Wednesday, August 18, 2021

80. బాల్యం…..జీవిత శాసనం


బాల్యం…..జీవిత శాసనం

• బాల్యంలో రాత్రి ఆరుబయట నిలబడి ఆకాశం చూస్తుంటే ఊహ తెలియక, ఆకాశం ముట్టుకోగలనా అని ఆలోచిస్తూ ఉండే వాడిని, ఊహ తెలిసిన నేటికీ ఆ ఆకాశం, నాలో లోలోన, అలాగే, ప్రతీ మనిషిలోనూ ఉంటుందని అర్థమవుతుంది .

• చేతిలోని పది పైసలు, బాల్యంలో ఒక సామ్రాజ్యానికి చక్రవర్తిని చేసేది. పరుగుపరుగున పది పైసలతో వీధి చివర బండి దగ్గరకు పోయి, నుదిటి చెమటను చేతితో తుడుస్తూ, విప్పారిన కన్నులతో , నాలుకతో పెదవులు తడుపుతూ , గాజు గ్లాస్ లో సబ్జాలతో నిండిన నారింజ క్రష్ తాగుతుంటే " ఆహా ఇంతకన్నా ఆనందం ఏముంది" అనిపించేది.

• ఆదివారం మధ్యాహ్నం మండుటెండలో, వీధిలో చేతితో చిన్న ఇత్తడి గంట కొడుతూ నేనొచ్చాను, అని సంకేతంతో రోకలి వంటి కర్రకు చుట్టిన "ఎర్రని సాగే పీచుమిఠాయి" వాలా, చేతికి వాచీ , చిటికెన వేలికి ఉంగరం, చిన్న పుల్లకు సైకిలు , మరియు సీతాకోకచిలుక బొమ్మలు తయారు చేసి అమ్ముతూ ఉండే, సాగే పీచు మిఠాయిని కళ్ళు మూసుకుని చీకుతూ తింటూ ఉన్నపుడు.... ఆహా ఆ మాధుర్యానికి ఏది సరి సాటి అనిపించేది.

• తిరణాల్లో నాన్నతో తిరుగుతూ ....రంగులరాట్నం లోని గుర్రపు బొమ్మ ల పై స్వారీ లా కూర్చుని , కేరింతలతో చుట్టూ తిరుగుతూ ఉన్నపుడు పొందిన ఆనందం, ....నడినెత్తిన ఎండలో దాహంతో ఆర్తిగా జుర్రుకుంటూ, చేతిలో కారిపోతున్న కొబ్బరి, రంగు పుల్ల ఐసు లోని కమ్మదనం....ఏమైపోయిందో, ఎక్కడికి పోయిందో.

• బాల్యం లో సంవత్సరానికి ఒకసారి కొనుక్కునే కొత్త బట్టలను , తేరిపార చూస్తూ , తరచి తరచి నిమురుతూ, సగం రాత్రిలో నిద్ర మధ్యలో లేచి బీరువాలోని కొత్తబట్టలు ఆనందంగా చూసుకుంటూ ఉంటే .....ఇవి , ఇవి , ఇవే కాదా వెలకట్టలేని అనుభూతులు.

• ఆవురావురుమని ఆకలితో సాయింత్రం బడి నుంచి ఇంటికి చేరాక బెల్లం, గోధుమపిండి కలిపిన అమ్మ చేతి అట్లు......చేతి వేళ్లకు పసుపు రంగు తినే గొట్టాలు తొడిగి , వేళ్లను ఊపుతూ తింటూ ఆడే ఆటలు......మంచం కింద ఆరబెట్టిన గడ్డిలో ముగ్గబెట్టిన మామిడికాయలతో ఇల్లంతా నిండిన వాసనలు, ఎక్కడికి పోయాయో, ఏమైపోయాయో. 

• బాల్యం లో కష్టాలు, దుఃఖం, బాధలు అనుభవిస్తే ఈ రోజు నీకు అంతులేని అపరిమితమైన రాటుదేలే అనుభవాలను మిగిల్చినట్లే…..బాల్యం లో సుఖం, సంతోషం, అనుభవిస్తే అవి మంచి జ్జాపకాలుగా నీలోని శక్తి కి ప్రేరణ అవుతుంది. బాల్యం ఒక దూదిపింజ వంటిది, ఎప్పుడూ తేలియాడుతూ నే ఉంటుంది. ఎందుకంటే బాల్యానికి కొలతలు, కొలమానాలు, ఎల్లలు, తారతమ్యాలు, లింగభేధాలు, వర్ణవివక్షతలు, ధనిక, పేద, కులమత వర్గాలు ఉండవు……ఒక్క మాటలో చెప్పాలంటే కల్మషం అంటే అర్థం తెలియనిది. నేటి జీవితం విధానం లో పేరుకు పోయిన ఒత్తిడి మాలిన్యం కొంత అయిన విదిలించి కోవాలి.  అందుకే ఆ బాల్యం గుర్తు చేసుకుంటే , ఆస్వచ్ఛత మనసుకి ఒక మంచి ఔషధం అవుతుంది.

• బాల్యంలోని కమనీయత, విలువ, స్వేచ్ఛ బాల్యంలో ఉన్నప్పుడు వయసుకు, మనసుకు అర్థం కాకపోవచ్చు, కానీ బాల్యంలోని ఆనందాలు, అనుభవాలు, అనుభూతులు ఒక జన్మ లోని జీవితానికి కావలసిన శక్తిని , సంతోషాన్ని , పరిపూర్ణతను ఇస్తాయి .....అందుకు చేయవలసినది ఒకటే , నీవు ప్రస్తుతం ఏ వయసులో ఉన్నా, ఏ సమయం లో ఉన్నా, కొన్ని క్షణాలు మాత్రం నీ బాల్య అనుభవాలకు కేటాయించుకో....తప్పక నీలో మానసిక శారీరక ఆరోగ్య చైతన్యం రాకపోతే చూడు.

• నువ్వు ప్రకృతిలో ఉన్నావు అంటే నీలో ప్రకృతి ఉంది అని అర్థం. నీలోని సహజ తత్వాన్ని గుర్తించి, కృత్రిమ తత్వాన్ని వదిలిపెట్టు. "బాధ్యతలు నిన్ను ఎప్పుడూ దేనికి బందీగా, బలహీనంగా మారమని చెప్పవు". బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి అంటే నీలోని సహజసిద్ధమైన స్వభావంతో నిండిన ఆనందమే నీకు ఆయుధం , ఔషధం. ....మరి ఇంకెందుకు ఆలస్యం నీ లోలోని ఆనందం ఎక్కడ దాగి ఉందో గమనించు.

• నీ జీవితం ఎంత మందితో, ఎన్నెన్నో సంబంధ బాంధవ్యాల తో ముడిపడి ఉన్నా, నీ మనసు పుస్తకంలో భగవంతుడు సృష్టించిన ఒక పేజీ నీకంటూ, నీకోసం ఖాళీ గా ఎదురు చూస్తూనే ఉంటుంది, "నువ్వు ఏమి రాస్తావో అని" .....అది సంతోషమో, దుఃఖమో, త్యాగమో, దైవమో, మోక్షమో......ఇంకెందుకు ఆలస్యం పూరించు......బహుశా ఆ ఖాళీ పేజీ యే నీ ఆత్మ కావచ్చు.

YSR 18 Aug 21, 2:00 pm


No comments:

Post a Comment

494. Failers Are Accurate Winners

  Failers Are Accurate Winners • అపజయం అనే పదం వినగానే ప్రతి మనిషి లో కలిగేది ఒక భయం, మానసిక ఆందోళన. మనిషి ఏదైతే కోరుకుంటాడో అది పొందక పోవ...