Friday, August 27, 2021

83. జీవన అంతర్ముఖం

 

                       జీవన అంతర్ముఖం


• మనిషికి కొన్నిసార్లు కష్టాలు కన్నీళ్లతో జీవితం ఆగిపోయినట్లు అనిపిస్తుంది, కానీ అవి జీవితాన్ని సరిచేసి కొత్త మలుపు తిప్పడానికే అని అర్థం చేసుకోలేడు. ఊపిరి ఉన్నంత వరకు జీవితం ఆగిపోదు, కాకపోతే జీవితం ఎప్పటికప్పుడు మారుతూ పునరుజ్జీవనం పొందుతుంది.

• మనిషి సహజంగా తనకు తోచిన విధంగా ప్రవర్తిస్తూ, నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ వాటి ఫలితాలు అనుభవించినపుడే అవి సరైనవా, కాదా అనేది తెలుస్తుంది. అవే సంతోషం, దుఃఖం . ఆలోచనా శక్తి అందరికీ ఒకే విధంగా ఉండదు . కానీ పరిసరాలను “గమనించడం, నేర్చుకోవడం , అవలంభించడం” అనేది మనిషి జీవితంలో నిరంతర ప్రక్రియ లా ఉండాలి . ఎందుకంటే కొన్ని సార్లు మనిషి తీసుకునే నిర్ణయాలు సరైనవి కాకపోతే జీవితకాలం శాపం లా అనిపించవచ్చు . అందుకే పరిస్థితుల దృష్ట్యా, వయసురీత్యా, అవసరాలరీత్యా , అనుభవాలు రీత్యా, తత్వ విధానాన్ని మార్చుకుంటూ ఉండాలి . “ ఆలోచనల లోని మెరుగు జీవితానికి వెలుగు “.

• జీవితంలో మనిషి కి  ఎంత సాధించిన, ఏమి సాధించిన, సంపాదించినా, సంపాదించకపోయినా ఏదో ఒక వెలితి, తెలియని అసంతృప్తి, ఇంకా ఏదో కావాలనే ఆరాటం నిరంతరం  వెంటాడుతూనే ఉంటుంది.... తీరా ఆ అసంతృప్తి   ఏమిటా అని చూస్తే, చాలా సార్లు స్పష్టత ఉండదు. దీనినే, ఉన్న దానిని సంతోషంగా అనుభవించలేని స్థితి, లేదా లేనిదాని కోసం ఆతృత,   ఉన్న దానిని  ఆస్వాదించ లేకపోవటం అని అంటారు.

• నిన్న జరిగిపోయింది, రేపు ఎలా ఉంటుందో తెలియదు. నేడు ని ఎందుకు అర్థవంతంగా ఉంచుకో లేక పోతున్నామో మన మనసుకే తెలియాలి. నేేేటి కాలం లో  ఇందుకు ముఖ్యం గా డబ్బు యెుక్క  ప్రభావం కూడానేమో అని కొన్ని సార్లు అనిపిస్తుంది. ఎందుకంటే  జీవితం లో మనిషి చాలా సందర్భాల్లో ప్రతి విషయానికి డబ్బుతోనే కొలమానం గా భావిస్తూ  ఉంటాడు. ఎందుకంటే డబ్బు మనిషి జీవితానికి ఒక అవసరమైన వనరు. కానీ చేతి నిండా తరతరాలకూ కావాల్సినంత డబ్బు ఉన్న వారు నిజంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారా... అంటే ముమ్మాటికీ లేరు అనేదే సమాధానం, కాకపోతే వారు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. ధనం అన్నింటికీ పరిష్కారం కాదు. ధనమును మించిన  జీవన సోపానాలు మనిషి మనుగడ లో చాలా ఉన్నాయి. వాటినే  వ్యక్తిత్వ  విలువలు అనుకోవచ్చు.

• ఈ బాహ్య ప్రపంచంలో మనిషి తన చుట్టూ ఏర్పరుచుకున్న ప్రతీది తన మనుగడ రీత్యా , తన  అవసరాల కోసమే.   కానీ,  మనిషికి ఏది ఎంత అవసరమో అంతే ప్రకృతి కేటాయిస్తుంది. అంతకుమించి ఆశతో అర్రులు చాచిన ప్రకృతి ఇచ్చినట్టే ఇచ్చి ఏదో ఒక రూపంలో (నష్టం కలిగించి) తిరిగి తీసేసుకుంటుంది. అవసరానికి మించి తీసుకున్న ఆహారం ఎంత అజీర్ణమో , అలాగే అవసరానికి మించినది ఏదైనా మనతో శాశ్వతంగా ఉండదు. ఇది ప్రకృతి సిద్ధాంతం.

• వందల కోట్లు సంపాదించిన చాలా మంది మహానుభావుల మానసిక స్థితి చాలా సాదాసీదాగా నిజతత్వంతో నిండి ఉంటుంది . ఎందుకంటే వారికి సాధారణమైన మనుషుల కంటే , ప్రకృతి సిద్ధాంతం గురించి ఎక్కువగా తెలుస్తుంది. ఏదో ఒక శక్తి సహాయంతోనే వారు ఆ స్థితి,  స్థాయి,  భగవంతుని మరియు ప్రకృతి అనుగ్ర్రహంతో  పొందగలిగారు అని , కాలచక్రం లో   ఆ శక్తి ఏదో ఒక రోజు  మరల బలహీనం అవుతుందని కూడా గమనిస్తారు. అందుకే ఆ శక్తిని స్థిరత్వం చేసుకోడానికి ధర్మ పరమైన కార్యక్రమాలు, సేవా , ధార్మికత వంటి మంచి పనులు నిరంతరం చేస్తూ ఉంటారు. ఇది చాలా మంచి పరిణామం , సంకేతం , అవసరం. అంటే ఒక మనిషి మంచి శక్తి ని (positive energy) నిత్యం కలిగి ఉండాలి అంటే , దానం, దయ, సేవా    వంటి సహృదయంతో కూడిన గుణాలు కలిగి ఉండాలి.

• మనిషి కంటికి కనిపించని సూక్ష్మజీవులు, విశ్వం నుండి మనిషిని తాకే ఎన్నో రకములైన శక్తి కిరణాలు, ఇలా ఎన్నో ఎన్నో కంటికి కనిపించనివి మనిషి చుట్టూ ఉన్నాయి.   మనిషి తన చుట్టూ ఉన్న  ప్రకృతి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా సాధన అవసరం . ప్రతీ ఒక్కటి కంటికి కనిపిస్తేనే నిజం అనుకునే మనిషికి ,  సాధన ద్వారా ఆ స్పష్టత అవగతం అవుతుంది.  మనిషి మహాజ్ఞాని , అదేవిధంగా పరమ అజ్ఞాని కూడా. మనిషిలోని మనసుకు ఉన్న  అధ్బుతమైన  శక్తి , అదేవిధంగా వెసలుబాటు ఈ విశ్వంలో ఏ జీవికి లేదు. కానీ దానిని మనిషి పూర్తిగా చాలా సందర్భాల్లో గుర్తించలేడు. ఎందుకంటే కళ్ళతో నిత్యం చూస్తూ ఉండే బాహ్య ప్రపంచంలో మాయ సర్వం కమ్మెస్తూ ఉంటుంది.అదే ఒక విధంగా దుఃఖానికి కారణం అవుతుంది.

• మనిషి తన చుట్టూ ఉన్న సాటి మనిషి మనస్తత్వాన్ని నిరంతరం పరిశీలన చేస్తూ, విశ్లేషిస్తూ ఉంటాడు. కానీ తన గురించి, తన వ్యక్తిత్వం గురించి, తన మనస్తత్వం గురించి సమయం కేటాయించడు. ఎందుకంటే ఒప్పుకోలేని తనం. మనిషి ఒకసారి తన గురించి తాను ఆలోచించినప్పుడు తనలోని లోపాలు స్పష్టంగా కనబడుతున్నప్పుడు అంగీకరించలేడు. ఎందుకంటే ఏదో తెలియని అహం కనిపిస్తుంది, దీనినే తనను తాను మోసం చేసుకోవడం అంటారు. మనిషి తన లోపాలను తాను ఎప్పటికి అర్థం చేసుకుని అంగీకరిస్తాడో,  అప్పుడు  ఆ లోపాలు ఇతరులకు చేరే అవకాశం ముమ్మాటికీ ఉండదు. ఈ ప్రక్రియ వల్ల మనిషి కి గౌరవం, మర్యాద,  ఆనందమే దొరుకుతాయి  గానీ దుఖం ఉండదు.

• నిశితంగా గమనిస్తే ప్రకృతి మంచి ఆలోచనలతో కూడిన  సంకేతాలు మనిషికి నిరంతరం పంపిస్తూనే ఉంటుంది,  జీవితం ఎలా ఉంచుకోవాలి ,  ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఎలా బ్రతకాలి అని. వాటిని జాగ్రత్తగా గమనించి కార్యాచరణ చేయడమే  మనిషి విధి . అది కుటుంబమా, సమాజమా, సేవా , ఉద్యోగమా, వ్యాపారం  అనే పలు విధాలైన అంశాలతో ముడిపడి ఉంటుంది.

• When you feel nothing …. You will be come something……...When you feel something….You will be know that you are Whole Thing…….Here the Thing should be the "SUNYAM" .....This is the transformation and evaluation of life destiny by nature. నీవు ఒక శూన్యం అనే స్థితికి చేరినపుడు ప్రకృతి నీకు ప్రసాదించే అరుదైన గౌరవం ఇది.

• క్షమించాలి.....ఇదంతా బాధ్యతలను  విస్మరించమని   కాదు. ఒక  నిర్దిష్టమైన  ఆలోచనాశక్తి మనిషి పొందగలిగినపుడే విధిని సునాయాసంగా సులభంగా నిర్వర్తించగలడు.  ప్రతి సమస్య స్వయంగా పరిష్కరించుకోవచ్చు. ఆధ్యాత్మికత, దైవం, వేదాంతం అనేది మనిషిలోని అజ్ఞానాన్ని పారద్రోలే మార్గదర్శకాలు. కాకపోతే అవి సాధారణ స్థాయిలో ఉన్న మానవునికి అర్థం అయ్యే విధంగా చేరడం లేదు, అని నా ఉద్దేశం. పరమాాత్మ నాకు అప్పగించిన కర్తవ్యంగా భావించి రాస్తున్నాను .

YSR 20 Aug 21 6:00 am.


Thursday, August 26, 2021

82. ఆరాధన


ఆరాధన


·      

• “ఆరాధన” చాలా పవిత్రమైన భావన తో కూడిన అనుభూతి. ఈ సృష్టిలో మనిషికి మాత్రమే ప్రత్యేకంగా ఆరాధన యొక్క మాధుర్యం అనుభవించ గల అద్భుతమైన అవకాశం దొరికింది. ఈ సృష్టిలో తీయనిది ప్రేమ అంటారు. ప్రేమ లభించిన వారికి తియ్యనిదే, కానీ ఆ ప్రేమ దొరకని వారికి చేదుగానే ఉంటుంది. ఆరాధన అంటే ప్రేమ కాదు. ఆరాధన అంటే ప్రేమని మించిన అద్భుతం. ఒక విధంగా మనిషి తనను తాను ఇహము, పరము లలో అర్పించు కోవడం.


• ఆరాధన మానవుని జీవితంలో ఎన్నో విధములుగా ఉంటుంది. ప్రకృతిని ఆరాధించే వారు ప్రకృతిలో ఉన్న పుష్పాలు, వృక్షాలు, వనములు, జలపాతాలు, నదులు, మేఘాలు, ఆకాశం, వర్షం, పక్షులు , పంట పొలాలు  వంటి ప్రకృతి వరప్రసాదాలతో , మమేకం అవుతూ ఉంటారు. దీని వలన మంచి ఆరోగ్యం,  జీవన శక్తి, ఆనందం పొందుతూ ఉంటారు. 

• ఒక మనిషి, మరోక మనిషి యెడల ఆరాధన కలిగి ఉంటే , నిస్వార్థ మే  గాని, అణువంత స్వార్థం కూడా ఉండదు. ఉదాహరణకు ప్రేమికుల మధ్య ఆరాధన  ఉంటే,  ప్రేమించిన వ్యక్తి , సొంతం అయినా , కాకపోయినా నిరంతరం గౌరవభావంతో  ఆరాధిస్తూనే ఉంటారు. అంటే ఆరాధన కలిగి ఉంటే,  మనిషికి సాటి మనిషితో భౌతిక సంబంధం ఉండవలసిన అవసరం లేదు. ఒకరిని ఆరాధిస్తున్నాము అంటే వారి “పాదాల చెంత మన మనసుని ఉంచడం”.....దీనినే అర్పించుకోవడం అంటారు. సాధారణంగా అర్పించుకోవడం అనే మాటను  శరీరానికి ఉపయోగిస్తారు. శరీరం తాత్కాలికం....మనసు లోని ఆత్మ శాశ్వతం.  ఆరాధన ఆత్మ కు సంబంధించినది.         


• ఇక భగవంతుని పట్ల ఆరాధన. మనిషి భగవంతుడిని త్యాగ నిరతి తో  ప్రేమించ గలడు, కానీ భగవంతుని తో స్నేహం చేయలేడు.  ప్రేమ , స్నేహం అనేవి మానవునికి  కొంత భౌతిక తత్వంతో ముడిపడి ఉన్న అంశాలు. మన  పురాణాలలో ప్రస్తావించిన విషయం,  16 వేల మంది గోపికలు శ్రీకృష్ణుని  ఆరాధించారు.  కానీ ప్రేమించలేదు, స్నేహం చేయలేదు, మోహించలేదు.  ఆరాధన ద్వారా తిరిగి పొందే ప్రతిఫలం “పారవశ్యం”.  


• మదర్ థెరిసా  దీనులను, అభాగ్యులను దైవంగా భావించి ఆరాధించేవారు. ఆమెకు కుష్టు రోగులు కూడా  అందంగానే కనిపించేవారు. అందుకే ఆమెను మానవ రూపంలో ఉన్న దేవునిగా అభివర్ణిస్తారు. "ఎక్కడ ఆరాధన ఉంటుందో అక్కడ దైవత్వం నిండి ఉంటుంది",  అది చేసే వృత్తి , సమాజం, కుటుంబం ఏదైనా కావచ్చు.  మానవునిలోని  రాక్షస గుణాలను రూపుమాపడానికి,  నియంత్రించడానికి అద్భుతమైన విధానం ఆరాధన . మనిషి ఆరాధనను కలిగి ఉండాలి అంటే చేయవలసినది,  చెడు, అహంకారం,  అశాంతి, అపకారం,  ఈర్ష్య,  ద్వేషం అనే లక్షణాలను మనసులోంచి పారద్రోలాలి.  

• ఆరాధనను అవలంభించి అనుసరించే మార్గంలో ప్రధానమైనవి……ప్రార్థన,  సేవ , అంకితభావం. 

• ఆరాధన అనే అద్భుతమైన భావం భగవంతుడు మనిషికి ప్రసాదించడం లో అంతరార్ధం......ఈ సృష్టిని, విశ్వాన్ని సమస్త ప్రాణుల ను  ఆరాధిస్తూ  కాపాడుకోవమని. 

Worship is Divinity

 YSR 26 Aug 21 8:00 am

Saturday, August 21, 2021

81. రక్షాబంధనం

 రక్షాబంధనం

• అన్నా చెల్లెల, అక్క తమ్ముల అనుబంధం జన్మ జన్మల ఋణానుబంధం.

• బంధం లోని అర్థం రూపం కాదు.....రక్తం.

• బంధం లోని జీవనం బరువు కాదు.....రక్షణ.

• కలికాలంలో కొలతలతో, కొలమానాలతో కనుమరుగవుతున్న బంధాలకు వాటిలోని శక్తిని బలోపేతం చేసుకోవడమే జీవన సార్ధకం.

• బంధం ఉన్న వారికి దివ్యం……. బంధం లేని వారికి దయనీయం……బంధం ఉండి లేనట్లున్నవారికి దైన్యం……బంధం లేకుండా ఉన్నట్లున్న వారికి దైవత్వం.

• తల్లికి ప్రతిరూపం అక్క(సోదరి)…..తండ్రికి ప్రతిరూపం అన్న(సోదరుడు).

• సోదరి లోని ప్రేమ......సోదరుడి లోని లోని రక్షణ యే రక్షాబంధనం.


యడ్ల శ్రీనివాసరావు, 22 Aug 21, 9:00 am.

Wednesday, August 18, 2021

80. బాల్యం…..జీవిత శాసనం


బాల్యం…..జీవిత శాసనం

• బాల్యంలో రాత్రి ఆరుబయట నిలబడి ఆకాశం చూస్తుంటే ఊహ తెలియక, ఆకాశం ముట్టుకోగలనా అని ఆలోచిస్తూ ఉండే వాడిని, ఊహ తెలిసిన నేటికీ ఆ ఆకాశం, నాలో లోలోన, అలాగే, ప్రతీ మనిషిలోనూ ఉంటుందని అర్థమవుతుంది .

• చేతిలోని పది పైసలు, బాల్యంలో ఒక సామ్రాజ్యానికి చక్రవర్తిని చేసేది. పరుగుపరుగున పది పైసలతో వీధి చివర బండి దగ్గరకు పోయి, నుదిటి చెమటను చేతితో తుడుస్తూ, విప్పారిన కన్నులతో , నాలుకతో పెదవులు తడుపుతూ , గాజు గ్లాస్ లో సబ్జాలతో నిండిన నారింజ క్రష్ తాగుతుంటే " ఆహా ఇంతకన్నా ఆనందం ఏముంది" అనిపించేది.

• ఆదివారం మధ్యాహ్నం మండుటెండలో, వీధిలో చేతితో చిన్న ఇత్తడి గంట కొడుతూ నేనొచ్చాను, అని సంకేతంతో రోకలి వంటి కర్రకు చుట్టిన "ఎర్రని సాగే పీచుమిఠాయి" వాలా, చేతికి వాచీ , చిటికెన వేలికి ఉంగరం, చిన్న పుల్లకు సైకిలు , మరియు సీతాకోకచిలుక బొమ్మలు తయారు చేసి అమ్ముతూ ఉండే, సాగే పీచు మిఠాయిని కళ్ళు మూసుకుని చీకుతూ తింటూ ఉన్నపుడు.... ఆహా ఆ మాధుర్యానికి ఏది సరి సాటి అనిపించేది.

• తిరణాల్లో నాన్నతో తిరుగుతూ ....రంగులరాట్నం లోని గుర్రపు బొమ్మ ల పై స్వారీ లా కూర్చుని , కేరింతలతో చుట్టూ తిరుగుతూ ఉన్నపుడు పొందిన ఆనందం, ....నడినెత్తిన ఎండలో దాహంతో ఆర్తిగా జుర్రుకుంటూ, చేతిలో కారిపోతున్న కొబ్బరి, రంగు పుల్ల ఐసు లోని కమ్మదనం....ఏమైపోయిందో, ఎక్కడికి పోయిందో.

• బాల్యం లో సంవత్సరానికి ఒకసారి కొనుక్కునే కొత్త బట్టలను , తేరిపార చూస్తూ , తరచి తరచి నిమురుతూ, సగం రాత్రిలో నిద్ర మధ్యలో లేచి బీరువాలోని కొత్తబట్టలు ఆనందంగా చూసుకుంటూ ఉంటే .....ఇవి , ఇవి , ఇవే కాదా వెలకట్టలేని అనుభూతులు.

• ఆవురావురుమని ఆకలితో సాయింత్రం బడి నుంచి ఇంటికి చేరాక బెల్లం, గోధుమపిండి కలిపిన అమ్మ చేతి అట్లు......చేతి వేళ్లకు పసుపు రంగు తినే గొట్టాలు తొడిగి , వేళ్లను ఊపుతూ తింటూ ఆడే ఆటలు......మంచం కింద ఆరబెట్టిన గడ్డిలో ముగ్గబెట్టిన మామిడికాయలతో ఇల్లంతా నిండిన వాసనలు, ఎక్కడికి పోయాయో, ఏమైపోయాయో. 

• బాల్యం లో కష్టాలు, దుఃఖం, బాధలు అనుభవిస్తే ఈ రోజు నీకు అంతులేని అపరిమితమైన రాటుదేలే అనుభవాలను మిగిల్చినట్లే…..బాల్యం లో సుఖం, సంతోషం, అనుభవిస్తే అవి మంచి జ్జాపకాలుగా నీలోని శక్తి కి ప్రేరణ అవుతుంది. బాల్యం ఒక దూదిపింజ వంటిది, ఎప్పుడూ తేలియాడుతూ నే ఉంటుంది. ఎందుకంటే బాల్యానికి కొలతలు, కొలమానాలు, ఎల్లలు, తారతమ్యాలు, లింగభేధాలు, వర్ణవివక్షతలు, ధనిక, పేద, కులమత వర్గాలు ఉండవు……ఒక్క మాటలో చెప్పాలంటే కల్మషం అంటే అర్థం తెలియనిది. నేటి జీవితం విధానం లో పేరుకు పోయిన ఒత్తిడి మాలిన్యం కొంత అయిన విదిలించి కోవాలి.  అందుకే ఆ బాల్యం గుర్తు చేసుకుంటే , ఆస్వచ్ఛత మనసుకి ఒక మంచి ఔషధం అవుతుంది.

• బాల్యంలోని కమనీయత, విలువ, స్వేచ్ఛ బాల్యంలో ఉన్నప్పుడు వయసుకు, మనసుకు అర్థం కాకపోవచ్చు, కానీ బాల్యంలోని ఆనందాలు, అనుభవాలు, అనుభూతులు ఒక జన్మ లోని జీవితానికి కావలసిన శక్తిని , సంతోషాన్ని , పరిపూర్ణతను ఇస్తాయి .....అందుకు చేయవలసినది ఒకటే , నీవు ప్రస్తుతం ఏ వయసులో ఉన్నా, ఏ సమయం లో ఉన్నా, కొన్ని క్షణాలు మాత్రం నీ బాల్య అనుభవాలకు కేటాయించుకో....తప్పక నీలో మానసిక శారీరక ఆరోగ్య చైతన్యం రాకపోతే చూడు.

• నువ్వు ప్రకృతిలో ఉన్నావు అంటే నీలో ప్రకృతి ఉంది అని అర్థం. నీలోని సహజ తత్వాన్ని గుర్తించి, కృత్రిమ తత్వాన్ని వదిలిపెట్టు. "బాధ్యతలు నిన్ను ఎప్పుడూ దేనికి బందీగా, బలహీనంగా మారమని చెప్పవు". బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి అంటే నీలోని సహజసిద్ధమైన స్వభావంతో నిండిన ఆనందమే నీకు ఆయుధం , ఔషధం. ....మరి ఇంకెందుకు ఆలస్యం నీ లోలోని ఆనందం ఎక్కడ దాగి ఉందో గమనించు.

• నీ జీవితం ఎంత మందితో, ఎన్నెన్నో సంబంధ బాంధవ్యాల తో ముడిపడి ఉన్నా, నీ మనసు పుస్తకంలో భగవంతుడు సృష్టించిన ఒక పేజీ నీకంటూ, నీకోసం ఖాళీ గా ఎదురు చూస్తూనే ఉంటుంది, "నువ్వు ఏమి రాస్తావో అని" .....అది సంతోషమో, దుఃఖమో, త్యాగమో, దైవమో, మోక్షమో......ఇంకెందుకు ఆలస్యం పూరించు......బహుశా ఆ ఖాళీ పేజీ యే నీ ఆత్మ కావచ్చు.

YSR 18 Aug 21, 2:00 pm


Saturday, August 14, 2021

79. మనసు ఊహకు శిరోధార్యం

 మనసు  ఉహకు  శిరోధార్యం

• ఈశ్వర పరమేశ్వర !

• నీ ఆటేమిటో, నీ పాట ఏమిటో, నీ లీల ఏమిటో......

• నీ పాదాల చెంత నిలిస్తేనే కదా తెలిసేది నేనేమిటో .....

• నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటావు....కారణం లేకుండా ఏదీ జరగదు అంటావు....కానీ కారణం తెలిసేనాటికి కాలాతీతం అయిపోతుంది.

🌹🌹🌹🌹🌹🌹

• రాయించెడిది నీవు,  రాసేడిది నేను..... నిజము కాని  నిజము సజీవమై నడిమధ్యన ఏమిటయ్యా ....ఈశ్వరా!

• ఎదురుపడిన చూపులకు చూపే కరువైనపుడు….

• ఎదురుపడిన మాటలకు మాటలే కరువైనపుడు….

• చూపులు లేని,  మాటలు లేని నడుమ జీవం ఉంటుందా….

• చూపులు మనసులకే గాని మనుషులకు కాదా….

• మాటలు మనసులకే కానీ మనుషులకు కాదా….

* మనసు వేరు..... మనిషి వేరా.....

• అవుతుంది….అవుతుంది….అర్థం అవుతుంది.....

* మనసు అంటే ఊహా..... మనిషి అంటే నిజం....

* మనసు మనిషి కావచ్చు కానీ,  ఊహా  నిజం కాదేమో....

• మరి మనసులోని ప్రేమ,  రాతలోని ప్రేమ ఊహలోని నిజం నిజమే కదా!

* ఊహాలోని నిజం నిజం కానపుడు , నా  ప్రేమ కూడా నిజం  కాదంటావా.....

• లేని మనసును ఉన్నట్టు చూపి,   మనసులోని ప్రేమకు, ఊహతో నిజమైన ప్రాణం ఎందుకు పోశావు ఈశ్వరా!...

* ఊహలోని నిజం నిజం కాదంటే భరించేే శక్తి నాకెక్కడిది  .......ఈ ఊహకు  నీవే శిరోధార్యం పరమేశ్వరా!

• ఏమైనా..... నీవు ఆడించే ఆటలో ఎప్పుడూ మనిషి కీలుబొమ్మయే ,  శివయ్యా!...

* ఆశలు కల్పిస్తావు,  అందలమెక్కిస్తావు.....ఆవిరి చేసేస్తుంటావు.....ఈశ్వరా... పరమేశ్వరా!


యడ్ల శ్రీనివాసరావు

6 Aug 2021, 10:30 pm

Tuesday, August 3, 2021

77. బంధమా... అనుబంధమా....సుగంధమా

 

        అనుబంధం……సుగంధం

🥀🥀🥀

* బంధమా     ...  అనుబంధమా ...

   నిర్బంధమా ...  సుగంధమా     ...  ఏ బంధమో.


• అనంతమైన ఈ విశ్వంలో అంతం లేనిది శూన్యం ...

  ఈ బంధమే ఒక శూన్యం ... 

   కానీ ... శూన్యం ఎంతో సజీవం ... 

  సజీవం తో  ఉన్న  ఈ బంధమే నా శ్వాసకు ఆధారం.


• కరుగుతున్న కాలంలో 

  కలిసి "పోతున్న" మనకు

  కలవరమెందుకో  ...  కలత ఎందుకో.


• అశలు హరివిల్లు అవుతున్న వేళ

  ఆనందమే ఆకాశం అవుతుంటే  … ఆహా.


• జ్ఞాపకాలు ఊపిరి అవుతున్న వేళ

  సుఖదుఃఖాలు  రేయి పగలు  అవుతున్నవి.


• రాసిన అక్షరాలు  హృదయస్పందన  అవుతుంటే

 మనసు మూగ పోతుంది

 నా మనసు  మేఘమవుతుంది.


• వాడిన మొక్కకు పువ్వులు పూస్తుంటే

  ఎండిన చెట్టు చిగురిస్తుంటే

  వయసు చిన్నదాయెను  ... మనసు ఊయలూగెను.


• మనసు పంచుకోవడానికి 

  మనసే కావాలా, మనిషి  కానక్కర్లేదా

  చెలి ఓ నా చెలి ... 

  మనిషి లోనే కదా మనసు ఉన్నది.🌹🌹🌹


యడ్ల శ్రీనివాసరావు  9 July 21 , 9:00 pm

 

















        

75. ఏమనాలి.... ఏమనుకోవాలి

 

ఏమనాలి…. ఏమనుకోవాలి

• కలయిక కల కాదులే..... కల్పన కాదులే..... కారణముంటుంది లే.

• నా వేదన నీ రోదనలా.....నా సంతోషం నీ ఆనందంలా.... నే చెప్పకనే నా అనుభూతులు నీవి అవుతుంటే, ఏమనాలి.... ఏమనుకోవాలి.

తడబడిన మాటలే, నీ కోసం......తపన పడుతుంటే,

• అర్థం లేని ఈ అక్షరాలే సమూహమై,   నీకోసం..... ఆరాధనగా మారుతుంటే,

• నిరాశ తో దిక్కులు చూసే కనులే, నీకోసం...... దేదీప్యమవుతుంటే,

• నీ మాట లోని శబ్దం కోసం.....నా గుండె లోని శబ్దం ఎదురుచూస్తూ ఉంటే.....ఏమనాలి..... ఏమనుకోవాలి.

• నువు చెప్పకనే, చెప్పిన చెప్పలేని భావాన్ని......చెప్పినాక, చిగురించిన భావానికే అర్థం తెలిసింది,   నీవు నాకు తోడుగా ఉంటే....నా నీడకు నీవే జీవమని.

• నీ అదరముల అలజడికి జ్వలించిన, నుదుటిపై స్వేదము నేనని తెలియడం లేదా....

• నీ స్వరూపానికి సారూప్యతను నిచ్చే సమతుల్యం నేనని తెలియడం లేదా....

• చెలి ఓ చెలి, చాచే నీ చేతుల్లో ఒదగాలని.....నిలిచే నీ పాదాల చెంత కరగాలని.......మనసు పడే ఆరాటాన్ని ఏమనాలి......ఏమనుకోవాలి.

యడ్ల శ్రీనివాసరావు

31 July 21 7:30 am


76. ఏమి అడుగగలను... ఏమి ఇవ్వగలను

 

ఏమి అడగగలను.....ఏమి ఇవ్వగలను


💖💖💖💖💖

• కనులలోని నీ రూపం కలయా, ఇలయా లేక తెలియని మాయా.

• నీ దోబూచుల్లో ఆంతర్యం....ప్రకృతి చెప్పకనే చెబుతుంది .

• నా చిన్ని గుండెలో దాగిన , చిట్టి ప్రేమకు “చిగురే” నీ మనసు.

• మనసు లోని మాధుర్యం.....గుండెలోని గందరగోళం కలిసి చేసే అల్లరి, అనుభూతులు అవుతుంటే......ఆ అనుభవం కోసం ఎన్ని జన్మలైనా ఎదురు చూడాలి అని ఉంది.

• కలయిక కల కాదని చెప్పే సాక్ష్యాలే ఈ కలమున జారే కవితలు.

• ఉంటావా...... నాతో ఉంటావా.....నేనున్నంత వరకు ఎప్పుడూ ఇలానే ఉంటావా.... అంటే.... కాలం స్తంభించిన క్షణం అది.....నా జన్మకు అర్థం తెలిసిన మరుక్షణం అది.

• నా శ్వాస , నీ నిశ్వాస అవుతుంటే….. ఏమడగగలను నేను....ఏమివ్వగలను నీకు.... ప్రేమ లోని పరవశం తప్ప.

యడ్ల శ్రీనివాసరావు

1 Aug 21 5:30 pm


489. నేను ఉండలేను

నేను ఉండలేను • నేను ఉండలేను   నిను విడిచి    నేను  ఉండలేను.   శివ   నేను  ఉండలేను   నిను విడిచి    నేను ఉండలేను. • తలపు లో      కొలువైనాక ...