Friday, September 30, 2022

249. పరిణయం

 

పరిణయం



• పరిణయం పరిణయం

  ప్రణయము కై  పరితపించెను  నా పరిణయం

• మధువనం మధువనం

  మధుమాసం లో వికసించెను నా  మధువనం


• పరిణయా న  పరిమళం  పరిణితి చెందిన వేళ

  వికసించి న మనసు కి  వసంతాలు నిండెను.


• వల్లీ   రాగవల్లి   అనురాగవల్లీ

  నా హృదయానికి అల్లుకున్న   ఓ తీగమల్లీ


• పరిణయం   పరిణయం

  ప్రణయము కై   పరితపించెను  నా పరిణయం

• మధువనం  మధువనం

  మధుమాసం లో విరపూసెను  నా  మధువనం


• మధుపర్కాల మిలమిల లో 

  నా మనువు ఎంతో మాధుర్యం.

• తలంబ్రాల జల్లుల లో 

   నా తనువు ఎంతో తమకం.


• సుఖదుఃఖాలు పసుపు కుంకుమలు గా

  ముసిముసి నవ్వులు మేళతాళాలు గా

• అగ్ని సాక్షి తో మొదలైయ్యింది

  నా నవజీవనవేదం … నా తొలి పొడుపు రాగం.


• పరిణయం  పరిణయం

  ప్రణయము కై  పరితపించెను నా  పరిణయం

• మధువనం మధువనం

  మధుమాసం లో విరపూసెను నా మధువనం

 

• ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ

  జీవనం ఏడడుగుల బంధం

• కుశలమెరగని  కలియుగంలో

   పరిణయం ఒక ఎడారి బంధం.


• భావం :

  పెళ్లి అనేది ప్రేమ కోసం పరితపిస్తుంది.


  పెళ్లి తో వసంత ఋతువు లో 

  వికసించే పువ్వుల వలె తేనేలొలికింది మనసు.


  పెళ్లి అనే అనుభూతి సుగంధం లా 

  సంపూర్ణం మైతే మనసు వికసించి 

  వయసు నిండుతుంది.


  రాగాల, అనురాగాల తీగ వంటి దాన 

  ఎదలో పెనవేసుకున్న మల్లి తీగ దాన


  పెళ్లి వస్త్రాల మెరుపు లలో 

  పెళ్లి చాలా మధురం గా ఉంది


  తలంబ్రాలు జల్లులవుతుంటే 

  శరీరం చాలా ఉత్కంఠ గా ఉంది.


  కష్టం సుఖం పసుపు కుంకుమ లు వలె


  ముసి ముసి నవ్వులు మంగళ వాయిద్యాలు గా


  అగ్ని సాక్షి తో మొదలైయ్యింది 

  కొత్త జీవితం అదే జీవితానికి ఉదయ రాగం.


  ధర్మం తో జీవిస్తూ అర్దం (ధనం) తో కోరికలు

  సుఖాలు తీర్చుకుంటేనే మోక్షం ఇచ్చేది 

  ఏడడుగుల బంధం.


  కాని కుశలం క్షేమం ఎరుగని నేటి 

  కలియుగంలో పెళ్లి ఒక ఎడారి 

  బంధం గా అయిపోతుంది.


ఇదంతా ఒక విధంగా మనుషుల స్వీయ, స్వయం ప్రభావం అనే కంటే కూడా కాలగమనంలో  జరగాల్సిన జరుగుతున్న మార్పులు. లోక కల్యాణం భగవంతుడు తిరిగి చెయ్యాలంటే  కలిపురుషుడు ప్రభావం వలన భూమి మీద ప్రతీ అంశం లో సకల జీవ రాశులు, మనుషులు విఫలమై ,  సంధికాలంలో  సర్వకాల సర్వావ్యస్థలు  నాశనం అవుతూ ఉంటాయి. 


• కలియుగంలో ధర్మం నడిచేది ఒక పాదం మీద. అన్నీ యాంత్రికం , ఒకరిని మరొకరు అర్దం చేసుకోవడం అరుదు అయిపోతుంది, భౌతిక సుఖాల జీవనం, మనుషులు మనసులు కంటే వస్తువులను ప్రేమించే తత్వం, ఒకరు కోసం మరొకరు సమయం కేటాయించలేనంత హడావిడి జీవితాలు, సంపాదన కోసం పడే ఆరాటం , ఇలా ఎన్నో అంశాలలో ప్రతీ మనిషి ఏదొక విధంగా తనని తాను కోల్పోతున్నాడు. చివరికి ఇదంతా సహజం అనుకునే స్థితి లో జీవితాలు గడుస్తున్నాయి. వెను తిరిగి చూస్తే పూరించలేని శూన్యం.

• మనుషుల కు వివాహం చేసుకున్న సమయం లో ఉన్న శ్రద్ధ, ప్రేమాభిమానాలు అనంతరం కాలక్రమేణా ఉంటున్నాయా, లేదా , లేకపోతే ఎందుకు అనే ప్రశ్నలు వేసుకుంటే సమాధానం దొరుకుతుంది. దొరికిన కొందరికి కాలాతీతం అయిపోతుంది.

• ఏదైనా అర్దం చేసుకుంటే ఆనందం  ఉంటుంది. కాని అర్దం అంటే ఏకత్వం తో కాదు బహుతత్వం తో ఉంటేనే సమతుల్యం ఉంటుంది.


యడ్ల శ్రీనివాసరావు 30 Sep 2022 6:00 PM.





248. మనిషి దుర్గంధం మాట

 

మనిషి దుర్గంధం మాట



• దుర్గంధం ఈ పదం పలకాలంటేనే  మనిషి కి ఏదో ఒక రోత. ఎందుకంటే ఆ పదం ఏ చోట నిలబడి పలికినా మనసు ద్వారా కంటికి కనిపించేది, అనిపించేది మురికి, మురికి వాసన, మలినం , చెడు, వ్యర్థం తో నిండిన చెత్త.


• చెత్త, దుర్గంధం అనేది వింటుంటే నే , ఏ మనిషి కైనా ఒక  అసహ్యం, కంపనం పుడుతుంది. అవునన్నా కాదన్నా ఇది నిజం. అసలు ఈ దుర్గంధం (చెడు వాసన) అనేది పాడైన వస్తువుల వలన,  కాయగూరల వ్యర్థాలు, తినుబండారాలు వంటివి రోజుల తరబడి నిల్వ ఉంచుకోవడం వలన  కుళ్లిపోయి  దుర్గంధం పుడుతుంది.  ఇటువంటి చెత్తను ఎవరు కూడా ఇంటి ఆవరణలో ఉంచుకోము,  ఎందుకంటే అనారోగ్యం పాలు అవుతాం అనే భయం , ఇంకా అందులో భయంకరమైన వైరస్ లు ఉంటాయి ,  ఆ వాసన కూడా భరించలేము. ఇదంతా మనకు పుస్తకాలు, నిత్యం  అనుభవాల నుంచి తెలుసుకున్న విజ్ఞానం.


• అంటే ఆరు బయట  ఉన్న చెత్త, వ్యర్థం చాలా హని చేస్తుందని తెలిసి  దూరం గా ఎక్కడో విడిచి పెట్టె స్తున్నాము. చెత్త విసిరేసాక కనీసం దాని వైపు చూడను కూడా చూడం. ఎందుకంటే అసహ్యం, వాసన భరించలేం కాబట్టి.


• ఇక అసలు విషయానికి వస్తే….


• మరి మనిషి అంతరంగం లో అంతర్గతంగా పుట్టుక నుంచి పేరుకుపోయిన చెత్త అయిన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈర్ష్య , ద్వేషం, పగ, అహంకారం అనేక సంవత్సరాల తరబడి శరీరం, మెదడు అనే containers లో నిక్షిప్తం చేస్తూనే  ఉన్నాడు , మరి అటువంటప్పుడు ఇంకెంత దుర్గంధం మనిషి లోపలి నుంచి నిత్యం వెలువడుతుందో ఆలోచించామా , ఆలోచిస్తున్నామా. అది మనిషి శరీరానికే కాదు బంధాల లో చుట్టూ ఉన్న సాటి వారి ఆరోగ్యానికి ఇంకెంత హానికరమో ఒకసారి ఆలోచించిస్తున్నామా.


• ఇంటి లోపల, ఇంటి చుట్టూ ఉన్న బహిరంగ మైన చెత్త వ్యర్థాలను తొలగించుకొని శుభ్రం గా ఉంచుకోవాలి అనే తెలివి తేటలు,   విజ్ఞానం తెలిసిన మనిషి కి , తన లోపల అనాది గా ఉన్న చెత్త గుణాల దుర్గంధాన్ని ఎందుకు మోస్తుంటాడు, ఎందుకు గుర్తించడు, ఎందుకు శుభ్రం చేసుకోలేడు….మరి ఎంతో విజ్ఞానం కలిగి ఉన్న మనిషి కి జ్ఞానం ఉన్నట్లా? లేక అజ్ఞానం ఉన్నట్లా?


• ఈ వికారి దుర్గుణాలే తన క్షోభ కి, దుఃఖానికి జన్మ జన్మలు గా కారణం అవుతూ తనలో దుర్గంధం పేరుకుపోతుంది అనే విషయం  తెలుసుకోలేక తన తోటి వారి పై ఎందుకు నిందలు, అభాండాలు వేస్తుంటాడు ?


• బాహ్య ప్రపంచంలో పేరుకుపోయిన చెత్త అంతా కలిసి చెడు వాసన రూపం లో బయటకు వ్వాపిస్తుంటే, మనిషి అంతర్గతం లో పేరుకుపోయిన వికారాల చెడు  “మాట”, “చూపు”, “ఆలోచనల” రూపం లో బయటకు వస్తుంది. 

ఇవి ఎలా ఉంటాయి అంటే   వంకర బుద్ది తో  చూసే చూపులు,  వికారం తో కూడిన ఆలోచనలు,  ద్వదర్థం తో కూడిన మాటలు.  వీటిలో అత్యంత ప్రమాదకరం ఆలోచనలు, మాటలు.


• మాట, శబ్దం  చాలా శక్తివంతమైనవి.  చరిత్ర లో మహాభారతం, రామాయణ యుద్ధాలు కేవలం ఒక మాటతో నే మొదలైనాయి. కొందరికి మనసు లో నిండిన  మలినం  మాట రూపం లో బయటకు పలుకుతూ చుట్టూ ఉన్న వారిని బాధ పెడుతూ వాతావరణం కలుషితం చేస్తుంటారు. మానసిక ఆనందం పొందుతూ ఉంటారు.  

ఇది చాలా బాధాకరమే  కాని ఈ స్థితి తాత్కాలికం.  

మనిషి నోరు  మంచి మాటలు  పలకక పోయినా నష్టం  లేదు. కానీ చెడు మాట్లాడితేనే ప్రమాదకరం. 

మనిషి కి  అనాదిగా తనలో పేరుకు పోయిన వికారి గుణాలను, లక్షణాలను, తుచ్ఛమైన కామంతో నిండిన ఆలోచనలను అణగార్చు కోలేక, తన ఆలోచనలను  సాటి  మనుషులకు ఆపాదిస్తూ ఆనందం పొందుతూ, అందరూ తమలాంటి వారే అని  పైశాచిక   సంతృప్తి తో  ఉంటారు కొందరు.  ఇది ఎంత ఘోరమైన వికర్మో వారికి తెలియదు.


• మనిషి తాను తినే ఆహారం శుభ్రం గా , ఏరి కోరి, శుద్ధి చేసుకొని నోటితో ఆహారం తింటూ మంచి శక్తి పొందుతూ ఉంటాడు. అంటే తినే నోరు కి రుచికరమైన, శుభ్రమైన మంచి ఆహారం కావాలి.  కాని అదే నోరును మంచి  మాట్లాడానికి,  సంతోషం పంచడానికి లేదా దుుఃఖం పంచకుండా ఉంచడానికి ఎంత వరకు ఉపయోగిస్తున్నాడు అంటే వెనక్కి తిరిగి ఆలోచించుకోవలసిందే.

నోటికి స్వార్థం,  దురద ఉంటే ఏనాటికైనా నష్టం జరిగేది శరీరానికే. 

మరి కొందరు సునాయాసంగా అబద్దాలాడడం, మాట అవలీలగా మార్చే నేర్పరితనం తో  ఊసరవెల్లి చందాన తీరును మారుస్తూ ఆనందం పొందుతూ ఉంటారు.  ఇటువంటి  తీరు ఎంత దుష్కర్మో  వారికి  తెలియదు.  

కొందరు తన బాధలను , వ్యక్తి గత సమస్యలను నమ్మకమైన వారికి చెపితే,  విన్నవారు ఆ విషయాలను  మరొకరి దగ్గర ప్రస్తావించడం  కొంత మంది లో చూస్తుంటాం. ఈ విషయం లో మొదట బాధలు చెప్పుకున్న వారి కర్మను రెండవ వారు తప్పక అనుభవించ వలసి ఉంటుంది.  

ఇవన్నీ నోటి తో జరిగే క్రియలు కాబట్టి  " ఆ ఏముంది లే" అని సునాయాసంగా తీసుకుంటారు. కాని అవే తిరిగి తిరిగి  పాపపు కర్మలు గా చుట్టుకుంటాయి.

ఎందుకంటే కలియుగంలో  ఎక్కువ శాతం  మనిషి పాపం చేసేది నోటి తోనే అని గరుడ పురాణములో కూడా చెప్పబడింది.

కొందరు మంచి భోదలు చేస్తుంటారు. కానీ ఆచరించరు.  ఇది ఒక నటనతో కూడిన విధానం. ఇటువంటి వారికి మనస్సాక్షి వేసే శిక్ష వర్ణించలేం. మనిషి నిజాయితీగా ఎప్పుడైతే ఆత్మవిమర్శ చేసుకోగలుగుతాడో  తనను తాను మార్చుకోగలుగుతాడు , దీనికి కావలసింది ఒకటే అంగీకరించే తత్వం. 


• ఏ మనిషి అయినా తన మనసు లో ఉన్న మాట ను స్పష్టం గా,  ధైర్యం గా, ఉన్నది ఉన్నట్లుగా చెపితే, తన వ్యక్తిత్వం  సంస్కరింప బడుతుంది.  ఎందుకంటే ధైర్యంగా బయటకు చెప్పే మాటకి , తప్పును సరిచేసుకునే ఉన్నతమైన లక్షణం కలిగి ఉంటుంది. తప్పు మాట్లాడటం, తప్పులు చేయడం తప్పు కాదు.  కాని వాటిని సరిదిద్దుకునే అవకాశం వచ్చినా కూడా ఆ తప్పుల  ఊబి లో నే  జీవితాంతం గడిపెయ్యడం ఒక దౌర్భాగ్యం, అవివేకం.  ఇదే మనిషి కి అతి పెద్ద ముప్పు.


• ఒక నోటి నుండి వచ్చే మంచి మాట ఎందరికో ఆదర్శం, శక్తి, భరోసా, ధైర్యం ఇవ్వగలదు. ప్రాణాలను సైతం కాపాడగలదు. ఉదాహరణకు ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారితో ఒక పూట మంచిగా మాట్లాడితే తెలుస్తుంది, ఆ స్థితి నుంచి వారు ఎలా బయటపడతారో.  ఒక మంచి మాటకి  మానసిక రోగాలను, భయాలను నయం (healing) చేయగలిగే గొప్ప శక్తి కలిగి ఉంటుంది. 


• నోటి నుండి దుర్గంధం తో కూడిన మాటలు రాకుండా ఉండాలంటే  శారీరక, మనో వికారాలకి బానిస గా కాకూడదు. ఒక మనిషి  తన లో లో  పేరుకుపోయిన చెత్తను గుర్తించి తొలగిస్తే నే, తనతో ముడిపడి న మనుషులు ఎటువంటి  వారు  అనే  స్పష్టత వస్తుంది. లేదంటే  తనలాగే అందరూ వికారులు గా కనిపిస్తారు.

మనసు లో వ్యర్థం, మలినం తొలగినపుడే  పరమాత్మ కు చేరువ అవుతూ  మనిషి   జ్యోతి లా స్వయం ప్రకాశం అవుతాడు.


• మనుషులలో ఎవరి కర్మలు వారివి. కర్మానుసారంగా ఎవరి జీవితాలు వారికి గడుస్తుంటాయి. అంతే కాని ఒకరి వికారాలను  మరొకరి కి ఎప్పుడూ ఆపాదించకూడదు.


• మనిషి కి   తన మనసు పై  నియంత్రణ   కలిగినపుడు  ఎటువంటి నెగెటివ్ శక్తి తన దరి   చేరదు. చేరలేదు.


• మంచి ఆలోచనలు  మంచి మాటలై,  చాలా శక్తివంతంగా  ఈ విశ్వం లో సుదూర ప్రయాణం చేస్తూ మనిషి కి సక్రమమైన దారి, గమ్యము చూపిస్తాయి.


ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 30 Sep 2022 1:00 pm.





Monday, September 26, 2022

247. శివ చైతన్యం

 

శివ చైతన్యం


• దయగల నా  శివ దరిచేరి వచ్చాను

  దయచేసి దయచూపు నా దారి గమ్యము న


• నిను తాకిన తమకమున

  అణగారిన బుద్ధి వికసించేను


• నా లోని *చపలము విఫలము చేసి

  సకలము స్థితము చేయు తండ్రి


• మన బంధం మేమిటో తెలిసింది

  అనుబంధం కోసం వచ్చాను తండ్రి.


• అడుగు దూరాన అడుగడి అడుగుతున్నాను

  నీ అడుగు లో మడుగవుతాను


• దయగల నా శివ దరిచేరి వచ్చాను

  దయచేసి దయచూపు నా దారి గమ్యము న


• నడయాడే నా తల్లి పార్వతి

  నగుమోము చూడగ

• నా తల్లి ఒడిలో న   నిదురించేందుకు

  ఇంకెన్ని జన్మలు ఎదురు చూసేది


• నవమాసాలు మోయలేదు కానీ

  *నైమిషం లో ని  నన్ను  *నవనీతం చేయు తల్లీ


• ఆలనా లాలన పాలన కై

  నీ కేమి సేవ చేయగలను


• ప్రకృతి లో ప్రకాశించే పరవశం నీవు

  వికృతులను హరియించే విశాలాక్షి నీవు


• మల్లన్నను మురిపించే మలయవాసిని  వి నీవు

  మురిపాలు కురిపించే కమలాక్షి  వి  నీవు


• నేనేమి దూరం నేనేమి భారం


• కనులకు కానరాని మీరు

  మనసున కొలువై ఉన్నారు


• దయగల నా శివ దరిచేరి వచ్చాను

  దయచేసి దయచూపు నా దారి గమ్యము న



చపలము = నిలకడ ,  స్థిరత్వం  లేని బుద్ది

నైమిష  = దండకారణ్యం , అజ్ఞానం, చీకటి

నవనీతం = చిలికిన వెన్న.


యడ్ల శ్రీనివాసరావు. 27 sep 2022 8:30 am.






Saturday, September 24, 2022

246. నా పల్లె

 

నా పల్లె



• తొలి కోడి కూసింది

  తొలి పొద్దు లేపింది

• చలిగాలి వీస్తుంది

  మనసేమో చూస్తుంది.

• తెలవారే ఈ సమయం 

  మంచు తెరలతో  కమ్మింది.


• గువ్వపిట్ట అరిచింది

  గూడు దాటి వచ్చింది

• జాబిల్లి   వెళుతుంది

  జనస్రవంతి లేస్తుంది.

• తెలవారే ఈ సమయం   

  మసక  మత్తు  విడిచింది.


• నదిలోన నీరంతా

  సూర్యుని తో   మిలమిల.

• మదిలోన తలపంతా

  తేజము తో    తళతళ .


• భానుడి తో  ఉదయం 

  సంబంరం   చేస్తుంటే

• ప్రకృతి లో   నా మనసు 

  అంబరం  చూస్తుంది.


• కోయిలమ్మ రాగాలకు   

  కోనసీమ  పలుకుతుంటే

• ఎగిరేటి కొంగలు     

  ఆగి ఆగి  చూస్తున్నాయి

• ఊగేటి పువ్వులు   

  తొంగి తొంగి  వింటున్నాయి

• పంట పైరులు  పరవశమై  

   సరిగమలై  వీస్తున్నాయి.


• తొలి కోడి కూసింది

  తొలి పొద్దు లేపింది

• చలిగాలి వీస్తుంది

  మనసేమో చూస్తుంది.

• సన్నాయి మోగింది

  గంగిరెద్దు ఆడింది

• గుడి గంటలు మోగాయి

  గణనాధుడు చూశాడు


• పల్లెలోని పశువులన్నీ 

  పచ్చికలో విహరిస్తుంటే

• పిల్లగాడి ఆలోచనలు 

  పల్లకిలో ఊగుతున్నాయి


• నడినెత్తిన భానుడి తో 

  పల్లె నడవలేక నీరసిస్తుంటే

• మనసున్న వృక్షాలు 

  వంగి వంగి  సేద నిస్తున్నాయి.



• తొలి కోడి కూసింది

  తొలి పొద్దు లేపింది

• చలిగాలి వీస్తుంది

  మనసేమో చూస్తుంది.


• సాదరమైన ఈ సంధ్య 

  సుస్వాగతం చెపుతుంది.

• బడి పిల్లలు ఈలల తో 

  ఇంటి పయనమయ్యారు.


• నిశి రాతిరి వచ్చింది

  చీకటి ని తెచ్చింది

• జాబిల్లి వచ్చింది

  వెన్నెల తో నింపింది.


• నా పల్లెకు సాక్ష్యం ఈ ప్రకృతి

  నా జీవానికి ఊపిరి ఈ పల్లె



యడ్ల శ్రీనివాసరావు 24 sep 2022 1:30 PM










Thursday, September 22, 2022

245. తెలుసుకో…. ఇంకా ఎంత కాలం…. ఇలా

 

తెలుసుకో…. ఇంకా ఎంత కాలం…. ఇలా



• ఒక మనిషికి ఒక జన్మలో జననం, వివాహం, మరణం, ఈ మూడింటి తోనే జీవిత చక్రం వివిధ దశలుగా నడుస్తుంది. ఆత్మ గర్భం లోకి ప్రవేశించిన తరువాత 3 వ నెల వరకు తన పూర్వ జన్మ జ్ఞాపకాలతో ఉంటుంది. ఆ తరువాత కొంతమంది కి పూర్తిగా, మరికొందరికి 90 శాతం గత జన్మ జ్ఞాపకాలు తొలగిపోతాయి. కానీ ఏదైనా,  ఒక ఆత్మ జననం తీసుకునే ముందే  అంతా నిర్ణయించుకొని శరీరం ఎంచుకొని,  గర్భం లో ఉన్న పిండంలోకి ప్రవేశిస్తుంది. ఇది అంతా గత జన్మలలో చేసిన కర్మలను అనుసరించి జరుగుతుంది.


• ఇక ఆత్మ ఒకసారి  జననం తీసుకుని గర్భం విడిచి శరీరం తో భౌతిక ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత మనిషి జీవితం మొదలవుతుంది. మనిషి తాను ఒక ఆత్మ అని మర్చిపోయి , తాను ఒక శరీరం, అదే సర్వం అనుకొని జీవించడం తో నే జీవన చక్రం ప్రారంభమవుతుంది. ఇది మాయ యెక్క ప్రభావం. ఈ భౌతిక ప్రపంచంలో మనిషి శరీరానికి కావలసిన కోరికలు, ధనం, మోహం, సుఖాలు, కామం ఒకటేమిటి అన్నీ కలి మాయ ప్రభావం తోనే జీవితం మొదలవుతుంది. ఎందుకంటే మనిషికి కనిపించేది స్థూల స్థితి (శరీరం ఆకారం). కానీ దాని వెనుక తన స్థితి గతులను సర్వం నడిపిస్తున్న సూక్ష్మ స్థితి (ఆత్మ) కంటికి కనిపించదు…. ఎందుకంటే భృకుటీ స్థానం లో ఉన్న మూడవ నేత్రం (పినియల్ గ్రాండ్ మెదడు కి అనుసంధానించి ఉంటుంది) తల్లలి గర్భంంలో ఉన్న  మూడవ నెలలో నే మూసుకు పోతుంది.


• ఇక అసలు విషయానికి వస్తే…..

• మనిషి పుట్టుక నుంచి ఆనందం గా ఉండాలని, అనుకున్నది సాధించాలని, ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని, విపరీతమైన ధనం సంపాదించాలని, భోగభాగ్యాలు అనుభవించాలని, కోరికలు సఫలం కావాలని శతవిధాలా ప్రయత్నం చేస్తుంటాడు. ఇదే ఏ మనిషి అయినా ఆలోచించేది.


• అందుకు జీవితం లో అనేక జీవన దారులు ఎన్నుకుంటారు. మంచి చదువు, ఉద్యోగం, వ్యాపారం అని ధర్మబద్ధంగా కొందరు చేస్తే మరికొందరు దొంగతనాలు, మోసం , అక్రమాలు వంటివి చేస్తుంటారు. అంటే ఇక్కడ కర్మ , సకర్మ వికర్మ అని రెండు గా విభజించబడుతుంది.


• ఇదంతా ఎందుకు అంటే తన కంటితో చూస్తున్న మనసు కి అనిపించిన సంతోషాలను సాధించు కోవడం అని లేదా జన్మించాము బ్రతకాలి , అవసరం కాబట్టి ఇలా చెయ్యాలి అని అనిపిస్తుంది.


• పుట్టుక నుంచి ఒక యుక్త వయసు వచ్చేంతవరకు కూడా తాను జన్మతీసుకున్న తల్లి తండ్రులు, కుటుంబ లోని వ్యక్తులు, బంధువులు, రక్తసంబంధాలు, గురువులు, వంటి వారి ప్రమేయం తో నడుస్తుంది…ఇదంతా ఒక దశ. ఈ దశలో తన చుట్టూ ఎంతమంది ఉన్నా ఒక స్వతంత్ర ఆలోచన విధానాలతో తన మనసు లోని ఆలోచనలకు బలమైన పునాది వేసుకుని తనదైన భవిష్యత్తు ని నిర్మించుకోవాలి అని కలలు కంటాడు. ఆ క్రమంలో నే మంచి ఉద్యోగం, సంపాదన, అందమైన ఇల్లు, అందమైన భార్య, గుణవంతుడైన భర్త, ఇలాంటి కనీస కోరికలు సహజం. ఇదంతా ఎందుకు అంటే సంతోషం, ఆనందం కోసం. కానీ  చాలా మంది కి ఇదంతా తెలియకుండానే గడిచిపోతుంది.

• ఇక రెండవ దశ…. ఇది ఒక రకంగా జీవిత చక్రం లో చాలా ముఖ్యమైనది. అదే వివాహం. మనిషి అప్పటి వరకూ ఉన్న ఒక దశను వదిలి రెండవ దశ లో అడుగు పెడతాడు. వివాహం అయిన తరువాత ప్రతీ ఒక్కరి జీవితంలో ఊహించలేని విపరీతమైన మార్పులు సంభవిస్తాయి. అవి ఉత్తమము లేక అల్పము కావచ్చు. ఇక్కడ ఒక మనిషి కి మరో మనిషి జత అయినపుడు జీవన విధానం లో , ఆలోచనలలో, మానసిక శక్తి లో పెను మార్పులు సంభవిస్తాయి. ఎందుకంటే ఒకరి ప్రభావం మరొకరి పై ఉంటుంది. మనిషి కి తన జీవిత కాల చక్రం లో ఎక్కువ సంవత్సరాలు ఈ దశలోనే జరుగుతుంది. అందుకే దీనిని సంసార సాగరం అంటారు. ఇందులో కూడా ప్రతీ మనిషి సంతోషం, ఆనందం కోసమే పరితపిస్తూ ఉంటాడు.


• ఇప్పుడు రెండు దశలు అంటే జననం, వివాహం ఈ రెండింటి లో మనిషి అన్ని వేళలా, అన్ని విషయాల తాను అనుకున్న ప్రతీది సంపాదించుకొని సంతోషంగా ఉన్నాడా? ….లేక రాజీపడి పోయాడా?...లేక తాను అనుకున్నది ఏదీ సాధించలేక దుఃఖం తో ఉన్నాడా? ….


• ఈ మూడు ప్రశ్నలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అది ఏంటంటే మనిషి ఎంత సంపాదించినా సంపాదించక పోయినా, ఎన్ని కోరికలు తీర్చుకున్నా, తీర్చుకోక పోయినా, ఎన్ని భోగం భాగ్యాలు అనుభవించినా అనుభవించ లేక పోయినా……మనశాంతి, ప్రశాంతత మాత్రం దొరకక నిరంతరం ఏదొక సమయం లో ఎంతో కొంత దుఃఖం అనుభవిస్తూనే ఉంటాడు. ఇది నిజమా కాదా అని కళ్లు మూసుకుని మనసు ను అడిగితే సమాధానం చెపుతుంది. కొందరు విజ్ఞత తో ఈ స్థితి ని జయిస్తారు. మరికొందరు దుఃఖిస్తారు.


• అంటే మనిషి తాను జన్మించినా, వివాహం చేసుకున్నా , సంపాదించినా నిరంతరం జీవన పోరాటం చేస్తున్నా , భవనాలు కట్టుకున్నా , శరీరం పై మమకారం పెంచుకున్నా, కుటుంబం, బాధ్యతలు, ఇలాంటివి అన్నీ కూడా ఒక డ్రామా, ఇది ఏదీ శాశ్వతం కాదు అని మరణం సంభవించే వరకు తెలుసు కోలేడు. ఎందుకంటే మాయ తెలియనివ్వదు.


• అదే విధంగా ముఖ్యమైనది మూడవ దశ మరణం. మనిషి కి మరణం గురించి ఆలోచిస్తే భయం, ఎందుకంటే శరీరం పై మమకారం అటువంటిది. మరణం తధ్యం అని తెలుసు కానీ దానిని అంగీకరించలేడు. మరణం ప్రతీ ఒక్కరికీ సహజం , తప్పదు అనుకున్నప్పుడు మనసు లో ఎందుకు భయపడాలి. ఈ నిజాన్ని మనసు ఎందుకు అంగీకరించక పోవాలి. దీనినే వ్యామోహం, అజ్ఞానం అంటారు….

• జన్మించిన తరువాత మంచి జీవితం కావాలని ప్రయత్నం చేస్తుంటారు, కష్టపడతారు…. మంచి వివాహం , భోగాలు, సుఖాలు కావాలని పరితపిస్తూ ఉంటారు….

అంటే తనకు కావలసిన అశాశ్వతమైన ప్రతీ దాని కోసం ముందుగా ప్రణాళికలు వేసుకొని కూడా పెట్టుకుంటున్నాడు. మరి మంచి ప్రశాంతమైన , గౌరవమైన, సంతోషకరమైన , శాంతివదనం తో కూడిన మరణం గురించి మనిషి ఏం చేస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు.


• చివరి దశలలో ఎంతో మందిని మన కుటుంబంలో, దగ్గర వారిలో తరచూ చూస్తుంటాం దుర్భరమైన , బాథలతో కూడిన మరణాలు. వాళ్లు అంటుంటారు “ శత్రువు కి కూడా ఈ స్థితి రాకూడదు అని” . మరి ఇది నిజం అని కళ్లముందు చూసినా తెలిసినా ఎందుకు మనం మేలు కోం.


• మరణం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తేనే జననం, జీవితం, జీవనం యెక్క విలువ పరమార్థం, ఉన్నతి తెలుస్తుంది. ఎందుకంటే శరీరం శాశ్వతం కాదు. ఆత్మ వినాశి, నాశనం లేనిది. ఆత్మ పరిశుభ్రం అయి , తన శక్తి ని పూర్తిగా పుంజుకున్నప్పడే తిరిగి పరమాత్మ సన్నిధి కి తిరిగి వెళుతుంది. అంతవరకు ఆత్మ శరీరాలను వెతుక్కుంటూ ఉంటూనే ఉంటుంది.


• ఆత్మ పరిశుభ్రం కావాలి, శక్తి వంతం కావాలి అంటే పరమాత్మ అయిన శివుని ధ్యానం చెయ్యాలి. తద్వారా చేసిన పాపకర్మల నుంచి విముక్తి లభిస్తుంది.

• ఒక శరీరానికి జనన మరణ చక్రం లోంచి బయట పడే సమయం వస్తేనే, తానొక ఆత్మ అని తెలుసుకుంటుంది. అదే ఆత్మజ్ఞానం.


• అలాగే గత జన్మలలో మిగిలిపోయిన కర్మలను, బుణాలను తీర్చుకుంటుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఏదీ తనకు శాశ్వతం కాదు తనతో ఏమీ ఎక్కడికి తీసుకెళ్ళలేను అనేది తెలుస్తుంది.


• మంచి మరణం రావాలంటే పరమాత్మ అయిన శివుని ప్రార్థించాలి. ఎవరిని మాటలతో, చేతలతో దుఃఖ పెట్టకూడదు. శాంతవంతమైన ఒక మంచి మరణం తిరిగి అత్యుత్తమమైన జన్మ ఇస్తుంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే చివరి దశలలో క్షోభ, దుఃఖం తో మరణిస్తే తిరిగి వాటి తోనే జననం తీసుకోవాల్సి వస్తుంది. ఇది పరమాత్మ చెప్పిన సత్యం.


• అన్నింటి ని ప్రేమించినట్లే మరణాన్ని కూడా ప్రేమించండి. నిజాన్ని అంగీకరించండి.


• ఇదంతా అర్దం కావాలి అంటే కాసేపు నేను బ్రతికి లేను చనిపోయి ఉన్నాను అని అనుకుంటే…. ఇందులో నిజం అర్దం అవుతుంది.


• అహంకారం విడిచినపుడే నీ ఆత్మ నీకు దర్శనం ఇస్తుంది…. అదే పరమాత్మ వైపు దారి చూపిస్తుంది….. ఎందుకంటే సత్యయుగం లో ఒకప్పుడు ఈ ఆత్మలన్ని పరమాత్మ సన్నిధి లో శాంతియుతంగా ఉండేవి. యుగ యుగాలు మారే కొద్దీ ఆత్మకు వికారాలు అంటి , పరమాత్మ సన్నిధిని విడిచి భూలోకం వచ్చాయి. ఆత్మ యొక్క స్వస్ధలం పరమాత్మ సన్నిధి.


• ఈ మూడవ దశ అయిన మరణమే ఆఖరి దశ…. ఇదే తిరిగి నిర్ణయిస్తుంది , నీ సుఖదుఃఖాలను మరియు మరొక జన్మను…..


• గమనిక : ఇది బాధ్యతలను విస్మరించిమని కాదు…. బంధాలలో , జీవిత గమనం లో ప్రతీ అడుగు ఆనందించండి కానీ దేని వలన దుఃఖం తీసుకోకండి, దుఃఖం ఇవ్వకండి. అన్నింటి తో కలిసి మమైకమై ఉండాలి ఎలా అంటే తామరాకు పై నీటి బిందువులా…. ఏది ఉన్నా సంతోషమే లేక పోయినా సంతోషమే. అదే పరమానందం.


యడ్ల శ్రీనివాసరావు 22 sep 2022 12:30 PM.


Friday, September 16, 2022

244. నవనీత

 

నవనిత


• నలుపు  తెలుపు  లోన  వనిత

  ఓ  నవనీత  పునీత

• చిలుక  పలుకు  లొలికే  సంగీత

  ఓ మధుమిత  సునీత


• నీ నగుమోము  లోని  నయనాలు

  సెలయేరు లోని   కలువలు


• నీ కనుబొమ్మల  కమనీయం

  నెలవంక న   సౌభాగ్యం


• నీ నుదుటి మెరిసే  సింధూరం

  రవి  కాంతులీనే  సోయగం


• నలుపు  తెలుపు  లోన  వనిత

  ఓ  నవనీత  పునీత

• చిలుక  పలుకు  లొలికే  సంగీత

  ఓ మధుమిత  సునీత


• నీ అరవిరిసిన   ముంగురులు

  జలపాతపు   జావళము


• నీ చెవి దిద్ది ల    అందాలు

  మాటు  వేసిన  మల్లె తీగలు


• నీ నాసిక న  నిగనిగలు

  ఎగిసిపడే కోపాల  అలలు


• నలుపు  తెలుపు  లోన  వనిత

  ఓ నవనీత  పునీత

• చిలుక  పలుకు  లొలికే  సంగీత

  ఓ మధుమిత  సునీత


• నీ ఒడిదుడుకుల  అధరాలు

  పెనవేసుకున్న  సన్నజాజులు


• నీ చూపు లోని  లావణ్యం

  వికసించిన  ముద్దమందారం


• నీ మేని  ఛాయ  బంగారం

  అజంతా శిల్ప  చందనం.


యడ్ల శ్రీనివాసరావు 16 sep 2022 9:30 PM






Thursday, September 15, 2022

243. రుద్రనాయక

 

రుద్రనాయక



• హర హర శంకర     శంభో శంకర     మహాదేవ

  శివ శివ   శంకర      శంభో శంకర     మహాదేవ


• హర హర అనగా     హలమును  దాచిన

  గళము ను   విప్పి  వచ్చావు

  శివ శివ  అనగా       శిరమున   దాచిన

  జ్ఞానగంగ ను    తెచ్చి  ఇచ్చావు


• ఓ కాలకంఠుడా         ఓ భృకుటినాధుడా

  ఓ నీలకంఠుడా          ఓ పింగళాక్షుడా


• హర హర అనగా      హలమును   దాచిన

  గళమును విప్పి  వచ్చావు

  శివ శివ అనగా       శిరమున    దాచిన

  జ్ఞానగంగ ను    తెచ్చి   ఇచ్చావు


• రుద్రనాయకుడి వై    భధ్రమూర్తి లా   నడిపిస్తావు

  కాలహరుడి వై       సృష్టి చక్రము ను    శాసిస్తావు

  మోక్షనాధుడి వై     ఆత్మఘోషలకు    కరుణిస్తావు

  భస్మరూపుడు వై     విశ్వము నే      పరిపాలిస్తావు


• ఓ నందివర్ధనుడా          ఓ ప్రమధనాధుడా

  ఓ భూతనాధుడా          ఓ మృత్యువంచకుడా


• హర హర శంకర       శంభో శంకర     మహాదేవ

  శివ శివ  శంకర         శంభో శంకర     మహాదేవ

 

• జనన మరణాల       బీజనాధుడివి

  అది  అంతాల          సూత్రధారివి

  సత్య అసత్యాల       జ్ఞానరూపివి

  పాప పుణ్యాల         ధర్మకారకుడివి


• ఓ చంద్రశేఖరా          ఓ ఆదిభిక్షువా

  ఓ మల్లిఖార్జునా        ఓ కేతుపుంగవా


• హర హర అనగా       హలమును  దాచిన

  గళము ను    విప్పి  వచ్చావు

  శివ శివ అనగా       శిరమున దాచిన

  జ్ఞానగంగ ను   తెచ్చి  ఇచ్చావు


• హర హర శంకర శంభో శంకర మహాదేవ

  శివ శివ శంకర శంభో శంకర మహాదేవ

 

యడ్ల శ్రీనివాసరావు 15 sep 2022 5:00 PM




Tuesday, September 13, 2022

242. మోక్ష కాల భస్మేశ్వరుడు

 

మోక్ష కాల భస్మేశ్వరుడు



• ఈశ్వర   పరమేశ్వర

• నిను కోరి వచ్చాను    నీ సన్నిధికి

  కోరికలతో కాదయా

• నిను చేరి నిలిచాను    నీ హారతికి

  భస్మమై  కలిసేందుకు


• ప్రేమ పాశం తో     ముడిపడిన ఆత్మ

  అర్పితం    శివా    నీకే అర్పితం.

• భవ బంధనం లో   తేలియాడే  దేహం

  అర్పితం    శివా    నీకే అర్పితం.


• ఏది కర్మమో …. ఏది మర్మమో

  ఏది పుణ్యమో …. ఏది పాపమో


• నీ వెంత ఘనుడవు

 గతము నెరిగించావు

 వర్తమానం చేసావు.



• నీ వెంత  సఖుడవు

 కర్మను  తెలిపావు

 వర్తమానం చేసావు.


• నీ ఆటలో బొమ్మను

  ఛిద్రం చేసినా      భద్రం చేసినా

  నీవే కదా శివా


• ఈశ్వర   పరమేశ్వర

• నిను కోరి వచ్చాను    నీ సన్నిధికి

  కోరికలతో కాదయా

• నిను చేరి నిలిచాను   నీ హారతికి

  భస్మమై కలిసేందుకు


• అవధుల ను   దాటి   సమిధ నవుతాను

  యుక్తి తో కాదయా    నీ శక్తి తో

• అంధకారము లోని   ఆనందం

  అవని దాటి   పుంతలు  తొక్కుతొంది.

• సంధికాలంలో   నవవసంతం

  పుడమి దాటి   పరవళ్లు  తొక్కుతోంది.


• కాలమే కలిసి   ఒడిలో ఆడిస్తుంటే

  ఎందుకు బాధ…ఎందుకు రోత.

• అసలెందుకు

  ఈ గందర  'గోళం'  లో చిందర వందర.


• ఇచ్చేది నీవు      మెచ్చేది నీవు

  నడి సంద్రంలో   ముంచేది నీవు.

• ఎందుకు  బాధ…ఎందుకు రోత

  అసలెందుకు

  ఈ గందర  'గోళం'  లో చిందర వందర


• సర్వం శివమయం  ….  సర్వం శివార్పణం

• ఇక మిగిలింది ఒక్కటే

  చితానందం  …  చితాభస్మం


• ఓం నమఃశివాయ🙏


అవధి = హద్దు, కష్టం, శ్రమ

సమిధ = కాలుతూ వెలుగు నిచ్చేది.

యుక్తి = తెలివి

సంధికాలం = కలియుగ అంతం.


యడ్ల శ్రీనివాసరావు 13 సెప్టెంబర్ 2022 6:30 PM.





Tuesday, September 6, 2022

241. వినీలాకాశం

 

వినీలాకాశం



• సాయంకాలం ఈ సుందర ఆకాశం

• సాగరతీరం సుమధుర మనోహరం


• చలి గాలులు తెరలుగా పిలిచి పోతున్నాయి

• చెలి పిలుపుకి అలలు తడిపి పోతున్నాయి.


• నింగి నెగిరే జాబిలి మబ్బు చాటున దాగింది.

• నేల నడిచే పాదము మన్ను చెంతన నిలిచింది.


• మెరిసేటి మెరుపులకు కురిసేను మేఘం

• ఊగేటి లతల తో దోబూచులాడెను జలం.


• నీలి కన్నుల పారిజాతం కోటి కాంతులీనుతుంటే

• జాబిల్లి సింగారం సిగ్గు లొలుకుతుంది.


  అది చూసిన

• నా కాటుక కన్నులు మయూరి లా నాట్యం చేస్తుంటే

• చిరుజల్లులు సరిగమలు వినిపిస్తున్నాయి.

• హరివిల్లు ఆరాటం గా అంబరం 

  దిగి వస్తానంటోది  నా తోటి  సంబరానికి.



యడ్ల శ్రీనివాసరావు 7 Sep 2022 6:00 AM











Sunday, September 4, 2022

139. కళాశాల 1980 ఎపిసోడ్ - 16

 

కళాశాల 1980

ఎపిసోడ్ - 16



సీన్ – 58


రాము ని విమల తన ఇంటికి తీసుకెళ్లింది. చిన్న రెండు గదులు ఇల్లు, మాములు మంచం, పాత కుర్చీలు, అదంతా చూస్తుంటే తన గడిపిన చిన్నతనం లో ఇల్లు గుర్తు కు వచ్చింది.


గోడ మీద విమల భర్త ఫోటో చూసి అసలు ఏం ఆ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు రాము కి.

విమల తన ఇద్దరు పిల్లలను రాము కి పరిచయం చేసింది.


రాము : పిల్లల తో ఏం చదువుతున్నారు …అని అడిగాడు.

పిల్లలు : లేదండి…. ఇంటర్ వరకు చదువుకున్నాము. ఇప్పుడు ఇక్కడే చాక్లెట్ తయారీ కంపెనీ లో పని చేస్తున్నాము.

ఆ సమాధానం విన్న రాము తట్టుకోలేక పోయాడు.

రాము : మీ పేర్లు ఏంటీ.

పిల్లలు : రామలక్ష్మి, రాంబాబు. ….అని చెప్పారు.

అది విని రాము కి కన్నీళ్లు ఆపుకోవడం చాలా కష్టం అయింది.

ఇంతలో విమల పిల్లలు తో సరే మీరు బయట ఉండండి….. అని, రాము కి మంచినీళ్లు ఇచ్చింది.

రాము : విమల…ఏంటిది…ఏం జరిగింది…. నాకేం అర్థం కావడం లేదు…. అన్నాడు కంగారుగా.

విమల తన పెళ్లి నాటి నుండి జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పింది.

అప్పటి కే సమయం మధ్యాహ్నం 2 గంటలు అయింది.

విమల : కంగారుగా…రాము కొంచెం సేపు భోజనం చేసి పెడితాను ,. రామాలయం దగ్గర భోజనాలు అన్నారు అందుకని నేను ఇంటిలో వండలేదు.

రాము : ఆగు విమల…ఇప్పుడు ఏం వండొద్దు….

అని తన పి.ఏ. కి కాల్ చేసి, ఫుడ్ కాంప్ దగ్గర నుంచి పార్శిల్ అందరికీ విమల ఇంటి వద్దకు తెప్పించాడు.

వారిద్దరి మధ్య పెళ్లిళ్లు తరువాత జరిగిన గతం అంతా అద మరచి చెప్పుకుంటున్నారు.

రాము తన కుటుంబం పిల్లలు గురించి చాలా క్లుప్తంగా చెప్పాడు. అంతకు మించి ఆ సమయంలో విమల ను చూసి చెప్పలేక పోయాడు.


సమయం సాయంత్రం 5 గంటలు అయింది. 


రాము పి. ఏ. :  ఫోన్ చేసి....సార్ కాంప్ అయిపోయింది .  బయలు దేరడమే ఆలస్యం.

రాము : సరే…వస్తున్నా….పేకప్ అవ్వండి.

రాము విమల ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.

రాము : విమల … రేపు ఉదయం పది గంటలకు కారు పంపిస్తాను. నేను రేపు ఆఫీస్ కి వెళ్లను. ఇంటిలో కూర్చుని మాట్లాడుకుందాం.

విమల : సరే …

రాము విమల పిల్లల ను పిలిచి భుజం తట్టి వెళ్లొస్తానని చెప్పి…. కారు ఎక్కి వెళ్ళిపోయాడు.

రాము వెళ్లిన తరువాత విమల ను పిల్లలు ఇద్దరు అడుగుతున్నారు.

పిల్లలు : ఎవరమ్మా ఆ అంకుల్ ఎప్పుడూ చూడలేదు….నాన్న ఫ్రెండా…

(విమల మనసు లో అవును మీరు ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే నా మనసు లోతు లో నే అణిగి ఉండిపోయాడు….అనుకుంది)

విమల : కాదమ్మా….నా ఫ్రెండ్…మేము చిన్నప్పుడు నుండి కలిసి చదువుకున్నాం. చాలా సంవత్సరాల తరువాత ఇదే కలవడం. ఆ అంకుల్ బాగా చదువుకుని అమెరికా లో జాబ్ చేసి, ఇక్కడే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పడుపుతున్నారంట.

పిల్లలు : కాస్త అమాయకంగా…. అమ్మా మరైతే మన కి ఏమైనా ఆఫీసు లో చిన్న ఉద్యోగాలు అడగొచ్చు కదమ్మ…. ఇక్కడ కంపెనీ లో చేసే పనికి నీరసం వస్తుంది.

విమల : ఆ మాటలు విని, కన్నీళ్లు ఆపుకోలేక పోయింది….. సరే నమ్మా నేను అడుగు తా లే…. రేపు ఆ అంకుల్ వాళ్లింటికి నన్ను రమ్మన్నారు. కారు పంపిస్తానన్నారు.

పిల్లలు : అయితే …మేము వస్తాం…

విమల : లేదమ్మా…. మీరు పనికి వెళ్లండి. ఇంకో సారి తీసుకెళతా మిమ్మల్ని.

ఆ రోజు రాత్రి విమల నిద్ర పోలేదు. గతం అంతా కళ్ల ముందు కనిపిస్తుంది. తాను రాము ను ఎలా చూడాలని ఊహించిందో…. అలాగే తన కంటి ముందు కనపడ్డాడు…. కానీ రాము పక్కన తను లేదు., రాము తో తన జీవితం లేదు.

కానీ ఆ రోజు ఉదయం రాము ని చూసి మాట్లాడాక విమల కి తన ధైర్యం రెట్టింపు అయింది. తన మనసు ఒంటరి కాదు అని అనుకుని నిద్రలో కి జారుకుంది.

అదే రోజు సాయంత్రం రాము కారు లో వెళ్తున్నాడు. తనకు విమల ను చూసిన క్షణం నుండి ఆనందం కంటే విమల పరిస్థితి చూసి గుండెలు పిండెస్తున్నట్లు అయిపోతుంది. అంతా చీకటి మయం గా కనిపిస్తుంది. ఆ సమయంలో తనకు శైలజ, పిల్లలు, కంపెనీ ఏమీ గుర్తు కు రావడం లేదు. తాను ఒక రకం గా విలాసమైన జీవితం గడుపుతూ ఉంటే , విమల తన పిల్లలు తో అలా ఉండడం చూసి తట్టుకోలేక పోతున్నాడు. ఎందుకంటే రాము కి తెలుసు ఈ రోజు తాను అనుభవిస్తున్న స్థితి కి బీజం విమల అని.

ఆ రోజు రాత్రి రాము కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధ మయ్యాడు…. సరిగ్గా అదే సమయంలో అమెరికా నుంచి శైలజ ఫోన్ చేసింది , కానీ రాము బాగా మానసికంగా అలసి పోవడం వలన ఫోన్ ఆన్సర్ చెయ్యలేదు.

శైలజ తాను ఫోన్ చేసినా తీయకపోతే టప్పటికి “ఆర్ యూ ఓ కే “ అని మెసేజ్ పెట్టింది.

తరువాత ఎప్పుడో “ ఎస్…ఐయాం ఓ కే…బట్ వర్క్ స్ట్రెస్…టు మారో విల్ కాల్ యూ” అని రిప్లై ఇచ్చాడు.


సీన్ – 59


మరుసటిరోజు ఉదయం విమల ఇంటి ముందు కారు ఆగింది. వీధిలో వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. విమల కారులో రాము ఇంటికి బయలుదేరింది.

రాము ఇంటి కి రాగానే పెద్ద గేటు వాచ్మెన్ తీసాడు. ఇల్లు చాలా పెద్దది. ఇంటి ముందు గార్డెన్ అన్నీ చూసి ఇలాంటి ఇల్లు సినిమా లోనే కానీ ఎప్పుడూ చూడలేదు అనుకుంటూ కారు దిగింది. ఇంతలో రాము స్వయంగా లోపలికి తీసుకెళ్ళాడు. రాము ఇల్లంతా చూపించాడు.

శైలజ తల్లి తండ్రులు చనిపోయారని, ఆమె కి విశ్రాంతి కోసం కొన్నాళ్ళు అమెరికా లో పిల్లలు దగ్గరకు పంపానని రాము చెప్పాడు.

కాసేపు తరవాత ఇద్దరూ సోఫా లో కూర్చున్నారు.

కాస్త మౌనం తరువాత

రాము : విమల ఇవన్నీ అనుభవిస్తున్నాను. కానీ ఇవన్నీ నువ్వు ఇచ్చినవే…. కాలేజీ లో ఆ రోజు నువ్వు నాకోసం దెబ్బలు తిన్నావు. నా జీవితం మొత్తం మార్చావు…. చెప్పాలంటే ఇవన్నీ నీకు దక్కాలి విమల.

విమల : ఊరుకో రాము…. అదేం మాట…మనచేతిలో లేకుండా కొన్ని జరిగి పోయాయి.

రాము : తాను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ప్రతీ విషయం పూస గుచ్చినట్లు చెప్పాడు. అలాగే విమల ను చూడడానికి జగిత్యాల వెళ్లడం, తనని కలవడం కోసం ఈ రోజు వరకు పడిన తపన వివరం గా చెప్పాడు.

విమల : తాను కూడా నిధానంగా , తన పెళ్లి ఇంకా జీవితం లో జరిగిన సంఘటనలు అన్నీ చెప్పింది.

రాము కి ఆ రోజు కాస్త ప్రశాంతంగా అనిపించింది.

ఇంటిలో ఇద్దరూ కలిసి భోజనం చేసారు.

కాసేపటి తరువాత

రాము : విమల నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోలేను. ఇలా అనడానికి నాకు హక్కు ఉంది అనిపిస్తుంది. నేను నీకు అండగా ఉంటాను అని చెప్పడం లేదు. ఎందుకంటే ఈ రోజు కి, నీ అండలోనే నేను ఉన్నాను. నన్ను నీ ఆలోచనలే నడిపిస్తున్నాయి, ఇంత దూరం నన్ను తీసుకు వచ్చాయి. నాకు ఉన్న వాటన్నింటిలో నీకు హక్కు ఉంది.

విమల : ఎందుకు రాము అంత పెద్ద మాటలు. మన జీవితాలు పూర్తిగా వేరు. నేను నీకు ఏ రోజు ఒక సమస్య అనకూడదు….అంది ఆత్మాభిమానం తో.

రాము : సమస్య అంటే ఏంటి విమల…. అవును మనం జీవితాలు వేరు , కానీ మనం జీవించి ఇంకా ప్రాణాలతో నే ఉన్నాం కదా…. నువ్వు నా జీవితం లో లేక పోయినా , నా మనసు లో ఉన్నావు. ఇప్పుడు ఒకరికి మరొకరు సహకరించుకోవలసిన సమయం వచ్చింది. చూడు నీకు పెళ్లి అయినా సరే, నీ పిల్లలు ఇద్దరికి నా పేరే పెట్టావు…. ఎందుకు చెప్పగలవా….. నువ్వు చెప్పలేవు, కానీ నాకు తెలుసు నీ పిల్లల లో నన్ను చూసుకుంటున్నావు‌‌…. ఇదంతా ఏంటి విమల చెప్పు…. దీనిని ఏమంటారో చెప్పు.

విమల కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి…ఏం మాట్లాడాలో తెలియడం లేదు.

రాము : చూడు విమల నా కంపెనీ పేరు “ V soft solutions” . అందులో “ V “ అనే అక్షరానికి అర్దం విమల అని.

విమల : ఏం మాట్లాడలేక మౌనంగా ఉంది.

రాము మనసు లో అనుకుంటున్నాడు విమల కి ఆత్మాభిమానం చాలా ఎక్కువ అని.

రాము : విమల ఇక నుంచి నీ బాధ్యత నేను తీసుకుంటాను అనడం లేదు. కానీ నీ బాధ్యత కి నేను సహకరిస్తాను. నేను తోడు ఉంటాను .

విమల కి రాము మాటలు మంత్రముగ్ధుం గా, ఏదో దేవుడు అభయం ఇస్తున్నట్లు అనిపిస్తుంది.

విమల :  సరే రాము, కానీ నా వలన నీకు ఏ సమస్య లేదు అనుకుంటే నే ఏదైనా చెయ్యి.

రాము :  ఆ మాటకు సంతోషించి…చూడు విమల ఇక మీదట నీకు కావలసిన వన్నీ నీకు సమకూరుస్తాను. క్రమేపీ కొంత కాలానికి నీకు నువ్వే ఏంటో నిరూపించుకుంటావు. కానీ నా మాట కి అడ్డు రాకు.

విమల : సరే…రాము.

ఆ రోజు సాయంత్రం విమల ఇంటికి వెళ్ళి పోయింది. విమల పిల్లలు తల్లి ని చుట్టూ చేరి…ఏమ్మా అంకుల్ ఏమైనా ఉద్యోగం ఇస్తానన్నారా అని అడుగుతుంటే…. వారి తలపై నిమురుతూ విమల పిల్లల్ని ముద్దు పెట్టు కుంది. తల్లి ముఖంలో అంత సంతోషం చూసి పిల్లలు కి చాలా కాలం అయింది.


సీన్ - 60


ఆ మరుసటి రోజు రాము శైలజ కి ఫోన్ చేసాడు.

రాము : శైలు ఎలా ఉన్నావు.

శైలజ : బాగున్నాను…. ఏమండీ నాకు ఇండియా వచ్చెయ్యాలని ఉందండి. ఇక్కడ బోర్ గా ఉంది.. మీరు కూడా లేరు.

(నిజానికి రాము యే శైలజ ని వచ్చెయ్యమని చెపుదాం అనుకున్నాడు)

రాము : సరే…నీకు రిటర్న్ జర్నీ ఏర్పాట్లు చేస్తాను…. నువ్వు వచ్చాక నీకు చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి.

శైలజ : సరే నండి.

ఆ రోజు రాత్రి రాము , విమల విషయం శైలు కి చెపితే ఎలా తీసుకుంటుందో అనుకున్నాడు. కానీ విమల పట్ల తన ఫీలింగ్స్ ని మనసు లో దాచుకున్నా, విమల పరిస్థితులు ఏవీ శైలజ దగ్గర దాయకూడదు అనుకున్నాడు.

ఒక వారం లో శైలజ ఇండియా వచ్చేసింది.

రాము శైలజ వచ్చాక, పిల్లలు యోగ క్షేమాలు అడిగాడు.

శైలజ వచ్చిన తరువాత రోజు రాత్రి పడుకుని…. రాము శైలజ తో

రాము : శైలు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.

శైలజ : చెప్పండి…అని దగ్గర గా చేరి, రాము గుండెలపై తల ఆనించింది.

రాము : నెమ్మదిగా …. విమల గురించి జరిగిన విషయం, విమల జీవితం లో జరిగిన సంఘటనలు, ప్రస్తుతం విమల పరిస్థితి , విమల ఇంటికి వచ్చిన విషయం అన్నీ వివరంగా దాచకుండా చెప్పాడు.

శైలజ : ఒక్కసారి కొంచెం ఆశ్చర్య పడింది. కానీ రాము చెపుతున్నందంతా మౌనం గా వింటుంది.

శైలజ కి విమల ఎలా ఉంటుందో తెలియదు కానీ…రాము ఈ స్థితి కి రావడం వెనుక కారణం విమలే అని తెలుసు.

శైలజ : కాసేపు ఆగి…ఏం చేద్దామండి…. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పరవాలేదు.

రాము : మనమే…ఏదొక టి చేసి విమలకి సహకరించాలి…శైలు…. లేదంటే నా ఈ జీవితానికి అర్థం ఉండదు.

శైలజ : మీరు ఏం చేసినా కరెక్ట్ గా నే చేస్తారు. నేను మీ మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పను…. రెండవది విమల విషయం లో మీరు ప్రతీది నాకు చెప్పి చెయ్యొద్దు…. ఎందుకంటే ఇది మీ ఆత్మాభిమానం కి సంబంధించిన విషయం.

రాము : శైలజ పెద్ద మనసు కి రాము మనసు లో నే కృతజ్ఞతలు చెప్పుకుంటూ…. లేదు శైలు నీకు చెప్పు వలసిన బాధ్యత నాకు ఉంది. నేను సంపాదించిన దాంట్లో కొంత విమలకి ఇవ్వాలని, ఇంకా విమల చేయగలిగే ఏదైనా వ్యాపారం పెట్టించాలను కుంటున్నాను.

శైలజ : తప్పకుండా చెయ్యండి.

రాము : విమల…విమల…నేనొకటి అడగనా…

శైలజ : హు…చెప్పండి…

రాము : నీకు ఇదంతా మనస్పూర్తిగా ఇష్టమేనా….నా మీద నీకు నమ్మకం ఉంది కదా

అనేలోపు

శైలజ : ఒక్కసారిగా రాము గుండె పై నుంచి పైకి జరిగి , తన పెదాలతో రాము పెదాలను నొక్కి పెట్టింది…ఏమీ మాట్లాడొద్దు అన్నట్టు….

శైలజ కళ్లలో నుంచి జారిన నీరు చుక్కలు రాము ముఖం పై పడుతున్నాయి.

రాము : ఏంటి శైలు ఎందుకు ఏడుస్తున్నావు.

శైలజ : మీ మనసు ఏంటో, మీరు ఏంటో నాకు బాగా తెలుసండి. మీ కంటే ముందు ప్రేమ విలువ ఏంటో నాకు తెలుసు. మీరు విమల విషయం లో ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమే …..

రాము కి శైలజ మాటలోని అంతరార్థం ఎలా అనుకోవాలో అర్దం కాక మౌనంగా ఉండిపోయాడు.

నాలుగు రోజుల తరువాత రాము విమలకి ఫోన్ చేసి , శైలజ అమెరికా నుంచి వచ్చిన విషయం చెప్పి….ఈ ఆదివారం కారు పంపిస్తాను, పిల్లలు తో కలిసి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు.

విమల సరే అంది. కానీ మనసు లో ఏదో భయం , అంతా చక్కని కుటుంబం లో తన వలన ఏమైనా అపార్థాలు వస్తాయేమో అని.

ఆదివారం రాగానే రాము , విమల కోసం కారు పంపాడు…. విమల తన ఇద్దరు పిల్లలతో రాము ఇంటికి వచ్చింది. కారు దిగగానే ముందు గా శైలజ నవ్వుతూ వెళ్లి విమల ను చెయ్యి పట్టుకుని ఇంట్లో కి తీసుకు వచ్చింది.

శైలజ కి విమల ను చూస్తుంటే కళావిహీనమైన లక్ష్మీదేవి లా అనిపించింది. 

విమల కి  శైలజని చూసి సన్నగా అందం గా ఉంది, రాము కి సరైన జోడి అనుకుంది.

విమల  కాస్త భయపడుతుంది. విమల పిల్లలు ఆ ఇంటిని నోరు తెరిచి ఆనందం గా చూస్తున్నారు. ఇంతలో లోపల నుండి రాము వచ్చాడు. నిజానికి ఆ సీన్ ఆ సమయంలో వారందరికీ ఏదో సినిమా సన్నివేశం లా అనిపిస్తుంది.

శైలజ తానే కలివిడిగా విమలను కలుపు కొని మాట్లాడుతూ ఉంది. రాము పిల్లలు ఇద్దరినీ తన గదిలోకి తీసుకెళ్ళాడు.

శైలజ విమల తో

శైలజ : సారీ …విమల గారు …. నాకు ఈయన మీ గురించి అన్నీ చెప్పారు. మీకు చిన్న వయసులో ఇలా జరిగి ఉండకూడదు…. విధి రాత అంతే …ఏం చెయ్యగలం.

విమల : అవునండీ.

శైలజ : నన్ను ఆండీ అనవద్దు …పేరు తో పిలు విమలా…నేను కూడా అలానే పిలుస్తాను.

విమల : సరే…అంది చిన్నగా నవ్వుతూ

శైలజ : విమల …పిల్లలు పేర్లు ఏంటీ.

విమల : కొంచెం సంశయిస్తూ…నెమ్మదిగా రాంబాబు, రామలక్ష్మి అని చెప్పింది.

శైలజ : వెంటనే…షేక్ హ్యాండ్ ఇచ్చింది. నీది చాలా గొప్ప ఉన్నతమైన ప్రేమ విమల. మీ విషయం నాకు పూర్తిగా తెలుసు…. ఏంటి ఇంత బోల్డ్ గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా….నా దగ్గర రాము నీ గురించి ఏదీ దాచలేదు. నీ పెళ్లి జరిగింది అని తెలిసిన తరువాత పిచ్చివాడిలా అయిపోయాడు. చాలా కాలం పట్టింది మాములుగా అవడానికి. రాము చిన్న పిల్లాడి మనస్తత్వం, అదే నన్ను తనను ప్రేమించే లా చేసింది. రాము నన్ను దూరంగా ఉంచినా, నేనే రాము వెనుక తిరిగి బెదిరించి , ప్రేమించి పెళ్లి చేసుకున్నాను.

అదంతా వింటున్న విమల కి శైలజని చూసి ఒక్కసారిగా కిందికి వంగి శైలజ కాళ్లకు నమస్కరించింది.

విమల కాసేపు ఏడుపు ఆపుకోలేక పోయింది.

శైలజ ఆ సంఘటన కి ఆశ్చర్యం చెంది వెంటనే విమల ను పైకి లేపి…. మనసు లో అనుకొంటుంది, విమలకి రాము పై ప్రేమ సామాన్య మైనది కాదు, ఎంత త్యాగానికైనా విమల సిద్దపడుతుంది అని.

కాసేపటి కి ఇద్దరూ కాస్త మానసికంగా ఇంకా దగ్గర అయ్యారు.

అందరూ కలిసి భోజనాలు చేశారు.

భోజనం చేసిన తరువాత రాము, విమల, శైలజ కూర్చుని ఉండగా….

రాము : విమల రేపు,  నీ పేరు మీద బాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. అందులో నీ పేరు మీద 5 కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తాను. ఇంకా నీకోసం  సిటీ లోనే  నెల రోజుల్లో  ఒక మంచి ఇల్లు కొంటాను. నీ చేత చీరల షాప్ పెట్టిస్తాను. పిల్లలు ఇద్దరు కి ఆఫీస్ లో సాఫ్ట్వేర్ ట్రైన్ అప్ చేయించి , డిగ్రీలు ప్రైవేటు గా చదివిస్తాను…. అన్నాడు

విమల : నిర్ఘాంత పోయింది…ఏంటి ఇంత నా కోసం మీరు వద్దు వద్దు రాము…. నీకు అభిమానం ఉంటే పిల్లలు కి దారి చూపించు చాలు.

శైలజ : ఏం పరవాలేదు…విమల, నువ్వు బయట మనిషి వి కావు…దేవుడు మెదట నుంచి ఆయన ఎదుగుదలకు ఏదో రూపంలో సహకరించాడు. బీజం వేసింది నువ్వు. అవసరానికి మించి ఉన్నాయి అన్నీ.

ఆ సాయంత్రం విమల తిరిగి కారు లో వెళుతూ …. కష్టాలు ఇంతకాలం వరదలా వెంటాడాయి…ఇప్పుడు మంచి మనుషుల ప్రేమ వరదలా వెంటాడుతున్నాయి…. జీవితం అంటే నాటకం అంటారు. అది ఇదే నేమో అని మనసు లో అనుకుంటుంది.


మిగిలినది ఎపిసోడ్ -17

యడ్ల శ్రీనివాసరావు 4 Sep 2022 10:30 PM

















Saturday, September 3, 2022

139. కళాశాల 1980 ఎపిసోడ్ - 15

 

కళాశాల 1980

ఎపిసోడ్ - 15



సీన్ – 56


రాము, శైలజకి నిజం గా ఇది కోలుకోలేని బాధ. ఒకే నెలలో తల్లి తండ్రులు ఇద్దరిని కోల్పోవడం షాక్ లా ఉంది శైలజకి. రాము దగ్గర ఉండి శైలజ కి ధైర్యం చెప్పేవాడు. తనకు పెద్దదిక్కు గా ఉన్న ఇద్దరూ ఒకేసారి లేకపోవడంతో ఎన్నడూ లేని రాము కి మొదటి సారిగా కొంచెం భయం వేస్తుంది. అంతకాలం తనతో కలిసి ఉన్న మనుషులు లేకపోతే ఆ ఒంటరితనం అనుభవిస్తున్నాడు.


కాలం మనుషులను మరపింపచేసి మనసు లో ని గాయాలను మరచి పోయేలా చేస్తుంది. శైలజ నెమ్మదిగా కోలుకొని రోటీన్ జీవితం లో కి వచ్చింది.

ఒక రోజు రాము శైలజ తో….

రాము : శైలు…నీకు కొంచెం రిలాక్స్ గా ఉంటుంది పిల్లలు దగ్గరకు, అమెరికా వెళ్ళి ఉండిరా…. ప్రదేశం మారితే అన్ని సర్దుకుంటాయి…. పిల్లలు తో గడిపి నట్లు ఉంటుంది.

శైలజ : లేదండీ…. నాకు ఇప్పుడు వెళ్లడానికి ఇష్టం లేదు.

రాము : అది కాదు…శైలు…. మరలా ఆలోచించి చూడు…

శైలజ : మీరు వస్తారా…..

రాము : లేదు…శైలు…కొన్ని కొత్త ప్రాజెక్టులు వచ్చాయి…. దగ్గర ఉండాలి.

శైలజ : సరే…వెళ్తాను

రాము : రేపే ఏర్పాట్లు చేస్తాను…. నీకు ఇష్టమైన రోజు లు ఉండి రా…

శైలజ : సరే…. అలాగే నండి.

శైలజ ఒక వారం రోజుల తరువాత అమెరికా వెళ్ళింది. రాము యధాలాపంగా తన ఆఫీసు పనిలో బిజీగా ఉంటున్నాడు.

కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం రాము తన కారు లో ఆఫీసునుండి ఇంటికి బయలుదేరాడు. సమయం 5 గంటలు అవుతుంది. ఆఫీస్ నుండి ఇంటికి 20 కిలో మీటర్ల దూరం అయినా హైదరాబాద్ ట్రాఫిక్ వలన ప్రతీరోజూ గంట సేపు పట్టెస్తుంది.

రాము బయలు దేరిన కాసేపటికి ఆకాశం అంతా నల్లని మబ్బులు తో నిండి వర్షం వచ్చేలా చల్లగా మారిపోయింది. చాలా రోజుల తరువాత ఆ వాతావరణం చూసి రాము కి చాలా సంతోషం అనిపిస్తుంది.

కారులో F M రేడియో ఆన్ చేసాడు. ప్రేమలేఖ సినిమా లో “ ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాక వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం” అనే పాట వస్తుంటే, రాము మనసంతా ఒకసారి గా వికలం అయిపోయింది. …ఆ క్షణంలో కారు నడుపుతూ మనసు లో అనుకుంటున్నాడు, అసలు విమల నేను బ్రతికుండగా కనిపిస్తుందా…నేను ఎందుకు విమలను ఇంకా గుర్తు చేసుకుంటున్నాను…. అనుకునే లోపు జోరున  వర్షం మొదలైంది. కారు లో వైపర్స్ వేసినాా  సరే  దారి సరిగా కనిపించడం లేదు. సాయంత్రం ఆరు గంటల అయింది, చీకటి పడుతుంది.

వర్షం బాగా పెరిగింది. దారి కనపడటం లేదు. ఆ సమయంలో కాసేపు ఆగడం మంచిదనిపించి దగ్గర లో రోడ్ పక్కన ఉన్న సిటీ బస్ స్టాప్ ముందు కారు ఆపి, కారులో కూర్చోని…పాటలు వింటూ ఆ వాతావరణం ఎంజాయ్ చేస్తున్నాడు.

ఆ సమయం కొంచెం చీకటి  పడుతూ, మబ్బుల వర్షం తో ఉంది.  కారు అద్దం పైనుంచి వర్షం నీరు జారుతూ ఉంది.  రాము ఏదో ఆలోచిస్తూ బస్ స్టాప్ షెల్టర్ లో కి చూసాడు. ఒక్క అయిదు సెకన్ల లో కళ్లు పెద్దవి చేసి జోరు వర్షం లో మరలా చూసాడు. ఆ బస్ షెల్టర్ లో ఒక స్త్రీ ఒంటరిగా నిలబడి బస్ కోసం చూస్తుంది. ఆమె ఎర్రని నలిగి పోయిన కాటన్ చీర ధరించింది. చేతి లో కాయగూరల సంచి, కాళ్లకి హవాయి చెప్పలు, చింపిరి జుత్తు లో ఒక పేదింటి స్త్రీ లా కనిపించింది. ముఖం బొద్దుగా ఉంది కానీ ఆ వర్షం లో స్పష్టం గా కనపడటం లేదు.

అప్పటి వరకూ మాములు గా ఉన్న రాము లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ ప్రకంపనలు మెదడు కి చేరగానే, రాము కి ఆమె తన విమలే నా, విమల లా అనిపిస్తుందేంటి, అయినా విమల ఒంటరిగా ఇక్కడ ఎందుకు ఉంటుంది అని అనేక ప్రశ్నలు మొదలైన క్షణం లోనే , బస్ షెల్టర్ లో కి వెళ్ళి దగ్గరగా చూడాలని కారు దిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో రాము పక్కనుండి ఒక సిటీ బస్ వచ్చి ఆగింది. రాము వేగం గా కారు దిగి వర్షం లో తడిచి వెళ్లే లోపు ఆమె ఆ బస్ లో ఎక్కి వెళ్లి పోయింది.

రాము ఒక్కసారి గా “ఛ”  మిస్ అయింది అనుకొని వేగం గా వచ్చి కారు తీసి బస్ ను ఫాలో అయ్యాడు. బస్ నెంబర్ చూసాడు. నెమ్మదిగా ఆ బస్ నే ఫాలో అవుతూ వెళ్లాడు. మధ్యలో ఏ బస్ స్టాప్ లో ను ఆమె దిగినట్లు అనిపించలేదు. చాలా దూరం వెళ్ళాక ఆ బస్ హైదరాబాద్ ఊరి శివార్లలో నాచారం ఆఖరి బస్ స్టాప్ లో ఆగింది. ఆమె అక్కడ దిగడం గమనించాడు…కానీ అంతలోనే ఆమె ఏదో సందులో కి వెళ్లి కనిపించలేదు.

రాము ఒక్కసారి గా తనకు తాను పిచ్చి వాడిలా అనిపించాడు. సిటీ నుండి దాదాపు 30 కిలో మీటర్ల ఆ బస్ వెనుక వచ్చేసాడు. సమయం రాత్రి 8:30 అయిపోయింది. చేసేది ఏమీ లేక వెను తిరిగి కారు లో ఇంటికి బయలుదేరాడు.

ఇంటికి చేరేటప్పటికి చాలా సమయం అయింది. ఆ రాత్రి భోజనం చెయ్యలేదు. కనీసం ఫ్రెష్ అవకుండా బెడ్ పై జారబడి ఆలోచిస్తున్నాడు.

ఆమెను చూస్తుంటే తన విమలా అనిపిస్తుంది. అసలు విమల అయితే అంత ధీనమైన సాధారణ స్థితిలో ఎందుకు ఉంటుంది. అయినా ఇదంతా నా భ్రమ అని అనుకొని నిద్రలోకి జారుకున్నాడు



సీన్ – 57



ఒక వారం గడిచింది. రోజు శైలజ అమెరికా నుంచి రాము కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. రాము కి ఆ రోజు నుంచి ఆమె ఆలోచనలు వెంటాడుతూనే ఉన్నాయి. కానీ ఏం చెయ్యాలో అర్ధం కావడంలేదు. అసలు ఆమె ని ఎలా కలవాలి, ఇంతకీ ఆమె తన విమలేనా…అని తల పగిలే లా ఆలోచిస్తున్నాడు. కానీ బయటకు మాత్రం తన పనులు సజావుగా చేసుకుంటున్నట్లు నటిస్తున్నాడు.

ఒక రోజు రాము కి ఒక ఆలోచన వచ్చింది. తన ఛారిటీ సర్వీస్ టీం హెడ్ ని పిలిచి,

రాము : ఈ నెల సర్వీస్ కాంప్ నాచారం మురికివాడల్లో ఏర్పాటు చెయ్యండి.

సర్వీస్ టీం హెడ్ : సారీ సార్…ఆల్రేడీ లాస్ట్ మంత్ షెడ్యూల్ చేసేశాం. ఈ నెల ఓల్డ్ ఏజ్ హోం లో ఉంటుంది.

రాము : ప్లీజ్ పోస్ట్ పోన్ ఇట్ టు నెక్ట్స్ మంత్. ఈ సారి నేను చెప్పినట్లు చెయ్యండి. వెళ్లి అక్కడ సర్వే చేసి , అక్కడ వారికి కావలసిన ఏర్పాట్లు చూడండి. ఈ సారి కాంప్ శనివారం కాదు ఆదివారం పెట్టండి

సర్వీస్ టీం హెడ్ : సరే.. సార్…(బయటకు వస్తూ… ఏంటి సార్ అంత ప్రత్యేకంగా చెప్పారు అని మనసులో అనుకుంటున్నాడు)

రాము కి రోజూ ఇంట్లో ఒంటరిగా ఉండడం, బస్ స్టాప్ లో తాను చూసింది విమలా కాదా అనే సంశయం తో , తెలియకుండా నే తన బాల్యం, చిన్నతనంలో రోజులు గుర్తు చేసుకుంటూ గడుపుతున్నాడు.

సర్వీస్ కాంప్ నాచారం లో ఏర్పాటు చేసిన రోజు రానే వచ్చింది. ముందు రోజు రాత్రి అంతా రాము ఆలోచిస్తూనే ఉన్నాడు. రాముతో పాటు ఆఫీస్ టీం అందరూ నాచారం లో రామాలయం దగ్గర ఏర్పాటు చేసిన ప్రదేశానికి చేరుకున్నారు.

నాచారం లో అప్పటికే రెండు రోజుల ముందు నుంచే దండోరా, బ్యానర్లు, పోస్టర్లు ద్వారా ప్రజలకు తెలియచేసారు. వైద్య శిబిరం, బట్టల పంపిణీ, పేద పిల్లల చదువులకు ఫీజు లు వంటివి ఎవరో కంపెనీ వారు ఉచితంగా ఇస్తారంటా అని ప్రజలందరూ ముందు గానే చెప్పుకొని ఉదయం పది గంటలకు రామాలయం దగ్గర కి చేరారు. విమల కూడా వాల్ పోస్టర్స్, బ్యానర్లు చూసింది. వాటిపై “V soft solutions “ అని రాసి ఉండడం చూసింది.

విమల ఎరుపు రంగు కాటన్ చీర లో, తన పిల్లలు తో కలిసి రామాలయం దగ్గర సభలో అందరితో స్టేజి కి పాటు దూరం గా కూర్చుంది. ఆ ప్రదేశం అంతా పండుగ వాతావరణం లా కోలాహలంగా ఉంది.

సేవా కార్యక్రమాలు మొదలు పెట్టే ముందు V soft solutions కంపెనీ గురించి, విజయాలు, వారు చేసిన సేవలు టీం హెడ్ మాట్లాడుతూ…. “ ఇప్పుడు V soft solutions అధినేత, CEO, MD శ్రీ రాము గారు స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడవలసింది గా కోరుతున్నాను “ అని రాము ని ఆహ్వానించారు.

అక్కడ ప్రజలు చప్పట్లు తో ఆ ప్రదేశం అంతా మారు మోగింది. రాము అనే పేరు వినగానే జనం మధ్యలో ఉన్న విమలకి ఒళ్లు జలదరించింది. తేరుకునే లోపు సూటులో ఉన్న వ్యక్తి స్థేజి మీదకు వచ్చి మాట్లాడుతూ ఉంటే,…విమల కి అతనిని చూస్తుంటే తన రాము యేనా, అలాగే ఉన్నాడు, ఎప్పుడో 25 సంవత్సరాలు అయిపోయింది చూసి, తనా కాదా, అని అనుకుంటూనే కాళ్లు చేతులు వణుకుతున్నాయి విమలకి. నెమ్మదిగా తన చీర కొంగు ని తలపై నుండి చుట్టుకుంది, తన ముఖం పూర్తి గా కనపడకుండా.

రాము మైక్ లో మాట్లాడుతూ “ ఈ కంపెనీ గొప్ప తనం అంతా ఉద్యోగులదే, నేను ఒక సాధారణ స్థాయి కంటే చిన్న కూలీ కుటుంబం నుంచి ఎందరో సహయ సహకారాలు వలన ఈ స్థితి కి వచ్చాను . నా సొంత ఊరు సిరిసిల్ల అని చెప్పగానే విమలకి ఆనందం తో కళ్లు తిరిగి పోయి, ఏడుపు ఆపుకోలేక మనసు లో నా రాము…నా రాము…. నా రాము అనుకుంటూ ఏడుస్తుంది.

రాము స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు కానీ ఆ రోజు బస్ షెల్టర్ లో చూసిన ఆమె కనిపిస్తుందేమో అని , తన కళ్లతో ఆ జనం మధ్యలో అందరినీ ఆతృతగా వెతుకుతున్నాడు.

రాము అలా మాట్లాడుతూ దూరంగా ఎరుపు రంగు చీర లో ఇద్దరు ఎదిగిన పిల్లలు తో కూర్చుని ఉన్న ఆమె ను చూసి, మనసు లో నో డౌట్, అదే శారీ కలర్, ఆమే, వెళ్లి ఆమె ఎవరో ,  ఏంటో అడగాలి అనుకుని తన స్పీచ్ ముగించి స్టేజ్ దిగి , తన టీం కి ప్రోగ్రాం కంటిన్యూ చెయ్యమని చెప్పి,…. ఆమె కూర్చున్న వైపు వెళ్లాడు.

అప్పటికే ఆమె అక్కడ నుండి తన పిల్లలు తో దూరం గా ఆ ప్రదేశం నుంచి నడిచి వెళ్ళి పోతూ ఉండడం గమనించి, కొంచెం వేగం గా నడుస్తూ , చిన్నగా పరుగులు పెడుతున్నాడు రాము.

అప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటలు అయింది. అప్పటి కి ఆమె ఒక వీధి మలుపు తిరిగింది. ఊరిలో జనం అంతా రామాలయం దగ్గర ఉండడం వలన వీధి నిర్మానుష్యంగా ఉంది. రాము ఆమె కి దగ్గరగా వెళ్ళి వెనుక నుండి నెమ్మదిగా ఏమండీ…ఏమండీ అని రెండు సార్లు పిలిచాడు….ఆ పిలుపు ఆమె కి స్పష్టం గా వినపడలేదు……. అప్పుడే రాము ఒక్కసారి గా గట్టి గా “ విమలా” అని ఆకాశం దద్దరిల్లే లా అరిచాడు. ఆమె అడుగు ఆగిపోయింది. ఆకాశం లో మండుటెండలో ఒక కాకి అరుస్తూ ఉంది. ఆమె ఒక్క సారి వెనక్కి తిరిగి రాము ని చూసింది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. తన రెండు చేతులు ఇద్దరి పిల్లలు భుజాల పై ఉన్నాయి.

రాము కి ఇప్పుడు స్పష్టంగా ఆ ముఖం చూసేటప్పటికీ అర్దం అయింది, ఆమె తన విమలే అని. రాము విమలని అలా చూస్తూ మోకాళ్ళపై కుప్ప కూలి పోయాడు. విమల నుదుటన బొట్టు లేదు. కాళ్లు బోసిగా ఉన్నాయి. చేతికి గాజులు కూడా లేవు, ఆ నలిగిన పాత వెలిసిన చీర, పిల్లల నలిగిన పాత బట్టలు అవన్నీ చూస్తూ , రాము తట్టుకోలేక నుండి వీధిలో ఏడుస్తున్నాడు.

విమల రెండు అడుగులు ముందుకు వేసి “రాము” ….మీ రు రాము అనేటప్పటికీ రాము కి గుండె పగిలి నట్లు అయింది. ఎందుకంటే రాము కి “మీ రు” అని విమల పిలిచిన పదం జీర్ణించుకోలేకపోతున్నాడు.

అసలు ఇలాంటి పరిస్థితుల్లో విమలను చూస్తాడని రాము ఏనాడూ అనుకోలేదు.


రాము వేగం గా స్టేజ్ దిగి వెళ్లడం చూసి , రాము ఆఫీస్  పి.ఏ., ..... రాము వెనుక నే  ఫాలో అవుతూ వస్తూ జరుగుతున్నదంతా చూస్తున్నాడు.


మిగిలినది ఎపిసోడ్ – 16

యడ్ల శ్రీనివాసరావు 4 Sep 2022.








Friday, September 2, 2022

240. కలల కుమారా … ఓ సుకుమార

 

కలల కుమారా … ఓ సుకుమార



• నిన్నే చూస్తున్నా     నిన్నే చూస్తున్నా

  ఉదయించిన   సూర్యుడి లా   నిన్నే చూస్తున్నా

• నీకై వస్తున్నా       నీకై వస్తున్నా

  నీ వెలుగే   చూడాలని   నీకై  వస్తున్నా.


• నీ కిరణం    నన్ను    తాకింది

  ఒక వెలుగై   నన్ను నాకు   చూపింది.

• నీ మాటే    నన్ను    మీటింది

  ఒక రాగమై    అనురాగం    చూపింది.


• నా కన్నుల   కేమయిందో    

  కలలే   కంటున్నాయి

• కలల కుమారా     ఓ  సుకుమారా

• కలలకు  ఎందుకు  తెలియదు

  నాకొక   వలయం   ఉందని

  

• నిన్నే చూస్తున్నా        నిన్నే చూస్తున్నా

  ఉదయించిన    సూర్యుడి లా   నిన్నే  చూస్తున్నా

• నీకై వస్తున్నా       నీకై వస్తున్నా

  నీ వెలుగే   చూడాలని    నీకై  వస్తున్నా


• నీ చూపుల   భాషకి   భావం  నేనని

  నీ   ఆశల     ఊహకి  రూపం  నేనని 

  తెలిసాక

• ఏమిటో  నా ఊపిరి   

  ఎదకే   భారమవుతుంది.


• నిను విడవలేను       నీతో నడవలేను

• ఏమి చెప్పగలను      ఏమి చేయగలను

• కలల కుమారా       ఓ సుకుమార

• కలలకు   ఎందుకు   తెలియదు

  నాకొక వలయం ఉందని


• నిన్నే చూస్తున్నా       నిన్నే చూస్తున్నా

  ఉదయించిన   సూర్యుడి లా    నిన్నే  చూస్తున్నా

• నీకై వస్తున్నా       నీకై వస్తున్నా

  నీ వెలుగే    చూడాలని    నీకై వస్తున్నా.



యడ్ల శ్రీనివాసరావు 3 Sep 2022 12:30 AM

















139. కళాశాల 1980 ఎపిసోడ్ - 14

 

కళాశాల 1980

ఎపిసోడ్ - 14



సీన్ – 53


అది 2012 లో సంవత్సరం. రాము ఆఫీస్ పెట్టి సుమారు 10 సంవత్సరాలు కావస్తోంది. రాము పిల్లలు చదువులు పూర్తి చేసి అమెరికా లో నే ఉద్యోగం లో చేస్తున్నారు. రాము కి  48 సంవత్సరాలు.  

ప్రిన్సిపాల్ గారు, రాజారాం గారు కూడా రిటైర్ అయిపోయారు. దాదాపు వారు 70 సంవత్సరాల వలన అనారోగ్య సమస్యలు ప్రారంభమయ్యాయి.

శైలజ తల్లి పావని ఆరోగ్యం చాలా పాడైయింది. వాళ్లందరికీ రాము ఒక దైవం లా అనిపిస్తుంటాడు.

రాజారాం, పావని, రాము, శైలజ, ప్రిన్సిపాల్ గారు వీలు కుదిరినపుడు కుటుంబ సమేతంగా కూర్చుని పాత జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటూ రాము జీవిత ప్రయాణం గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు.

అటువంటి సమయంలో రాము కి  తన తల్లి తండ్రులు, విమల, ఇంకా తన బాల్యం గుర్తు వస్తుంది. వాళ్లు లేని  తనకు లోటుగా అనిపిస్తుంది.  కానీ బయటకు మాట్లాడక అందరితో నవ్వుతూ గడిపెస్తూ,  లోపల ఆ ఒంటరితనం అనుభవిస్తుంటాడు.  తనకు ఇదంతా ఒక యాంత్రికంగా అనిపిస్తుంది.

ఒకసారి ఇదే విధంగా అందరూ కలిసి మాట్లాడుకున్న తరువాత ,

రాము ఒంటరిగా ప్రిన్సిపాల్ గారిని గదిలో కలిసి…

రాము :  సార్…. నేను మీతో ఒక విషయం మాట్లాడాలి నెమ్మదిగా అన్నాడు.

ప్రిన్సిపాల్ గారు : చెప్పు రాము…

రాము :   అదే సార్…. విమల గురించి, తాను ఎక్కడ ఉందో మీకు తెలుసా…లేదంటే సిరిసిల్ల లో విమల తల్లి ని అడిగితే తెలుస్తుంది కదా..

ప్రిన్సిపాల్ గారు : ఒక్కసారి ఆశ్చర్యంగా…ఏంటి రాము…నువ్వు ఇంకా విమలని మరచి పోలేదా

రాము :  ష్‌‌…ష్…సార్…నెమ్మదిగా…. అంటే నా ఉద్దేశ్యం నేను ఇంత ఉన్నత స్థితికి రావడానికి మెదటి బీజం విమల, తరువాత మీరందరూ కలిసి నన్ను ఈ స్థితి కి తీసుకు వచ్చారు. అటువంటిది,  మీరందరూ నా ఎదుగుదల చూసారు.  కానీ విమల కి నేను ఎలా ఉన్నానో తెలియదు కదా…తనను ఒకసారి చూసి బుణం కొంతైనా తీర్చుకోవాలని….

ప్రిన్సిపాల్ గారు : రాము…నిజం చెప్పు, నువ్వు ఇంకా విమలను ప్రేమిస్తున్నావా….

రాము : తల దించుకుని…. లేదు సార్…అని తనకు ప్రిన్సిపాల్ గారు పై ఉన్న గౌరవం చూపించాడు.

ప్రిన్సిపాల్ గారు : చూడు రాము……మీ ప్రేమ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు విమలని కలిసి తరువాత , నీకు శైలజ తో ఏమైనా ఇబ్బంది వస్తుందేమో ఆలోచించు. (అని మనసులో రాము గురించి ఆందోళన చెందుతున్నారు)

రాము : సార్…. నేను ఈ రోజు వరకు మీ మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు…సరే మీ ఇష్టం సార్ అన్నాడు దిగులు గా…


ప్రిన్సిపాల్ గారికి  రాము మాటలకు జాలి వేసింది. ఎందుకంటే ఆయనకి తెలుసు ప్రేమ ఎంత బలమైనదో,  ప్రేమికులు తమ ప్రేమ కోసం మాత్రమే జీవిస్తారని,  అందు కోసం ఏదైనా చేస్తారని.


రాము మాత్రం తన ప్రయత్నం ఆపలేదు. ఒకసారి రాము తనకున్న పలుకుబడితో విమల గురించి జగిత్యాల లో అడ్రస్ కనుక్కునేందుకు ప్రయత్నించాడు. కానీ విమల కుటుంబం జగిత్యాల లో లేరని తెలిసి నిరాశ చెందాడు.


సీన్ -54


రాము సంపాదన కోట్ల లో ఉంటుంది. ఎన్నో ఛారిటీలకు లక్షల్లో విరాళాలు ఇస్తున్నాడు. ఎంతో మంది పేద పిల్లలకు చదువులు చదివిస్తున్నాడు.

ఒకరోజు రాత్రి పడుకునే ముందు రాము శైలజ తో అంటున్నాడు.

రాము :  శైలు…నా కొక ఆలోచన వచ్చింది. మనకి పిల్లలు కి కావలసినంత ఆస్తి సంపాదించుకున్నాము. కానీ ఈ డబ్బు ఇంకా పెరుగుతూ నే ఉంది. 

అందుకే నేను ఇకనుంచి సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా చెయ్యాలని,  అది కూడా మన కంపెనీ ఉద్యోగుల ద్వారా కొన్ని మురికి వాడలు, ఊరు శివార్లలోని ప్రాంతాల్లో నెలకు ఒకసారి ఉద్యోగులు అందరినీ తీసుకు వెళ్లి వారి చేత సర్వీస్ కేంప్ లు పెడితే , వ్యక్తిగతం గా ఉద్యోగులు అందరికీ సేవా భావం అలవాటు అవుతుంది. 

మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. సాటి మనుషులను ప్రేమిస్తారు…. పైగా వారి సొంత ఖర్చు ఏం ఉండదు. అంతా కంపెనీ ఫండ్…. ఏమంటావు…. అన్నాడు.

రాము చెపుతుంటే…. అలా వింటూ మనసు లో అనుకొంటుంది. మట్టిలో మాణిక్యాలు అంటే ఇలానే ఉంటారనుకుంటా…. రాము తన గతాన్ని, మూలాల్ని ఎప్పుడూ మరచి పోడు…. అని  తేరుకుని...


శైలజ :  మీది చాలా గొప్ప ఆలోచనండి. మీలా ఎవరు ఆలోచించగలరు. మనకి ఏ లోటూ లేదు. 

మీ ఇష్టమే నా ఇష్టం…. ఎప్పుడైనా, అది ఎలాంటి విషయం లో నైనా….

(అని అనేసి శైలజ మనసులో అనుకుంటుంది. రాము తన ప్రేమను , ప్రేమించిన అమ్మాయి ని  కోల్పోయాడు,  అయినా సరే తన ప్రేమను సాధ్యమైనంత వరకు ఎలాగైనా అందరికీ పంచుతూనే ఉంటాడు.)

రాము :  ధాంక్స్…శైలు..


రాము వెంటనే మరుసటి రోజు ఒక టీం ఏర్పాటు చేసి తన కార్యాచరణను మొదలు పెట్టాడు. నెలకు ఒకరోజు ఆఖరి శనివారం తప్పనిసరిగా ఒకొక్క ప్రాంతంలో సేవా కార్యక్రమాలు , పుస్తకాలు పంపిణీ, బట్టలు, ఆహారం, మందులు, వికలాంగులకు అవసరమైన సాధనాలు, రక్త దానం, ఇలా అనేక రకాలైన సేవలతో ప్రారంభించాడు. అందుకోసం చాలా ధనం ఖర్చు పెట్టే వాడు. ఉద్యోగులతో పాటు తాను తప్పని సరిగా ఆ యా ప్రాంతాలకు వెళుతూ ఉండేవాడు.

రాము ఇవన్నీ ఎంత చేసినా, మనసు లో మాత్రం ఒక బలమైన కోరిక ఉండేది…. ఎలాగైనా ఎప్పటికైనా విమలను చూడాలి, కలవాలి అని…. ఎందుకంటే తనకు తెలుసు తాను ఈ రోజు ఏం చేస్తున్నా , అది విమల సంకల్పం అని.


సీన్ – 55


కొన్ని నెలల తరువాత…

ఒక రోజు శైలజ తల్లి పావని తీవ్ర అనారోగ్యంతో మరణించింది. రాజారాం కి తీరని లోటు. మానసికంగా చాలా బలహీనం పడ్డాడు . రాము పిల్లలు అమెరికా నుంచి వచ్చి వెళ్లారు. శైలజ కి తల్లి చూపించిన ప్రేమ పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడేది.

రాము కి మాత్రం తాను 17 సంవత్సరాల వయసు లో ఎంసెట్ కోచింగ్ కోసం వచ్చినప్పుడు , తనను సొంత పిల్లాడి లా పావని చూసిన రోజులు గుర్తు చేసుకుంటూ తనకు మరో తల్లి దూరం అయిందని బాధపడే వాడు.

రాము తల్లి తండ్రులు తన చిన్నతనం లో నే , పెద్ద గా ఊహ , లోకజ్ఞానం తెలియని వయసు లో చనిపోవడం వలన మరణం అంటే ఏంటో అంతగా తెలియలేదు. 

కానీ ఇప్పుడు ఒక మనిషి చావు అంటే ... ఇక శాశ్వతం గా వారు మనతో ఉండరూ అని తెలిసి, కాళ్లు వణికే భయంతో బాధగా అనిపిస్తుంది రాము కి…. ఎందుకంటే ఆ భయం, బాధలో తన ప్రేమ కి ప్రతిరూపం ఎక్కడైనా   ఉందేమో  అనే ఆలోచన.

నెమ్మదిగా పావని మరణ విషాదం లో నుంచి అందరూ కోలుకుంటున్నారు.


ఒకరోజు ప్రిన్సిపాల్ గారు రాజారాం కి ఫోన్ చేసి..


ప్రిన్సిపాల్ గారు : రాజారాం…ఏరా ఎలా ఉన్నావు.

రాజారాం : పరవాలేదు రా…

ప్రిన్సిపాల్ గారు : నేనొక మాట అంటాను కాదనవు కదా…

రాజారాం : లేదు…చెప్పు.

ప్రిన్సిపాల్ గారు : నువ్వు కొన్ని రోజులు సిరిసిల్ల వచ్చేయి…. నాతో కలిసి ఉందువు…కొంచెం వాతావరణం మార్పు వస్తుంది. నువ్వు ఒక్కడివే ఉంటే…పావని జ్ఞాపకాలతో ఇంకా ఎక్కువ బాధపడతావు…. అసలే నీ ఆరోగ్యం కూడా అంతంత గా ఉంది.

రాజారాం : లేదు రా…. నేను రాలేను.

ప్రిన్సిపాల్ గారు : నువ్వు అలా అనకు…నా కోసం…. నేను రాము కి, శైలజా కి కూడా ఫోన్ చేసి చెపుతాను…వారు ఏర్పాట్లు చేస్తారు.

రాజారాం : సరే …రా…నీ ఇష్టం.

రాజారాం , పావని చాలా అన్యోన్యంగా ఉండే వారు…రాజారాం తన జీవిత కాలంలో ఎప్పుడు ఏం చెప్పినా పావని నో చెప్పేది కాదు...

రాజారాం కి పావని పై ప్రేమ బ్రతికి ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది…బహుశా మనిషి లేని లోటు వల్లనేమో...


ప్రిన్సిపాల్ గారు రాము, శైలజా కి ఫోన్ చేసి రాజారాం ని పంపించే ఏర్పాట్లు చేయించారు.

ఒకరోజు రాజారాం తన మిత్రుడు ఇంటికి సిరిసిల్ల వెళ్ళాడు. ప్రిన్సిపాల్ గారి ఇంటికి రావడం రాజారాం కి కొంత తేలికగా ఉంది. వారిద్దరూ చిన్న నాటి మిత్రులు. కలిసి ఎన్నో జ్ఞాపకాలు పంచుకునే వారు. ఆ బాల్య జ్ఞాపకాలు వారికి మంచి శక్తి, ఆనందం ఇస్తున్నాయి.

ఒక రోజు రాత్రి పడుకునే సమయంలో రాజారాం తన మిత్రుడు తో ….తన వయసు మరచి పోయి మనసు తెరిచి మాట్లాడుతున్నాడు.

రాజారాం : ఒరేయ్…పావని నా అదృష్టం రా…తనను నేను బంధువుల పెళ్ళిలో చూసి ఇష్ణపడి, పెద్దలతో చెప్పి పెళ్లి చేసుకున్నాను. తన అందం కంటే మనసు మంచిది రా. నన్ను చాలా విషయాల్లో గైడ్ చేసేది. నాకు ఆఫీస్ లో కానీ ఎక్కడ ఎప్పుడు టెన్షన్ ఉన్నా తనను చూస్తే చిన్న పిల్లాడిలా అయిపోయే వాడిని…ఒక తల్లి ప్రేమ చూపించేది రా…ఏ రోజు  ఏ విషయం లోనూ  కోపం తెచ్చుకునేది కాదు…తను నాకు ధైర్యం, సర్వస్వం రా...తను లేకపోతే ఈ జీవితం ఇంతవరకూ వచ్చేది కాదు.

రాజారాం చెపుతుంటే  ప్రిన్సిపాల్ గారు నిస్తేజంగా వింటున్నారు

రాజారాం : అంతెందుకు రా….. నువ్వు రాము ని పంపించినపుడు …పావని ఏమైనా అభ్యంతరం పెడుతుందేమో అని సంశయించాను. ఎందుకంటే ఎదిగిన ఆడపిల్ల ఇంటిలో ఉంది కదా,  తల్లి గా ఏమైనా అంటుందేమో అనుకున్నాను. కానీ తనకు నామీద, నీమీద…నువ్వు పంపిన రాము మీద మంచి నమ్మకం పెట్టుకుని చూసింది….. అంతెందుకు రా , రాము ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాక, విమల రాము ల  ప్రేమ విషయం తెలిసి కూడా ఒక్కమాట నాతో ఏరోజు, ఏమీ అనకుండా రాము మీద నమ్మకం ఉంచి , సొంత బిడ్డలా చూసింది ….ఆ ఫలితమే కదరా ఈ రోజు రాము అత్యుత్తమ స్థితి కి ఒక కారణం అయింది. అసలు ఎవరు ఉంటారు రా…ఇలా…

ప్రిన్సిపాల్ గారు తెలియకుండా నే రాజారాం మాటలు విని కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు…పావని గురించి.

ప్రిన్సిపాల్ గారు : అవును రా…నువ్వు చెప్పింది. అక్షరాల నిజం. దేవుడు దేవతా స్త్రీ లను ఎందుకు సృష్టించాడొ పావని ని చూస్తే నే అర్దం అవుతుంది…

రాజారాం : నా కేమి అనిపిస్తుందో తెలుసా…రా…

ప్రిన్సిపాల్ గారు : బాధపడకు రా…చెప్పు…

రాజారాం : నన్ను పావని పిలుస్తున్నట్లు అనిపిస్తుంది రా…. నేను పావని దగ్గరకు వెళ్ళి పోతాను రా ….. తాను లేకుండా నేను ఉండలేను.

ప్రిన్సిపాల్ గారు : రాజారాం ఊరుకో రా…చిన్న పిల్లాడిలా…ఈ మంచి నీళ్ళు తాగి, ప్రశాంతంగా నిద్ర పో…రేపు మాట్లాడు కుందాము.

రాజారాం : సరే…

ప్రిన్సిపాల్ గారు : రాజారాం మాటలు విని ఆలోచిస్తూ, ప్రేమ అనేది కోరుకున్న మనిషి దగ్గర లేకపోతే ఎంత పిచ్చి వాడిని చేసెస్తుందో తనకు అర్దం అవుతుంది. దానికి వయసు తో సంబంధం లేదని అనుకున్నాడు. మనసు లో రాము, విమల గుర్తు వచ్చి నెమ్మదిగా నిద్రలో కి జారుకున్నాడు.

మరుసటి రోజు ఉదయం

ప్రిన్సిపాల్ గారు లేచారు….తన మిత్రుడు రాజారాం ఇంకా పడుకొని ఉన్నాడు.

సరే లే మంచి నిద్ర లో ఉన్నాడు.. కాసేపు ఆగి లేపుదాం అనుకొని ఫ్రెష్ అయి …మరలా వచ్చి

చూసి లేపుతుంటే ….తన చిరకాల మిత్రుడు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు .

భోరున విలపిస్తూ రాము శైలజ లకి ఫోన్ చేసాడు.


మిగిలినది ఎపిసోడ్ -15 లో

యడ్ల శ్రీనివాసరావు  2 Sep 2022.




Thursday, September 1, 2022

139. కళాశాల 1980 ఎపిసోడ్ - 13

 

కళాశాల 1980

ఎపిసోడ్ - 13




సీన్ – 51


  అది 2001 వ సంవత్సరం. సాంకేతిక రంగంలో ప్రపంచంలో చాలా మార్పులు వస్తున్నాయి. రాము ఇండియా లో హైదరాబాద్ లో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ మొదలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. రాము తన పిల్లలు ఇద్దరు హైస్కూల్ చదువు తున్నారు. వారిని అమెరికాలో నే ఉంచి చదివించాలనుకున్నారు, రాము శైలజ.


కొన్ని రోజుల తరువాత రాము అమెరికా లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా వచ్చి, తన కొత్త కంపెనీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు.   తన కంపెనీ పేరు Victory soft solutions అని పేరు పెట్టాడు “ V soft “ గా అభివృద్ధి చెందుతుంది. మొదట చిన్నగా 30 మంది తో మొదలైంది.  తనకు అమెరికా లో ఉన్న అనుభవం, పరిచయాల తో ప్రాజెక్టులు సంపాదించి అతి తక్కువ కే చెయ్యడం మొదలు పెట్టాడు.

మరిన్ని ప్రాజెక్టులు రావడం వలన స్టాఫ్ ను 150 వరకు పెంచి అభివృద్ధి చెందుతున్నాడు.

రాము కి ఇదంతా అంత కష్టం గా అనిపించడం లేదు. రాము కి మూడు సంవత్సరాల కాలంలో నే సాఫ్ట్వేర్ మార్కెట్ లో మంచి పేరు వచ్చింది.

V soft లో నెమ్మదిగా 500 మంది స్టాఫ్ అయ్యారు. పెద్ద కంపెనీల తో సమానం గా నడుస్తుంది. డబ్బు తో పాటు సమాజం లో రాము పేరు, గౌరవం బాగా పెరిగింది.

రాము తన జీవితం ఎంత బిజీగా ఉన్నా, కుటుంబం, శైలజ పిల్లలు తో క్రమం తప్పకుండా గడుపుతున్నాడు. అదే తనకు కొంచెం విశ్రాంతి గా ఉండేది. 

రాము కి  తన జీవితం లో ఎంత ఎదుగుతున్నా ఒక వెలితి ప్రతీ క్షణం వెంటాడుతూనే ఉంది, అది విమల గురించి.  విమల ఎక్కడ ఉందో..., ఎలా ఉందో... అని ప్రతీ రోజు ఆలోచిస్తూ నే ఉంటాడు.  విమల కోసం కొన్న డైమండ్ రింగ్ ఎప్పటి కైనా  ఇవ్వాలని అప్పుడప్పుడు ఆ ఉంగరం బీరువా నుంచి తీసి చూసుకుంటూ ఉండేవాడు.

రాము జీవితం శైలజ, రాజారాం దంపతులతోను సాఫీగా సాగిపోతుంది. ప్రిన్సిపాల్ గారు కూడా అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళుతున్నారు. రాము ఇద్దరు పిల్లలు అమెరికా లో నే చదువుతూ సంవత్సరానికి ఒకసారి ఇండియా వచ్చి వెళుతున్నారు.



సీన్ – 52



విమల భర్త శేఖర్,  హైదరాబాద్  నాచారం లో  మెదలు పెట్టిన కోళ్ల ఫారం బాగా కలిసి వచ్చింది. శేఖర్ కి వ్యాపారం బాగా కలిసి డబ్బు రావడం తో పరిచయాలు, కొత్త స్నేహితులు పెరిగారు. విమల కి భర్త విషయం లో  స్నేహితులతో ఎక్కువ గడపడం  నచ్చేది కాదు. విమల పిల్లలు ఇద్దరు హైదరాబాద్ లో నే కాలేజీ చదువులు చదువు తున్నారు.


ఒకరోజు రాత్రి శేఖర్ బాగా తాగి కారు నడుపుతూ రాత్రి ఇంటికొచ్చి కాలింగ్ బెల్ నొక్కాడు.

విమల :  ఆ…వస్తున్నా అని తలుపు తీసింది

శేఖర్   :    ఏం…ఎంతసేపు, అడ్డం గా తిని పడుకున్నావా…అని నోటికొచ్చినట్టు తాగిన మైకం లో అరుస్తున్నాడు.


(విమల కి భర్త తాగుడు అలవాటు ఉందని తెలుసు కానీ ఈ మధ్య స్నేహల వలన విపరీతం అవుతుందని అర్దం అయింది. అందుకే తరచూ హెచ్చరించేది.)


విమల :  శేఖర్ మాటలు సహించలేక పోయింది వెంటనే,  సీరియస్ గా  ఆ…. తిని పడుకున్నాను...అంది

శేఖర్ :   ఎవరితో 

విమల : నిర్ఘాంత పోయింది….ఆ.. నాకు నచ్చిన వాడితో….

(విమల కి దుఃఖం వస్తుంది కానీ అదుపు చేసుకోలేక పోతుంది.)

శేఖర్ :  ఆ సమాధానం విని….విమల ను చెంప మీద కొట్టాడు.

వారిద్దరి గొడవకి పిల్లలు నిద్ర లేచి బయటకు వచ్చి జరిగింది అంతా చూస్తున్నారు. శేఖర్ ప్రవర్తన పిల్లలకి నచ్చులేదు.


విమల కి ఆ రాత్రి అంతా కాళరాత్రి లా గడిచింది. శేఖర్ అన్న మాటలకు దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూనే ఉంది. 

సరిగ్గా అదే సమయంలో చాలా రోజుల తర్వాత రాము గుర్తు కి వచ్చాడు విమలకి. బోర్లా పడుకుని దిండు లో తలపెట్టుకుని రాము…రాము…రాము…అని వెక్కి వెక్కి ఏడ్చింది.

మరుసటి రోజు ఉదయం పిల్లలు లేచి, విమల ఇంకా పడుకొని ఉండడం చూసి తల్లి ని లేపకుండా నే కాలేజీ కి వెళ్ళి పోయారు.

ఉదయం పది గంటలకు విమల, శేఖర్ లేచారు.

శేఖర్ కి పశ్చాత్తాపం కంటే అహం తోనే ఉన్నాడు. విమలకి కూడా శేఖర్ మీద భర్త అనే గౌరవం ఆ రోజు నుంచి సన్నగిల్లింది.


విమల కుటుంబం లో తెలియని పగుళ్లు వచ్చాయి. పిల్లలు విమలతో తప్ప, శేఖర్ తో ఆనందంగా ఉండలేక పోతున్నారు. దీనికి తోడు శేఖర్ ప్రవర్తన తాగుడు, విలాసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

శేఖర్ కి ఒక ధీమా కూడా వచ్చేసింది. తన వ్యాపారం పనివాళ్ల మీద సజావుగా జరిగిపోతుంది కదా…నాకేంటి అనుకున్నాడు.

రోజులు గడుస్తున్నాయి. మిత్రుడి సలహా మీద శేఖర్ సినిమా ఇండస్ట్రీ లో పెట్టుబడి పెట్టే వారికి ఎక్కువ వడ్డీ కి అప్పులు ఇవ్వడం మెదలు పెట్టాడు. మొదట్లో రిటర్న్ బాగా వచ్చేసేవి.

అది చూసి ఆశపడి తన దగ్గర ఉన్నదే కాక బయట తాను స్వయంగా తక్కువ వడ్డీకి అప్పు తెచ్చి , ఎక్కువ వడ్డీ కి ఇచ్చేవాడు.

విమలకి ఇదంతా నచ్చేది కాదు. శేఖర్ తాను స్వయంగా ఏదీ విమలకి చెప్పక పోయినా, శేఖర్ ఫోన్ లో మాట్లాడేటప్పుడు వినేది.

సరిగ్గా కొన్ని నెలలు తరువాత శేఖర్ నెత్తిన పిడుగు పడింది. తాను దాదాపు 10 కోట్లు అప్పు ఇచ్చిన ప్రొడ్యూసర్ గుండె పోటు తో చనిపోయాడు. ఆ డబ్బు లో ఒక్క రూపాయి కూడా తిరిగి వచ్చే అవకాశం కూడా లేదని తెలిసింది.

సరిగ్గా శేఖర్ తిరోగమనం మొదలైంది. తనకు అప్పులు ఇచ్చిన వారికి తీర్చడం కోసం తన దగ్గర ఉన్న స్థలం, చిన్న చిన్న ఆస్తులు అమ్మడం మొదలెట్టాడు. ఈ ఒత్తిడి లో రోజంతా తాగడం అలవాటు అయింది. 

కోళ్ల ఫారం మూతపడింది. అద్దె కట్టడం లేదని స్థలం యజమాని కొంత డబ్బు శేఖర్ కి ఎదురు ఇచ్చి కోళ్ల ఫారం స్వాధీనం చేసుకున్నాడు.

విమలకి జరుగుతున్న దంతా అర్దం అవుతున్నా, శేఖర్ కి ఎంత చెప్పినా వినే వాడు కాదు.

విమల కుటుంబ పరిస్థితులు పూర్తిగా దిగ జారాయి. ఉన్న కొద్ది బంగారం, హైదరాబాద్ లో ఉన్న ఇల్లు కూడా అప్పులు తీర్చడానికి అయిపోయాయి.

విమల మనసు లో ఒకటే అనుకుంది…తాను జీవితం లో తొలి నాళ్లలో ఎలా ఉండేదో, తిరిగి ఆ పరిస్థితి వచ్చింది.

తాము సొంత ఇల్లు అమ్మేసాక, ఒక చిన్న అద్దె ఇంట్లో కి మారారు. పిల్లలు ఇద్దరు ఇంటర్ చదవి మానేసారు. హైదరాబాద్ శివార్లలోని నాచారం అంతా ఇండస్ట్రీయల్ ఏరియా అవడం వలన చిన్న చిన్న పరిశ్రమలు చాలా ఉండేవి. ఇంటికి దగ్గరగా ఉండడం వలన ఒక ఫ్యాక్టరీ లో రోజు కూలీ పనికి విమల ఇద్దరూ పిల్లలు రామలక్ష్మి, రాంబాబు వెళ్తున్నారు.

శేఖర్ తాగి తాగి ఆరోగ్యం పాడుచేసుకుని తక్కువ వయస్సు లో నే మంచానికి పరిమితం అయ్యాడు.

విమలకి రోజులు భారం గా గడుస్తున్నాయి. శేఖర్ కి విమల పై జాలి కలిగేది. విమల ఎంత చెప్పినా, తన అహం వలన విమల మాట వినక ఈ స్థితి కలిగింది అని బాధపడుతూ ఉండేవాడు. మూడు నెలల తర్వాత ఒక ఆదివారం రోజు పిల్లలు , విమల బజారులో సరుకుల కోసం వెళ్లారు. ఆ సమయంలో తిరిగి వచ్చేసరికి శేఖర్ మరణించాడు.

విమల దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూనే ఉంది…కానీ అది తన మనసు లోతుల్లో నుంచి రావడం లేదు. అంతా యాదృచ్చికంగా జరుగుతుంది. ఊరినుంచి విమల తల్లి తండ్రులు, శేఖర్ బంధువులు వచ్చి అన్ని కార్యక్రమాలు జరిపించి వెళ్లారు.

విమల తల్లి తండ్రులు విమలతో, పిల్లలు ను తీసుకుని సిరిసిల్ల వచ్చేయ్యమన్నారు. కానీ విమల అందుకు ఒప్పుకోలేదు.

ఆ రోజు రాత్రి విమల , తన జీవితం గురించి ఆలోచిస్తూ తన మనసు లో రాము జ్ఞాపకాలు, పిల్లలు తప్ప తనకంటూ ఇక ఏమీ లేవని అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంది.

కొన్ని రోజుల తర్వాత విమల కూడా పిల్లలు ఇద్దరు పనిచేసే ఫ్యాక్టరీ లో, క్యాంటీన్ లో వంట మనిషి గా ఉద్యోగం లో చేరింది. ప్రతీరోజూ ఉదయం 9 గంటలకు ముగ్గురు కలిసి పనిలో కి వెళ్లి సాయంత్రం 6 గంటలకు వచ్చేవారు. ఆ చిన్న రెండు గదులు ఇంటిలో ఉంటూ కాలక్షేపం చేసే వారు.

విమల కి తరచూ తన జీవితం బాల్యం లో ఎలా ఉండేది…ఎలా మారిందో అనుకుంటూనే …రాము ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో…. అని ఆలోచిస్తూ ఉండేది.


మిగిలినది ఎపిసోడ్ -14 లో

యడ్ల శ్రీనివాసరావు 2 Sep 2022.




















491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...