Thursday, April 25, 2024

490. జన గళం


జన గళం


• జనమెత్తిన   గళము లో

  ఈ పవనం    లేచే  లే.

• కదమేగిన    పోటు లో

  ఈ కదనం    సాగే  లే.


• గుప్పెడు   పిడికిలి   గుండేలే

  ఈ   ధైర్యం.

• ఒక్కడు    వేసిన    అడుగే లే

  ఈ   సైన్యం …

  జన సైన్యం  … జన సైన్యం.


• జనమెత్తిన    గళము లో

  ఈ పవనం    లేచే లే.

• కదమేగిన    పోటు లో

  ఈ కదనం    సాగే లే.


• భావం తోని    బ్రతికే వా డే

  ఈ  నాయకు డే.

• త్యాగం చేసి   తగ్గిన  వా డే

  ఈ  ఉత్తము డే.

• పాలన  కాదని   సేవను   చేసే వా డే

  ఈ   లక్ష్మణు డే.

• పాపుల  పాలిట   అస్త్రం  వేసే వా డే

  ఈ   ఫల్గును డే.


• కులము లేదు   …   మతము లేదు

  జాతి లేదు  …  వర్ణం లేదు

  ఉన్నదల్లా    ఒకటే  లే

  మానవత్వం ... మానవత్వం ... మానవత్వం.


• జనమెత్తిన   గళము లో

  ఈ పవనం     లేచే లే.           

• కదమేగిన     పోటు లో

  ఈ కదనం      సాగే లే.


• చీకటి లో    చిగురించిన  వా డే

  ఈ  సేవకుడే.

• పేదల కోసం    వెలుగై  నా డే

  ఈ   భాస్కరు డే.

• ఆశయ  సిద్ధి కి    జ్యోతై  నా డే

  ఈ  కర్షకు డే.

• జనం  కోసం    రక్షకు డై  నా డే

  ఈ  సైనికు డే.


• పంచ భూతాలలో   ఈ పవనం ...

  పావనం   చేస్తుంది    లోకం ... 

  అదే కళ్యాణం … కళ్యాణం … కళ్యాణం.



కదమేగిన = గుర్రపు పరుగు.


యడ్ల శ్రీనివాసరావు 25 Apr 2024 9:05 pm.


489. నేను ఉండలేను


నేను ఉండలేను


• నేను ఉండలేను

  నిను విడిచి    నేను  ఉండలేను.

  శివ

  నేను  ఉండలేను

  నిను విడిచి    నేను ఉండలేను.


• తలపు లో      కొలువైనాక

‌ తనువు   నిను   చేరుటకు

 సిద్ధమవుతున్నది.

• నీవే   తండ్రివని    తెలిసినాక 

  నేననాధను   కానని

  ఆత్మ ఆనంద    మవుతున్నది.


• నేను  ఉండలేను

  నిను విడిచి   నేను ఉండలేను.

  శివ

  నేను  ఉండలేను

  నిను విడిచి   నేను ఉండలేను.


• నిను మరచిన    సమయమంతా

  అంధకార    అయోమయం.

• తెల్లగున్న    కొంగలు  హంసలు

  ఒకేలా అనిపించాయి.

  అనుభవం తో    తెలిసింది ...

  అది నా లోని   మాయ అని.


• నిను కలసిన ఈ కాలమంతా

  అమరలోకపు    ఆనందం.

• మనసు లో    నిలిచావు

  ఎన్నో   సూక్ష్మాలను   చూపావు.

  అందుకే ….

  నీ  ఛత్రఛాయ లోని   ప్రేమ   సత్యం.

  అదే   నా శ్వాస కు   ఆధారం.


• నేను ఉండలేను

  నిను విడిచి   నేను ఉండలేను.

  శివ

  నేను   ఉండలేను

  నిను విడిచి    నేను ఉండలేను.


యడ్ల శ్రీనివాసరావు 24 Apr 2024 , 9:00 pm.


Monday, April 15, 2024

488. నా ప్రపంచం


నా ప్రపంచం


• నా దొక   ప్రపంచం

  అది   సోయగాల   సౌందర్యం.

• నా  మనసెరిగిన   ప్రపంచం

  మధువొలికిన     అనందం.


• అందాల   ఆరబోతలు

  ఆదమరచి   ఉంటాయి.

• పరవశించు  పరిమళాలు

  గుబాళిస్తూ   ఉంటాయి.


• నా దొక    ప్రపంచం

  అది  సోయగాల   సౌందర్యం.

• నా  మనసెరిగిన   ప్రపంచం

   మధువొలికిన    మాధుర్యం.


• కొండ   కోనలు

  కౌగిలిలో     కదలాడుతుంటాయి.

• కోటి    రాగాల

  కోయిలలు    పలకరిస్తుంటాయి.

• వాగు   వంకలు

  సొంపులతో    సేద  తీరుతుంటాయి.

• చల్లని    గాలులు    సంబరమై 

  తనువు ని   తడుతు … తడుతు … ఉంటాయి.


• నా దొక    ప్రపంచం

  అది  సోయగాల   సౌందర్యం.

• నా  మనసెరిగిన   ప్రపంచం

  మధువొలికిన    మాధుర్యం.


• ప్రకృతి   ఒడిలో    పయనం

  పంచభూతాల తో    పరిణయం.

• హరిత  వనంలో    శయనం

  శాంతి సౌఖ్యాల    సంయోగం.


• తరంగాల    మౌనం లో

  నా అంతరంగం   విహరిస్తుంది.

• కిరణాల     కాంతి లో

  నా  మనోనేత్రం    వికసిస్తుంది.


• నా దొక    ప్రపంచం

  అది   సోయగాల  సౌందర్యం.

• నా  మనసెరిగిన   ప్రపంచం

  మధువొలికిన    మాధుర్యం.


కదలాడు = చలించుట.


యడ్ల శ్రీనివాసరావు. 16 Apr 2024 , 12:05 AM.




Friday, April 12, 2024

487. దీపం - తేజం


దీపం - తేజం


• వెలుగుతుంది    వెలుగుతుంది

  దివ్యమైన    దీపం.

• నిండుతుంది      నిండుతుంది

  చైతన్యమైన   తేజం.


• ఆ  దీపం    పరమాత్మ

  ఆ  చైతన్యం     శక్తి.


• చమురు  వలే    ఆత్మ

  పరమాత్మ యను    ప్రమిద లో   ఒదిగింది.

• దహనం   అనే    సాధన తో 

  మోక్ష సిద్ధి ని    పొందింది.


• జ్ఞానమనే     వెలుగుతో

  మనసు    చీకటి    తొలగును.

• యోగమనే    శక్తి తో

  బుద్ధి    వికాసం    కలుగును.


• వెలుగుతుంది    వెలుగుతుంది

  దివ్యమైన    దీపం.

• నిండుతుంది      నిండుతుంది

  చైతన్యమైన   తేజం.


• ఆ  దీపం     పరమాత్మ

  ఆ  చైతన్యం     శక్తి.


• శ్రేష్ట కర్మలు     చేయాలంటే

  మాయకు  వశం   కారాదు.

• బుణాను బంధాలు   తీరాలంటే

  శివుని   స్మృతి లో నే    సాధ్యం.


• కర్మ భోగి  గా     కావాలంటే

  నిర్వికారి   గా    కావాలి.

• కర్మ యోగి  గా   కావాలంటే

  బురద  తామర గా   ఉండాలి.


• వెలుగుతుంది    వెలుగుతుంది

  దివ్యమైన    దీపం.

• నిండుతుంది    నిండుతుంది

  చైతన్యమైన   తేజం.


• శివుడు   ఉండేది    పరంధామము లో

   అవతరిస్తాడు   భూమి పై

   కలియుగ   అంత్యాన 

  

• మనసు తో    ప్రేమ గా  

  పిలిచిన   పలుకుతాడు.

  మీ  సేవ కై   వచ్చాను  అంటాడు.


• వెలుగుతుంది    వెలుగుతుంది

  దివ్యమైన     దీపం

• నిండుతుంది      నిండుతుంది

  చైతన్యమైన    తేజం.



కర్మ భోగి    =  శరీరానికి  ఏ అవస్థ వచ్చినా అనగా అనారోగ్యం.   ఆ సమయంలో    దుఃఖం, బాధ  మనసు కి  కలగకుండా ,  ఆత్మ స్థితి లో  ఉంటూ,   అంతిమ క్షణాల్లో   శివుని పై  ధ్యాసతో   శ్వాస  విడవడం.  ఈ స్థితి  నిర్వికారి అంటే,    మనసు  వికారాలకు  అతీతం గా అయినపుడు  సాధ్యం. 


కర్మ యోగి  =  భౌతిక ప్రపంచంలో  కర్మలు ఆచరిస్తూ,  మనసు లో    సన్యాసి తత్వం తో జీవించడం.  తామర పువ్వు  కలుషితమైన  నీటిలో  ఉంటూ, పరిశుభ్రం గా   ఉంటుంది, ఆ విధంగా ఉండడం కర్మ యోగం.


కర్మ భోగం,  కర్మ యోగం  జ్ఞాన యోగ సాధన తో సాధ్యం.


యడ్ల శ్రీనివాసరావు. 9 Apr 2024 , 9:00 pm.


Thursday, April 11, 2024

486. అనుభవం – అనుభూతి

 

అనుభవం – అనుభూతి


• ఒక బంధం    విడిచింది

  ఒక నయనం  తొలగింది.


• జత  లోని  తోడు

  నీడ గా  మిగిలింది.

• మది   లోని  గోడు

  కధ గా   నిలిచింది.


• ఒక బంధం   విడిచింది

  ఒక నయనం  తొలగింది.


• జీవం  లేని  దేహం

  మౌనమై   చెబుతుంది

  "నీతో    ఉన్నానని".

• ప్రాణం   లేని  కాయం

  కనులు తెరిచి   పిలుస్తోంది

  "నాతో  వస్తావా"   అని.


• గడిపిన   క్షణాలు

  నడిచిన   నడకలు

  రూపు  చెరగని   ఆనవాళ్లు.

• కలిగిన    ప్రేమలు

  విడవని  మనసులు

  ఆత్మ బంధాల   సంకెళ్లు.


• ఒక బంధం     విడిచింది

  ఒక నయనం   తొలగింది.


• హృదయం   ...

  ప్రేమ  కోసమని

  చేతులు   వదలకున్నాయి.

• మరణం   ...

  ప్రేమ కు    లేదని

  చూపులు    వీడకున్నాయి.


• ఒక బంధం      విడిచింది

  ఒక నయనం   తొలగింది.


• చిటికెన వేలి    బంధం

  చిగురు లో   రాలింది.

• జ్ఞాపకాల    నిశ్శబ్దం  

  నిర్వేద మై    నిలిచింది.

• ఒక బంధం       విడిచింది

  ఒక నయనం    తొలగింది.


❤️ 🌹

స్త్రీ పురుషులు మధ్య ఉన్న ప్రేమ బంధం ,  ప్రేమ కలిగి ఉన్నవారికి   భాగ్యమైన స్థితి.  ఈ బంధం అనేది పలు రూపాల్లో ఉంటుంది.   ప్రేమ బంధం వలన అనేక విధాలుగా ఒకరి పై మరొకరు ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. 

మానవ జన్మ కి మరణం సహజం. ఇరువురి లో ఎవరైనా ఒకరు లోకం విడిచినపుడు ఉన్న తోడు కాస్త నీడ లా మారిపోతుంది. ఆ నీడలో ఎన్నో స్మృతులు కనపడుతూ, వినపడుతూ ఉంటాయి. జీవితం కొందరికి తలక్రిందులుగా కనిపిస్తుంది. ప్రేమలో ఉన్న నిజం ఏంటి అనేది,  ఇద్దరిలో  ఒకరు శాశ్వతం గా దూరం అయినప్పుడు  మరింత తెలుస్తుంది.

మనుషులకి , ఈ లోకంలో ఏదీ,  ఎవరు శాశ్వతం కాదనే నిజం తెలిసినా, అంగీకరించ లేరు.  దానికి అతీతం గా జీవించలేరు. ఎందుకంటే ప్రేమ, మమకారం అటువంటివి. 


 ప్రేరణ :

కొన్ని సార్లు  భౌతిక  శరీరానికి  ఎటువంటి  అనుభవం లేకున్నా ,   మనసు  అనుభూతి   ధరించినపుడు  ప్రతీ  స్థితి  సూక్ష్మం లో  తరించబడి ,  మానసికంగా  ఒక అనుభవాన్ని ఆపాదన  చేసుకుంటుంది .  ఇవి  కాలచక్రం లో  జరిగిపోయినవి  లేదా  జరగబోయేవి కావచ్చు.   లేదా ఎక్కడైనా చూసినటు వంటివి  మస్తిష్కం లో  ఉండిపోయినవి  కావచ్చు. ఇవి కేవలం  దృష్టి  భావనలు.  అవే అనుభవం లేని అనుభూతులు. 


యడ్ల శ్రీనివాసరావు  6 Apr 2024 ,  1:00 AM.







Wednesday, April 10, 2024

485. ఓ వయ్యారి

 

ఓ వయ్యారి



• ఓ   వయ్యారి   వయ్యారి

  వంగపండు   చిన్నారి

• పరువాల   పరికిణీ తో

  పైరు గట్టు నెగిరే   పొన్నారి.


• ఓ  వయ్యారి   వయ్యారి

  వంగపండు   చిన్నారి. 


• జడగంటల    జాజి మల్లె

  కస్సు మనే     కొండ మల్లె

  కోడె వయసు    కాడ మల్లె

  తైతక్క లాడే    తీగ మల్లె


• తూరీగ     నడుము తో

  తుర్రు మనే    లేడిపిల్ల.

  బరువెక్కిన    బుగ్గ లతో

  సిగ్గు లొలుకు   సీమపిల్ల.


• ఓ   వయ్యారి  వయ్యారి

  వంగపండు    చిన్నారి


• పంట  పంపు   బోదెకాడ

  జలకమాడే    కొర్రమీన.

  పట్టుకుంటే    జారుతావు 

  పైటకొంగు    విసురుతావు .


• గడ్డివాము    ఆటలలో

  గోల చేసే      గయ్యాళి.

• బొడ్డు కింద   చీర దోపి

  చిందు వేసే    బొమ్మాళి.


• ఓ   వయ్యారి   వయ్యారి

  వంగపండు   చిన్నారి.

• పరువాల    పరికిణీ తో

  పైరు గట్టు  నెగిరే   పొన్నారి.


యడ్ల శ్రీనివాసరావు  4 Apr 2024 8:00 PM


Tuesday, April 9, 2024

484. సిగలు వగలు

 

సిగలు  వగలు


• సిగలు     వగలు

  హొయలు   రగులు.

  సిగలు      వగలు

  హొయలు   రగులు.


• సంపంగి    తలపు తో    

  మొదలు

  సిరి మల్లె    వలపు    సెగలు.

• చామంతి   తనువు తో   

  తగులు

  విరజాజి    మధువు  మిగులు.


• సిగలు     వగలు

  హొయలు   రగులు.

  సిగలు      వగలు

  హొయలు   రగులు


• సరాగాల     సయ్యాట లో

  ప్రతి ధ్వనులు    పెనుగులాడగ ...

  శృతిలయల     శృంగారంతో

  పెనవేసుకుంది     ఆవేశం.


• ఆలింగిన     కేళి లో

  ఆవేదనలు    ఆదమరువగా  ...

  బాహువుల    బంధిఖాన లో

  స్రవియించెను    రసరాజం.


• సిగలు     వగలు

  హొయలు   రగులు.

  సిగలు      వగలు

  హొయలు   రగులు.


• పుప్పొడి     నివేదనం తో

  సరిగమలు   ఆలపించగా  ...

  చిరు స్వేధపు     జల్లులతో

  మదనం     వర్షించెను.


• కామనలు     రక్తి లో

  జ్వాలనల    హిమమవ్వగా ...

  భావనలు     ముక్తి తో

  తీరానికి     చేరుతాయి. 


• సిగలు      వగలు

  హొయలు   రగులు.

  సిగలు     వగలు

  హొయలు    రగులు.



తగులు =  తాకు, సంబంధం.

మధువు = తేనే , మకరందం.

రసరాజం = సిద్ధధాతువు, సిద్ధరసము, అమృతం.

పుప్పొడి = పుష్పము నందలి పరాగము 

మదనం = కామసుఖము,  ఆమని


యడ్ల శ్రీనివాసరావు  3 Apr 2024, 9:00 pm.


Monday, April 8, 2024

483. ఆమని


ని



• ఆగమేఘాల తో    వచ్చింది   ఆమని.

  కోకిల రాగాలు     పలికింది    వినమని.


హావభావాలతో    రాలాయి

  ఆకులు

  కొత్త  చిగురు    కోసం.

నింగి లో    ఎగిరాయి

  హంసలు

  సరికొత్త  లోకం   కోసం .


మంచు తెరలు  

  తుడిచింది  ...   ఈ  కాలం.

  రంగులతో   చిందులేసింది   నా మనసు.

పూల  పరికిణీలు   

  తొడిగింది    ...   ఈ వసంతం.

  హంగులతో   గెంతులేసింది  నా  వయసు.


• ఆగమేఘాల తో   వచ్చింది   ఆమని.

  కోకిల రాగాలు     పలికింది   వినమని.


పైరు గాలి    పలకరింపు తో

  పసితనం    పొంగింది.

కోడెకత్తె     చిలకరింపు తో

  ఈడుతనం    చిందింది.


• షడ్రుచుల   కలయిక  లో   

  భవ బంధాలు   నిండాయి.

రుచులకు     ఆహార్యం గా 

  భావోద్వేగాలు   నిలిచాయి.


• ఆగమేఘాల తో    వచ్చింది    ఆమని.

  కోకిల రాగాలు      పలికింది    వినమని.

• ప్రకృతి లో     పెనవేసుకుంది    ఉగాది.

  దాసుడి   రాతతో    నేడు   మేల్కొంది.


కోడెకత్తె  = పడుచు యువతి.


యడ్ల శ్రీనివాసరావు .  2 Apr 2024 9:30 pm 


Monday, April 1, 2024

482. కలియుగ ఈశ్వరుడు

 

కలియుగ ఈశ్వరుడు


• శ్రీ వెంకటేశ       శ్రీ  శ్రీనివాస

  సప్త  గిరుల  వాస

  అఖండ  తేజో  విలాస.


• మూడు  నామాల  తోడ

  ముల్లోకాలనేలు    వాడ ‌.

• శయ్య తో    శమనము న

  జగమేలు   వాడా.


• సిరుల    సింగారుడా 

  శ్రీ లక్ష్మి    నాధుడా 

• చిద్విలాసం తో    చింతకులను

  తన్మయం   చేయు  వాడా‌.


• శ్రీ  వెంకటేశ    శ్రీ  శ్రీనివాస

  సప్త గిరుల   వాస

  అఖండ   తేజో విలాస.


• భూదేవి   భారము   క్షమమని  

  శ్రీదేవి      గారము    భాగ్యమని 

  చాటిన   

  సంసార    సాగరుడా .


• అభయ   హస్తము  తోని

  ఆనందమిచ్ఛు  ఆపద్బాంధవుడా.

• కల్యాణ     శోభ తో    

  శుభములనిచ్చు   కలియుగ   ఈశ్వరుడా.


• శ్రీ   వెంకటేశ    శ్రీ శ్రీనివాస

  సప్త గిరుల  వాస 

  అఖండ  తేజో  విలాస.



శయ్య = నిదుర

శమనము = శాంతి పదము

చింతకులు = దుఖితులు

క్షమము  = సహనము

గారము = ప్రేమ


యడ్ల శ్రీనివాసరావు 1 Apr 2024 , 1:30 pm


Wednesday, March 27, 2024

481. పరిమళ భాష

 

పరిమళ భాష


• ఏమిటో     ఈ  భాష

  ఎద కే    తెలియని   ఆశ.

  అనుభవం  లేని   యాస

  సృష్టి   మూలానికి    శ్వాస.


• అక్షరాలు   ఉండవు  కానీ

  భావం  పలుకుతు  ఉంటుంది.

• కనులు    చూడలేవు  కానీ

  మనసు  చదువుతూ   ఉంటుంది.


• ఏమిటో   ఈ  భాష

  ఎదకే   తెలియని  ఆశ.

  అనుభవం   లేని   యాస

  సృష్టి  మూలానికి   శ్వాస.


• గజిబిజిల   గందరగోళం లో  నైనా 

  పులకింతలు   నింపుతుంది.

• ఎగుడు దిగుడు   తలంపుల  కైనా

  మధురిమలు   పలికిస్తుంది.


• ఎవరూ  నేర్పని   ఈ భాష

  సహజమై   ప్రకృతి లో  ఉంది.

• సకల   జీవుల    ఊపిరి కి

  ఆయువై   మూలం గా  ఉంది.


• ఏమిటో    ఈ  భాష

  ఎదకే   తెలియని  ఆశ.

  అనుభవం   లేని   యాస

  సృష్టి   మూలానికి    శ్వాస.


• అంతరంగం లో   అలజడి అయినా 

  అంతరాత్మ లో   ఆనందం  అయినా 

  భాష లో ని      భావం

  పరిమళమైన   భాగ్యం.


• ఏమిటో    ఈ  భాష

  ఎదకే   తెలియని  ఆశ.

  అనుభవం   లేని   యాస

  సృష్టి   మూలానికి    శ్వాస.


యడ్ల శ్రీనివాసరావు 27 March 2024 9:00 pm.


Sunday, March 24, 2024

480. పౌర్ణమి గ్రహణం

 

పౌర్ణమి గ్రహణం 


• మనసు  లోగి  లో   వెలసింది

  వెన్నంటి    జాబిలి

• తనువు  ముంగిట  మెరిసింది

  మిన్నంటి   వెన్నెల


• మౌనమ నే    వెలుగు తో

  మదిని    పులకరింప చేసింది.

• శాంతమ నే     శోభతో

  కాంతి   వికసింప  చేసింది.


• మనసు   లోగి లో    వెలసింది

  వెన్నంటి    జాబిలి.

• తనువు   ముంగిట  మెరిసింది

  మిన్నంటి    వెన్నెల.


• అమావాస్య     చీకట్లయినా

  గ్రహణాల         సర్పాలయినా

  చంద్రుని కి     చేటేముంది.

  మనసు కి      పొటేముంది.


• పూర్ణ కుంభం     తరిగినా 

  వికాసానికి     లోటేముంది. 

  కనులకు        కానరాకున్నా 

  హృదయం లో   మాటేసుంది.


• మనసు    లోగి లో   వెలసింది

  వెన్నంటి    జాబిలి.

• తనువు   ముంగిట  మెరిసింది

  మిన్నంటి    వెన్నెల.


• పౌర్ణమి    పరిమళం

  పాలపొంగు తో   నిండింది.

• తారల     తళుకులు

  మేఘాలలో    దాగాయి.


• కాలం ఆడే   సయ్యాటే 

‌  గ్రహణమనే   దోబూచి.

• ఈ  క్షణికమైన   చీకటే

   వెలుగు కి    సోపానం.


• మనసు  లోగి లో    వెలసింది

  వెన్నంటి   జాబిలి.

• తనువు  ముంగిట  మెరిసింది

  మిన్నంటి     వెన్నెల.



యడ్ల శ్రీనివాసరావు 24 March 2024, 11:00 pm.


Saturday, March 23, 2024

479. లక్ష్యం ( Goal) - కోరిక (Desire)

 

లక్ష్యం ( Goal) - కోరిక (Desire)


 మనిషి తల్లి గర్భంలో నుంచి పసికందు గా భూమి పైకి వస్తూనే అరచేతి గుప్పెడు బిగించి ✊ చూపిస్తూ       “ నేను  ఏదో  సాధించడానికి భూమి పైకి వచ్చాను “ అనే సంకేతం చూపిస్తాడు.

 

అందుకోసం పుట్టిన క్షణం నుండి చేసే ప్రయత్నాలు, చెప్పాలంటే పడే పాట్లు ఇన్ని అన్నీ కావు. చదువు లో, చేసే వృత్తి లో,   సమాజం లో,  వైవాహిక జీవితం లో, కుటుంబ జీవనం లో   ఇలా ఒకటేమిటి  అన్నింటిలో అత్యుత్తమంగా కావాలని అలుపెరుగని పరుగు పెడుతూనే ఉంటాడు.  ఈ పరుగు లో  అన్నీ లక్ష్యాలు , కోరికలు  సాధనలు  కనపడుతుంటాయి.    ఒక లక్ష్యం లేదా కోరిక   పూర్తి అయితే మరొకటి.  కానీ ఒక లక్ష్యం చేరిన తరువాత సంతృప్తి చెందుతున్నాడా, అంటే అది మనసు కే తెలియాలి. ఇక్కడ గమనిస్తే లక్ష్యం, కోరిక ఒకేలా అనిపించినా, తేడా ఉంటుంది.


 లక్ష్యాలకు ,  ఆరంభం మరియు అంతం అనేది ఉంటుంది.    కానీ మనిషి ఒక లక్ష్యం సాధించిన తరువాత సంతృప్తి పడి ఆగిపోతే,   అదే తన ఓటమి గా భావించే స్థితి గా భావిస్తాడు.

 ఈ లక్ష్యాలు అనేవి మనిషి , తాను ఎదగడం కోసం అంటుంటాడు .  అందులో డబ్బు సంపాదించడం, ఉద్యోగ స్థాయి పెంచుకోవడం, నాయకుడు గా ఎదగడం,   కుటుంబం తన ఆధీనంలో ఉండాలనుకోవడం,   సమాజం లో గుర్తింపు స్థానం కోసం, పారిశ్రామిక వేత్త గా ఎదగాలనుకోవడం,  ఇలా లక్ష్యం అనేది   ఎప్పుడూ చాలా చాలా  ఉన్నతంగా కనిపిస్తూనే ఉంటుంది.  దాని వెనుక పరుగు పెడుతూనే ఉంటాడు. విచిత్రం ఏమిటంటే ఇదే ఈనాడు మనిషి కి అసలు సిసలైన జీవితం అనే భావన కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఇందులో నే తొంభై శాతం మనిషి జీవిత కాలం గడుస్తుంది.


 లక్ష్యం సాధించాలి అంటే అహర్నిశలు కష్టపడాలి. నిజమే కష్టపడాలి. లేదంటే లక్ష్యం సాధించలేం. ఒక లక్ష్యం సాధించే దిశలో పరిస్థితి నా బట్టి ఎన్నో వదులు కోవలసినవి ఉంటాయి. అందులో , సమయం, విలువలు, ప్రేమ, ధనం ఆహారం, నిద్ర, మనుషులు , జీవితం , సుఖం, ఇలా ఎన్నో ఎన్నెన్నో వదులు కోవాలి.

 ఇలా ప్రతీ వయసు లో జీవితాంతం గడిపితే , అంటే మనిషి తన మనసు ను ఈ లక్ష్యాల పరుగు పందెంలో తాకట్టు పెడితే తన జన్మ సార్థకం అయినట్లే నా. అసలు ఈ లక్ష్య సాధన కి ఒక అంతం అనేది ఉంటుందా?.

 నిజానికి మనిషి తాను అనుకుంటున్నవి లక్ష్యాలా? లేక లక్ష్యం రూపం లో ఉండే కోరికలా?   ఎందుకంటే లక్ష్యం లో ఉన్నతి ఉంటుంది,  అది స్వయం గా తనతో పాటు కుటుంబం, నలుగురి, లేదా సమాజ శ్రేయస్సు ఉంటుంది.   కానీ కోరిక లో స్వలాభపేక్ష,  స్వార్థం ఉంటుంది.  కోరికలకు ఆరంభం మాత్రమే ఉంటుంది, అంతం ఉండదు.


 ఒక లక్ష్యం చిన్న దైనా, పెద్ద దైనా తీరినప్పడు మనిషి కి పూర్ణ మైన సంతృప్తి లభిస్తుంది.    కానీ కోరికలు తీరినప్పడు ముమ్మాటికీ  సంతృప్తి  ఉండదు. ఎందుకంటే ఆక్షణమే మరో కోరిక  అంతకు మించి మొదలవుతుంది.  కానీ నేటి కాలపు మనిషి ఈ తేడా గమనించే స్థితిలో ఉన్నాడా? అనేది ప్రశ్న.

 ఎందుకంటే లక్ష్యానికి కోరికకు తేడా తెలియని జీవిత పరుగు నేడు యువత కనపడుతుంది.

 లక్ష్యానికి ఒక పుల్స్ స్టాప్ ఉంటుంది. కానీ కోరికకు కామా మాత్రమే ఉంటుంది.

 లక్ష్యం అనేది ఆత్మ సంతృప్తి కోసం , కోరిక అనేది దేహ సంతృప్తి కోసం. దేహం లో కోరికలు అనేవి పుడుతూనే ఉంటాయి. కానీ లక్ష్యం చేరుకుంటే ఆత్మ పొందే సంతృప్తి ,  అనుకున్నది సాధించాను చాలు అనుకుంటుంది.   ఈ స్థితి పొందడం ఒక అదృష్ట యోగం గానే చెప్పాలి.   ఎందుకంటే నేడు యువత తన ఆలోచనలను నిజం చేసుకునే దిశలో పయనిస్తూ ఉంటారు,  కానీ ఆ ఆలోచనలు   సమన్వయం చేసుకునే స్థితిలో లేరు.  సమన్వయం అంటే, తమ లక్ష్య లేదా కోరికల సాధనలో తమను తాము సవ్య మైన దిశలో మరల్చు కోవడం. అలా కాకుండా ఎలాంటి అడ్డదారుల్లో నైనా లక్ష్య, కోరికల సాధన చేస్తే ఫలితం తిరిగి మనసు పై దుర్భరం గా ఉంటుంది.


 ఇదివరకటి కాలంలో లో మనుషుల మనసు ఒక స్థిరత్వమైన స్థితి తో ఉండేది. కానీ నేడు మనిషి, యువత జీవన విధానం లో మనసు ఒక అస్థిరత్వం తో ఉండడం అధిక శాతం గమనిస్తూనే ఉన్నాం. బహుశా అందుకే నేటి తరం శారీరకంగా బలం గా కనపడుతున్నా, మానసికంగా బలహీనం గా ఉంటూ, లక్ష్య సాధనలో వైఫల్యాలను అంగీకరించ లేకపోతున్నారు. ఇది రోజు రోజుకు పెరుగుతోంది.


 ఏది ఏమైనా , మనిషి ఏది సాధించినా తాను ఏకాంతం గా ఉన్నప్పుడు, నేను సంతోషం గా ఉన్నాను అని తనకు తాను అనుకో గలుగుతున్నాడా అనేది ముఖ్యం. ఎందుకంటే జీవితం లో ఏదొక దశలో తప్పని సరిగా ఒంటరి తనం, ఏకాంతం మనిషి అనుభవిస్తాడు. అది వరం అవ్వాలి కానీ శాపం కాకూడదు.


 మనిషి గా పుట్టిన ప్రతీ ఒక్కడూ తన జీవిత కాలం లో ఈ భౌతిక ప్రపంచంలో , తన కోసం ఏదో ఒకటి సాధిస్తూనే ఉంటాడు. కానీ వాస్తవం ఏమిటంటే మనిషి తన ప్రాణం విడిచిన తరువాత లేదా ప్రాణం విడవ బోయే ముందు తన గుప్పెడు తెరిచి 🫴 ”నేను ఇక్కడ ఏమీ సాధించలేదు, అని ఖాళీ గా చేతులు పైకి తెరిచి, నా కర్మ ను అనుభవించ డానికి మాత్రమే వచ్చాను “ అనే సత్యం తప్పకుండా గ్రహిస్తాడు.


 మనిషి కి బాధ్యతలు తీర్చు కోవడం లో పరిధి ఉండాలి. ఆ పరిధి పెంచుకుంటే భారం పెరుగుతుంది. అంటే శక్తి కి మించిన బాధ్యత లను పెంచుకోకూడదు. బాధ్యత లనేవి తప్పని సరి కర్మ స్థితి తో ముడి పడి ఉంటాయి.

 లక్ష్యం అనేది ఆత్మ సంతృప్తి సాధన కోసం ఉంటుంది.

 కోరిక అనేది దేహ సంతృప్తి కోసం ఉంటుంది.

 మూడింటిని గమనిస్తే ఒకేలా అనిపించినా, చాలా వ్యత్యాసం ఉంటుంది.


 యడ్ల శ్రీనివాసరావు 23 March 2024 11:00 pm.


Friday, March 22, 2024

478. రాజ యోగిని

 

 రాజ యోగిని




• హృదయ   మోహిని     రాజయోగిని

  మధువనం   కొలువులో   దైవ సంభూతిని.


• శివుని    శాంతి రాజ్యం  లో

   ప్రేమ  కిరీటమైన   సమ్మోహిని .

• మనసు   పాలన   లాలన లో

  మధువామృతం   నింపిన  మన్మోహిని.


• హృదయ   మోహిని   రాజయోగిని

  మధువనం   కొలువులో   దైవ సంభూతిని.


• ఆత్మల    భాగ్యం   కోసం

  శక్తిధార   కళ్యాణ కారిణి.

• పరమాత్ము ని    సందేశానికి

  సారధి అయిన  అశ్విని.


• హృదయ  మోహిని    రాజయోగిని

  మధువనం    కొలువులో   దైవ సంభూతిని.


• దృష్టి   మౌన యుక్తం తో

  స్వస్థ  కిరణాల   మాలిని.

• సంకల్పాల   సిద్ది   కలిగిన

  ఐశ్వర్య     స్వరూపిణి.

• విశ్వ కళ్యాణ పరివర్తన లో 

  ప్రకృతి సహాయోగిని.


• హృదయ   మోహిని    రాజయోగిని

 మధువనం   కొలువులో   దైవ సంభూతిని.


యడ్ల శ్రీనివాసరావు 22 March 2024 10:00 PM


Thursday, March 21, 2024

477. చూసుకో … ఒకసారి చూసుకో

 

చూసుకో … ఒకసారి చూసుకో


• చూసుకో

  ఒకసారి   చూసుకో

  నిన్ను నువ్వు   చూసుకో

  నీ లో లోన    ఏమి దాగుందో    తెలుసుకో.


• బంధాల    వలలే నా      బ్రతుకు.

  కోరికల     కలలే నా        ఎదుగు.

• సంకెళ్ల    సంతోషం తో    ఏమి సాధించావు.

  సందిగ్ధ     బుద్ధి తో         ఏమి సంపాదించావు.


• చూసుకో

  ఒకసారి    చూసుకో

  నిన్ను  నువ్వు    చూసుకో

  నీ  లో లోన   ఏమి దాగుందో    తెలుసుకో.


• ఆశల       అలలే నా        ఆనందం

  విలాసాల   లీలలే నా       జీవితం.


• సరళం   లేని   నీ మనసు    

  ఎలా    ఎగరగలదు.

• నిన్ను  నీవు  వదలక   పొతే 

  ఎలా   వదులు గవుతావు.


• చూసుకో

  ఒకసారి    చూసుకో

  నిన్ను   నువ్వు  చూసుకో

  నీ  లో  లోన   ఏమి దాగుందో   తెలుసుకో.


• మాయ   కోరల్లో

  చిద్రం అవుతుంది   నీ ఆత్మ.

• మోహ  ఊబిలో

  నలిగి  పోతుంది    నీ  దేహం.


• సజీవం  లోని    జీవం

  భారమనిపించ    లేదా.

• నిర్జీవం లోని      జీవం

  సారమని     తోచ లేదా.


• విడుదలవ్వాలి   అంటే

  నీ వెవరో        తెలుసుకున్నావా.

• ఎగిరి పోవాలి      అంటే

  నీ గమ్యం      తెలుసుకున్నావా.


• చూసుకో

  ఒకసారి     చూసుకో

  నిన్ను   నువ్వు   చూసుకో

  నీ  లో  లోన    ఏమి దాగుందో   తెలుసుకో.


యడ్ల శ్రీనివాసరావు 22 March 2024 10:00 am



Wednesday, March 20, 2024

476. కాలచక్రం

 

కాలచక్రం 


• ఏనాటి దో    ఈ కాలం 

  ఈనాటి కి    తిరిగొచ్చెను.

• ఏపాటి దో    ఈ ఆనందం 

  విడనాడక    వరమయ్యెను.


• కవ్వింత   నవ్వులతో

  పువ్వ ల్లే   సాగుతోంది  సమయం.

• తుళ్లింత    సిగ్గుల తో 

  మంచ ల్లే    జారుతోంది    వదనం.

• రవ్వంత    రవళి లతో

  మువ్వ ల్లే   మోగుతుంది  మదనం.



• ఏనాటి దో    ఈ కాలం 

  ఈనాటి కి    తిరిగొచ్చెను.

• ఏపాటి దో    ఈ ఆనందం 

  విడనాడక    వరమయ్యెను.


• ఏకాంతపు   సోయగం లో

  విరజిల్లెను    విరజాజులు.

• అంతరాన   ఆ లయం లో

  ఆలపించెను   ఆమనులు.


• మౌనం లో     మధురం

  మరు లోకపు     వికాసం.

• శాంతం లో     సౌమ్యం

  సుఖ వాసపు    రధం.


• ఏనాటి దో    ఈ కాలం 

  ఈనాటి కి     తిరిగొచ్చెను.

• ఏపాటి దో    ఈ ఆనందం

  విడనాడక    వరమయ్యెను.


• రాసిన  తల  రాతలు  రమణీయం.

  గీసిన నొస   గీతలు  గమనీయం.

  నిండిన    కాంతులు  కమనీయం.

  తలచిన   తలంపులు   పూరణం.


గమనీయం = పొందగలిగేది.


యడ్ల శ్రీనివాసరావు 20 March 2024 9:45 pm





Saturday, March 9, 2024

475. కాలుడు కమనీయం


కాలుడు  కమనీయం


• కాలుడు   కమనీయం

  కాలుడు    కమనీయం

• భైరవ    భవధీయం

  భైరవ    భవధీయం


• కల్పాన    కాలగతి లో

  కల్పతరువైనాడు 

• జ్ఞానమనే    అమృతం తో

  దాహాన్ని     తీర్చాడు.


• కాలుడు  కమనీయం

  భైరవ    భవధీయం


• అంధకార   ఆక్రందనలకు    కైవల్య  మిచ్చాడు.

  బానిస    బంధాల నుంచి    విముక్తి  నిచ్చాడు.

• ఊహించిన   క్షణాలను     ప్రత్యక్షం చేసాడు.

  ఊహించని   అద్బుతాలు   ఎన్నో  చూపాడు.


• కాలుడు  కమనీయం

  భైరవ  భవధీయం

• కాలుడు కమనీయం

  భైరవ  భవధీయం


• కల్పాన    కాలగతి లో

  కల్పతరువైనాడు

• జ్ఞానమనే   అమృతం తో

  దాహాన్ని    తీర్చాడు.


• మందగతి న     శనైశ్చరుని 

  కర్మాతీతుని గా    చేసాడు.

• శుభ స్థితి న      బృహస్పతి తో 

  జీవాత్మ ను    జాగృతం  చేసాడు.


• అధోగతి న     శ్రీ రాహువు తో

  భౌతికత కు     వెలి వేసాడు.

• ఊర్ధ్వగతి న     శ్రీ కేతువు చే 

  పరమాత్మ తో   అను సంధానం  చేసాడు.


• కాలుడు   కమనీయం

  కాలుడు   కమనీయం.

• భైరవ    భవధీయం

  భైరవ    భవధీయం.


యడ్ల శ్రీనివాసరావు 9 March 2024, 2:45 pm.


Friday, March 8, 2024

474. గవ్వను కాదు గువ్వను

 

గవ్వను   కాదు   గువ్వను



• గువ్వను  నేను

  ఎగిరే  గువ్వను  నేను.

• గవ్వను    కాను 

  కదలని  గవ్వను  కాను.


• సూక్ష్మమైన    లోకంలో

  సోయగాల   సోయి  నాది.

• అందమైన     వనంలో

  అంతులేని   హాయి   నాది.


• గువ్వను   నేను

  ఎగిరే   గువ్వను  నేను.


• గవ్వ    నున్నగున్న

  గీతలతో    గందరగోళం

• గవ్వ     తెల్లనైనా

  ఇసుక లో     నిర్జీవం.

• గవ్వను   కాను.

  కదలని   గవ్వను  కాను.


• విహరించే     మనసు తో

  విరహలను    వీడుతాను.

• విహంగమై     వెన్నెల లో

  విలాసి గా      తిరుగుతాను.


• సెలయేటి      సవ్వడి లో 

  సరోవరం పై      తేలుతాను.

• గిరులు   చుట్టి    పల్లె

  రాగాలు    వల్లె   వేస్తాను. 


• గువ్వను నేను

  ఎగిరే గువ్వను నేను.


• నింగి లో     నిలబడి 

  నేల  ను      చూస్తుంటాను.

• పల్టీలు     కొడుతూ 

  పరంధామము  చేరుతాను.


• గువ్వను   నేను

  ఎగిరే  గువ్వను  నేను.

• గవ్వను   కాను 

  కదలని  గవ్వను  కాను.

  

యడ్ల శ్రీనివాసరావు  8 March 2024, 9:30 pm.


Wednesday, March 6, 2024

473. మనో శతకం - 8


మనో శతకం - 8



సౌష్టవంబున  మెరుగుల్   శ్రేష్టంబాయెనా

దేహంబున   మోహంబు   దేహి జేయ

ఆత్మ  నెరిగి నందం  అంబర  మల్లే 

పరమాత్మయని   పలుకు  పతిత  పావనంబాయే.

సుందర గుణేశ్వరా!   సంపన్నేశ్వరా !      |20|


భావం :


శరీరానికి  ఆకృతులు  మెరుగులు దిద్ది నంతలో సౌందర్యం   అద్బుతం  అగునా.

శరీరం పై కోరిక, మోహం  అల్పునిగా   చేయును.

నేనొక ఆత్మనని ఎరిగినపుడు  అందం  ఆకాశమంత అల్లు కొని   విస్తారం  అగును. 

పరమాత్మ అయిన  శివుని జపించిన  యెడల  భ్రష్టులు కూడా   శ్రేష్టం గా   అవుతారు.

సుందరమైన  గుణములు  కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన  ఈశ్వరా!.


🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️


శూన్యంబున   దిక్కుల్   సమము గాంచే 

మరజీవికి  బంధమల్   ఎండమావులాయే

గమ్యమెరిగిన  గతి కి    దిక్సూచి ఏల

మౌనమున మది పయనించు విశ్వమున.

సుందర గుణేశ్వరా!   సంపన్నేశ్వరా !   |21|


భావం :

శూన్యమున   అన్ని దిక్కులు,  దిశలు   ఒకే విధంగా సమానం గా  ఉండును.

కోరికలు లేని జీవికి   బంధములు  ఎండమావులు అగును.  (ఎండమావి లో నీరు ఉన్నట్లు కనిపించును, కానీ నీరు ఉండదు.  అదే విధంగా   మరజీవికి  బంధములతో  అనుబంధం  ఉండునట్లు ఉండును, కాని   ఉండదు. 

గమ్యం తెలిసిన   దారికి  మార్గ దర్శకం  ఎందుకు.

ఆలోచన రహిత   మనసు  విశ్వం లో ప్రయాణం చేస్తుంది.

సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!.


యడ్ల శ్రీనివాసరావు 6 March 2024 , 9:15 pm


Saturday, March 2, 2024

472. కళ్యాణం – వివాహం

 

కళ్యాణం(శుభం) – వివాహం(బంధం)


• సాధారణంగా  ఒక పదం యొక్క  అర్దం పూర్తిగా తెలియనప్పుడు  లేదా అర్దం  చేసుకోవడం లో  లోపం ఉన్నప్పుడు  భావం పూర్తిగా మారిపోతుంది.  దీనినే భావరహిత  సమస్య అని అంటారు.  ఇదంతా ఎందుకు అంటే,  జ్ఞానం అజ్ఞానం ఈ రెండు పదాల  మధ్య ఉన్న   “అ”  అనే అక్షరం  వలన ఎంతో వ్యత్యాసం  కనపడుతుంది.


• అదే విధంగా తెలుగు లో  వాడుక భాషలో ఒక పదానికి అనేక పర్యాయపదాలు చేర్చడం వలన కొన్ని సందర్భాల్లో   జ్ఞాన వంతంగా   చెప్పిన విషయాల అర్థాన్ని కూడా   ఎవరి అనుసారం వారు   మార్చుకొని అజ్ఞాన మార్గం వైపు  మరలతూ  ఉంటారు.  అందుకు ఇది ఒక నిదర్శనం. ఈ సామెత.


• “ వెయ్యి అబద్ధాలు ఆడి ఒక కళ్యాణం / పెళ్లి / వివాహం  చెయ్యాలి “.


• కళ్యాణం  అనే మాట  చాలా  పవిత్రమైనది. వాస్తవానికి  దీని అర్ధం శుభం ,  శుభకరం.  జ్ఞాన వంతులు, పండితులు కలిసి  మనిషికిి   కళ్యాణం  తలపెట్టడం లేదా   కళ్యాణం చేయడం  అంటే ,   ఒక ఆత్మ కి  శుభం  లేదా  మంచి చేయడం  అని చెప్పారు . అదే విధంగా  లోక కళ్యాణం  అంటే  సృష్టిలో సమస్త జీవులకు శుభం,   మంచి   తలపెట్టడం అని అర్థం. ఇక్కడ శుభం అంటే  ఆనందంగా, సంతోషంగా జీవించడం అని అర్దం.


• సాధారణంగా  ఒకరికి  ఏదైనా  మంచి, శుభం , శుభకార్యం  తలపెట్టేటప్పడు  మాయా వలన విఘ్నాలు ఉత్పన్నమయ్యే అవకాశం   ,  ఈ మాయా లోకం లో ఉంటుంది  కాబట్టి ,  కొందరు గణపతిని పూజిస్తారు. మరికొందరు “ వెయ్యి అబద్ధాలు ఆడైనా సరే  ఆ కళ్యాణం చెయ్యాలి ” అంటారు.  అంటే ఇక్కడ ఉద్దేశం   ఒక శుభం,  ఒక మంచి,  ఒక లోక కల్యాణం తలపెట్టినపుడు  ఆ శ్రేయస్సు కోసం  వెయ్యి అబద్ధాలు ఆడడం లో  తప్పు లేదు  అని జ్ఞాన యుక్తం లో  ఈ సామెత  యెక్క భావం.


• కానీ సమస్య అంతా ఇక్కడే మొదలవుతుంది.

• నేటి లౌకిక ప్రపంచంలో కళ్యాణం అంటే కేవలం స్త్రీ పురుష వివాహం బంధం  అని , మానవుడు  తన అవసరం కోసం  ఈ భావనను తీసుకు వచ్చాడు.  అనగా వివాహం అంటేనే,   మనిషి కి ఎంతో శుభం తలపెట్టడం అనే భావన కల్పించారు. ఈ వివాహం అనేది మనిషి కి మంచి చేయడం గా భావించారు.  ఇదంతా  మనిషి కి ,  శారీరక  భౌతిక అవసరాల రీత్యా,  సృష్టించబడింది.

దీనిని దృష్టిలో పెట్టుకొని వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలని ,  సామెత ను ఆచరించడం మెదలు పెట్టి ….. నేడు సమాజంలో , వెయ్యి కాదు లక్ష అబద్ధాలు ఆడుతూ పెళ్లిళ్లు చేయడం మొదలు పెట్టారు.  కుటుంబాలకు, వ్యక్తులకు సంబంధించిన ఎన్నో నిజాలను దాచి ఒక వివాహం చేయడానికి అష్ట కష్టాలు పడుతూ ఒక యజ్ఞం లా భావిస్తున్నారు. 


• ఇది సరియైన విధానమా?  అబద్ధాలు ఆడి పెళ్లిళ్లు చేయడం ద్వారా, అంటే శుభం తలపెట్టడం అవుతుందా ?  నేడు సమాజంలో వివాహ వ్యవస్థ ఉన్నతంగా ఉందా?  వివాహితులు అందరూ ఆనందం గా ఉంటున్నారా ? …. ఇలా వెయ్యి అబద్ధాలు ఆడి వివాహాలు కుదర్చుడం అనేది పాపమా? పుణ్యమా? .….

సామెతలను ప్రామాణికంగా తీసుకుని , వాటి అసలు అర్దం తెలుసుకోకుండా, విచ్చలవిడి తనంతో  ధైర్యంగా నేడు పూర్తి అబద్ధాల మయంతో   మధ్య వర్తులు వివాహాలు కుదర్చుడం అనేది ఒక పాపపు ఖాతాను వారి కర్మ లో జమ చేసుకోవడమే అవుతుంది.

• పెళ్లి చెయ్యాలనుకునేటప్పుడు కుటుంబ, వ్యక్తి గత వాస్తవాలు లోటుపాట్లు,  నిజాలు  చెప్పి,  కాస్త ఆలస్యం  అయినా సరే, ఇరువురికి ఆమోద యోగ్యం  అయితేనే  అప్పుడు వివాహం కుదర్చుడం  మంచిది.


• ఎవరు ఎవరికి శుభం, మంచి చేసినా అది కళ్యాణమే అవుతుంది.

• సూక్ష్మం గా చూస్తే కళ్యాణానికి (శుభం), వివాహానికిి  (బంధం) చాలా తేడా ఉంది.

• ప్రతి కళ్యాణం ( శుభం, శుభకరం, మంచి) వివాహం (బంధం) కానక్కర్లేదు.

• ప్రతి వివాహం (బంధం)  కళ్యాణం గా (శుభం గా) కావాలి.


• తిరుపతి లో వెంకటేశ్వరస్వామి కి మరియు శ్రీశైలం లో శివుని కి నిత్యం కళ్యాణం జరుగుతుంది. నిరంతరం, అనుక్షణం ఈ సృష్టిలో సమస్త జీవకోటికి లోక కల్యాణం చేసేటి పరమేశ్వరుని సంస్మరణకు ప్రతీకగా ఆయా దేవస్థానాలలో ప్రతీ రోజు అర్చకులు కళ్యాణం చేస్తారు.


• ఈ దైవ కల్యాణం, అంటే దైవ వివాహం ద్వారా మనుషులు గ్రహించవలసిలనది సందేశం ఒకటి ఉంది. అది , స్తీ పురుషులు విభిన్నమైన శక్తి కలిగిన వారు. ఈ కలయికల తో కూడిన వివాహం ఏకరసం గా జీవితకాలం మనుగడ సాధించడం అంటే, కలియుగంలో అంత సర్వ సాధారణం విషయం కాదు. సాక్షాత్తు విష్ణు సహస్రనామం లో సంసారాన్ని మహ సాగరం గా అభివర్ణించారు. దంపతులు తమ వైవాహిక జీవితాలలో ఎన్ని అవాంతరాలు, విపత్తులు వచ్చినా అధిగమించి, ఆ భగవంతుని చూసి , ఆ నిత్య కల్యాణ శోభ తాము కూడా సంతరించు కోవాలి, అనేది నిత్య దైవ కల్యాణం యెక్క సూక్ష్మ సందేశం.


• చివరిగా … ఒకటి కాదు, వంద కాదు, వెయ్యి అబద్ధాలు ఆడి ఒకరికి శుభం, కల్యాణం, మంచి తలపెట్టినా …. ఈ అబద్ధాల వలన ఇతరులలో ఏ ఒక్కరికీ అపకారం గాని, చేటు గాని, నమ్మక ద్రోహాం గాని జరగ కూడదు. స్వయానికి నష్టం జరిగినా పరవాలేదు.


యడ్ల శ్రీనివాసరావు 3 March 2024 , 11:00 AM.


Thursday, February 29, 2024

471. శివ కీర్తన

 

శివ కీర్తన


• ఎన్ని    జన్మలెత్తిన

  ఎంత  జపము   చేసిన

  కలుగు   నీ   భాగ్యం

  ఈ   భాగ్యం.


• కావ్య  కీర్తన తో   

  కలిగె

  నా  మది  సౌఖ్యం.

  నా  మది  సౌఖ్యం.


• కదలిక ల      కవళిక ల

  కనుసన్న ల    నిలిచె 

  నీ   రూపం

  జ్యోతి   స్వరూపం.


• మైమరచి న    మనసు న

  మౌనము న     కలిగె

  నీ   ధ్యానం

  స్మృతి    శ్రీకారం.


• ఎన్ని    జన్మలెత్తిన

  ఎంత   జపము  చేసిన

  కలుగు   నీ భాగ్యం

  ఈ   భాగ్యం.


• కావ్య కీర్తన తో   

  కలిగె

  నా మది   సౌఖ్యం.

  నా మది   సౌఖ్యం.


• పిలిచి న     పణము న

  పలుకు న     ఒరిగె 

  నీ   ప్రేమం

  దాస్య    బీజం.


• నడచి న     నమిలి న

  నిదుర న     విడవ 

  నీ  నామం

  ధ్యాస   మయం.


• సంకల్పా ల     సావధానా ల

  సాంగత్యా ల    సంగమం

  నీ   సన్నిధానం

  సదా   మహిమాన్వితం.


• శివం    శవం

  సం యోగం     స  జీవనం.


• ఎన్ని   జన్మలెత్తిన

  ఎంత  జపము  చేసిన

  కలుగు  నీ  భాగ్యం

  ఈ  భాగ్యం.


యడ్ల శ్రీనివాసరావు 1 March 2024 5:00 AM


Sunday, February 25, 2024

470. ఒక మంత్రం

 

ఒక మంత్రం



• చెపుతా    ఒక   మంత్రం

  చెపుతా    ఒక    మంత్రం

• అది   జీవన   వేద  తంత్రం

  మానవ   మనుగడకి    శక్తి  యంత్రం.


• ఆ    మంత్రం   పేరు

  ఓం   నమఃశివాయ.

  అది  పలికిన  కలుగు

  సుఖ  సంతోషాల  సౌఖ్యం.


• ఆ   మంత్రానికి   అర్దం

  నేనొక    ఆత్మను   

  చేస్తున్నాను

  శివ   పరమాత్మ కు  వందనం.


• చెపుతా    ఒక    మంత్రం

  చెపుతా    ఒక    మంత్రం

• అది  జీవన  వేద    తంత్రం

  మానవ  మనుగడకి   శక్తి  యంత్రం.


• కలియుగ   మాయలో  విలవిలాడే 

  మనిషికి    ఇది    ఒక   కవచం.

• మనసు పై    దాడి  చేసే    రావణ

  వికారాలకు   ఇది   ఒక    అస్త్రం.


• ఈ   పంచాక్షరీ   మంత్రం

  దేవతలందరూ   ధ్యానించారు

  సర్వ   ప్రాప్తులను   పొందారు.

 

• ఈ రాజయోగ   తంత్రం

  మునులందరూ   స్మృతి  చేసారు

  జీవన్ముక్తి ని    పొందారు.


• చెపుతా    ఒక   మంత్రం

  చెపుతా    ఒక    మంత్రం

• అది    జీవన    వేద  తంత్రం

  మానవ  మనుగడకి   శక్తి  యంత్రం.


యడ్ల శ్రీనివాసరావు 26 Feb 2024 , 6:00 AM.


Thursday, February 22, 2024

469. కెరటం


కెరటం 


• పడిలేచే   కెరటమా

  పరుగెందుకు

  నీకు    పరుగెందుకు.

• పరుగు  ఎంత  పెట్టినా

  దూరమెంత   ఏగినా 

   నీ గమ్యం   మారునా ...


• పడిలేచే    కెరటమా

  పరుగెందుకు

  నీకు    పరుగెందుకు.


• తీరం    దాటాలని

  ఉరకలేస్తు    ఉంటావు.

• ఆకాశం    తాకాలని

  ఎగసి  ఎగసి   పడతావు.


• హద్ధు  లెరగని   కెరటమా

  నీ పయనం    ఎటు  వైపు.

• ముద్దు  గొలిపే   తరంగమా 

  నీ  తపనం   ఎన్నాళ్లు.


• పడిలేచే     కెరటమా

  పరుగెందుకు

  నీకు    పరుగెందుకు.

• పరుగు   ఎంత   పెట్టినా

  దూరమెంత    ఏగినా

  నీ  గమ్యం.  మారునా ...


• ఘోష   ఎంత    చేసినా

  సాగరం   దాటి   పోలేవు లే.

• లోతు   ఎంత   దాగినా 

  పరిధి   మీటి   రాలేవు లే.

 

• రతనాలు   ఎన్ని  పొదిగినా

  నీ రంగు    మారిపోదు లే.

• మాలిన్యం   ఎంత   చేరినా

  నీ శోభ   చెక్కు   చెదరదు లే.


• పడిలేచే      కెరటమా

  పరుగెందుకు

  నీకు   పరుగెందుకు.

• పరుగు   ఎంత   పెట్టినా

  దూరమెంత   ఏగినా 

  నీ గమ్యం    మారునా ...


యడ్ల శ్రీనివాసరావు  21 Feb 2024  10:00 PM


Tuesday, February 20, 2024

468. మనసు లోని దైవం


 మనసు లోని దైవం


• మనసు   లో ని    దైవమా

  వేచి ఉన్నాను   నీ ముంగిట.


• అమితమైన  ఆనందం   నీ చెంత

  ఆదమరవకున్నాను       నీ ఇంట.


• మనసు  లో ని    దైవమా

  వేచి ఉన్నాను   నీ ముంగిట.


• చూడు  …   ఇటు చూడు

  ఈ  పతిత  ప్రపంచం లో    ఎలా   ఉండాలి.

  ఈ  మాయా  లోకం లో      ఏమి  చేయాలి.

 

• జీవితం     ఓ బూటకపు   నాటకం.

  బంధాల   వలలు    ఆత్మకు    చెదలు.


• నీ  స్మృతి లోనే   వికర్మల ఖాతా   శూన్యం.

  నీ   గతి లోనే     సకర్మలు   ఆరంభం.


• మనసు   లో ని    దైవమా

  వేచి ఉన్నాను   నీ  ముంగిట.


• అమితమైన  ఆనందం   నీ చెంత

  ఆదమరవకున్నాను       నీ ఇంట.


• పొరలు  కమ్మిన  మనిషి కి 

  జ్ఞానం  ఒక  యోగం.

• అలలు  చేరిన   మనసు కి 

  ధ్యానం  ఒక   ఔషధం.


• మూసిన  కనులు  చూస్తున్నాయి

  నీ  దివ్య వెలుగు.

• తెరిచిన  కనులు   వెతుకుతున్నాయి

  నీ  సత్య  మార్గం.


• మనసు    లో ని     దైవమా

  వేచి ఉన్నాను    నీ ముంగిట.

యడ్ల శ్రీనివాసరావు  20 Feb 2024 , 10:00 pm.

Thursday, February 15, 2024

467. శివుని మనసు

 

శివుని మనసు


• మనసు    మందిరం

  నా శివుని   మనసు   సుందరం.

• ప్రేమ     అనంతం 

  నా శివుని   ప్రేమ    అంతరం.


• నిరుపేద    హృదయాలు

  సేద తీరు      ఆలయం.

• శుద్ధమైన       భావనలు

  జనియించే     గ్రంధాలయం.


• మనసు      మందిరం

  నా శివుని    మనసు  సుందరం.

• ప్రేమ      అనంతం 

  నా శివుని    ప్రేమ   అంతరం  .


• మనో కామనలు    తీరేటి   దేవాలయం

  అంతర్ముఖు ల కు    ఆనంద వైభోగం.

• ముళ్లను   పుష్పాలు    చేసే   ఉద్యానవనం.

  జీవ సత్యాలను    తెలిపే     భాండాగారం .


• ప్రేమ    అనంతం  

  నా శివుని    ప్రేమ  అంతరం  .


• దేహ వికారాలు   వడపోసే   కర్మాగారం

  పామరులకు  దారి   చూపు    జ్ఞాన సాగరం.

• నరుని    నారాయణుని   చేసే   విద్యాలయం.

  పండితులకు   మోక్షమిచ్ఛు   కైలాస   శిఖరం.


• మనసు    మందిరం

  నా శివుని    మనసు  మందిరం.

• ప్రేమ    అనంతం  

  నా శివుని    ప్రేమ  అంతరం.


• అమృత   వేళలో    మధురం తో

  మాటాడే    శాంతి రూపం.

• ఆత్మీయత తో     వెన్నంటి

  ఉండే   శక్తి    స్వరూపం.



యడ్ల శ్రీనివాసరావు 16 Feb 2024 12:30 am.


Wednesday, February 14, 2024

466. వసంత పంచమి - బ్రహ్మ జ్ఞానేశ్వరి

 

బ్రహ్మ జ్ఞానేశ్వరి

వసంత పంచమి 


• అభినేత్రి     ధరధాత్రి

  నడయాడే   సఖిదేవి.

• వాదనము    తంతిన

  పలికించిన    నాదము 

  పులకించిన   ప్రకృతి   విశ్వంభర.


• శ్రీవాణి        అలివేణి 

  కొనియాడే    వేదాగ్రణి.

• సృష్టి    చలన   ధారిణి

  విశుద్ధ   చక్ర   రూపిణీ

  జపియించిన   జాగృతి  జ్ఞానేశ్వరి.


• మీటిన   తరంగాల   మాత్రిక

  జీవుల    చైతన్య    మాలిక.

• ప్రాస    లయల      మాత్రుక

  శక్తి       ఉద్భవన     సారిక.


• అభినేత్రి     ధరధాత్రి

  నడయాడే   సఖిదేవి.

• శ్రీవాణి       అలివేణి

  కొనియాడే    వేదాగ్రణి.


• వసంతమున    వాగ్దేవి

  వికసించిన    హోలీ  హంస.

• బ్రహ్మ    జ్ఞానము కి

  తిలక   స్వరూపిణి   మమ్మా.

• బ్రహ్మ కుమారీల   జ్ఞాన  కలశం లో 

  జగదాంబ   సరస్వతి    మమ్మా.


• అభినేత్రి       ధరధాత్రి

  నడయాడే     సఖిదేవి.

• శ్రీవాణి        అలివేణి

  కొనియాడే     వేదాగ్రణి.

• శబ్దరూపిణి      అర్దభావణి

  అలల   తరంగణి 

  ఆనందాల  కల్పదాయిణి.


యడ్ల శ్రీనివాసరావు 15 Feb 2024 1:30 Am.


Tuesday, February 13, 2024

465. ప్రేయసి పరమాత్మ


ప్రేయసి  పరమాత్మ  

ప్రేమికుల  దినోత్సవం


• సంగమం … సంగమం

  ఆత్మ పరమాత్మ ల అపూర్వ సంగమం.

  ఇదే ఇదే   ఈ జన్మకు   శుభోదయం.


• పరమాత్మ   కలయిక తో   కదిలింది

  లో లోని  అణువణువు

• అదే అదే   నా మనసు ని

  నిలిపిన    స్థాణువు.


• సంగమం … సంగమం

  ఆత్మ పరమాత్మ ల   అపూర్వ  సంగమం.

  ఇదే ఇదే    ఈ జన్మకు  శుభోదయం.


• కంట జారు నీటికి   ఇక   కలత లేదు

  భారమైన మదికి    ఇక  దిగులు లేదు.


• ఒడిని  చేర్చుకున్న     తండ్రి   శివుడు.

  ప్రేమ    పంచిన    ప్రేయసి   పరమాత్ముడు.

  మనసు కు   తోడున్న   వాడే    విభుడు.


• సంగమం … సంగమం

  ఆత్మ పరమాత్మ ల    అపూర్వ  సంగమం.

  ఇదే ఇదే    ఈ జన్మకు  శుభోదయం


• బంధాలతో    పొందిన

  వైరాగ్యం   ఇక   సమాప్తం.

• శివుని  ఆలంబనతో  పొందిన

  భాగ్యం    ఆరంభం.


• ఆటలెన్నో   ఆడింది   మాయ.

  ఇక   ఆడితే   జరిగబోయేది  

  మనోనేత్రపు    వ్యధమేధం.


• సంగమం … సంగమం

  ఆత్మ పరమాత్మ ల    అపూర్వ  సంగమం.

  ఇదే ఇదే   ఈ జన్మకు   శుభోదయం


• పరమాత్మ   కలయిక తో   కదిలింది

  లో లోని   అణువణువు

•  అదే అదే   నా మనసు ని

  నిలిపిన    స్థాణువు.


యడ్ల శ్రీనివాసరావు 13 Feb 2024 , 10:00 pm


Sunday, February 11, 2024

464. శివుని తో మాటలు

 

శివుని తో మాటలు



• బాబా    శివ బాబా

  లాలినై   చేరాను   నీ ఒడికి

  విద్యార్థి నై   వచ్చాను   నీ బడికి


• నీ పవళింపు లో    హాయి మధురం.

  నీ చదువు లో     వాసి ఉన్నతం.


• ఆటపాటల    ఆనందం   ఈ సమయం.

  జ్ఞానభోధల    కలశం    ఈ రాజయోగం.


• ఈ పకృతి   అందాల  మధువనం

  స్వర్గ లోకానికి   తలమానికం.

• ఈ శాంతి  నిలయాల  సంగమం

  కైలాస   శిఖర    మండలం.


• బాబా    శివ బాబా

  లాలినై   చేరాను     నీ ఒడికి

  విద్యార్థి నై   వచ్చాను  నీ బడికి.


• నీ పవళింపు లో   హాయి మధురం.

  నీ చదువు లో   వాసి  ఉన్నతం.


• పరమాత్మ  నడిచిన  నేల   తాకగా 

  ఆది అంత్యాల   నాటకం  తెలిసింది.

• తీరని బుణం    మాటలయితే

  తరగని ధనం   మౌనమని  తెలిసింది.

• నలుగురిలో   నడత కు   నటన కావాలని

  ఏకాంతం లో   ఐక్యమే   శ్రేష్టమని తెలిసింది.


• బాబా   శివ బాబా

  లాలినై   చేరాను     నీ ఒడికి

  విద్యార్థి నై   వచ్చాను   నీ బడికి


• నీ పవళింపు లో   హాయి  మధురం.

  నీ చదువు లో  వాసి  ఉన్నతం.


యడ్ల శ్రీనివాసరావు 11 Feb 2024 , 8:00 PM.


Friday, February 9, 2024

463. ఏకాంత మెంత హాయి

 

ఏకాంత మెంత హాయి


• ఏకాంత  మెంత  హాయి

  ఏ కాంతి   ఇది   ఓయి.


• తలచిన   తారలలో   నిలిచిన   నీడ ను

  మరచిన మండలం   తిరిగి చేరిన    తోడు ను.

  తోడు నీడ ఒకటే   అయిన   ఆత్మ బిందువు ను.


• ఏకాంత   మెంత  హాయి

  ఏ కాంతి   ఇది   ఓయి.


• శివుని  అడుగు తో   వెలిగిన  విశ్వం

  నరుని చూపుకి     దొరికిన  భాగ్యం.


• వెలుగు   నేనయి    ఉన్నాను.

  చీకటి    నేనయి    ఉన్నాను.

  శూన్యం లో   తేలి   ఉన్నాను.


• ఏకాంత  మెంత   హాయి

  ఏ కాంతి   ఇది    ఓయి.


• ఇహ   లోకం    దాటాను 

  అమర  లోకం   చేరాను


• మూలం  లో   శబ్దం   వినిపిస్తోంది

  అది   ప్రణవ   నాదమైన   ఓం కారం.

• విశ్వం లో   మూలం     కనిపిస్తుంది

  అది   మంగళ   రూపమైన    శ్రీ కారం.


• ఏకాంత    మెంత   హాయి

  ఏ కాంతి   ఇది     ఓయి.


యడ్ల శ్రీనివాసరావు 10 Feb 2024 3:00 AM.


462. తీర పయనం

 

తీర పయనం


• దూర   తీరాన   పయనం

  జన్మ కు   దొరికిన   భాగ్యం.

  అడుగులు  పడుతున్న   వయనం

  మది     అవుతుంది    మేఘం.


• కానరాని   లోకంలో     

  కనిపించే ను     దైవం.

  తాకలేని   రూపం లో   

  ప్రసరించే ను    చైతన్యం.


• అనుభవాల ఆనందం లో 

  స్మృతులెన్నో    గడిచాయి.

  సేవ   సౌభాగ్యాల   సంగమం

  శేషం   మిగిలి   ఉంది.


• దూర   తీరాన   పయనం

  జన్మ కు   దొరికిన    భాగ్యం.

  అడుగులు  పడుతున్న  వయనం

  మది   అవుతుంది     మేఘం.


• దైవం తో    సంధానం 

  యుగ యుగాల  పుణ్యఫలం.

  సాధన లోని    ధనమంతా 

  జన్మ జన్మల   సార్థకం.


• మనసు లోని    శివముంటే 

  మనిషవుతాడు   సుందరం.

  ఆత్మ శుద్ధితో    జీవనం 

  ఎన్నో   కర్మల   విశేషం.


• దూర  తీరాన   పయనం

  జన్మ కు   దొరికిన  భాగ్యం.

  అడుగులు   పడుతున్న  వయనం

  మది  అవుతుంది   మేఘం.


• పరమాత్మ   నెరిగిన   ఆత్మ

  స్వర్గాన్ని     చూస్తుంది. 

  అడుగులు   వేస్తోంది.


యడ్ల శ్రీనివాసరావు 9 Feb 2024 , 6:00 pm.



Thursday, February 8, 2024

461. అలల గోదారి

 

అలల గోదారి



• అలల   గోదారి    రమ్మంటోంది.

  కలల   కావ్యాలు  తెమ్మంటోది.


• శుభోదయపు    కౌగిలి లో

  మంచు తెరల   కొంగులో   

  సూర్యుడు   దాగున్నాడు.

• గోదావరి   శాంతం లో 

  గలగలల    గానం  తో 

  పరవళ్లు   తొక్కుతోంది.


• అలల  గోదారి  రమ్మంటోంది.

  కలల  కావ్యాలు  తెమ్మంటోది.


• రవి   కిరణాల   కౌసల్యం 

  రస  రంజకం   చేస్తుంటే

  రాజ   భోగాల   సౌందర్యం

  మనసు ను    తాకుతుంది.


• బంగారు   వర్ణం లో

  గోదావరి   మెరుస్తుంటే

  సింగారి    నీలం లో

  ఆకాశం    నవ్వుతుంది.


• అలల  గోదారి    రమ్మంటోంది.

  కలల  కావ్యాలు   తెమ్మంటోది.


• ఎగిరే గువ్వల   సంబరాలు

  ఎదలో రేపెను   మధుర  భావాలు

• ఏకాంతమైన    ఈ క్షణాల లో 

  ఏమరించెను   ఈ   జీవం.


• అలల  గోదారి      రమ్మంటోంది.

  కలల   కావ్యాలు   తెమ్మంటోది.


యడ్ల శ్రీనివాసరావు  8 Feb 2024 , 6:30 pm.


Tuesday, February 6, 2024

460. మనో శతకం - 7

 

మనో శతకం - 7



ఆడకెన్నడు    ఆటల్    మతులతో 

జీవితంబాడిన    జీవికి   జీవంబుండదు.

అవసరంబున గాదు మనుజు  అవసరంబు నీవగు.

కాలం కలబడితే   కూలబడున్  బ్రతుకు

సుందర గుణేశ్వరా!    సంపన్నేశ్వరా!         |18|


భావం:

మనుషుల  మనసులతో  ఎన్నడూ ఆటలు ఆడకు.  

జీవితం కనుక  నీతో  ఆటాడడం మొదలెడితే నీకు జీవం లేకుండా చేస్తుంది.   

నీ  అవసరం కోసం మనుషులు కావాలని కోరుకోకు ,  నీవే మనుషుల కు  ఒక అవసరం గా  మారు.   

కాలం తిరగబడితే బ్రతుకు సర్వనాశనం అవుతుంది.

సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా, సంపన్నుడైన ఈశ్వరా.


🔱🔱🔱🔱🔱🔱


వీడిన  వికర్మ   జీవించు  కాలంబున

చేష్టలుడిగి నాడు   కార్యంబు దాల్చు 

కాలంబున దేహం   కర్మ  వదలకుండున్ 

సత్యంబెరిగి  ద్రవించుగొనిన  ధన్యుడగున్.

సుందర గుణేశ్వరా! సంపన్నేశ్వరా!          |19|


భావం :

చేసిన చెడు కర్మ  కాలంలోనే  స్థిరంగా జీవించి ఉంటుంది. 

చేష్టలు మితి మీరిన నాడు దాని  ఫలితం కనపడును.

శరీరం   కాలంలో  ఉన్నంతవరకు  ఎన్ని జన్మలెత్తినా కర్మ  వదలదు. 

జ్ఞానం తెలుసుకొని    కర్మ   కరిగించుకున్న వాడు  ధన్యుడు అగును.  

సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా, సంపన్నుడైన ఈశ్వరా.



యడ్ల శ్రీనివాసరావు 6 Feb 2024, 10:00 pm.


490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...