Wednesday, June 30, 2021

70. ఆట ఎవరికెరుక…. నీవు ఆడే ఆట ఎవరికెరుక

 ఆట ఎవరికెరుక…. నీవు ఆడే ఆట ఎవరికెరుక

                ( మహాదేవుని ఆటలు)



• ఆట ఎవరికెరుక

  ఆడే ఆట ఎవరికెరుక

  ముక్కంటి…..ఓ ముక్కంటి.


• మనసులకు  మాయ కలిగిస్తావు.

  దుఃఖంతో  భ్రమలు తొలగిస్తావు.

  ఆట ఎవరికెరుక

  నీవు ఆడే ఆట ఎవరికెరుక.


• మోహం  కలిగిస్తావు

  వ్యామోహం  కలిపిస్తావు

  తుదకు అంతా  మాయేనంటావు.


• నీ  రాతలో   శిలలెందరో    శిల్పాలెందరో


• కనులు మూసి కదం తొక్కుతూ 

  పాపపుణ్యాల లెక్కలు కడతావే.

  ఆట ఎవరికెరుక

  నీవు ఆడే ఆట ఎవరికెరుక.


• ఎవరికి ఎవరు ఏమవుతారో 

   బంధువులెవరో    రా బంధులు ఎవరో


• బంధాలతో బంధీలను చేసి 

  కొందరిని బలవంతులుగా , 

  మరికొందరిని బలహీనులుగా 

  మారుస్తావెందుకో   నీ ఆట ఎవరికెరుక  శివా.


• ఆశలతో  అందలమెక్కిస్తావు

  ఆనందంలోనే  అన్నీ ఆవిరి  చేసెస్తావు.


• నీరును సృష్టించి జీవం పోశావు

  కన్నీరును సృష్టించి జీవం తీస్తావు.


• మా లో ఉంటావు

  మహిమలు చేస్తావు

  మోక్షాన్నిస్తావు.


• చావు పుట్టుకల నడుమ 

  ఆట బొమ్మలతో నీవు ఆడించెడి 

  ఆట ఎవరికెరుక.


• లయ తప్పని నటరాజువి

  నట జీవులకు రారాజువి.


• బూడిదనే విభూతి చేసి 

  భూలోకాన్ని ఏలే, భూ తల వాసి.

  ఆట ఎవరికెరుక

  నీవు ఆడే ఆట ఎవరికెరుక

  ఈశ్వరా…. పరమేశ్వరా.🙏🙏🙏



యడ్ల శ్రీనివాసరావు (YSR)  1 July 21 8:00 am






Thursday, June 24, 2021

69. ప్రేమికుల ప్రకృతి పరిణయం

 

               ప్రేమికుల ప్రకృతి పరిణయం

(మూలం:  త్యాగశీలురైన ప్రేమికుల ను ప్రకృతి ఆశీర్వాదించి, పరిణయం గావించిన తరుణం.)


·        ఎన్నాళ్ళో……ఎన్నేళ్ళో  కలలు కరుణించెను, మదిని మరిపించెను.

·        చిగురించిన ఆశలు చిరుదివ్వెలైన వేళ నీ వసంతమే తోరణం.

·        పవళింపున  ఊహలు  ఆసన్నమై వేళ మన ప్రాయమే పందిరి.

·        మమత లోని మాధుర్యం మధురమైన వేళ మన మైత్రీయే తాంబూలం.

·        నమ్మకమే *నాంది గా, *నవనీత మైన వేళ మన సహచర్య మే  జీలకర్ర బెల్లం.

·        గాజుల సవ్వడి తో  , గజ్జల అలజడులే శృతిలయలు అయిన వేళ మన నడకలు  అయ్యెను ఏడు అడుగులు.

·        పంచ భూతాలే వేదపండితులై, పశుపక్షాదులు దేవతలైన వేళ  సార్థకమయ్యేను మన  పరిణయం.

·        వికసించిన మనసులకు ,  తొలకరి జల్లులే తుమ్మెదలయిన వేళ చిరునవ్వులే తలంబ్రాలు.

·        నీ చూపులోని  భావం,  నా మనసులోని మాట మమేకమైన వేళ ఆవిర్భవించిన అర్థాంగివి.... తోడు నీడ ల అర్థానివి.

 

YSR 25 JUN 21 5:00 am

పవళింపు = నిద్రలో

నాందీ = దేవతల ఆశీస్సులు

నవనీతం = చిలికిన తాజా వెన్న

Tuesday, June 22, 2021

68. బాధల్ని భరించేవారే బలవంతులు

 

బాధల్ని భరించేవారే బలవంతులు

·        సృష్టిలో బాధల్ని భరించేవాడే అసలైన బలవంతుడు. సామాన్యంగా దుఃఖించే వారిని బలహీనులు అనుకుంటారు. కానీ దుఃఖాన్ని అనుభవిస్తూ, సమస్యలతో సతమతమవుతున్న వారే నిజమైన శక్తి వంతులు.  సృష్టి లో ఏ మనిషి దుఃఖాన్ని అనుభవించాలని కోరుకోడు, కానీ సంతోషం కావాలని వెంపర్లాడతూ ఉంటాడు.

·        సంతోషం యెక్క తీవ్రత కంటే దుఃఖం యెుక్క ప్రభావం మనిషి పై సమర్థవంతంగా పని చేస్తుంది.  విధంగా అంటే , ఈ ప్రపంచంలో ఏ ప్రముఖుడినైనా, ఎటువంటి కీర్తి వంతుడినైనా, లేదా మహనీయుడు నైనా, ఖ్యాతి వంతుడి మనసు నైనా, కదిలిస్తే వారి జీవితం లో అత్యంత బాధ, విషాదం, దుఃఖం ప్రస్పుటంగా అనుభవించడం కనిపిస్తుంది. ఇది సత్యం ..... విశ్వంలో ఖ్యాతిగాంచిన ప్రతి ఒక్కరి జీవితంలో బాధను అనుభవించడం  అనేది ఒక  అంతర్భాగం. .....ఎందుకంటే వ్యక్తి అయినా మహానుభావుడు గా తయారు కావాలంటే దుఃఖస్థితి అనుభవించి రావాల్సిందే  . అప్పుడే వ్యక్తికి తన జన్మ పట్ల, జీవితం పట్ల,  స్థితప్రజ్ఞత , పరిపక్వత, పూర్తి అవగాహన వస్తుంది. ఇది సృష్టిధర్మం.


·        ఇక్కడ విచిత్రమైన విషయం ఏమంటే చూసేవారికి ఒక వ్యక్తి యొక్క కీర్తి ప్రతిష్టలు, గొప్పదనం మాత్రమే బహిర్గతం గా కనిపిస్తాయి. కానీ మనసు లోని అంతరంగిక చేదు అనుభవాలు ఎవరికీ తెలియదు . ఇది ఈ భూమండలం మీద ఉన్న ప్రతీ రంగంలో,  ఉన్నత స్థితి లో ఉన్న ప్రతి మహనీయునికి అనుభవమే.  కానీ అటువంటి మహనీయుల అందరికీ,  తమ జీవితాల్లో సంతోషం  అనే అంశం ఒక చిన్నపాటి అనుభవం మాత్రమే అవుతుంది  . ఎందుకంటే వారు అపజయాలు, బాధలు, ఇబ్బందులు అనుభవించి,  చివరకు సాధించిన ప్రగతి ద్వారా ప్రజలలో , మరియు ఎదుటివారి ఆనందంలోనే తమ యెక్క సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు.

·        ఆటలకి తర్ఫీదు నిచ్చే గురువు, వజ్రం లాంటి ఆటగాళ్లను తయారు చేయగలడు  . కానీ తన సంతోషం అతను తయారుచేసిన శిష్యుల్లో వెతుక్కుంటాడు . ఇందులో అంతర్లీనంగా త్యాగం కనిపిస్తుంది. అదేవిధంగా భారతీయ కుటుంబ వ్యవస్థ లో చూస్తే ముఖ్యంగా తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు, బాధలు ఎదుర్కొని పిల్లలకు తెలియనివ్వకుండా పెంచుతారు. తల్లిదండ్రులు తమ సంతోషం పిల్లల్లో చూసుకుంటారు.   


·        అంటే విధంగా గమనిస్తే,   సంతోషం అనేది ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత అనుభవం కానేకాదు. సంతోషం అనేది సామూహికంగా కుటుంబంలో గాని,  సమాజంలో గాని,  ప్రకృతిలోని పశుపక్షాదులలో గాని ,  పంచభూతాలతో గానీ , ముడిపడి ఉన్న అంశం . ఇది స్పష్టం.  కానీ దుఃఖం మాత్రం పూర్తిగా మనిషి యొక్క వ్యక్తిగతం.  బాధను అంతర్లీనంగా అనుభవిస్తేనే అసలైన సంతోషం ఏమిటో తెలుస్తుంది .

 

·        కానీ నేటి కాలంలో అమాయక ప్రజలు జ్ఞానం తెలియక అనేక వ్యసనాలలో (తాగుడు, జూదం , అతిగా తినడం) ఇలా అనేకమైన వాటిలోనే అసలైన సంతోషంగా ఉందని గ్రహిస్తూ విచ్చలవిడి తనాన్ని పెంచుకుంటూ అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేస్తుంటారు .

 

·        బాధని ప్రేమించండి ………బలవంతులు అవుతారు. నిరాశ లోనే ఆశ ఉంది …. నిస్పృహ లోనే స్పృహ ఉంది”.  మనిషి అంటే ఒక శక్తికి నిదర్శనం.  క్తి తేజోవంతం అవ్వాలంటే తప్పనిసరిగా ఎంతోకొంత అగ్నివలె మండవలసినదే. అదే దుఃఖము యొక్క  అసలు స్వరూపం.

 

·        భగవంతుడు మనిషికి కళ్ళు ప్రసాదించింది,  బయటకు మాత్రమే చూడమని కాదు ....బయట కనిపించే దాని కంటే ఎన్నో వందల రెట్లు నీలో, నీ దేహాంలో, నీ అంతరంగంలో, నీ అణువణులో దాగి ఉన్న దానిని చూడమని ....కానీ నువ్వేం చేస్తున్నావో ఆలోచించు.  సృష్టిలో నువ్వు దేని నుంచి అయినా తప్పించుకోవచ్చు...... అది చాలా సులభం..... కానీ నువ్వు నీ నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఇదే నీ లో ని సంతోష దుఃఖాలకు మూలం.

 

యడ్ల శ్రీనివాసరావు. 3:30 am 22 Jun 2021.




 

Saturday, June 19, 2021

67. గీతం…గానం…సంగీతం…ప్రేమం


గీతం…గానం…సంగీతం…ప్రేమం
( ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా…. గీతాన్ని, గానాన్ని, పాటని, పదము ప్రేమిస్తే, కీర్తిస్తే కలిగే భావం…ఈ చిన్న ప్రయత్నం…. సంగీత ఆరాధకుల కోసం.)



• గీతమా…..ఓ గీతమా…గగనంలో విహరింపచేసే సంగీతమా…..నా గానమా.
• సంతోషం లో స్వరాలను….బాథ లో భావాలను పలికించే మాధుర్యమా…గీతమా…ఓ….నా గానమా.
• పదనిసల పయనంలో పరువమే పులకించి పలికించే ప్రాణమా…..ఓ గీతమా…నా గానమా…
• నరుని నరాలను నవనీతం చేసే నాదమా…ఓ స్వరరాగమా…
• జాబిల్లి కి జోల పాడుతూ…. జలజల *జాలువారే జలపాతమా…గీతమా...సంగీతమా
• తకదిమిల తాళం….శ్రుతిలయల మేళం… *సమ్మోహన రాగం….వినువిందు భాగ్యం
• మనసుని మైనం చేసి……*మధువు కి జీవం పోసే….గేయమా….నా గానమా.
• కుహు..కుహు‌‌… కోయిలల కీర్తనలు…..సల‌సలల సవ్వడుల సంకీర్తనలై…. స్వరం ఆడెను…..సరిగమలతో పాడెను…శ్రావ్యమా, ఓ సన్నజాజి రాగమా…
• రాగం రమణీయం మైనపుడు…తానం తన్మయత్వం చెంది……పల్లవి పరవశించెను…పురివిప్పిన నెమలిలా…..
• గీతమా…గీతమా…. గొంతు లోని గానంతో….భాషలోని భావంతో…..శిలను సైతం శిల్పం గా మార్చిన, తరంగాల తరంగిణి.

YSR 19 June 20, 4:00 am
జాలువారే = ప్రవహించే.
సమ్మోహన = ముగ్ధుల్ని చేసే
మధువు = తేనే



Monday, June 14, 2021

66. చెలి మనోహరం


                        చెలి మనోహరం
          


• కన్నుల్లో నిలిచిన నా  చిత్రమా  
  క‌న్నీళ్ల కు   కరగకుమా 
  కనులే  కలవరపడతాయి.

• గుండెల్లో దాగిన నా గానమా 
  గుబులు  చెందకుమా  
  గాత్రమే *ఘనీభవించును.


• అరవిందం లో   ఒదిగిన  చెలి అందమా
  అలజడి   చెందకుమా 
  అమరమయ్యేను   నా ప్రాణం.


• మురిపెం  నిండిన,   
  ఓ  మగువ  ముంగురులారా 
  మిళితమవ్వకుమా  
  మన్మధుడే  మదనమయ్యేను. 


• నీ నడక లో  ఇమిడిన  నాట్యమా 
  నలత  చెందకుమా 
  నృత్యమే మరిచి పోయేను  నెమలి.


• నీ మేని  చందనాల   పరిమళమా 
  సిగ్గు  పడకుమా 
  ప్రకృతి యే   పరవశించకుండేను.

• ఓ అలంకారాల  అపురూపమా 
  అలక  చెందకుమా
  హరితమే  విరహం  చెందేను.

• నీ చిరుమందహసానికి  
  బృందావనం లోని  పుష్పాలు  
  మైకంతో మంత్ర ముగ్ధులవుతుంటే ...
  ఆహ, చెలి 
  ఇదే నీకు నా నజరానా.  


నా రచనకు 
  జీవం నీ రూపం …
  ఈ అక్షరజ్యోతి కి   
  తైలం నీ మనోహరం.”


యడ్ల శ్రీనివాసరావు 13 June 21 , 10:00 am.





Tuesday, June 8, 2021

65. బాల కార్మికులం….అభాగ్యులం….అనాధలం


     బాల కార్మికులం….అభాగ్యులం….అనాధలం
(మూలం : వీదుల్లో చాలా మంది పిల్లలు చెత్త సేకరించే కార్మికులు గా ఉన్నారు. అనాధలైన వారి జీవితం గురించి‌... చిన్న పాటి ఆలోచనతో …. ఈ రచన)




• కార్మికులం, బాల కార్మికులం…ఎవరి కర్మ కో ప్రతిరూపమైన అభాగ్యులం, అనాధలం.
• తొలి పొద్దు పొడుపు తో,  తెలవారె వెలుగులో, తొందర పరుగులతో,   వీధీ,  వీధులే శుభోదయం…మాకు నవోదయం.
• ఊరి చివర చెరువైనా, సర్కారు పంపు అయినా మా కృత్యాలకు *ఇంపు.
• మేమంతా ఒక మంద…..పనికి వాడలను ఎంచేది మా *బంటా.
• చింపిరి జుట్టు తో,  రక్షలు లేని పాదాలతో, చిరిగిన చొక్కాలతో,  పొట్టి పొడుగు నిక్కర్లు తో, చేతిలో గోనె సంచులతో…     వీధి చెత్తకుండీ లలో, ఆతృత తో కూడిన వెతుకులాటలు …మా బతుకు బాటకు సోపానాలు.
• మేమేం నేరం చేశామో, మేమేం పాపం చేశామో….వీధి కుక్కల భౌ భౌ లతో పరుగులు,  వీధి పెద్దల ఛీత్కారాలు, చీదరీంపులు. 
• చెత్తకుండీ లో వెతుకులాటలు, చెత్తకుప్పలతో సహవాసాలే మా ఆకలిదప్పుల చేయూత లు.
• శుభాఅశుభా కార్యాల వీధుల్లో  కాలాతీతమైనా , ఎంగిలాకుల కోసం  ఎదురు చూపులతో ఆరాటమే……మాలో ఎగసి పడే ఆనందం…. అదియే మాకు  విందు భోజనం.
• అన్నం దొరకని సందర్భాల్లో, పాచిన, కుళ్లిన ఆహరాలే మాకు నైవేద్యాలు.
• లెక్కల్లో లేని జనాలం…. నిరంతరం మా రెండు కళ్లు ఎదురు చూసేది జానెడు పొట్ట కి, బారెడు అన్నం కోసం.
• చెత్తతో,  చెత్తలో వెలుగుతున్న దీపాలం,  చెత్తను సేకరించడం , చెత్తను ప్రేమించడం మాత్రమే మాకు తెలిసిన బ్రతుకు జ్ఞానం.
• ధర్మాతుల  వస్త్ర దానం  మాకు సంక్రాంతి. పుణ్యాత్ముల అన్నదానం మాకు దీపావళి. 
• మీరే మా  దేవుళ్లు……మీ కట్టు, బొట్టు, వస్త్రాలు, వేషధారణ, నిత్యం శుచి యైన ఆహారం , ఆహా ఎంత అదృష్టం… అందుకే మీకు చేతులెత్తి మొక్కుతాం….మీరే మా దేవుళ్లు.

(ఈ రచన చదివిన వారు, అటువంటి పిల్లలు తారసపడితే, ధనం కాకుండా,  కనీసం వాడిన బట్టలు గాని, మంచి ఆహారం గాని, అవకాశం ఉంటే ఏదైనా పని కల్పించి చేయూతనివ్వండి.)

ఇంపు = అనుకూలము, యోగదాయకం.
బంటా= కార్మికుల పెద్ద

YSR 9 June 21 3:30 am


64. మనిషి ప్రస్థానం


                         మనిషి ప్రస్థానం



• మనిషి ... ఓ మనిషి 
  తెలుసా … ఏమవుతుందో తెలుసా

• ప్రకృతి తో మమేకవ్వమంటే
   వికటాట్టహాసం చేస్తున్నావు.

• ప్రకృతి  వికృతి అయి 
  విలయతాండవం చేస్తుంటే
  తిరిగి ప్రకృతి నే ప్రార్థిస్తున్నావు.

• ఎందుకు ఈ ద్వందం
   ఏల నీ బుద్ధి అల్పం.

⭐⭐⭐⭐⭐


• వృద్ధి,  వృద్ధి,  అభివృద్ధి అంటూ…. 
  ప్రకృతి పై పైశాచికం చేశావు (చెట్లు నరకడం)
  ప్రత్యామ్నాయంగా   ఏం చేశావు.


• ఏం…నీవు మాత్రమే జీవివి
   పశుపక్ష్యాదులు, వన్యప్రాణులు
   వృక్షాలు  జీవులు కావనున్నావా
   ఎందుకీ వివక్ష…..దేనికీ దుర్బుద్ధి.

• రంగులు పూసుకుని, రూపం మార్చుకుని,   
  రజోగుణం తో జీవితాన్ని రణరంగం చేసుకునే
  దౌర్భాగ్యం  నీ కెందుకు. 


⭐⭐⭐⭐


• నీటి బుడగ నీ జీవితమంటే
  ఏనాడైనా శోధించావా
  ఏనాడైనా పరిశీలించావా.

• జననం మరణం సహజం అంటే
  ఏనాడైనా విన్నావా,  ఏనాడైనా కన్నావా.

• అందుకే కాబోలు   
  కాలం నీకు కరోనా రూపం లో 
  కమనీయంగా తెలియచేస్తుంది. 


⭐⭐⭐


• భయం  నీ రక్షణ కాదు , భక్షణ.
   ధైర్యం నీ శత్రువు కాదు , హితవు.


• మనిషి   మారు,  ఇకనైనా మారు
  మారకపోతే సృష్టిలో జరిగబోయే 
  మార్పును చూడడానికి నీవుండవు.


• బూజు పట్టిన బుర్రలోని అజ్ఞానమనే 
  బురద ను తొలగించి , 
  జ్ఞానమనే  పాదరసం నింపు.


• పంజా విప్పిన పులిలా,  
  ప్రగతి పధం లో ధర్మం తో పయనించు.

⭐⭐


• మాయను వీడు,  సత్యం తెలుసుకో
  నీవు పంచభూతాల మిళితం
  ప్రకృతి లో  అంతర్భాగం.


• మనిషి…ఓ మనిషి,  
  మననం చేసి చూడు నీవు ఎవరివో ...
  పరమాత్ముని అంతరాత్మ లో 
  నీవొక దృశ్యము కాని కణం …
  గ్రహించకపోతే అది నీ కర్మఫలం.

• శాంతం నీ శక్తి
  సహనం నీ యుక్తి
  అదే నీకు ముక్తి. 


YSR  8 June 21 11:00 pm























Sunday, June 6, 2021

63. సెలయేరు

                                సెలయేరు
(మూలం: మారు మూల కొండ కోనల్లో, పర్వతాల మధ్య ఒక అర్థరాత్రి సమయంలో పుట్టిన సెలయేరు తన పుట్టుక గురించి  గొప్పగా ఇలా చెపుతుంది.)


• కానరాని, చేరలేని కీకారణ్యపు గర్భం లో,
 ఒంపుసొంపుల లోయల్లో,  వయ్యారమైన
 చిట్టడవుల్లో నే,   నా జన్మము.


• వీచే గాలి   చూచే నేల
  పూచే పువ్వులు  కాచే వెన్నెల 
  నా జన్మకు సాక్షులు.


• మిణుగురులు   కిచ్ కిచ కీచురాళ్లు  
  నా జన్మకు మంత్రసానులు.


• నా తల్లి  *వసుంధర    
  తండ్రి  *దినకరుని 
  యోగమే నా జన్మము.


• బుడ  బుడ పొంగే  పొంగులు, 
  పడి పడి లేచే  సుడులే, 
  చిన్నని, సన్నని నా తొలి అడుగులు.


• సాగే పయనం లో 
 *వనస్పతులు,   తామరలు, 
   కలువలు,  పారిజాతాలు,  *శిలలు 
   నా శ్రేయోభిలాషులు
   జలచరాలే  నా  తోబుట్టువులు.


• అలసి సొలసి దప్పిక తో చేరే 
  పక్షులు, కొంగలు, కోయిలలు
  వన్యప్రాణులే నా అతిథులు.


• వంక డొంక ల్లో సాగే అలుపెరుగని 
  ప్రయాణానికి  హోరుగ చేసే శబ్ధం
  నా గమ్యానికి ఇంథనం.


• రమణీయమైన  *రశ్మికాంతి(తం) తో 
  రంజించి రతనాలయిన రాళ్లు 
  నా స్పర్శతో స్పందిచి కోమలమైన 
  శిలలు ఎన్నో…ఎన్నెన్నో.


• నిరంతరం మలినాలను మాధుర్యం గా,
 జీర్ణించుకొని, మచ్చ లేని స్వచ్ఛతతో 
 అలరించే నా రూపమే నా స్వభావము.


• కొండ కోనల్లో ని నా సౌందర్యం 
  ఈ ప్రకృతి కే తలమానికం.

• సమస్త జీవులకు జీవనాధారమై, 
  జీవం పోసే చిరంజీవి ని నేను.
 

వసుంధర = భూమి
దినకరుడు = సూర్యుడు
వనస్పతులు  = అడవిలో వృక్షాలు
శిలలు = రాళ్లు
రశ్శికాంతి = సూర్యరశ్మి

యడ్ల శ్రీనివాసరావు  6 June 2021  11:30.



488. నా ప్రపంచం

నా ప్రపంచం • నా దొక   ప్రపంచం   అది   సోయగాల   సౌందర్యం. • నా  మనసెరిగిన   ప్రపంచం   మధువొలికిన     అనందం. • అందాల   ఆరబోతలు   ఆదమరచి   ...