కళాశాల 1980
ఎపిసోడ్ - 15
సీన్ – 56
రాము, శైలజకి నిజం గా ఇది కోలుకోలేని బాధ. ఒకే నెలలో తల్లి తండ్రులు ఇద్దరిని కోల్పోవడం షాక్ లా ఉంది శైలజకి. రాము దగ్గర ఉండి శైలజ కి ధైర్యం చెప్పేవాడు. తనకు పెద్దదిక్కు గా ఉన్న ఇద్దరూ ఒకేసారి లేకపోవడంతో ఎన్నడూ లేని రాము కి మొదటి సారిగా కొంచెం భయం వేస్తుంది. అంతకాలం తనతో కలిసి ఉన్న మనుషులు లేకపోతే ఆ ఒంటరితనం అనుభవిస్తున్నాడు.
కాలం మనుషులను మరపింపచేసి మనసు లో ని గాయాలను మరచి పోయేలా చేస్తుంది. శైలజ నెమ్మదిగా కోలుకొని రోటీన్ జీవితం లో కి వచ్చింది.
ఒక రోజు రాము శైలజ తో….
రాము : శైలు…నీకు కొంచెం రిలాక్స్ గా ఉంటుంది పిల్లలు దగ్గరకు, అమెరికా వెళ్ళి ఉండిరా…. ప్రదేశం మారితే అన్ని సర్దుకుంటాయి…. పిల్లలు తో గడిపి నట్లు ఉంటుంది.
శైలజ : లేదండీ…. నాకు ఇప్పుడు వెళ్లడానికి ఇష్టం లేదు.
రాము : అది కాదు…శైలు…. మరలా ఆలోచించి చూడు…
శైలజ : మీరు వస్తారా…..
రాము : లేదు…శైలు…కొన్ని కొత్త ప్రాజెక్టులు వచ్చాయి…. దగ్గర ఉండాలి.
శైలజ : సరే…వెళ్తాను
రాము : రేపే ఏర్పాట్లు చేస్తాను…. నీకు ఇష్టమైన రోజు లు ఉండి రా…
శైలజ : సరే…. అలాగే నండి.
శైలజ ఒక వారం రోజుల తరువాత అమెరికా వెళ్ళింది. రాము యధాలాపంగా తన ఆఫీసు పనిలో బిజీగా ఉంటున్నాడు.
కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం రాము తన కారు లో ఆఫీసునుండి ఇంటికి బయలుదేరాడు. సమయం 5 గంటలు అవుతుంది. ఆఫీస్ నుండి ఇంటికి 20 కిలో మీటర్ల దూరం అయినా హైదరాబాద్ ట్రాఫిక్ వలన ప్రతీరోజూ గంట సేపు పట్టెస్తుంది.
రాము బయలు దేరిన కాసేపటికి ఆకాశం అంతా నల్లని మబ్బులు తో నిండి వర్షం వచ్చేలా చల్లగా మారిపోయింది. చాలా రోజుల తరువాత ఆ వాతావరణం చూసి రాము కి చాలా సంతోషం అనిపిస్తుంది.
కారులో F M రేడియో ఆన్ చేసాడు. ప్రేమలేఖ సినిమా లో “ ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాక వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం” అనే పాట వస్తుంటే, రాము మనసంతా ఒకసారి గా వికలం అయిపోయింది. …ఆ క్షణంలో కారు నడుపుతూ మనసు లో అనుకుంటున్నాడు, అసలు విమల నేను బ్రతికుండగా కనిపిస్తుందా…నేను ఎందుకు విమలను ఇంకా గుర్తు చేసుకుంటున్నాను…. అనుకునే లోపు జోరున వర్షం మొదలైంది. కారు లో వైపర్స్ వేసినాా సరే దారి సరిగా కనిపించడం లేదు. సాయంత్రం ఆరు గంటల అయింది, చీకటి పడుతుంది.
వర్షం బాగా పెరిగింది. దారి కనపడటం లేదు. ఆ సమయంలో కాసేపు ఆగడం మంచిదనిపించి దగ్గర లో రోడ్ పక్కన ఉన్న సిటీ బస్ స్టాప్ ముందు కారు ఆపి, కారులో కూర్చోని…పాటలు వింటూ ఆ వాతావరణం ఎంజాయ్ చేస్తున్నాడు.
ఆ సమయం కొంచెం చీకటి పడుతూ, మబ్బుల వర్షం తో ఉంది. కారు అద్దం పైనుంచి వర్షం నీరు జారుతూ ఉంది. రాము ఏదో ఆలోచిస్తూ బస్ స్టాప్ షెల్టర్ లో కి చూసాడు. ఒక్క అయిదు సెకన్ల లో కళ్లు పెద్దవి చేసి జోరు వర్షం లో మరలా చూసాడు. ఆ బస్ షెల్టర్ లో ఒక స్త్రీ ఒంటరిగా నిలబడి బస్ కోసం చూస్తుంది. ఆమె ఎర్రని నలిగి పోయిన కాటన్ చీర ధరించింది. చేతి లో కాయగూరల సంచి, కాళ్లకి హవాయి చెప్పలు, చింపిరి జుత్తు లో ఒక పేదింటి స్త్రీ లా కనిపించింది. ముఖం బొద్దుగా ఉంది కానీ ఆ వర్షం లో స్పష్టం గా కనపడటం లేదు.
అప్పటి వరకూ మాములు గా ఉన్న రాము లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ ప్రకంపనలు మెదడు కి చేరగానే, రాము కి ఆమె తన విమలే నా, విమల లా అనిపిస్తుందేంటి, అయినా విమల ఒంటరిగా ఇక్కడ ఎందుకు ఉంటుంది అని అనేక ప్రశ్నలు మొదలైన క్షణం లోనే , బస్ షెల్టర్ లో కి వెళ్ళి దగ్గరగా చూడాలని కారు దిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో రాము పక్కనుండి ఒక సిటీ బస్ వచ్చి ఆగింది. రాము వేగం గా కారు దిగి వర్షం లో తడిచి వెళ్లే లోపు ఆమె ఆ బస్ లో ఎక్కి వెళ్లి పోయింది.
రాము ఒక్కసారి గా “ఛ” మిస్ అయింది అనుకొని వేగం గా వచ్చి కారు తీసి బస్ ను ఫాలో అయ్యాడు. బస్ నెంబర్ చూసాడు. నెమ్మదిగా ఆ బస్ నే ఫాలో అవుతూ వెళ్లాడు. మధ్యలో ఏ బస్ స్టాప్ లో ను ఆమె దిగినట్లు అనిపించలేదు. చాలా దూరం వెళ్ళాక ఆ బస్ హైదరాబాద్ ఊరి శివార్లలో నాచారం ఆఖరి బస్ స్టాప్ లో ఆగింది. ఆమె అక్కడ దిగడం గమనించాడు…కానీ అంతలోనే ఆమె ఏదో సందులో కి వెళ్లి కనిపించలేదు.
రాము ఒక్కసారి గా తనకు తాను పిచ్చి వాడిలా అనిపించాడు. సిటీ నుండి దాదాపు 30 కిలో మీటర్ల ఆ బస్ వెనుక వచ్చేసాడు. సమయం రాత్రి 8:30 అయిపోయింది. చేసేది ఏమీ లేక వెను తిరిగి కారు లో ఇంటికి బయలుదేరాడు.
ఇంటికి చేరేటప్పటికి చాలా సమయం అయింది. ఆ రాత్రి భోజనం చెయ్యలేదు. కనీసం ఫ్రెష్ అవకుండా బెడ్ పై జారబడి ఆలోచిస్తున్నాడు.
ఆమెను చూస్తుంటే తన విమలా అనిపిస్తుంది. అసలు విమల అయితే అంత ధీనమైన సాధారణ స్థితిలో ఎందుకు ఉంటుంది. అయినా ఇదంతా నా భ్రమ అని అనుకొని నిద్రలోకి జారుకున్నాడు
సీన్ – 57
ఒక వారం గడిచింది. రోజు శైలజ అమెరికా నుంచి రాము కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. రాము కి ఆ రోజు నుంచి ఆమె ఆలోచనలు వెంటాడుతూనే ఉన్నాయి. కానీ ఏం చెయ్యాలో అర్ధం కావడంలేదు. అసలు ఆమె ని ఎలా కలవాలి, ఇంతకీ ఆమె తన విమలేనా…అని తల పగిలే లా ఆలోచిస్తున్నాడు. కానీ బయటకు మాత్రం తన పనులు సజావుగా చేసుకుంటున్నట్లు నటిస్తున్నాడు.
ఒక రోజు రాము కి ఒక ఆలోచన వచ్చింది. తన ఛారిటీ సర్వీస్ టీం హెడ్ ని పిలిచి,
రాము : ఈ నెల సర్వీస్ కాంప్ నాచారం మురికివాడల్లో ఏర్పాటు చెయ్యండి.
సర్వీస్ టీం హెడ్ : సారీ సార్…ఆల్రేడీ లాస్ట్ మంత్ షెడ్యూల్ చేసేశాం. ఈ నెల ఓల్డ్ ఏజ్ హోం లో ఉంటుంది.
రాము : ప్లీజ్ పోస్ట్ పోన్ ఇట్ టు నెక్ట్స్ మంత్. ఈ సారి నేను చెప్పినట్లు చెయ్యండి. వెళ్లి అక్కడ సర్వే చేసి , అక్కడ వారికి కావలసిన ఏర్పాట్లు చూడండి. ఈ సారి కాంప్ శనివారం కాదు ఆదివారం పెట్టండి
సర్వీస్ టీం హెడ్ : సరే.. సార్…(బయటకు వస్తూ… ఏంటి సార్ అంత ప్రత్యేకంగా చెప్పారు అని మనసులో అనుకుంటున్నాడు)
రాము కి రోజూ ఇంట్లో ఒంటరిగా ఉండడం, బస్ స్టాప్ లో తాను చూసింది విమలా కాదా అనే సంశయం తో , తెలియకుండా నే తన బాల్యం, చిన్నతనంలో రోజులు గుర్తు చేసుకుంటూ గడుపుతున్నాడు.
సర్వీస్ కాంప్ నాచారం లో ఏర్పాటు చేసిన రోజు రానే వచ్చింది. ముందు రోజు రాత్రి అంతా రాము ఆలోచిస్తూనే ఉన్నాడు. రాముతో పాటు ఆఫీస్ టీం అందరూ నాచారం లో రామాలయం దగ్గర ఏర్పాటు చేసిన ప్రదేశానికి చేరుకున్నారు.
నాచారం లో అప్పటికే రెండు రోజుల ముందు నుంచే దండోరా, బ్యానర్లు, పోస్టర్లు ద్వారా ప్రజలకు తెలియచేసారు. వైద్య శిబిరం, బట్టల పంపిణీ, పేద పిల్లల చదువులకు ఫీజు లు వంటివి ఎవరో కంపెనీ వారు ఉచితంగా ఇస్తారంటా అని ప్రజలందరూ ముందు గానే చెప్పుకొని ఉదయం పది గంటలకు రామాలయం దగ్గర కి చేరారు. విమల కూడా వాల్ పోస్టర్స్, బ్యానర్లు చూసింది. వాటిపై “V soft solutions “ అని రాసి ఉండడం చూసింది.
విమల ఎరుపు రంగు కాటన్ చీర లో, తన పిల్లలు తో కలిసి రామాలయం దగ్గర సభలో అందరితో స్టేజి కి పాటు దూరం గా కూర్చుంది. ఆ ప్రదేశం అంతా పండుగ వాతావరణం లా కోలాహలంగా ఉంది.
సేవా కార్యక్రమాలు మొదలు పెట్టే ముందు V soft solutions కంపెనీ గురించి, విజయాలు, వారు చేసిన సేవలు టీం హెడ్ మాట్లాడుతూ…. “ ఇప్పుడు V soft solutions అధినేత, CEO, MD శ్రీ రాము గారు స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడవలసింది గా కోరుతున్నాను “ అని రాము ని ఆహ్వానించారు.
అక్కడ ప్రజలు చప్పట్లు తో ఆ ప్రదేశం అంతా మారు మోగింది. రాము అనే పేరు వినగానే జనం మధ్యలో ఉన్న విమలకి ఒళ్లు జలదరించింది. తేరుకునే లోపు సూటులో ఉన్న వ్యక్తి స్థేజి మీదకు వచ్చి మాట్లాడుతూ ఉంటే,…విమల కి అతనిని చూస్తుంటే తన రాము యేనా, అలాగే ఉన్నాడు, ఎప్పుడో 25 సంవత్సరాలు అయిపోయింది చూసి, తనా కాదా, అని అనుకుంటూనే కాళ్లు చేతులు వణుకుతున్నాయి విమలకి. నెమ్మదిగా తన చీర కొంగు ని తలపై నుండి చుట్టుకుంది, తన ముఖం పూర్తి గా కనపడకుండా.
రాము మైక్ లో మాట్లాడుతూ “ ఈ కంపెనీ గొప్ప తనం అంతా ఉద్యోగులదే, నేను ఒక సాధారణ స్థాయి కంటే చిన్న కూలీ కుటుంబం నుంచి ఎందరో సహయ సహకారాలు వలన ఈ స్థితి కి వచ్చాను . నా సొంత ఊరు సిరిసిల్ల అని చెప్పగానే విమలకి ఆనందం తో కళ్లు తిరిగి పోయి, ఏడుపు ఆపుకోలేక మనసు లో నా రాము…నా రాము…. నా రాము అనుకుంటూ ఏడుస్తుంది.
రాము స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు కానీ ఆ రోజు బస్ షెల్టర్ లో చూసిన ఆమె కనిపిస్తుందేమో అని , తన కళ్లతో ఆ జనం మధ్యలో అందరినీ ఆతృతగా వెతుకుతున్నాడు.
రాము అలా మాట్లాడుతూ దూరంగా ఎరుపు రంగు చీర లో ఇద్దరు ఎదిగిన పిల్లలు తో కూర్చుని ఉన్న ఆమె ను చూసి, మనసు లో నో డౌట్, అదే శారీ కలర్, ఆమే, వెళ్లి ఆమె ఎవరో , ఏంటో అడగాలి అనుకుని తన స్పీచ్ ముగించి స్టేజ్ దిగి , తన టీం కి ప్రోగ్రాం కంటిన్యూ చెయ్యమని చెప్పి,…. ఆమె కూర్చున్న వైపు వెళ్లాడు.
అప్పటికే ఆమె అక్కడ నుండి తన పిల్లలు తో దూరం గా ఆ ప్రదేశం నుంచి నడిచి వెళ్ళి పోతూ ఉండడం గమనించి, కొంచెం వేగం గా నడుస్తూ , చిన్నగా పరుగులు పెడుతున్నాడు రాము.
అప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటలు అయింది. అప్పటి కి ఆమె ఒక వీధి మలుపు తిరిగింది. ఊరిలో జనం అంతా రామాలయం దగ్గర ఉండడం వలన వీధి నిర్మానుష్యంగా ఉంది. రాము ఆమె కి దగ్గరగా వెళ్ళి వెనుక నుండి నెమ్మదిగా ఏమండీ…ఏమండీ అని రెండు సార్లు పిలిచాడు….ఆ పిలుపు ఆమె కి స్పష్టం గా వినపడలేదు……. అప్పుడే రాము ఒక్కసారి గా గట్టి గా “ విమలా” అని ఆకాశం దద్దరిల్లే లా అరిచాడు. ఆమె అడుగు ఆగిపోయింది. ఆకాశం లో మండుటెండలో ఒక కాకి అరుస్తూ ఉంది. ఆమె ఒక్క సారి వెనక్కి తిరిగి రాము ని చూసింది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. తన రెండు చేతులు ఇద్దరి పిల్లలు భుజాల పై ఉన్నాయి.
రాము కి ఇప్పుడు స్పష్టంగా ఆ ముఖం చూసేటప్పటికీ అర్దం అయింది, ఆమె తన విమలే అని. రాము విమలని అలా చూస్తూ మోకాళ్ళపై కుప్ప కూలి పోయాడు. విమల నుదుటన బొట్టు లేదు. కాళ్లు బోసిగా ఉన్నాయి. చేతికి గాజులు కూడా లేవు, ఆ నలిగిన పాత వెలిసిన చీర, పిల్లల నలిగిన పాత బట్టలు అవన్నీ చూస్తూ , రాము తట్టుకోలేక నుండి వీధిలో ఏడుస్తున్నాడు.
విమల రెండు అడుగులు ముందుకు వేసి “రాము” ….మీ రు రాము అనేటప్పటికీ రాము కి గుండె పగిలి నట్లు అయింది. ఎందుకంటే రాము కి “మీ రు” అని విమల పిలిచిన పదం జీర్ణించుకోలేకపోతున్నాడు.
అసలు ఇలాంటి పరిస్థితుల్లో విమలను చూస్తాడని రాము ఏనాడూ అనుకోలేదు.
రాము వేగం గా స్టేజ్ దిగి వెళ్లడం చూసి , రాము ఆఫీస్ పి.ఏ., ..... రాము వెనుక నే ఫాలో అవుతూ వస్తూ జరుగుతున్నదంతా చూస్తున్నాడు.
మిగిలినది ఎపిసోడ్ – 16
యడ్ల శ్రీనివాసరావు 4 Sep 2022.
No comments:
Post a Comment