Thursday, May 14, 2026

745. సమస్యల సావధానం

 

  సమస్యల సావధానం

(సావధానం = శ్రద్ద)



• సరిగా  ఆలోచిస్తే సమస్యలను మనమే సృష్టించుకున్నాము .  అవును  మనం ఒక విషయాన్ని  సమస్య గా భావిస్తుంటే, ఆ సమస్య కి మూల కారణం మనమే . అది తెలియక తరచూ ఇతరులను నిందించడం జరుగుతుంది .

• సమస్య ను  విశ్లేషించుకునే  మానసిక శక్తి , అవగాహన  లోపించినపుడు  దానికి కారణం తరచూ ఇతరులు గా   భావించడం జరుగుతుంది . వాస్తవానికి సమస్య మనది కాబట్టి కారణం కూడా మనమే . మనకు ఉన్న ఆలోచనా లేమి తో సమస్య ను సృష్టించుకునేందుకు మనమే అవకాశం ఇస్తాము లేదా ఇతరులకు ఆ అవకాశం మనమే స్వయంగా కల్పిస్తాము .


• సమస్యను ఎప్పుడూ బాహ్య దృష్టి తో కంటే , అంతర్దృష్టి తో చూసి నపుడు , ఏ దశలో మనము తప్పు చేశాము లేదా సరియైన నిర్ణయం తీసుకోలేక పోయాము  లేదా   సరియైన విధంగా ప్రవర్తించ లేకపోయాము  అనేది మనకు మాత్రమే తెలుస్తుంది . దీనికి కాస్త ఆత్మ శుద్ది అవసరం . ఆత్మ శుద్ది లేని నాడు మన సమస్యలకు సమాధానం గాని, పరిష్కారం గాని పొందలేము .

• నేను కరెక్ట్ అనే భావన ద్వారా సరళత ఉన్న వారికి ఎన్నడూ తమకు సంబంధించిన ఏ విషయం పైన మనసు లో కించిత్ బాధ, దుఃఖం సహజంగా కూడా అనుభవించరు . ఎందుకంటే వారు తమ విషయాలనే కాదు ఎవరి విషయాలను కూడా సమస్యాత్మకంగా చూడరు, సమస్యను అనుభవం పొందరు . ఒకవేళ వారికి సమస్య ఉన్నా లేనట్లే ఉంటారు. కానీ, ఇందులో ఒకవేళ అహంకారం నిండి  ఉంటే  తమను తామే పాతాళానికి చేర్చుకునే ప్రయాణం అవుతుంది.

• వాస్తవానికి కొన్ని సార్లు, మనకు ఏ విధమైన సమస్యలు లేక పోయినా సరే , సమస్యలను అధికం గా ఫీల్ అవుతూ ఉంటాం . ఇది ఒక మానసిక మైన రోగం, బలహీనత.

  

• మనలో మంచి గుణాలు లేనపుడు తప్పని సరిగా ఏదో విధంగా , ఏదో రూపంలో ఇతరులు మనకు గుణపాఠం నేర్పిస్తారు . ఈ విషయం గ్రహించిన నాడు మనం మేలు పొందిన వారమే అవుతాం . కర్మ పాఠాలు, గుణ పాఠాలు నేర్చుకోవడానికి మన జీవితంలోని కాలం  మనకు ఏదో ఒక వయసు లో , ఏదో ఒక సమయంలో అవకాశాన్ని ఇస్తుంది . అది సద్వినియోగం చేసుకున్న వారు భాగ్యవంతులు . కానీ ఇక్కడే ఒక సమస్య . . . అనేక కాలాలు గా మనిషి బుద్ధి బురదలో దొర్లి దొర్లి ఉండడం వలన , పాత సంస్కారాలు పాత ఆలోచనలు కి అలవాటు పడి పోయి ఉండడం వలన . . . గుణ పాఠాలు ఎదురైనా సరే తిరిగి బురదలో దొర్లాడే జీవి లా జీవించాలి అని  అనిపిస్తుంది . ఇటువంటి వారిని మాయా జీవులు అంటారు. అంటే మాయ కు, కొన్నిరకాల బలహీనతలకు పూర్తిగా వశం అయిపోయిన వారు అని అంటారు .

• మన అంతరంగం పరిణితి చెంది ఉన్నంతలో , సాధించేది ఏమీ లేదు. పరిణితి తో పాటు దృఢత్వం అత్యంత అవసరం . ఈ దృఢత్వం సరియైన నియమాలు తో కూడిన నిర్ణయాలను ధైర్యం గా తీసుకునేందుకు సహకరిస్తుంది .

• సమస్యలు అనుభవాన్ని పెంచడానికి , వాటిని పరిష్కారించు కొనే మార్గం తెలియచేయడానికి వస్తాయి . అంతే కానీ వాటిని తప్పించుకు తిరగడానికి కాదు .‌ సమస్యలు అనేవి శాశ్వతంగా తీరిపోయేటివి కాదు . ఒకటి పోతే మరొకటి, మనిషి జీవించి ఉన్నంత వరకు ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి . వాటిని ఎదుర్కోవడం అనగా సమస్య పై యుద్ధం చేయడం , ఒక బుద్ధి హీనత. 

అంత కంటే కూడా, ‌సమస్యను అర్దం చేసుకోవడం అలవాటుగా  చేసుకుంటే తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించవచ్చు . ఆ అనుభవం తో మన సమస్యలనే కాదు , ఇతరుల సమస్యలకు కూడా అలవోకగా పరిష్కారం చూపించవచ్చు. . . కానీ అందుకు ఓర్పు సహనం తో పాటు సత్యమైన విశాల హృదయం కావాలి .

• కొన్ని సార్లు కొన్ని సమస్యలకు మూలం సరియైన కమ్యూనికేషన్ లోపం , అవగాహన లోపం ,  స్పష్టత లో లోపం . ఈ కమ్యూనికేషన్ లో ఆలోచన , మాట , కర్మ ఉంటాయి . వీటిని నిజాయితీ గా  ఆచరించనపుడు మాత్రమే , జరిగిన పొరపాట్లుకు , అనుభవిస్తున్న  సమస్యల కు  తిరిగి  అవే  ఆలోచనలు  , మాట , కర్మ  పరిష్కారం చూపిస్తాయి .

• మనిషి జీవించి ఉన్నంత వరకు సమస్యలు ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి. అందులో అనుమానం లేదు. ఎందుకంటే మనకు తెలియని సత్యం ఏమిటంటే , ఈ కలికాలం లో మనిషి జీవించడమే ఒక పెద్ద సమస్య , దీనికి ఉన్నోడు లేనోడు అనే మినహాయింపు లేదు . ధనం తో అసలు సంబంధం లేదు.  అనేక జన్మలు గా వికర్మలు చేసిన వారే కలియుగం లో జన్మలు తీసుకుంటారు . ఆ కర్మల ఫలితం పూర్తిగా అనుభవించి , శుద్ది కాబడిన వారు మాత్రమే తిరిగి రాబోయే సత్య యుగం లో దైవీక జన్మలు తీసుకుంటారు . . అవునన్నా కాదన్నా ఇదే సత్యం .



• భారతదేశం వేద భూమి, పుణ్య భూమి, కర్మ భూమి. ఇది జగమెరిగిన సత్యం. భగవత్ జ్ఞానం లో స్వస్తిక్ గుర్తులో సృష్టి రహస్యం దాగి ఉంది . అది నాలుగు యుగాల సంకేతం , సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం , కలి యుగం . ఈ నాలుగు యుగాలలో నే  సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఒకొక్క యుగం 1250 సంవత్సరాలు. సృష్టి మొత్తం 5000 సంవత్సరాలు . దీనిని ఒక కల్పం అంటారు. ఇప్పటికే ఎన్నో కల్పాలు జరిగాయి. అందుకే సృష్టి చరిత్ర లక్షల సంవత్సరాలు అనే మాట శాస్త్రాలలో  అంటుంటారు . ప్రస్తుత కాలం కలియుగం పూర్తిగా వినాశనం అయ్యే కాలం. ఆరంభం కూడా అయింది. అందుకు ఎన్నో నిదర్శనాలు ఉదాహరణలు  నిత్యం చూడడం జరుగుతుంది.

  క్రమేపీ సత్య యుగం ఆరంభం కూడా భరత ఖండము నుంచే ఆరంభం ఔతుంది.


• నిజం లో ప్రయాణించడం, నిజం తో కలిసి జీవించడం అసాధ్యం కాదు, కానీ అందుకు కావలసింది నిజాయితిని  కలిగి ఉండాల్సిన అంతరంగం 

ధనం ఉంటే గుణం చూడరు . అదే లేకుంటే  పుట్టుమచ్చ నైనా  రోగం లా చూపేందుకు వెనుకాడరు  .


  ఓం శాంతి

  ఓం నమఃశివాయ

  యడ్ల శ్రీనివాసరావు   14 May 2026 1:00 AM .


No comments:

Post a Comment

745. సమస్యల సావధానం

    సమస్యల సావధానం (సావధానం = శ్రద్ద) • సరిగా  ఆలోచిస్తే సమస్యలను మనమే సృష్టించుకున్నాము .  అవును  మనం ఒక విషయాన్ని  సమస్య గా భావిస్తుంటే, ఆ...