Wednesday, August 19, 2026

776. కర్మ ఫలం 2027 - 37

 

కర్మ ఫలం 

2027 - 2037 

ప్రపంచ కాల స్వరూపం




• పాల కడలి పై   పవళించె డి   ప్రభు 

  రక్ష   నీ య వా  . . .

• దుఃఖ  అలల పై  నిలిచి న   మా పై 

  కరుణ  జూ ప వా . . . 


• పాపం పుణ్యం  ఎరుగని  వారి మై 

  మాయా  మోహితు లైనాము .

• నేడు  ఈ  ప్రకృతి   అలజడుల లో  

  ఆవేదన తో    ఉన్నాము.

• పోరు లు   చేస్తున్న   ఈ దేశాల తో  

  జీవచ్ఛవాలు   అయి . . . .

  అభము  శుభము తెలియక 

  దిక్కుల  నడుమ  ధీనులమైనాము .


• పాల  కడలి పై  పవళించె డి   ప్రభు 

  రక్ష   నీ య వా  . . .

• దుఃఖ అలల పై నిలిచి న మా పై 

  కరుణ   జూ ప వా . . .


• ఈ పంచభూతాల  ప్రతాపం 

   ఆగేది  ఎన్నడు  .

• ఈ  మానవాళి  పై  హింస ను 

   ఆపేది   ఎవరు .


• అంతరించు నున్నదా  . . . 

  ఈ   కలియుగం .

• అవతరించు నున్నదా . . . 

   సరి కొత్త యుగం .

• ఇది   విశ్వాని కే   ప్రక్షాళ నా . . . 


• ఆకలి   కరువు లతో 

  అలమటించి   పోతున్నాము.

• ఈ శవాల గుట్టలే  

  భూమాతకు  ఆహరమాయేనా . . .

• మా  ఆవేదనలు  ఆర్తనాదాలు

  నీ  అనంత లోకాలకు 

  వినిపిస్తున్నాయా . . . 


• పాల కడలి పై   పవళించె డి    ప్రభు 

  రక్ష  నీ య వా  . . .

• దుఃఖ అలల పై   నిలిచి న  మా పై 

  కరుణ  జూ ప వా . . . 


మానవుడు ప్రకృతి పట్ల  గత 100 సంవత్సరాల నుంచి ఎలా ప్రవర్తిస్తూ వచ్చాడో , అదే తిరిగి  విశ్వ వ్యాప్తం గా  ప్రకృతి నుండి పొందే కాలం 2027-37.

Cleansing period of the entire world  🌎. 

KARMA RETURNS. Newton's Third Law , For every action equal and opposite reaction. 

కర్మ సిద్ధాంతం ప్రకారం . . . 

మానవుడు ఏదైతే చేసాడో అదే  తిరిగి పొందడం.

మంచి కి  మంచి . . .   

చెడు  కి  చెడు  . . . 


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 13 Aug 2026 9:00 PM .


Friday, August 14, 2026

775. సత్యమైన స్వాతంత్ర్యం

 

 సత్యమైన స్వాతంత్ర్యం


ఈ రోజు మనం దేశ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్నాము.

అలాగే, ఈ రోజు మరో స్వాతంత్ర్యాన్ని కూడా జరుపుకుందాం . మనస్సు యొక్క స్వాతంత్ర్యాన్ని.


ఇది ఎలాంటి స్వాతంత్ర్యం . . . అంటే  ఎవరూ మీ మనసు యొక్క శాంతిని హరించలేని స్వాతంత్ర్యం.

ఏ పరిస్థితీ మిమ్మల్ని చలింపజేయలేని స్వాతంత్ర్యం.

ఏ సంఘటన కూడా మీ అంతరంగంలోని ప్రశాంతతను దూరం చేయలేని స్వాతంత్ర్యం.


ఇదే ఆత్మ యొక్క నిజమైన స్వాతంత్ర్యం.


మనల్ని మనం శాంతియుతమైన ఆత్మగా, పరమాత్మకు సంతానంగా ఎంతగా స్మరించుకుంటామో,  అంతగా మనలో అచంచలత్వం మరియు స్వేచ్ఛ పెరుగుతూ ఉంటాయి.


ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేవలం త్రివర్ణ పతాకం తో పాటు మన చైతన్యాన్ని కూడా ఉన్నతంగా చేసుకుందాం.


మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ హార్దిక శుభాకాంక్షలు. 🇮🇳🙏


మన దేశం ఎంత స్వతంత్రంగా ఉందో, మీ జీవితం కూడా అంతే స్వతంత్రంగా, ప్రశాంతంగా మరియు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. 🌹


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

బ్రహ్మ కుమారీస్.

యడ్ల శ్రీనివాసరావు 15 Aug 2026 10:00AM.





774. రాజయోగ ఫలాలు

 

రాజయోగ ఫలాలు



• గొప్పతనం ఎన్నడూ ప్రతిభ (Talent) వలన రాదు . . . ప్రతిరోజూ మనం చేసే సరైన ఎంపికల ఆచరణ వలన ఏర్పడుతుంది.

  మీ ఆలోచనలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి.

  మీరు ఏ ఆలోచనను పదేపదే ఆలోచిస్తారో, అదే మీ స్వభావంగా , మీ నిర్ణయాలుగా , చివరికి  మీ జీవితంగా మారుతుంది. అందుకే ప్రతిరోజూ శ్రేష్ఠమైన, శక్తివంతమైన , ఉన్నతమైన ఆలోచనలను ఎంచుకోండి.


• మీ సమయం అంటే మీ జీవితమే. 

మీ సమయం ఎక్కడ , ఏ విషయం పట్ల వెచ్చించబడుతుందో, మీ జీవితం కూడా అదే దిశలో రూపుదిద్దుకుంటుంది. కాబట్టి ప్రతిరోజూ కొంత సమయాన్ని మీ కోసం , మౌనం కోసం , ధ్యానం కోసం , భగవంతుని స్మృతి కోసం , విశ్వ శక్తి పొందడం కేటాయించండి. ఆ కొద్దిపాటి సమయమే మీ రోజంతా సరైన దిశలో నడిపిస్తుంది.


• మీ అలవాట్లు మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. మీరు ప్రతిరోజూ చేసే పనులే క్రమంగా మీ గుర్తింపుగా (Identity ) మారుతాయి.  

  కాబట్టి ఈ మూడు విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి . . . 

• శ్రేష్ఠమైన ఆలోచనలు

• సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం

• శ్రేష్ఠమైన అలవాట్లు

 నెమ్మదిగా ఇవే మీ గొప్ప శక్తిగా, మీ గొప్పతనానికి పునాదిగా మారతాయి. 


  🌹🌹🌹🌹🌹




• చాలామంది తమ ఎంపికలను , ఎంచుకున్న వాటిని (Choosens) మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు.

 ఈశ్వరుని రాజయోగం మాత్రం  ముందుగా మీ స్వ గుర్తింపును (Identity) మార్చుకోవడం తో ప్రారంభమవుతుంది.


• మీరు “నేను ఈ శరీరం మాత్రమే” అని భావిస్తే, మీ మనసు తాత్కాలిక సుఖాల వెంట పరుగులు తీస్తూనే ఉంటుంది.

  కానీ మీరు  “నేను శ్రేష్టమైన , ప్రశాంతమైన , విశ్వానికి  మేలు  చేసే  ఆత్మను”  అని స్మరించిన క్షణం నుంచే ,  మీ యొక్క  ప్రాధాన్యతలు (Importance’s)  నిశ్శబ్దంగా  మారడం ప్రారంభిస్తాయి.  

క్రమేపీ  విశ్వ శక్తిని  మీరు ఆవాహన చేయడం ఆరంభిస్తారు.  తదుపరి   మీ లోని  శక్తి  కూడా,  ఏదో ఒక భాగ్య రూపంలో విశ్వమంతా ప్రసరిస్తుంది. 


• మీ  జీవిత    గత  ఎంపికలలో  లేదా  ఎంచుకున్న (Choosens) వాటి లలో   ఏది తప్పో  ,  ఏది మీకు సరి కాదో  , దాని నుండి  మిమ్మల్ని   మీరు  బలవంతంగా   దూరం చేసుకోవాల్సిన   అవసరం లేదు. 

అది సహజం గానే   మీ నుంచి   విడిపోతుంది . 

ఇక  , అది మీకు సరైనదిగా అనిపించదు . ఎందుకంటే  అది   మీ స్వభావ  ధర్మానికి విరుద్ధమైనది .


• ప్రతి ఉదయం మీ రోజును ప్రారంభించే ముందు, ఒక నిమిషం పాటు 

    అసలు నేను ఎవరు ? 

    • ఎచట నుంచి వచ్చాను ? 

    • నాతో ఏమి తీసుకొని వచ్చాను ? 

    • నాతో  ఏమి తీసుకు వెళతాను ? 

    • గతంలో ను   నేను ఉన్నాను 

    • భవిష్యత్తులోనూ   నేను  ఉంటాను .

  అని మీలో మీరు స్మరించుకోండి . 

  రోజు లో ఏదైనా కఠినమైన నిర్ణయం , పరిస్థితి దీర్ఘంగా ఎదురైనప్పుడు, మళ్లీ అదే ఆత్మిక అవగాహనకు  తిరిగి రండి.


• మీ గుర్తింపు మీ ఎంపికలను రూపుదిద్దుతుంది 

  Your Identity  

shape’s 

Your Choosens .


• మీ ఎంపికలు  మీ  విధిని  రూపుదిద్దుతాయి.

    Your Choosens 

shape’s 

Your Destiny , Fate , Karma .


  

  ఓం శాంతి 

  ఓం నమఃశివాయ 🙏 

  బ్రహ్మ కుమారీస్ 

  ఆత్మ  14 Aug 2026 , 6:00 AM.

Tuesday, August 11, 2026

773. భగవంతుని మించిన భక్తులు

 

భగవంతుని మించిన భక్తులు 


• భక్తుడు (మానవుడు)  భగవంతుడు ని  మించిపోయాడా ? 

భగవంతుని కంటే భక్తుడు తెలివైన వాడా ? 

అంటే . . . అవును అనిపిస్తుంది . 

సృష్టి మూలాల్లో పొందుపరిచిన కొన్ని సత్యాలు గ్రహిస్తూ ఉంటే , . . ఇది పరమ సత్యం అనిపిస్తుంది . వాస్తవానికి భగవంతుడు ఏ మాత్రం తెలివైన వాడు కాదు, అమాయకుడు, భోళా నాధుడు . కానీ మానవుడే భగవంతుని మించి తెలివైన వాడు. 


 భగవంతుడి పై మనిషి కి ఉన్న భక్తి చాలా చాలా గొప్పది . ఈ చాలా చాలా లో ఏం దాగి ఉంది అంటే, మనిషి తన స్వప్రయోజనం కోసం భగవంతుడిని కూడా ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోలడు . ఇందులో  ఏ సందేహం లేదు . 

• ఈ అంశం లో సూక్ష్మం లోకి వెళితే . . ‌. 




• భగవంతుడు , మనిషిని తన సమానం గా ఉన్నతుడుగా దేవతగా చేసేందుకు , మనిషి లో ని “నేను” అనే అహంకారాన్ని , తనకు బలి ఇమ్మని కోరుతాడు .

 “నేను” అంటే సంస్కృతం  హిందీ లో “ में “ “మే” అని అంటారు. అంటే భగవంతుని కి “ में ” “మే” (నేను) అనేది మానవుడి నుండి కోరుకున్నాడు  కాబట్టి , బాగా ఆలోచించిన మనిషి తన అహంకారాన్ని వదులుకోలేక  , తన తెలివి తో వెతికి వెతికి “మే” అని అరిచే మేక ను తీసుకు వచ్చి బలి ఇవ్వడం మొదలుపెట్టాడు . 

 అందుకే అనేక మతాల ధర్మాల వారు కేవలం మేకను ఎంపిక చేసుకొని బలి ఇవ్వడం ఆరంభించారు . ఆ బలి పేరు తో నైవేద్యంగా ప్రసాదం గా భావించి మేక మాంసం భుజించడం ఆరంభించారు . . . 




• మాంసాహారం ఒక్కటే తన కడుపు కి వెలితి గా అనిపించిన మానవుడు , మరొక అడుగు ముందుకు వేసి . . . 

 కొందరు దేవతలకు మరియు శివుని యొక్క ఆస్థాన పాలకుడిగా చెప్పే కాలభైరవుడు కి సురాపానం (సారాయి , మద్యం) నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం మొదలు పెట్టాడు. కొన్నిచోట్ల గ్రామదేవతలకు జంతుబలి తో పాటు కల్లు, సారాయి నైవేద్యంగా నేటికీ సమర్పించడం విశేషం.

 మద్యం తాగి , మాంసం భుజించిన మనిషి మనసు యొక్క అంతరంగం తమోగుణం తో  ఏ స్థితి లో ఉంటుందో , ఏం కోరుకుంటంందో . . . పాపం మనిషికే తెలియని అమాయకుడు కదా ! . ఇదీ కలియుగం లో దైవ భక్తి .

ఈ విధంగా భక్తి శ్రద్ధలతో భగవంతుడిని , దేవతలను పూజించే మానవుడు నిజం గా ఎంతో మేధావి అనిపిస్తుంది ! . . .

 శివుడు సృష్టి కర్త. తాను సృష్టించిన  సమస్త జీవుల సంరక్షణ కోరి , జీవహింస మహా పాపం అని తెలియ చేశాడు . అదే విధంగా మద్యపానం అనారోగ్యం తెలియజేసిన వైద్యనాథుడు(శివుడు) కి . . . మానవుడు తన తెలివితో అవి నైవేద్యంగా సమర్పించడం, తన కడుపు నిండా భుజించడం అమోఘం . గొప్ప విషయం కదా ! 




• ఆది మానవుడు మాంసాహారం భుజించే వాడు . ఆహారం కోసం జీవహింస చేసేవాడు . ఆ సమయంలో మానవుడు అజ్ఞాని , నాగరికత తెలియని వాడు . కాలం మారుతూ వచ్చింది. మానవుడు నాగరికత , బట్ట కట్టడం నేర్పాడు . దైవాన్ని గుర్తించాడు . భక్తి చేయడం ఆరంభించాడు. కానీ ఆది నుంచి అలవాటు పడి , ఆత్మ లో పేరుకు పోయిన కొన్ని మూల సంస్కారాలను నేటికి కూడా విడవ లేక , అవి భగవంతుని కి నైవేద్యంగా అర్పించి తినడం మొదలు పెట్టాడు . దీనినే అనాదిగా వస్తున్న ఆచారం అని సమర్థించుకుంటాడు మనిషి . ఇందులో మనిషి కి ఏ స్వప్రయోజనం లేదని ఎలా అనుకోగలం .


• కాలభైరవుని సారాయి నివేదన చేయడం అంటే, అది ఆయనకు దానం చేయడం. దానం చేస్తే తిరిగి స్వీకరించ కూడదు . కానీ మనిషి తెలివైన వాడు కదా! తనకు తోచిన విధంగా ప్రవర్తిస్తాడు. తనతో పాటు ఎవరినైనా , ఎందరినైనా ఏ మార్చ గలడు .


 🌹🌹🌹🌹🌹🌹



• పరమాత్మ శివుడు తన సంతానం అయినటువంటి మనుషుల దుఃఖానికి అజ్ఞానానికి మూల కారణం అయిన కామం , క్రోధం , లోభం , మోహం , మాత్సర్యము అనే పంచ వికారీ గుణాలు అని , వాటిని తనకు అభిషేకించమని మనిషి ని కోరుతాడు . “ అభిషేకించడం ” అంటే , శివుని తలపై చేయి పెట్టి ఈ వికారీ గుణాలు మనసు తో ధారణ చేస్తూ ఆయనకు విడిచి పెట్టడం . తిరిగి ఆ గుణాలను ఆచరించను అని ప్రతిజ్ఞ చేయడం. 


• కానీ, మనిషి మహా మేధావి కదా! . . . శివుడు అభిషేక ప్రియుడు అని బాగా ఆలోచించి తనలోని పంచవికారాలకు బదులుగా (substitute) పంచామృతాలు అయిన నీరు, పాలు, పెరుగు, తేనే , నెయ్యి కలిపి శివుని తలపై వేయడం ఆరంభించాడు . 

• ఇది మానవుడు తన తెలివి తేటల తో , తనకు తోచిన రీతిలో వృద్ధి చేసుకున్న భక్తి . . .అభిషేకించిన ఈ విలువైన  ఖరీదైన  పోషకాలు  కలిగిన పంచామృతాలు కళ్ళు ముందే  నేలపాలు అవుతున్నా సరే మానవుని బుద్ధి సత్యం గ్రహించదు . ఎందుకంటే మానవుని కి శివుని పై అపారమైన భక్తి ప్రేమ . . . ఎంతగా అంటే శివుడు చెప్పేది  విని ఆచరించ లేనంతగా .

 అందుకే మానవుడు తెలివైన అమాయక మేధావి ! 


• అదే విధంగా శివుని కి పంచ వికారాలను అభిషేకించి దానం ఇస్తే , తిరిగి మనిషి వాటితో జీవించ రాదు . ప్రత్యేకించి కలియుగం లో పుట్టిన మనిషి ఇది ఆచరించలేక , పంచామృతాలు అభిషేకిస్తూ ఉంటాడు . అల్ప కాల ఫలితం తో సంతుష్టుడై ఉంటాడు .


• భక్తి, జ్ఞానం వేరు వేరు. భక్తి లో , భగవంతుని పొందడం కోసం ఏది ఎందుకు చేస్తున్నాం ? అనే ప్రశ్న కి ఆధారం తో కూడిన సమాధానం లభించదు . ఎందుకంటే భక్తి లో అనేక విషయాలు ఎవరికి తోచిన రీతిలో వారు కధలు గా చెప్పారు , నమ్మకాలు గా ఏర్పరిచారు . కొందరు తమ భుక్తి జీవన భృతి కోసం వారు చెప్పినట్లు చేయకపోతే అరిష్టం అని భగవంతుడి పట్ల సామాన్య మనిషి లో భయాలను , ఆందోళనలను సృష్టించారు. ఇదే భక్తి లో  నేడు విచ్చలవిడిగా  విరాజిల్లుతోంది. భగవంతుడు - భక్తి - వ్యాపారం  , ఈ మూడు విడదీయలేనంతగా  ఒకదానితో ఒకటి నేడు పెనవేసుకు పోయాయి. 


• కానీ భగవత్ జ్ఞానం లో ప్రతీ విషయంలో దాగిన శ్రేష్టత  సత్యంతో ఆధార భరితమైన సమాధానం లభిస్తుంది. ఎందుకంటే జ్ఞానానికి మూల స్వరూపం జ్ఞాన సాగరుడైన  శివుడు . అతడినే దక్షిణామూర్తి అని కూడా పిలుస్తాము. 

 భగవంతుడు అందరివాడు . 

భగవంతుని కి భక్తుని కి మధ్య ఉండవలసింది జ్ఞానం అర్దం చేయించే సద్గురువు , అంతేకానీ దళారులు కాదు .


• గమనించాలి . . . ఈ రచన కొన్ని  అంధ విశ్వాసాలు మరియు మూఢ నమ్మకాల నుంచి మేల్కొలపడానికి మాత్రమే . అంధకారం విడిచి , జ్ఞాన యుక్తం గా భగవంతుడు చెప్పిన సత్యం తెలుసుకోని , ఆ రీతిలో భక్తి చేస్తే , కలి మాయా ప్రభావం నుంచి మనిషి కి  విముక్తి లభిస్తుంది. 

భగవంతుడు చెప్పింది ఒకటైతే మనిషి చేసేది మరొకటి. దీనినే అజ్ఞానం, మాయ అంటారు .


🌹🌹🌹🌹🌹🌹


జంతు బలులు మహా పాపం. 

మత్తు పానీయాలు, మద్యం, మాదకద్రవ్యాలు స్వీకరించడం ఆరోగ్యానికి హానికరం, దేశ ప్రగతికి అవరోధం , మానవ జాతి నాశనానికి తొలి బీజం .  దయచేసి  ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.  


భారత్ మరియు యావత్ విశ్వం . . . వ్యసన నషా ముక్తి భవ

🙏



ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 11 Aug 2026 11:00 AM.


Friday, August 7, 2026

772. ప్రతికూలతలను అనుకూలతలు గా మార్చుకోవడం ఎలా

 

 ప్రతికూలతలను అనుకూలతలు గా 

మార్చుకోవడం ఎలా 


• మన జీవితంలో ఏదైనా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు, అంటే ఏదైనా సవాలు వచ్చినప్పుడు, దాన్ని అందరితో చర్చించకండి . ముఖ్యంగా బలహీనమైన మరియు చపల మనస్తత్వం, ఇంకా నెగెటివ్ ఆలోచనలు ఉన్నవారికి. ఎందుకంటే అలా చెప్పడం వల్ల ఆ సమస్య మరింత బలపడుతుంది.

 ఎందుకు అంటే , మనం కొందరికి చెప్పినప్పుడు వారు కూడా దాని గురించి తమ ఆలోచనలతో, తమ సంస్కారాల ప్రకారం మరింత ఆందోళనను సృష్టిస్తారు. మీరు "ఈరోజు నా ఆరోగ్యం బాగోలేదు" అని మాత్రమే చెప్పినా, మరొకరు దాన్ని "చాలా బలహీనంగా ఉన్నారు, లేవలేకపోతున్నారు " అని ఇంకొకరికి చెబుతారు. ఇలా ఒకరి నుంచి మరొకరికి చేరే కొద్దీ మీ గురించి ప్రతికూల భావనలు, ఆందోళనలు, జాలి దయతో కూడిన భయాలు పెరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ మీ పై మరింత ప్రభావం చూపిస్తాయి. 

అలా పది మంది మీ గురించి "చాలా అనారోగ్యంగా ఉన్నారు", "చాలా బలహీనంగా ఉన్నారు" అనే ఆలోచనలు తరంగాలుగా పంపితే, ఆ ప్రతికూల శక్తి తిరిగి మీకే చేరుతుంది.


• అందుకే శరీరం ఎంత అనారోగ్యంగా ఉన్నా, ఎవరైనా "ఎలా ఉన్నారు?" అని అడిగితే, "నేను చాలా బాగున్నాను. అంతా ఫస్ట్ క్లాస్." అని చెప్పండి. మన ఆరోగ్య స్థితిని పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం  ఉన్న  వైద్యుడికి మాత్రమే నిజం చెప్పండి. మిగతా ప్రపంచానికి అది తెలుసుకోవాల్సిన అవసరం ముమ్మాటికీ లేదు.


• మీరు "నేను బాగున్నాను" అని చెప్పినప్పుడు, ఎదుటివారు కూడా "బాగున్నారు" అనే ఆశీర్వాద భావనను మీకు పంపుతారు. ఆ శుభాకాంక్షలు మీ ఆరోగ్యాన్ని బలపరుస్తాయి.

 మన సమస్యలను అందరితో పంచుకోవడం కంటే, వాటి కోసం ప్రతిరోజూ ఆశీర్వాదపూర్వకమైన , ఉన్నతమైన ఆలోచనలు మనమే సృష్టించాలి. ఉదాహరణకు శరీరానికి నొప్పి ఉంటే, "నొప్పి ఉంది" అని పదే పదే చెప్పకండి. "నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. ప్రతి కణం శక్తివంతంగా ఉంది." అని చెప్పండి.

 రాత్రి నిద్రపోయే ముందు "నొప్పి ఉంది, నొప్పి ఉంది" అని ఆలోచిస్తూ నిద్రపోతే, ఆ ఆలోచన ఆరు గంటల పాటు శరీరంపై పనిచేస్తుంది. ఉదయానికి నొప్పి మరింత పెరిగే అవకాశం ఉంటుంది .

 అదే , నిద్రకు ముందు "నా శరీరం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంది" అని భావించి నిద్రపోతే, ఆ సానుకూల స్పందనలు (vibrations ) రాత్రంతా శరీరాన్ని స్వస్థపరచడం ప్రారంభిస్తాయి.


• మన శరీరం కేవలం ఆహారంతో మాత్రమే కాదు. . .  మన ఆలోచనలు, భావాలు, స్పందనలతో (vibrations ) కూడా ప్రభావితమవుతుంది.

 అందుకే ఇతరుల గురించి గాసిప్ చేయడం మానేయాలి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటను ముందుగా మన శరీరంలోని ప్రతి కణం వింటుంది. అది మన ఆరోగ్యాన్ని మరియు కర్మ ని ప్రభావితం చేస్తుంది.


• మీరు ఎవరితో నైనా ఫోన్ లో కానీ , ముఖాముఖీ కానీ మాట్లాడిన తరువాత, మిమ్మల్ని మీరే ఇలా అడగడం అలవాటు చేసుకోండి .

వారితో  నా  ఈ  సంభాషణ  నా లో  శక్తిని పెంచిందా ? లేక నా శక్తిని తగ్గించిందా ?

ఎప్పుడైనా బంధుమిత్రుల తో పార్టీలకు ఫంక్షన్లకు వెళ్లిన తర్వాత కూడా ఇదే ప్రశ్న వేసుకోండి. అక్కడ తిన్నది, తాగింది, మాట్లాడింది, కలిసిన వ్యక్తులు ఇవి అన్నీ కూడా మీ ఆలోచనలను స్పందనలను (vibrations ) పైకి ఉన్నతంగా తీసుకెళ్లాయా ? లేక క్రిందికి దించాయా ?


మన జీవితంలో మన శక్తిని తగ్గించే వాటిని గమనించాలి  గుర్తించాలి. ఇందులో మనం గ్రహించవలసింది కొందరి వ్యక్తుల సమీపత ద్వారా మన శక్తి పెరుగుతుంది, అదే విధంగా మరికొందరి ద్వారా మనకు ఉన్న శక్తిని కోల్పోవడం జరుగుతుంది . ఇటువంటి వారికి దూరంగా ఉండడం మంచిది .


• ప్రతికూల (Un Ethical & Negative ) సంభాషణల్లో భాగస్వామ్యులు గా కాకండి. ఒకవేళ ఎవరైనా అటువంటి విషయాలను మీకు వినిపించాలి అనుకుంటే సున్నితంగా తిరస్కరించండి . 

 మన శరీరానికి ఆరోగ్యానికి ఎలా కొన్ని ఆహారాలు సరిపడవు అని మనం తినకూడదు అని నిర్ణయించుకుంటామో , అలాగే కొన్ని విషయాలు వినకూడదని  కూడా నిర్ణయించుకోవాలి. "మరేదైనా మంచి విషయం మాట్లాడుకుందాం" అని చెప్పడం అలవాటు చేసుకోండి .


🌹🌹🌹🌹🌹🌹


• ధ్యానం (మెడిటేషన్) కోసం సమయం లేదని చెప్పి, పార్టీలకు ఫంక్షన్లకు మాత్రం సమయం కేటాయించడం సరైనది కాదు. మన స్పందనలను పెంచే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.

రోజూ కనీసం 30 నిమిషాలు ధ్యానం తప్పనిసరిగా చేయండి. తెల్లవారుజామున ఫలితం బాగుంటుంది. ధ్యానం అనేది జీవితానికి ఒక ఎంపిక కాదు , అది జీవితంలో ప్రధాన అవసరం.

 ప్రతీ రోజూ  ఉదయం ధ్యానం ద్వారా మన అంతర్గత రక్షణ కవచాన్ని బలపరచుకోవాలి . ఎందుకంటే రోజంతా మనం వందలాది మంది స్పందనల (vibrations ) మధ్య జీవిస్తాం.

మన స్పందనలు ఉన్నతంగా ఉంటే, ఇతరుల ప్రతికూల స్పందనలు ( Negative vibrations) మనపై ప్రభావం చూపవు. దానికి బదులుగా, మన సానుకూల స్పందనలు వారిపై ప్రభావం చూపుతాయి.


• మన ఇల్లు పెద్దదిగా విలాసవంతంగా ఉండాల్సిన అవసరం లేదు . అధిక శాంతి స్పందనలు ఉన్న ఇల్లు కావాలి. ఎవరైనా మన ఇంటికి వచ్చి, "మీ ఇంటికి వస్తే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తోంది" అని చెప్పగలిగితే, అదే నిజమైన విజయం.


• సమయం గురించి కూడా ఎప్పుడూ "నాకు సమయం లేదు" అని చెప్పకండి. బదులుగా, "నా దగ్గర చాలాసమయం ఉంది. సమయం ఎప్పుడూ నాకు సహకరిస్తుంది." అని చెప్పండి.

 సమయంతో కూడా మన సంబంధం ఒక శక్తి సంబంధమే.


🌹🌹🌹🌹🌹🌹


• మనసు పరిశుభ్రంగా ఉన్నప్పుడు అంతర్దృష్టి (Intuition) పెరుగుతుంది. 

అప్పుడు అనవసరమైన పది ఆలోచనలు రావు , సరైన ఒక ఆలోచనే వస్తుంది. 

ఆ ఆలోచన విజయవంతమవుతుంది . సూక్ష్మ దృష్టి పరీశీలన శక్తి పెరుగుతుంది. 


• అందుకే . . .  ప్రతిరోజూ ఈ సంకల్పాలను పునరావృతం చేయండి.

  నేను శ్రేష్టమైన ఆత్మను.

  నేను ఎవరి నుంచి ఏమీ ఆశించను .

  నేను అందరికీ సహాయం చేయగలను .

  నేను భగవంతుని యొక్క సంతానం .


 ఏ సమావేశానికి వెళ్లినా, ఎవ్వరినైనా  కలిసే ముందు ఈ సంకల్పాలను  మనసు లో గుర్తుచేసుకోండి .


• ఫోన్, టీవీ, వార్తాపత్రికలు, సోషల్ మీడియా ద్వారా మనలోకి ఏమి ప్రవేశిస్తుందో  జాగ్రత్తగా చూసుకోవాలి. వినోదం పేరుతో ప్రతికూల విషయాలను స్వీకరించకండి .


• ప్రతి ఒక్కరికీ మీ మనసు ద్వారా దీవెనలు ఇవ్వండి.  శుభచింతన చేయండి. ఎవరి గురించి కూడా చెడు మాటలు మాట్లాడకండి. "వారు చాలా మంచివారు" అనే భావనను కలిగి ఉండండి.


• ఏ పరిస్థితి వచ్చినా ఇలా చెప్పండి :

 "ఈ పరిస్థితిలో కూడా నా మేలు దాగి ఉంది."

   ఈ వాక్యాన్ని పదేపదే చెప్పడం వల్ల అది మీ జీవిత సత్యంగా మారుతుంది. అప్పుడు ప్రతి సవాలు కూడా మీ అభివృద్ధికి, శ్రేయస్సుకు మార్గం అవుతుంది.


మీరు ఒక పాజిటివ్ శక్తి గా మారాలి 

అంటే 

ఎన్నో  నెగెటివ్ శక్తుల ను  దాటి వెళ్ళాలి . 





ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 7 Aug 2026 8:15 PM.

Wednesday, August 5, 2026

771. మనిషి కూడా ఒంటరివాడే


మనిషి కూడా ఒంటరివాడే 


• మనిషి ఎందుకని ఏకాంతం గా జీవించలేడు ?   ఎందుకని  ఒంటరితనం అంటే భయపడుతూ   ఉంటాడు ? 

ఒంటరి గానే పుట్టాడు. ఒంటరిగా నే చనిపోతాడు . మరి నడి మధ్య నడిచే జీవితం నాటకం, తాత్కాలికం అని తెలిసినా ఒంటరిగా ఏకాంతంగా జీవించ లేక కొత్త బంధాలు ఏర్పరచుకొని కర్మల ఖాతా, బుణాలు తయారు చేసుకుంటాడు .  


• మనిషి మనసు తరచూ అనేక అలజడులు గురి అవుతూ ఉంటుంది . దుఃఖం కొని తెచ్చుకుంటుంది. ముఖ్యంగా బంధాలలో బంధుత్వాల  లో,  స్నేహల లో  ఇలా ప్రతీ రిలేషన్ షిప్ లో కూడా ఆనందం గా ఉన్నట్లు పైకి నలుగురితోనూ కనిపిస్తూనే , లోపల మాత్రం ఆ యా వ్యక్తుల పట్ల ఏదో అసహనానికి గురి అవుతూ, అలజడులు సృష్టించుకుంటూ , వారు మాట్లాడే సూటి పోటి మాటలకు , వారి స్వభావ సంస్కారాల హీనతకు కొందరి మనసు బాధపడుతూ ఉంటుంది. నేటి కలియుగం లో ఈ స్థితిని అటుఇటుగా ప్రతి ఒక్కరూ అనుభవిస్తూనే  ఉంటారు .

• అసలు, మనిషి తన బంధాలలో  అందరిలో ఉంటూ తన మనసు ను ఒంటరిగా , ఏకాంతం గా ఉంచుకో లేడా ? . . . ఈ విషయాన్ని ఉద్దేశించే ఒక ప్రముఖ సినీ కవి “ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది “ అనే అధ్బుతమైన విషయాన్ని పాట గా రాశాడు . 


• ముఖ్యంగా ఈ విషయం ఎందుకంటే . . . మనం భగవంతుడిని తల్లి తండ్రి గా భావిస్తూ భక్తి చేస్తూ పూజిస్తాం , ఆరాధిస్తాం . కానీ ఆ భగవంతుడు ఎక్కడో మన కంటికి కనిపించని ముల్లోకం ఆవల (1. స్థూల లోకం, 2. సూక్ష్మ లోకం, 3. మూల వతనం) ఒంటరిగా ఏకాంతంగా ఏకాకి గా శక్తి స్వరూపుడై సూక్ష్మ జ్యోతిర్బిందువై ఉంటాడు . 

భగవంతుని కి తెలుసు మనమందరం ఆత్మ స్వరూపులైన ఆయన పిల్లలం అని  , దేహం ధరించి భూమి పై కర్మలు చేయడానికి వచ్చాం అని ఆయనకు తెలుసు. కానీ ఈ విషయం మనకు ఆయన చెపితే నే కానీ  తెలియదు. 

భగవంతుని తో  మనం  భౌతికంగా కలిసి లేకపోయినా, మనం స్మృతి చేస్తూ ఉంటే చాలు మన ఆలన పాలన తాను ఎక్కడో ఏకాంతం గా ఉంటూనే మనల్ని చూస్తాడు . ఇదంతా శక్తి ప్రసార రూపేణా జరుగుతుంది.  భగవంతుడు ఒంటరిగా ఉంటూనే సమస్త సృష్టి ని నడిపిస్తాడు. మనం తెలిసి తెలియక చేసే పాప కర్మలను సరి దిద్దుకునే శక్తిని ఇస్తూ ఉంటాడు. కానీ ఆయన భౌతికంగా మన పక్కన కనిపించడు. 

ఒంటరి తనం లో ఉన్న శక్తి , ఏకాంతం లో ఉన్న మౌనం తోనే ఆయన ఈ సమస్త సృష్టి ని నడిపిస్తాడు . సర్వ జీవుల అవసరాలు తీరుస్తాడు . 

• మరి అటువంటి సర్వ శక్తి వంతుడు అయిన భగవంతుని సంతానం , పిల్లలం , వారసులం అని చెప్పుకునే మనం ఆయనలోని ఏకాంతం , ఆయనలోని ఒంటరితనం అనే లక్షణాలను ఎందుకు పుణికి పుచ్చుకోలేక పోతున్నాము ? ఆయన శక్తి ని ఎందుకు వారసత్వంగా స్వీకరించలేక  మన మనసును దుఃఖానికి, వ్యర్థ విషయ వికారాలకు దాసోహం అయ్యేలా చేసుకుంటున్నాము ? ఆయన కనిపించనంత దూరం లో ఉంటూనే తన శక్తి తో మన అందరినీ చూస్తుంటాడు . మన అవసరాలు తీరుస్తాడు .

• మరి మనం అదే విధంగా అన్ని బంధాలలో, సంబంధాలలో , అందరితోనూ ఉంటునే ఏకాంతం గా ఒంటరితనం గా మన మనసు ను ఎందుకు ఉంచుకోలేక పోతున్నాం ? 

మన మనసు లో వ్యర్థ విషయాల ను  నింపుతూ  , బుద్ధి  హీనత తో మనసు ను  బానిసగా తయారు చేసుకుంటూ , మనలోని   పాజిటివ్ శక్తి ని కోల్పోయి  దుఃఖితులు గా అవుతున్నాం .


• మనసు మాయకు వశం అయినపుడు తన శక్తిని కోల్పోయి , మోహం , కామం, క్రోధం , ఈర్ష్య ద్వేషం , భయం , ఆందోళన , వికారాలకు అలవాటు పడుతుంది . ఇవన్నీ నేటి మన మానవ సంబంధాల లో సహజం అనుకునే విధంగా దిగజారిపోయాం . అందువలనే మనిషి మనసు కోతి వంటిది , స్థిరత్వం ఉండదు అని అంటారు . 

• సర్వ శక్తిమంతుడు అయిన పరమాత్మ శివుని కి మన బుద్ధి లో , ఆలోచన లో , మనసు లో చోటు ఇస్తే మన మనసు మన అధీనంలో ఉంటుంది. ప్రేమ దయ కరుణ మన మనసు లో చిగురిస్తాయి. . . మనం అందరిలో అందరితో ఉంటూనే ఏకాంతం లోని ఆనందం అనుభవిస్తూ , ఒంటరితనం లోని అధ్బుతమైన భగవంతుని శక్తి ని స్వీకరించవచ్చు . 


• సూక్ష్మం  గమనించాలి …. దీని అర్థం, మనుషులకు బంధాలకు బాధ్యతలను విడిచి దూరంగా ఉండమని కాదు . వారితో ఉంటూనే మనసు ఎందులోనూ , ఎవరి తోనూ చిక్కుకు పోకుండా , దుఃఖానికి బానిసగా కాకుండా,  ఏ విషయం లోనూ బలహీన పడకుండా  స్వయాన్ని  ఆధీనంలో ఉంచుకోవాలని . 

భగవంతుని వలే మనిషి కూడా ఒంటరి వాడే ,  ఈ విషయం మరచి  బంధాలను కోరుకొని , అందులో బంధీ గా  చిక్కుకొని కర్మల యాతన అనుభవిస్తున్నాడు . 

అయినప్పటికీ కూడా ప్రతీ రోజు తెల్లవారు జామున లేచి ఏకాంతం గా కూర్చొని ధ్యానం,  శివుని తో యోగం చేసే అభ్యాసం నిరంతరం చేయడం వలన అందరితో ఉంటూనే మనసును అధీనంలో ఉంచుకునే యోగశక్తి లభిస్తుంది. 

మనిషి ప్రతీ కర్మ చేయాలి , కానీ అందులో మునిగి పోకుండా  మనసును అతీతంగా చేసి యోగి గా  . . . తామరాకు పై నీటి బొట్టు వలే  జీవించాలి. అప్పుడే మనిషి కర్మ యోగి గా మారగలడు.  నిత్యానందం పరమానందం అనుభవించగలడు.



ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 6  Aug 2026 , 7:00 AM.


Sunday, July 26, 2026

770. సుఖం సంతోషం ఆనందం

 

సుఖం సంతోషం ఆనందం



• మనం జీవిస్తున్న దశా కాలం లో , ఎన్నో భావాలు, భావోద్వేగాలు కలిగి ఉంటాం. కానీ వాటన్నిటినీ మనం లో లోపల అనుభవిస్తూ అనుభూతి చెందుతూ ఉంటాం, కానీ వాటిపై సంపూర్ణ అవగాహన లేని ఎన్నో విషయాలు మన చుట్టూనే ఉన్నాయి . అంటే కొన్ని భావాల పై పూర్తి సూక్ష్మం , వ్యత్యాసాలు తెలియకుండానే దానిని మనం ఆపాదన చేసుకుని , ఆ భావాలను భాష గా ఉపయోగిస్తూ ఉంటాం . 

  ఉదాహరణకు సుఖం, సంతోషం, ఆనందం అనే పదాలను తరచూ వాడుతుంటాం. చూడడానికి మూడు భావాలు ఒకే స్థితి కి సంబంధించినవి గా అనిపిస్తాయి . కానీ వాస్తవానికి మూడింటికి చాలా వ్యత్యాసం ఉంది. 


సుఖం  : అనేది శరీరం పొందే అనుభూతి . ఒక కారు లో ప్రయాణం చేస్తున్నంత సేపు లేదా ఒక ఏ.సి. ముందు కూర్చుని ఉన్నంత సేపు శరీరం సుఖాన్ని హాయిగా పొందుతుంది . సుఖం అనేది ఏ రూపంలో పొందినా అది శరీరానికి మాత్రమే వర్తిస్తుంది. సుఖం తాత్కాలికం .

ఒకోసారి మనం గమనించవచ్చు, ఏదైనా ప్రయాణం నిలబడి చాలా దూరం చేసినపుడు వెంటనే సుఖం లేదు అంటాం. ఎందుకంటే శరీరం అలసిపోయి ఉంటుంది కాబట్టి. 

  సుఖం దేహానికి సంబంధించిన అంశం.

వస్తు వాహన వైభోగాలు లేకపోతే సుఖం లభించదు అని అనుకుంటాం , కానీ ఇవేవి లేని పాత కాలం రోజులలో కూడా ,  ప్రకృతి తో కలిసి అనుసంధానం అయి మనిషి తన సుఖం పొందేవాడు . 


సంతోషం :  మనసు పోందే అనుభూతి . దీనికి శరీరం తో సంబంధం ఉండదు. ఏదైనా మంచి విషయం విన్నప్పుడు , మనకు నచ్చింది చూసినప్పుడు, మనం ఇష్టమైన వారితో ఉన్నప్పుడు , ఊహించుకున్నప్పుడు  మన మనసు సంతోషంతో ఉరకలు వేస్తుంది . సంతోషం అనేది మనసు పొందే అనుభవం. సంతోషాన్ని నవ్వు ద్వారా , కేరింతలు ద్వారా అనేక రూపాల్లో బయటకు వ్యక్తపరుస్తాం.

 సంతోషం మనసు కి సంబంధించిన అంశం.

ఊహించినవి , అనుకున్నవి , నచ్చినవి దొరకక పోతే పోతే సంతోషం లభించదు .


ఆనందం :  ఇది మనిషి యొక్క ఆత్మ పొందే స్థితి . ఆనందం అనేది శరీరం, మనసు రెండింటి కి అతీతమైనది. . రమిస్తూ ఉండడం. ఆనందం అలౌకికం . ఆనందం బయటకు కనిపించదు. ఆనందం అనేది ఒక నిశ్చలమైన నిశ్శబ్దం తో ఉంటూ , స్థితి గతులు , పరిస్థితులకు అతీతంగా ఉంటుంది . వస్తు వైభోగాల ప్రభావం తో ఇది జనియించదు . ఆనందాన్ని   ఆత్మ  మాత్రమే  అనుభవిస్తుంది . ఆనందం ద్వారా వచ్చే శక్తి సుధీర్ఘ కాలం ఉంటుంది. 

  ఆనందం ఆత్మ కి సంబంధించిన అంశం.

ఏది ఉన్నా ,  లేక పోయినా అన్నింటికీ అతీతంగా నిత్యం దేదీప్యమానంగా  ఆత్మ కి  స్థితప్రజ్ఞత తో లభించేది ఆనందం.  దీనిని నిత్యానందం అని కూడా అంటారు . 


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 24 JULY 2026 , 11:00 AM.

Thursday, July 23, 2026

769 . నన్ను “నేను” వదులు కుంటున్నాను

 


 నన్ను  “నేను” వదులు కుంటున్నాను 



• నన్ను “నేను” వదులుకుంటున్నాను . “నేను” అనేది నాకు చాలా భారం గా అనిపిస్తుంది. భరించలేని నొప్పి ని కలిగిస్తుంది. ప్రతీ ఆలోచన ని , కర్మని రోజు రోజుకు బరువుగా చేస్తుంది. దీనంతటికీ కారణం నాలో ఉన్న “నేను” అని తెలుసుకున్నాను. 

• బహశ ఈ “నేను” , అహంకారం అయి ఉండవచ్చు . అది ఎక్కువగా ఉన్నా, తక్కువ గా ఉన్నా సరే నా తలపై ఉండడం వలన, భారం గా బరువు గా అనిపిస్తుంది. అందువలన తేలికగా అవలేక పోతున్నాను. తేలికగా కానప్పుడు నేను , ఆ పైన ఉన్న నా లోకానికి సంతోషంగా ఎలా వెళ్ల గలను . నా తండ్రి ని ఎలా కలుసుకోగలను . ఆయనను నేడు కింద నుంచి చూస్తున్నాను. కానీ ఆయన దగ్గరకు వెళ్ళాలంటే , నాలో ఏదో బరువు భారంగా అనిపిస్తుంది . ఆ బరువు  పేరు  “అహం” అని  తెలిసింది. సర్వత్రా ఇదే నాకు అడ్డంకి అవుతుంది. 

    అందుకే  నన్ను  “నేను”  వదులుకుంటున్నాను.  I  my self  withdrawing . 


• అనేక జన్మలు గా “అహం” పొరలు పొరలుగా కమ్మేసి ఉండడం వలన లోపల బంధింపబడి ఉండిపోయిన “నేను” ,   నేడు ఈ సృష్టిలో తేలికగా అవలేక పోతున్నాను . ఉన్న స్థానం నుంచి ఎగరలేక పోతున్నాను .

  అహంకారం వలన   నా లోని  “నేను”  నిజం మాట్లాడలేక అసత్యాలు మాట్లాడవలసి వస్తుంది,  వివాదాలు , అలజడులు  సృష్టించుకుంటున్నాను. ఇతరులకు దుఃఖం పంచి పెడుతున్నాను.  

నా లోని “నేను” నిద్రావస్థలో ఉన్నప్పుడు మాత్రం నిత్యానందం  పొందుతూ , నా తండ్రి శివుని యొక్క వెలుగు చూడగలుగుతున్నాను. అందుకే సాధ్యమైనంత వరకు మేల్కొని ఉండడానికి  ప్రయత్నిస్తున్నాను . 

  నా లోని “నేను” అనేక కోరికలు కోసం నిత్యం వెంపర్లాడుతుంది . దక్కని వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనిపిస్తుంది. శారీరక వాంఛల కోసం , ధనం కోసం , కీర్తి ప్రతిష్టలు కోసం పరితపిస్తున్నాను . అందుకే నాకు “ నేను “ బరువు గా భారం గా అయిపోయాను.

• నేను ఎప్పటికైనా ఎగరాలి , ఎగరలేక పోతే అంతిమ ఘడియలు భూమి పై నరకం అనుభవించ వలసి వస్తుంది , అందుకోసం తేలికగా ఇప్పటినుంచే అవ్వాలి . అందుకే నన్ను “ నేను “ వదులు కుంటున్నాను . 


ఇంతకీ 

ఆ “ నేను “   ఎవరో చెప్పలేదు కదా ! 

"  నేను " ఒక  ఆత్మను .


నా  ఆత్మ  లోనే  మరొక 

" నేను "   అహంకారం .


" నేను " ప్రతి మనిషి లో ఉన్నాను. 


ఆత్మ లో అహంకారం తొలగినపుడు మాత్రమే తేలిక అయి పరమాత్మ వైపు పయనిస్తుంది.

  



ఓం శాంతి 

‌ఓం నమఃశివాయ 🙏 

ఆత్మ   23 July 2026 3:15 PM .

Monday, July 20, 2026

768. సుగుణాల శుభమాల

 

సుగుణాల శుభమాల


• సుగుణాల శుభమాల పరిమళం  .

• మనిషి కి 

  సుగుణాల శుభమాల పరిమళం 

• బ్రతుకు కి 

  బంగారు భావాలు అలంకరణం .


• రేయి పగల   సాధారణం 

  చీకటి వెలుగు ల   జీవితం .

• మనసు   ఆకాశ  నిర్మలం

  చల్లని   మేఘమైన  విస్తారం .


• సుశీ లత ల   కుటుంబం

  చింతలు  చిగురించని  వనం .

• దరహసపు   విరి  వదనం 

  దివ్య పుష్పాల ధారణం .


• సుగుణాల శుభమాల పరిమళం 

• మనిషి కి 

  సుగుణాల శుభమాల పరిమళం 

• బ్రతుకు కి 

  బంగారు భావాలు అలంకరణం.


• వైషమ్య    వికారాలు 

  మనిషి ని  బంధించే   సుడిగుండం.

• ఆలోచనల   అలలు

  ఆటుపోటుల   సాగరం .


• అలకలు  -  అల్లిన మల్లెలు

‌  వాడినా . ‌. . వికసించును  సంతోషం .

• బంధాలు -  అల్లుకున్న తీగలు 

  వీడినా  . . . విరియును  ఆత్మానందం.


• సుగుణాల శుభమాల పరిమళం 

• మనిషి కి 

  సుగుణాల శుభమాల పరిమళం .

• బ్రతుకు కి 

  బంగారు భావాలు అలంకరణం.



యడ్ల శ్రీనివాసరావు 21 Julyv2026 10:00 AM 

Wednesday, July 15, 2026

767. ఇది మనం గమనిస్తున్నామా ?

 

  ఇది మనం గమనిస్తున్నామా ?




• మనకు గుర్తు ఉందా ? 2000 సంవత్సరం కంటే ముందు పుట్టిన మనం మన చిన్న తనం , ఇంట్లో పెరుగుతూ ఉన్న సమయంలో తల్లి తండ్రులు, పాఠశాల లో ఉపాధ్యాయులు తరచూ మనకు నీతి ని బోధించే వారు . వారికి మనసు లో మన పట్ల  ప్రేమ మమకారం ఉన్నా సరే బయటకు పెద్ద గా వ్యక్త పరచకుండా , కేవలం వారి దృష్టి మన నడవడిక మీద పెట్టి గమనిస్తూ ఉండేవారు .

 ఎందుకంటే నడవడిక సరి లేక పోతే, వీడు భవిష్యత్తులో ఎందుకు పనికి రాకుండా పోతాడు అనేవారు .   అంటే దాని అర్థం ఏ పని (వృత్తి) చేయలేడు అని కాదు . ఏ పని ని బాధ్యతాయుతంగా చేయలేడు అని అర్థం . అంటే ఒక మనిషి నడవడిక, ప్రవర్తన సరిగా లేకపోతే అత్యంత ప్రమాదకరమైన స్థితి , ఆ మనిషి కే కాదు భవిష్యత్తులో తన కుటుంబానికి , చుట్టూ ఉన్న సమాజానికి కూడా చేటు జరుగుతుంది అని , మన తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు ఆలోచించే వారు . వారి ఆలోచన సరళి కొంత వయసు వరకు , కాస్తంత కఠినం గా అనిపించినా . . . అందులో సూక్ష్మం మాత్రం ఆ వ్యక్తి శ్రేయస్సు , సమాజ శ్రేయస్సు దాగి ఉండేది ‌. 

 ఒక తప్పు చేస్తే చాలు దండించే వారు . శిక్షించే వారు .  తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనే భయం , భావన మన బాల్యం నుంచే ప్రతి ఒక్కరికీ ఆ రోజుల్లో అనుభవం అయ్యేది , ముఖ్యం గా మనసుల్లో ముద్రించుకు పోయేది.

• ఒకవేళ తప్పులు  చేసి కప్పి పుచ్చుకొనో  లేక శిక్షలకు దొరకకుండా పెరిగిన వారు , ఆ తప్పుడు పనుల స్వభావం తోనే  నేటికీ జీవిస్తూ ఉంటారు అనడం లో సందేహం లేదు .  అది వారికి బాల్యం నుంచి ఒక అలవాటు తో కూడిన ఆనందం అవుతుంది ‌. ఎందుకంటే వారికి తమ స్వభావం పట్ల పరిపక్వత ఉండదు . “మొక్కై వంగనిది మానై వంగునా “ అని అందుకే అంటారు.


• ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థల్లో , సమాజం లో , ప్రజలకు సేవ చేస్తాం అని చెప్పే రాజకీయ పార్టీ ల్లో ,  ప్రతీ చోట బహిరంగంగా వికృత వికార చేష్టలతో, హింస తో అనేక మంది  ప్రత్యక్షం గా పార్కుల్లో , వేదిక ల పైన , యూట్యూబ్ వీడియోల లో విచ్చలవిడి వికారీ  చేష్టలతో ప్రవర్తిస్తూ ఉండడం మనం గమనిస్తున్నాం . ఇటువంటి వారు ముమ్మాటికీ తల్లి తండ్రుల , ఉపాధ్యాయులు చెప్పిన నీతి ని చిన్న తనం నుంచి ఆచరించని వారే. ఇటువంటి వీరే సంఘవిద్రోహ శక్తులు గా తయారవుతూ సమాజం లో స్వేచ్చ ను హరిస్తూ , సామాన్య పౌరులకు శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారు. 

ఇది ప్రత్యక్షంగా   మన సమాజంలో ప్రతి రోజూ నేడు నిత్యం అనుక్షణం చూస్తున్నాం . ఇది ఇంతింతై అన్నట్టుగా పెరుగుతూ ఉంది కానీ , … నీతి , విలువలు , అభ్యుదయ భావాలు లాంటి విషయాలు, మాటలు జీర్ణించుకోలేని దుస్థితి కి నేడు అధిక శాతం యువత తయారవుతుంది అనడం లో సందేహం లేదు. ఇందులో గంజాయి, మాదకద్రవ్యాలు, మద్యం వంటివి వీరికి ప్రోత్సాహకాలు గా అందించే రాజకీయ వ్యవస్థలు తయారు అయ్యాయి . 

 వారిలో ఉన్న ఆలోచన మంచి ని ప్రేరేపిస్తుందా  లేదా చెడు ని ప్రేరేపిస్తుందా అనే కనీస మానసిక అవగాహన లేకుండా, సరియైన పునాది లేని వ్యక్తిత్వం తో , హద్దులు లేని స్వేచ్చ తో , తమో గుణ ప్రవర్తన ను ఆచరించడానికి పూర్తిగా అలవాటు పడి పోయారు . దీనికి ప్రధాన కారణం నేడు కాలం లో విస్తృతం గా వ్యాపించిన ఇంటర్నెట్ మాయా కమ్యూనికేషన్. 


• ఇదంతా చివరికి …. దేనికి చేరువ అవుతుంది అంటే  వినాశనానికి . జన జీవన వినాశనానికి . కుటుంబ  వ్యవస్థ ల  వినాశనానికి . ఇప్పటికే ఈ వినాశనం  బీజం పడి  మొలకెత్తి వృక్షం అయి , అంట్లు గా సమాజం లో అల్లుకుపోయింది . దీనిని నివారించడం అసాధ్యం అనేంతగా తయారయ్యింది .  

• గమనించండి ….. 2000 సంవత్సరం కంటే ముందు కాలం లో సమాజం, జన జీవనం , ప్రకృతి ఇంత అలజడుల తో ఉండేదా . నేడు 50 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతీ ఒక్కరికీ తమ జీవితాల ద్వారా ఇదంతా ప్రత్యక్ష అనుభవం కావడం లేదా?


• మనిషి కి బాల్యం నుంచి పెరుగుతూ ఉన్న సమయంలో నీతి కధలు, నీతి , విలువలు, కష్టం సుఖం , మంచి చెడు , పరులకు సహాయం , దైవం వంటివి తెలియక పోతే మొదట నాశనం అయ్యేది ఆ మనిషే , తరువాత తన కుటుంబం లోని భార్య , భర్త , పిల్లలు …… ఆ తరువాతే సమాజం . వాడు ఎంత ధనవంతుడైన , పేదవాడు అయినా జరిగేది ఇదే . 

• నేడు మనం అవసరాలకు మించిన ధనం సంపాదిస్తూ , సౌకర్యాలు అనుభవిస్తూ అభివృద్ధి చెందుతున్నాం,  నాకేంటి!  అనే మాయా ముసుగు లో  పైకి  జీవిస్తున్నాం , మంచిదే . . .  కానీ అంతకంటే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిత్వాలు కలిగిన మనుషుల తో , వైట్ కాలర్ సైకో లతో ( పైకి సాధారణంగా కనిపించే ఉన్మాదులు), ప్రమాదకరమైన మానసిక రోగులతో కలిసి ఇటు కుటుంబ వ్యవస్థ లలో , అటు సమాజం లో కలిసి సహ జీవనం చేస్తూ ఉన్నాం . అందువలనే క్రైమ్ రేటు ఇంతగా పెరుగుతుంది . ఇందులో ప్రధాన మొదటిది అక్రమ శారీరక సంబంధాలు, రెండవది అక్రమ ధన సంపాదన .  

• ఇటీవల పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా గత 15 ఏళ్ళలో సమాజంలోని ప్రజలు , మానవ జీవితాల పట్ల చేసిన దురాగతాలు బయట పడుతుంటే , డబ్బు కోసం ఆమె ప్రవర్తించిన తీరు చూసినప్పుడు ఆలోచిస్తే …… ప్రాథమికంగా ఒకటే లోపం అనిపిస్తుంది . . . ఆమె పెరిగిన తీరు , పెంపకం లో లోపం , స్వభావం లోని లోపం . ఆమె కి ఎంతో ధనం సహజంగా ఉండి ఉన్నా సరే అత్యాశతో చేసిన దురాగతాలు . ఇటువంటి కొందరు నాయకులు దేశం నిండా అనేకులు వ్యాపించి ఉన్నారు .  ఇది కేవలం రాజకీయ నాయకులకే కాదు , సర్వ మానవాళిలో ఈ స్వభావం ఎంతో కొంత అటుఇటుగా వ్యాపించుకు పోయి ఉన్నాది .


• ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లో ఉన్న ప్రతి మనిషి కి రక్షణ , ఉన్నంతలో జీవన సంతృప్తి ఉండేది . మనుషుల మధ్య ఎన్ని అంతర్యుద్ధాలు వచ్చిన తెల్లారే సరికి సమసిపోయి, అందరూ కలిసి ఉండేవారు. విలువలు ఉండేవి . పిల్లలు పెంపకం జీవన విధానం విలువలతో బాగుండేది . ఏదైనా సమస్యను అనుభవం తో  యుక్తిగా , ఎలా  పెద్ద వారు పరిష్కారించు కుంటున్నారో ప్రత్యక్షంగా పిల్లలు గమనించే వారు , సమాజం లో నలుగురితో ఎలా మెలగాలో , ఇంటి వాతావరణం నుంచే అలవడేది . కానీ నేటి కాలంలో మన ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో మనకు మనమే ప్రశ్నించుకోవాలి, ఆలోచించు కోవాలి .  

భర్త మంచి చెపితే భార్య కి నచ్చదు, భార్య మంచి చెపితే భర్తకు నచ్చదు. అహంకారాలతో  కూడిన ఈ  విభిన్న వ్యక్తిత్వాలు , మనస్తత్వాలు కలిసి తమ శారీరక సుఖం మరియు సామాజిక అవసరాల కోసం కలిసి జీవిస్తున్నాం అన్నట్లు ఉంటుంది . కానీ  ... వారి  తీరు , ప్రభావం  వారి  పిల్లల  పై  ఏ విధంగా  ప్రభావితం అవుతుందో  అని గమనించే స్థితిలో లేరు , అనేది నిజం . ఇక పిల్లల వ్యక్తిత్వాన్ని  ఇటువంటి తల్లిదండ్రులు ఎలా తీర్చి దిద్దగలరు ?


నేటి స్వతంత్ర కుటుంబాలలో మనిషి కి అవసరానికి మించిన  ధనం , స్వేచ్ఛ , తద్వారా విచ్చలవిడితనం లభిస్తుంది . . . అంతకు మించి వీటి ద్వారా మనిషి  ఏమి కోల్పోతున్నాడో తాను తెలుసుకో లేక పోతున్నాడు  . 


• మన ఇంటి పెరట్లో పెరిగిన మొక్క కి చీడ పడితే , ఇంటిలో మిగిలిన మొక్కల కి విస్తరిస్తుందని తెలిసి తీసి వీధిలో బయట పడెస్తాము , వెంటనే వీధి లో మొక్క లకు కూడా ఆ చీడ సోకుతుంది . అలా కాకుండా ఆది లోనే నివారించడానికి మంచి ఘాటైన మందు ఇంటి పెరట్లో నే పిచికారి చేస్తే , ఆ చీడ బయట మొక్కలకు వ్యాపించదు . ఒకవేళ ఆ మొక్క శ్రేష్టమైనది అయితే పట్టిన చీడ నుంచి బయటపడి వృద్ధి అవుతుంది . శ్రేష్టమైనది కాకపోతే పిచికారి చేసిన మందుకి చీడ తో పాటు కలిసి చస్తుంది . 

అదే విధంగా, మనలో  మొలకెత్తిన రాచపుండు ను ప్రాధమిక స్థాయిలో నిర్మూలించక పోతే, అదే కాన్సర్ అయి మనల్ని నిర్మూలిస్తుంది. . .  ఇక్కడ రాచపుండు అంటే అవగుణాలు , వికారాలు పైత్యాలు.


• మంచికి , మార్పుకి  పునాది  మన మనసు ,  మన చేతులు , మన చేతలే అవుతాయి  కానీ , మన చుట్టూ ఉన్న సమాజం కాదు . 

అంతర్ముఖం  ‌శుద్ధి గా  లేకపోతే  బాహ్య ముఖం అష్ట వంకరలతో  (వికారాల తో)  కనిపిస్తుంది . 




నిశితంగా గమనించాలి 🙏 . . .   
మనిషి చైతన్యం , వర్తమాన కాలంలో వాస్తవాల కోసమే  ఈ రచన. . .  అంతకు మించి ,  ఏ మనిషి ని  విమర్శించడానికి  , లోపాలను ఎత్తి చూపడానికి  కాదు .  ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపుడం వలన ఎవరికీ ఏ ప్రయోజనం ఉండదు. ఎవరిని వారే శుద్ది చేసుకోవాలి .


  ఓం శాంతి 

  ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 15 July 2026 11:30 AM 


Monday, July 13, 2026

766. ఆధ్యాత్మికత - పురోగతి

 

ఆధ్యాత్మికత - పురోగతి 



• భగవంతుని సాన్నిధ్యాన్ని ఒక్క క్షణమైనా నిజంగా అనుభవించ గలిగితే , అది మన జీవితంలో వెలుగును వెలిగించడానికి చాలు. దీపం వెలిగితే నీడ కూడా వెంట వస్తుంది. కానీ ఆ వెలుగు మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జీవితానికి కొత్త దిశను చూపుతుంది.


• ప్రతిసారి భగవంతుని గురించి ఆలోచించినప్పుడు, అది ఒక అద్భుతమైన దివ్య శక్తిని అనుభవించినట్లుగా అనిపిస్తుంది. భగవంతుడు ఉన్నాడా లేదా అనే వాదన కంటే, మన విశ్వాసమే ఆయనను లేదా ఆయన శక్తి ని మన హృదయంలో సజీవంగా నిలబెడుతుంది.


 మనలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే మనకు జీవించే ఉత్సాహాన్ని, ఆలోచించే సామర్థ్యాన్ని, కార్యాచరణను ప్రసాదిస్తుంది. ఆ శక్తిని మనలో నింపింది ఎవరు? ఆ పరమశక్తినే మనం భగవంతుడు అని పిలుస్తాం.

విభిన్న అభిప్రాయాలు ఉండటం సహజం. కానీ ద్వేషం ఈర్ష్య అసూయ మాత్రం ఎప్పటికీ ఎవరి పట్ల సమర్థనీయం కాదు.  “విజ్ఞానాన్ని ఎప్పుడూ మనస్సాక్షి  నడిపించాలి .” 


• చరిత్ర ఎల్లప్పుడూ భవిష్యత్తుకు పాఠాలు నేర్పుతుంది. ఆధునిక యుగంలో కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తూ పశ్చిమ దిక్కునే అస్తమిస్తాడు.  సత్యాలు ఎన్నటికీ మారవు . అవి సృష్టి నియమాలు. వాటిని గౌరవించడం , అనుసరించడం , ఆచరించడం   మన బాధ్యత.


• మన ప్రతి శ్వాస‌ , ప్రతి ఉచ్ఛ్వాసం, ప్రతి నిశ్వాసం ఒక పరమశక్తి దృష్టిలోనే జరుగుతుంది. ఆ శక్తిని మనం ఏ పేరుతో పిలిచినా పరవాలేదు. కానీ మన సమాజాన్ని నిర్మించి, ముందుకు నడిపించిన విలువలను, విశ్వాసాలను, సంప్రదాయాలను , మూలాలను  గౌరవించండి.


• అద్దం ముక్కలుగా పగిలిపోయినా, ప్రతి ముక్కలో మన ప్రతిబింబం కనిపిస్తుంది. తన స్వభావాన్ని అది కోల్పోదు. అలాగే మనం తెలిసో తెలియకో తప్పులు చేసినా, భగవంతుడు మనల్ని విడిచిపెట్టడు.

మన కర్తవ్యం , జ్ఞానంతో ఆయనను తెలుసుకోవడం, స్థిరమైన విశ్వాసంతో ఆయనను నమ్మడం, నిర్మలమైన హృదయంతో ఆయనను అంగీకరించడం.


• జీవన పురోగతి కి అవసరమైన వృత్తి ఉద్యోగం , కుటుంబ పోషణ వృద్ధి పై దృష్టి సారించడం ప్రతీ ఒక్కరి భాధ్యత . అదే విధంగా ఉన్న కొద్ది పాటి విలువైన జీవితాన్ని కుట్రలకు కుతంత్రాలకు కామ వికారాలకు వ్యర్థ విషయాలకు తావు ఇస్తూ  కాలయాపన చేస్తే . . . భవిష్యత్తులో మరింత దుర్భరమైన కాలం లోకి మానవ జీవిత ప్రయాణం ఉంటుంది. అది ఆర్తనాదాలు తో నిండి ఉంటుంది అని అనడం లో ఏ సందేహం లేదు.  

సత్యం పలకడం , సత్యం ఆచరించడం అనేది నరం లేని ప్రతి నరుడి నాలుక కి ప్రాధమిక అవసరం . 

• ఆద్యాత్మికత అంటే వృద్దాప్యం లోకి అడుగుడిన తరువాత లేదా అవయవాలు సహకరించక , శరీరం మూల చేరిన సమయం లో మాత్రమే మనిషి కి అవసరం అనుకునే పుంగవులు , తమ యొక్క పాపాల భారాన్ని ఒక అనంతమైన నిధి వలే తమ తలపై జన్మ జన్మల కోసం సమకూర్చుకుంటున్నారు అని అర్దం. 

మనలో సత్యత  చిగురించినపుడే  సత్ సాంగత్యం పొంద  గలము. సత్ సాంగత్యాలు మాత్రమే సన్మార్గం లో నడిపిస్తాయి.

ఓం శాంతి 

ఓం నమఃశివాయ 

ఆత్మ 

13 July 2026 , 11:30 PM.


Friday, July 3, 2026

765. జీవాత్మ సత్యం

 

జీవాత్మ సత్యం 



• ఏది నాది . . . ఏది నీది

  నాది  నాదనుకున్నదంతా  

  ఏమైందో  . . .  ఈనాడు .


• నాద నే   ధనము కై  

‌ రేయి పగలు   పరుగు లెట్టాను . 

• నావి   నావను కొని   

  వస్తు   వైభోగాల కై 

‌  వెంపర్లు  పడ్డాను . 


• ఏది నాది . . . ఏది నీది 

  నాది   నాదనుకున్నదంతా 

  ఏమైందో . . . ఈనాడు .

  

• దేహము  పై   ప్రీతి తో  

  పన్నీరు   స్నానాలు   చేసాను . 

• నా సొగసు   సౌందర్యానికి  

  తీరిక లేని   సేవ  లెన్నో చేసాను .


• బంధు    మిత్రులను 

  రాజభోగాల తో   సత్కరించాను .

• తరతరాలకు   తరగని 

  ఆస్తుపాస్తులెన్నో    కూడ  గట్టాను . 



• ఏది నాది . . . ఏది నీది 

  నాది    నాదనుకున్నదంతా 

  ఏమైందో . . . ఈనాడు .


• నను    నట్టింట   చాప లో 

  నేడు    చుట్టి   పెట్టారు.

  ఏమైంది  . . .  నాకు  .

• నా  అనుకున్న   వారంతా 

  నను   తాకటం  లేదు . 

  ఏమైంది  . . .  నాకు 


• ఎవరు నేను   . . ‌.  ఎవరు నేను 

  నను   నేను   మరిచి  తిరిగాను ఇన్నాళ్లు

   ఎందుకో .

• ఆలు   బిడ్డలే    శాశ్వతమని

  బంధు  మిత్రులే  ఆత్మీయులని 

  తండ్రి  పరమాత్మ  తో     బంధం  

  ఎరుగక    జీవించాను.

• ఆ   బంధం  కోసం   నేడు

  ఆరాట పడుతుంటే  

  దేహము  లేక   . . . దేహము లేక 

  దిక్కులు   చూస్తున్నాను .


• ఏది నాది . . . ఏది నీది 

  నాది   నాదనుకున్నదంతా 

  ఏమైందో . . . ఈనాడు .


శరీరము ఉన్న సమయంలో నే , ఈ సృష్టి  మూలానికి  తండ్రి  అయిన శివ పరమాత్మ తో   స్మృతి బంధం  కలిగి ఉంటే , శరీరం వదిలిన తరువాత ఆయన సన్నిధి చేరడం సాధ్యం అవుతుంది . 

ప్రాపంచిక , సంసార బంధాలలో ఉంటూ , తండ్రి శివుని తో బంధం కొనసాగించడమే  జీవుని కి కర్మ బంధ మోక్షం . 

దేహానికి మాయ ఆవహించి ఉండడం వలన భార్య భర్త పిల్లలు బంధువులు స్నేహితులు  తోడు గా ఉన్నట్టు అనిపిస్తారు అంతే కానీ వారెవరు శాశ్వతం కాదు. 

జీవునికి  శరీరం ఉన్నప్పుడు కంటికి కనిపించక , శరీరం లేనప్పుడు  ఆత్మ కి  కనిపిస్తూ  అన్ని వేళలా శాశ్వతం గా   తోడు  ఉండేది  శివుడు ఒక్కడే . 

అందుకే శివుని పూజించాలి , ప్రేమించాలి ,  ధ్యానించాలి .

 

ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

ఆత్మ   4 July 2026 10:00 AM.



Wednesday, July 1, 2026

764. స్వస్థితి - పరస్థితి

 

స్వస్థితి - పరస్థితి


• స్వ అంటే స్వయం , ఆత్మ , మనసు అని  అర్థాలు ఉన్నాయి . స్థితి అంటే ఉండవలసిన విధానం . 

  మన మనసు గాని , ఆత్మ గాని ఆచరిస్తూ ఉండవలసిన విధానమే మన స్వస్థితి .   

  పర స్థితి నుంచి వచ్చిన పదం పరిస్థితి . పరిస్థితి అనగా  మనది  కాని  స్థితి అదే  పర స్థితి . 


• మనం అనేక సార్లు అంటుంటాం . . . పరిస్థితి ల వలన అలా జరిగింది , ఇలా జరిగింది అని .  

  మనలో ఉన్న మన బుద్ధి మన యధార్థ  స్థితి ని తెలుసుకొని    స్వ స్థితి ని  కలిగి  ఉన్న నాడు, పరిస్థితులు (పర స్థితిలు) మనపై ప్రభావం చూపవు. అనగా మన చుట్టూ ఉండే పరిస్థితి లు మనల్ని లోబరుచుకో  లేవు . 


• అసలు  స్వ స్థితి లో  ఉండ వలసిన ఏడు గుణాలు ఏమిటి అంటే . . . శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం , జ్ఞానం (సత్యం), శక్తి , పవిత్రత . ఇవే మనల్ని దేని పైనా ఆధారపడకుండా జీవితాన్ని తీరం దాటించే సుగుణాలు . ఇవే  మన స్వస్థితి అనే వృక్షానికి బలమైన కొమ్మలు . 

  ఇవి మనలో బలహీనం అయినపుడు పరిస్థితి, పర స్థితి ల పై ఆధారపడటం , ఆ పర స్థితులకు  మనం లోబడి ఉండడం ,  వికారీ గుణాలకు దాసోహం కావడం , తద్వారా చెడు కర్మలు చేసి  దుఃఖం పొందడం వంటివి జరుగుతూ ఉంటాయి . 

గమనించాలి . . .  స్వ స్థితి  అనే మాట వినగానే  మనం  సహజంగా  అనుకునే  నేను  నాది  అనే అహంకార  సంస్కారం  కాదు . అదే విధంగా పర స్థితి అంటే  ఇతరులు , పరులు అని కూడా కాదు .  


• స్వ స్థితి లో ఉండ వలసిన గుణాలు కాకుండా మరే ఇతర ఏ గుణాలను అయినా మనం మనసు తో ఆహ్వానించి నా , వాటిని కలిగి ఉన్నా సరే పరిస్థితి లకు లొంగి  జీవించ వలసిందే . పర స్థితు లలో ఉండేవి అన్నీ మాయా గుణాలు .


• స్వ స్థితి వలన మనసు కి ఆత్మకు ప్రయోజనాలు ఏమిటి అంటే . . . 

 1. శాంతి  అనే గుణం ఉండడం వలన మనసు లో భావోద్వేగాల అలజడుల  ఊగిసలాట (Emotional  Unbalance) ఉండదు . 

 2. సుఖం అనే గుణం ఉండడం వలన మనసు ఏ సందర్భంలోనూ అలసట (Tired ) పొందక , ఉన్న దానిని  సద్వినియోగం చేసుకుంటూ , అందులో మాధుర్యాన్ని అనుభవిస్తూ . . . శరీరాన్ని  వ్యర్థ కోరికలు  వ్యామోహల  నుంచి దూరంగా ఉంచుతుంది.

3.  ప్రేమ  అనే గుణం వలన మనసు నిరంతరం రంజితం  అవుతూ , ఆ  ప్రేమ ను సృష్టి లో ఇతర జీవుల కు పంచడం జరుగుతుంది . ఈ గుణం లేక పోవడం వలన మనల్ని మనం ప్రేమించు కోలేక, అసలు ప్రేమ అంటే అర్దం తెలియక ,  ప్రేమ ను పరుల నుంచి ఆశించ వలసిన  పర స్థితి వస్తుంది . నేటి ప్రపంచంలో ఈ ప్రేమ కోసమే మనిషి పరితపిస్తూ ఉన్నాడు . అందు కోసం తన స్థితి ని దిగజారి ప్రవర్తిస్తూ ఉన్నాడు .

4. ఆనందం  కలిగి ఉండడం వలన మన చుట్టూ నిరంతరం ఒక సంతోషంతో కూడిన వలయం (ఆరా) ఏర్పడి ఉంటుంది . మనం ఒంటరిగా, ఏకాంతం గా ఉన్నా ఏ లోటూ ఉండదు సరికదా మన వలయం లోనికి వచ్చిన ఇతరులు కూడా ఆ ఆనందాన్ని అనుభవం పొందుతారు .


5. జ్ఞానం (సత్యం)  వలన వివేకం కలిగి , సూక్ష్మ దృష్టి పొంది  ఏ సమయంలో  ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే స్పష్టత తో ఉండడం జరుగుతుంది .  జ్ఞానం వలన సత్యం తెలుస్తుంది . మాయ నుంచి మనల్ని మనం ఎలా రక్షించు కోవాలో మన  మనో దృష్టి కి అర్ధం అవుతుంది.


6. శక్తి  వలన మనసు బలహీనత నొందక , ఉత్తేజం తో ఉండి  జీవితం లో మన చుట్టూ ఉండే ఎటువంటి పరిస్థితులనైనా , పర స్థితు లను అయినా సునాయాసంగా ఎదుర్కొవచ్చు . 


7. పవిత్రత  వలన బుద్ది ఆలోచనల లో శుద్ధి ఏర్పడి మనసు మంచి నిర్ణయాలు తీసుకొని, తద్వారా శరీరం తో  సత్ కర్మలు చేయడం జరుగుతుంది . 


• ఈ ఏడు గుణాలు , ఏడు లక్షణాలు మన ఆత్మ , మనసు , స్వయం మనము కలిగి ఉండడమే స్వ స్థితి. వీటిని అభ్యసించడమే రాజయోగం . జ్ఞాన ధ్యాన యోగాల అభ్యాసం నిరంతరం చేయడం వలన స్వ స్థితి సహజంగా వరిస్తుంది.

గమనిస్తే  . . . ఈ ఏడు గుణాలు   ఏడు తెల్లని అశ్వము లై  ,  మనసు ను  ఏడు కళ్లెము ల తో  స్వాధీన పరుచుకొని ,   దివ్యత్వం తీసుకు వచ్చి , జీవితం అనే  రధాన్ని  పూలబాట గా  చేసి మనిషి ని మహారాజు గా  నడిపిస్తాయి

  

  స్వ స్థితి తో  మన మనసు , ఆత్మ లేకపోతే పర స్థితులపై  ఆధారపడడం జరుగుతుంది. అదే దుఃఖానికి  , మాయ కి  ద్వారం అవుతుంది . 



ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 .

యడ్ల శ్రీనివాసరావు 1 July  2026 2:00 PM.

Monday, June 29, 2026

763 . 🌊గోదా . . . వరి🛶

 

🌊గోదా . . . వరి🛶


• గోదావరి . . . గోదా . . . వరి 

  గోదావరి . . . గోదా . ‌. . వరి 

• వరి ని     గోదాముల లో   నింపే    సిరి .

  గోదావరి . . . గోదా . . . వరి . 


• నిర్మల మైన    నీరూ పం   

  నిత్యం . . .

  నిశ్చలమై   నిలుస్తుంది   నా  లో . 

• జీవితానికి   తోడైన    నీవు . . . 

  నేనెవరో   అర్దమవని   నాడే  

  నను    అర్దాంగి గా  చేసుకున్నావు . . . 

  గోదావరి   గలగలల తో   తరించావు .


• గోదావరి . . . గోదా . . . వరి 

  గోదావరి . . . గోదా . . . వరి 

• వరి ని    గోదాముల లో    నింపే    సిరి .

  గోదావరి . . . గోదా . . . వరి .


• నాడు    నీ దరి   చేరిన    

  ఈ  బీడు  మనసు లో 

  అక్షరాల    సేద్యానికి  వరమై  

  గద్య   గోదాములు  నింపావు.

• నేడు  ప్రపంచమంతా  

  పాయలుగా   పాకి

  మనసు ల  దాహానికి 

  జీవం   పోస్తున్నావు  .


• పంచభూత మైన   నీకు 

  ఆ  ప్రాణ నాధుడే   చెప్పాడా  

  నను వరించమని .


• గోదావరి . . . గోదా . . . వరి 

  గోదావరి . . . గోదా . . . వరి 


• రాజ  రాజ    నరేంద్రుని   నగరం లో 

  నడి బొడ్డున   వెలసిన   తరంగిణి .

• నిను    కలవని   సాయంత్రం 

  నా మది   అలకదు   అక్షరములు .

• ఈ సరస్వతీ   రేవు లో    తొలి 

  పదములు  అందించి  అల్లించింది  

  నా  తల్లి   సరస్వతి .


• గోదావరి . . . గోదా . . . వరి 

  గోదావరి . . . గోదా . . . వరి 

• వరి ని   గోదాముల లో   నింపే  సిరి .

  గోదావరి . . . గోదా . . . వరి .


• నేను  లేకున్నా   . . .  నేను  లేకున్నా

  నా గుండె పరవళ్ళు   నీ తోనే   శాశ్వతం .

  నీ గలగలలే   ఈ పదగలలు .


• గోదా . . . వరి . . .  గలగలల గోదావరి

  గోదా . . . వరి . . .  గలగలల గోదావరి .


🌹🌹🌹🌹🌹🌹




ఇవి కేవలం జూన్ నెలలో రిపోర్ట్. 
ఇంకా అనేక దేశాల list Other 2.43K లో ఉన్నాయి.


బ్లాగు ఆరంభించి 2026  మే నెలకు  6 years  పూర్తి అయింది.  సుమారు గా ఒక సంవత్సరానికి  12,000 Views  వరకూ average గా  వచ్చేవి . 

కానీ , 2026 ఒక జూన్ నెలలో మాత్రమే అత్యధికం గా 11,000 Views బ్లాగు కి రావడం . మరియు Total  Views  87,000   cross చేయడం . . .

అదే విధంగా ఇదే నెలలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 130 దేశాల వరకు బ్లాగు Reach అవడం అనగా ఆయా దేశాల లో ని తెలుగు వారు బ్లాగు ని వీక్షించడం లో , ఆనందం అనే మాటకు తావు లేదు కానీ  చాలా  ఆశ్చర్యం గా అనిపిస్తుంది .  


ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల లో ఉన్న తెలుగు వారందరికీ , మనో వికాసం కోసం బ్లాగు లో  రచనలను చదువుతున్న వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏.


జ్యేష్ట  పౌర్ణమి  శుభాకాంక్షలు 💐 


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు . 30 June 2026 6:00 AM.


776. కర్మ ఫలం 2027 - 37

  కర్మ ఫలం  2027 - 2037  ప్రపంచ కాల స్వరూపం • పాల కడలి పై   పవళించె డి   ప్రభు    రక్ష   నీ య వా  . . . • దుఃఖ  అలల పై  నిలిచి న   మా పై   ...