సెలయేరు
(మూలం: మారు మూల కొండ కోనల్లో, పర్వతాల మధ్య ఒక అర్థరాత్రి సమయంలో పుట్టిన సెలయేరు తన పుట్టుక గురించి గొప్పగా ఇలా చెపుతుంది.)
• కానరాని, చేరలేని కీకారణ్యపు గర్భం లో,
ఒంపుసొంపుల లోయల్లో, వయ్యారమైన
చిట్టడవుల్లో నే, నా జన్మము.
• వీచే గాలి చూచే నేల
పూచే పువ్వులు కాచే వెన్నెల
నా జన్మకు సాక్షులు.
• మిణుగురులు కిచ్ కిచ కీచురాళ్లు
నా జన్మకు మంత్రసానులు.
• నా తల్లి *వసుంధర
తండ్రి *దినకరుని
యోగమే నా జన్మము.
• బుడ బుడ పొంగే పొంగులు,
పడి పడి లేచే సుడులే,
చిన్నని, సన్నని నా తొలి అడుగులు.
• సాగే పయనం లో
*వనస్పతులు, తామరలు,
కలువలు, పారిజాతాలు, *శిలలు
నా శ్రేయోభిలాషులు
జలచరాలే నా తోబుట్టువులు.
• అలసి సొలసి దప్పిక తో చేరే
పక్షులు, కొంగలు, కోయిలలు
వన్యప్రాణులే నా అతిథులు.
• వంక డొంక ల్లో సాగే అలుపెరుగని
ప్రయాణానికి హోరుగ చేసే శబ్ధం
నా గమ్యానికి ఇంథనం.
• రమణీయమైన *రశ్మికాంతి(తం) తో
రంజించి రతనాలయిన రాళ్లు
నా స్పర్శతో స్పందిచి కోమలమైన
శిలలు ఎన్నో…ఎన్నెన్నో.
• నిరంతరం మలినాలను మాధుర్యం గా,
జీర్ణించుకొని, మచ్చ లేని స్వచ్ఛతతో
అలరించే నా రూపమే నా స్వభావము.
• కొండ కోనల్లో ని నా సౌందర్యం
ఈ ప్రకృతి కే తలమానికం.
• సమస్త జీవులకు జీవనాధారమై,
జీవం పోసే చిరంజీవి ని నేను.
వసుంధర = భూమి
దినకరుడు = సూర్యుడు
వనస్పతులు = అడవిలో వృక్షాలు
శిలలు = రాళ్లు
రశ్శికాంతి = సూర్యరశ్మి
యడ్ల శ్రీనివాసరావు 6 June 2021 11:30.
No comments:
Post a Comment