Monday, May 31, 2021

62. కలి మనిషి

                              కలి మనిషి



 

·   చిత్రమో….  ఇదియే విచిత్రమో

·   ఉషోదయం తో   ఉరుకుల 

    పరుగులిడే  ఓ మనిషి‌.

·    చించు … కాస్త ఆలోచించు 

     నీ నీడ  పయనమెటో.

·    అరచేతి  రేఖల  మార్గము 

     అంతా  అగమ్యగోచరం.


·    చూసే చూపులు , చేసే చేతలు 

    *చించే మనసు వేనా‌ ... నీ మనసు వేనా

     అడిగి చూడు  మదిని  శాంతంగా 

·    ఈ గందర   *“గోళంలో 

     చిందర వందర

    ఎవరి కోసం,  ఎందు కోసం..

·    మాయ లోని   *ధూమం 

     ఏ అధ్బుతమైనా   సృష్టించగలదు, 

     రంజింప  గలదు.

·    కాలం  *“కలిది   అయినపుడు, 

    *మానానికి   *మోచనమెక్కడ.


·   *అరిషడ్వర్గాలను  ఆభరణాలు గా 

    ఆశ, అత్యాశ ల    నడుమ 

    ఊయల ఊగే మనిషి … ఓ మనిషి.

·   కల్తీల కాలగమనంలో 

    స్వచ్చత ఎప్పటికి నిరాశే.


·   మాయా లోకం లో 

    ఆహారమే … ఆహర్యము, 

    బంధువులే … రాబందులు, 

    శ్రమయే … దోపిడీ, 

   అనాగరికతే … నాగరికత, 

   పచ్చనోట్లే … జీవిత కొలమానం.

·  అజ్ఞానమే ...  జ్ఞానమనుకునే 

   మిడిసిపాటు 

   కన్ను మూస్తే నే ..కాని … కానరాదా.


·   మనిషి  

   నీ వొక  *మన్ను ...

   నీ వొక  *ఉదకము ...

   నీ వొక  *ఉష్ణము ...

   నీ వొక  *పవనము ...

   నీ వొక  *శూన్యము ...

   అడిగి చూడు నీ మూల కణాన్ని, అవునో … కాదో.


·  నీవు ఉన్నా … లేకున్నా, 

   నీ కోసం ఎవరూ  ఆగిపోయేది  లేదు.

·  ఎంత సాధించిన,   ఏమి సాధించిన 

   అంతర్యామి యే 

   నీ ఆఖరి మజిలీ.


·  సత్యమెరిగిన  మనిషి లో 

   జ్యోతి ప్రజ్వలన నిరంతరం

   దేదీప్యమానం … అదియే  *ఆదిదేవుని దీవెన.🙏

 

చించే= ఆలోచించుట.

గోళం = విశ్వం.

ధూమం = పొగ.

కలి= కలి పురుషుడు

మానం బుద్ధి, శీలం.

మోచనము = విముక్తి, మోక్షం.

అరిషడ్వర్గాలు = అంతర్గత శత్రువులు. (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు)

మన్ను= మట్టి.

ఉదకము = నీరు, జలం

ఉష్ణము = నిప్పు, వేడి

పవనము= వాయువు, శ్వాస.

శూన్యము= ఆకాశము.

ఆదిదేవుడు = ఈశ్వరుడు.


యడ్ల శ్రీనివాసరావు  31 May 2021  3:00 pm.

 

61. ఏమయ్యావు…. మిత్రమా

 

ఏమయ్యావు…. మిత్రమా

·        ఏమయ్యావు మిత్రమా….ఏడున్నావు స్నేహమా

·        కాలినడక తో కాలేజీ కి  చెట్టాపట్టాల్…..కాలక్షేపం తో  కాలం తెలియని కబుర్లు.

·        ఆంగ్లం అర్థం కాని ఈ మట్టి బొమ్మకి…..నీ అనువాదం తో ఆనందం గా బుట్ట బొమ్మ ని చేశావు.

·        తెలుగు మాష్టారి(శర్మగారు) పాఠం తదుపరి మిత్రురాలు  ఐ. వెంకటలక్ష్మి తో వెటకారాలు, లక్ష్మీ జడ మన బల్ల పై పడితే పెన్ను తో పక్కకు తోసే ఆటలు…. అంతకు మించి జడకు అంటించిన చూయింగ్ గమ్….ఏల మరువను నీ స్మృతులు.

·        సాయం సమయాన గోదావరి గట్టు పై,  చెట్టు చెంత పిట్ట గోడ పై, అల్లరి చేష్టలు….నీ నసీమా(ముస్లిం అమ్మాయి, మా క్లాస్) కోసం నీ ఎదురు చూపులు,  మీ ఇద్దరి మౌన వేదనలునాకు తొలి ఆనందాలు.

·        అల్లరి కి అర్థం నీవుఆ అర్థానికి ధైర్యం నేనుకలబోతయే మన మిత్రబృందం.

·        మన మాటల్లో సంతోషంమనకు నిత్య యవ్వనంఎంతటి కష్టాలైనా కరిగిపోయేవి.

·        కరోనా కలకలంతో , కడలిలా కల్లోలం అయ్యెను మన చెలిమి.

·        చెరగని, చెదరని నీ రూపానికి, నీ ఆలోచనలే జీవం.

·        అలుపెరుగని జీవన ప్రయాణం లో మన దారులు వేరైనా….గమ్యాన్ని చేరడానికి మరీ ఇంత తొందర ఎందుకు రా నీకు!....

 

 

అశృతాంజలి

YSR 31 May 21, 10:00 am

 

 

 

 

 

 

Saturday, May 29, 2021

60. ప్రేమ సత్యం..మనిషి నిత్యం..మనసు కృత్యం


🌹ప్రేమ సత్యం🧒👧మనిషి నిత్యం❣️మనసు కృత్యం

 


·        వేదనాఇది ఏ వేదానికి అందని ఆవేదనా.

·        *ప్రణయానికి పరిశీలనే నిలువెత్తు నివేదనా.

·        చూసే చూపులకు నిట్టూర్పు లే నిరీక్షణ.

·        పలికే పెదవులకు మౌనమే శ్రీ రాగం.

·        ఊగిసలాడే మనసుకి *ఉద్వేగమే  ఊరట.

·        వేదనాఇది ఏ వేదానికి చెందని మనో వేదనా.

·        పరిమళించే పుష్పానికి ఏమి ఎరుక దాని సుగంధం.

·        మనసు పడే బాధ మనిషికి ఏమి ఎరుక, దాని వేదన.

·        అంతరంగం లోని తరంగాలు తీరం దాటినపుడు  కలిసేది *ప్రకృతి లోనే .

·        సుందరమైన స్మృతులు అలంకారాలైనపుడు, జీవనం  సజీవం  జీవితాంతం.

·        ప్రేమ సత్యంమనిషి నిత్యం..మనసు *కృత్యం 

(నిజమైన ప్రేమతో, మనిషి నిత్యం, మనసు కోరుకునేది ఆచరిస్తాడు.)

 

ప్రణయం = ప్రేమ, స్నేహం, మంచితనం

ఉద్వేగం =  మనసు పడే విరహం

ప్రక్రృతి = స్త్రీ, ప్రియురాలు, సృష్టి

కృత్యం = సజావుగా చేయుట

YSR 29 May 21 13:30.

 

 

 

 

 

 

 

 

Sunday, May 23, 2021

59. మనసు నినాదం


మనసు నినాదం




•ఎన్నో ఆలోచనలు, ఆశల కలబోత మనసు. మనసు కి  కావలసినది దొరికే వరకు అలుపు లేకుండా నిరంతరం పరితపిస్తూ నే ఉంటుంది. శరీరానికి నటించడం తెలుసేమో గాని , మనసు కు మాత్రం తెలియదు. ఎందుకంటే మనసు ఒకవేళ పోరపాటున నటించినా క్షోభ అనుభవిస్తూనే ఉంటుంది. ఔనన్నా కాదన్నాఆ విషయం  మనసు కు స్పష్టంగా తెలుసు. మనసు సంతోషం,  సంత్రృప్తి పడింది అంటే చాలు ఇక అదే మనిషికి జీవిత పరమార్థం. 
🌷🌷🌷🌷
• మనిషి లో ఉన్న మనసు కోరుకునే కోరిక పరి విధాల గా, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ధనం, పేరు, కీర్తి, ప్రతిష్ట, సుఖాలు, సంతోషం, గౌరవం, ప్రేమ, మోక్షం, ధర్మం…ఇలా ఉన్న ఎన్నో అంశాలలో,  ప్రత్యేకంగా ఏదోఒక అంశం తో  ముడి పడి ఉంటుంది. అది మనిషి జన్మించడం తోనే నిర్ణయం అయిపోతుంది. కాని అది మనిషి  గ్రహించడానికి , వయసు ,అనుభవం, తన గురించి తాను తెలుసు కునే జ్ఞానం అవసరం.
🌺🌺🌺🌺
• ఇక్కడే ఒక చిత్రం, విచిత్రం దాగి ఉంటుంది. భగవంతుడు ఆడించే ఆటలో , జీవితం లో కొందరికి చాలా సునాయాసంగా , అవలీలగా మనసు కి కావలసినవి దొరుకుతాయి. అది సుక్రృతం.
🌿🌿🌿🌿
• కాని మరికొందరికి ఎంతో ప్రయాస పడితేనేకానీ మనసు కు కావలసింది దక్కదు. ఇది కూడా అద్రుష్టమే.  ఇంకొందరికి జీవితాంతం ఎంత ప్రయత్నించినా , మనసు కోరుకున్నది ఎన్నటికీ దొరకదు. ఇటువంటి వారు…హ…ఏం చేస్తాం లే రాసి పెట్టి లేదు అని నిరాశ తో సరి పెట్టుకుంటారు. 
☀️☀️☀️☀️
• మరికొందరి పరిస్థితి చాలా ఆశ్చర్యం గా ఉంటుంది. మనసు కోరుకున్నవి, కావలసినవి అందుబాటులో నే ఉంటాయి, కానీ అనుభవించడానికి మాత్రం,  అందని ద్రాక్ష పండ్లు లా ఉంటాయి. ఉదాహరణకు ఒక మనిషి తన జీవితంలో లడ్డూ గురించి వినడమే గాని, ఏనాడు చూడడం గాని, తినడం గాని లేదు. ఎప్పటికైనా లడ్డూ తిని చనిపోతే చాలు ఈ జన్మ చరితార్థం అని మనసు లో,  ఊహ తెలిసిన నాటి నుండి అనుకునేవాడు. అతనికి వయసు 55 సంవత్సరాలు వచ్చాయి. అతనికి విపరీతమైన మధుమేహ వ్యాధి వచ్చింది. అపుడు వైద్యుడు నువ్వు ఏనాడైతే చక్కెర పదార్థాలు తింటావో అదే నీకు ఆఖరి రోజు అని చెప్పాడు. ఒక రోజు అతనికి ఒక ప్రముఖ మిఠాయి దుకాణం లో , పని దొరికింది. అక్కడ పని చేసే వారు ఉచితంగా మిఠాయిలు తినవచ్చు. చుట్టూ ఎన్నో రకాల రుచికరమైన మిఠాయిలు ఉండేవి, వాటిలో ముఖ్యంగా తన జీవిత సార్థకానికి కావలసిన లడ్డూ ఎదురుగా నే ఉండేది. నిత్యం తాజాగా ఉన్న లడ్డూ సువాసన ని చూస్తూనే ఆనందం తో, కూడిన మానసిక క్షోభ అనుభవించే వాడు. చూస్తే ఈ స్థితి ఎంత విచారకరం గా అనిపిస్తుందో కదా…. బహుశా కొందరికి  జీవితం అంటే ఇదేనేమో.  ఒక మనిషి గా ఆలోచిస్తే ఈ స్థితి చాలా విచిత్రం గా అనిపిస్తుంది.  కానీ మనసు గొప్పది, ఎందుకంటే అది కోరుకున్నది నెరవేర్చుకోవడమే దాని అంతిమ లక్ష్యం. అప్పుడు మనసు  తెలివిగా ఇలా ఆలోచించడం మొదలు పెట్టింది. నా జీవిత సార్థకత లడ్డూ రుచిచూడడం. ఎప్పటికైనా మరణం తధ్యం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ…అని తనకు నచ్చిన లడ్డూ త్రృప్తిగా తిని, మనసు కోరిక నెరవేర్చుకున్నది.

• “ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ” అనేదే మనసు నినాదం అనుకుంటా.


YSR 23 May 21 3:00 pm

Thursday, May 20, 2021

58. ఎవరు తండ్రి.... ఎవరు కొడుకు

ఎవరు తండ్రి  ...  ఎవరు కొడుకు.




• బాల్యం అంటే భయం . ఆ భయానికి ప్రతిరూపం నాన్న . నాన్నను చూడాలన్నా, మాట్లాడాలన్నా భయం.శిక్షణకు, క్రమశిక్షణకు నిలువెత్తు విగ్రహం నాన్న.ఎప్పుడు ఏ క్షణంలో ఎందుకు దెబ్బలు తినాల్సి వస్తుందో అని అనుక్షణం భయం.బాల్యమంతా దిన దిన గండం. నాన్న ఏరోజు ప్రేమగా మాట్లాడే వారు కాదు.ఇంటి నుండి పారిపోవాలని ఎన్నోసార్లు అనిపించేది కానీ ధైర్యం చాలేది కాదు.చదువులో ఎప్పుడూ మంచి మార్కులే వచ్చేవి  , చెప్పిన మాట ప్రతిదీ వినేవాడిని అయినా ఎందుకు ..ఎందుకు కొడుతూ తిడుతూ ఉంటారు అనే ప్రశ్న ఎప్పుడూ వేధిస్తూనే ఉండేది.బహుశా నేనంటే అసహ్యం ఏమో అనుకునేవాడిని  కానీ అర్ధరాత్రులు పక్కన పడుకుని నా పొట్ట మీద చెయ్యి వేసి నిమురుతూ ఉండేవారు ఆ స్పర్శకి కళ్ళల్లో చుక్కలు కారేవి.మరలా ఉదయానికి నాన్న గంభీరమైన మాటలకు కళ్ళల్లో చుక్కలు కారుతూ ఉండేది. నాకు ఆ వయసులో సంతోషం, ఆనందం అంటే కేవలం స్కూలు, స్నేహితులు మాత్రమే . అదేవిధంగా ఇష్టానికి ప్రతిరూపం అమ్మ. ఎందుకమ్మా  నాన్న అస్తమానం నన్ను తిడుతూ ఉంటారు అని అమ్మ అని అడిగినా సమాధానం దొరికేది కాదు.  నాన్న అంటే కేవలం అవసరాలు తీర్చే మనిషి అనిపించేది. పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. అవి చూసి నాన్న విడిచిన నిట్టూర్పు ఇప్పటికీ మర్చిపోలేను .   
• కాలక్రమేణా వయసు పెరిగే కొద్దీ ఇంటికి దూరంగా ఉంటూ స్నేహితులతో స్వేచ్ఛను సంతోషాన్ని వెతుక్కునే వాడిని. కానీ నాన్న అంటే విపరీతమైన భయం వలన బయటకు చెప్పలేక  , పంచుకోలేని భావాలు ఎల్లప్పుడూ మనసులో రోధిస్తూనే ఉండేవి.

• కానీ తరువాత కాలంలో నాన్న గురించి తను పెరిగిన వాతావరణం గురించి నానమ్మ చెప్పేది.నాన్నకు తన బాల్యంలో సరిగా తినడానికి తిండి కూడా ఉండేది కాదని, బట్టలు కూడా తాతయ్యవి సైజు చేయించుకుని వాడేవారట . రెండు సార్లు ఫెయిల్ అయినా కష్టపడి పియుసి చదువుకొని, గవర్నమెంట్ క్లర్క్ జాబు సంపాదించుకుని అటు తాతయ్య కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకునేవారట. అదే సమయంలో నాన్న తోటి వారిలో చాలా మంది రకరకాల విలాసాలకు బానిసలై యవ్వనంలోనే జీవితాన్ని చాలించిన వారు ఉన్నారంట. ఆ భయము ప్రభావం నాన్న మీద చాలా ఎక్కువగానే ఉండేదట. పిల్లలకి స్వేచ్ఛ ఇస్తే పాడై పోతారు , చెడు దార్లు పడతారు అనే భయం విపరీతంగా ఉండటం వల్ల,  పైగా నేను ఒక్కగానొక్క డనే అవడంవల్ల ఏమైపోతానో అనే భయంతో నన్ను ఉంచవలసిన దానికంటే ఎక్కువ క్రమశిక్షణ, భయపెట్టి పెంచారని తెలిసింది.

• కానీ ఆయన పెంపకం వలన నాకు క్రమశిక్షణ, పద్ధతి ,ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలిసేది. కానీ ఒక వైపు బాల్యంలో చాలా కోల్పోయాను అనే బాధ వేధిస్తూనే ఉండేది . నాన్నకి 73 సంవత్సరాలు . 8 నెలల నుంచి పూర్తిగా ఆరోగ్యం క్షీణించి మంచానికే పరిమితం అయిపోయారు. అమ్మ ఆరోగ్యం కూడా కొంచెం పాడైంది.హైదరాబాద్ లో మంచి ఉద్యోగం వదులుకొనిఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన దగ్గర నుండి నాన్న సేవకే జీవితం పరిమితం అయిపోయింది. నాన్నకు తెలుస్తుంది రోజులు గడిచే కొద్దీ ఇంకా ఎంతో కాలం  తను బ్రతకరని . నాన్న అమ్మతో తరచూ అంటూ ఉండేవారట వాడికి చిన్నప్పటినుండి అవసరాలు తీర్చేను కానీ వాడి మనసును అర్థం చేసుకోలేకపోయాను, నావల్ల చాలా సంతోషాలు దూరం చేసుకున్నాడు అయినా భరించేవాడు అనేవారంట . 

• నాన్న మంచం మీద నుంచి లేవలేక పోయేవారు . కాళ్లు చేతులు కూడా కదపలేక పోయేవారు. నిత్యం నాన్న మంచం పక్కనే ఉండి పసిపిల్లవాడిలా మనసులో కొడుకులా చూసుకునేవాడిని. ఒకరోజు అంటే ఇంకా పదిహేను రోజుల్లో చనిపోతారని కొనేముందు నాన్న నన్ను తన పక్కన కూర్చోమన్నారు. అప్పటికే మాట చాలా వరకూ కోల్పోయారు . ఆయన పడుకుని నా వైపు తీక్షణంగా చూస్తున్నారు, ఆయన కళ్ళ నుండి విపరీతంగా నీరు ధారలుగా వస్తుంది.  నా చేతి వేళ్ళను ఆయన నెమ్మదిగా స్పృశిస్తూ........ నన్ను క్షమించు నాన్న...... నువ్వు నాకు కొడువు కాదు ..తండ్రివి....అని ఏడుస్తూ.... నిన్ను చిన్నతనం నుండి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు అంటుంటే కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతూ నాకు వచ్చేసాయి. అప్పుడు నాన్న తో నేను ...లేదు నాన్న అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నువ్వే కరెక్ట్ నువ్వు ఏం చేసినా నా మంచికే చేసావు, నీ పెంపకం వలన ఎలా బ్రతకకూడదో...తెలిసింది అన్నాను  . నాన్న వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ తనకు ఇష్టమైన భయాన్ని నా నుండి తీసుకెళ్లిపోయారు .ఈ విశ్వాన్ని చూడగల ధైర్యాన్ని, ఆలోచనలను  ఇచ్చి వెళ్ళిపోయారు . ఇంకా ...ఇంకా.... ఇంకా....చెప్పాలంటే చేజారిన బాల్యాన్ని,  సంతోషాలను ఆశీస్సులను ఇచ్చి వెళ్ళిపోయారు అందుకు ప్రత్యక్ష  ఉదాహరణ  నాతో ఉన్న మీరు మీతో ఉన్న  నేను . మా నాన్న నాతో ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి.ఇప్పుడు చెప్పండి ఎవరు తండ్రి .........ఎవరు కొడుకు  . ఒక నాడు తండ్రి కూడా కొడుకే .......ఈనాడు కొడుకు కూడా తండ్రే..

యడ్ల శ్రీనివాసరావు. 5 May 2020



57. చిత్రమైన మహిళకి విచిత్రమైన సంతోషం.

చిత్రమైన మహిళకి విచిత్రమైన  సంతోషం.
(మూలం : బాల్యం నుంచి చూసిన ఒక విచిత్రమైన మహిళ వ్యక్తిత్వాన్ని చూసి, గమనించి ప్రేరణతో  రాసింది.)


హనీత

• ఎలా, ఎక్కడినుంచి మొదలు పెట్టాలో తెలియడం లేదు. కానీ ఎలా గోలా మొదలు పెట్టాలి. పేరు కి ఆడపిల్ల నే అయినా, నన్ను మాత్రం నా తల్లి దండ్రులు చిన్నతనం నుండి మగాడి లాగే పెంచారు. కట్టు, బొట్టు, జుట్టు, మాట ఒకటేమిటి అన్నీ పురుష వేషధారణ, అవే లక్షణాలతో పెరిగాను. నేను నా సాటి వారితో, మగవాడి లా ప్రవర్తిస్తూ ఉంటే, నాలో విపరీతమైన మానసిక ఆనందం కలిగేది. నెమ్మదిగా నేను మగాడిలా అజమాయిషీ, పెత్తనం చేస్తుంటే , ఇంట, బయట అందరూ భయపడుతూ ఉండేవారు. అది నాకు చెప్పలేని సంతోషం ఇచ్చేది.  

• వయసు పెరిగిన కొద్దీ నాలో ఈ ధోరణి విపరీతంగా పెరిగిపోయింది.  తల్లి తండ్రులు , తోడపుట్టినవారు నన్ను భరించలేక పోయేవారు. వారు ఏదో విషయాలను నాకు చెప్పాలని ప్రయత్నించేవారు, వారు చెప్పేది నిజమే అనిపించినా, చాలా విసుగు గా ఉండేది. స్త్రీ కాలచక్ర ధర్మం సమయం రోజుల్లో మాత్రమే, నేను ఒక ఆడదాన్ని అని అనిపించేది.  తరువాత అంతా మగరాయుడి లా ఉండే(వాడిని) దాన్ని.  తోడ పుట్టిన వారికి పెళ్లిళ్లు అయ్యాయి. వాళ్లు సుఖం గా, సంతోషంగా ఉంటుంటే , నాలో ఏదో భాథ, వారిని చూసి తట్టుకోలేక, అవసరం లేకపోయినా, ఏదొక విధంగా నోటికి వచ్చినట్లు మాటలు అంటూ, , గొడవలు పెట్టె దాన్ని…అది నా మనసు కు చాలా హాయిని ఇచ్చేది, ఆ తర్వాత సంతోషం తో తిండి తినాలని అనిపించేది కాదు.   “నాకు దక్కనిది నాతో ఉన్నవారికి ఎవరికైనా దక్కితే ఎంతకైనా తెగించాలనిపిస్తుంది”. అది చాలా సరదాగా ఉంటుంది. మా నాన్న కూడా ప్రభుత్వ డాక్టర్ వృత్తి లో ఉన్నప్పుటికి  నా ప్రవర్తన చూసి  నన్ను ఒకరోజు ప్రైవేటు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్ చెప్పిన విషయం ఏమిటంటే హార్మోన్ల సమతుల్యత లేకపోవడం వలన అలా అవుతారు అన్నారు. కొన్ని రోజులు మందులు వాడి మానేసాను. మందులు వాడి మానేసిన తర్వాత నా పరిస్థితి అంతకు ముందు కంటే 10 రెట్లు అయింది. నేను చెప్పింది వినకపోయినా, నా మాట కు అడ్డు వచ్చినా ఎవరిపైనైనా చేయి చేసుకునేదాన్ని. నా మాట వినకపోతే  ఇప్పటికీ విపరీతంగా కోపం వచ్చెస్తుంది. ఇది ఎంత సంతోషంగా ఉంటుందో మాటలలో చెప్పలేను.


• అమ్మా, నాన్న పెళ్ళి సంబంధాలు చూసేవారు. ఒక మగాడు ఇంకొక మగాడి ని పెళ్లి చేసుకొని ఏం చేయాలి, అని సంబంధాలు చెడగొట్టే దాన్ని . నేను మగవారితో ఎక్కువ స్నేహం చేసేదాన్ని. మగవాళ్లు చాలా నిస్సంకోచంగా ఎటువంటి విషయాలైనా (వివరం అవసరం లేదు) మాట్లాడుకో గలరో,  నేను వారితో కలిసి అలాంటి మాటలు, మాట్లాడేదాన్ని.  అలా ఉంటే చాలా చాలా ఆనందంగా ఉండేది.  కానీ ఎవరూ ఏనాడు నాతో ఎంతో కాలం స్నేహం చేసేవారు కాదు.  ఇక నా వయసు అమ్మాయిలతో స్నేహం అయితే సరేసరి. వాళ్లందరి దగ్గర మగాడిలా హీరోయిజం చూపించాలని ఉంటుంది. అలాగే వాళ్ల చేత పొగిడించుకోవాలనే తపన ఉంటుంది. నా మాట వినకపోయినా, వాళ్లలో ఎవరైనా సంతోషంగా, అందంగా  నా కంటికి కనపడితే అది వాళ్ల కర్మ, దౌర్భాగ్యం. 


• చెప్పుకో కూడదు కాని నేను అలుపు ఆయాసం లేకుండా ఎన్ని గంటలైనా , మాట్లాడగలను. అది మంచా, చెడా అనేది అనవసరం. ఇది గుర్తించి , కొంతమంది ఎవరూ చేయలేని పనులు నాకు అప్పచెపుతారు. అవి మంచా,చెడా అనేది అనవసరం. ఒక రకంగా చెప్పాలంటే నాకు మిత్రుల కంటే , శత్రువుల పైన ప్రేమ, ఎందుకంటే వాళ్లు ఇచ్చే మానసిక సంతోషం ఎవరూ ఇవ్వలేరు. అందుకే ఎక్కువ కాలం ఎవరిని మిత్రులు గా ఉంచుకోను. గొప్ప విషయం ఏమంటే, నాలాంటి వాళ్ళే నన్ను చేరదీస్తుంటారు. మళ్లీ మాలో మాకే ఆధిపత్యం పోరు మొదలవుతుంది. కానీ ఇలా భలే ఉంటుంది.


• చివరిగా,    కొన్నిసార్లు ఇంట్లో తల్లి తండ్రులు, తోడపుట్టినవారు, సమాజం, సాటివారు నన్ను ఒక “ చీడపురుగులా” దాపరించావు అని అంటుంటే , ఆ మాటలు విన్న నాకు ఈ జన్మకు ఈ సంతోషం చాలు అనిపిస్తుంది.  నేను మనిషినే, నాకు ఆలోచనలు ఉంటాయి అవి ఎలాంటివి అనేది అనవసరం. నా లా ధైర్యం గా బ్రతకలేని పిరికి వాళ్లు, ఏవేవో మాటలు చెపుతుంటారు, మంచి, మర్యాద, గౌరవం, నీతి, నియమం....అంటూ.…ఛీ …ఇటువంటి మాటలు నాకు పరమ రోత. కొంతమంది యొక్క గొప్పదనాన్ని చని పోయాక చెప్పుకుంటారు. కానీ నా లాంటి వాళ్ల గొప్పదనం,  బ్రతికి ఉండగా నే చెప్పుకుంటారు.. ఎంతమంది కి దొరుకుతుంది ఈ అద్రుష్టం. కొందరు ఏనుగులా, సింహంలా, పులిలా బ్రతాకాలి అంటారు. కానీ నేనైతే  “బురదలో దొర్లే పందిలా బ్రతకాలి” అంటాను. ఎందుకంటే ఏదైనా దులుపుకుని సిగ్గు లేకుండా తిరగడం పంది అద్రుష్టం. నాకు అదే ఆదర్శం
.  

ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు. నా తోటి వారు పెళ్లి పిల్లలు సంసారం అంటూ జీవిస్తుంటే నాకు వారి మీద చాలా జాలిగా ఉంటుంది. ఎందుకంటే నాకు నచ్చిన చోట తిరుగుతూ, నచ్చిన వి తింటూ, నచ్చిన మనుషులతో తిరుగుతూ స్వేచ్ఛ గా  నా జన్మను సార్ధకం చేసుకుంటున్నాను.  నన్ను చూసి ఓర్వలేని వారు ఏదో అంటుంటారు. పాపం అటువంటి వారి పై జాలి వేస్తుంది.

🌿🌿🌿🌿🌿🌿🌿

YSR 20 Apr 21









56. పల్లవోదయం (కధ)


                            తొలి పల్లవో దయం.
(ఈ డ్రాయింగ్ మిత్రుడు , వానపల్లి శ్రీనివాస్ వేసినది)

ఎన్నాళ్ళనుంచో  మనసులో ఉన్న అనుభూతులను, జ్ఞాపకాలను కథ గా రాయాలని అనుకున్నాడు ఉదయ్. కానీ కథ ఎలా రాయాలో తెలియక చివరికి ఒక ప్రయత్నం  చేశాడు. అది ఈ ఉదయ్ కథ .

" అందరికీ కన్నీళ్ళు ఉప్పగా అనిపిస్తాయి, మరి నాకెందుకో రుచిగా అనిపిస్తున్నాయి. ఓహో కన్నీళ్లు నా ఊహ తెలిసిన నాటి నుంచి ఊపిరిలో  భాగం కదా అందుకే నేమో "  అని మనసులో అనుకుంటూ వేసవి కాలం సాయంత్రం 6 గంటలకు  మేడమీద ఆరుబయట మంచం మీద జారపడి ఆకాశం లోని మేఘాల వైపు నిట్టూర్పుగా చూస్తున్నాడు ఉదయ్.  41 సంవత్సరాల ఉదయ్  సున్నిత మనస్కుడు.  ఉదయ్ కి హైదరాబాదులో మంచి ఉద్యోగం భార్య, పిల్లలు ఉన్నారు. జీవితంలో ఏ లోటు లేనట్లుగా పెరిగాడు  , ఇది తనతో ఉన్న బంధుమిత్రులకు పైకి తనపై కనిపించే  అభిప్రాయం.  కానీ ఉదయ్ మాత్రం తన వారి అందరి అవసరాలు తీర్చడం కోసం,  వారిని సంతోషపెట్టడం కోసం ,తన జీవితాన్ని మంచి వేదికగా చేసుకొని నటిస్తూ ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాడు.కానీ అంతరంగంలో ఎప్పుడు ఒంటరి గానే ఉంటాడు. ఎందుకంటే బాల్యం నుంచి తనకు నచ్చినవి, ఇష్టమైనవి తనకు దక్కినట్లే ఉండేవి,  కానీ  ఏవీ దక్కేవి కావు, ఇది ప్రతి అంశం లోను చదువు, అవసరాలు, వ్యక్తుల సాన్నిహిత్యం, ఇష్టమైన ఆహారం, బంధాలు ఈవిధంగా అన్ని అంశాల్లో రాజీ పడుతూ జీవించడం అలావాటు అయిపోయింది.  తనకు తన చుట్టూ ఎన్నో ఉన్నా, అవేమీ తనకు సంబంధించినవిగా మాత్రం అనుకోడు. ఎందుకంటే తన బాల్యం, పెరిగిన విధానం, చెరగని మధురమైన జ్ఞాపకాలు, చిన్న చిన్న సంతోషాలు ఉదయ్ కి అత్యంత విలువైనవి. అలా ఆకాశం లోని చంద్రుడుని ఒకవైపు , గుంపులుగుంపులుగా ఎగురుతున్న కొంగలు, పక్షులు  సమూహాలను మరో వైపు చూస్తూ కంటి తెరల వెనుక జారుతున్న నీటితో తన మధురమైన బాల్యంలోకి జారుకున్నాడు ఉదయ్ .


రావు గారు, ఈశ్వరమ్మ గార్ల ప్రథమ సంతానం ఉదయ్.  1980 ల్లో, రావు గారు సూర్యాపేట దగ్గరలో రామాపురం అనే ఊరిలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఆయన క్రమశిక్షణ కి మారుపేరు. ప్రతి చిన్న విషయానికి ఉదయ్ మీద కోపగించుకునేవారు. తండ్రి గాంభీర్యానికి భయపడి వెక్కివెక్కి ఏడుస్తూ ఈశ్వరమ్మ గారిని పట్టుకొని పక్కనే పడుకునేవాడు ఉదయ్.  " నేనేం చేశాను అమ్మ,  తెలియకపోతే నాకు నెమ్మది గా చెప్పొచ్చు కదమ్మా "  అని అమాయకంగా తల్లితో ఆస్తమాను అంటూ ఉండేవాడు. ఆ వయసు నుంచే తన  అందమైన కళ్లు వెనుక జారని కన్నీటి చెమ్మ  నిరంతరం ఉండేది.  తండ్రి మీద ఉన్న భయంతో  ఏ పని చెయ్యాలో,  ఏది చెయ్యకూడదో తికమక పడుతూ సందిగ్ధంలో  లోనే ఉండేవాడు . ఆ వయసులో  "భయం"  అనేది తనకు ప్రాణ మిత్రుడు అని అర్థమయ్యింది ఉదయ్ కి.


రామాపురం లో ఎలిమెంటరీ స్కూల్ నుండి , సూర్యాపేట గవర్నమెంట్ హై స్కూల్ కి వచ్చాడు ఉదయ్ . ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యాపేట గవర్నమెంట్ హై స్కూల్ కి ,అందరూ  రిక్షాలు, సైకిళ్లు పై వెళ్ళేవారు ఆ రోజుల్లో . ఉదయ్ కూడా రిక్షా లోనే వెళ్లేవాడు . తరగతి గదిలో  అబ్బాయిలు, అమ్మాయిలు కిక్కిరిసి ఉండే వారు.  సరిగ్గా ఆరవ తరగతి నుండే ఉదయ్ కి అంతుచిక్కని అర్థంకాని ఆశ నిరాశల జీవితం మొదలైంది. 


రిక్షాలో ఉదయ్ కి తన తరగతి వారు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి పదిమంది వరకు ఉండేవారు. స్కూల్ లోని క్రమశిక్షణ  నిబంధనల కారణంగా అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకునేవారు కాదు.  ఉదయ్ కి మాత్రం స్కూల్  రంగుల ప్రపంచం లా ఉండేది  . అబ్బాయిల అందరితో స్నేహంగా ఉండే వాడు. బాగా చదివేవాడు. స్కూల్లో ఉన్నంతసేపు హుషారుగా ఉండేవాడు .కానీ సాయంత్రం ఇంటికి చేరగానే మాటలు తడబడేవి  తండ్రి పట్ల ఉన్న విపరీతమైన భయంతో, ఇంట్లో ఏం మాట్లాడాలో తెలియక నిశ్శబ్దంతో స్నేహం చేసేవాడు.  ఇది ఉదయ్ మనసుకి అసలు నచ్చేది కాదు. తన ఆలోచనలను సంతోషంగా పంచుకునే అవకాశం తండ్రి తో ఏనాడు ఉండేది కాదు.   నెలలో మొదటి ఆదివారం వస్తే రెండు రూపాయలు ఇచ్చి సినిమాకి పంపేవారు,  ఆ ఒక్క రోజు కోసం ఎంతో ఆనందంగా ఎదురు చూసేవాడు ఉదయ్.


ఇలా కొన్ని నెలలు గడిచాయి‌. హైదరాబాదు నుండి ఒకరోజు ఒక మార్వాడి కుటుంబం వ్యాపారం చేయటానికి రామాపురం వచ్చారు.  వారికి ఒక అందమైన అమ్మాయి ఉండేది ప్రమీల.   ప్రమీల కూడా ఆరవ తరగతి ఉదయ్ క్లాస్ లోనే చేరింది.  ప్రమీల అందానికి  మిగతా పిల్లలందరూ ఆశ్చర్యంగా వింతగా చూసేవారు . ఉదయ్ కి కూడా ప్రమీలను చూసిన ప్రతిసారి అర్థంకాని ఒక వింత అనుభూతి పొందేవాడు.  భయంతో కూడిన సంతోషంతో  చూసేవాడు ప్రమీలని.   రెండు రోజుల తర్వాత ఉదయ్ వాళ్ళ వీధి చివర ప్రమీలను ఇంటివద్ద ఉండటం చూశాడు . ఒకే వీధిలో ఇద్దరి ఇళ్లు ఉండటం  ఉదయ్ కి చాలా సంతోషం కలిగింది . తన ఆనందానికి అర్థం తెలిసేది కాదు గాని, ప్రమీల ఇంటి ముందు నుంచి వెళుతూ, వస్తూ ప్రమీల కనపడుతుందేమో అని అప్రయత్నంగా తొంగి చూసేవాడు.  మరొక వారం రోజుల తర్వాత ప్రమీల ఉదయ్ రిక్షా లోనే చేరింది . ప్రమీలను  చూస్తే నిర్మలంగా ఉన్న ఉదయ్ ముఖంలో  ఏదో తెలియని ఆనందం, అలజడి ఉండేది . చూస్తూనే ఆరోతరగతి గడచిపోయింది .


ఏడవ తరగతి లోకి వచ్చాక కామన్ పబ్లిక్ పరీక్షలు చాలా జాగ్రత్తగా చదివి పాస్ అవ్వాలి అని టీచర్స్ ప్రతిసారి భయ పెట్టేవారు . ఇక ఇంట్లో అయితే సరేసరి. రావు గారు ఉదయ్ ని రామాపురం లో ఒక టీచర్ వద్ద  సాయంత్రం వేళ ట్యూషన్ లో చేర్పించారు. ట్యూషన్, ప్రతి రోజు రాత్రి ఏడున్నర గంటల వరకు ఉండేది . ఉదయ్ అయిష్టంగానే మొదటిరోజు ట్యూషన్ కి వెళ్ళాడు , కానీ ట్యూషన్ లో అడుగు పెట్టేసరికి , అక్కడ ఉన్న ప్రమీలను చూసి ఆనందానికి అవధులు లేవు. ట్యూషన్ అయిపోయాక రోజు ప్రమీలను వాళ్ళ నాన్నగారు దగ్గరుండి తీసుకెళ్లే వారు. ఎందుకంటే ఆ రోజుల్లో వీధి దీపాలు సరిగ్గా వెలిగేవి కాదు. రాత్రుళ్లు వీధిలో కుక్కలు మొరుగుతూ ఉండేవి.  ఉదయ్  మాత్రం ఒంటరిగా నే ఇంటికి వెళ్ళేవాడు. ఉదయ్ కి రోజులు బయట సంతోషంగా,  ఇంట్లో భయం భయంగా గడుస్తున్నాయి తండ్రి పట్ల భయం వలన. ట్యూషన్ అలవాటు పడిన తర్వాత , ఒకరోజు హోంవర్క్ విషయమై , మొదటిసారిగా అవసరమైన ఉదయ్, ప్రమీలతో మాట్లాడాడు . ఉదయ్ కి తన బాల్య జీవితంలో అదొక అద్భుతమైన రోజు ఎందుకంటే తొలిసారిగా ఒక అమ్మాయి తో మాట్లాడటం కొత్త అనుభూతి. ట్యూషన్ లోని పరిచయంతో  ప్రమీలకి రోజురోజుకీ దగ్గరయ్యాడు. ఉదయ్ , ప్రమీలకు చాక్లెట్లు ఇవ్వడం , పుస్తకాలు ఇచ్చి పుచ్చుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉండేవి. మనసులో తండ్రి వలన ఉన్న భయానికి , ప్రమీలతో స్నేహం ధైర్యం గా అనిపించేది ఉదయ్ కి.


కొద్ది రోజుల తర్వాత  ప్రమీలను వాళ్ళ నాన్నగారికి వీలు కుదరక ట్యూషన్  నుంచి తీసుకు రావడం మానేశారు. ఒకే వీధిలో ఇళ్లు ఉండటం వలన , అప్పటికే ఉన్న పరిచయం వలన ప్రమీల ఉదయ్ తో కలిసి అడుగు దూరంలో పక్కపక్కనే నడుచుకుంటూ , స్కూలు విషయాలు మాట్లాడుకుంటూ ఇంటికి చేరే వారు .  ప్రమీల  ఈ విషయంలో ఎలా ఉన్నా కానీ,  ఉదయం మాత్రం ప్రమీల తో ఉన్నంతసేపు అర్థంకాని  విపరీతమైన సంతోషంతోఉండేవాడు . ఇంతలో  ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షలు తేదీలు ఖరారయ్యాయి . పట్టుదలగా అందరూ చదివే వారు.  ట్యూషన్  ఇంకొక గంట సమయం  రాత్రి 8:30 వరకు పొడిగించారు .


ఒకరోజు ట్యూషన్ లో ఉండగా సాయంత్రం విపరీతమైన వర్షం  వచ్చింది . కరెంటు పోయింది . తర్వాత ఎప్పుడో 7:30 గంటలకి వర్షం తగ్గింది. కరెంటు వచ్చింది . ప్రమీల ఉదయ్ ట్యూషన్ నుండి ఇంటికి బయలుదేరారు . వీధుల్లో వర్షపు నీటి గుంతలు, , మట్టి రోడ్లు బురదగా ఉన్నాయి . కొన్ని చోట్ల వీథి దీపాలు సరిగా వెలగడంలేదు. ఆరోజు వరకు అడుగు దూరంలో పక్కపక్కనే  నడచిన ప్రమీల ఉదయ్ లు , ఆ రోజు మాత్రం వీధి లో ఉన్న వాతావరణం వల్ల పక్కపక్కగా తగులుకుంటు కొంచెం భయం గా నడుస్తున్నారు.  ఒకవైపు వీధి కుక్కలు మొరుగుతున్నాయి . ఆ వాతావరణం ప్రమీలకు మాత్రం చాలా భయంగా ఉంది. ఉదయ్ కి భయం వేసినా బయటపడకుండా నెమ్మదిగా మాట్లాడుతూ నడుస్తున్నాడు. ఒక వీధి మలుపు తిరిగి, రెండవ వీధిలో కి రాగానే నీటి గుంతల్లోని  రెండు కప్పలు  అమాంతంగా బెక్ బెక్  మనే గట్టి శబ్దంతో ఎగిరేటప్పటికీ , ఆకస్మికంగా ప్రమీల తన చేతిలో పుస్తకాల సంచి కిందపడేసి బిగ్గరగా అరుస్తూ ఉదయ్ చేతిని, భుజాన్ని గట్టిగా పట్టుకుంది. ఊహించని ఆ పరిణామానికి, ప్రమీల శరీరం, చేతి స్పర్శ ఉదయ్ కి తగిలేటప్పటికి  ,ఉదయ్ షాక్ అయ్యాడు . నెమ్మదిగా ఇంటికి వచ్చేసారు.  ప్రమీల చేతి స్పర్శ తన మానసుపై  చెరగని ముద్ర వేసింది . ఉదయ్ కి ఆ రోజు రాత్రి నిద్ర లేదు , ఆ రాత్రే కాదు ఆ సంఘటన  తలచుకున్న నేటికి ఏ రాత్రి నిద్ర లేదు. 


ఏడవ తరగతి పరీక్షలు  అయిపోయాయి . స్కూలుకు సెలవులు ఇచ్చారు. అందరూ వేసవి సెలవులకు తాతగారి ఊరికి వెళ్ళి నా , ఉదయ్ మాత్రం రామాపురం లో నే ఉండిపోయాడు. వేసవి సెలవుల్లో ఉదయ్, ప్రమీల ఇంటి ముందు నుంచి వెళ్తూ తోంగి చూసేవాడు ప్రమీల కనిపిస్తుందేమో అని. కాని ఏనాడు ఉదయ్ కి ప్రమీల కనిపించలేదు. తిరిగి స్కూలు ప్రారంభించారు. అందరూ  8 తరగతిలోకి వచ్చారు . అందరూ ఆనందం గా కొత్త తరగతి లోకి హుషారుగా వచ్చారు, ఒక్క ప్రమీల మినహా. మొదటి రోజు ఉదయ్ కి ఏదో తెలియని నిరాశ. ప్రమీల కుటుంబం మాత్రం ఏదో కారణం వలన తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారని తెలిసింది ఉదయ్ కి . ఉదయ్ కి తన దైర్యం కోల్పోయినట్లు అనిపించింది. యాంత్రికంగా  తల్లిదండ్రుల కోసం చదువుతూ ఉన్నా,  ప్రతిరోజు ప్రమీలను గుర్తుకు తెచ్చుకుంటూ, నిస్సహాయంగా,  ఏదో కోల్పోయినట్లు ఉండేవాడు ఉదయ్.  ఆ తర్వాత ఏనాడు ప్రమీల తన కంటికి కనబడలేదు . కానీ ప్రమీలపై ఉన్న ఇష్టం , ఆశ  , జ్ఞాపకాలు తనని సంతోషంగా ఉండేలా చేసేది..  ఉదయ్ కు,  ప్రమీల అందం,  చూపు , నవ్వు గుర్తు చేసుకుంటూ తనతోనే ఉన్నట్లు భావిస్తూ,  పైకి కనిపించని బాధతో ఆనందంగా ఉండేవాడు . ఉదయ్ ద్రృష్టి లో ప్రమీల అంటే తన జీవిత ధైర్యం.  కానీ బాల్యంలో ఆ వయసులో ఉదయ్ కి తెలియదు అదే తన  జీవితానికి తొలి, చివర మానసికమైన   "ప్రేమ"  అని .


ఇంతలో ఏవండోయ్ టైం 8 అయ్యింది భోజనానికి రండి. అని మెట్లపై నుండి ఉదయ్ భార్య గట్టిగా పిలిచింది  . ఉదయ్  ఒక్కసారిగా ఉలిక్కి పడి,  చేతులతో కళ్లు తుడుచుకుంటూ , నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.

ఎలా రాయాలో తెలియని ఉదయ్, చివరికి తన జ్ఞాపకాలను ఒక కథలా రాసుకున్నాడు.  ఆ కధ ముగించిన రోజు అర్థరాత్రి ,  ఉదయ్ అకస్మాత్తుగా నిద్ర లోంచి ఉలిక్కి పడి లేచాడు.  ముఖమంతా చిరు చెమటలతో ఉన్నాడు. ఆ క్షణంలో ఉదయ్ కి మనసు లో ఎవరో స్త్రీ గొంతు తో, “ ఇంత కాలం  నీ లోనే,  నీతో నే , నీలా నే ఉన్నాను,  అని వినిపించాయి,  ఉదయ్ ఇన్నాళ్లు ఆ  మాటలు  కోసమే ఎదురు చూస్తున్నాడు. ఉదయ్ నిట్టూర్పు గా, రెండు అరచేతుల తో కళ్లు తుడుచుకుంటూ , నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటూ, మనసులో అనుకున్నాడు,  “ ప్రమీల తో తనకున్న మానసిక అనుబంధం ఆరోజు తో  తీరిపోయింది అని” .


YSR 28 March Sunday 2021 10:00 am.



55. పితృ కార్యం .... కాకి

పితృ కార్యం... కాకి
 ( మూలం : స్వీయ అనుభవం నా మిత్రులతో పంచుకున్నది.)



• అశోక్... కాకి గురించి చాలా మంచి అంశాన్ని పోస్ట్ చేసినందుకు థాంక్యూ .

• ఈ సందర్భంలో తప్పనిసరిగా నాకు ఒక విషయాన్ని కాకి గురించి  పంచుకోవాలని అనిపిస్తుంది .  చదువుకున్న మన లాంటి వాళ్ళము కొన్ని  విషయాలను మూఢనమ్మకాలు గా అనుకుంటూ ఉంటాం . ఒకటి మనం మేధావులం అని అనుకోని ఒప్పుకోకపోవడం  కావచ్చు , లేదా ఆ విషయాన్ని అర్థం చేసుకునే జ్ఞానం మనకు లేకపోవచ్చు . ఈ విషయంలో నాకు కళ్ళు తెరిపించే సంఘటన ఒకటి జరిగింది . 2019 Oct 3 వ తేదీన మా నాన్నగారు కాలం చేశారు. మూడవ రోజున చిన్న కార్యక్రమం చేస్తూ ఆయన అస్థికలు గోదావరి లో నిమజ్జనం చేసిన తర్వాత , ఆయనకు ఇష్టమైన ఆహార పదార్థాలు గోదావరి ఒడ్డున ఒక  ఆకు లో పెట్టాము.

• నేను  ఈ process అంతా  చూస్తున్నా..మనసులో మాత్రం ఇదంతా నిజమేనా ఆయన కాకి రూపం  లో తిరిగి ఆయనకి నచ్చనవి తింటారా ? అని చాలా logical గా , ఒక రకంగా తర్కంగా , ఇది ఎంతవరకు నిజమో చూద్దాం అని ఆలోచిస్తున్నాను.  ఆ ఆకులో,  ఆమ్లెట్, చారు అన్నం, స్వీట్, పప్పు, చికెన్, బిరియాని, పెరుగు, మటన్, పెట్టి ఒక 20 అడుగుల దూరంలో నిలబడ్డాం.

• మా నాన్నగారికి ఆమ్లెట్, చారు అన్నం, స్వీట్  బాగా ఇష్టం . ఇంట్లో కూడా భోజనం పెడితే ముందు ఆమ్లెట్ తినేవారు. ఆ సమయంలో అక్కడ నిలబడి నేను మనసులో ,భగవంతుడు ఉండటం నిజమే అయితే , ఇదంతా నిజం అయితే, వచ్చిన కాకి మొదట ఆమ్లెట్, తరువాత చారు అన్నం, తర్వాత స్వీట్ తినాలి , అని నేను మనసులో అనుకుంటూ పక్కనే ఉన్న మా మావయ్య తో, ఈ విషయం చెప్పి,  ఎంతవరకు ఇవన్నీ నిజమో చూద్దాం అన్నాను.

• అప్పటి వరకు ఒక్క కాకి కూడా లేని ఆ చోటులో , ఐదు నిమిషాల తర్వాత   సుమారుగా  ముప్పై కాకులు వరకు గుంపుగా వచ్చాయి.  ...చాలా ఆశ్చర్యం అనిపించింది . ఆ ఆకు కి మూడు అడుగుల దూరంలో కాకులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. నాలో ఒక తెలియని టెన్షన్ మొదలైంది  . ఒళ్లంతా వేడెక్కుతున్నట్టు , కాళ్లు వణుకుతున్నట్లు అనిపిస్తుంది .....ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ కాకుల  గుంపులోంచి , ఒకే ఒక కాకి ముందుకు వచ్చి ఆకు వైపు తీక్షణంగా ఒక నిమిషం చూసి ,  ఆమ్లెట్  తిన్నాది., తర్వాత అదే కాకీ చారు అన్నం , ఆ తర్వాత స్వీట్ తిని వెనక్కి వెళ్ళి పోయింది. ...ఆ తరువాత మిగిలిన కాకులన్ని  గుంపుగా ఆకు పై వాలి అన్ని పదార్థాలు తిన్నాయి . నాకు కళ్ళలోంచి నీళ్ళు తిరిగాయి . ఇదంతా ఈరోజు యాదృచ్చికంగా జరిగింది అని అనుకోవటానికి ఎంత మాత్రం వీలు లేదు . ఏదైనా మనకి కొన్ని స్వయంగా అనుభవాలు జరిగితేనే కొన్ని నమ్ముతాం  .

• మనం భగవంతుడిని విశ్వసించినా, ప్రార్థన చేస్తూ ఉన్నా మనలో ఉన్న అంధత్వం ఏదో ఒక మూల ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది . కానీ అదే భగవంతుడు మన వైపు ఒక్కసారి చూడడం మొదలు పెడితే మనలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటాయి . అందుకు చేయవలసినది ఒకటే శరీరము వేరు, ఆత్మ వేరు అని తెలుసుకోగలిగే జ్ఞాన స్థితి కలిగి ఉండటం .


YSR 8 May 21  3 30 pm

Wednesday, May 19, 2021

54. మనిషి కి దుఃఖం యోగమా... శాపమా

మనిషికి దుఃఖం యోగమా.... శాపమా



• పదిలం   పదిలం 
  మనసు  పదిలం ... మాట పదిలం.
• మెండైన  మనుషులకి
  నిండైన మనసు   కలిగిన వారెందరో.

• మనసు   మదన పడితే  
  మనిషివి  కాలేవు.
• మనిషివి   కాలేనపుడు   
  నిశి తోనే ,  నిశి లోనే (చీకటి)   జీవన పయనం.

• నిశిలో    నీ .. వు ...
  ఎంత  అందంగా   ఉంటావో   తెలుసా ...
• నిశి లో   కనిపించేవి   
  నీ ... లో ... చీకటి  కోణాలు.

☀️☀️☀️☀️☀️

• ఏ ... ఏం ... పాపం  చేసిందని 
  దుఃఖాన్ని   అసహ్యించుకుంటావు.

• బాహ్య  సమాజానికి 
  నిన్ను  పరిచయం చేసింది  నీ జన్మము అయితే ...

• నిన్ను   నీకు  పరిచయం   చేసేది  
  నీ  లోని   దుఃఖమే .
  అది   ఏనాడైనా  గమనించావా.

• నీ  లోని   సంతోషం  
  నిన్ను  ఊర్ధ్వం లోని   స్థాయి  స్థానాన్ని
  (external higher status,  position)     
  సమాజంలోని   నలుగురికీ   చూపిస్తే ...

• నీ లోని    దుఃఖం  
  నీ అంతర్ముఖ   పాతాళంలోని
  (Internal in depth personality)   
  కేంద్ర  బిందు స్థానం   నీకు చూపిస్తుంది.

☀️☀️☀️☀️☀️

• రెండు నేత్రాలతో   చూడడమే   
  బ్రతుకు  కాదు , 
  జీవితం   అంతకన్నా  కాదు .
  నీ పుట్టుకతో   మూసుకుపోయిన  
  మనోనేత్రం తో   (త్రినేత్రం)  సాధన  చేసి చూడు.
  నువ్వు ఏమిటో ... 
  నీ చుట్టూ ఉన్న వలయాలు ,
  ఏమిటో  స్పష్టంగా  కనిపిస్తాయి.

• అనుభవించు ,  అనుభవించు ,  
  తనివితీరా   అనుభవించు , 
  నీ లోని   దుఃఖాన్ని .
  దుఃఖం లోని   ధ్రృడత్వాన్ని   స్పృశిస్తే ,
  నీ అంత ధీరుడు ,  
  వీరుడు  ఉండడు ,   ఈ విశ్వంలో.

• కలవర  పడినంత   మాత్రాన 
  నీ కంటిలోని  వెలుగు   ఏమీ   కనుమరుగై పోదు.

• నీ  ఆలోచనలే    అలలైనపుడు ,
  కలలే   నీ జీవితం  మైనపుడు  ,
  చొరబడే   కడలి లా ...
  నీ కంటూ ఒక పౌర్ణమి ,    
  అమావాస్య   చీకట్లను   చీల్చుకుంటూ 
  దివ్యమైన   వెన్నెలతో   వస్తుంది.

☀️☀️☀️☀️☀️

• చెయ్   దుఃఖంతో   స్నేహం  చెయ్ ,
  దుఃఖాన్ని   ప్రేమించు ,
  నీ లో   జ్ఞాన జ్యోతిని   వెలిగిస్తుంది.
  కానీ,  దుఃఖానికి  మాత్రం  బానిసవి   కావద్దు.

• దుఃఖం  నీ లోని  శక్తిని   హరించడానికి  రాలేదు. 
  అది  నీ లో శక్తిని  సమన్వయం   చేయడానికి
  వచ్చింది,   నిశితంగా  గమనించి  చూడు. 

• సంతోషం ,  దుఃఖం   రెండు  ఒకటే .
  కానీ  అది గమనించ  లేకపోవడమే 
  నీ లోని "మాయ".

• ఆ  నీలకంఠు డే   
  గరళాన్ని   కంఠంలో  దాచుకుని ,
  దుఃఖాన్ని   దిగమింగి,  
  మౌన ముద్ర తో   లయ కారకుడయ్యాడు.
  ఏ  ఇది   నీకు  ఆదర్శం  కాదా .


యడ్ల శ్రీనివాసరావు  15 May 2021.



Tuesday, May 18, 2021

53. నా కోసం...ఓ మనసు

                   నా కోసం...ఓ మనసు



• సముద్రంలా గంభీరంగా ఉంటావు ...బాధలన్నీ నీలోనే దాచుకుంటావు.
• సెలయేరులా  స్వచ్ఛంగా చలాకీగా నీ స్నేహందిస్తావు.
• పర్వతంలా ఉన్నతమైనది నీ వ్యక్తిత్వం….
• ఆకాశంలా నిర్మలమైనది నీ మనసు …..
• ఏ ఉరుములు మెరుపులు నిను తాకలేవు.
• ఎడారిలో పూసిన మంచు పుష్పం నువ్వు….
• వేడిమి నువ్వు భరిస్తూ చల్లదనాన్ని మాకు పంచి ఇస్తావు.
• మంచి గంధానికి చల్లగాలి తోడైనట్టుంటుంది నీ స్నేహపరిమళం.
• ఎన్నో రంగులు... మరెన్నో సుగంధాలతో పూసింది నీ కవితా వనం ...అది అలసిన  మా మనసులకు పన్నీటి జల్లు.
• నీ కవితా గుచ్చం లో  , ఇది ఒక గడ్డిపువ్వు అనుకో....   


May 19 21

Friday, May 14, 2021

52. వ్యక్తిత్వం

వ్యక్తిత్వం




• మాట మంచిదైతే మర్యాద నిస్తుంది .
• మర్యాద సక్రమమైనదైతే గౌరవం తెస్తుంది.
• గౌరవం నిండుగా ఉంటే వ్యక్తిత్వం ఉన్నతమవుతుంది.
• ఉన్నత వ్యక్తిత్వం సత్ప్రవర్తనకు మాత్రమే సాధ్యం.
• సత్ప్రవర్తనకు మూలం వినయం, సహనం.
• వినయానికి, సహనానికి బీజం పరిమళమైన ఆలోచనలు.
• ఈ పారిజాతపు లక్షణాలన్నీ పరిమళమైన ఆలోచనాపరులందరి సొంతం.


YSR 14 May 21 8:30 pm.

Sunday, May 9, 2021

51. అమ్మకు వందనాలు

 🙏అమ్మకు వందనాలు 🙏

• అమ్మలను కన్న మా అమ్మ  ఆనంద రూపిణీ.
• అండ పిండ బ్రహ్మాండమ్ముల  క్షేత్ర స్వరూపిణి.
• సృష్టి కి మూలం నీవు.
• ప్రతిసృష్టి  కి మూలం నీవు.
• ప్రకృతిలోని  పులకరింతలు  నీ పరవశానికి  ప్రతిరూపాలు ... జగత్ జననీ.
• నిర్జీవాని కి   జీవం పోసే వసుధరణివి.
• జీవాన్ని నిర్జీవం చేసే  శత్రు సంహారి కాళికవి.
• శక్తికి బీజమైన భైరవి ...నీ దేహమంత  ఈ విశ్వంలో  అణువంత  భాగ్యులం  తల్లీ.
• క్షేత్రమున కానరాని దేదమ్మ నీ కంటికి.
• ప్రేమను పంచే పరమేశ్వరి .....కరుణ చూపే కాదంబరి ...లాలించే నీలాంబరి.
• నీ ఆగ్రహానికి  భీతిల్లే  నీ బిడ్డలం ....నీ అనుగ్రహం తోనే ఊపిరి పోసుకున్నాం.
• మూర్ఖత్వంతో ముదిరిన మా మస్తిష్కాలకి నీ మననం తో మురిపించు తల్లీ... ఓ జ్ఞాన ధాత్రి .
🙏🙏
క్షేత్రము = సమస్తము, విశ్వము, శరీరము.
మస్తిష్కము = మెదడు
మననం = జపించుట, ధ్యానం, పదే పదే తలచుట.

YSR 09 May 21 3:00 pm.

Monday, May 3, 2021

50. శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా

 
శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా ఆయనకు అంకితమిస్తూ 


* మీ ఆలోచనలే ఆయుధాలుగా 
* జీవం లేని జీవికి మీ మాటలే శ్వాస యై
* మీ ఊపిరే ఊరికి మేలుకొలుపై
* మీ మనసే సమాజానికి దిక్సూచి యై
* రాతి బాటంత దృఢత్వం మీ భావం 
* పర్వతాలను కరిగించే మీ పదముల పదును
* కత్తి  కాని  కలం మీ  ఆవేశం 
* రాజసాలకే  గోరీలు కట్టే మీ రాతలు 
* మా గుండెల్లో శాశ్వతమైన స్థానం మీ ప్రస్థానం
* ఉదయించే సూర్యుడు కూడా ఎదురు చూసేవాడు మీ రాతల కోసం
* ఆడంబర మే అసూయపడే  మీ నిరాడంబర మే నిలువెత్తు రూపం మీ వ్యక్తిత్వం . అది ఈ సృష్టికే తలమానికం . 
 🙏🙏🙏
YSR 1 May 21 3:30 pm

49. గుర్తింపు - మనిషికి వరమా - శాపమా - యోగమా - రోగమా


• 😎గుర్తింపు (Recognition) - మనిషికి వరమా -  శాపమా - యోగమా - రోగమా.🤔

• అంతర్ముఖ ప్రయాణం లో స్పష్టం గా కనిపించిన ఒక అంశం. 

• Recognition గుర్తింపు మనిషి జీవితంలో పుట్టిన దగ్గర నుండి పోయేవరకు చాలా ప్రాముఖ్యత తో కూడిన అంశం . అదే విధంగా మనిషి మానసిక  స్థితిని, జీవితాన్ని నిర్ణయించి శాసించే అంశం .


• బాల్యంలో ఊహ తెలిసిన నాటి నుండి  గుర్తింపు కోసం తపన ప్రారంభమవుతుంది . అది ఇంట్లో , బంధుమిత్రులలో  , బడిలో ఇలా ప్రతి చోటా చదువులో ఆటల్లో, గురువులతో , మాట తీరుతో , ప్రవర్తనతో, పోటీ వాతావరణంలో,  వేషధారణతో ఇలా ఎన్నో రకాల మార్గాలలో, తనను తాను బహిర్గతం చేసుకుని ఒక చిన్న గుర్తింపు కోసం మనిషి మనసు ఆరాటపడుతుంది .  జీవిత గమనంలో ప్రతి ఒక్కరికి ఇది చాలా సహజమైన ప్రక్రియ . ఈ  "గుర్తింపు" అనే అంశం  ద్వారా మనిషి మానసిక సంతోషం పొందుతూ ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటాడు. అదేవిధంగా  అభివృద్ధి చెందాలని ఆశిస్తాడు.

🌿🌿🌿🌿🌿

• బాల్యం నుండి కౌమరం లోకి వచ్చినపుడు "గుర్తింపు" తన దిశను మార్చుకుంటూ  , అందంగా ఆకర్షణీయంగా కనబడాలని,  వ్యతిరేక లింగ జాతి పట్ల  పరస్పర "గుర్తింపు" కోసం పరి విధాల ఆలోచనలు చేస్తూ , బహిరంగంగా చెప్పకపోయినా అంతర్గతంగా మనసు నిరంతరం  ఏదోఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది .


• యవ్వనంలో జీవిత స్థిరత్వం  పొందిన తర్వాత మనిషి తన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలని, ధనం బాగా సంపాదించాలని, కుటుంబ అవసరాలను తీర్చుకోవాలని, అనేక కోరికలతో కూడిన ప్రయాణం అలసి సొలసి ఉంటుంది.  మధ్య వయసుకు వచ్చిన మనిషికి జీవితంలో చాలా త్యాగాలు కూడా ఉంటాయి. అయినా మనిషి మనసు నిరంతరం కోరుకునేది "గుర్తింపు" ద్వారా మానసిక వికాసం.  మధ్య యవ్వనంలో , స్థిరపడిన తర్వాత పేరుప్రఖ్యాతులు సంపాదించాలి, సమాజం కోసం ఏదైనా చెయ్యాలి, తోటి వారికి సహాయ పడాలి, నాయకుడిగా ఎదగాలి  , నేనేంటో అందరికీ తెలియాలి ఇలా,  మనిషి తన సహజమైన అవసరాలకు,   తన సాధారణ  జీవితానికి భిన్నంగా  ఆలోచిస్తూ "గుర్తింపు" కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. కాస్త నిశితంగా ఆలోచిస్తే ఈ "గుర్తింపు" అనేది మానవ జీవితంలో ఒక భాగం మాత్రమే.  కొందరికి తాము కోరుకున్న  గుర్తింపు లభించినందుకు దానిని సఫలీకృతం చేసుకొంటారు. అంతవరకు బానే ఉంటుంది  . మరికొందరికీ ఈ "గుర్తింపు" అనేది ఒక వ్యసనంగా చేసుకొని దానికి బానిసలు గా తయారవుతారు. అందుకోసం తమ వ్యక్తిత్వాన్ని వదులుకొని, అడ్డదారులు తొక్కుతూ, ఒక మానసిక రోగి లా తయారై, చివరికి తమ ఉనికిని కోల్పోతారు. ఉదాహరణకు అప్పటివరకు ఎంతో విలాసవంతమైన  లేదా ప్రాముఖ్యత తో కూడిన జీవితం గడిపిన రాజకీయ నాయకులు, ప్రముఖులు, తమకున్న అధికారం, హోదా, సదుపాయాలు అన్నీ కోల్పోయాక , సర్వం కోల్పోయినట్లు అవమానభారంతో ఆత్మన్యూనతతో  జీవితాన్ని వదిలేసుకుంటారు. 

🌿🌿🌿🌿🌿

• మరికొంతమంది పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది జీవితంలో ఏనాడు ఎంత ప్రయత్నించినా ఏ గుర్తింపు దొరకక అడ్డదారులు తొక్కుతూ , సంతోషంగా ఉన్న సాటి వారిని హింసిస్తూ , వారికి లభించని ప్రాముఖ్యత ఇతరులకు లభిస్తుందని అసూయతో దిగజారుతూ , లేనిపోని అభాండాలు, నిందలు  వేస్తూ మానసిక రోగుల  (psycho) వలే ప్రవర్తిస్తూ ఉంటారు . వీరి జీవితం అంతా నీతిమాలిన తనం తోనే ఉంటుంది.  ఇదే రకమైన విధానంలో అంటే వ్యక్తిగత  గుర్తింపు లభించని కొంతమంది తమ సాటి బంధుమిత్రులలో, తమ పొరుగు వారి లో  తమను తాము చూసుకుంటూ సంతృప్తి పొందుతూ ఒక మంచి ఆకర్షణ శక్తితో సంతోషంతో ఉంటూ ఉంటారు .

💦💦💦💦💦

• ఒక్క మాట చెప్పాలంటే ఈ "గుర్తింపు" అనేది ఒక  "మాయ".

• మనిషి చేసే కర్మలో భాగంగా ప్రకృతి మరియు భగవంతుడు సహజసిద్ధమైన గుర్తింపు ఇస్తూ ఉంటాడు. ఆ గుర్తింపు మంచి అయినా లేక చెడు అయినా కావచ్చు . "గుర్తింపు"  లభించడం అనేది కర్మ ఫలితం లో భాగమే కానీ...."గుర్తింపు"  కోసమే కర్మలు చేయడం అనేది దౌర్భాగ్యం, అమానుషం.  గుర్తింపు కోసమే  మనిషి జీవించడం అనేది ఒక మానసిక చపలత్వం.

☀️☀️☀️☀️☀️

• నీటి బుడగ లాంటి మనిషి జీవితానికి,  ఎన్ని అలంకారాలు చేసినా,  ఎన్ని మెరుగులు దిద్దినా, ఎన్ని రంగులు వేసినా  అది తాత్కాలికమే. 

• మనిషికి నిజమైన గుర్తింపు అనేది  "ఆ మనిషి జీవించి లేక పోయిన తరువాత కూడా  ఎంతోమంది  మనసుల్లో  నివసిస్తూంటారు" . అది అసలు సిసలైన శాశ్వతమైన " గుర్తింపు ".  ఇది ప్రయత్నిస్తే దొరికేది కాదు . భగవంతుడు నిన్ను కారణభూతుడు గా నిర్ణయించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఇచ్చేది , తిరిగి తీసుకునేది భగవంతుడే.

• మనిషి ఔనన్నా, కాదన్నా అంతర్మథనం లో ప్రతీ దశలో గుర్తింపు కోసం సకలవిధాల యత్నాలు చేస్తునే ఉంటాడు. ఎందుకంటే అది మానసికమైన లక్షణం. ఏనాడైతే ఈ లక్షణానికి  అతీతవుతాడో , వారే చరిత్రలో చిరకాలం నిలిచి పోతారు. ఉదాహరణకు శ్రీ శ్రీ గారు, శ్రీ పొట్టిశ్రీరాములు గారు, శ్రీ కందుకూరి గారు ఇలా ఎంతోమంది మేధావులు నేటికి  ఎంతో మంది మనసుల్లో బ్రతికే ఉన్నారు. వీరు చేసిన కర్మలు(కార్యక్రమాలు) ఫలితం ఆశిస్తూ చేసినవి కావు. 

• అందుకే ఓ మనిషి నీ గురించి నువ్వు తెలుసుకో, ఈ సృష్టిలో  నీ స్థానం,  బాధ్యత ఏమిటో గుర్తించుకో,  అదే నీకు భగవంతుడు ఇచ్చిన చెదరని చెరగని  "గుర్తింపు".

YSR 3 May 2021 11:30 am.



490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...