Sunday, May 8, 2022

171. నవరసాలు

 

నవరసాలు


1. శృంగారం : (రతి భావం)

• సంయోగ వియోగాల సౌందర్య మదనం

• మది భావమున మకరంద ఔషధీ.

• రతి లోకమున రస రాజ కేళి.

• ప్రకృతి పురుషుల సృష్టి యాగానికి బీజ యోగం.

• (కలియుట ఎడబాటుగా ఉండుట అనేది అందమైన కలవరం….. మనసు ఆలోచనకి తియ్యని ఔషధం…మన్మధ లోకం లో రసవత్తరమైన రాచ క్రీడ….. స్త్రీ పురుషుల ఆవిర్భావ యజ్ఞానికి శృంగారం అదృష్ట విత్తనం.)


2. హాస్యం : (హస భావం)

• హసిత విహసిత అతిహసిత

• వికృతి వికార వైఫల్య వికలముతో జనియించిన సకలము.

• అనుకరణ తో ఉదయించిన చిద్విలాస ఆహ్లాదము.

• శారీరక మానసిక గతుల కు అతీతము భావము.

• అష్టరసాల విఫలతను సఫలదాత హాస్యరసం.

• ( చిన్నగా, ఎరుపెక్కేలా, ఆనందబాష్పాలతో ఉండే నవ్వు…..సహజంగా పుట్టదు, ప్రయత్నపూర్వకంగా, వికార ఆకారములు, అంగ వైకల్యలను అనుకరించడం ద్వారా హాస్యం పుట్టింది. ఒకరిని హవ భావాలు, మాటలు, వేషధారణ అనుకరించడం తో మనసులో రసోత్పత్తి జరిగి హాయిని ఇస్తుంది. అదే హాస్యరసం. నటుడు ఏ రసం లో విఫలం అయినా, చివరిగా ఏదో ఒక పిచ్చి చేష్టలతో వీక్షకులను నవ్విస్తాడు.)


3. కరుణ : (శోక భావం)

• నష్టశోక దుఃఖవిషాదాల అనుభవ జననం .

• కారుణ్యము సృష్టి హరిత జీవన మూలం.

• కరుణ లేని నాట కాఠిన్యం విరియ

• మనసు ఆర్థృతకు మాధుర్యం కారుణ్యం.

• (కోల్ఫొయిన బాధ ఏడుపు అనుభవం లో నుండి పుట్టేది కరుణ రసం. దయ వలనే ఈ సృష్టిలో ఏ జీవియైన సంతోషంగా జీవించ గలదు. కనికరం లేనిచో కౄరత్వం ఏలును. మనసులోని చెమ్మకు మధుర రూపం కరుణ రసం.)


4. రౌద్రం : (క్రోధ భావం)

• అసత్య అసూయ అభిద్రోహ అవమాన భావ జననం.

• సంగ్రామ రాక్షస ప్రకృతుల వికార స్థితి.

• ప్రకృతి వికృతిని చేసే బీజరూపం.

• రుద్రవతారే లయకార రూపే.

• (అవమానం, ద్రోహం, మోసగింపబడటం వలన పుట్టిన భావం. యుద్దము నందు కలిగే రాక్షసత్వం ఈ భావం. ఏదైనా వినాశనం చేయాలంటే ఈ రసోత్పత్తియే కారణం.  శివుడు రుద్రుని అవతారంలో నే ఈ సృష్టి ని లయం చేస్తాడు.)


5. వీరత్వం : (ఉత్సాహ భావం)

• ఆధిపత్యం తో ప్రకృతి భావ జననం.

• అంగబల పరాక్రమ శక్తి.

• ప్రతాప ప్రభావాల చతురంగ బలం.

• కలతచెందక విగ్రహ నిగ్రహల పట్టుదల వీరత్వం.

• (అజమాయిషీ అనే సహజసిద్ధమైన ధైర్య భావం.శారీరక ధృడత్వం , సైన్యం కలిగి ఉండడం వలన కలిగే రసోత్పత్తి. మనోధైర్యం, నిబ్బరం, పట్టుదల కలిగి ఉండటం.)


6. భయానకం : (భయ భావం)

• స్వభావ సిద్ధమైన కృత్రిమ భావం జననం

• అపరాధ హింస మోస ప్రవృత్తి ల పరిణామం

• మనోవిఫల కుంచిత భావహః

• (మోసగింపబడటం, హింసించి బడటం, అపరాధ తత్వం వలన కృత్రిమ తత్వం తో కలిగేది భయం. మనోధైర్యం విఫలమై కుంచితతత్వం కలుగుతుంది.)


7. భీభత్సం : (జుగుప్స భావం)

• కృత్రిమమైన విరక్తి భావ జననం.

• అయిష్టం , అసహ్యం , విసుగుల రసోత్పత్తి.

• నాశనం ప్రతిఫలం.

• ( రౌద్రం వలన వినాశనం, భీభత్సం వలన నాశనం . ఏహ్యభావం తో మొదలై యే చర్య.)


8. అధ్బుతము : (విస్మయ భావం)

• మనోవాంఛ పరిపూర్ణత భావ జననం.

• ఆధ్యాత్మిక , ఇంద్రజాల, అతీత దర్శన అభినయం.

• (మనసులో అనుకున్నది జరగడం, ఊహించని ఆశ్చర్యం జరగడం వలన ఆనందంతో జరిగే రసోత్పత్తి. దైవపరమైన నిదర్శనాలు, ఇంద్రజాలం, మహానుభావుల సందర్శన వలన కలిగే భావన)


9. శాంతము : (శమ భావం)

• తత్వజ్ఞాన వైరాగ్య ఆశయసిద్ధి జననం

• ఓరిమి, కామక్రోధాది రాహిత్యం.

• మోక్షమునకు తొలి దశ.

• ( వైరాగ్యం, తత్వజ్ఞానము , ఓర్పు వలన పుట్టిన భావము.)


యడ్ల శ్రీనివాసరావు 9 May 2022, 7:00 AM.




No comments:

Post a Comment

481. పరిమళ భాష

  పరిమళ భాష • ఏమిటో     ఈ  భాష   ఎద కే    తెలియని   ఆశ.   అనుభవం  లేని   యాస   సృష్టి   మూలానికి    శ్వాస. • అక్షరాలు   ఉండవు  కానీ   భావం ...