Sunday, April 28, 2024

491. చిన్న పిల్లలు


చిన్న పిల్లలు



• మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనందం సంతోషం  బహుశా  ఇక ఏ వయసులోను  మనిషి కి లభించదేమో అనిపిస్తుంది.    ఆ వయసు పిల్లలకు తల్లి తండ్రి కుటుంబం చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది.  పసి వయసులో పిల్లల మానసిక స్థితికి ఏది దొరికితే అదే అద్బుతం, అదే ఆనందం. అందులో లోటు పాటులు ఎంచలేరు సరికదా, లభించిన వాటితో అమితమైన సంతోషం పొందుతూ ఉంటారు. వారి స్థితి లో ధనికులా ,  పేదలా అనే ఆలోచన కూడా మనసు లో ఉండదు. అంటే ముఖ్యం గా వారికి అవగాహన ఉండదు, తెలియదు.


• ఈ వయసు పిల్లలు  ప్రపంచంలో తమ చుట్టూ ఉన్న ప్రతీది చూస్తుంటారు గాని వారి మనసు లోకి ఏదీ కూడా సీరియస్ గా తీసుకోలేరు. ఒకవేళ ఆకలికి గాని, మరేదయినా విషయం లో బాధ కలిగితే, వెంటనే గట్టిగా ఏడుస్తారు. ఆ ఏడుపు లో అన్నీ మరిచి పోయి మాములుగా అయిపోతారు . చెప్పాలంటే ఈ వయసు పిల్లలకు కోపం, వచ్చినా కొన్ని నిమిషాలు, సెకన్లు మాత్రమే.


• ఇదంతా ఎందుకు అంటే పన్నెండు సంవత్సరాల లోపు వయసున్న వారిలో భావోద్వేగాలు శరీరం లో ఎక్కువ సమయం ఉండవు. అందుకే వారు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. అదే పన్నెండు సంవత్సరాల వయసు దాటి దాటడం తో ఉద్వేగాలు మనసు ని అంటి పెట్టుకోవడం, మనసు లో దాచుకోవడం వంటివి అనేక విధాలుగా మొదలవుతాయి.


• పెద్ధవారు ఎవరైనా సరే, ఆ వయసు పిల్లలతో కాసేపు గడిపితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, కొత్త శక్తి వచ్చినట్లు ఉంటుంది. ముఖ్యం గా , ఆ వయసు పిల్లల్లో అమాయకత్వం అందరిని ఆకర్షిస్తుంది. ఉదాహరణకు మనం ఒక మురికి వాడకి (slum area) లేదా ఒక చిన్న పల్లెటూరు కి వెళ్లినా, చిన్న పిల్లల్లు వీధుల్లో చిరిగిన బట్టల్లో ఉన్నా, మట్టిలో ఆడుతూ ఉన్నప్పుడు వాళ్లను కాసేపు చూస్తూ నిధానం గా గమనిస్తే , వీళ్లు భలే సంతోషం గా, ఏ చింత లేకుండా ఆడుకుంటున్నారు అని మనసు లో చాలా మంది అనుకున్న సందర్బాలు ఉంటాయి.  అదే విధంగా ఎవరైనా కొత్తగా ఆ పిల్లల వద్దకు వచ్చిన వారిని, ఆ పిల్లలు వింతగా నోరు తెరిచి చూస్తుండడం , ఒక మంచి అనుభూతి కలుగుతుంది.

• చెప్పాలంటే అటువంటి సమయంలో మనలో ఏమైనా విసుగు, కోపం ఉన్నా సహజంగా పోతాయి. ఇవన్నీ మనకి తెలియకుండానే జరుగుతాయి.


• 1 నుండి 5 లో తరగతి వరకు చదివే పిల్లల తో సమయం గడిపితే, మనలో ఉత్సాహం పెరుగుతుంది. అలసట తగ్గుతుంది. ముఖ్యం గా ఓర్పు, సంతోషం పెరుగుతాయి.


• దీనంతటికీ కారణం ఒకటే, చిన్న పిల్లల్లో కల్మషం లేకపోవడం. ఎవరి దగ్గరైతే కల్మషం ఉండదో వారి దగ్గర సహజ సిద్ధమైన సంతోషం లభిస్తుంది. ఎందుకంటే నెగెటినెస్ ఉండదు కాబట్టి.


• మనిషి సంతోషం, ఆనందం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు, కానీ గమనిస్తే మన చుట్టూ ఉండే చిన్న చిన్న విషయాలు,  చిన్న చిన్న  అంశాలలో చాలా లభిస్తుంది. కాకపోతే మనిషి మనసు కి కొంచెం నిధానం కావాలి అంతే.  మనసు లో ఆలోచనలు గందరగోళం సృష్టించ కూడదు అంటే, మనసు ని విశాలంగా ఉంచుకోవాలి.  


• మనుషులు వయసు పెరిగే కొద్దీ బాధ్యత లతో పరుగులు పెడుతూ, యవ్వనం వృద్ధాప్యం లో కి యాతనలతో, అనారోగ్యంతో  అడుగు పెడుతూ , తమ బాల్యాన్ని పూర్తిగా మరచిపోతారు.    ప్రతి మనిషి కూడా తమ 12 సంవత్సరాల వయసు కంటే తక్కువ  ఉన్న చిన్న తనం లో స్మృతులు, మాటలు, గడపిన ప్రదేశాలు, ఆ ఇల్లు వాతావరణం, అయిదవ తరగతి వరకు చదివిన బడి , తరచూ గాని,   వారంలో ఒకసారి గాని,  వీలైతే రోజూ పడుకునే సమయంలో   ఏకాంతంగా, ప్రశాంతంగా  గుర్తు చేసుకుంటే ముఖం పై చిరునవ్వు  తెలియకుండా నే వికసిస్తుంది. ఇది మరింత మంచి ఆరోగ్యం ఇస్తుంది. ప్రయత్నించి చూడండి.


• పెద్ధ అయ్యాక ఎవరు ఏం అవుతారో తెలియదు, ఎలా ఉంటారో  తెలియదు కానీ,  ప్రతీ మనిషి తన బాల్యం లో తానే ఒక హీరో.  ఆ వయసు లో   ఆర్థిక స్థితి గతులు ఎలా ఉన్నా సరే,  దొరికే మానసిక సంతోషం బహుశా జీవితంలో ఎప్పుడూ దొరకదేమో.  విచిత్రం ఏమిటంటే వాస్తవానికి బాల్యం లో దుర్భరమైన పరిస్థితులు ఉన్నా,  అంటే   అనాధ పిల్లలు అయినా, వీధి బాలలు అయినా సరే  మనసు లో వారు చాలా సంతోషంగా నే ఉంటారు.  ఎందుకంటే దుఃఖం, మరణం, బాధ వంటి భావోద్వేగాల విషయాలు శరీరానికి గాని,  మనసు కి గాని అంటుకోవు.


• నేటి కాలం లో,  జీవితంలో ఆలోచనలతో ముందుకు చూడడం వలన కలిగే గందరగోళం, టెన్షన్ ని తొలగించు  కోవాలంటే …. ప్రతిరోజూ కొంత సమయం తప్పని   సరిగా  వెనక్కి ముఖ్యం గా పసితనం ఛాయలు లోకి  ప్రయాణం చేయాలి.  ఆ జ్ఞాపకాలు మననం  చేసుకుంటే కొంత సంతోషం , ఇంకా ఎక్కువ గా ఆరోగ్యం లభిస్తుంది.

• నేటి జీవన విధానం,  పరిస్థితుల్లో ఇది ప్రతి ఒక్కరికీ ఇది  చాలా అవసరం.


• Love yourself …. Love your Childhood.


యడ్ల శ్రీనివాసరావు 28 Apr 2024 , 11:00 pm.


Thursday, April 25, 2024

490. జన గళం


జన గళం


• జనమెత్తిన   గళము లో

  ఈ పవనం    లేచే  లే.

• కదమేగిన    పోటు లో

  ఈ కదనం    సాగే  లే.


• గుప్పెడు   పిడికిలి   గుండేలే

  ఈ   ధైర్యం.

• ఒక్కడు    వేసిన    అడుగే లే

  ఈ   సైన్యం …

  జన సైన్యం  … జన సైన్యం.


• జనమెత్తిన    గళము లో

  ఈ పవనం    లేచే లే.

• కదమేగిన    పోటు లో

  ఈ కదనం    సాగే లే.


• భావం తోని    బ్రతికే వా డే

  ఈ  నాయకు డే.

• త్యాగం చేసి   తగ్గిన  వా డే

  ఈ  ఉత్తము డే.

• పాలన  కాదని   సేవను   చేసే వా డే

  ఈ   లక్ష్మణు డే.

• పాపుల  పాలిట   అస్త్రం  వేసే వా డే

  ఈ   ఫల్గును డే.


• కులము లేదు   …   మతము లేదు

  జాతి లేదు  …  వర్ణం లేదు

  ఉన్నదల్లా    ఒకటే  లే

  మానవత్వం ... మానవత్వం ... మానవత్వం.


• జనమెత్తిన   గళము లో

  ఈ పవనం     లేచే లే.           

• కదమేగిన     పోటు లో

  ఈ కదనం      సాగే లే.


• చీకటి లో    చిగురించిన  వా డే

  ఈ  సేవకుడే.

• పేదల కోసం    వెలుగై  నా డే

  ఈ   భాస్కరు డే.

• ఆశయ  సిద్ధి కి    జ్యోతై  నా డే

  ఈ  కర్షకు డే.

• జనం  కోసం    రక్షకు డై  నా డే

  ఈ  సైనికు డే.


• పంచ భూతాలలో   ఈ పవనం ...

  పావనం   చేస్తుంది    లోకం ... 

  అదే కళ్యాణం … కళ్యాణం … కళ్యాణం.



కదమేగిన = గుర్రపు పరుగు.


యడ్ల శ్రీనివాసరావు 25 Apr 2024 9:05 pm.


489. నేను ఉండలేను


నేను ఉండలేను


• నేను ఉండలేను

  నిను విడిచి    నేను  ఉండలేను.

  శివ

  నేను  ఉండలేను

  నిను విడిచి    నేను ఉండలేను.


• తలపు లో      కొలువైనాక

‌ తనువు   నిను   చేరుటకు

 సిద్ధమవుతున్నది.

• నీవే   తండ్రివని    తెలిసినాక 

  నేననాధను   కానని

  ఆత్మ ఆనంద    మవుతున్నది.


• నేను  ఉండలేను

  నిను విడిచి   నేను ఉండలేను.

  శివ

  నేను  ఉండలేను

  నిను విడిచి   నేను ఉండలేను.


• నిను మరచిన    సమయమంతా

  అంధకార    అయోమయం.

• తెల్లగున్న    కొంగలు  హంసలు

  ఒకేలా అనిపించాయి.

  అనుభవం తో    తెలిసింది ...

  అది నా లోని   మాయ అని.


• నిను కలసిన ఈ కాలమంతా

  అమరలోకపు    ఆనందం.

• మనసు లో    నిలిచావు

  ఎన్నో   సూక్ష్మాలను   చూపావు.

  అందుకే ….

  నీ  ఛత్రఛాయ లోని   ప్రేమ   సత్యం.

  అదే   నా శ్వాస కు   ఆధారం.


• నేను ఉండలేను

  నిను విడిచి   నేను ఉండలేను.

  శివ

  నేను   ఉండలేను

  నిను విడిచి    నేను ఉండలేను.


యడ్ల శ్రీనివాసరావు 24 Apr 2024 , 9:00 pm.


Monday, April 15, 2024

488. నా ప్రపంచం


నా ప్రపంచం


• నా దొక   ప్రపంచం

  అది   సోయగాల   సౌందర్యం.

• నా  మనసెరిగిన   ప్రపంచం

  మధువొలికిన     అనందం.


• అందాల   ఆరబోతలు

  ఆదమరచి   ఉంటాయి.

• పరవశించు  పరిమళాలు

  గుబాళిస్తూ   ఉంటాయి.


• నా దొక    ప్రపంచం

  అది  సోయగాల   సౌందర్యం.

• నా  మనసెరిగిన   ప్రపంచం

   మధువొలికిన    మాధుర్యం.


• కొండ   కోనలు

  కౌగిలిలో     కదలాడుతుంటాయి.

• కోటి    రాగాల

  కోయిలలు    పలకరిస్తుంటాయి.

• వాగు   వంకలు

  సొంపులతో    సేద  తీరుతుంటాయి.

• చల్లని    గాలులు    సంబరమై 

  తనువు ని   తడుతు … తడుతు … ఉంటాయి.


• నా దొక    ప్రపంచం

  అది  సోయగాల   సౌందర్యం.

• నా  మనసెరిగిన   ప్రపంచం

  మధువొలికిన    మాధుర్యం.


• ప్రకృతి   ఒడిలో    పయనం

  పంచభూతాల తో    పరిణయం.

• హరిత  వనంలో    శయనం

  శాంతి సౌఖ్యాల    సంయోగం.


• తరంగాల    మౌనం లో

  నా అంతరంగం   విహరిస్తుంది.

• కిరణాల     కాంతి లో

  నా  మనోనేత్రం    వికసిస్తుంది.


• నా దొక    ప్రపంచం

  అది   సోయగాల  సౌందర్యం.

• నా  మనసెరిగిన   ప్రపంచం

  మధువొలికిన    మాధుర్యం.


కదలాడు = చలించుట.


యడ్ల శ్రీనివాసరావు. 16 Apr 2024 , 12:05 AM.




Friday, April 12, 2024

487. దీపం - తేజం


దీపం - తేజం


• వెలుగుతుంది    వెలుగుతుంది

  దివ్యమైన    దీపం.

• నిండుతుంది      నిండుతుంది

  చైతన్యమైన   తేజం.


• ఆ  దీపం    పరమాత్మ

  ఆ  చైతన్యం     శక్తి.


• చమురు  వలే    ఆత్మ

  పరమాత్మ యను    ప్రమిద లో   ఒదిగింది.

• దహనం   అనే    సాధన తో 

  మోక్ష సిద్ధి ని    పొందింది.


• జ్ఞానమనే     వెలుగుతో

  మనసు    చీకటి    తొలగును.

• యోగమనే    శక్తి తో

  బుద్ధి    వికాసం    కలుగును.


• వెలుగుతుంది    వెలుగుతుంది

  దివ్యమైన    దీపం.

• నిండుతుంది      నిండుతుంది

  చైతన్యమైన   తేజం.


• ఆ  దీపం     పరమాత్మ

  ఆ  చైతన్యం     శక్తి.


• శ్రేష్ట కర్మలు     చేయాలంటే

  మాయకు  వశం   కారాదు.

• బుణాను బంధాలు   తీరాలంటే

  శివుని   స్మృతి లో నే    సాధ్యం.


• కర్మ భోగి  గా     కావాలంటే

  నిర్వికారి   గా    కావాలి.

• కర్మ యోగి  గా   కావాలంటే

  బురద  తామర గా   ఉండాలి.


• వెలుగుతుంది    వెలుగుతుంది

  దివ్యమైన    దీపం.

• నిండుతుంది    నిండుతుంది

  చైతన్యమైన   తేజం.


• శివుడు   ఉండేది    పరంధామము లో

   అవతరిస్తాడు   భూమి పై

   కలియుగ   అంత్యాన 

  

• మనసు తో    ప్రేమ గా  

  పిలిచిన   పలుకుతాడు.

  మీ  సేవ కై   వచ్చాను  అంటాడు.


• వెలుగుతుంది    వెలుగుతుంది

  దివ్యమైన     దీపం

• నిండుతుంది      నిండుతుంది

  చైతన్యమైన    తేజం.



కర్మ భోగి    =  శరీరానికి  ఏ అవస్థ వచ్చినా అనగా అనారోగ్యం.   ఆ సమయంలో    దుఃఖం, బాధ  మనసు కి  కలగకుండా ,  ఆత్మ స్థితి లో  ఉంటూ,   అంతిమ క్షణాల్లో   శివుని పై  ధ్యాసతో   శ్వాస  విడవడం.  ఈ స్థితి  నిర్వికారి అంటే,    మనసు  వికారాలకు  అతీతం గా అయినపుడు  సాధ్యం. 


కర్మ యోగి  =  భౌతిక ప్రపంచంలో  కర్మలు ఆచరిస్తూ,  మనసు లో    సన్యాసి తత్వం తో జీవించడం.  తామర పువ్వు  కలుషితమైన  నీటిలో  ఉంటూ, పరిశుభ్రం గా   ఉంటుంది, ఆ విధంగా ఉండడం కర్మ యోగం.


కర్మ భోగం,  కర్మ యోగం  జ్ఞాన యోగ సాధన తో సాధ్యం.


యడ్ల శ్రీనివాసరావు. 9 Apr 2024 , 9:00 pm.


Thursday, April 11, 2024

486. అనుభవం – అనుభూతి

 

అనుభవం – అనుభూతి


• ఒక బంధం    విడిచింది

  ఒక నయనం  తొలగింది.


• జత  లోని  తోడు

  నీడ గా  మిగిలింది.

• మది   లోని  గోడు

  కధ గా   నిలిచింది.


• ఒక బంధం   విడిచింది

  ఒక నయనం  తొలగింది.


• జీవం  లేని  దేహం

  మౌనమై   చెబుతుంది

  "నీతో    ఉన్నానని".

• ప్రాణం   లేని  కాయం

  కనులు తెరిచి   పిలుస్తోంది

  "నాతో  వస్తావా"   అని.


• గడిపిన   క్షణాలు

  నడిచిన   నడకలు

  రూపు  చెరగని   ఆనవాళ్లు.

• కలిగిన    ప్రేమలు

  విడవని  మనసులు

  ఆత్మ బంధాల   సంకెళ్లు.


• ఒక బంధం     విడిచింది

  ఒక నయనం   తొలగింది.


• హృదయం   ...

  ప్రేమ  కోసమని

  చేతులు   వదలకున్నాయి.

• మరణం   ...

  ప్రేమ కు    లేదని

  చూపులు    వీడకున్నాయి.


• ఒక బంధం      విడిచింది

  ఒక నయనం   తొలగింది.


• చిటికెన వేలి    బంధం

  చిగురు లో   రాలింది.

• జ్ఞాపకాల    నిశ్శబ్దం  

  నిర్వేద మై    నిలిచింది.

• ఒక బంధం       విడిచింది

  ఒక నయనం    తొలగింది.


❤️ 🌹

స్త్రీ పురుషులు మధ్య ఉన్న ప్రేమ బంధం ,  ప్రేమ కలిగి ఉన్నవారికి   భాగ్యమైన స్థితి.  ఈ బంధం అనేది పలు రూపాల్లో ఉంటుంది.   ప్రేమ బంధం వలన అనేక విధాలుగా ఒకరి పై మరొకరు ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. 

మానవ జన్మ కి మరణం సహజం. ఇరువురి లో ఎవరైనా ఒకరు లోకం విడిచినపుడు ఉన్న తోడు కాస్త నీడ లా మారిపోతుంది. ఆ నీడలో ఎన్నో స్మృతులు కనపడుతూ, వినపడుతూ ఉంటాయి. జీవితం కొందరికి తలక్రిందులుగా కనిపిస్తుంది. ప్రేమలో ఉన్న నిజం ఏంటి అనేది,  ఇద్దరిలో  ఒకరు శాశ్వతం గా దూరం అయినప్పుడు  మరింత తెలుస్తుంది.

మనుషులకి , ఈ లోకంలో ఏదీ,  ఎవరు శాశ్వతం కాదనే నిజం తెలిసినా, అంగీకరించ లేరు.  దానికి అతీతం గా జీవించలేరు. ఎందుకంటే ప్రేమ, మమకారం అటువంటివి. 


 ప్రేరణ :

కొన్ని సార్లు  భౌతిక  శరీరానికి  ఎటువంటి  అనుభవం లేకున్నా ,   మనసు  అనుభూతి   ధరించినపుడు  ప్రతీ  స్థితి  సూక్ష్మం లో  తరించబడి ,  మానసికంగా  ఒక అనుభవాన్ని ఆపాదన  చేసుకుంటుంది .  ఇవి  కాలచక్రం లో  జరిగిపోయినవి  లేదా  జరగబోయేవి కావచ్చు.   లేదా ఎక్కడైనా చూసినటు వంటివి  మస్తిష్కం లో  ఉండిపోయినవి  కావచ్చు. ఇవి కేవలం  దృష్టి  భావనలు.  అవే అనుభవం లేని అనుభూతులు. 


యడ్ల శ్రీనివాసరావు  6 Apr 2024 ,  1:00 AM.







Wednesday, April 10, 2024

485. ఓ వయ్యారి

 

ఓ వయ్యారి



• ఓ   వయ్యారి   వయ్యారి

  వంగపండు   చిన్నారి

• పరువాల   పరికిణీ తో

  పైరు గట్టు నెగిరే   పొన్నారి.


• ఓ  వయ్యారి   వయ్యారి

  వంగపండు   చిన్నారి. 


• జడగంటల    జాజి మల్లె

  కస్సు మనే     కొండ మల్లె

  కోడె వయసు    కాడ మల్లె

  తైతక్క లాడే    తీగ మల్లె


• తూరీగ     నడుము తో

  తుర్రు మనే    లేడిపిల్ల.

  బరువెక్కిన    బుగ్గ లతో

  సిగ్గు లొలుకు   సీమపిల్ల.


• ఓ   వయ్యారి  వయ్యారి

  వంగపండు    చిన్నారి


• పంట  పంపు   బోదెకాడ

  జలకమాడే    కొర్రమీన.

  పట్టుకుంటే    జారుతావు 

  పైటకొంగు    విసురుతావు .


• గడ్డివాము    ఆటలలో

  గోల చేసే      గయ్యాళి.

• బొడ్డు కింద   చీర దోపి

  చిందు వేసే    బొమ్మాళి.


• ఓ   వయ్యారి   వయ్యారి

  వంగపండు   చిన్నారి.

• పరువాల    పరికిణీ తో

  పైరు గట్టు  నెగిరే   పొన్నారి.


యడ్ల శ్రీనివాసరావు  4 Apr 2024 8:00 PM


Tuesday, April 9, 2024

484. సిగలు వగలు

 

సిగలు  వగలు


• సిగలు     వగలు

  హొయలు   రగులు.

  సిగలు      వగలు

  హొయలు   రగులు.


• సంపంగి    తలపు తో    

  మొదలు

  సిరి మల్లె    వలపు    సెగలు.

• చామంతి   తనువు తో   

  తగులు

  విరజాజి    మధువు  మిగులు.


• సిగలు     వగలు

  హొయలు   రగులు.

  సిగలు      వగలు

  హొయలు   రగులు


• సరాగాల     సయ్యాట లో

  ప్రతి ధ్వనులు    పెనుగులాడగ ...

  శృతిలయల     శృంగారంతో

  పెనవేసుకుంది     ఆవేశం.


• ఆలింగిన     కేళి లో

  ఆవేదనలు    ఆదమరువగా  ...

  బాహువుల    బంధిఖాన లో

  స్రవియించెను    రసరాజం.


• సిగలు     వగలు

  హొయలు   రగులు.

  సిగలు      వగలు

  హొయలు   రగులు.


• పుప్పొడి     నివేదనం తో

  సరిగమలు   ఆలపించగా  ...

  చిరు స్వేధపు     జల్లులతో

  మదనం     వర్షించెను.


• కామనలు     రక్తి లో

  జ్వాలనల    హిమమవ్వగా ...

  భావనలు     ముక్తి తో

  తీరానికి     చేరుతాయి. 


• సిగలు      వగలు

  హొయలు   రగులు.

  సిగలు     వగలు

  హొయలు    రగులు.



తగులు =  తాకు, సంబంధం.

మధువు = తేనే , మకరందం.

రసరాజం = సిద్ధధాతువు, సిద్ధరసము, అమృతం.

పుప్పొడి = పుష్పము నందలి పరాగము 

మదనం = కామసుఖము,  ఆమని


యడ్ల శ్రీనివాసరావు  3 Apr 2024, 9:00 pm.


Monday, April 8, 2024

483. ఆమని


ని



• ఆగమేఘాల తో    వచ్చింది   ఆమని.

  కోకిల రాగాలు     పలికింది    వినమని.


హావభావాలతో    రాలాయి

  ఆకులు

  కొత్త  చిగురు    కోసం.

నింగి లో    ఎగిరాయి

  హంసలు

  సరికొత్త  లోకం   కోసం .


మంచు తెరలు  

  తుడిచింది  ...   ఈ  కాలం.

  రంగులతో   చిందులేసింది   నా మనసు.

పూల  పరికిణీలు   

  తొడిగింది    ...   ఈ వసంతం.

  హంగులతో   గెంతులేసింది  నా  వయసు.


• ఆగమేఘాల తో   వచ్చింది   ఆమని.

  కోకిల రాగాలు     పలికింది   వినమని.


పైరు గాలి    పలకరింపు తో

  పసితనం    పొంగింది.

కోడెకత్తె     చిలకరింపు తో

  ఈడుతనం    చిందింది.


• షడ్రుచుల   కలయిక  లో   

  భవ బంధాలు   నిండాయి.

రుచులకు     ఆహార్యం గా 

  భావోద్వేగాలు   నిలిచాయి.


• ఆగమేఘాల తో    వచ్చింది    ఆమని.

  కోకిల రాగాలు      పలికింది    వినమని.

• ప్రకృతి లో     పెనవేసుకుంది    ఉగాది.

  దాసుడి   రాతతో    నేడు   మేల్కొంది.


కోడెకత్తె  = పడుచు యువతి.


యడ్ల శ్రీనివాసరావు .  2 Apr 2024 9:30 pm 


Monday, April 1, 2024

482. కలియుగ ఈశ్వరుడు

 

కలియుగ ఈశ్వరుడు


• శ్రీ వెంకటేశ       శ్రీ  శ్రీనివాస

  సప్త  గిరుల  వాస

  అఖండ  తేజో  విలాస.


• మూడు  నామాల  తోడ

  ముల్లోకాలనేలు    వాడ ‌.

• శయ్య తో    శమనము న

  జగమేలు   వాడా.


• సిరుల    సింగారుడా 

  శ్రీ లక్ష్మి    నాధుడా 

• చిద్విలాసం తో    చింతకులను

  తన్మయం   చేయు  వాడా‌.


• శ్రీ  వెంకటేశ    శ్రీ  శ్రీనివాస

  సప్త గిరుల   వాస

  అఖండ   తేజో విలాస.


• భూదేవి   భారము   క్షమమని  

  శ్రీదేవి      గారము    భాగ్యమని 

  చాటిన   

  సంసార    సాగరుడా .


• అభయ   హస్తము  తోని

  ఆనందమిచ్ఛు  ఆపద్బాంధవుడా.

• కల్యాణ     శోభ తో    

  శుభములనిచ్చు   కలియుగ   ఈశ్వరుడా.


• శ్రీ   వెంకటేశ    శ్రీ శ్రీనివాస

  సప్త గిరుల  వాస 

  అఖండ  తేజో  విలాస.



శయ్య = నిదుర

శమనము = శాంతి పదము

చింతకులు = దుఖితులు

క్షమము  = సహనము

గారము = ప్రేమ


యడ్ల శ్రీనివాసరావు 1 Apr 2024 , 1:30 pm


491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...