ఆరాధన
·
• “ఆరాధన” చాలా పవిత్రమైన భావన తో కూడిన అనుభూతి. ఈ సృష్టిలో మనిషికి మాత్రమే ప్రత్యేకంగా ఆరాధన యొక్క మాధుర్యం అనుభవించ గల అద్భుతమైన అవకాశం దొరికింది. ఈ సృష్టిలో తీయనిది ప్రేమ అంటారు. ప్రేమ లభించిన వారికి తియ్యనిదే, కానీ ఆ ప్రేమ దొరకని వారికి చేదుగానే ఉంటుంది. ఆరాధన అంటే ప్రేమ కాదు. ఆరాధన అంటే ప్రేమని మించిన అద్భుతం. ఒక విధంగా మనిషి తనను తాను ఇహము, పరము లలో అర్పించు కోవడం.
• ఆరాధన మానవుని జీవితంలో ఎన్నో విధములుగా ఉంటుంది. ప్రకృతిని ఆరాధించే వారు ప్రకృతిలో ఉన్న పుష్పాలు, వృక్షాలు, వనములు, జలపాతాలు, నదులు, మేఘాలు, ఆకాశం, వర్షం, పక్షులు , పంట పొలాలు వంటి ప్రకృతి వరప్రసాదాలతో , మమేకం అవుతూ ఉంటారు. దీని వలన మంచి ఆరోగ్యం, జీవన శక్తి, ఆనందం పొందుతూ ఉంటారు.
• ఒక మనిషి, మరోక మనిషి యెడల ఆరాధన కలిగి ఉంటే , నిస్వార్థ మే గాని, అణువంత స్వార్థం కూడా ఉండదు. ఉదాహరణకు ప్రేమికుల మధ్య ఆరాధన ఉంటే, ప్రేమించిన వ్యక్తి , సొంతం అయినా , కాకపోయినా నిరంతరం గౌరవభావంతో ఆరాధిస్తూనే ఉంటారు. అంటే ఆరాధన కలిగి ఉంటే, మనిషికి సాటి మనిషితో భౌతిక సంబంధం ఉండవలసిన అవసరం లేదు. ఒకరిని ఆరాధిస్తున్నాము అంటే వారి “పాదాల చెంత మన మనసుని ఉంచడం”.....దీనినే అర్పించుకోవడం అంటారు. సాధారణంగా అర్పించుకోవడం అనే మాటను శరీరానికి ఉపయోగిస్తారు. శరీరం తాత్కాలికం....మనసు లోని ఆత్మ శాశ్వతం. ఆరాధన ఆత్మ కు సంబంధించినది.
• ఇక భగవంతుని పట్ల ఆరాధన. మనిషి భగవంతుడిని త్యాగ నిరతి తో ప్రేమించ గలడు, కానీ భగవంతుని తో స్నేహం చేయలేడు. ప్రేమ , స్నేహం అనేవి మానవునికి కొంత భౌతిక తత్వంతో ముడిపడి ఉన్న అంశాలు. మన పురాణాలలో ప్రస్తావించిన విషయం, 16 వేల మంది గోపికలు శ్రీకృష్ణుని ఆరాధించారు. కానీ ప్రేమించలేదు, స్నేహం చేయలేదు, మోహించలేదు. ఆరాధన ద్వారా తిరిగి పొందే ప్రతిఫలం “పారవశ్యం”.
• మదర్ థెరిసా దీనులను, అభాగ్యులను దైవంగా భావించి ఆరాధించేవారు. ఆమెకు కుష్టు రోగులు కూడా అందంగానే కనిపించేవారు. అందుకే ఆమెను మానవ రూపంలో ఉన్న దేవునిగా అభివర్ణిస్తారు. "ఎక్కడ ఆరాధన ఉంటుందో అక్కడ దైవత్వం నిండి ఉంటుంది", అది చేసే వృత్తి , సమాజం, కుటుంబం ఏదైనా కావచ్చు. మానవునిలోని రాక్షస గుణాలను రూపుమాపడానికి, నియంత్రించడానికి అద్భుతమైన విధానం ఆరాధన . మనిషి ఆరాధనను కలిగి ఉండాలి అంటే చేయవలసినది, చెడు, అహంకారం, అశాంతి, అపకారం, ఈర్ష్య, ద్వేషం అనే లక్షణాలను మనసులోంచి పారద్రోలాలి.
• ఆరాధనను అవలంభించి అనుసరించే మార్గంలో ప్రధానమైనవి……ప్రార్థన, సేవ , అంకితభావం.
• ఆరాధన అనే అద్భుతమైన భావం భగవంతుడు మనిషికి ప్రసాదించడం లో అంతరార్ధం......ఈ సృష్టిని, విశ్వాన్ని సమస్త ప్రాణుల ను ఆరాధిస్తూ కాపాడుకోవమని.
Worship is Divinity
YSR 26 Aug 21 8:00 am
No comments:
Post a Comment