంతో  వెలుగుతో స్పష్టంగా అన్నీ కనిపిస్తాయి .  

ఇంటిలో ఎదురుగా కనిపిస్తున్న మట్టి ప్రమిద దీపం నిత్యం వెలిగిస్తూ నే ఉంటాం . వాస్తవం అర్దం చేసుకో గలిగితే  మట్టి లో  నుంచి  తయారయిన  మానవుని  దేహం కూడా ఒక ఇల్లే .    మరి  నేడు మనిషి   తన  దేహం లో   ఉన్న  దీపం  ప్రతి రోజూ వెలిగిస్తున్నాడా ? ఇప్పటికే మనిషి శరీరంలో దీపం ఉంది.  అందుకే నొసట ఉన్న ఆ దీపానికి రోజు బొట్టు పెడుతూ ఉంటాడు  కానీ వెలిగించడు. అందుకే ఆ దీపం శరీరం లోపలి ఉండి నిద్రాణమైన స్థితి లో ఉంది. అందుకే మనిషి అజ్ఞాన అంధకారంలో  నేడు ఉన్నాడు. చీకటి వంటి దుఃఖం మనసు లో అనుభవిస్తూ ఉన్నాడు. పాపపుణ్యాల భేదం ఎరుగక జీవిస్తున్నాడు.  జ్ఞానమే సిరిసంపదలు అని  మాయ వలన  తెలియక , కరెన్సీ ధనమే అసలు సిసలైన ధనం అనుకొని  జీవిస్తున్నాడు. అవసరానికి మించిన ధనం పెరిగి పెరిగి చివరికి  మనిషి ని దుఃఖం లోకి నెడుతుంది అనే విషయం జీవితపు ఆఖరి క్షణం వరకు తెలియక నరకం తో జీవిస్తున్నాడు.  


మనిషి లో ఉన్న దీపం ఆత్మ. కానీ ఈ ఆత్మ అనేక జన్మలు గా శరీరాలు ధరిస్తూ జనన మరణాలు పొందుతూ ఉండడం వలన తన శక్తిని క్రమేపీ కోల్పోతూ చైతన్యం లేక నేటి మాయా కాలం లో పూర్తి నిద్రావస్థలో ఉంది. మనిషి లో ఉన్న దీపం (ఆత్మ) వెలిగిన నాడు జ్ఞాన ప్రకాశం నిండుతుంది . మనిషి లో ఉన్న అజ్ఞానం మూర్ఖత్వం అంధకారం దుఃఖం సమూలంగా పోయి ప్రకాశవంతమైన వెలుగుతో శాంతి , సుఖం , ఆనందం , ప్రేమ , జ్ఞానం, శక్తి పుష్కలంగా నిండుతుంది . మనిషి ఇవి సంపాదించు కున్న నాడు దేవత గా మారుతాడు . అందుకే "నరుడే నారాయణుడు గా"  అవుతాడు అన్నారు . 


నరకాసురుడు అనే రాక్షసుడిని సత్య భామ సంహరించింది అని , అందుకు చిహ్నం గా దీపావళి చేసుకోవడం జరుగుతుంది. ఇది కధ గా చదువుకున్నాం. 

 నరకాసురుడు “ నరక + అసురుడు “ .

 మానవుడు నరకం అనుభవించడానికి కారణమైన అసుర గుణాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు , ఈర్ష్య , అసూయలు. 

ఈ అసుర గుణాలను 

“సత్య భామ” సత్య(జ్ఞానము)+ భామ(శక్తి) 

అనగా జ్ఞానము అనే శక్తి తో రాక్షస గుణాలను నిర్మూలించుకోవడం వలన చైతన్యం వెలుగు ఆత్మలో నిండుతుంది . నిత్యానందం లభిస్తుంది. ఇదే దీపావళి పండుగ అర్దం.


దీపావళి ఒక్క రోజున ఇంటిలో దీపాలు వెలిగిస్తే ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. అదే విధంగా మనిషి తన లోని ఆత్మ జ్యోతి ని , పరమాత్మ శివుని జ్ఞానము మరియు ధ్యానము ద్వారా నిత్యం వెలిగించు కోవడం వలన మనిషి ఆత్మ , మనసు అఖండ జ్యోతి వలే నిత్యం ఆనందం తో నిండి పోతుంది. ఎంతటి సమస్య అయినా గడ్డి పోచ వలే తొలగిపోతుంది. 

దీపావళి తర్వాత రోజు  కార్తీక మాసం ఆరంభం అవుతుంది. కార్తీక మాసం  శివుని కి ఇష్టం అని అంటారు. భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామున 4 గంటల నుంచి పూజలు చేస్తారు, రోజూ దీపాలు వెలిగిస్తారు. దీని వలన పొందగలిగే ఫలితం అల్ప కాలికం మాత్రమే. 

ప్రతీరోజూ తెల్లవారుజామున 4 గంటల కు , మానవుడు నిద్ర లేచి తన లోని ఆత్మ జ్యోతి ని మౌనం తో ధ్యానం ద్వారా వెలిగించిన నాడు ,  పరమాత్మ తో పాటు కలిసి సమానంగా అడుగులు వేసే అవకాశం  లభిస్తుంది. చేసిన పూజలకు , భక్తి శ్రద్ధలకు ఫలితం గా శివుడు తన జ్ఞానాన్ని సద్గురువై నింపుతాడు. తనతో సమానంగా చేయి పట్టి నడిపిస్తాడు.

శివుడు జ్యోతిర్లింగ బిందువు . జ్ఞాన స్వరూపం .

 🪔దీపావళి శుభాకాంక్షలు 🪔


ఓం శాంతి 🙏 

శివ బాబా (శివుడే తల్లి తండ్రి)

యడ్ల శ్రీనివాసరావు 8 Nov 2026 9:30 PM.

Saturday, November 7, 2026

801. రాజయోగ ఫలాలు -6

 

సహజ రాజయోగ ఫలాలు 

1


మీ మాటల శక్తి   మీరు ఎంత అందంగా మాట్లాడతారు  అనేదానిపై  ఆధారపడి ఉండదు.    ఆ మాటల వెనుక  మీ మనసు ఎంత దృఢంగా మరియు  విశ్వాసంతో  నిండి ఉంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

మనసులో స్పష్టత, నమ్మకం మరియు ఆత్మబలం ఉన్నప్పుడు, సాధారణమైన మాటలు కూడా ఎవరి హృదయాన్నైనా  తాకగలవు,  ఎవరికైనా స్ఫూర్తినివ్వగలవు మరియు జీవితంలో మార్పును తీసుకురాగలవు.

కానీ మనసే   సందేహం , భయం మరియు సందిగ్ధతతో  నిండి  ఉన్నప్పుడు, అత్యంత అందమైన  పదాలు కూడా తమ ప్రభావాన్ని కోల్పోతాయి.

అందువల్ల మీ మాటలను ప్రభావవంతంగా మార్చుకునే ముందు మీ మనసును శక్తివంతం చేసుకోండి. మీ ఆలోచనలను దృఢపరచుకోండి,    మీ మాటలపై నమ్మకం ఉంచండి మరియు మీ భావాలను మీ మాటలతో జోడించండి.


ఎందుకంటే ప్రజలు కేవలం మీ మాటలను వినరు, ఆ మాటల వెనుక దాగి ఉన్న మీ శక్తిని కూడా అనుభూతి చెందుతారు.

మనసు శక్తివంతంగా ఉన్నప్పుడు, మాటలు కేవలం ఉచ్చరించబడవు… అవి నేరుగా హృదయాలను చేరుకుంటాయి.


2


మన ప్రతి ఆలోచన ప్రపంచంలో ప్రవహించే ఒక శక్తి. మన ప్రతి మాటలో ఒక భావన ఉంటుంది మరియు మన ప్రతి కర్మ ఎవరో ఒకరి జీవితాన్ని స్పృశిస్తుంది. 

కానీ సేవలలో అత్యంత లోతైన రూపం ఏమిటంటే—అది మాట్లాడక ముందే, ఏ పని చేయక ముందే ప్రారంభమవుతుంది ,  అదే మన ఆలోచనలు.

ఎవరి పట్లైనా మనం పవిత్రమైన భావనను కలిగి ఉన్నప్పుడు, వారి కోసం శుభాకాంక్షలు కోరుకున్నప్పుడు మరియు వారిలోని మంచిని చూసినప్పుడు, మనం ఎలాంటి మాటలు మాట్లాడకుండానే  ప్రేమ, శాంతి తరంగాలను ప్రసరింపజేస్తాము. 

మన కర్మల ద్వారా ప్రతి ఒక్కరికీ సహాయం చేయలేకపోవచ్చు, మన మాటలతో ప్రతి ఒక్కరినీ చేరుకోలేకపోవచ్చు, కానీ ప్రతి ఆత్మ కోసం మంచి భావనలను (శుభభావనలను) మాత్రం నిశ్చయంగా కలిగి ఉండవచ్చు.

దీనిలో అత్యంత సుందరమైన విషయం ఏమిటంటే, మన మనస్సు ప్రేమ, శాంతి మరియు శుభభావనలతో నిండిపోయినప్పుడు, ఆ సౌందర్యం మొదట మనలోనే అనుభవానికి వస్తుంది.

కేవలం మంచి పనులు చేసేవారే కాక, మీ స్వచ్ఛమైన ఆలోచనలు కూడా ప్రపంచంలో మంచిని విస్తరింపజేసేలా జీవించండి.


3


ప్రపంచాన్ని మార్చడం మన లోపలి నుంచి మొదలవుతుంది. 

ప్రతి ఆలోచనలోనూ ఒక శక్తి ఉంటుంది. ప్రతి భావనలోనూ ఒక ప్రకంపన ఉంటుంది. మనం శాంతిని, ప్రేమను, సానుకూలతను ఎంచుకున్నప్పుడు, ఇతరులకు నిశ్శబ్దంగా స్ఫూర్తినిచ్చే ఒక వాతావరణాన్ని సృష్టిస్తాము.


ప్రపంచం మారడం కోసం ఎదురుచూడకండి. మీ సొంత ప్రకంపనలతోనే మొదలుపెట్టండి. 

గుర్తుంచుకోండి, అంతరంగిక పరివర్తనే బాహ్య సామరస్యానికి నాంది. 


4


జీవితాన్ని ప్రశ్నించడం మానేసి, దాని పాఠాలను అర్థం చేసుకోవడం వైపు అడుగు వేయండి. ప్రతి దృశ్యం ఎదగడానికి, పరిణామం చెందడానికి మరియు మరింత జ్ఞానాన్ని పొందేందుకు ఒక గొప్ప అవకాశం.


5


ప్రేమను వెతకడం ఆపండి. మీరే ప్రేమకు మూలంగా మారండి. 

మీ ఆలోచనలు, మీ శక్తి, మీ ఉనికి — మాటలతో చెప్పలేని భావాలను వ్యక్తపరచనివ్వండి.

ప్రేమను పొందాలని ఆశించేకంటే, మీ నుంచి ప్రేమను పంచండి. మీ శుభ సంకల్పాలు, శాంతియుతమైన వైబ్రేషన్లు, పవిత్రమైన దృష్టి ద్వారా ప్రతి ఆత్మకు ప్రేమను, శాంతిని అనుభూతి చేయించండి. 


6



నమ్మకంతో వదిలిపెట్టండి. ప్రశాంతంగా స్వీకరించండి. జీవితం లో ప్రతీ ముగింపు దైవిక ప్రణాళికలో భాగమే, ఇది సరికొత్త ఆరంభానికి స్థలాన్ని ఇస్తుంది. ప్రయాణాన్ని నమ్మండి.


 విశ్వ వ్యాప్తం గా  ఉన్న

 తెలుగు వారందరికీ 

🪔 దీపావళి శుభాకాంక్షలు 💐 



ఓం శాంతి 🙏 

శివ బాబా 🇲🇰 (శివుడే తండ్రి).

# బ్రహ్మా కుమారీస్ డెస్క్.

Prajapita Brahma Kumaris Spiritual University.


యడ్ల శ్రీనివాసరావు 7 Nov 2026



Friday, November 6, 2026

800. ప్రతిభ

 

ప్రతిభకు గుర్తింపు కావాలా . . .


అవసరం లేదు. ప్రతిభకు గుర్తింపు అవసరం లేదు.

ప్రతిభ  గుర్తింపు ను ఆశిస్తుందా ? . . . 

ఆశించదు . ఒకవేళ గుర్తింపును ఆశిస్తే అది  ప్రతిభ కానే కాదు . 


ప్రతిభ (Talent) అనేది అతి సహజతత్వం తో ఉద్భవిస్తుంది. ఒక మనిషి ఏ రంగం లో నైనా, ఏ అంశం లో నైనా సరే ప్రతిభావంతుడు అంటే అది ఆ జన్మలో  అతనికి సహజ లక్షణం లేదా సహజ తత్వం. 

కఠోర శ్రమ సాధన లతో  నైపుణ్యం సంపాదించవచ్చు కానీ ప్రతిభను సాదించలేము.

Talent is natural phenomenon for a person provide  by Nature, God and Universe.

ప్రతిభ యొక్క ప్రధాన ధర్మం సృష్టించడం (Creation ) , రక్షించడం (Protection) . ఇందులో నే  సృష్టి రక్షణ  అనే విధి ఇమిడి ఉంటుంది. 

ప్రతిభ కు , కార్యం(పని) సహకరిస్తూ అలవోకగా  సిద్ధిస్తుంది. 


ప్రతిభ అనేది ఎన్నో ఎన్నో అనుభవించిన (multiple experiences) అనుభవాల ద్వారా రూపాంతరమై ఒక సిద్ధతను సంతరించుకొని , మనిషి కి ఒక లక్షణం గా , ఒక సహజ అలంకారం గా   జన్మతః  వస్తుంది.  

ఈ అనుభవాలు అనేవి , అనేక జన్మ జన్మల ద్వారా అనుభవించి, అనుభవించి ఆరితేరి ఆత్మ లో నిక్షిప్తం చేసుకొని అది ఒక సంస్కారం గా ప్రతిభను మనిషి పొందగలుగుతాడు. ఇటువంటి ప్రతిభ ఏనాడూ గుర్తింపు ను ఆశించదు. ఒకవేళ ఏ వ్యక్తి అయినా తనలోని టాలెంట్ కు గుర్తింపు ఆశిస్తే , అది అసలు ప్రతిభ కానే కాదు. 

ప్రతిభ అనేది అనేకానేక రంగాల లో పరి విధాలుగా ఉంటుంది. 

నీ లో ఉన్న   అతీంద్రియ శక్తి ని  "ప్రతిభ"  అని నీ చుట్టూ ఉన్న వారు భావించవచ్చు. అది సహజం. ఎందుకంటే వారిలో  లేనిది   నీ లో  కనిపిస్తుంది కాబట్టి . కానీ , నీ లో ఉన్న ప్రతిభ నీకు ఎప్పుడూ కిరీటం కానే కాదు. అది నీకు సహజతత్వం . 

ఇందుకు  నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఒక 3 ఏళ్ళ చిన్నారి భగవద్గీత శ్లోకాలు అనర్గళంగా పాడుతుంది. ఒక 4 ఏళ్ళ అబ్బాయి ఎక్కడా నేర్చుకోకుండా నే అద్బుతం గా నృత్యం చేస్తాడు. ఒక 5 ఏళ్ళ బాబు universal Mathmatical problems సెకన్ల లో solve చేస్తాడు. కొందరు కళ్ళకు గంతలు కట్టుకొని అద్భుతమైన పెయింటింగ్ వేస్తారు.  ఇవన్నీ practice వలన సాధ్యం అయినవి కావు. 


చిన్న వయసు లో నే వీరు అంత ప్రతిభ ను ప్రదర్శన చేస్తున్నారంటే , వీరు గత జన్మల లో ఆ యా రంగాలలో ఎంతో ఎంతో కష్టపడి కృషి చేసి ప్రావీణ్యం పొంది ఉన్నారు . ఆ యా గత జన్మలలో వీరు ప్రతిభావంతులు అని చెప్పలేము.  కానీ ఆనాటి  ప్రావీణ్యమే   నేటి జన్మలో ప్రతిభ అవుతుంది.

అందుకే , ఈ జన్మలో ఎక్కడా ఏమీ నేర్చుకోకుండా నే  ఆ యా కళలలో ,  రంగాలలో ప్రతిభను సహజంగా నే చూపిస్తారు . ఇటువంటి ప్రతిభ ను విశ్వశక్తి ప్రకృతి తో కలిసి సహజ సిద్ధంగా గానే లోకానికి పరిచయం చేస్తాయి .

గుర్తింపు అనేది బాహ్య ప్రపంచానికి అవసరమైన అంశం . ప్రతిభ అనేది మనిషి అంతర్ముఖ ప్రపంచంలో నిక్షిప్తమైన అంశం. 

టాలెంట్స్ అనేవి ప్రతి మనిషి లో ఏదో ఒక అంశం పట్ల అంతర్ముఖం గా ఉంటాయి. కాకపోతే అవి బయట ప్రపంచానికి పరిచయం కావాలి అంటే , విశ్వం లో  నీ కాలం (Timeline) లో  నువ్వు నడవాలి, అంటే కాలం నీకు అనుకూలించాలి. 

నీ లో ఎటువంటి టాలెంట్ (ప్రతిభ) ఉన్నప్పటి అది నీకు మాత్రం సహజమైనది . ఎందుకంటే ఏదైనా నేర్చుకొని సాధన చేయడం వలన ప్రావీణ్యం పొందవచ్చు కానీ ప్రతిభను మాత్రం పొందలేవు . 


ఈ సృష్టిలో  ప్రతిభావంతులు నిశ్శబ్దం తోనే రాజ్యమేలు తారు. నిశ్శబ్దం ఒక చీకటి . సృష్టి రూపాంతరం చీకటి లోనే ఆవిర్భావం అవుతుంది . 


ఓం శాంతి 

శివ బాబా (శివుడే తండ్రి).

యడ్ల శ్రీనివాసరావు 6 Nov 2026 ,10:30 PM.

Thursday, November 5, 2026

799. పుట్టిన రోజు

 

 పుట్టిన రోజు 



• దేవుడు    మనిషి కి   ఇచ్చిన రోజు 

  పుట్టిన రోజు  

  అది  అందరికి  నచ్చిన రోజు .


• పుట్టడం   అంటే     పుణ్యం 

  అది అర్దం  చేసుకుంటే  ధన్యం.


• ఎందుకంటే . . .


• ఆత్మ  వైన   నీవు 

  పరమాత్మ ను   అడిగి 

  ఎంచుకున్న దే    నీ జన్మం .


• దేవుడు మనిషి కి   ఇచ్చిన  రోజు 

  పుట్టిన రోజు 

  అది అందరికి   నచ్చిన రోజు .


• భవబంధాలు  

  నీ గత జన్మల   బుణాలు .

• రక్త  సంబంధాలు 

  నీ కర్మ ను  తెలిపే  బాధ్యతలు.


• నీ  జన్మను  సఫలం 

  చేసుకునేందుకే    ఈ భూమి 

  ఓ  పుణ్యక్షేత్రం .

• అది తెలిసి మసలుకున్న నాడు

  నీ మనసు అవుతుంది  దివ్యక్షేత్రం.


• దేవుడు  మనిషి కి  ఇచ్చిన రోజు 

  పుట్టిన  రోజు 

  అది అందరికి   నచ్చిన  రోజు .


• సుఖదుఃఖాలలో    ఆరితేరితే 

  రెండు సమానం  అని తెలియును .

• విధి రాతలో   మునిగి తేలితే 

  జీవితం  ఒక నాటకం 

  అని తెలియును.


• భరత భూమి 

  భోగ భూమి  కాదు 

  కర్మ  భూమి .


• దేవుడు  మనిషి కి   ఇచ్చిన రోజు 

  పుట్టిన  రోజు 

  అది అందరికి నచ్చిన రోజు .


• పుట్టడం   అంటే   పుణ్యం 

  అది అర్దం  చేసుకుంటే  ధన్యం.


🌹🌹🌹


భవ బంధాలు =  ఈ సంసారంలో (భూమిపై) పుట్టుకతో ఏర్పడే మమకారాలు, అనురాగాలు , మోహం మరియు సంబంధాల ఆశల వలయం 

 

ఓం శాంతి 

శివ బాబా (శివుడే తండ్రి )

యడ్ల శ్రీనివాసరావు 5 Nov 2026 , 11:30AM.


Tuesday, November 3, 2026

798 . నరుడే నారాయణుడు

 

నరుడే  నారాయణుడు 




• నరు నే    నారాయణుని గా

  చేయును    శివుడు .

• నీవే     ఆత్మవు

  ఆ శివుడే   పరమాత్ముడు .


• పరమేశుని    పఠియించిన 

  తొలగును     పాప కర్మలు. 

• ఆ   పరమ   పదమే  

  పవిత్రము   గాంచును. 


• మతి    స్తుతి    లేనిచో  

  మైకం కలిగి    మలినం చేరును. 

  మనసు లో . . . మలినం చేరును .


• నరు నే     నారాయణుని గా

  చేయును    శివుడు .

• నీవే     ఆత్మవు

  ఆ శివుడే    పరమాత్ముడు .


• పర చింతనలు . . . పర దర్శనలు 

  పెంచును   పాప  భారము 

  తలపై . . . పాప భారము.


• కళ్లెం   లేని   కోరికలు 

  కాటి   వరకు   తోడైతే 

  మనసు కి   శాంతి   ఎక్కడ 

  విశ్రాంతి   ఎక్కడ .


• వికారాలు  . . .   వైషమ్యాలు 

  విగతజీవిగా    చేసేటి    సాధకాలు 

  అవే   జన్మ జన్మలకు    బాధకాలు .


• దేహం లో    శివ నాదం 

  లేని  నాడు 

  నాడులే   నరకానికి   బాసట . 

  అదే    జీవునికి    అలసట .


• నరు నే    నారాయణుని గా 

  చేయును   శివుడు .

• నీవే    ఆత్మవు 

  ఆ శివుడే   పరమాత్ముడు .


• పరమేశుని   పఠియించిన 

  తొలగును   పాప కర్మలు. 

• ఆ పరమ    పదమే  

  పవిత్రము    గాంచును. 


ఓం శాంతి 

శివ బాబా 🇲🇰 (శివుడే తండ్రి).

Prajapita Brahma Kumaris Spiritual University.


యడ్ల శ్రీనివాసరావు 4 Nov 2026 12:30PM.


Monday, November 2, 2026

797. మమలేశ్వర

 

మమలేశ్వర 




  ఓం  . . . ఓం  . . . ఓం  . . . 

• ఓం   కారం తో 

  ఒదిగి ఉంచే    ఈశ్వర    ఓంకారేశ్వర 

• మౌన     మననం తో 

  ఎదిగించే      ఈశ్వర      మమలేశ్వర . 


• నాదము   నీవై         మౌనము నీవై 

  నడి మధ్యన     నర్మద  నైనా ను 

  జీవనాడి తో     తేలుతూ   ఉన్నాను.


  ఓం . . .   ఓం . . .  ఓం  . . . 


• ఓం     కారం తో 

  ఒదిగి   ఉంచే    ఈశ్వర    ఓంకారేశ్వర .

• మౌన     మననం తో 

  ఎదిగించే    ఈశ్వర     మమలేశ్వర .


• మరువలేదు   ఈ దేహం  

   అలనాటి  మధుర  క్షణాలు .

  

• నా  కంట  నీరు లో    నీ రూపం 

  కమనీయం.

• నా మౌన   ధ్యానం లో   నీ తేజం 

   చైతన్యం  .

• ఆనాటి  మాటల  ఆర్తి  

  నా  పసితనపు  ఛాయలు .

• ఏమి చేశావో    ఏమో  కానీ 

  నాదను కున్న   దేదో    నీ  చెంత  వదిలాను .

• నిను  వీడ లేక    వీడిన  క్షణాలు 

  నేటికీ   జ్ఞాపకమే .


   ఓం … ఓం …. ఓం 


• ఓం కారం తో 

  ఒదిగి ఉంచే    ఈశ్వర   ఓంకారేశ్వర  .

• మౌన  మననం తో

  ఎదిగించే   ఈశ్వర     మమలేశ్వర .



నర్మద = ఆనందము ఇచ్చేది , సుఖము ప్రసాదించేది , ఒక నది 


2022 సెప్టెంబర్ లో కుటుంబంతో కలిసి ఉజ్జయిని మహం కాళేశ్వర  ఆలయం లో భస్మాహరతి కి వెళ్లినపుడు, అక్కడ నుంచి మరుసటి ఓంకారేశ్వర వెళ్లాము.   ఒకవైపు ఓంకారేశ్వర జ్యోతిర్లింగ  ఆలయం  , మరోవైపు మమలేశ్వర  జ్యోతిర్లింగ ఆలయం  మధ్యలో నర్మదా నది ఉంటుంది.

ఈ రెండూ  కలిపి ఒకే జ్యోతిర్లింగం గా  చెపుతారు. ఓంకారేశ్వర లో  ఓం కార నాదానికి  . . . మమలేశ్వర లో మౌన అమరత్వానికి ప్రతీక అని తదుపరి   కాలం లో  తెలిసింది. 

ఆ ప్రదేశం అత్యంత సుందరం అద్బుతం. ఓంకారేశ్వర ఆలయం లో దర్శనం అయిపోయిన తర్వాత  నర్మద నది పైన  ఉన్న బ్రిడ్జి దాటుకుని మమలేశ్వర జ్యోతిర్లింగం  దర్శనం కోసం వచ్చాను. మమలేశ్వర ఆలయం లో  చాలా ప్రశాంతంగా అనిపించింది.  పాల రాతి నేల పై కూర్చుని శివుని జ్యోతిర్లింగం ఎదురుగా 30 నిమిషాలు పైనే ఉండడం జరిగింది . కొంత సేపు ధ్యానం, మరి కొంత సేపు మనసు తో ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాను. . . కానీ కాసేపటికి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ,  నాకు  కన్నీరు  రావడం , ఆ ఆలయం లో అంతా అప్పటి వరకు ఉన్న దాని కంటే అతి వెలుగు గా  కనిపించడం జరిగింది . ఆరోజు అక్కడ నుంచి లేచి వెళ్ళాలని అనిపించలేదు. చాలా మంచి అనుభవం , మరిచిపోలేనిది . 

ఎందుకో , ఈ రోజు ధ్యానం లో  అదంతా స్ఫురణ లోని కి వచ్చింది.


ఓం శాంతి 

శివ బాబా 🙏 

యడ్ల శ్రీనివాసరావు 2 Nov 2026. 9:00PM.


Sunday, November 1, 2026

796. గంగ లో మునిగితే పాపాలు పోతాయి

 

గంగ లో మునిగితే పాపాలు పోతాయి 🤔 !


భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో అనాదిగా మనం కొన్ని ఆధ్యాత్మిక ఆచారాలు  పాటిస్తూ ఉంటాం. ఇవి సూక్ష్మ జ్ఞానం తో మానవ శ్రేయస్సు కోసం మునులు యోగులు జ్ఞానులు ఎంతో దివ్య దృష్టి , దూరదృష్టితో ఏర్పాటు చేసినవి. ప్రతి ఆచారం వెనుక ఒక విజ్ఞానం మరియు జ్ఞాన సూక్ష్మం ఇమిడి ఉంది. దురదృష్టవశాత్తు వాటి అర్దం , యధార్థం సరిగా తెలియనపుడు , సత్యం మరుగున పడుతుంది.


నేటి కలియుగం లో పాపాలు చేయని మనిషి ఉండడు . చేసిన పాపాలు కాశీ వెళ్ళి గంగలో మునిగితే పోతాయి అని , పుష్కరాల పేరిట వివిధ ప్రాంతాలలోని నదులలో స్నానం చేస్తే చేసిన పాపం పోయి పుణ్యం ప్రాప్తిస్తుందని అంటుంటారు.  

ఇది వాస్తవమేనా? అంటే కాదు. 




గంగా నది లో స్నానం చేస్తే పాపాలు పోతాయి ? లేదా పుణ్యం వస్తుంది ?

కాసేపు , ఇది నిజమే అనుకుందాం . మరి కాశీ లో జీవిస్తున్న వారంతా ప్రతి రోజూ ఆ గంగలోనే స్నానం చేస్తున్నారు. ఆ గంగ నీరే సేవిస్తూ ఉంటారు. మరి అక్కడ నివసించే వారందరూ చేసిన  పాపాలు నేటికి తొలగి పోయినట్లే నా ? ప్రతి రోజు స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం జమ అయినట్లే నా ?   

గంగా స్నానం చేయడం వలన పుణ్యం వస్తే , కాశీ ప్రజలకు బాధలు, సమస్యలు, దుఃఖం అనే వాటన్నింటికి   అతీతంగా అయిపోయి సుఖ సంతోషాలతో జీవించాలి కదా ?  మరి కాశీ ప్రజానీకం మొత్తం ఆ స్థితి లో నేడు జీవిస్తున్నారా? ఎందుకంటే పాపం తొలగిన వారు దుఃఖం , కష్టం అనేవి ఎరుగక సంతోషంగా జీవిస్తారు . 


అదే విధంగా భారతదేశంలో ఎన్నో పవిత్రమైన నదులలో నిత్యం ఎంతో మంది స్నానం చేస్తారు . ఈ విధంగా అందరికీ తమ పాపాలు తొలగి పోతే  మనిషి కి భగవంతుని తో అవసరం ఏముంటుంది ? 




గంగా స్నానం వలన ఎవరికీ ఎటువంటి పాపాలు తొలగవు . గంగా నది ఎంతో ఎతైన హిమాలయాలు నుంచి ప్రవహించి , మధ్యలో ఎన్నో అడవులు, వాటిలో వనమూలికా వృక్షాలను తాకుతూ ఉండడం వలన, ఆ నీరు ఔషధ గుణాలను సంతరించుకుని ప్రవహిస్తూ ఉంటుంది. అందులో స్నానం చేయడం వలన శరీరంపై ఉన్న కొన్ని రుగ్మతలు తొలగి మనసు తేలిక అయి కొంత ఉత్తేజం తో నిండిన శక్తి తాత్కాలికంగా అనుభవం అవుతుంది.


 అంతేకాని మనిషి చేసిన పాప కర్మలు , నీచమైన పనులు , హింసాత్మక ఆలోచనలు గంగలోనే కాదు , ఏ పుష్కర నదీ స్నానం చేసిన అణువంత కూడా తొలగనే తొలగవు . పాప కర్మలు ఏ రీతిలో  ఎలా చేయడం జరిగిందో , అదే రీతిలో తిరిగి మనిషి అనుభవించినపుడు మాత్రమే తొలుగుతాయి. 


కార్తీక పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేస్తే పుణ్యం అంటారు . ఇందులో పుణ్యం సంగతి ఎలా ఉన్నా. . . పౌర్ణమి రోజున చంద్రుని గురుత్వాకర్షణ శక్తి మరింత ఎక్కువ గా భూమి పై ఉంటుంది. తెల్లవారుజామున వచ్చే వెన్నెల ద్వారా ఈ శక్తి మనిషి మనసు ను శక్తి వంతం గా చేస్తుంది. మానసిక ఆందోళనలు తొలగుతాయి. సముద్ర లవణాల నీరు ఎన్నో రకాల చర్మ వ్యాధులను నయం చేస్తుంది. ఇది ఆరోగ్య సూక్ష్మం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేయమని చెప్తారు . 



భారత దేశం లో  ఎన్నో నదులు  ఉన్నాయి. అందులో కొన్నింటిని పుణ్య నదులు అని , పవిత్రమైనవి అని ఎందుకు అంటారంటే , అవి ఎంతో ఎత్తైన కొండలపై ఆరంభమై , స్వచ్చమైన నీరు తో , ఏ రకమైన కలుషితం కాకుండా, వనమూలిక వృక్షాలను తాకుతూ ప్రవహిస్తూ , ఆ నీరు ఔషధ తత్వాన్ని కలిగి ఉంటుందని గ్రహించిన మునులు యోగులు జ్ఞానులు అందులో మానవులు స్నానం చేయడం వలన దేహం , శరీరం శుద్ధి అవుతుంది అని ప్రాచీన కాలంలో చెప్పారు . 

అంతేకానీ నీటిలో మునగడం వలన ఆత్మ శుద్ది జరగదు . ఆత్మ శుద్ది జరగాలంటే  నీటి గంగ లో కాదు  జ్ఞాన గంగ లో మునగాలి . అనగా శివ పరమాత్ముని జ్ఞానము లో తరించాలి.  

పాపాలను తక్కువ దుఃఖం తో   తేలికదనం తో అనుభవించే లా  చేసి తొలగించేది  , ఆత్మ శుద్ది చేసేది   జ్ఞాన గంగ మాత్రమే. 


ఈ జ్ఞాన గంగ ను శంకరుని జటాజూటం లో నీరు ప్రవహిస్తున్న విధంగా చిత్రాలలో (ఫోటో లలో) చూపించారు.  

శంకరుడు తన తపో ధ్యాన దీక్ష వలన శివుని యొక్క దివ్య జ్ఞానం తన మస్తిష్కం నుంచి గంగా జలం వలే  బయటకు వచ్చింది  అనడానికి చిహ్నం గా ఆ చిత్రం గీశారు . అంతే గానీ అది నీటి గంగ కాదు, జ్ఞాన గంగ. . . . (అసలు తల లోనుంచి నీరు ఫౌంటెన్ వలే బయటకు  చిమ్మడం  ఎవరికైనా అసాధ్యం. కానీ జ్ఞాన సూక్ష్మానికి ప్రతీక గా చిత్రం లో చూపించారు . భక్తి మార్గం లో కధలు అనేకం ఉంటాయి. జ్ఞాన మార్గంలో సత్యం ఒకటే ఉంటుంది. ఆ సత్యమే శివుడు. ) 


నేడు భక్తి ఒక పెద్ద వ్యాపారం తో ముడిపడి పోయింది. దీనికి టి.వి., యూట్యూబ్ ప్రచార మాధ్యమాలు చేసే హడావిడి ఇంతా అంతా కాదు. మనుషుల అమాయకమైన నమ్మకాలకు , విపరీతమైన ఖర్చు తో కూడుకున్నది గా నేటి దైవ భక్తి విస్తరించి ఉంది. మనిషి సత్యం యదార్ధం తెలుసుకో నంత వరకు తనకు తాను మోసపోతునే ఉంటాడు . 


అసలు మనిషి ని సృష్టించింది భగవంతుడు . ఆ భగవంతుని  చేరడం కోసం, మనిషి అష్టకష్టాలు పడుతూ , ఆర్భాటాలతో విపరీతమైన ధనం ఖర్చు చేస్తూ యాత్రలు , నదీ స్నానాలు చేస్తూ భగవంతుని ని అన్వేషణ చేయడం అనేది. కలి మాయా ప్రభావం. ద్వాపర కలియుగాల నుంచి మానవుడు ఈ విధంగా  ప్రవర్తిస్తూ నే ఉన్నాడు . ఎందుకంటే , మనిషి తన ఆత్మ శక్తి ని  పూర్తిగా కోల్పోయి , భగవంతుడు అంటే ఎవరో అనే యధార్థం మరచి పోవడం వలన.


భగవంతుడు ఒక్కడే  అని ఎవరిని అడిగినా చెబుతూ ఉంటారు . మరి , ఆ ఒక్కడూ ఎవరు అని అడిగితే , ఒకొక్క  పేరు చెపుతారు . ఎందుకంటే స్పష్టత లేక పోవడం వలన. 


ఆహ్లాదం కోసం నదీ స్నానాలు చేయడం మంచిదే , మనసుకి కాస్త ఆటవిడుపు గా ఉంటుంది …. అంతేకానీ, తలపైన పాపాలు పోతాయని దూర తీరాలకు ప్రయాణించి ఏ నదీ స్నానాలు చేసినా అది మనిషి యొక్క అమాయకత్వమే .  పైగా నేటి కాలంలో  , గంగ తో పాటు అనేక నదుల నీరు కూడా అత్యంత కాలుష్యము తో  కలుషితం అయిపోయాయి . ఇది కూడా మనిషి  , ప్రకృతి పట్ల చేసిన . . . చేస్తున్న పాపమే.  ఈ స్నానాల కోసం వెళ్ళి ఎన్నో ప్లాస్టిక్ వ్యర్ధాలు నదులలో కలపడం, ఇంటిలో పూజలు చేసి తీసుకెళ్ళి కుళ్ళిన చెత్త నదులలో చెరువు లలో కలపడం,  పరిశ్రమల వ్యర్ధాలు నదులలో కలపడం. . . పాపం అమాయకమైన మనిషి ఇదంతా చేస్తూ ఉంటాడు . ఎందుకంటే రేపు వీటన్నిటికి బలిహరం కావలసింది అమాయకమైన మనిషే  కాబట్టి.


ఆత్మ చైతన్యం సత్యమే చెపుతుంది.

స్వ పరివర్తనే  విశ్వ పరివర్తన. 



ఓం శాంతి 

శివ బాబా (శివుడు తండ్రి)

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 1 Nov 2026 11:45 AM.


806. మౌనంగా అందరినీ వదిలేయండి-4

  మౌనంగా అందరినీ వదిలేయండి (నాల్గవ భాగం) దయచేసి . . .  మొదటి మూడు భాగాలు     (803 ,804 ,805 ) చదివిన తరువాత మాత్రమే ఈ రచన చదువగలగరు 🙏   ఇ...