ఎవరు తండ్రి ... ఎవరు కొడుకు.
• బాల్యం అంటే భయం . ఆ భయానికి ప్రతిరూపం నాన్న . నాన్నను చూడాలన్నా, మాట్లాడాలన్నా భయం.శిక్షణకు, క్రమశిక్షణకు నిలువెత్తు విగ్రహం నాన్న.ఎప్పుడు ఏ క్షణంలో ఎందుకు దెబ్బలు తినాల్సి వస్తుందో అని అనుక్షణం భయం.బాల్యమంతా దిన దిన గండం. నాన్న ఏరోజు ప్రేమగా మాట్లాడే వారు కాదు.ఇంటి నుండి పారిపోవాలని ఎన్నోసార్లు అనిపించేది కానీ ధైర్యం చాలేది కాదు.చదువులో ఎప్పుడూ మంచి మార్కులే వచ్చేవి , చెప్పిన మాట ప్రతిదీ వినేవాడిని అయినా ఎందుకు ..ఎందుకు కొడుతూ తిడుతూ ఉంటారు అనే ప్రశ్న ఎప్పుడూ వేధిస్తూనే ఉండేది.బహుశా నేనంటే అసహ్యం ఏమో అనుకునేవాడిని కానీ అర్ధరాత్రులు పక్కన పడుకుని నా పొట్ట మీద చెయ్యి వేసి నిమురుతూ ఉండేవారు ఆ స్పర్శకి కళ్ళల్లో చుక్కలు కారేవి.మరలా ఉదయానికి నాన్న గంభీరమైన మాటలకు కళ్ళల్లో చుక్కలు కారుతూ ఉండేది. నాకు ఆ వయసులో సంతోషం, ఆనందం అంటే కేవలం స్కూలు, స్నేహితులు మాత్రమే . అదేవిధంగా ఇష్టానికి ప్రతిరూపం అమ్మ. ఎందుకమ్మా నాన్న అస్తమానం నన్ను తిడుతూ ఉంటారు అని అమ్మ అని అడిగినా సమాధానం దొరికేది కాదు. నాన్న అంటే కేవలం అవసరాలు తీర్చే మనిషి అనిపించేది. పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. అవి చూసి నాన్న విడిచిన నిట్టూర్పు ఇప్పటికీ మర్చిపోలేను .
• కాలక్రమేణా వయసు పెరిగే కొద్దీ ఇంటికి దూరంగా ఉంటూ స్నేహితులతో స్వేచ్ఛను సంతోషాన్ని వెతుక్కునే వాడిని. కానీ నాన్న అంటే విపరీతమైన భయం వలన బయటకు చెప్పలేక , పంచుకోలేని భావాలు ఎల్లప్పుడూ మనసులో రోధిస్తూనే ఉండేవి.
• కానీ తరువాత కాలంలో నాన్న గురించి తను పెరిగిన వాతావరణం గురించి నానమ్మ చెప్పేది.నాన్నకు తన బాల్యంలో సరిగా తినడానికి తిండి కూడా ఉండేది కాదని, బట్టలు కూడా తాతయ్యవి సైజు చేయించుకుని వాడేవారట . రెండు సార్లు ఫెయిల్ అయినా కష్టపడి పియుసి చదువుకొని, గవర్నమెంట్ క్లర్క్ జాబు సంపాదించుకుని అటు తాతయ్య కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకునేవారట. అదే సమయంలో నాన్న తోటి వారిలో చాలా మంది రకరకాల విలాసాలకు బానిసలై యవ్వనంలోనే జీవితాన్ని చాలించిన వారు ఉన్నారంట. ఆ భయము ప్రభావం నాన్న మీద చాలా ఎక్కువగానే ఉండేదట. పిల్లలకి స్వేచ్ఛ ఇస్తే పాడై పోతారు , చెడు దార్లు పడతారు అనే భయం విపరీతంగా ఉండటం వల్ల, పైగా నేను ఒక్కగానొక్క డనే అవడంవల్ల ఏమైపోతానో అనే భయంతో నన్ను ఉంచవలసిన దానికంటే ఎక్కువ క్రమశిక్షణ, భయపెట్టి పెంచారని తెలిసింది.
• కానీ ఆయన పెంపకం వలన నాకు క్రమశిక్షణ, పద్ధతి ,ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలిసేది. కానీ ఒక వైపు బాల్యంలో చాలా కోల్పోయాను అనే బాధ వేధిస్తూనే ఉండేది . నాన్నకి 73 సంవత్సరాలు . 8 నెలల నుంచి పూర్తిగా ఆరోగ్యం క్షీణించి మంచానికే పరిమితం అయిపోయారు. అమ్మ ఆరోగ్యం కూడా కొంచెం పాడైంది.హైదరాబాద్ లో మంచి ఉద్యోగం వదులుకొనిఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన దగ్గర నుండి నాన్న సేవకే జీవితం పరిమితం అయిపోయింది. నాన్నకు తెలుస్తుంది రోజులు గడిచే కొద్దీ ఇంకా ఎంతో కాలం తను బ్రతకరని . నాన్న అమ్మతో తరచూ అంటూ ఉండేవారట వాడికి చిన్నప్పటినుండి అవసరాలు తీర్చేను కానీ వాడి మనసును అర్థం చేసుకోలేకపోయాను, నావల్ల చాలా సంతోషాలు దూరం చేసుకున్నాడు అయినా భరించేవాడు అనేవారంట .
• నాన్న మంచం మీద నుంచి లేవలేక పోయేవారు . కాళ్లు చేతులు కూడా కదపలేక పోయేవారు. నిత్యం నాన్న మంచం పక్కనే ఉండి పసిపిల్లవాడిలా మనసులో కొడుకులా చూసుకునేవాడిని. ఒకరోజు అంటే ఇంకా పదిహేను రోజుల్లో చనిపోతారని కొనేముందు నాన్న నన్ను తన పక్కన కూర్చోమన్నారు. అప్పటికే మాట చాలా వరకూ కోల్పోయారు . ఆయన పడుకుని నా వైపు తీక్షణంగా చూస్తున్నారు, ఆయన కళ్ళ నుండి విపరీతంగా నీరు ధారలుగా వస్తుంది. నా చేతి వేళ్ళను ఆయన నెమ్మదిగా స్పృశిస్తూ........ నన్ను క్షమించు నాన్న...... నువ్వు నాకు కొడువు కాదు ..తండ్రివి....అని ఏడుస్తూ.... నిన్ను చిన్నతనం నుండి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు అంటుంటే కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతూ నాకు వచ్చేసాయి. అప్పుడు నాన్న తో నేను ...లేదు నాన్న అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నువ్వే కరెక్ట్ నువ్వు ఏం చేసినా నా మంచికే చేసావు, నీ పెంపకం వలన ఎలా బ్రతకకూడదో...తెలిసింది అన్నాను . నాన్న వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ తనకు ఇష్టమైన భయాన్ని నా నుండి తీసుకెళ్లిపోయారు .ఈ విశ్వాన్ని చూడగల ధైర్యాన్ని, ఆలోచనలను ఇచ్చి వెళ్ళిపోయారు . ఇంకా ...ఇంకా.... ఇంకా....చెప్పాలంటే చేజారిన బాల్యాన్ని, సంతోషాలను ఆశీస్సులను ఇచ్చి వెళ్ళిపోయారు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నాతో ఉన్న మీరు మీతో ఉన్న నేను . మా నాన్న నాతో ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి.ఇప్పుడు చెప్పండి ఎవరు తండ్రి .........ఎవరు కొడుకు . ఒక నాడు తండ్రి కూడా కొడుకే .......ఈనాడు కొడుకు కూడా తండ్రే..
యడ్ల శ్రీనివాసరావు. 5 May 2020
No comments:
Post a Comment