Sunday, May 31, 2026

750. తాడు ను తెంపకండి “సాగ” దీయండి

 

తాడు ను  తెంపకండి   “సాగ” దీయండి



• మానవ సంబంధాలలో అభిప్రాయ భేధాలు కలగడం సహజం , కలహాలు సంభవించిడం సర్వ సాధారణం. ఇవి ఒకోసారి తారాస్థాయికి చేరుకుంటాయి. ఒకరితో మరొకరు కలిసి ఉండలేనంతగా , ఒకరిని మరొకరు భరించలేనంత పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది .

 ఈ సమస్య ప్రతి మనిషి తన జీవితంలో ఏదో సమయం లో ఎవరో ఒకరితో ఏదో ఒక సందర్భంలో అనుభవించ వలసి వస్తుంది . ఆ సమయంలో వ్యక్తుల మధ్య కలహాలు , దూషణలు పెరుగుతాయి . ఓర్పు సన్నగిల్లి ఆ బంధాన్ని  తుంచి వేయాలి , కట్ చేసుకోవాలి  అనిపిస్తుంది .


• బంధాలు  ఎటువంటివి అయినా సరే బలవంతంగా తెంపకండి , కట్ చేయకండి . ఎందుకంటే ఆ బంధం వేసుకున్నది , కలుపుకున్నది మనమే కాబట్టి . ఆ బంధం లో సమస్య ఉంటే , అది సరియైన బంధం కాకపోతే , ఆ బంధాలలో వ్యక్తుల మధ్య పొంతన కుదరకపోతే కనుక ఆ బంధాన్ని  కొన  “సాగ” నివ్వండి .


• బంధం అంటే మనకు మనం గా , కోరుకొని పెన వేసుకున్న, లేదా ముడి పెట్టుకున్న తాడు. దానిని బలవంతంగా తెంపకూడదు, ఆ బంధం లోని వ్యక్తులతో సమస్యలు వచ్చి నప్పుడు మనకు మనం కట్ చేయకుండా , కాస్త ఓర్పు వహిస్తే . . . ఆ బంధం సాగి సాగి అనగా పలచబడి దానంతట అదే సహజం గా తెగిపోతుంది  , లేదంటే బంధం లోని సమస్య పరిష్కారం అవుతుంది. 

• అంతవరకు ఆ బంధాన్ని కాస్త భరించే గలిగితే ఏదో రూపంలో ఏదో విధంగా ఎవరో ఒకరి సహాయం వలన సహజంగా తెగిపోతుంది . అంతే కానీ బలవంతంగా మాటలతో చేతలతో ఆ బంధాన్ని తెంపకూడదు .


• బంధాలు అనేవి చేసిన కర్మల అనుసారం మనిషికి ఏర్పడతాయి . మనిషి  తనకు తాను కోరుకొని కలుపుకొని  ఏర్పరుచుకున్నవి . ఇందులో భగవంతుని ప్రమేయం ఉండదు . ఎందుకంటే ఏ మనిషి కూడా భగవంతుని ఆమోదం తీసుకొని బంధాన్ని కలుపుకోడు . మనిషి  తన అవసరం కోసమే బంధాలను సృష్టించుకుంటాడు .


• ఈ బంధాలు అనేవి కర్మ బుణాలు. ఒకవేళ మనకు ఒకరితో ఇబ్బంది ఉంది అని బంధాన్ని కట్ చేస్తే , అదే  ఇబ్బంది కర స్థితి తో  కూడిన కర్మ మరొకరితో తప్పకుండా  ఆరంభం అవుతుంది. ఇది పరమ సత్యం . 

బంధాలలో ఉన్న కర్మ బుణం అనేది  మనిషి కి ఎవరితో  ఏ విధంగా ఉన్నా  ఆ  వ్యక్తులతో తీరి పోవలసిందే . బంధాల లోని వ్యక్తులు ఇబ్బంది పెట్టే స్థితి ఉంటే ఓర్పు  వహించి  సహించి  కాలానికి  వదిలెయ్యండి , భగవంతుడుని  స్మరించండి . ఎందుకంటే కాలంలో కాలుడు (శివుడు) ఉంటాడు. ఆ సమస్యాత్మక బంధాలను ఎలా పలుచగా (dilute) చేయాలో కాలుడికి తెలుసు . అప్పుడు ఆ బంధం అనే తాడు సాగి సాగి  సన్నగిల్లి  సహజంగా తెగిపోతుంది లేదా పరిష్కారం అవుతుంది .


• బంధం అంటే ఏదైనా కావచ్చు . . . స్నేహబంధం , ప్రేమ బంధం, దాంపత్య బంధం, రక్త(సం)బంధం, అక్రమ(సం)బంధం , వ్యాపార బంధం . ఇలా ఎన్నో ఎన్నెన్నో  మానవుడికి దుఃఖం, అశాంతి కలిగించేవి ఈ బంధాల లోని పాత్ర లే .

కర్మ ఏ రూపంలో ఎవరితో ఎలా ఉన్నా అనుభవించ వలసినపుడు అనుభవించ వలసిందే. ఆ కర్మ ను బలవంతంగా తుంచకూడదు . శివుని స్మృతి లో ఆ కర్మ ఆచరించడం వలన తేలికగా తొలగిపోతుంది.


గమనించాలి . . .

 ఈ రచన యొక్క అర్దం ఎవరూ కూడా బంధాలను ఏర్పరచుకోవద్దు  అని కాదు , బంధాలకు  దూరంగా ఉండమని అసలే కాదు .   బంధాల ద్వారా వ్యక్తులను  భరించ లేని స్థితి కలిగినపుడు , సమస్యలు వచ్చినప్పుడు , కట్ చేయకండి . ఓర్పుతో ఉండండి. 

భార్య భర్తలు  విడాకులు వంటివి తీసుకోకండి . రక్త (సం)బంధీకులు ఆస్తుల కోసం హింసకు పాల్పడకండి .  స్నేహితులు  మాటలతో  ఈర్ష్య ద్వేషాలు తో  దూషించుకోకండి .  ప్రేమికులు  నమ్మించి  మోసం చేసేలా  జిత్తులమారి  నటన వేషాలు అవలంభించకండి . 

వీటన్నింటి బదులు భగవంతుని స్మృతి చేయండి . మీకు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే బంధాలలోని వ్యక్తులతో  శాశ్వత విముక్తి లభిస్తుంది లేదంటే కనీసం వారిలో మార్పు వస్తుంది . మీ సమస్య తీరి సంతోషంగా ఉంటారు . ఇది పరమ సత్యం .


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 31 May 2026 , 10:00 AM.


Saturday, May 30, 2026

749. విదేశీయుల శివ సాన్నిధ్యం

 

విదేశీయుల  శివ సాన్నిధ్యం


Arunachalam 

•  2017 వ సంవత్సరంలో ,  నేను , నా భార్య    మా అబ్బాయి  కలిసి అరుణాచలం వెళ్ళాం . ఆ సమయంలో మా అబ్బాయి 8 వ తరగతి చదువుతున్నాడు .


• ఆ రోజు ఆలయం లో  శివుని దర్శనం అయిన తరువాత చూస్తే  చాలా మంది విదేశీయులు కనిపించారు.  అక్కడ నుంచి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము . అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది . ఎటు చూసినా నెమళ్లు కనిపిస్తున్నాయి. ఆశ్రమ ప్రాంగణం లోపల , రమణుల సమాధి వద్ద కొందరు , ఆ ప్రక్కనే ఉన్న శివలింగం ఎదుట అనేక మంది విదేశీ స్ర్తీ లు చీర లో , విదేశీ పురుషులు పైజామా లాల్చీ లో వస్త్రాలు ధరించి లో శివ ధ్యానం చేయడం కనిపించింది. వారిలో ప్రతి ఒక్కరికీ నుదుట కుంకుమ బొట్టు ఉంది . ప్రత్యక్షం గా అదంతా చూస్తున్న నాకు చాలా ఆశ్చర్యం గా అనిపించింది .


• భారతదేశం లో ఉన్న మనం శివుని ఆరాధించడం అనేది మన హిందూ సాంప్రదాయం లో భాగం గా , భక్తి సంస్కృతుల పరంపరలో మనకు సహజంగా అలవడతాయి.

 కానీ విదేశీయులు, వివిధ పాశ్చాత్య దేశాల్లో పుట్టి , భిన్న సంస్కృతి సంప్రదాయాల్లో పెరిగిన వారు, అసలు దైవ భక్తి , మన ధర్మం తెలియని వారు , ఇంకా చెప్పాలంటే భారతదేశ మూలాలకు ఏ సంబంధం లేని వారు శివుని పూజించడం , ధ్యానించడం ఏమిటి ?  పైగా ఎన్నో సముద్రాలు దాటి ఇంత దూరం అసలు శివుని ఆలయానికి , రమణుల ఆశ్రమానికి ఎలా వస్తారు?. విలాసాల జీవనానికి మొగ్గు చూపించే విదేశీయులు ఇంత నిరాడంబరంగా ఎలా ఉంటున్నారు ? అని ఎన్నో ప్రశ్నలు మనసు లో వచ్చాయి . కానీ సమాధానం దొరకలేదు.


• రమణాశ్రమం లో కాసేపు నేను, నా కుటుంబం తో ధ్యానం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాం . మేము బస చేసిన  శివ సన్నిధి సత్రం  వద్దకు వెళుతూ ఉండగా , అరుణాచలం రోడ్ మీద సైకిళ్ళు తొక్కుతూ కొందరు విదేశీ స్త్రీ పురుషులు చీర, లాల్చీ పైజామా లో కనిపించారు . అలానే మేము నడుస్తూ కొంచెం ముందుకు  వస్తుంటే మరి కొందరు విదేశీయులు చెప్పలు లేకుండా నడుచు కుంటూ మాకు ఎదురయ్యారు . వాళ్లు మమ్మల్ని , ఇంకా రోడ్ పై వెళ్లే మరి కొందరిని చాలా ప్రశాంతంగా కళ్లలో కి కళ్లు పెట్టి చూస్తూ , ఓం నమఃశివాయ అంటూ చిరు నవ్వుతో పలకరిస్తూ వెళ్తున్నారు .


• అది చూసిన నాకు, మా అబ్బాయి కి కూడా చాలా వింతగా అనిపించింది. వెంటనే మా అబ్బాయి అడిగాడు, నాన్నా ఫారినర్స్ అంతా లగ్జరీ ఎంజాయ్ మెంట్ , డిఫరెంట్ కల్చర్ లో ఉంటారు కదా, వీళ్లు ఏంటి ఇక్కడ ఇలా మన ఏన్షియంంట్ సేజ్ స్ (పూర్వ కాలం మునులు) వలే జుట్టు పొడవుగా పెంచుకుని ఉన్నారు , అని అడిగాడు. అప్పటికే అవే ఆలోచనలు ప్రశ్నలు నా మనసు లో తిరుగుతూ ఉండడం, వాటికి సమాధానాలు నా వద్ద లేక పోవడం వలన మౌనం గా ఉండి పోయాను .


• ఎవరినైనా ఈ విషయం గురించి అడిగితే సంతృప్తి కరమైన సమాధానం చెప్పలేదు . కానీ అక్కడ ఉన్న కొందరు ఇలా చెప్పారు , విదేశీయులు అనేక మంది ప్రతి సంవత్సరం లో ఆరు లేదా మూడు నెలలు పాటు అరుణాచలం వచ్చి ఆ సమయం అంతా శివాలయం లోను మరియు, రమణాశ్రమం లోనూ ధ్యానం చేస్తూ ఉంటారు , అని చెప్పారు.


• కానీ , మనం భగవంతుని పై సత్యమైన నమ్మకం విశ్వాసం ఉంచినప్పుడు కాస్త ఆలస్యమైనా మనకు తప్పక మనకు కావలసిన సమాధానం , లేదా మనం పొందవలసినవి తప్పక పొందుతాం. ఎందుకంటే ఇది భగవంతుని బాధ్యత. 

ఇది నాకు అనేక సందర్భాల్లో, అనేక విషయాలలో నిరూపణ అయింది, ఇంకా నేటికీ అవుతూనే ఉంది, అవసరం లేనివి నా నుంచి  ఏదో రూపంలో  దూరం అవడం , అవసరం అయ్యేవి మాత్రమే దగ్గరగా ఉండడం శివలీల అనిపిస్తుంది .

• అరుణాచలం లో  విదేశీయుల గురించి తలెత్తిన సందేహం మనసులో అలాగే అప్పటి నుంచి మిగిలి పోయింది.


🌹🌹🌹🌹



North Carolina , USA

• 2025 లో సంవత్సరం లో నేను, మా అబ్బాయి కలిసి శివరాత్రి సమయం లో రాజస్థాన్ లో , మౌంట్ అబూ, బ్రహమకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయానికి వెళ్లాము . పది రోజులు అక్కడే ఉన్నాము . శివరాత్రి సమయం లో తండ్రి అయిన పరమాత్మ శివుని తో  మిలనం (కలయిక) అత్యంత మనో  వైభవంగా   మౌంట్ అబూ లో  జరుగుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా పోర్చుగీసు, డచ్ , రష్యా , అమెరికా , ఆస్ర్టేలియా , ఇండొనేషియా , జపాన్ , ఇరాన్ , ఇలా ఎన్నో వివిధ దేశాల నుంచి వేలాది మంది విదేశీయులు వచ్చి ఉన్నారు . నాకు మరలా అదే ఆశ్చర్యం, అసలు విదేశీయులు ఏంటి , ఇంత దూరం రావడం,  వీరంతా  శివుని గురించి తెలుసుకోవడం,  శివధ్యానం చేయడం వెనుక ఏదో బలమైన  సూక్ష్మ రహస్యం ఉంటుంది అని మనసులో అనిపించింది .


• నా ఈ సందేహానికి మౌంట్ అబూ లో ఉండగానే  ఆ మరుసటి రోజు నే ,  శివ పరమాత్ముని గీతా జ్ఞానం  క్లాస్  (మురళి)  ద్వారా  సమాధానం లభించింది . ఆ సమాధానం చాలా అద్భుతంగా ,  ఆధార భరితంగా  , ఈ విధంగా ఉంది .

ఈ సంగమ యుగం లో   (కలియుగం అంతం అవుతూ, సత్య యుగం ఆరంభం అయ్యే కాలం) . . . నేను (శివ పరమాత్మ) తిరిగి సత్య యుగ స్థాపన కు భరత భూమి పై వృద్ధ మానవ తనువు లో అవతరిస్తాను .

• ఈ విశ్వం   ఆది లో  అనగా కల్పం (5000 సంవత్సరాల) క్రితం సత్య యుగం లో ఎవరైతే నా పిల్లలు (ఆత్మలు) , ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన  వారు  ఎవరైతే  ఉన్నారో , . . వారంతా జనన మరణ చక్రంలో తిరుగుతూ కాల క్రమేణా వేరు వేరు ధర్మాలలో కి  వెళ్లి పోయారు .

బౌద్ధ , క్రిష్టియన్ , ముస్లిం , జైన్ , సిక్కు , ఇలా ప్రపంచ వ్యాప్తంగా  వందకు పైగా అనేక ధర్మాలలో కి వెళ్లి ఉన్నారు . 

 నేను (శివ పరమాత్మ) భూమి పై అవతరించిన ఈ కలియుగాంత సమయం లో , ఈ విశ్వం అంతా నిండి ఉన్న  నా పిల్లలు (ఆత్మలు) ఎవరు ఏ ధర్మానికి చెందిన వారైనా సరే . . . ఆదిలో  సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన  నా పిల్లలు (ఆత్మలు) నన్ను వెతుక్కుంటూ  వారి మూల స్థానం అయిన ఈ భరత భూమి కి చేరుతారు . తిరిగి నన్ను కలిసి నా ద్వారా  రాజయోగం పొందుతారు . అని స్పష్టం గా గీతా జ్ఞానం ద్వారా ఆ రోజు సమాధానం లభించింది . . . 


• అప్పుడు నాకు అర్దం అయింది ఒకటే … అరుణాచలం లో  నేను చూసిన విదేశీయులు , ఎక్కడో విదేశాలలో క్రిష్టియన్, జోరాస్ట్రియన్ , ఇస్లాం , బౌద్ద ధర్మాలలో నేడు పుట్టినవారు . . . కొన్ని యుగాల క్రితం భారతదేశ సంతతి కి చెందిన వారు . వారు అప్పటిలో శివుని ఆరాధించే వారు . వారు (ఆ ఆత్మలు) జననం మరణం పొందుతూ తమ మూలాలను మరచి , కలియుగం లో వేరు వేరు ధర్మాలలో వివిధ దేశాల లో జన్మించారు .

తిరిగి  ఈ కలియుగాంత సమయం లో , శివుడు అవతరించిన ఈ సంగమ యుగం లో , వారంతా తాము పూర్వజులం అనగా ఎన్నో జన్మలు ఎత్తిన వారం అనే విషయాన్ని శివ శక్తి ద్వారా అనేక ఆధారభరిత అనుభవాలను వారు స్వయం గా పొంది , ఒకప్పుడు తాము ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారము అని తెలుసుకుని నేడు , భారత దేశం లో ఉన్న ఉన్న శివుని ఆలయాలకు , ఆశ్రమాలకు చేరుకుంటారు . . . చేరు కుంటున్నారు .


• శివుడే స్వయంగా గీతా జ్ఞానం ద్వారా,  నా మనసు లోని  ఈ సందేహానికి సత్యమైన సమాధానం ఆధారంతో చూపిస్తూ తెలియచేయడం జరిగింది .

 ఇలాంటి అనుభవాలు ఎన్నో. . . అందుకే శివుని తో ప్రయాణం అత్యద్భుతం. అది అనేక భవిష్య జన్మలకు కావలసిన భోగ భాగ్యం.


శివుడు అంటే ఒక విశ్వ మహ శక్తి .   అంతే కానీ ప్రత్యేకంగా ఒక మతానికి పరిమితం అయిన వాడు కాదు .  ఇటీవల ఇరాన్, అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో , ఇరాన్ ప్రజలు  శివుని పూజించడం, ప్రార్థనలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో లింక్ 👇👇 . వేల సంవత్సరాల క్రితం , ఆ యా దేశాలలో  వారు ఉపయోగించిన నాణేల పై  శివలింగం ఉండడం గమనించవచ్చు. 


1. 

https://youtu.be/av-_Ivs6FmY?si=N7JkOD4Fm6ggqmKA



2. 

https://youtu.be/y2OAJlCjBGY?si=3qtJxnXrHrwD-nN5




ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 30 May 2026 . 9:00 PM .


Friday, May 29, 2026

748 . నేను ఒంటరిని కాను

 


నేను ఒంటరిని కాను



• నేను  “ఒంటరిని” కాను  అని  ఈ సమాజానికి ఎలా చెప్పాలి అని నేను “ఒంటరిగా” కూర్చొని ఆలోచిస్తున్నాను . బాల్యం లో ఒంటరితనం అనే బీజం బాధించేందుకే అనిపించినా, అది బ్రతుకు బంగారు బాట కోసం అని శివుని తత్వం తో అనుభవం అయింది . భగవంతుని రచన (script) అమోఘం . ఆ మూలాన్ని అర్దం చేసుకోవడం అసాధారణం . స్వయం భగవంతుడే  వచ్చి అర్దం చేయించినపుడే అది తెలుస్తుంది .


• నేను ఒంటరిని కాను . అనేక జన్మల కొరకు నాకంటూ ఒక శాశ్వతమైన తోడు నీడ కలిగి ఉన్నాను . ఆ తోడు తోనే జీవిస్తున్నాను , ఆ నీడలోనే నడుస్తున్నాను . . .  ఒకోసారి , నువ్వు భగవంతుడు అనే భ్రమ లో (లోకం భాష లో పిచ్చి) ఉన్నావు , అని  నా చుట్టూ ఉన్న మాయ నాకు గుర్తు చేసిన క్షణం లోనే , ఏదో అసాధారణమైన శక్తి తో అద్భుతాలను నాకు అందిస్తూ ,  ఆ మాయా భ్రమ లకు తెర దించుతూ,  చీకటిని  మరింత తొలగించి స్పష్టం గా చూపిస్తూ , వాటిని చవిచూసేలా చేస్తూ , నేను నీతో ఉన్నాను అంటాడు శివుడు . ఇంతకు మించి ఏం కావాలి.


• కాలం లో కలం ఒకోసారి కలకలం సృష్టిస్తోందా అనిపిస్తుంది. జీవితం లో ముగింపు లేని కథలకు , వాటి పాత్రలతో నాకు పని ఏంటి ? అలాగని నన్ను నేను తీరం చేరని కెరటం అనుకోలేను కదా? నా ప్రయాణం సంద్రమైనా తీరం చేరడం నాకు ముఖ్యం కదా!


• నేను మనసుతో నవ్వితే సమాజం నన్ను వెర్రి అనుకుంటుంది , మౌనం గా ఉంటే బ్రతకడం చాత కాదు అంటుంది , కానీ నా ఆనందం  నాలోనే నాతోనే .   

నేను నలుగురిలో ఉంటే ఇబ్బంది పడుతున్నాను అని సమాజం ఈ మధ్య అంటుంది . అవును , ఇబ్బంది పెడితే ఎవరైనా ఇబ్బంది పడతారు కదా ! ఆ మాత్రం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా , ఆ నలుగురి తో ఉన్న  ఈ సమాజం ఎలా  ఎదిగింది ?  అజ్ఞానం  కాకపోతే . అందుకే ఒకోసారి సమాజాన్ని చూసి జాలేస్తుంది , పాపం సత్యాన్ని ఎదుర్కొ లేక మాయ తో  కలిసి  వంకర గా నడుస్తుంది అని.

  ఇది నిజం , ఇదే నా నైజం . . .


• నాకు కనబడదని గాలిని , నేను చూడలేదని అదృష్టాన్ని నమ్మను అంటే కుదురుతుందా ? కలానికి కాలానికీ తలవంచని మనిషి లేడు కదా ! ఒక్కోసారి ఆలస్యం అమృతంగా మారుగాక. . అయినా గరళాన్ని మింగేవాడికి రంగు రుచి వాసనలతో పని ఏంటి ?


అప్పుడప్పుడు పదాలకు దూరమయ్యేనేమో గానీ , నా శివుని పాదాలకు మాత్రం కాదు.

 ఒక్కోసారి వాంఛితములు వంచనలకు గురికావలసిందే. నాకు వద్దూ అంటే చెవిలో దూరిన జోరీగ నిశ్శబ్దంగా ఉంటుందా ? అదే విధంగా కొన్ని మాయా సాంగత్యాలను కర్మ బుణానుసారం భరించవలసి వచ్చేది . బుణాలు తీరాయి . శాశ్వత విముక్తి లభించింది .


• నాలోని ప్రతి భావము పదరూపము పొందాలంటే అది శివానుగ్రహానికి నోచుకోవాలి కదా ! . . . . . . లేదు లేదు, నాకు ఆ అధికారం ఉంది కదా అని , అడిగిన వారి కోసం విర్రవీగితే పద సోపానాలు తుల్యమై చివరకు శల్యమై పోవుగా .


• “నా” అన్న భావన “నమః శివాయః” లోని “” నుండి వచ్చినదైతే నా లోని “” నన్ను ఎప్పుడూ ఉచ్చ స్థితిలో నిలబెడుతుంది. కారణం అది నిర్వికారి నిగర్వి నిరాకార నిర్గుణ తత్వాలని కలిగి ఉంటుంది కాబట్టి . లేదంటే , “ నా “   నాలోని సర్వ గుణముల కలయికయై నన్ను అహంకార భూషితుడను చేస్తుంది. 

ప్రణవ నాదమైన ఓంకార శబ్దం శరీరం లో అణువణువునా ప్రతిధ్వనిస్తే ఆ తరంగ “అంతరంగ” మధురానుభూతులు వెల్లువలా పొంగి పద ప్రాసలుగా మారి పరవళ్ళు తొక్కు ప్రవాహాలుగా పొర్లుతాయి. ఇదే శివలీల. శివ కణములు లేని శివ గణములు ఉండునా ?

• నేను ఇంతకు ముందు విన్నవించినట్లు , మండినా మారనది , తుదకు మిగిలేది వెలకట్టలేనిది “విభూది” అదే ఐశ్వర్యం . నువ్వు విభూదిగా మారక మునుపే దాని విలువ తెలుసుకో తరువాత తెలుసుకోవడానికి ఏమీ మిగలదు , మరల విభూది తప్ప.

విరక్తి లోని రక్తి అద్బుతం . వైరాగ్యం లోని రాగం సమ్మోహనం .


• చివరిగా ! శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా ,   ఆ “చీమ” నన్ను ఎప్పుడు కుడుతుందా అని శూన్యం  లోకి  ఎదురు చూస్తూ  ...


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు  30 May 2026 5:00 AM.


Thursday, May 21, 2026

747. కది లే కలం

 

కది లే  కలం



• కది లే   కది లే

  కది లే   ఈ  కలము .

• కాలము తో   చేసెను    స్నేహం .

  చిర కాలముగా   పంచెను    తన భావం .


• సిరా   లేని    ఈ అక్షరాలు

  సిరులొలికే    సంపదలు .

• అవి పలికే   కంఠ  స్వరాలు

  వెతలు   తరించే   తారలు.


• భారం దించే   ఈ  భావాలు

  విశ్వసేవ కై   వెలసిన   చిరు  దివిటీలు.

• దారిని   చూపే   ఈ రాతలు

  భావి  మనసు లకు   సంపదలు .


• కది లే     కది లే

  కది లే     ఈ కలము

• కాలము తో   చేసెను    స్నేహం 

  చిర కాలముగా   పంచెను   తన భావం .


• కాలం   తెలిపిన   మౌనం తో

  ఈ కలం   చేస్తుంది   తాండవం .

• కాలుడు  చూపిన   సత్యం తో

  ఈ కరం  రాస్తుంది   మైమరచి .


• తాళ   పత్రాలు  కావివి . . . 

  కానీ

  మనసు  తాళం   తెరిచే  సూత్రాలు .

• తెలుగు లోని  తెల్లదనంతో 

  తేటతెల్లం  మవుతున్న

  ఈ తామరలు   శివార్పితాలు  .


• కది లే    కది లే

  కది లే    ఈ కలము

• కాలము తో    చేసెను   స్నేహం .

  చిర కాలముగా   పంచెను    తన భావం .



వెతలు = దుఃఖాలు

తరించు = దాటు, అతిక్రమించు

తారలు = ప్రకాశించు నక్షత్రాలు.

తేటతెల్లం = మిక్కిలి స్పష్టం.


యడ్ల శ్రీనివాసరావు 22 May 2026 10:30 AM.


Tuesday, May 19, 2026

746. శ్రీకృష్ణోపదేశం - కలియుగాంతం

 

 శ్రీకృష్ణోపదేశం  - కలియుగాంతం


• ఒకసారి శ్రీకృష్ణుడు , పాండవుల కు సృష్టి మరియ యుగాల గురించి ఉపదేశిస్తూ కలియుగం ఆరంభం గురించి వివరించగా , పాండవులు కలియుగ అంతం గురించి తెలియ చేయమని అడగడం జరిగింది .

  వెంటనే , శ్రీ కృష్ణుడు కలియుగ అంత్య సమయం ఎలా ఉంటుందో వివరించడం కంటే ముందు , తన శక్తి తో  అది స్వయం గా   వారికి  చూపించాలని నిర్ణయించుకొని , పాండవులకు  ఒక  పరీక్ష పెడతాడు .  ఆ పరీక్ష లో   ధర్మరాజు ను మినహాయించి . . . తన వద్ద ఉన్న నాలుగు బాణాలు తీసి , నాలుగు దిక్కుల వైపుకు వేసి అవి తీసుకుని రమ్మని అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు కి  చెపుతాడు .


వారు నలుగురు  తలో దిక్కు కు వెళతారు . 


• అర్జునుడు తాను వెళ్లిన దిక్కు లో దొరికిన బాణం తీసుకుని వస్తుండగా , ఒకచోట ఒక విచిత్రం చూస్తాడు. అప్పుడే దూడకు జన్మనిచ్చిన ఆవు, అదే పనిగా దూడను విపరీతంగా నాకుతూ ఉంటుంది. ఆ దూడను ఎంతకూ వదిలి పెట్టదు . అక్కడ ఉన్న వారు, ఆవు ను బలవంతంగా దూరం గా ఉంచినా సరే పరిగెత్తుకుంటూ ఆవు , దూడ దగ్గర కు వెళ్లి నాకుతూ ఉంటుంది . ఇది అర్జునుడికి చాలా ఆశ్చర్యం గా అనిపిస్తుంది . అది చూసి అర్జునుడు బయలుదేరుతాడు.


• ఇక రెండవ దిక్కు నుండి భీముడు బాణం తీసుకుని వస్తూ ఉంటే , ఆ మార్గంలో ఒక కోకిల బ్రతికి ఉన్న కుందేలు ను పొడుచుకుని తింటూ ఉంటుంది . భీముడు ఆశ్చర్యపోతాడు కోకిల ఎంతో మృధువైనది. ఎంతో మృదువుగా రాగం ఆలపిస్తుంది . అటువంటిది , కుందేలు ను పొడుచుకుని ఆహారం గా తినడం ఏమిటి . ఏమిటి ఈ విపరీతం అని, సందేహం తో భీముడు అక్కడి నుంచి బయలుదేరుతాడు .


• ఇక మూడవ దిక్కు నుంచి నకులుడు బాణం తీసుకుని తిరిగి వస్తుండగా , ఒక చోట వింత చూస్తాడు . ఒక పెద్ద బావి , దాని సమీపంలో నాలుగు చిన్న బావులు ఉంటాయి . కేవలం పెద్ద బావి లో మాత్రమే నీళ్ళు ఉండడం వలన , అక్కడి ప్రజలు నీళ్ళు తోడి చుట్టూ ఉన్న నాలుగు చిన్న బావుల్లో సమానం గా నింపుతూ ఉంటారు . కొంత సమయానికి పెద్ద బావి లో నీళ్ళు పూర్తిగా నిండుకుంటాయి . వెంటనే అక్కడి ప్రజలు, అయ్యయ్యో పెద్ద బావి లో కొన్ని నీళ్ళు అయినా ఉండాలి కదా అని , చుట్టూ ఉన్న నాలుగు బావుల లో ఇది వరకు వేసిన కొన్ని నీళ్ళు కొంచెం కొంచెం తోడి పెద్ద బావి లో వెయ్యాలని ప్రయత్నిస్తే , ఆ నాలుగు చిన్న బావుల లోని నీళ్ళు తోడే సరికే , అవి ఆవిరి అయిపోతుంటాయి ‌. కానీ పెద్ద బావి కి ఒక్క నీటి చుక్క కూడా దొరకదు .

 అది చూసిన నకులుడు ఏంటి ఈ విచిత్రం కళ్ళ ముందే ఇలా జరుగుతుంది అని అనుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు .

• ఇక నాల్గవ దిక్కు న ఉన్న బాణం సేకరించిన సహదేవుడు తనకు దొరికిన బాణం తీసుకుని శ్రీకృష్ణుని వద్దకు బయలుదేరుతుండగా , ఒక విచిత్రం చూస్తాడు . ఒక పెద్ద బండరాయి , మహా పర్వతం పై నుంచి, దొర్లుకుంటూ వస్తుంది. అది అలా దొర్లుకుంటూ వచ్చేటప్పుడూ ఎంతో ఏపుగా ఆ పర్వతం పై పెరిగిన మహ వృక్షాలను కూలదోస్తూ , దొర్లుకుంటూ దొర్లుకుంటూ వచ్చి ఆఖరికి ఒక చిన్న గడ్డిపోచను అడ్డుకొని పర్వతం మధ్యలో ఆగి పోతుంది . సహదేవుడు కి చాలా ఆశ్చర్యం కలుగుతుంది అంత పెద్ద బండరాయి చిన్న గడ్డిపోచను ఆనుకొని ఆగిపోవడం ఏమిటి . ఏమిటి ఈ విచిత్రం అని అనుకుంటూ అక్కడ నుంచి బయలు దేరుతాడు .


• ఆ నలుగురు శ్రీకృష్ణుని చేరి , తాము చూసిన వింత అనుభవాలు వివరిస్తారు . అందుకు సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా చెపుతాడు . కలియుగం చివరిలో అంతం అవుతుంది అనడానికి అవే సంకేతాలు . . వాటిలోని సూక్ష్మం మీకు అర్దం చేయిస్తాను అని , శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం ఆరంభిస్తాడు .

• మొదటి వృత్తాంతం ఆవు , దూడను నాకుతూ ఉండడం. . . కలియుగం అంత్య కాల సమయం లో జన్మ నిచ్చన తల్లి తండ్రులు తమ పిల్లలకు అతి గా ప్రేమ ను పంచుతూ , సాకుతూ ఉంటారు . పిల్లలకు కష్టం తెలియకుండా సమస్తం సమకూరుస్తూ , మమకారం అనే మైకంలో పిల్లలకు , తల్లిదండ్రులు బానిసలు లా ప్రవర్తిస్తూ ఉంటారు . కష్టం తెలియని పిల్లలు సోమరులై , అపసవ్య దిశలో జీవనం సాగిస్తారు . అందుకు నిదర్శనం ఆ ఆవు దూడ వృత్తాంతం అని శ్రీకృష్ణుడు చెపుతాడు. వాస్తవానికి దూడ ఆవు గర్భం నుంచి భూమిపై పడిన కొన్ని క్షణాలలో తనకు తాను లేచి పరిగెట్టాలి , ఇది సృష్టి ధర్మం. కానీ సృష్టి ధర్మం తప్పి నపుడు జీవులకు అదే వినాశన కాలం అని చెపుతాడు .

• ఇక రెండవ అంశం అయిన కోయిల కుందేలు వృత్తాంతం గురించి చెపుతూ. . . సృష్టి లో కోయిల స్వరం భగవంతుని ఆశీర్వాదం . ఆ విధంగా కోయిల వలే , దైవానుగ్రహం తో సంపాదించిన జ్ఞానాన్ని కలిగి ఉన్న పండిత పుంగవులు తమ గొంతు, స్వరం , మాటలతో , కుందేలు వంటి అమాయకులను ధనం కోసం పీల్చి పిప్పి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు . విద్య , వైద్య , దైవీ జ్ఞానం వంటివి అనుభవజ్ఞులు కు ,  పండితులకు , గురువులకు లోక కళ్యాణార్దం భగవంతుని అనుగ్రహం చేత లభిస్తుంది . కానీ , ధనం కోసం తమ జ్ఞానాన్ని భ్రష్టు పట్టించి అమాయకులను పీడిస్తారు. అందుకు ఉదంతమే కోయిల , కుందేలు పట్ల  ప్రవర్తన అని శ్రీకృష్ణుడు చెపుతాడు.


• ఇక ముడవ అంశం . . . అతి పెద్ద బావి వలే విశాల హృదయం ఉన్న తల్లి తండ్రులు ఉమ్మడి కుటుంబం లోని తమ పిల్లలందరికీ సమానంగా కావలసినంత ప్రేమ సహయ సహకారాలు అందిస్తారు . కలియుగ అంతం లో ఈ ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయి , వృద్ధాప్యం లో ఉన్న తల్లి తండ్రులకు తమ పిల్లలు కడివెడు ప్రేమను కూడా పంచరు సరికదా అనాధల వలే చూస్తారు. అందుకే చిన్న బావుల్లో నీరు పెద్ద బావి కి చేరలేదు .


ఇక నాల్గవ అంశం బండరాయి గడ్డిపోచ . . . కలియుగం లో భగవంతునికి కోసం  ఎన్నో  వ్యయ ప్రయాసలతో   ఆలయాలు నిర్మించి  , అంగరంగ వైభవంగా విగ్రహాలు తయారు చేయించి ఆలయాలకు  సమర్పించిన వారికి కూడా సర్వ శక్తివంతుడు అయిన భగవంతుడు , పరమాత్ముడు అనుభవం కాడు .  కారణం  ఆడంబరాలు అలంకారాలు , మాయా ఆకర్షణల తో చేసే  భక్తి   భగవంతుని కి  అణువంత కూడా ప్రీతి పాత్రం  కాదు . ఆ విధమైన వాటన్నింటినీ   దాటుకుని  . . .   భగవంతుని పై సత్యమైన ప్రేమ , మనసు కలిగి ఉన్న  గడ్డిపోచ  వంటి  అమాయకుని చెంతకు స్వయం గా పరమాత్ముడే  వెళతాడు .  నిష్కల్మషమంటి  నిరుపేదదైన  మనసు లోనే  భగవంతుడు ఆసీనుడు అవుతాడు . దాని ఉదంతమే బండరాయి వలే  శక్తి వంతమైన  పరమాత్మ  , గడ్డి పోచ ను ఆనుకొని ఉండడం అని శ్రీకృష్ణుడు పాండవుల కు చెపుతాడు.


సేకరణ :   గీతా జ్ఞానం - రాజయోగం .


• శ్రీకృష్ణుడు చెప్పిన ఈ సందర్భాలు నేడు జరుగుతున్నాయో లేదో , ఇది కలియుగ అంత్య సమయమో కాదో నేటి కాలంలో మనిషే గ్రహించాలి . . . లేదంటే ఇంకా కలియుగం ప్రధమ పాదే , జంబూ ద్వీపే , భరతఖండే , భరతవర్షే , అంటూ నామ గోత్రాలు జపిస్తూ , ఇంకా కలియుగం ప్రధమ పాదం లో ఉన్నాం అనుకుని అమాయకత్వం తో ఉండవలసి వస్తుంది.


• Written by the Energies Conjunction of KARMIC planet SATURN 🪐 and Past Lifes Spiritual Mastery experienced planet KETU .


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 


ఆత్మ  ✍️ 19 May 2026 11:30 PM 

Thursday, May 14, 2026

745. సమస్యల సావధానం

 

  సమస్యల సావధానం

(సావధానం = శ్రద్ద)



• సరిగా  ఆలోచిస్తే సమస్యలను మనమే సృష్టించుకున్నాము .  అవును  మనం ఒక విషయాన్ని  సమస్య గా భావిస్తుంటే, ఆ సమస్య కి మూల కారణం మనమే . అది తెలియక తరచూ ఇతరులను నిందించడం జరుగుతుంది .

• సమస్య ను  విశ్లేషించుకునే  మానసిక శక్తి , అవగాహన  లోపించినపుడు  దానికి కారణం తరచూ ఇతరులు గా   భావించడం జరుగుతుంది . వాస్తవానికి సమస్య మనది కాబట్టి కారణం కూడా మనమే . మనకు ఉన్న ఆలోచనా లేమి తో సమస్య ను సృష్టించుకునేందుకు మనమే అవకాశం ఇస్తాము లేదా ఇతరులకు ఆ అవకాశం మనమే స్వయంగా కల్పిస్తాము .


• సమస్యను ఎప్పుడూ బాహ్య దృష్టి తో కంటే , అంతర్దృష్టి తో చూసి నపుడు , ఏ దశలో మనము తప్పు చేశాము లేదా సరియైన నిర్ణయం తీసుకోలేక పోయాము  లేదా   సరియైన విధంగా ప్రవర్తించ లేకపోయాము  అనేది మనకు మాత్రమే తెలుస్తుంది . దీనికి కాస్త ఆత్మ శుద్ది అవసరం . ఆత్మ శుద్ది లేని నాడు మన సమస్యలకు సమాధానం గాని, పరిష్కారం గాని పొందలేము .

• నేను కరెక్ట్ అనే భావన ద్వారా సరళత ఉన్న వారికి ఎన్నడూ తమకు సంబంధించిన ఏ విషయం పైన మనసు లో కించిత్ బాధ, దుఃఖం సహజంగా కూడా అనుభవించరు . ఎందుకంటే వారు తమ విషయాలనే కాదు ఎవరి విషయాలను కూడా సమస్యాత్మకంగా చూడరు, సమస్యను అనుభవం పొందరు . ఒకవేళ వారికి సమస్య ఉన్నా లేనట్లే ఉంటారు. కానీ, ఇందులో ఒకవేళ అహంకారం నిండి  ఉంటే  తమను తామే పాతాళానికి చేర్చుకునే ప్రయాణం అవుతుంది.

• వాస్తవానికి కొన్ని సార్లు, మనకు ఏ విధమైన సమస్యలు లేక పోయినా సరే , సమస్యలను అధికం గా ఫీల్ అవుతూ ఉంటాం . ఇది ఒక మానసిక మైన రోగం, బలహీనత.

  

• మనలో మంచి గుణాలు లేనపుడు తప్పని సరిగా ఏదో విధంగా , ఏదో రూపంలో ఇతరులు మనకు గుణపాఠం నేర్పిస్తారు . ఈ విషయం గ్రహించిన నాడు మనం మేలు పొందిన వారమే అవుతాం . కర్మ పాఠాలు, గుణ పాఠాలు నేర్చుకోవడానికి మన జీవితంలోని కాలం  మనకు ఏదో ఒక వయసు లో , ఏదో ఒక సమయంలో అవకాశాన్ని ఇస్తుంది . అది సద్వినియోగం చేసుకున్న వారు భాగ్యవంతులు . కానీ ఇక్కడే ఒక సమస్య . . . అనేక కాలాలు గా మనిషి బుద్ధి బురదలో దొర్లి దొర్లి ఉండడం వలన , పాత సంస్కారాలు పాత ఆలోచనలు కి అలవాటు పడి పోయి ఉండడం వలన . . . గుణ పాఠాలు ఎదురైనా సరే తిరిగి బురదలో దొర్లాడే జీవి లా జీవించాలి అని  అనిపిస్తుంది . ఇటువంటి వారిని మాయా జీవులు అంటారు. అంటే మాయ కు, కొన్నిరకాల బలహీనతలకు పూర్తిగా వశం అయిపోయిన వారు అని అంటారు .

• మన అంతరంగం పరిణితి చెంది ఉన్నంతలో , సాధించేది ఏమీ లేదు. పరిణితి తో పాటు దృఢత్వం అత్యంత అవసరం . ఈ దృఢత్వం సరియైన నియమాలు తో కూడిన నిర్ణయాలను ధైర్యం గా తీసుకునేందుకు సహకరిస్తుంది .

• సమస్యలు అనుభవాన్ని పెంచడానికి , వాటిని పరిష్కారించు కొనే మార్గం తెలియచేయడానికి వస్తాయి . అంతే కానీ వాటిని తప్పించుకు తిరగడానికి కాదు .‌ సమస్యలు అనేవి శాశ్వతంగా తీరిపోయేటివి కాదు . ఒకటి పోతే మరొకటి, మనిషి జీవించి ఉన్నంత వరకు ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి . వాటిని ఎదుర్కోవడం అనగా సమస్య పై యుద్ధం చేయడం , ఒక బుద్ధి హీనత. 

అంత కంటే కూడా, ‌సమస్యను అర్దం చేసుకోవడం అలవాటుగా  చేసుకుంటే తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించవచ్చు . ఆ అనుభవం తో మన సమస్యలనే కాదు , ఇతరుల సమస్యలకు కూడా అలవోకగా పరిష్కారం చూపించవచ్చు. . . కానీ అందుకు ఓర్పు సహనం తో పాటు సత్యమైన విశాల హృదయం కావాలి .

• కొన్ని సార్లు కొన్ని సమస్యలకు మూలం సరియైన కమ్యూనికేషన్ లోపం , అవగాహన లోపం ,  స్పష్టత లో లోపం . ఈ కమ్యూనికేషన్ లో ఆలోచన , మాట , కర్మ ఉంటాయి . వీటిని నిజాయితీ గా  ఆచరించనపుడు మాత్రమే , జరిగిన పొరపాట్లుకు , అనుభవిస్తున్న  సమస్యల కు  తిరిగి  అవే  ఆలోచనలు  , మాట , కర్మ  పరిష్కారం చూపిస్తాయి .

• మనిషి జీవించి ఉన్నంత వరకు సమస్యలు ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి. అందులో అనుమానం లేదు. ఎందుకంటే మనకు తెలియని సత్యం ఏమిటంటే , ఈ కలికాలం లో మనిషి జీవించడమే ఒక పెద్ద సమస్య , దీనికి ఉన్నోడు లేనోడు అనే మినహాయింపు లేదు . ధనం తో అసలు సంబంధం లేదు.  అనేక జన్మలు గా వికర్మలు చేసిన వారే కలియుగం లో జన్మలు తీసుకుంటారు . ఆ కర్మల ఫలితం పూర్తిగా అనుభవించి , శుద్ది కాబడిన వారు మాత్రమే తిరిగి రాబోయే సత్య యుగం లో దైవీక జన్మలు తీసుకుంటారు . . అవునన్నా కాదన్నా ఇదే సత్యం .



• భారతదేశం వేద భూమి, పుణ్య భూమి, కర్మ భూమి. ఇది జగమెరిగిన సత్యం. భగవత్ జ్ఞానం లో స్వస్తిక్ గుర్తులో సృష్టి రహస్యం దాగి ఉంది . అది నాలుగు యుగాల సంకేతం , సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం , కలి యుగం . ఈ నాలుగు యుగాలలో నే  సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఒకొక్క యుగం 1250 సంవత్సరాలు. సృష్టి మొత్తం 5000 సంవత్సరాలు . దీనిని ఒక కల్పం అంటారు. ఇప్పటికే ఎన్నో కల్పాలు జరిగాయి. అందుకే సృష్టి చరిత్ర లక్షల సంవత్సరాలు అనే మాట శాస్త్రాలలో  అంటుంటారు . ప్రస్తుత కాలం కలియుగం పూర్తిగా వినాశనం అయ్యే కాలం. ఆరంభం కూడా అయింది. అందుకు ఎన్నో నిదర్శనాలు ఉదాహరణలు  నిత్యం చూడడం జరుగుతుంది.

  క్రమేపీ సత్య యుగం ఆరంభం కూడా భరత ఖండము నుంచే ఆరంభం ఔతుంది.


• నిజం లో ప్రయాణించడం, నిజం తో కలిసి జీవించడం అసాధ్యం కాదు, కానీ అందుకు కావలసింది నిజాయితిని  కలిగి ఉండాల్సిన అంతరంగం 

ధనం ఉంటే గుణం చూడరు . అదే లేకుంటే  పుట్టుమచ్చ నైనా  రోగం లా చూపేందుకు వెనుకాడరు  .


  ఓం శాంతి

  ఓం నమఃశివాయ

  యడ్ల శ్రీనివాసరావు   14 May 2026 1:00 AM .


Wednesday, May 13, 2026

744. వర్ణాల లో వెలుగు శివం

 

వర్ణాల లో వెలుగు శివం



• ఎంతని   చూసేది    శివ

  ఏమని చెప్పేది   నా తండ్రి  శివ .


• సృష్టి  వర్ణాల లో   వెలుగై 

‌  వికసించిన    నీ రూపం . . . 

  చూశాయి    నా కనులు

  కలవరింతల   భాగ్యం లో .


• ఎంతని    చూసేది   శివ

  ఏమని చెప్పేది    నా తండ్రి  శివ


• ఎన్ని   జన్మలెత్తినా  వదలలేను 

  నీ  శివ  నామం

• ఎందరి లో  కలిసున్నా   విడువలేను 

  నీ  శివ  నామం

• అదే . . .  నా గుండె  లయకారం .

  అదే  . . . నా  నోట   నుడికారం.


• శిల లోని   లేని  నీవు

  శిధిలమైన  మనసు లో  నిండావు .

• మది   ఎరుగని  మహిమలను

  మాట తో   పలికించావు 

  నా మాట లో   నీవు  కనిపించావు.


• ఎంతని    చూసేది    శివ

  ఏమని చెప్పేది   నా  తండ్రి  శివ .


• సృష్టి  వర్ణాలలో    వెలుగై  

  వికసించిన   నీ   రూపం . . . 

  చూశాయి    నా కనులు

  కలవరింతల   భాగ్యం లో .


• తనువు లోని   తపనలన్నీ 

  నీ తలంపు తో   తరిగి   తరిగి

  తురుములైనాయి .

• వెలుగు లోని    నీ రూపం

  నా  వెనుక   ఉండి

  నీడ ను   చూపిస్తుంది

  నా  నీడ ను   నడిపిస్తుంది .


• ఈ యేటి లోని     గలగలలు

  పలుకుతున్నాయి   శివ రాగం .

• ఈ గాలి లోని     సుడిగుండాలు

  ఆడుతున్నాయి    శివ నాట్యం .


• సిరులు   కురిపించేటి   సుగంధం

  శివ    నామ   స్తోత్రం .

• వెతలు    వొలిచేటి    వ్యాపకం

  శివ    నామ   స్తోత్రం  .


• ఎంతని     చూసేది     శివ

  ఏమని  చెప్పేది    నా  తండ్రి   శివ .

• సృష్టి వర్ణాలలో   వెలుగై 

  వికసించిన   నీ  రూపం . . . 

  చూశాయి    నా కనులు

  కలవరింతల   భాగ్యం లో . .



యడ్ల శ్రీనివాసరావు 13 May 2026. 11:00 PM.



Tuesday, May 12, 2026

743. భగవంతుడు మనిషితో మాట్లాడి తే -2

 

 భగవంతుడు మనిషితో మాట్లాడితే-2


భగవంతుడు  సృష్టి కర్త. అత్యంత శక్తివంతడు . మనిషి భగవంతుని భక్తి చేస్తూ ప్రార్ధిస్తాడు, కీర్తిస్తాడు . భగవంతుని కోసం అన్వేషిస్తూ ఉంటాడు . తనను దుఃఖం నుంచి విడిపించుకుని అడుగు తాడు , కోరికలను తీర్చమని ప్రాధేయపడతాడు .


మనిషి ఇన్ని చేసినా భగవంతుడు మాత్రం మనిషి తో మాట్లాడినట్టు ఎక్కడా అనిపించదు. సమాధానం ఇచ్చి నట్టు వినిపించదు . మౌనం గా నే ఉంటాడు .


• కానీ అప్పటి వరకూ ఎదురు చూసిన మనిషి భగవంతుని పై  ఓర్పు నశించి, సహనం కోల్పోయి , భగవంతుని పై నమ్మకం సన్నగిల్లి ఉంటాడు . ఇదే మనిషి యొక్క అజ్ఞానం , మాయా ప్రభావం .


• మనిషికి , భగవంతుడు లభించేది , మనిషి తో మాట్లాడేది కేవలం మౌనం లోనే , మౌనం తోనే . మౌనం మహత్తరమైన శక్తి . ఏకాంతం లో ఉంటూ మౌనం తో , శబ్ద రహితమైన స్థితి లో భగవంతుని తో కూర్చుని ధ్యానం చేస్తూ అనుసంధానం అయినపుడు, భగవంతుడు మాట్లాడుతాడు . ఆ భాష మౌన భాష . ఆ సంకేతం మనిషి ఎదురు చూస్తున్న దానికి సమాధానం . మాట్లాడడానికి మించి  స్పష్టం గా కంటికి  అన్నీ  చూపిస్తాడు .


• మౌనం . . . సృష్టి స్థితి లయల శక్తితో నిండి ఉన్న దివ్యమైన భాష . అదే భగవంతుడు మనిషితో మాట్లాడడానికి , అనుసంధానం అవడానికి ఎంచుకున్న విధానం అని  నేటి కాలపు మనిషి కి తెలియదు .


• సంపూర్ణ మైన మౌనం తో  రోజూ కొన్ని గంటల సమయం ఏకాంతం గా, తెల్లవారుజామున నిశ్శబ్ద వాతావరణంలో , ఏ శబ్దం నోటితో పలకకుండా భగవంతుడిని , మనసు లో స్మృతి చేస్తూ ఉంటే, భగవంతుడు మనిషి కి సమాధానం ఇవ్వడం ఆరంభిస్తాడు .


• ఇందులో మొదట మనిషి కి అర్దం చేయించేది , నీవు ఎవరు?  నేను ఎవరు?  నీవు ఎందుకు జన్మ తీసుకున్నావు ? నీవు ప్రస్తుతం ఏం చేస్తున్నావు ? ఇలా ఎన్నో ఎన్నెన్నో  సూక్ష్మ రహస్యాలు తెలియ చేస్తాడు . 

మనిషిని పవిత్రంగా , ఉన్నతంగా కావించేందుకు మనిషి యొక్క లోపాలు మానసిక వికారాలు , బలహీనతలు , జన్మాంతరాలుగా  సంపూర్ణం కాకుండా   మిగిలి  ఉన్న  కర్మలు , కర్మ బంధనాలు , చేసిన పాప పుణ్య కర్మల లెక్కల ఖాతాలు  అన్నీ  క్రమేపీ ఆధారాలతో అర్దం చేయిస్తాడు . వాటన్నింటి నుంచి సంపూర్ణంగా విముక్తుడిని చేసే మార్గం చూపిస్తాడు .

ఇదంతా భగవంతుని పై నిశ్చయం తో , పూర్తి బలిహరం అయినప్పుడే సాధ్యం అవుతుంది .


• సమస్య అంతా మనిషి కి ఇక్కడే ఎదురవుతుంది . ఎందుకంటే మనిషి దేనిని అంత సులభంగా అంగీకరించడు . సాక్షాత్ భగవంతుడు వచ్చి మనిషి కి తన అంతర్గత స్థితి ని అర్దం చేయించి పరివర్తన చెయ్యాలి అనుకున్నా సరే భగవంతుడిని శిరసావహించ లేడు . ఎందుకంటే మనిషి లో  నేను అనే అహం , మాయ మైకం తో పేరుకు పోయిన అజ్ఞానం , తన శరీరం పై ఉన్న వ్యామోహం , మమకారం . మరియు కామ వికారాల ప్రభావం. ఇంద్రియ నిగ్రహము లేకపోవడం.  ఇవన్నీ కలిసి మనిషి ని భగవంతుని కి దూరంగా చేస్తాయి .


• భక్తి లో పతిత పావన రండి , వచ్చి మమ్మల్ని పావనం చేయండి అని పాటలు పాడుతూ భగవంతుడుని మనిషి పిలుస్తాడు . తీరా భగవంతుడు వచ్చి తన శక్తి తో జ్ఞానం ఇచ్చి , మనిషి ని చైతన్య వంతం గా  పవిత్రుడు గా చేయాలని , తన సమానంగా దివ్య గుణాల వారసుడిగా చేయడం ఆరంభిస్తే , మనిషి అందుకు సంసిద్ధం కాడు , కాలేడు . ఎందుకంటే అనేక జన్మలు గా మాయ, వికారాల ఊబిలో కూరుకు పోయి ఉండడం , వాటికి దాసోహం అయిపోవడమే కారణం . నేడు , శారీరక మానసిక వికారాలు లేకుండా , శుద్ది కలిగిన మనసు తో , సత్యమైన మాట తో బ్రతక లేని స్థితి లో మనిషి జీవిస్తున్నాడు అనేది ఏ మనిషి కి  తెలియని యదార్థం కాదు .


• శరీరం వేరు , ఆత్మ వేరు అనే రహస్యమైన విషయం గ్రహించ లేని స్థితిలో మనిషి భగవంతుని భక్తి చేస్తాడు . ఈ విషయం స్వయం భగవంతుడు అర్దం చేయించే వరకు , నేను ఆత్మ ను అనే విషయం ఎవరికీ తెలియదు.


• భగవంతుడి శక్తి ని మనిషి స్వీకరించినపుడు, ఆ శక్తి తోనే మనసు , బుద్ధి , ఆత్మ సంపూర్ణ పవిత్రంగా అయి భగవంతుని సన్నిధి చేరుకోగలం . సన్నిధి చేరడం అంటే భగవంతుని వలే జనన మరణాలకు అతీతంగా అవడం కానేకాదు . భగవంతుడి సన్నిధి చేరడం అంటే తిరిగి విశ్వ రాజ్యాధికారిగా  ఉన్నతమైన  జన్మలు ఎత్తే భాగ్యం కలిగి ఉండడం .


• మనిషి తాను ఒక శరీరం అనే భావన కంటే తాను ఒక ఆత్మ మరియు శక్తి అనే సత్యమైన స్థితి లో ఉన్నప్పుడు మాత్రమే పరమాత్ముడు  ఒక  శక్తి స్వరూపం అనే అనుభవం పొంది …. భగవత్ శక్తి స్వీకరించగలడు , తద్వారా సత్కర్మలు ఆచరించగలడు .


జీవితం లో  మనకు అన్నీ దొరకక పోవచ్చు. కానీ దొరికిన వాటి విలువ తెలుసుకుంటే  జీవితం చాలా అందంగా ఉంటుంది.


• Written by the Energies Conjunction of KARMIC planet SATURN 🪐 and Past Lifes Spiritual Mastery experienced planet KETU .


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

ఆత్మ  ✍️ 13 May 2026 1:50 AM.


Friday, May 8, 2026

742 .భగవంతుడు మనిషి తో మాట్లాడితే ?

 

భగవంతుడు మనిషి తో మాట్లాడితే ?





• భగవంతుడు మనుషులతో మాట్లాడితే ? . . . 

• అవును భగవంతుడి కోసం ఎన్నో ప్రార్థనలు, పూజలు, వ్రతాలు , ఉపవాసాలు, మొక్కులు ఎన్నో ఎన్నెన్నో మనిషి చేస్తుంటాడు . ఎందుకంటే భగవంతుడితో మనిషి కి అనేక అవసరాలు ఉన్నాయి . కానీ ఎంత భక్తి చేసినా, ఆ విగ్రహాంలో ఉన్న మూర్తి ఎందుకని మాట్లాడడం లేదు . కాలం గడుస్తుంది కానీ మనిషి సమస్యలకు, దుఃఖాలకు పరిష్కారం లభించడం లేదు సరికదా నానాటికీ ఎందుకు పెరుగుతున్నాయి . మరి మనిషి ఆంత ప్రాధేయపడి , బోలెడు ధనం వెచ్చించి భగవంతుడు కోసం ఎన్నో చేస్తున్నప్పుడు, కనీసం భగవంతుడు మాట్లాడాలి  కదా  ?


• కానీ  . . .  భగవంతుడు మనిషి తో మాట్లాడడు ,  ఎందుకంటే  ఆయన కి  భయం , ఆయన  మనిషి తో మాట్లాడితే ,  మనిషి  చాలా  బాధపడతాడు  అనే  భయం. అసలే  దుఃఖాల లో ఉన్న మనిషి మరింత దుఖితుడు గా అయిపోతాడు అనే జాలి . అందుకే  భగవంతుడు మౌనం గా ఉండి పోతాడు.

అయినా ,  భగవంతుడు మాట్లాడితే మనిషి ఎందుకు  బాధపడతాడు ,  ఇంకా సంతోష పడతాడు కదా  ?


• కలియుగంలో మనుషులందరూ అమాయకులు . ఎంత అమాయకులు అంటే  . . . 

మేడిపండు చూడ నోరూర 

పొట్ట విప్పి చూడ పురుగులుండ 

అనే చందాన ఉండడం . . . . నీతి , ధర్మం , నిజాయితీ , నిస్వార్థం అంటూ  వేదాలు వల్లిస్తారు . కానీ ఆచరించే వారు అరుదు . సత్యమే మాట్లాడాలి అంటారు . కానీ నిజం మాట్లాడే వారు అరుదు . మంచి ఆలోచనల తో జీవించాలి అంటారు , కానీ మనసు లోతుల్లో కి  వెళితే   చీకటి కోణాలు, వ్యవహారాల తో   ఎన్నో ఆలోచనలు నిండి పోయి ఉంటాయి .

• మానవ సంబంధాలు , బంధుత్వాలు , స్నేహ సాంగత్యాలలో  భ్రష్టు పుష్కలంగా పేరుకు పోయి ఉందని , ఎన్నో అనుభవాలతో మనిషి స్పృహ కి ఒక వైపు స్పష్టం గా  అర్దం అవుతుంది , మరో వైపు ఆ మత్తు నే  కోరుకుంటాడు . ఎందుకంటే అదొక మానసిక దుర్బలత . అందులో నే  కావలసిన ఎన్నో ఆనందాలు కాలక్షేపాలు , psychic  emotions లాంటివి  వెతుక్కుంటాడు . మనిషికి  మనిషికి మధ్య  మనసు లో ఆత్మీయత ఉండదు, కానీ ఆలింగనాలూ, కరచాలనాలు , విషపు నవ్వులు మెండుగా  ఉంటాయి .  అన్ని విధాలా మానసికంగా పతనం అయిపోయిన మనిషి నైతికంగా స్టేటస్ , వస్తృ వేషధారణ , హావభావాల హుందా తనం ప్రదర్శిస్తాడు . ఇదంతా కలిపి కలియగపు మనిషి అమాయకత్వం .  

• ఆలుమగలు గృహస్థ ధర్మం ఆచరిస్తాం అని పెళ్లి నాడు ,  అగ్ని సాక్షిగా ప్రమాణాలు చేస్తారు . అక్రమ సంబంధాలే  నేడు అధికంగా సక్రమ సంబంధాలు గా  మారుతున్న మనిషి పరిస్థితి ఒక దుస్థితి .  మానసిక వ్యభిచారానికి మనిషి దాసోహం అయిన , వేళ , ఏదీ తప్పు కాదు అంతా సహజం అనుకునే ఆలోచనలతో సర్దుకుంటున్నాడు . ఎందుకంటే మనిషి కి కావలసినంత స్వేచ్చ  లభిస్తుంది కాబట్టి.

• వ్యాపార ధర్మం ఆచరిస్తాను  , అని ఆరంభంలో భగవంతుడి సాక్షి గా పూజ చేస్తాడు. కల్తీ లలో తన మునక లేస్తుంటాడు .

• వృత్తి ధర్మం పాటిస్తాను అని సంతకాలు చేసి అపాయింట్మెంట్ లెటర్ తీసుకుంటాడు . లంచగొండి వ్యవహారాలు, కమీషన్లు సర్వ సాధారణం గా భావిస్తాడు .

• ఒకటేమిటి విద్య, వైద్యం అన్నింటా ఎటు చూసినా దోపిడీ, దురాగతాలు. ఇవన్నీ మనిషే అలవోకగా గుట్టు చప్పుడు కాకుండా, మూడో కంటికి తెలియకుండా తన మనసు లోని ఆలోచనల తో భద్రం గా  జాగ్రత్తగా  ఒక క్రమశిక్షణా పద్దతి లో చేస్తుంటాడు . అందులో మనిషి ఆరితేరిపోయాడు. అయినా ఇందులో తప్పేముంది, ఇదంతా మోడ్రన్ , ఆధునిక సమాజం లో ఇవి  సహజం అని అమాయకత్వం గా అనుకునే తత్వాన్ని బాగా వృద్ధి చేసుకున్నాడు మనిషి . దీనికి కారణం అవసరానికి మించిన ధనం కలిగి ఉండడం . 


• నేడు మనిషి చాలా అమాయకుడు. ఎంత అమాయకుడు అంటే , తాను చేసిన తప్పులు , పొరపాట్లను  బయట పడిన సందర్భాలలో  , ఒకవేళ ఎవరైనా సహచరులు గాని , కుటుంబీకులు గానీ , శ్రేయోభిలాషులు గాని , మిత్రులు గాని సరిచేయాలని చూస్తే అటువంటి వారి ని నిందించడం , దూషించడం అవసరమైతే హత్య చేయడానికి కూడా వెనుకాడని స్థితి లో మనిషి ఉన్నాడు . ఎందుకంటే అది  తన పరువు , అహంకారానికి సంబంధించిన అంశం కాబట్టి .


• ఇక్కడ గమనిస్తే ప్రతీ అంశం లో కూడా మనిషి అమాయకుడే . ఎందుకంటే ఇతరులను నమ్మించడం లో  ఆరితేరి పోయి , మాటలను మార్చడం లో తన నాలుక చేసే నాట్యానికి ముగ్ధుడై . . .  పాపం తన అమాయకత్వానికి తానే ఆనందపడుతూ  ,  రోజూ గుడికి  వెళ్ళి  భగవంతుడికి  వాటాలు ఇస్తూ తాను  అమాయకుడిగా   భావిస్తాడు.


•  మనిషి ని   సృష్టించిన  భగవంతుడికి ,  ప్రతి మనిషి యొక్క బుద్ధి  ఆలోచన  వ్యక్తిత్వం  సంస్కారం ఇలాంటివి ఏమీ తెలియదా ? . . . అంటే తెలుసు.

తెలుసు, కనుకనే  ఆయన ఎవరితోనూ మాట్లాడడు. ఒకవేళ భగవంతుడు  మాట్లాడితే సత్యమే మాట్లాడుతాడు . సత్యం తప్ప మరొకటి భగవంతుడికి తెలియదు . మనిషి బుద్ధి లో ని లోపాలను , చేసే పాపాలను కళ్ళు కు కట్టి నట్టు వివరించి  చూపించి కర్మలు లెక్కలు సూక్ష్మంగా వేసి చెపుతాడు .  మరి  , భగవంతుడు చెప్పే , ఆ సత్యం  మనిషికి  రుచిస్తుందా ? జీర్ణించుకోగలడా ?.


భగవంతుడు  నేటి కాలంలో మనిషి గురించి సత్యం మాట్లాడితే , వెంటనే మనిషి తిరిగి తనను దూషిస్తాడని , తనపై కత్తి దూస్తాడని  భయపడి మాట్లాడకుండా , రాయి లో మౌనం గా ఉండిపోయి మనిషి నటనను చూస్తూ ఉంటాడు భగవంతుడు . ఎందుకంటే , లోపాలు సరి చేయాలనుకున్న  తోటి మనిషి  పైనే  విధ్వంసం సృష్టించే మనిషికి . . . అదే మనిషి గురించి నిజాలు చెబితే తనను ఇంకేమి చేస్తాడో  అని భగవంతుడికి విపరీతమైన భయం ఉంటుంది .


• కానీ , అదేంటో విచిత్రం, గుట్టు చప్పుడు కాకుండా చీకటి ఆలోచనల  వ్యవహారాల తో , ధర్మ బద్ధం కాని ధనంతో, బుద్ధి హీనత తో ఎన్నో రకాలు గా మనిషి జీవిస్తూ , భగవంతుడికి వాటాలు సమర్పిస్తూ , భగవంతుని  కార్యాలు చేసెస్తూ  , . . . సమాజ సేవ అంటాడు. ఆ ముసుగులో  పబ్లిసిటీ ,  పేరు , కీర్తి , గుర్తింపు కోసం తహతహలాడుతాడు  మనిషి .


• భగవంతుడు  అనే పేరు తో  ఎన్ని  సేవా కార్యక్రమాలు చేసినా . . . ధర్మబద్ధం కాని పైసాను , మనో శుద్ది లేకుండా  చేసే  భగవత్ కార్యాలను భగవంతుడు అణువంత కూడా స్వీకరించడు . ఇది పరమ సత్యం . భగవద్గీతలో చెప్పబడింది . ఆ కార్యక్రమాల భాగ్యం మనిషి పుణ్య ఖాతాలో జమ కానే కాదు . ఎందుకంటే భగవంతుని కి , మనిషి నుంచి కావలసింది  పవిత్రత , మనో శుద్ది , శుద్ద మైన ప్రేమ ,  కల్మషం ఎరుగని అమాయకత్వం .  


• మనిషి గురించి సర్వస్వం సమస్తం తెలిసిన భగవంతుడు , నేడు మనిషి మానసిక పరిస్థితిని చూసి జాలిపడే స్థితి లో ఉన్నాడు . ఎందుకంటే మనిషి చాలా అమాయకుడు. ఎంతగా అంటే, తనను తాను అనుక్షణం మోసం చేసుకుంటున్నాను అనే విషయం మరచి ఇతరులను మోసం చేస్తూ , ఈ మాయా ప్రపంచం లో ఏది తప్పు ఏది ఒప్పు , ఏది సత్యం ఏది అసత్యమో తెలియక , మితి మీరిన ధనం వలన సమస్తం నాకే తెలుసు అనే అహంకారం లో చిక్కుకు పోయాడు .


భగవంతుడికి , నేటి కలి కాలపు మనిషి యొక్క మానసిక స్థితి , పరిస్థితి,  కొన్ని యుగాల క్రితమే తెలిసి  . . . త్రేతా, ద్వాపర యుగాలలో  బుషులు, మునులు జ్ఞానుల ద్వారా  రామాయణం , భారతం , పురాణాలు , ఇతిహాసాలలో   పాత్రల ద్వారా ఎలా జీవించాలో రచించాడు . నేడు ఆ గ్రంధాలను పూజించడం మినహ అందులో ఉన్న ప్రతి పాత్ర తనదే అని మనిషి గ్రహించే పరీశీలనా శక్తి కూడా నేటి మనిషి కి లేదు. ఎందుకంటే నేటి మనిషి  చాలా అమాయకుడు .


• ఈ ప్రపంచంలో  ఏ మనిషి  మరో  మనిషి కోసం జీవించడు . ప్రతి మనిషి తన అవసరాల కోసమే ఒక అమాకుడిలా  నటిస్తూ జీవిస్తాడు . ఎందుకంటే మనిషి లోని అపారమైన తెలివి తేటలు అన్నీ కూడా నటన లో ఆరితేరడానికే  సరిపోతుంటాయి … అందుకే మనిషి ఒకే మాటను మార్చి మార్చి నలుగురికి నాలుగు విధాలు గా మాట్లాడుతుంటాడు . ఇందులో సిద్ధహస్తుడు , ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంటాడు . నేడు బ్రతకాడానికి ఇంతకంటే గత్యంతరం లేదు .


• ఎన్నో అమ్ముకోవడానికి  అలవాటు పడిన మనిషి మనస్సాక్షి ని కూడా అలవోకగా అమ్ముకోవడానికి ,  తాకట్టు పెట్టుకోవటానికి తనకు తెలియకుండానే అలవాటు పడిపోయాడు. ఎందుకంటే మనిషి అమాయకుడు .

• ఎన్నో కొనడానికి అలవాటు పడిన మనిషి , తనకు అవసరమైన,  తన స్వ ధర్మాలైన  శాంతి , సుఖం , ప్రేమ , జ్ఞానం , పవిత్రత , ఆనందం   ఎక్కడా  కొనలేక పోతున్నాడు . ఎందుకంటే  మనిషి చాలా అమాయకుడు కాబట్టి వాటి గురించి తెలియదు .

అందుకే భగవంతుడు తిరిగి మనిషి తో మాట్లాడడానికి భయపడుతున్నాడు . . . 


• భగవంతుడి కి తెలుసు . . . మనిషి , పూర్తిగా మాయకు వశం అయి పోయి జీవిస్తున్నాడని . అందుకే భగవంతుడు కలియుగాంతం లో , ధర్మం పూర్తిగా నశించి నపుడు భూమి పై అవతరిస్తాను అని భగవద్గీతలో చెప్పిన విధంగా అవతరించి నేటికీ 90 సంవత్సరాలు అయింది . కలియుగం అంతం కూడా ఆరంభం అయింది . అందులో భాగంగానే కరోనా లాంటి వైరస్ లు , ప్రపంచం నలువైపులా యుద్ధాలు. ఇది ఆరంభం మాత్రమే. పూర్తి స్థాయి వినాశనానికి ఇక మిగిలింది 10 సంవత్సరాలు లోపు కాలం మాత్రమే.


తనను తాను తెలుసు కోవడం లో ,  లోపాలను సరిచేసుకోవడం లోనే  మనిషి  ఉన్నతి   కాగలడు. ఎందుకంటే, మరణం తరువాత తిరిగి శ్రేష్టమైన జన్మ ఎత్తాలి అంటే  తప్పని సరిగా స్వీయ ఉన్నతి అవసరం . 


Written by the Energies Conjunction of KARMIC planet SATURN 🪐 and Past Lifes Spiritual Mastery experienced planet  KETU .

 

ఓం శాంతి 🙏

ఓం నమః శివాయ 🙏.

• ఆత్మ ✍️ , 7 May 2026 11:30 PM .



Tuesday, May 5, 2026

741. వైరాగ్యం జన్మకు సూర్యోదయం

 

  వైరాగ్యం జన్మకు సూర్యోదయం 



• మనం అనేక సార్లు వైరాగ్యం గురించి ఇలా అనుకుంటాం . వైరాగ్యం అంటే విరక్తి , నిరాశ వాదం సర్వస్వం కోల్పోయినట్లు ఉండడం  .

  అసలు వైరాగ్యం అనే పదం జ్ఞానం యొక్క పరిపక్వత తో  ఆవిర్భవించిన అనుభవం . “జ్ఞానం” అంటే ఏది సత్యమో , ఏది అసత్యమో  ఆధార భరితంగా, అనుభవ పూర్వకంగా  మనకు  అర్దం  కావించేది .


• మనుషులం అయిన మనం ఈ  మాయా ప్రపంచం లో , మాయ తో కలిసి జీవిస్తున్నాం  అనే  విషయం తెలియకుండా నే జీవిస్తున్నాం . అదే మాయ యొక్క మహిమా శక్తి .   అందుకు ఉదాహరణ నీతి , నిజాయితీ , సత్యం అంటూ  ఎన్నో విషయాలు మాట్లాడుతాం , చెపుతాం కానీ ఆచరణలో మాత్రం ఉండవు .  అదే మాయ ,   మాయా ప్రపంచపు ప్రభావం . 

 ఇక్కడ ఉన్నది అంతా నిజం అని పరిగెడుతూ, వెంపర్లాడుతూ  మనల్ని మనం మరచి పోయి, మనలో మనకు  ఉన్నది   మనకు మేలు  చేసేది ఏదో తెలియక , లేని దాని కోసం అర్రులు చాచి , చివరికి పుణ్యకాలం అంతా గడిపెస్తాం  . దీనినే అజ్ఞానం అంటారు . దుఃఖానికి , సమస్యలకు , చెడు కర్మలకు ఇదే బీజం.


• జ్ఞానం  సత్యాన్ని , నిజాన్ని తెలియచేస్తుంది , చూపిస్తుంది .‌ భక్తి లో ఇది సాధ్యం కాదు . జ్ఞానం ఏనాడైతే ఆకళింపు అవుతుందో , అది వైరాగ్యాన్ని కలుగ చేస్తుంది. వైరాగ్యం అంటే అన్నీ వదలి వేయడం కాదు .  సూక్ష్మ స్థితి తో  మనకు ఏది అవసరమో దానితో ఉండడం వైరాగ్యం  . శరీరం తో అన్నింటా ఉంటూ మనసు ను అన్నింటికీ అతీతంగా చేసుకోవడం వైరాగ్యం . ఎప్పుడైతే మనసు అన్నింటికీ అతీతంగా అవుతుందో , ఆ మనసు ప్రత్యక్షం గా  ముడిపడేది  భగవంతుని తో నే .


• వైరాగ్యం వలన పొందే ఆనందం, సంతోషం వర్ణించలేనివి .  మానవుడు ఈ ఆనందం , సంతోషం కోసమే  ఎన్నో మార్గాలు వెతుక్కుంటూ , నేడు వికారాలతో   కుప్పిగంతులు వేస్తూ , విలాసాల మైకం లో   అనారోగ్యం పాలై  చివరికి వికారిగా , బికారి గా మరణిస్తున్నాడు . ఇదంతా మాయా ప్రభావం. 

దురదృష్టం  ఏమిటంటే సంతోషం ఆనందం అనేవి మనిషి  మనసు లో నే అనాది గా కప్పబడి ఉండిపోయాయి అనే విషయం తెలియకపోవడం .


• గమనిస్తే . . .  బ్రహ్మ సరస్వతి , విష్ణువు లక్ష్మి దేవి లను బురదలో ఉన్న కమలపుష్పం లో చూపిస్తారు . దీనికి అర్దం , కలియుగ ప్రపంచం అంతా మాయ అనే బురద తో నిండి ఉంటుంది అని .  మాయా అనే బురదలో కూరుకు పోకుండా మనిషి తన లో దాగి ఉన్న దివ్యత్వాన్ని తిరిగి ఎలా పొందాలో తెలియ చేసేది శివ పరమాత్ముని జ్ఞానం . దీనినే గీతా జ్ఞానం అంటారు . భక్తి మార్గం లో ఇదే విషయాన్ని శివుడు దక్షిణామూర్తి రూపంలో చెపుతున్న విధంగా  శాస్త్రాలలో చూపిస్తారు .


• జ్ఞానం  ప్రతి మనిషి కి అవసరం . బుద్ధి, ఆలోచన సవ్యం గా , స్థిరంగా , ఏకాగ్రం గా ఉన్న నాడు జ్ఞానం యొక్క అసలు స్వరూపం తెలుసుకొని అర్దం చేసుకొని  అనుభవించ గలం . మనిషి యొక్క అన్ని సమస్యలకూ జ్ఞానం లేకపోవడం కారణం . మాయ ఆడించే  ఆటకు మనిషి ఏనాడో దాసోహం అయిపోయాడు . మాయ కూడా , భగవంతుని వలే చాలా శక్తి వంతమైనది . అందుకే మనిషి , అంత త్వరగా  తన లో గాని, తన చుట్టూ ఉన్న మాయను గ్రహించలేడు  జయించలేడు .


• శివుని గీతా జ్ఞానం లభించిన నాడు త్రికాల దర్శనం , త్రికరణ సిద్ధి లభిస్తుంది. అప్పుడే మన చుట్టూ ఉన్న శత్రువులతో పాటు మనలో ఉన్న శత్రువులు స్పష్టం గా కనిపిస్తారు .

 విచిత్రమైన విషయం ఏమిటంటే, ఏనాడైతే మనిషి జ్ఞానం తెలుసు కోవడం ఆరంభిస్తాడో , ఆనాడే మాయ మరింత ఫోర్స్ గా   ఏదొక రూపం లో  అనగా  , వ్యక్తి  ఆకర్షణ   లేదా  వస్తు ,  ధనం , వ్యామోహం  రూపంలో  లేదా  బంధన  రూపం లో  వెంట పడుతుంది . 

 ఈ విషయాన్ని మనకు ధృవీకరణ చేసేందుకు , విశ్వామిత్రుడిని భంగపరిచేందుకు  లో రంభ ఊర్వశి మేనకలు  మాయ రూపం లో  వచ్చారు అని పురాణాల లో చెప్పారు .  

అదే విధంగా సీతాదేవి అకస్మాత్తుగా మాయా లేడి  పట్ల ఆకర్షితమై , దాని వెంట పడి రావణాసురుడికి  దొరికిపోయింది.  అని రామాయణం లో చెప్పారు . 

 ఇది పరమ సత్యం .


• జ్ఞాన మార్గం లేదా  సంపూర్ణ  దైవిక ప్రయాణం ఆచరించే వారి పై మాయ ఎనలేని ప్రేమను చూపిస్తూ తవ వైపు ఆకర్షిస్తూ పాతాళానికి పడేయాలి అని చూస్తుంది . కానీ , జ్ఞానులు మాయా జీవులను కూడా భగవంతుని జ్ఞానం తో జయించ గలరు .

 మాయ ,  మనిషి లోని బలహీనతల రూపం లో కూడా ఉంటుంది . మాయ చాలా సూక్ష్మంగా ఉంటుంది. అదే మనిషి పతనానికి కారణం అని మనిషి కూడా తెలియకుండా ఎన్నో జన్మలు గడిచిపోతాయి .  మాయ అంటే అసత్యం. నిజం కానిది . 


• ఏదైతే మనం రెండు చేతులు ఎత్తి భగవంతుని కి మొక్కుతూ ఉంటామో, భగవంతుని కోసం దిక్కు లేని వారిగా కొండలు కోనలు ఎక్కుతూ తిప్పలు పడుతూ ఉంటామో , అదంతా మాయ వలన మనిషి కి కలిగిన దుస్థితి . ఎందుకంటే , మనం శివుని సంతానం అనే విషయాన్ని , మరచి పోయేలా మాయ చేసింది . అందుకే అనాధల వలే భగవంతుడు అయిన తండ్రి కోసం ఆర్తి తో వెతుకుతూ ఉంటాం .

• జ్ఞానం ద్వారా తెలియవచ్చిన  సత్యం ఆచరించినపుడు ప్రకృతి, సృష్టి, విశ్వం మనకు కావలసిన శక్తి ని ఇవ్వడం ఆరంభిస్తాయి . జ్ఞాని ఎన్నడూ ఆడంబరంగా జీవించడు  . ఎందుకంటే జ్ఞానికి  వైరాగ్యమే  ఊపిరి  .

అందుకే నేను అంటాను , వైరాగ్యం జన్మ కి సూర్యోదయం అని .  వైరాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం . అన్నింటా ఉంటూనే , వాటిని మనసు కి అంటక అతీతమైన స్థితితో జీవించడమే వైరాగ్యం .

ఆధ్యాత్మిక చింతన , స్పృహ కలిగిన వారికి మాత్రమే ఈ రచన .


 ఓం శాంతి 🙏

 ఓం నమః శివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 5 May 2026 1:00 PM


759. ఎల్లి పోతున్నదే నా నావ

  ఎల్లి   పోతున్న దే  నా నావ  • ఎల్లి   పోతున్న దే    నా  నావ    మల్లి  . . .   ఎల్లి   పోతున్న దే   నా  నావ. • గింగురల  గాలి  లో ….    గిం...