తొలి పల్లవో దయం.
(ఈ డ్రాయింగ్ మిత్రుడు , వానపల్లి శ్రీనివాస్ వేసినది)
ఎన్నాళ్ళనుంచో మనసులో ఉన్న అనుభూతులను, జ్ఞాపకాలను కథ గా రాయాలని అనుకున్నాడు ఉదయ్. కానీ కథ ఎలా రాయాలో తెలియక చివరికి ఒక ప్రయత్నం చేశాడు. అది ఈ ఉదయ్ కథ .
" అందరికీ కన్నీళ్ళు ఉప్పగా అనిపిస్తాయి, మరి నాకెందుకో రుచిగా అనిపిస్తున్నాయి. ఓహో కన్నీళ్లు నా ఊహ తెలిసిన నాటి నుంచి ఊపిరిలో భాగం కదా అందుకే నేమో " అని మనసులో అనుకుంటూ వేసవి కాలం సాయంత్రం 6 గంటలకు మేడమీద ఆరుబయట మంచం మీద జారపడి ఆకాశం లోని మేఘాల వైపు నిట్టూర్పుగా చూస్తున్నాడు ఉదయ్. 41 సంవత్సరాల ఉదయ్ సున్నిత మనస్కుడు. ఉదయ్ కి హైదరాబాదులో మంచి ఉద్యోగం భార్య, పిల్లలు ఉన్నారు. జీవితంలో ఏ లోటు లేనట్లుగా పెరిగాడు , ఇది తనతో ఉన్న బంధుమిత్రులకు పైకి తనపై కనిపించే అభిప్రాయం. కానీ ఉదయ్ మాత్రం తన వారి అందరి అవసరాలు తీర్చడం కోసం, వారిని సంతోషపెట్టడం కోసం ,తన జీవితాన్ని మంచి వేదికగా చేసుకొని నటిస్తూ ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాడు.కానీ అంతరంగంలో ఎప్పుడు ఒంటరి గానే ఉంటాడు. ఎందుకంటే బాల్యం నుంచి తనకు నచ్చినవి, ఇష్టమైనవి తనకు దక్కినట్లే ఉండేవి, కానీ ఏవీ దక్కేవి కావు, ఇది ప్రతి అంశం లోను చదువు, అవసరాలు, వ్యక్తుల సాన్నిహిత్యం, ఇష్టమైన ఆహారం, బంధాలు ఈవిధంగా అన్ని అంశాల్లో రాజీ పడుతూ జీవించడం అలావాటు అయిపోయింది. తనకు తన చుట్టూ ఎన్నో ఉన్నా, అవేమీ తనకు సంబంధించినవిగా మాత్రం అనుకోడు. ఎందుకంటే తన బాల్యం, పెరిగిన విధానం, చెరగని మధురమైన జ్ఞాపకాలు, చిన్న చిన్న సంతోషాలు ఉదయ్ కి అత్యంత విలువైనవి. అలా ఆకాశం లోని చంద్రుడుని ఒకవైపు , గుంపులుగుంపులుగా ఎగురుతున్న కొంగలు, పక్షులు సమూహాలను మరో వైపు చూస్తూ కంటి తెరల వెనుక జారుతున్న నీటితో తన మధురమైన బాల్యంలోకి జారుకున్నాడు ఉదయ్ .
రావు గారు, ఈశ్వరమ్మ గార్ల ప్రథమ సంతానం ఉదయ్. 1980 ల్లో, రావు గారు సూర్యాపేట దగ్గరలో రామాపురం అనే ఊరిలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఆయన క్రమశిక్షణ కి మారుపేరు. ప్రతి చిన్న విషయానికి ఉదయ్ మీద కోపగించుకునేవారు. తండ్రి గాంభీర్యానికి భయపడి వెక్కివెక్కి ఏడుస్తూ ఈశ్వరమ్మ గారిని పట్టుకొని పక్కనే పడుకునేవాడు ఉదయ్. " నేనేం చేశాను అమ్మ, తెలియకపోతే నాకు నెమ్మది గా చెప్పొచ్చు కదమ్మా " అని అమాయకంగా తల్లితో ఆస్తమాను అంటూ ఉండేవాడు. ఆ వయసు నుంచే తన అందమైన కళ్లు వెనుక జారని కన్నీటి చెమ్మ నిరంతరం ఉండేది. తండ్రి మీద ఉన్న భయంతో ఏ పని చెయ్యాలో, ఏది చెయ్యకూడదో తికమక పడుతూ సందిగ్ధంలో లోనే ఉండేవాడు . ఆ వయసులో "భయం" అనేది తనకు ప్రాణ మిత్రుడు అని అర్థమయ్యింది ఉదయ్ కి.
రామాపురం లో ఎలిమెంటరీ స్కూల్ నుండి , సూర్యాపేట గవర్నమెంట్ హై స్కూల్ కి వచ్చాడు ఉదయ్ . ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యాపేట గవర్నమెంట్ హై స్కూల్ కి ,అందరూ రిక్షాలు, సైకిళ్లు పై వెళ్ళేవారు ఆ రోజుల్లో . ఉదయ్ కూడా రిక్షా లోనే వెళ్లేవాడు . తరగతి గదిలో అబ్బాయిలు, అమ్మాయిలు కిక్కిరిసి ఉండే వారు. సరిగ్గా ఆరవ తరగతి నుండే ఉదయ్ కి అంతుచిక్కని అర్థంకాని ఆశ నిరాశల జీవితం మొదలైంది.
రిక్షాలో ఉదయ్ కి తన తరగతి వారు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి పదిమంది వరకు ఉండేవారు. స్కూల్ లోని క్రమశిక్షణ నిబంధనల కారణంగా అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకునేవారు కాదు. ఉదయ్ కి మాత్రం స్కూల్ రంగుల ప్రపంచం లా ఉండేది . అబ్బాయిల అందరితో స్నేహంగా ఉండే వాడు. బాగా చదివేవాడు. స్కూల్లో ఉన్నంతసేపు హుషారుగా ఉండేవాడు .కానీ సాయంత్రం ఇంటికి చేరగానే మాటలు తడబడేవి తండ్రి పట్ల ఉన్న విపరీతమైన భయంతో, ఇంట్లో ఏం మాట్లాడాలో తెలియక నిశ్శబ్దంతో స్నేహం చేసేవాడు. ఇది ఉదయ్ మనసుకి అసలు నచ్చేది కాదు. తన ఆలోచనలను సంతోషంగా పంచుకునే అవకాశం తండ్రి తో ఏనాడు ఉండేది కాదు. నెలలో మొదటి ఆదివారం వస్తే రెండు రూపాయలు ఇచ్చి సినిమాకి పంపేవారు, ఆ ఒక్క రోజు కోసం ఎంతో ఆనందంగా ఎదురు చూసేవాడు ఉదయ్.
ఇలా కొన్ని నెలలు గడిచాయి. హైదరాబాదు నుండి ఒకరోజు ఒక మార్వాడి కుటుంబం వ్యాపారం చేయటానికి రామాపురం వచ్చారు. వారికి ఒక అందమైన అమ్మాయి ఉండేది ప్రమీల. ప్రమీల కూడా ఆరవ తరగతి ఉదయ్ క్లాస్ లోనే చేరింది. ప్రమీల అందానికి మిగతా పిల్లలందరూ ఆశ్చర్యంగా వింతగా చూసేవారు . ఉదయ్ కి కూడా ప్రమీలను చూసిన ప్రతిసారి అర్థంకాని ఒక వింత అనుభూతి పొందేవాడు. భయంతో కూడిన సంతోషంతో చూసేవాడు ప్రమీలని. రెండు రోజుల తర్వాత ఉదయ్ వాళ్ళ వీధి చివర ప్రమీలను ఇంటివద్ద ఉండటం చూశాడు . ఒకే వీధిలో ఇద్దరి ఇళ్లు ఉండటం ఉదయ్ కి చాలా సంతోషం కలిగింది . తన ఆనందానికి అర్థం తెలిసేది కాదు గాని, ప్రమీల ఇంటి ముందు నుంచి వెళుతూ, వస్తూ ప్రమీల కనపడుతుందేమో అని అప్రయత్నంగా తొంగి చూసేవాడు. మరొక వారం రోజుల తర్వాత ప్రమీల ఉదయ్ రిక్షా లోనే చేరింది . ప్రమీలను చూస్తే నిర్మలంగా ఉన్న ఉదయ్ ముఖంలో ఏదో తెలియని ఆనందం, అలజడి ఉండేది . చూస్తూనే ఆరోతరగతి గడచిపోయింది .
ఏడవ తరగతి లోకి వచ్చాక కామన్ పబ్లిక్ పరీక్షలు చాలా జాగ్రత్తగా చదివి పాస్ అవ్వాలి అని టీచర్స్ ప్రతిసారి భయ పెట్టేవారు . ఇక ఇంట్లో అయితే సరేసరి. రావు గారు ఉదయ్ ని రామాపురం లో ఒక టీచర్ వద్ద సాయంత్రం వేళ ట్యూషన్ లో చేర్పించారు. ట్యూషన్, ప్రతి రోజు రాత్రి ఏడున్నర గంటల వరకు ఉండేది . ఉదయ్ అయిష్టంగానే మొదటిరోజు ట్యూషన్ కి వెళ్ళాడు , కానీ ట్యూషన్ లో అడుగు పెట్టేసరికి , అక్కడ ఉన్న ప్రమీలను చూసి ఆనందానికి అవధులు లేవు. ట్యూషన్ అయిపోయాక రోజు ప్రమీలను వాళ్ళ నాన్నగారు దగ్గరుండి తీసుకెళ్లే వారు. ఎందుకంటే ఆ రోజుల్లో వీధి దీపాలు సరిగ్గా వెలిగేవి కాదు. రాత్రుళ్లు వీధిలో కుక్కలు మొరుగుతూ ఉండేవి. ఉదయ్ మాత్రం ఒంటరిగా నే ఇంటికి వెళ్ళేవాడు. ఉదయ్ కి రోజులు బయట సంతోషంగా, ఇంట్లో భయం భయంగా గడుస్తున్నాయి తండ్రి పట్ల భయం వలన. ట్యూషన్ అలవాటు పడిన తర్వాత , ఒకరోజు హోంవర్క్ విషయమై , మొదటిసారిగా అవసరమైన ఉదయ్, ప్రమీలతో మాట్లాడాడు . ఉదయ్ కి తన బాల్య జీవితంలో అదొక అద్భుతమైన రోజు ఎందుకంటే తొలిసారిగా ఒక అమ్మాయి తో మాట్లాడటం కొత్త అనుభూతి. ట్యూషన్ లోని పరిచయంతో ప్రమీలకి రోజురోజుకీ దగ్గరయ్యాడు. ఉదయ్ , ప్రమీలకు చాక్లెట్లు ఇవ్వడం , పుస్తకాలు ఇచ్చి పుచ్చుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉండేవి. మనసులో తండ్రి వలన ఉన్న భయానికి , ప్రమీలతో స్నేహం ధైర్యం గా అనిపించేది ఉదయ్ కి.
కొద్ది రోజుల తర్వాత ప్రమీలను వాళ్ళ నాన్నగారికి వీలు కుదరక ట్యూషన్ నుంచి తీసుకు రావడం మానేశారు. ఒకే వీధిలో ఇళ్లు ఉండటం వలన , అప్పటికే ఉన్న పరిచయం వలన ప్రమీల ఉదయ్ తో కలిసి అడుగు దూరంలో పక్కపక్కనే నడుచుకుంటూ , స్కూలు విషయాలు మాట్లాడుకుంటూ ఇంటికి చేరే వారు . ప్రమీల ఈ విషయంలో ఎలా ఉన్నా కానీ, ఉదయం మాత్రం ప్రమీల తో ఉన్నంతసేపు అర్థంకాని విపరీతమైన సంతోషంతోఉండేవాడు . ఇంతలో ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షలు తేదీలు ఖరారయ్యాయి . పట్టుదలగా అందరూ చదివే వారు. ట్యూషన్ ఇంకొక గంట సమయం రాత్రి 8:30 వరకు పొడిగించారు .
ఒకరోజు ట్యూషన్ లో ఉండగా సాయంత్రం విపరీతమైన వర్షం వచ్చింది . కరెంటు పోయింది . తర్వాత ఎప్పుడో 7:30 గంటలకి వర్షం తగ్గింది. కరెంటు వచ్చింది . ప్రమీల ఉదయ్ ట్యూషన్ నుండి ఇంటికి బయలుదేరారు . వీధుల్లో వర్షపు నీటి గుంతలు, , మట్టి రోడ్లు బురదగా ఉన్నాయి . కొన్ని చోట్ల వీథి దీపాలు సరిగా వెలగడంలేదు. ఆరోజు వరకు అడుగు దూరంలో పక్కపక్కనే నడచిన ప్రమీల ఉదయ్ లు , ఆ రోజు మాత్రం వీధి లో ఉన్న వాతావరణం వల్ల పక్కపక్కగా తగులుకుంటు కొంచెం భయం గా నడుస్తున్నారు. ఒకవైపు వీధి కుక్కలు మొరుగుతున్నాయి . ఆ వాతావరణం ప్రమీలకు మాత్రం చాలా భయంగా ఉంది. ఉదయ్ కి భయం వేసినా బయటపడకుండా నెమ్మదిగా మాట్లాడుతూ నడుస్తున్నాడు. ఒక వీధి మలుపు తిరిగి, రెండవ వీధిలో కి రాగానే నీటి గుంతల్లోని రెండు కప్పలు అమాంతంగా బెక్ బెక్ మనే గట్టి శబ్దంతో ఎగిరేటప్పటికీ , ఆకస్మికంగా ప్రమీల తన చేతిలో పుస్తకాల సంచి కిందపడేసి బిగ్గరగా అరుస్తూ ఉదయ్ చేతిని, భుజాన్ని గట్టిగా పట్టుకుంది. ఊహించని ఆ పరిణామానికి, ప్రమీల శరీరం, చేతి స్పర్శ ఉదయ్ కి తగిలేటప్పటికి ,ఉదయ్ షాక్ అయ్యాడు . నెమ్మదిగా ఇంటికి వచ్చేసారు. ప్రమీల చేతి స్పర్శ తన మానసుపై చెరగని ముద్ర వేసింది . ఉదయ్ కి ఆ రోజు రాత్రి నిద్ర లేదు , ఆ రాత్రే కాదు ఆ సంఘటన తలచుకున్న నేటికి ఏ రాత్రి నిద్ర లేదు.
ఏడవ తరగతి పరీక్షలు అయిపోయాయి . స్కూలుకు సెలవులు ఇచ్చారు. అందరూ వేసవి సెలవులకు తాతగారి ఊరికి వెళ్ళి నా , ఉదయ్ మాత్రం రామాపురం లో నే ఉండిపోయాడు. వేసవి సెలవుల్లో ఉదయ్, ప్రమీల ఇంటి ముందు నుంచి వెళ్తూ తోంగి చూసేవాడు ప్రమీల కనిపిస్తుందేమో అని. కాని ఏనాడు ఉదయ్ కి ప్రమీల కనిపించలేదు. తిరిగి స్కూలు ప్రారంభించారు. అందరూ 8 తరగతిలోకి వచ్చారు . అందరూ ఆనందం గా కొత్త తరగతి లోకి హుషారుగా వచ్చారు, ఒక్క ప్రమీల మినహా. మొదటి రోజు ఉదయ్ కి ఏదో తెలియని నిరాశ. ప్రమీల కుటుంబం మాత్రం ఏదో కారణం వలన తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారని తెలిసింది ఉదయ్ కి . ఉదయ్ కి తన దైర్యం కోల్పోయినట్లు అనిపించింది. యాంత్రికంగా తల్లిదండ్రుల కోసం చదువుతూ ఉన్నా, ప్రతిరోజు ప్రమీలను గుర్తుకు తెచ్చుకుంటూ, నిస్సహాయంగా, ఏదో కోల్పోయినట్లు ఉండేవాడు ఉదయ్. ఆ తర్వాత ఏనాడు ప్రమీల తన కంటికి కనబడలేదు . కానీ ప్రమీలపై ఉన్న ఇష్టం , ఆశ , జ్ఞాపకాలు తనని సంతోషంగా ఉండేలా చేసేది.. ఉదయ్ కు, ప్రమీల అందం, చూపు , నవ్వు గుర్తు చేసుకుంటూ తనతోనే ఉన్నట్లు భావిస్తూ, పైకి కనిపించని బాధతో ఆనందంగా ఉండేవాడు . ఉదయ్ ద్రృష్టి లో ప్రమీల అంటే తన జీవిత ధైర్యం. కానీ బాల్యంలో ఆ వయసులో ఉదయ్ కి తెలియదు అదే తన జీవితానికి తొలి, చివర మానసికమైన "ప్రేమ" అని .
ఇంతలో ఏవండోయ్ టైం 8 అయ్యింది భోజనానికి రండి. అని మెట్లపై నుండి ఉదయ్ భార్య గట్టిగా పిలిచింది . ఉదయ్ ఒక్కసారిగా ఉలిక్కి పడి, చేతులతో కళ్లు తుడుచుకుంటూ , నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.
ఎలా రాయాలో తెలియని ఉదయ్, చివరికి తన జ్ఞాపకాలను ఒక కథలా రాసుకున్నాడు. ఆ కధ ముగించిన రోజు అర్థరాత్రి , ఉదయ్ అకస్మాత్తుగా నిద్ర లోంచి ఉలిక్కి పడి లేచాడు. ముఖమంతా చిరు చెమటలతో ఉన్నాడు. ఆ క్షణంలో ఉదయ్ కి మనసు లో ఎవరో స్త్రీ గొంతు తో, “ ఇంత కాలం నీ లోనే, నీతో నే , నీలా నే ఉన్నాను, అని వినిపించాయి, ఉదయ్ ఇన్నాళ్లు ఆ మాటలు కోసమే ఎదురు చూస్తున్నాడు. ఉదయ్ నిట్టూర్పు గా, రెండు అరచేతుల తో కళ్లు తుడుచుకుంటూ , నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటూ, మనసులో అనుకున్నాడు, “ ప్రమీల తో తనకున్న మానసిక అనుబంధం ఆరోజు తో తీరిపోయింది అని” .
YSR 28 March Sunday 2021 10:00 am.
No comments:
Post a Comment