Sunday, November 1, 2026

796. గంగ లో మునిగితే పాపాలు పోతాయి

 

గంగ లో మునిగితే పాపాలు పోతాయి 🤔 !


భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో అనాదిగా మనం కొన్ని ఆధ్యాత్మిక ఆచారాలు  పాటిస్తూ ఉంటాం. ఇవి సూక్ష్మ జ్ఞానం తో మానవ శ్రేయస్సు కోసం మునులు యోగులు జ్ఞానులు ఎంతో దివ్య దృష్టి , దూరదృష్టితో ఏర్పాటు చేసినవి. ప్రతి ఆచారం వెనుక ఒక విజ్ఞానం మరియు జ్ఞాన సూక్ష్మం ఇమిడి ఉంది. దురదృష్టవశాత్తు వాటి అర్దం , యధార్థం సరిగా తెలియనపుడు , సత్యం మరుగున పడుతుంది.


నేటి కలియుగం లో పాపాలు చేయని మనిషి ఉండడు . చేసిన పాపాలు కాశీ వెళ్ళి గంగలో మునిగితే పోతాయి అని , పుష్కరాల పేరిట వివిధ ప్రాంతాలలోని నదులలో స్నానం చేస్తే చేసిన పాపం పోయి పుణ్యం ప్రాప్తిస్తుందని అంటుంటారు.  

ఇది వాస్తవమేనా? అంటే కాదు. 




గంగా నది లో స్నానం చేస్తే పాపాలు పోతాయి ? లేదా పుణ్యం వస్తుంది ?

కాసేపు , ఇది నిజమే అనుకుందాం . మరి కాశీ లో జీవిస్తున్న వారంతా ప్రతి రోజూ ఆ గంగలోనే స్నానం చేస్తున్నారు. ఆ గంగ నీరే సేవిస్తూ ఉంటారు. మరి అక్కడ నివసించే వారందరూ చేసిన ఘోర పాపాలు నేటికి తొలగి పోయినట్లే నా ? ప్రతి రోజు స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం జమ అయినట్లే నా ?   

గంగా స్నానం చేయడం వలన పుణ్యం వస్తే , కాశీ ప్రజలకు బాధలు, సమస్యలు, దుఃఖం అనే వాటన్నింటికి   అతీతంగా అయిపోయి సుఖ సంతోషాలతో జీవించాలి కదా ?  మరి కాశీ ప్రజానీకం మొత్తం ఆ స్థితి లో నేడు జీవిస్తున్నారా? ఎందుకంటే పాపం తొలగిన వారు దుఃఖం , కష్టం అనేవి ఎరుగక సంతోషంగా జీవిస్తారు . 


అదే విధంగా భారతదేశంలో ఎన్నో పవిత్రమైన నదులలో నిత్యం ఎంతో మంది స్నానం చేస్తారు . ఈ విధంగా అందరికీ తమ పాపాలు తొలగి పోతే  మనిషి కి భగవంతుని తో అవసరం ఏముంటుంది ? 




గంగా స్నానం వలన ఎవరికీ ఎటువంటి పాపాలు తొలగవు . గంగా నది ఎంతో ఎతైన హిమాలయాలు నుంచి ప్రవహించి , మధ్యలో ఎన్నో అడవులు, వాటిలో వనమూలికా వృక్షాలను తాకుతూ ఉండడం వలన, ఆ నీరు ఔషధ గుణాలను సంతరించుకుని ప్రవహిస్తూ ఉంటుంది. అందులో స్నానం చేయడం వలన శరీరంపై ఉన్న కొన్ని రుగ్మతలు తొలగి మనసు తేలిక అయి కొంత ఉత్తేజం తో నిండిన శక్తి తాత్కాలికంగా అనుభవం అవుతుంది.


 అంతేకాని మనిషి చేసిన పాప కర్మలు , నీచమైన పనులు , హింసాత్మక ఆలోచనలు గంగలోనే కాదు , ఏ పుష్కర నదీ స్నానం చేసిన అణువంత కూడా తొలగనే తొలగవు . పాప కర్మలు ఏ రీతిలో  ఎలా చేయడం జరుగుతుందో , అదే రీతిలో తిరిగి మనిషి అనుభవించినపుడు మాత్రమే తొలుగుతాయి. 


కార్తీక పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేస్తే పుణ్యం అంటారు . ఇందులో పుణ్యం సంగతి ఎలా ఉన్నా. . . పౌర్ణమి రోజున చంద్రుని గురుత్వాకర్షణ శక్తి మరింత ఎక్కువ గా భూమి పై ఉంటుంది. తెల్లవారుజామున వచ్చే వెన్నెల ద్వారా ఈ శక్తి మనిషి మనసు ను శక్తి వంతం గా చేస్తుంది. మానసిక ఆందోళనలు తొలగుతాయి. సముద్ర లవణాల నీరు ఎన్నో రకాల చర్మ వ్యాధులను నయం చేస్తుంది. ఇది ఆరోగ్య సూక్ష్మం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేయమని చెప్తారు . 



భారత దేశం లో  ఎన్నో నదులు  ఉన్నాయి. అందులో కొన్నింటిని పుణ్య నదులు అని , పవిత్రమైనవి అని ఎందుకు అంటారంటే , అవి ఎంతో ఎత్తైన కొండలపై ఆరంభమై , స్వచ్చమైన నీరు తో , ఏ రకమైన కలుషితం కాకుండా, వనమూలిక వృక్షాలను తాకుతూ ప్రవహిస్తూ , ఆ నీరు ఔషధ తత్వాన్ని కలిగి ఉంటుందని గ్రహించిన మునులు యోగులు జ్ఞానులు అందులో మానవులు స్నానం చేయడం వలన దేహం , శరీరం శుద్ధి అవుతుంది అని ప్రాచీన కాలంలో చెప్పారు . 

అంతేకానీ నీటిలో మునగడం వలన ఆత్మ శుద్ది జరగదు . ఆత్మ శుద్ది జరగాలంటే  నీటి గంగ లో కాదు  జ్ఞాన గంగ లో మునగాలి . అనగా శివ పరమాత్ముని జ్ఞానము లో తరించాలి.  

పాపాలను తక్కువ దుఃఖం తో   తేలికదనం తో అనుభవించే లా  చేసి తొలగించేది  , ఆత్మ శుద్ది చేసేది జ్ఞాన గంగ మాత్రమే. 


ఈ జ్ఞాన గంగ ను శంకరుని జటాజూటం లో నీరు ప్రవహిస్తున్న విధంగా చిత్రాలలో (ఫోటో లలో) చూపించారు.  

శంకరుడు తన తపో ధ్యాన దీక్ష వలన శివుని యొక్క దివ్య జ్ఞానం తన మస్తిష్కం నుంచి గంగా జలం వలే  బయటకు వచ్చింది  అనడానికి చిహ్నం గా ఆ చిత్రం గీశారు . అంతే గానీ అది నీటి గంగ కాదు, జ్ఞాన గంగ. . . . (అసలు తల లోనుంచి నీరు ఫౌంటెన్ వలే బయటకు  చిమ్మడం  ఎవరికైనా అసాధ్యం. కానీ జ్ఞాన సూక్ష్మానికి ప్రతీక గా చిత్రం లో చూపించారు . భక్తి మార్గం లో కధలు అనేకం ఉంటాయి. జ్ఞాన మార్గంలో సత్యం ఒకటే ఉంటుంది. ఆ సత్యమే శివుడు. ) 


నేడు భక్తి ఒక పెద్ద వ్యాపారం . దీనికి టి.వి., యూట్యూబ్ ప్రచార మాధ్యమాలు చేసే హడావిడి ఇంతా అంతా కాదు. మనుషుల అమాయకమైన నమ్మకాలకు , విపరీతమైన ఖర్చు తో కూడుకున్నది గా నేటి దైవ భక్తి విస్తరించి ఉంది. మనిషి సత్యం యదార్ధం తెలుసుకో నంత వరకు తనకు తాను మోసపోతునే ఉంటాడు . 


అసలు మనిషి ని సృష్టించింది భగవంతుడు . ఆ భగవంతుని  చేరడం కోసం, మనిషి అష్టకష్టాలు పడుతూ , ఆర్భాటాలతో విపరీతమైన ధనం ఖర్చు చేస్తూ యాత్రలు , నదీ స్నానాలు చేస్తూ భగవంతుని ని అన్వేషణ చేయడం అనేది. కలి మాయా ప్రభావం. ద్వాపర కలియుగాల నుంచి మానవుడు ఈ విధంగా  ప్రవర్తిస్తూ నే ఉన్నాడు . ఎందుకంటే , మనిషి తన ఆత్మ శక్తి ని  పూర్తిగా కోల్పోయి , భగవంతుడు అంటే ఎవరో అనే యధార్థం మరచి పోవడం వలన.


భగవంతుడు ఒక్కడే  అని ఎవరిని అడిగినా చెబుతూ ఉంటారు . మరి , ఆ ఒక్కడూ ఎవరు అని అడిగితే , ఒకొక్క  పేరు చెపుతారు . ఎందుకంటే స్పష్టత లేక పోవడం వలన. 


ఆహ్లాదం కోసం నదీ స్నానాలు చేయడం మంచిదే , మనసుకి కాస్త ఆటవిడుపు గా ఉంటుంది …. అంతేకానీ, తలపైన పాపాలు పోతాయని దూర తీరాలకు ప్రయాణించి ఏ నదీ స్నానాలు చేసినా అది మనిషి యొక్క అమాయకత్వమే .  పైగా నేటి కాలంలో  , గంగ తో పాటు అనేక నదుల నీరు కూడా అత్యంత కాలుష్యము తో  కలుషితం అయిపోయాయి . ఇది కూడా మనిషి  , ప్రకృతి పట్ల చేసిన . . . చేస్తున్న పాపమే.  ఈ స్నానాల కోసం వెళ్ళి ఎన్నో ప్లాస్టిక్ వ్యర్ధాలు నదులలో కలపడం, ఇంటిలో పూజలు చేసి తీసుకెళ్ళి కుళ్ళిన చెత్త నదులలో చెరువు లలో కలపడం,  పరిశ్రమల వ్యర్ధాలు నదులలో కలపడం. . . పాపం అమాయకమైన మనిషి ఇదంతా చేస్తూ ఉంటాడు . ఎందుకంటే రేపు వీటన్నిటికి బలిహరం కావలసింది అమాయకమైన మనిషే  కాబట్టి.


ఆత్మ చైతన్యం సత్యమే చెపుతుంది.  రాస్తుంది.

స్వ పరివర్తనే  విశ్వ పరివర్తన. 



ఓం శాంతి 

శివ బాబా (శివుడు తండ్రి)

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 1 Nov 2026 11:45 AM.


No comments:

Post a Comment

796. గంగ లో మునిగితే పాపాలు పోతాయి

  గంగ లో మునిగితే పాపాలు పోతాయి 🤔 ! భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో అనాదిగా మనం కొన్ని ఆధ్యాత్మిక ఆచారాలు  పాటిస్తూ ఉంటాం. ఇవి సూక్ష్మ జ్ఞ...