Tuesday, June 23, 2020

14. ఓం నమఃశివాయ శివాయ నమః ఓం

ఓం నమఃశివాయ…శివాయ నమః ఓం

ఈశ్వరా   ప్రాణేశ్వరా    దివిజ గంగాధరా

పంచభూత సమ్మిళిత రూపా

  సమస్త జీవ ఆత్మాశ్రయా

మాయను మాపే మాయావి

   జ్ఞానం నింపే సద్గురువా

శ్మశానమే ఆవాస మంటావు

   భస్మమే జీవం అంటావు.


ఈశ్వరా   ఓంకార రూపేశ్వరా

త్రిలోకం  త్రిగుణం   త్రినేత్రాధి నేతనంటావు

  త్రిశూలంతో రక్షణ నిస్తావు

ధ్యానమే ధ్యాసంటావు

  ధ్యానంలో  దర్శనమిస్తావు



ధ్యానేంద్రా    ఓ యోగీంద్రా

కంఠ గరళంతో  కరుణిస్తావు

  సిగ చంద్రుడితో శాంతి నిస్తావు


నీలకంఠేశ్వరా   ఓ అర్ధ నారీశ్వరా

నీ కంటి భాష్పాలే 

  అక్షతలయ్యాయి  రుద్రాక్షలయ్యాయి


ఈశ్వరా   ఓ రుద్రేశ్వరా

ఢం ఢం ఢం ఢమరుకమే  

  శక్తి నాదమంటావు 

  లయ తప్పని శృతికి   నటరాజువి.


ఈశ్వరా   ఓ చిదంబరేశ్వరా

శరణు  కోరిన జీవికి      బోళాశంకరుడివి

   శరణు  తప్పిన పాపికి   సంకట హరుడివి


ఓ శంకరా  బోళా శంకరా

ఆడుకుంటావు మాతో  

  ఆటాడుకుంటావు మాతో

 మా తత్వము నెరుగు శక్తి  లేని వారము

  నీ తత్వము నెట్లు తెలుసుకోగలమయ్యా.

ఈశ్వరా   ఓ జ్ఞానేశ్వరా

తెరిపించ వయ్యా మా మనోనేత్రం 

   మరిపించ వయ్యా మా మూర్ఖత్వం




యడ్ల శ్రీనివాసరావు. 2021 June














Wednesday, June 17, 2020

13. ఓ మనిషి.... జీవితం…… ఏది శాశ్వతం

ఓ మనిషి.... జీవితం…… ఏది శాశ్వతం


రాసిన రాతలు రాయయ్యేనా
చేసిన చేతలు చేదయ్యేనా
మాటాడిన మాటలు మౌనమా యేనా
నడచిన నడతే నలుసయ్యేనా
గెలిచిన గెలుపే గేళి య్యేనా
కలసిన కలయిక కాటేసే నా
ఈసడించిన ఈర్ష్య ఈల యేసేనా
దేహించిన దేహం దేభ్యమయ్యేనా
అందించిన అండే అణగతోక్కే నా
అలవిగాని అసూయ ఆరాధన య్యేనా
హేళన తో హోళీ చేస్తే హంకారమే (అహంకారం)
ద్వేషంతో దండిస్తే దారిద్ర్యమే
కాంతిని కాయలనే కన్ను కనుమరుగే
పైన చేయ్యేస్తే పైవాడై అయిపోలేం
ప్రతీకారానికి ప్రతి రూపమా నీ ప్రతిభ
ఏం వజ్రం చీకట్లో మెరవదనుకున్నావా
వజ్ర కాంతి కి చీకటి వెలుతురు సమానమే
చేసిన చేతలు మనసు చెపుతున్నా ... అర్థం కానట్టు నటించాలా......లేకపోతే జీవితానికి మనుగడ కష్టమా. ఎందుకు  ఈ దుస్థితి.

ఏ ఎండకు ఆ గొడుగేనా జీవితం.

పతనానికి ప్రయాణమైన  జీవితానికి జాలి తప్ప ... ఏమి చేయగలము.

మనం చేసే ప్రతి కర్మని పంచభూతాల తో సహా వందల కళ్లు గమనిస్తూ నే ఉన్నాయి. ఎందుకంటే ఆ కళ్లన్నీ  గుడ్డివి కావు……కొన్ని కళ్ల లాగ….

మాయ మంచిదే… భాధకు మగతనిస్తుంది.  ఎక్కువైతే  నిజం కాన రాక జీవశ్చవం అయిపోతాం.


యడ్ల శ్రీనివాసరావు  June 2022

12. నవరసాల నవరత్నాల గోదావరి

నవరసాల నవరత్నాల గోదావరి
( నవరత్నాలు…నవరసాలు కలిపి గోదారమ్మ కి ఆపాదించి చేసిన చిన్న ప్రయత్నం ఈ పాట.)



గోదారమ్మ గోదారి
  ఒంపుసొంపుల గోదారి 
  నవరత్నాల గోదారి 
  నవరసాల గోదారి

ముత్యమంత   శాంతి  నీదమ్మా 
  వెన్నెలారేసిన   బింబాని వమ్మా
  చంద్రబింబాన్ని  వమ్మా.


గోదారమ్మ గోదారి 
  ఒంపుసొంపుల గోదారి

నీలమంత నీలి నీలాంబరమ్మా 
  లావణ్య మంత చిలిపి శ్రృంగారి వమ్మా.


గోదారమ్మా గోదారి 
  నవరత్నాల గోదారి

రాగమంత  పుష్యరాగానీ  వమ్మా
  అద్భుతమైన రూప రూపాని వమ్మా.


గోదారమ్మా గోదారి 
  నవరసాల గోదారి

పచ్చ పచ్చాని ప్రాణదాత వమ్మా
  జీవనాడి నిచ్చే కరుణ దాయని వమ్మా


గోదారమ్మ గోదారి 
  ఒంపుసొంపుల గోదారి.

వజ్రమంటి  వీరనారి వమ్మా
  వినుల వీక్షణకు నీకు సాటిలేరమ్మా


గోదారమ్మా గోదారి 
  నవరత్నాల గోదారి

వైడూర్యమంటి వయ్యారివమ్మా
  హాస్యానికే  గలగల లిస్తావమ్మా


గోదారమ్మా గోదారి 
  నవరసాల గోదారి

(కెంపు) మాణిక్యానికే  మకరందాని వమ్మా
   రౌద్రానికే నువు రారాణి వమ్మా


గోదారమ్మ గోదారి 
  ఒంపుసొంపుల గోదారి

పగడానికే నువ్వు పట్టమహిషి వమ్మా
  ఎంత బీభత్సమైనా
  నీ ముందు  భీతిల్లాలమ్మా


గోదారమ్మా గోదారి 
  నవరత్నాల గోదారి

గోమేథమంటి గోమాత వమ్మా
  భయమెంతున్నా బంధమైయ్యేవు
  నువు మా బంధువయ్యావు


గోదారమ్మ గోదారి 
  ఒంపు సొంపుల వయ్యారి 
  గల గల పారే గోదారి
  ఇసుక తిన్నెల గోదారి



యడ్ల శ్రీనివాసరావు.  2020  May











Monday, June 1, 2020

11. తొలి విఫల మలి సఫల ప్రేమికుడు

తొలి విఫల... మలి సఫల...భగ్న ప్రేమికుడు

(మూలం: యౌవనం లో ప్రేమించిన అమ్మాయి తో తన పెళ్లి జరగక విఫలమై,.  ఇష్టం లేకపోయినా తప్పక మరొకరిని పెళ్ళి చేసుకుని.  వేదన  తనలో తాను అనుభవిస్తు తన ప్రేమను మనసులో సఫలం చేసుకొంటున్న భగ్న ప్రేమికుడు.)



పిలిచితివో......వలచితివో.......మైమరపించితివో   ప్రేయసి.


సంతోషం అంటే నవ్వే అని తెలుసు..... నీ పరిచయం తో అది నువ్వే అని తెలిసింది.

కట్టేసిన కట్టుబాట్లతో కట్టెగా ఉన్న నాలో ప్రేమా ....ఏమి ఈ చలనం ...ఎందుకీ సంచలనం.

అమ్మ తో ఉన్న పసితనాన్ని ఆస్వాదించలేదు...... కానీ నీతో ఉన్న క్షణాల నుండి నేనింకా పసితనం లోనే ఉన్నాను.

పసి పిల్లాడికి రెండే తెలుసు... ఏడవడం, నవ్వడం.... కానీ అది ఎందుకో  కారణం వాడికి తెలియదు...... ప్రస్తుతం నా స్థితి లాగ.

జీవితం అంటే ఆట....  ఆ ఆటలో ఎందరినో గెలిపిస్తున్న ఛాంపియన్ని.....కానీ నిను పొందలేక ఓడిన ఆటగాడిని.


జీవితం అంటే నటన..... ఎందరినో మెప్పిస్తున్న మహానటుణ్ని......కానీ నిన్ను పొందలేక విఫలమైన నటుడిని.

మనసంటే ఒక్కటే......జీవితం అంటే ఒక్కటే...అంటారు..... మరి  నాకెందుకో అవి రెండేసి గా కనిపిస్తున్నాయి .


తనువుకు  కట్టుబాట్లేమో గానీ...... మనసుకు కాదు కదా.


మాటలు మాట్లాడలేను గానీ........మదిలో నాదైన జీవితం నీతో పంచుకోలేనా.


నా ఈ ఆలోచన నేరమా...... నాకు నేను వేసుకున్న శిక్ష లో ఆనందించడం కూడా నేరమేనా.


నా సంతోషం నువ్వని తెలుసు.......కానీ నా బాధకి కారణం నువ్వని చెప్పలేక కూడాపోతున్నా .


వదులుకున్నాను...... వదిలేసుకున్నాను...... నిను పొందే భాగ్యం లేక నీతో నన్ను నేనే వదిలేసుకున్నాను.


నీ వలపుల.... మలుపుల....తలపులు.... పౌర్ణమి వెన్నెలని.... అమావాస్య  నిశని మిగిల్చాయి.

కుటుంబం, వ్రృత్తి, సమాజం పట్ల భాథ్యతను విస్మరించలేదు….. కానీ నా పట్ల నా భాథ్యతను, సంతోషాన్ని గుర్తించలేని అంధుణ్ని.


ఒక్కటి మాత్రం నిజం..... నను నమ్ముకున్న కుటుంబానికి నేను హీరోని.....కానీ నాకు నేను జీరోని .


పరిపక్వత లేని వయసు లో నిను ప్రేమించాను…. కానీ నీ ప్రేమతో నే పరిపక్వత పొందాను.

నీ ప్రేమ తోనే తెలిసింది…. శరీరం వేరు,  మనసు వేరని……అందుకేనేమో శరీరం వద్దన్నా…. మనసు నిను కావాలంటుంది.


ఈ శరీరం ఎక్కడ విహరించినా…. మనసు మాత్రం వదిలిన చోటే పదిలంగా ఉంది.

ఎవరికి సాధ్యం........నా మనసుని  నిలువరించడం ఎలా సాధ్యం .


ఎంతకాలమైనా..... ఎంత మందితో ఉన్నా..... ఎన్ని రోజులు బ్రతికినా..... నీ జ్ఞాపకాలే నా ఊపిరి.


ఈ ఆరు పదుల వయసు దాటినా నిను చూడాలని, మాట్లాడాలని ఉంటుంది….నీ తలంపు తో నావయసు రెండు పదులవుతుంది. బహుశా అదే ప్రేమకున్న బలమేమో.

సంతోషము దుఃఖము రెండూ సమానమే,పాలలో నీళ్ళలా గా కలిసి ఉంటాయనే  జీవిత సత్యాన్ని తెలియజేసిన నీ నా ప్రేమ ఎప్పటికీ సఫలమే....

నేను కట్టుబాట్లకు కట్టుబడి...... కట్టబడి...... కట్టెగా ఉన్నాను…చివరికి కట్టెల మీద  కడ చేరేలోపు…  కడసారైన నిను భౌతికంగా చూడగలనో…లేదో…


      
యడ్ల శ్రీనివాసరావు




488. నా ప్రపంచం

నా ప్రపంచం • నా దొక   ప్రపంచం   అది   సోయగాల   సౌందర్యం. • నా  మనసెరిగిన   ప్రపంచం   మధువొలికిన     అనందం. • అందాల   ఆరబోతలు   ఆదమరచి   ...