Thursday, November 19, 2020

29. ఊహించలేదే.....

ఊహించలేదే....
  


• ఊహించలేదే....
  ఊపిరి అవుతావని నా ఊహలకి

• ఆలోచించలేదే....
  ఆయువువుతావని  నా కవితకి 

• కాన రాలేదే....
  కలుస్తావని  నా కనులకి 

• మననం చేయలేదే....
  నాందివవుతావని నా మనోగతానికి

• పదముల ప్రేరణ నీవైనప్పుడు.... 
  గజ్జెల వలే గలగల లాడింది నా గద్యం

• ఈశ్వరా!  ఏమి ఈ వింత…. 
  ఎందుకు ఇదంతా!  నీ ఆట ఎవరికెరుక



యడ్ల శ్రీనివాస్



28. బాల్య మిత్రుల కలయిక రూపమా అపురూపమా?....

 బాల్య మిత్రుల కలయిక రూపమా..... అపురూపమా...

• ఉన్నాం.. ఉన్నాం...అందరం ఒకేలా ఉన్నాం.... ఏం ఒకేలా లేకుంటే మరి ప్రతిబింబాలు ఎలా కా గలిగాం... మాట్లాడు మిత్రమా.... ఓ నేస్తమా ..

• ముప్పది సంవత్సరాల ఎడబాటును మైమరిపించే మహత్తరమైనదా!  మన స్నేహం ?
• అవును.....కాదనేది ఎవరు?   జ్ఞాపకాలు పదిలం.... అనుభవాలు మధురం.... బాల్య బంధం తాజాగా పరిమళంతో  ఉన్నప్పుడు కాలంతో.... వయసుతో... పని ఏముంది మిత్రమా ..


• కంటికి కనిపించని స్నేహ తరంగాలు ఎన్నో ఉన్నా....... నీ అంతరంగాన్ని స్పృశిస్తే  కనువిందుచేసే అలలే బాల్య మిత్రులు....

• సంతోషం సంబరపడుతోంది......ఆనందం ఆశ్చర్య పడుతుంది..... బాల్య మిత్రుల కలయికకి....

• తనువులు వేరైనా,  మనసులు వేరైనా,  ఒకే మూలంలో (ప్రదేశం) , సరిసమానమైన స్పర్శలతో కలిసి పెరిగాం…....మరి  ఆ జీవ స్పర్శ  మన జీవనాడి లో లేదంటారా.. మిత్రులారా....ఓ మిత్రులారా...

• ఏ క్షణాన ఏమి జరుగునో ఎవరికి తెలుసు .....వెనుకకు తిరిగి చూస్తే ఎంతో కొంత బరువులు అందరికీ ఉన్నాయి ( పేరు ,హోదా, ధనము, ఋణము, అనారోగ్యము, దుఃఖము) .....ఏది శాశ్వతం?  

• ఆరోగ్యంతో ఆనందమయమై.... వర్తమానంతో వర్ధిల్లాలంటే .....ఒకటే ఔషధం .... మనసుకు ఊరట....అది దొరికేది మన అందరి లోనే......కావున..... మిత్రులారా…..
• చేతులు కలుపుదాం........ చేయూత నిచ్చుకుందాం......
• మాటలు కలుపుదాం .......మనసుని బలోపేతం చేద్దాం…..

• తెరవకు..... తడమకు.....నీ అంతర్మథనం లోని చీకటి కోణాన్ని(అహంకారం, గర్వం,ఈర్ష్య, అసూయ,పగ, ప్రతీకారం, ద్వేషం,హేళన, వెకిలి మాటలు, వెకిలి చేష్టలు, మోసం).....పొరపాటున.... తెరిచినా.....తడిమినా.... చీకటిలో ఏకాకిగా   అంతరించిపోవాలి…..... సిద్ధమేనా ఆలోచించు…….. తదుపరి చీకటి కూడా నీ చిరునామా కనుగొనలేదు……ఇది అక్షర సత్యం.... జాగ్రత్త... మిత్రమా.


• సరియైన శక్తి మాత్రమే...... నీ దశ తిరిగే దిశను చూపిస్తుంది.....ఏం కాదనగలరా మిత్రులారా.....

మీ మిత్రుడు
యడ్ల శ్రీనివాసరావు

27. ఒక సందర్భంలో స్నేహితులను ఉద్దేశించి

స్నేహితులందరికీ మనవి,  నన్ను మన్నించాలి,  నా  ఆలోచనలను దయచేసి అర్థం చేసుకోండి . నేను ముందుగా వివరణ ఇచ్చినట్లు ఈ రాత ఒక వ్యక్తి రాసినది కాదు.....  ముమ్మాటికి కానేకాదు. వ్యక్తి ఎప్పుడూ ఒంటరి వాడే...కానీ వ్యక్తికి శక్తి కలిస్తేనే సంఘటితం అవుతుంది. ఆ శక్తే ఇక్కడ "మనం". మనలో ప్రతి ఒక్కరికి బడిలో అపురూపమైన అనుభవాలు ఉన్నాయి.  


ఈ రాతలో ప్రతి అక్షరం ఒక విద్యార్థి. అంటే ప్రతి ఒక్కరి సంతోషం, ఆనందం,  అనుభవాల సమ్మేళనమే ఈ రాత.  
మనమందరం కలిసి మనకు మనమే కృతజ్ఞతలు చెప్పుకోవాలి.. ఎందుకంటే ఈ రోజు మన బాల్య సంతోషాన్ని మనమే నెమరువేసుకుంటున్నాము, పండుగ వాతావరణం   సృష్టించుకున్నాము. అందుకు నిదర్శనమే ఈ రోజు.

నన్ను క్షమించాలి అర్థం చేసుకోవాలి,   మన వాళ్ళ యొక్క కృతజ్ఞతలను వ్యక్తిగా నేను స్వీకరించలేక పోతున్నాను. 

ఒకటి మాత్రం నిజం......ఇది  చదివిన ఆనందించిన ప్రతి ఒక్కరం భాగస్వామ్యులమే,   ఎవరికి వారే స్వయంగా, స్వీయ అనుభవంతో  రాసుకున్నదే ఇది. 

ఎందుకంటే బాల్య భావాలు బయటకు అందరం వ్యక్త పరచ లేకపోవచ్చు  . భగవంతుడి ఆశీస్సులు ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో మనపై ఆ వర్షం పడుతుంది. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది.  " ఓం శ్రీ గురుభ్యోనమః" ....... Praise the lord.... "జీసస్". 


"నేను" పలికి చూడండి రెండు పెదవులు కలవవు.
"మనం " పలికి చూడండి రెండు పెదవులు కలుస్తాయి .

ఏదైనా "నేనేదో చేసేసాను.... నేనేదో చేస్తాను.... నావల్లే ఇదంతా అనుకుంటే" మిగిలేది ఏకాంతం ,  ఒంటరితనం.  

కానీ  "మనం ....మనది.... మనమంతా కలిసి చేసాం" అనుకుంటే మిగిలేది కోటి దివ్వెల కాంతి,  సంతోషం .  

ఆ "మనం" లోనే ...."నేను"  చిన్నగా ఒక ప్రక్కన ఉంటాడు.
అదే "నేను" కు  "ఆనందం" ….... "మనం" కు  బలం.



మీ మిత్రుడు
యడ్ల శ్రీనివాసరావు

26. స్నేహం.... స్నేహితుల దినోత్సవ సందర్భంగా

స్నేహం…



• స్నేహమంటే విలువైనది,  అపురూపమైనది,  అమర మైనది. కానీ  ప్రతీ అంచుకు రెండు కోణాలు ఉన్నట్లే , మంచి,  చెడు అనే  గుణాలకి  స్నేహం కూడా ఏమీ అతీతం కాదు. 

• మంచి స్నేహం ఎప్పుడూ నీడలా వెన్నంటి ఉంటుంది..... ఆపదలో ఆసరా అవుతుంది...... సంతోషానికి సంబరం అవుతుంది.....బాధకు  భరోసా ఇస్తుంది..... ప్రతిభకు గుర్తింపు ఇస్తుంది...... పిలవకపోయినా నేనున్నా అంటుంది. 

• మంచి స్నేహానికి ఒక బలమైన,  విచిత్రమైన,  విపరీతమైన స్వార్థం ఉంటుంది.  ఆ స్వార్థం పేరు ఏంటంటే " సంతోషం " . సంతోషాన్ని స్నేహితులతో  పంచుకోవాలనే ఒక ఆరాటం.... అంతకుమించి స్వచ్ఛమైన మంచి  స్నేహం లో ఏ రకమైన స్వార్థం ఉండదు.

• మంచి స్నేహం... ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సందర్భంలోనైనా, సాటి స్నేహితుడి యొక్క ఉన్నత తత్వాన్ని, అభ్యున్నతిని  మాత్రమే కోరుకుంటుంది.  అదేవిధంగా స్నేహితుడి యొక్క నిమ్నతత్వాన్ని  సరి చేయడానికి ప్రయత్నిస్తుంది.  

• మంచి స్నేహానికి   అర్థం చేసుకునే గుణం ,  సహాయపడే తత్వం భగవంతుడు సహజంగానే ప్రసాదిస్తాడు . మంచి..... వేగంగా నడవలేదు,  త్వరగా ఆకట్టుకోలేదు కానీ ఎప్పటికీ స్థిరత్వమే దాని గమ్యం.

• ఇక పోతే  చెడు స్నేహం……  స్నేహం ముసుగులో ఏదో ఒక లబ్ధి పొందాలనుకోవడం……..  వ్యక్తిగత అవసరాలకు స్నేహాన్ని ఆయుధంగా ,  ఒక వ్యాపారంగా మార్చుకోవటం…….. స్నేహితులతో ప్రేమగా ఉంటూ, వారి మనస్తత్వాన్ని,   బలహీనతలను, అనవసరమైన వివరాలు అడిగి  తెలుసుకుని జీవితాలతో ఆటలాడటం……. చెడు అలవాట్లను నేర్పించడం…….. నమ్మకద్రోహం తలపెట్టడం…….డబ్బు, హోదా ఉన్న వారితో ఒక రకమైన స్నేహం,  అది లేని వారితో మరొక రకమైన స్నేహం చేయడం .....ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రకమైన చెడు స్నేహలతో ఎప్పటికీ మిగిలేది క్షోభే………..చెడు  వేగంగా నడవగలదు, త్వరగా ఆకట్టుకో గలదు …కానీ పతనమే దాని గమ్యం.

• స్నేహితులారా……మంచిని ప్రోత్సహిద్దాం....... మంచి స్నేహితులుగా ఉందాం.......... నిజం లో బ్రతుకుతూ ఆనందంగా ఉందాం. ఎందుకంటే మిగిలిన జీవితానికి కావలసింది ఆనందం. ఆనందంగా ఉంటేనే మనం బాగుంటాం......మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది...... మన కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది..... సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది.

• స్వచ్ఛమైన ఆలోచన...... స్వచ్ఛమైన జీవితానికి నాంది.

• స్వచ్ఛమైన స్నేహాన్ని బ్రతికిద్దాం.......స్వచ్ఛందంగా బ్రతుకుదాం.

• ఐదు పదుల వయసులో అడుగు వేయబోయే  స్నేహానికి కావలసింది ఆస్వాదనే....... కానీ ఆరాటం కాదు. 

• చివరిగా ఒక మాట……. స్నేహం అంటే కాలక్షేపం కాదు……కాలక్షేమం.

• (మిత్రులు గమనించాలి.... ఇవి నా ఆలోచన, అభిప్రాయం  మాత్రమే) 

స్నేహితుల దినోత్సవ సందర్భంగా .....
ప్రతి సంవత్సరం ఆగష్టు తొలి ఆదివారం .

మీ మిత్రుడు 
యడ్ల శ్రీనివాసరావు
2020 ఆగష్టు

25. ప్రక్రుతి పిలుస్తోంది

ప్రకృతి పిలుస్తోంది


• పిలుస్తోంది 
  పిలుస్తోంది   ప్రక్రుతి
 తన ఒడిలో   సయ్యాటకి  పిలుస్తోంది.

• అక్కున  చేర్చుకుని   మక్కువతో 
  ఊయలాడేందుకు   పిలుస్తోంది.


• తన సరసం తో   నీ విరహం 
  వినీలమైయ్యేందుకు  పిలుస్తోంది.


• చేతులు చాచి    సేదను తీర్చి
  ప్రేమ ను   పంచడానికి  పిలుస్తోంది
  పిలుస్తోంది   ప్రక్రుతి.


యడ్ల శ్రీనివాసరావు  







24. అలజడి...నా మనస్...సలజడి

అలజడి..




• అలజడి అలజడి ఈ చిరు ఆదః అధరాల  అలజడి ఎందుకో నాకే ఎందుకో...

• సూర్యోదయ మంచు పొరల తెరలతో చెలిమి చేసి,   చొరవతో చొరబడే వెచ్చా వెచ్చని సూర్యకిరణాలు ....రేప రెపలాడే పైరుపై చల్లా చల్లని స్వేద బిందువులు .....ఇసుక తిన్నెల వాలు జారే హోయలు పోయే నడుము పైన సన్నని పరికిణీ చిరుగాలి రెపరెపలు.


• అలజడుల నా మనస్ సవ్వడి .....గలగల నా తుమ్మెద రవళి .

• పైరుగాలి పై విహరించే పక్షి కిలకిలలా.......ఉరకలతో ఎగిసిపడుతోంది నా మనస్  సలజడి .....


• పొలము గట్టు బోదేలో  స్వచ్ఛమైన  ఉరకలేసే  నీరులా....విప్పారిన కన్నులతో నిశ్చలమైన నిరీక్షణ... నా మనస్  కోసం ...

• నడినెత్తిన సూర్యుడు ......క్షీణంతో , సహనంతో , వేడిమిని ఆస్వాదిస్తున్న  పైరులా .....ఎదురు చూపుల బలహీనతే చిగురుటాకులా....నా మనస్  కోసం నిరీక్షణ.


• అస్తమించిన సూర్యుడు,  పైరుగాలి సవ్వడులు,  పక్షుల గలగలలు,  పునః తేజానికి  ఆరంభాలు....ప్రకృతి నాకు ఇచ్చే , నా శక్తే   నా నిరీక్షణ , నా మనస్ కోసం....

• తెలుసు నా మనసు.... నాది కాదని తెలుసు.... నా దరికి రాదని తెలుసు .....అయినా నేను ప్రకృతిలో మమేకమై ఉన్నాను కదా అందుకే అచంచలమైన చిరకాల నిరీక్షణ.

యడ్ల శ్రీనివాస్

23. జాబిల్లి

జాబిల్లి


• మనసును  మురిపే   జాబిల్లి ...
  మగువను   తలపించే  జాబిల్లి.

• పసి  హృదయాలకు   తల్లివి ...
  పగిలిన   హృదయాలకు  వెలుగువి.

• నిశిరాత్రి కి   ప్రాణం  పోస్తావు ...
  మంచును   ముత్యం  చేస్తావు.

• నీ  ప్రేమ కోసం  అలలు  ఉరకలేస్తాయి ...
  ఎందుకమ్మా మేఘాల చాటున దోబూచులు.

• జీవుల  మనసుకు  మూలం  నీ  స్వరూపం 
   జాబిల్లి  ...   ఓ తల్లి   జాబిల్లి .    

              
యడ్ల శ్రీనివాస్





22. చిరుగాలుల గలగలలు

చిరుగాలుల గలగలలు

• చిరుగాలుల గలగలలు. 

 గలగలల సవ్వడికి వయ్యారంగా 

 సుడులు తిరిగే నుదుట ముంగురులు.


• ముంగురుల అలజడి కి  

 టపటపలాడే  విప్పారిన  కనురెప్పలు.


• కనురెప్పల  సౌందర్యానికి 

  చంద్రబింబం వలె తిలకం.


• సన్నని సొగసరి సూదంటి ముక్కు కి 

  మేని ఛాయ ముక్కెర.


• ఉచ్ఛ్వాస , నిచ్ఛ్వాసాల అలజడి కి 

  సన్నగా అదియే అథరాలు

  వెరసిన ముఖారవిందం   సొంతం   నా సొంతం.


యడ్ల శ్రీనివాసరావు

21. చలనం....నిశ్చలనం

చలనం...నిశ్చలనం


• సాగర కెరటమంత చలనం గా 

  నీ ఆలోచనలు  (అల్లకల్లోలం  గా)

  సాగర గర్భమంత నిశ్చలం గా    నీ మనసు.


• ఏల సాధ్యం   ఎలా సాధ్యం.


• సాగర గర్భాన్ని   పున్నమి చంద్రుని వెన్నెల

  తాకినందుకా   అంత నిశ్చింత   నిశ్చలనం.


• నీ  నోట నుండి   మాట రాకపోయినా

  తనువు నుండి తరంగాలు  తాకుతూనే ఉన్నాయి.


• నీ  నోట‌ మాట  పదాల పదనిసలు 

  లయ తప్పవచ్చు

  కానీ   నీ మనసు సరిగమలు  శ్రుతి  తప్పవు.


• నీ రాతలు రూపాంతరమై 

  భావవ్యక్తీకరణ కాకపోతేనేం

  నా హ్రుదయం  అనుసంధానమై ఉంది కదా.


• నా కనులకు చూడాలని అంటాయి

  కానీ మనసు   మార్గం  తెలియదు అంటుంది.


• నా మనసు  మాట్లాడలని అంటుంది 

  కానీ కంఠం మూగపోతుంది.


• ఇక స్వేచ్చగా ఉన్నది ఈ చేయి 

  అందుకే ఇదంతా రాస్తుంది.


• బంథంలో జీవమున్నపుడు

  ఎన్ని బంథనాలున్నా చిరకాలం చిరస్మరణీయమే.


• అర్థం  నీవు అర్థం కావాలంటే

  నీ మౌనం చాలు   ఈ హ్రుదయానికి


• మరి అర్థం  నేను అర్థం కావాలంటే

  చీకటి లో   కూడా చూడు   

  నీడనై  నీ నీడనై  ఉన్నాను  ఆత్మగా.


• చూడగలుగుతున్నావా   కనిపిస్తున్నానా



యడ్ల శ్రీనివాసరావు















20. పదముల... చెలి... చెలిమి


 పదముల   చెలి  చెలిమి

• పదములు కలమున వదలక గాంచిన(చూసిన)

  చెలిమి సంతసించే.


• పదములు పిదపన(తదుపరి)

  చెలిమి మనసున్  దోచెన్.


• పదముల నాట్యమే

  చెలిమి ఊగిసలాడే వాలుజడ వలపు 
  
  నడక విన్యాసం.


• పదముల  అభినయమే

  చెలిమి నేత్రారవింద శృంగం (తామర పుష్పం ).


• పదముల పదనిసలే

  చెలిమి తలపుల్  వలపుల్  కులుకుల్.


• పదముల సరిగానం
  
  చెలిమి మేనిన హొయల్

  వర్ణించలేని భాండాగారం.


• పదముల ప్రవాహంలో జలకాలాడే

  చెలిమి నిత్యానంద శోభమయం.


• పదముల కదలికలే

  చెలిమి ఎదలోతుల్లో ప్రకంపనల్.


• పదముల  ప్రతి పాదమున

  చెలిమి తన ముఖారవిందం గాంచెన్.


• పదముల విరహం

  చెలిమి మోమున అలకతో అథరం అదిరెన్.


• పదముల పుట్టుక తనకైనని  తలచిన

  చెలిమి రక్తియై   అనురక్తియై   నేలకామడ

  ఆడుతుండే    మయూరిలా  నాట్యమాడుతుండే.



• పదమా.  పంచభూతాల ఆకర్షితమా

  ప్రకృతిని ( చెలిమిని)  పరవశింపజేసే

  పంచతంత్రమా.


• పదముల పరువానికి ప్రణమిల్లే చెలిమికి  

  పదములు రాసేడువాడు 

  శూన్యంబుగా  గాంచెను    ఎన్నడు.



• పదము పైన  ప్రేమ  చెలిమి సొత్తు

  పదము గాంచిన వాడు విభుడి(ఈశ్వరుడు) సొత్తు.



యడ్ల శ్రీనివాసరావు










19. ఓం నమఃశివాయ , ఉన్నాడులే... ఒకడున్నాడు లే

ఉన్నాడులే.... ఒకడున్నాడు లే


• ఉన్నాడు లే,  
  యుగమొక క్షణమును చేసే 
  యోగి  ఒకడున్నాడులే.


• జగమున 
  జనముకు  రక్షకుడైనాడులే
  పరిరక్షకుడై  యున్నాడులే.


• నట నాట్యం తో తాండవమెత్తి 
  ప్రక్రుతి పాలకుడై యున్నాడులే
  ఒకడున్నాడు లే.


• తేటతెల్లమైన  మేని  విభూది తో
  స్థితప్రజ్ఞడై    శాంతి కాముకుడై
  థ్యానముద్రకు  ప్రతీకుడై  యున్నాడులే.


• సుందర  మనోహర 
  చిద్విలాస  చిదానందుడి 
  కనుపాప  బాష్పమునైన  ధన్యం
  నా ఈ జన్మ ధన్యం.

• ఓం నమఃశివాయ….శివాయఃనమః ఓం.


యడ్ల శ్రీనివాసరావు








18. సుడిగుండాలు

సుడిగుండాలు


వికసించే విరజాజి   మంచు వెన్నెల జాబిల్లి

పరిమళాల సంపెంగ   కోటి తారల కాంతిమయి

ఆనందవల్లి

ఏది ఆది   ఏది అంతం

ఈ పయనం ఎందాకో  ఎందుకో 


బందమో 

   అనుబంధంమో  ఋణానుబందమో


బందమా  అంటే 

   బాధ్యతలు కాన రావడం లేదు

అనుబంధమా అంటే 

   అనుభవాలు కాన రావడం లేదు.

మరి ఇక మిగిలినది

   ఋణానుబందమే కదా


కలయిక చిత్రం కాదు 

   విచిత్రం కానే కాదు 

   యాదృచ్ఛికం అంతకంటే కాదు.


అవుతుందా

   అర్థం అవుతుందా

   శక్తిని చూడలేం  కాని అనుభవించగలం


చూడు  మనసు పొరలు చీల్చి చూడు

   నీ పట్ల ఈ ప్రకృతి లీల కనిపిస్తుంది.


పడ్డావు  పడ్డావు  

   సుడులు తిరిగే సుడిగుండాలే  

   ఆయాసపడే కష్టాలు పడ్డావు.


సుడిగుండాల్లో  సుడులెన్నునా  

   సున్నితమే  నీ  సుందరాభరణం.


ఆ సుందరాభరణానికే 

   ఎగిరే రెక్కల గుర్రం ఎక్కించుకుంది.


విహరించు  వినీలాకాశాన్ని

   ఆలంబనతో ఆస్వాదించు 

   సుడులు తిరిగే సుడిగుండాలని.


సాగరం లో శాంతిని చూసే 

   నీ మనసే నీకు  శ్రీ రామ రక్ష

ఉన్నాడు  ఒకడున్నాడు 

   ఈ సర్వం జగత్ వ్యాపించి ఉన్నాననే

   వాడొకడున్నాడు.  

   వాడిని చూడాలంటే 

   ఎన్నో సుడిగుండాలు  దాటాలి మరి.  

   వాడు అనుగ్రహిస్తే 

   ఏదో ఒక దేహం తో దర్శనమిస్తాడు.


యడ్ల శ్రీనివాసరావు









488. నా ప్రపంచం

నా ప్రపంచం • నా దొక   ప్రపంచం   అది   సోయగాల   సౌందర్యం. • నా  మనసెరిగిన   ప్రపంచం   మధువొలికిన     అనందం. • అందాల   ఆరబోతలు   ఆదమరచి   ...