Friday, July 30, 2021

74. నీ లోని నేను


నీ లోని నేను


• పలికే  పదాలకు   ఏమి తెలుసు, 

  నీ పెదవుల  కలయిక  తప్ప  ....

  నీ పలకరింపు లోని  పరవశం.


• ముసి ముసి  నవ్వులకు   ఏమి తెలుసు,

 మురిపించడం  తప్ప ....

 నీ   నవ్వులోని   ముత్యాల విలువ.


• అణుకువ లేని కోపానికి ఏమి తెలుసు, 

  కోలాహలం తప్ప .... 

  నీ కోపం వెనుక కోమల స్వభావం.


• గర్వానికి ఏమి తెలుసు,  

  గాంభీర్యం తప్ప ...

  నీ గర్వం లో  దాగి ఉన్నది   ఆత్మస్థైర్యం  అని.


• కారే   కన్నీటికి   ఏమి తెలుసు, 

  కలవరం తప్ప ....

  నీ కంటి వెనక కావ్యం.


• నీ  అంతర్యానికి  ఏమి  తెలుసు , 

  నిస్తేజం తప్ప  ....  

  తేజోవంతమైనదని   నీ జీవితం.


• నడిచే   పాదానికి   ఏమి తెలుసు, 

  నీ భారం  తప్ప  ... 

  నిను మోసే   భూమి  విలువ.


• బంధానికి  ఏమి  తెలుసు, 

  బందీలను  చేయడం తప్ప  ....

  ఇది   జన్మాంతర   బుణం అని.


• నేను  రాసే  రాతలకు   ఏమి తెలుసు, 

  ఎగుడుదిగుడు   కదలికలు తప్ప ....

  నా రాతలలోని   సజీవ  ప్రేమ  తత్వం.


• అనుకుంటేనే  తప్ప   

  నీవెవరివో  నేనెవరినో  .....

  లేకపోతే   నీవే నేను,   నేనే నీవు.


యడ్ల శ్రీనివాసరావు

30 July 2021 5:00 am 









Monday, July 26, 2021

73. బాల్య మిత్రుడు శ్రీహరి పుట్టినరోజు

 బాల్య మిత్రుడు సుంకరణం వెంకట నారాయణ రావు (శ్రీ హరి) పుట్టినరోజు సందర్భంగా  శుభాకాంక్షలతో….. 

మనసు లో ని మాట.

మిత్రమా శ్రీహరి ....

• నా మనసు చూసిన,  నీ బాల్యం బడి, గుడి, అమ్మా నాన్న కుటుంబం.

• మేని పర్వతం లాంటి, నీ ఉంగరాల జుట్టు కు అమ్మ రాసిన కొబ్బరినూనెతో  వెలుగొందుతూ ఉండేది......నీ ముఖారవిందం.

• పుస్తకాల సంచి లేక,  పరీక్ష అట్ట మీద పుస్తకాలు పేర్చి, ఒక వైపు చేతితో నిలువుగా శరీరానికి అదిమి పుస్తకాలతో తరగతి గదిలో అడుగిడిన నీ రూపం.......నా అంతరంగం లో చెరగని కావ్యం .

• రబ్బరు చెప్పుల కాళ్లతో,  మన్నును తాకుతూ , చిన్నిరాళ్లను తన్నుతూ , జిల్లేడు మొక్కలను పలకరిస్తూ , బడికి నడుస్తూ వచ్చే,  నీ  ఆ దృశ్యం ......నేటికీ ఒక మధురమైన అపురూపం.

• మన మసకబారిన( *సౌకర్యాలు,  సిరిసంపదలు లేని కాలం) బాల్యంలో మకరందాన్ని ఆస్వాదించిన ....ఔన్నత్యం  తోనే  మట్టిలోని మాణిక్యమయ్యావు.

• ఆకలి లో ఆనందాన్ని…..బాధల్లో బలాన్ని…...కష్టాల్లో కరుణ తో ,   నీ మనసు కి స్నేహం చేయించి…....ఆ స్నేహం తోనే జీవిత పునాది ని నిర్మించావు.

• తల్లిదండ్రులే ఆస్తి అంటావు.....ఎదగడం అంటే ఒదగడం అని.....సంస్కారం అంటే శాంతం అంటావు.

• నాన్నను చూస్తూ,  నాన్నతో ఉంటూ , నాన్నను నీలో నింపుకుని, నాన్న బాటలో నడుస్తూ,  నాన్న వంశానికి నాన్నయై......చివరికి  శాశ్వతంగా  నాన్నను   నీలో  జీవించేలా చేశావు.....ఏ జన్మ పుణ్యఫలమో.

• మాట తో  కాకుండా మనసు తో స్పందించే నీ వ్యక్తిత్వం…. ప్రకృతి వరం.

• ముక్కలవుతున్న  నేటి కాల ఉమ్మడి కుటుంబ బంధాల విభేదాలకు ముకుతాడు వేసి,  ఐకమత్యం తో ముచ్చటగా ముడివేసి చేసే నీ వైనం….అద్భుతం.

• "దేహం తో  కంటే కూడా , ఆత్మశుద్ధి తో చేసే కార్యక్రమాలే  చిరస్మరణీయం"…..అని చాటి చెప్పే  నీ అంతర్ముఖం….ఆదర్శప్రాయం.

• ప్రశంసలు తాకలేని నీ కర్ణభేరి .....కీర్తి ప్రతిష్టలకు  మైనం(wax) కాని  నీ మనసు.....సహాయానికి అర్థం హృదయస్పందన అనే నీ సంస్కారం….పరమాత్ముని అనుగ్రహం.

• సమస్యలను సృష్టించడం కాదు….. సమస్యలను పరిష్కరించడమే రాజనీతి అనే నీ విధానం…. వయసు  పెరిగినా , పెరుగుతూ ఉన్నా  మానసిక పరిపక్వత లేని ఎందరికో కనువిప్పు.

• స్వఛ్చత,  పారదర్శకత,  నిష్కళంకం ,  నిర్మలత్వం  మాత్రమే గిరి దాటి ,  నీ దరి చేరగలవు….. స్వీయ శోధన.

• తామరాకుపై నీటి బిందువు లాంటి నీ జీవితం, విలువలకు అద్దం లాంటి నీ వ్యక్తిత్వం…..ఎంతో మందికి ఆదర్శం.🙏

( ఇది  ఈశ్వరుని అనుగ్రహంతో సాధ్యమైన, అంతరంగం లోని భావం.)

నీ బాల్య మిత్రుడు,

యడ్ల శ్రీనివాసరావు. 27 July 21.


Wednesday, July 7, 2021

71. నటరాజ వైభవం

                            నటరాజ వైభవం

( చిదంబరంలో శివుడు నటరాజ స్వరూపుడై, నిరాకారుడిగా కొలువబడుతున్నాడు. చిదంబర రహస్యం ఏమిటంటే “భక్తుడు తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భగవంతుడు తన భక్త్తుడి అజ్ఞానాన్ని తొలగింపచేసి, ఆయన యెక్క దర్శన ప్రాప్తి కలిగించి, ఆయన ఉనికిని అనుభవించేసి, ముక్తిని ప్రసాదిస్తాడు.”)

• నటరాజ నీ రూప నీరాజనం......కనులారా అరవింద శ్రీ రాజసం.

• రసరంజ రాగానికి నర్తించే నీ నాట్యం.....సృష్టి స్థితి లయల సోపానం‌.

• బ్రోటనవేలి బింబం పై తాండవమాడే అభినయాల ఆనందరూపా.

• నవరసాల అష్టాశత(108) భంగిమలతో నలుదిక్కుల నడయాడే నీ నాట్యం విశ్వ సమ్మోహనాస్త్రం.

• నీ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాలే  జనన మరణాల చక్రం.

• నీ జటాజూట అలల తరంగాలకు,  మా డబ్బెది రెండు వేల నాడులు కంపనలై, ప్రకంపనలై అణువణువున జ్వలించెను మా లో  ఓంకారం.  

• ఆహా!  ఏమి ఈ అద్భుతం ఈశ్వరా!  పరమేశ్వర!.

• నీ అడుగుల సవ్వడులే ఖగోళ కదలికల పర్యంతం.

• నీ చూపుల మోహం.....అనంత విశ్వ తారల తళుకుల తేజం.

• నీ దేహం అనంత వాయువుల  ఖగోళ శక్తికి కర్మాగారం.

• అజ్ఞానాన్ని అణగదొక్కే నీ పాద సంకేతం.....మానవ జన్మ స్థితికి కారకం.

• నీ రూపం నిరాకారం.....అదియే చిదంబర రహస్యం.

• చిదానంద రూపం.... శివోహం శివోహం.🙏


YSR  7 July 21 11:00 pm.

796. గంగ లో మునిగితే పాపాలు పోతాయి

  గంగ లో మునిగితే పాపాలు పోతాయి 🤔 ! భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో అనాదిగా మనం కొన్ని ఆధ్యాత్మిక ఆచారాలు  పాటిస్తూ ఉంటాం. ఇవి సూక్ష్మ జ్ఞ...