Monday, December 26, 2022

288. ఏమి మనుషులో

 

ఏమి మనుషులో



• ఏమి మనుషు లో …. ఏమి మనసు లో

  ఏమి బ్రతుకు లో


• ఓ మనిషి….

  నడిచే నాటకం లో   

  నీవొక నటుడి వని  తెలిసినా

  రక్తి కట్టించలేని    

  రంగస్థలం  నీ జీవితం.


• రంగులు పూసిన  

  హంగులు దిద్దిన  

  నీ నవ్వు ల   వెనుక  కనపడుతుంది   

  ఈర్ష్య ద్వేషాల  విషవలయం.


• ఇంత కన్నా 

  ఏమి సాధించావు    ఏమి శోధించావు


• సాక్షి వి  కాలేని  

  నీ మాటకు ….  నీ ఆలోచనకు

  మనస్సాక్షి లేని జీవితమేరా   

  నేటి  నీ  జన్మకు సాక్ష్యం.


• ప్రేమ  ల్లో మోసాలు      

  గుండె ల్లో భారాలు ...

  స్నేహ ల్లో మాయలు    

  మనుషులతో ఆటలు.


• ఇంత కన్నా 

  ఏమి సాధించావు   ఏమి శోధించావు.


• ఏమి మనుషు లో …. ఏమి మనసు లో

  ఏమి బ్రతుకు లో


• ఓ మనిషి

  జీవితమంటే   వ్యాపారం  కాదురా

  లెక్కలు వేయడానికి

  తేడా చేస్తే   మరు జన్మ కూడా 

  తారు  మారే  కదరా


• చెదలు నిండిన మెదడు తో 

  చదరంగం ఎన్నాళ్ళురా ...

  చిక్కి శల్యం  అయ్యాక  

  నీలో  మిగిలేది  చెత్తే  కదరా


• ఇంత కన్నా 

  ఏమి సాధించావు   ఏమి శోధించావు

 

• యేరు దాటాక   

  తెప్ప తగలెయ్యకు రా ...

  ఊరు దాటాక   నీ  దేహాన్ని 

  కాడు తరిమెస్తుంది రా


• మాయలో మునిగి తే 

  మర్మం ఎన్నటికి తెలిసేది రా

  మనసు  తెరిచి  చూడరా 

  శివుని బాట  తెలియును రా


• ధనం ఎంతున్నా  

  నీ దారిద్ర్యం తీరేనా

  భోగం ఎంతున్నా 

  నీ రోగం నయమయ్యేనా.


• ఏమి మనుషు లో …. ఏమి మనసు లో

  ఏమి బ్రతుకు లో


• ఓ మనిషి

  పూటకో  నాటకం లో  ఆరితేరావు

  నటకిరీటి  వై   చెలరేగుతున్నావు.


• సిగ్గు లేని   జీవితానికి   తెర ఎత్తావు

  హద్ధు లేని  అలవాట్లకు  బానిస అయ్యావు.


• ఏమి మనుషు లో …. ఏమి మనసు లో

   ఏమి బ్రతుకు లో


• ఓ మనిషి

  ఇంత కన్నా 

  ఏమి సాధించావు   ఏమి శోధించావు


యడ్ల శ్రీనివాసరావు 26 Dec 2022 7:30 pm







Friday, December 23, 2022

287. వికసిత

 

వికసిత



• వికసిత  వదన    కుసుమిత  సదన

  చెకుముకి  చెలియా

  ఇదే ఇదే   నా సుమాంజలి.


• ఊహలోన  కలిశావు

  కనుల  ఎదుట  మెరిశావు

  కలలకు  జీవం  పోశావు

  కాలంలో  కరిగి  పోయావు.


• నీ అందంతో   ఆకాశం లో   విహరించి

  ఆనందాన్ని   ఆస్వాదించా

• నీ మౌనం తో   మలయం లో  సంచరించి

  స్వేదం పట్టని   సేదను పొందా


• చెకుముకి చెలియా    జీవన సఖియా

  తవనత  ప్రణయా

  ఇదే ఇదే   నా హృదయాంజలి


• నీ కాలం లో    నే  లేనే  లేను

  కానీ   నే   ఏకాకి ని   కాను.

• నాతలపు లో   నిలిచి   ఉన్నావు

  ఊపిరి వై   కలిసి ఉన్నావు


• తవనత  ప్రణయా    నదమున నదియా

  సరసన  సరయా

  ఇదే ఇదే  నా ప్రేమాంజలి


• నీ కోసం వస్తాను   నీ తోనే ఉంటాను

  నీ లోనే  కరిగి  కనుమరుగై  “పోతాను”.


మలయము = ఉద్యానవనం, తోట

తవనత = క్లుప్త కాలం

ప్రణయ = ప్రేమ, పరిచయం, ప్రీతి.

నదము = ప్రవహించే జలపాతం

నదియా = ఆశ

సరయు = చల్లని గాలి


యడ్ల శ్రీనివాసరావు 23 Dec 2022 , 10:30 pm.




Wednesday, December 21, 2022

286. సాగర నెమలి

 

సాగర నెమలి


• ఈ  సాయం   సంధ్య సమయంలో

  పాడింది రవళి …  పలికింది మురళి

  సంతోషం తో   సాగింది  సాగర సరళి


• ఈ పౌర్ణమి  రాతిరి   సమయం లో

  పిలిచింది నళిని … చూసింది హరిణి

  ఆనందం తో ఆడింది   వనమున  నెమలి.


• తీరం లో   రేణువులు   గానానికి గమకాలై

  ఎగిరి ఎగిరి  నాట్యం  చేస్తున్నాయి.


• వెన్నెల్లో  మిణుగురులు   శ్రావ్యానికి  సంబరమై

  తహ తహ  మెరిసిపోతూ ఉన్నాయి.


• ఈ సాయం  సంధ్య  సమయంలో

  పాడింది   రవళి …  పలికింది  మురళి

  సంతోషం తో  సాగింది  సాగర సరళి


• ఈ పౌర్ణమి  రాతిరి  సమయం లో

  పిలిచింది  నళిని …  చూసింది హరిణి

  ఆనందం తో ఆడింది   వనమున నెమలి.


• ఉరకలు వేసే అలలు   ఉవ్వెత్తున  లేచాయి

  ఇసుక  రేణువులను  ముంచాయి.


• ఆకలి గొన్న  కీటకాలు   దాడులు చేసాయి

  మెరిసే  మిణుగురులను  మింగాయి.


• మురళి మూగ బోయింది …  రవళి రాగం ఆగింది


• నళిని కుంగి పోయింది …  హరిణి వెడలి పోయింది


• సాగుతోంది  సాగర  సరళి 

  అదోలా  అదేదో లా … అదేదో లా


• ఆడుతోంది  వనమున  నెమలి 

  అదోలా  అదేదో లా … అదేదో లా


• రవళి = శ్రావ్య శబ్దం

• మురళి = పిల్లనగ్రోవి

• నళిని = తామర పువ్వు

• హరిణి = ఆడ జింక, అప్సరస


యడ్ల శ్రీనివాసరావు 21 Dec 2022 9:00 pm







Monday, December 19, 2022

285. అల్లూరి సీతారామరాజు

 

అల్లూరి సీతారామరాజు


• ఓ మన్నెం  వీరుడా  

  మనుషుల్లో   కొలువై న   దేవుడా

  అడవి తల్లి  పుత్రుడా  

  స్వాతంత్ర్య  సమర  యోధుడా


• దొరలను తరిమావు   …  ధైర్యం గా   నిలిచావు

  ప్రాణాలను వదిలావు  …  ప్రకృతి లో  కలిశావు


• నేల లోని మన్ను వై   …  నీటి లోని  బిందు వై

  శూన్యం లో   శక్తి వై   …  గాలి లోని  ఊపిరి వై

  నిప్పు లోని వెలుగు వై    తాకుతు నే ఉన్నావు


• ఆంగ్లేయుల   ఆగడాలు  అడ్డుకున్న  వీరుడా

  అభాగ్యుల కు   అన్న వై    ఆదుకున్న  ధీరుడా


• ఓ మన్నెం వీరుడా   

  మనుషుల్లో  కొలువై న  దేవుడా

  అడవి తల్లి   పుత్రుడా   

  స్వాతంత్ర్య  సమర యోధుడా


• అలుపెరుగని పోరాటం లో 

  ఆయుధమై  మారావు.

  మాటల తూటాల తో 

  ఈటెల నే విసిరావు.

  విప్లవ జ్యోతి వై 

  విరోధుల వెన్ను లో నిలిచావు.

  సాహస వీరుడు వై 

  తిరుగుబాటు సంబరాలు చేశావు.


• కారణజన్ముడి వై 

  కర్మయోగి లా   బ్రతికావు.

  రుద్రాభిషేకం చేసి    

  శివతాండవ మే   ఆడావు.


• మూడు పదులు  నిండక  అమరుడైన

  వీరాధి వీరుడా … లోకానికి శూరుడా

  రాజుల చరిత లో   రారాజు వయ్యావు

  ఓ రామరాజు ...

  సీతా రామరాజు…. 

  అల్లూరి సీతారామరాజు

  వందనం … మీ కు పాదాభివందనం.🙏


( ఇటీవల K.D.PETA లో  శ్రీ అల్లూరి సీతారామరాజు గారి సమాధిని  దర్శించిన క్షణం నుంచి,  ప్రేరణతో.)


యడ్ల శ్రీనివాసరావు 19 Dec 2022 2:30 pm.








Saturday, December 17, 2022

284. స్వామి నీ రాజనం

 

స్వామి నీ రాజనం



• సస సస సస సస సస సరిగ సరిగ సరిగ

  ససరిగ రిగ రిగ సరిగ సరిగ ససరిగ

  సరి సరి రిగ రిగ సరిగ సరిగ సరిగ…..


• స్వర రాగ  నీ రాజనం …  స్వామి

  స్వర శేష   నీ భాషణం.

 

• శుభ కల్ప  నీ స్వరూపం …  స్వామి

  శుభ పీత   నీ భూషణం.


• సర్వ శ్రేష్టంబు   నీ విమలము … స్వామి

  సర్వ  శ్రీ కరం    నీ విరజమానం.


• సత్య  జ్ఞానతః   నీ గీర్వాణము … స్వామి

  సత్య  విజ్ఞత     నీ నిర్వాణము.


• సత్వ  శోభిత    నీ ప్రేమము … స్వామి

  సత్వ సంశుద్ది    నీ దివ్యము.



• స్వామి … స్వరం లోని ఈ రాగం నీకు హారతి (నీరాజనం)

  నిను పలుకు (భాషణం) స్వరాలు (స్వర) నీవు అనుగ్రహించి ఇచ్చిన అక్షింతలు (శేష).


• స్వామి … నీ రూపం తో  ఈ  మంగళకరమైన     (శుభ)  యజ్ఞ కర్మ లో సమర్థుడగుదును (కల్ప).

  పసుపు పచ్చని (పీత)  నీ అలంకరణము.  (భూషణం) శుభకరం.

  

• స్వామి … నీ నిర్మలత్వం తో (విమలము) సమస్తము (సర్వ) ఉత్తమము (శ్రేష్టంబు) అగును. ‌

  జగమంతయు (సర్వ) లక్ష్మి ప్రదమై (శ్రీకరం) నీ చే మిక్కిలి ప్రకాశమవుతుంది (విరాజమానము).


• స్వామి … దేవభాష అయిన సంస్కృతం  లో (గీర్వాణము) నీ రూపం యధార్థమైన  జ్ఞానం తో (సత్య జ్ఞానతః)  నింపావు.

  సత్యవంతమైన వివేకము (సత్య విజ్ఞత) , నీ సంపూర్ణ ముక్తి (నిర్వాణము) తో  కలుగును.


• స్వామి… ప్రేమ తో ప్రకాశించెడిది  (శోభిత) నీ స్వభావము (సత్వ)

  మనసులో ఎలాంటి కల్మషాలు లేకుండా ఉంచేది (సత్వ సంశుద్ది)   నీ దైవత్వం  (దివ్యము).


యడ్ల శ్రీనివాసరావు 17 Dec 2022 9:00 pm







Friday, December 9, 2022

283. బంధుత్వాలు – స్నేహాలు

 

బంధుత్వాలు – స్నేహాలు



• బంధుత్వాలు, బంధాలు, స్నేహాలు మనిషి ని  నిజం గా  చైతన్యపరిచే వే  నా ....మనిషి ప్రభావం  తోటి మనిషి పై ఎలా?  ఎందుకు?  ఉంటుంది....మనిషి తోటి మనిషి పై మానసికంగా ఎందుకు ఆధారపడతాడు?  మనుషులకు తమ తోటి వారితో ఉండే బంధం జీవిత కాలక్షేపం కోసమా లేక ఏదైనా purpose ఉండి ఉంటుందా?.


• ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి నుంచి ఏదో ఒక సందర్భం లో తరచుగా వినపడే మాట “ బంధువుల కంటే స్నేహితులు నయం. స్నేహితులు అన్నీ చక్కగా అర్దం చేసుకుంటారు, కానీ ఈ బంధువులు మాత్రం రాబందులు కంటే దారుణం” . ఈ మాట ప్రతీ మనిషి తన జీవిత కాలంలో ఎవరో ఒకరి దగ్గర నుండి వింటూనే ఉంటాడు.


• కానీ ఈ మాట సబబేనా ….. సరిగ్గా ఆలోచించి చూడండి మీకే తెలుస్తుంది. మనిషి అనాదిగా సమాజం లో తన మనగడ కి అనుగుణంగా కొన్ని బంధాలను రూప కల్పన చేసుకుని, తన అవసరాలను బట్టి ఈ బంధాలకు సామాజిక పరంగా హద్దులు, పరిమితులు, విధి విధానాలు కల్పించుకుని జీవిస్తున్నాడు. ఈ బంధాలే స్నేహాలు మరియు బంధుత్వాలు.


• మొదట గమనించ వలసినది బంధువులైనా స్నేహితులైనా రెండింటి లోను ఉండేది మనుషులే. మనిషి కి జీవితం, జీవనం అంటే బ్రతకడం. ఈ బ్రతకడం అనేది ఒక అవసరం తో కూడిన నిత్య చర్య. ఈ చర్యలో ఉండేవి అన్నీ మానవుని అవసరాలే. ఆ యా అవసరాలను బట్టి సాటి మనుషులతో బంధుత్వమైనా, స్నేహమైనా, శత్రుత్వమైనా ఇలా ఏదోకటి ఏర్పడుతుంది. దీని కోసం మనిషి పరి విధాలుగా రూపాలు ఎత్తుతూ ఉంటాడు.


• ఏ బంధం లో చూసినా ఉండేది మనుషులు, వారి స్వభావాలు, సంస్కారాలు, ప్రవర్తనలు …


• ఏ మనుషులైనా తమ అవసరాలను బట్టి ఒకరికొకరు దగ్గర అవుతారు. ఇది మానవ నైజం. (అవసరం అనే పదాన్ని తప్పు గా భావించవద్దు.) అవసరం అనేది మనిషి కి సహజం. మనుషుల మధ్య అవసరాలు తీరి పోయాక లేదా అవసరాలు ఇక తీరవు అనుకున్నప్పుడు సహజంగా దూరం అయిపోతుంటారు. ఇది బంధువు లలో, స్నేహితుల లో కూడా ఉంటుంది. మరి అలాంటప్పుడు బంధువుల కంటే స్నేహితులు నయం లేదా స్నేహితుల కంటే బంధువులు నయం అని ఎలా చెప్పగలం.


• బంధువులలో బంధుత్వం ఒకసారి ఏర్పడితే (కుటుంబ బంధాలు వావి వరసలు చాలా ఉంటాయి) జీవిత కాలం ఇష్టం ఉన్నా లేకపోయినా, మనుషుల మనస్తత్వాలు సరిపడక పోయినా సరే బంధం భరించాల్సి ఉంటుంది. ఛాయిస్ ఉండదు. ఇంకా బంధుత్వ బంధాలలో విలువలు తప్పనిసరిగా భరించి ఆచరించాల్సి వస్తుంది. నేటి కాలంలో కొన్ని సార్లు అది చాలా కష్టం గా అనిపిస్తుంది . అందుకనే బంధువుల లో ఉండే మనుషులతో లో లోపల ఇబ్బంది పడుతూ , బయట కు ప్రేమగా ఉంటారు. ఇంకా బంధుత్వ మనుషుల లో వయసు వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఒకరి భావాలు మరొకరికి అర్దం కావు. మనం ఎదుగుతుంటే బంధువులు ఓర్వలేక ఏడుస్తుంటారు అంటారు, అంటే ఈర్ష్య, అసూయ అనేవి బంధువులలో ఎక్కువ గా ఉంటాయి అనే ముద్ర బలపడి ఉంటుంది.


• అదే స్నేహం లో అయితే కావల్సినంత ఛాయిస్ ఉంటుంది. మనిషి తన మనస్తత్వానికి తగినట్లు, లేదా తన అవసరాలకు తగినట్లుగా మనుషులను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే అవసరాలు తీరి పోయినా లేదా  ఆశించిన  విధంంగా  స్నేహితులు ఉండకపోయినా    సునాయాసంగా , రాజకీయ నాయకులు పార్టీలు మార్చినట్లు మనుషులతో స్నేహం మార్చుకోవచ్చు. ఎందుకంటే స్నేహం లో ఉండేదే స్వేచ్ఛ, వెసులు బాటు. ఇక్కడ అంతగా విలువలు ఆచరించాల్సిన అవసరం లేదు. ఇది నేటి కాలంలో మనుషుల తీరు. కానీ స్నేహితుల లో ఈర్ష్య, అసూయ అనేవి ఉండవు అని నమ్మకం గా చెప్పగలమా? నమ్మక ద్రోహం తలపెట్టరు అని అనుకోగలమా? స్నేహితులు అనే బంధం లో ఉన్న వారు అందరూ సహయకారులు గా ఉంటూ సాటి వారికి మంచే చేస్తారు అని గట్టిగా చెప్పగలమా? స్నేహితులు ఏ ఎండకి ఆ గొడుగు పట్టకుండా ఉంటారని అనుకోగలమా?... స్నేహితులు ఒకరిని మరొకరు పూర్తిగా అర్దం చేసుకోగలరు అని చెప్పగలమా?.... ఆలోచించండి.


• మనిషి అమాయకత్వం ఏమిటంటే అటు బంధుత్వాల లో ను, ఇటు స్నేహితుల లో ను ఉండేది అందరూ  మనుషులే , మానవమాతృలే  అని  ఆలోచించ లేక పోవడం.  

ఒక మనిషి తోటి మనిషి తో కలిసి ఉండాలన్నా, విడిపోవాలన్నా ముఖ్యమైనది అది ఏ రకమైన బంధం, బంధుత్వం, స్నేహం అనేది కాదు. మనిషి కి మనిషి తో ఉండే ప్రవర్తన, స్వభావం, సంస్కారం, బుద్ది, ఆలోచన లలో ఉండే సమతుల్యత ముఖ్యం. ఈ గుణాలు సమపాళ్లలో ఇరువురి లో ఉంటే అది ఏ బంధం అయినా నిలబడుతుంది. ఇవి హెచ్చు తగ్గులు తో ఉన్నప్పుడు అంటే ఒకరికి కావలసింది మరొకరి దగ్గర లేనప్పుడు లేదా మరొకరు ఇవ్వనప్పుడు ఈ విడిపోవడం, దూరం, ఎడబాటు అనేది జరుగుతుంది.


• మనుషులు చాలా చాలా మంచి వారు…అలాగే అత్యంత ప్రమాదకారులు కూడా. అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి ఎప్పుడు, ఎలా మారుతూ ఉంటారో లేదా అవసరాలు మనుషుల ను ఎలా మార్చేస్తూ ఉంటాయో తెలియదు.


• మనుషుల తో ఏ బంధం అయినా సరే నిలబడాలి అంటే మనిషి లో ముందుగా ఉండవలసింది కొంతైనా స్వచ్చత (fairness) . ఈ స్వచ్ఛత లోపిస్తే ఎక్కడా ఎప్పుడూ ఎవరితో ఎక్కువ కాలం ఏ సంబంధమూ దీర్ఘ కాలం  కొనసాగదు .


• ఈ సృష్టిలో జీవన సత్యం ఏంటంటే,  ఏ  మానవ బంధం శాశ్వతం కాదు. ఎందుకంటే మనిషే శాశ్వతం కాదు కాబట్టి.   కానీ మనిషి తన బ్రతుకుతున్న జీవితానికి అర్థం ఉండాలంటే కష్టమైనా సుఖమైనా కనీసం కొన్ని మంచి విలువలకు కట్టుబడి ఉండాలి. మరొకరికి ఆదర్శం గా ఉండాలి. ఈ విలువలు అనేవి బయటకు కనిపించే లా,  అర్దం అయ్యేలా ప్రవర్తించనవసరం లేదుు .  అంతరంగం లో ఉంటే చాలు. చుట్టూ ఉన్న   ప్రకృతి కి  సహజంగా అర్దం అవుతుంది.


• మనుషులు ఏ బంధం లో నైనా సరే కొంతైనా తోటి సాటి మనుషులతో స్వచ్చత గా, నిజాయితీగా ఉండండి.  కానీ మితిమీరిన అనుబంధం పెట్టుకోకండి. ఎందుకంటే ఎవరు ఎవరితో ఎంతకాలం ఉంటారో తెలియదు. కానీ కలిసి ఉన్నంత కాలం ఒక మంచి పుస్తకం లా ఉండగలిగితే చాలు.  ఎందుకంటే అది ఏ బంధమైనా ఆ బంధం లోని జ్ఞాపకాలు మంచి శక్తి ని ఇస్తూ ఉంటాయి, ఆ తోటి మనుషులు మనతో లేకపోయినా…..


• ఓ మనిషి నువ్వేంటో నీకు తెలియాలంటే, ప్రతీ రోజూ నీ గురించి నువ్వు కొంత సమయం ఏకాంతంగా ఉండి విశ్లేషించుకో …. అప్పుడు నీ చుట్టూ ఉన్న వారు ఏంటో అర్దం అవుతారు.


• నేటి కాలంలో మానవ బంధాలు అర్థవంతం గా, సమర్థ వంతంగా ఉండాలనే ఆలోచనతో ఈ చిన్న రచన.


• జీవితం విలువైనది… ఎవరికి వారే ఉత్తములు ఆత్మశక్తి ని, ఆత్మవిశ్వాసాన్ని గ్రహిస్తే….🙏


ఓం నమఃశివాయ 🙏.


యడ్ల శ్రీనివాసరావు 9 Dec 2022 9:30 pm.





Tuesday, December 6, 2022

282. పలికితివి హర

 

పలికితివి హర


• పలికితివి   హర  …   పలికితివి శివ 

  పలికితివి   హర  …   పలికితివి శివ 


• నా పదము  పిలుపు కే     పలికితివి హర హర

  నే పలుకు    పదము కే     పలికితివి శివ శివ


• ఏమి  భాగ్యము     ఎంత  ధన్యము

  ఏమి  యోగము     ఎంత  భోగము


• నీ పాదము   చెంత   నిలిచిన  ఈ పదము

  నా అంతరంగమున  వెలసిన  ఆపాదమస్తకము.


• పలికితివి   హర   …    పలికితివి  శివ

  పలికితివి   హర   …    పలికితివి  శివ 


• నా పదము  పిలుపు కే    పలికితివి   హర హర

  నే పలుకు   పదము కే      పలికితివి    శివ శివ.


• చేయి తిరగని  చేతి లో    నీ నామము ఉంచావు

  మాట పలకని  నోటి లో     నీ పదము  ఉంచావు.


• నీ  వెక్కడున్నావు   …   నా తో నె   కదా

  నే  నెక్కడున్నాను   …   నీ  తో నె    కదా


• ఏమి  కృతం       ఎంత  సుకృతం

  ఏమి  చిత్తం        ఎంత  సంచితం


• పలికితివి   హర  …  పిలిచితివా   శివా

  పలికితివి   హర  …   పిలిచితివా  శివా


• శివ శివ   హర హర  …  శివ శివ   హర హర.

ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 6 Dec 2022 8:30 pm .




281. పల్లెటూరు


పల్లెటూరు 



• మా పల్లె లెగిసింది     మా ఇల్లు వెలిగింది

  మా పల్లె లెగిసింది     మా ఇల్లు వెలిగింది

  మా పల్లె అందాలు    మా మనసు చందాలు


• ఎర్రని బురద తో   వాన లో    జలకాలు ఆడింది.

  తెల్లని మంచు తో  చలి లో     గజ గజ వణికింది.


• పచ్చని పంటలను     ఎలుగెత్తి చాటింది.

  పైరు గాలులు తిమ్మెరల తో   ఊరంతా నిండింది.


• పల్లె పడుచు లంతా   ముతైదువు లై  పల్లెకొచ్ఛారు.

  అల్లుళ్లు హంగులతో  సంక్రాంతి  శోభను  తెచ్చారు.


• సన్నాయి మేళం తో    సరిగమలు పాడింది.

  గంగిరెద్దుల గజ్జెల తో   గ్రామమంతా దద్ధరిల్లింది.


• ఆవు గేదె లతో    పాడి    యేరు లై    పారింది

  గడ్డి మోపు లతో   పెరడు  గోకులం  అయింది.


• జడగంటల   జవరాళ్ల తో    కళకళ  ఆడింది

  రంగోలి ముగ్గుల తో   పల్లె పులకరించి  పోయింది.


• మా పల్లె లెగిసింది     మా ఇల్లు వెలిగింది

  మా పల్లె లెగిసింది     మా ఇల్లు వెలిగింది

  మా పల్లె అందాలు    మా మనసు చందాలు


• పిడక పొయ్యి తో పరమాన్నం పంచభక్ష్య మయింది.

  గుడిసె లో   మమతలు   మరుజన్మ కు నిలిచాయి.


• చెరువు  చెంత  చింత చెట్టు న   భూతం ఉండేది.

  బువ్వ తినని  రాత్రి బుడుంగున  ఎత్తుకుని పోయేది.


• వేప పుల్లల తో   చిగురులు   చిమ చిమ లాడేవి.

  మడత మంచం లో  నిదుర  మహా రంజుగ ఉండేది.


• మా పల్లె అందాలు మా మనసు చందాలు.


యడ్ల శ్రీనివాసరావు 6 Dec 2022, 6:30 pm






Sunday, December 4, 2022

280. ఉడుతా ఉడుతా ఊచ్

 

ఉడుతా ఉడుతా ఊచ్



• ఊసులు   చెప్పే   ఉడుతా

  ఊయలెక్కితే   ఎట్టా గే ...

  నువు ఊయలెక్కి    ఊగుతూ ఉంటే

  ఊరంతా ఉరుకులు   పరుగులు  పెడుతున్నా రే.


• చెట్టున   పండిన   జాంపండు

  చిట్టి  చిలక  కే    చెందును లే

• ఉట్టి లో   పెట్టిన   అరటి పండు

  పొట్టి పిచ్చుక  కే   చెందును లే.


• చెట్టు  కొమ్మ న  ఉంటావు

  చేయి  చాచిన  చెంతకు  రావు.

• కంటి  ముందు న  ఉంటావు

  రెప్ప పాటు లో   మాయం  అవుతావు.

  దాగుడు మూతలు  దండాకోర్.


• తుర్రు బుర్రు   పరుగుల   ఉడుతా

  తొందరెందుకే   నీకు

• జానడంత  ఉంటావు

  జా .. రి ...... జా .. రి ….. పోతావు


• నీ  గూడు   ఎక్కడని   వెతికే ది

  నీ  కూడు   ఎట్టాగని    పెట్టే ది

  నీ  తోడు     ఎలాగ     నే నయ్యేది.


• నిను  చూస్తూ  చూస్తూ  ఉంటే

  ఆవిరయ్యే ను   కొందరి     బరువులు

  తేలికయ్యే ను   ఇంకొందరి   మనసులు

  చిగురించే  ను   అందరికీ    చిలిపి నవ్వులు.


దండా కోర్ = మొండి


యడ్ల శ్రీనివాసరావు 4 Dec 2022 10:30 pm.







279. Meet Cute

 

Meet Cute

 (Inspired and written from the Beautiful Classic Web series Meet Cute BGM)



• చిగురించిన

  ఊహలకే   ఊపిరి  అందక

  ఉక్కిరిబిక్కిరి   అవుతుంటే

  మది తెరిచెను  తలుపులు.


వికసించిన   మనసు లో

  బరువెక్కిన   భాస లే

  ఉప్పొంగెను   ఊసు లై

  ఈ కాలం  సాక్షి గా.


• తీరం  చేరని  అలలు

  ఆశ  లై    

  ఎగసి  ఎగసి   పడుతుంటే

  హృదయం   నిండిన    

  ప్రేమలు

  గమ్యం   తెలియక   కాలం లో

  దిక్కులు    చూస్తున్నాయి.


• కలిసిన   కలయిక   

  కల గా    

  మిగిలితే ...

  నడచిన      నడకలో 

  అడుగులు   

  అడగలేక ...

  మౌనం గా    చూపులు 

  ఆకాశం  చూస్తున్నాయి.


• దూరం  ఎరగని   పరిచయం

  దారే   తెలియక   సతమతమవుతుంటే ...

  భావం   తెలియని   బంధం

  అనుబంధమై  సాకుతుంది 

  మనసు ను   తాకుతుంది.


• ఏదో   తెలియని   వెలుగు

  తార లా    సితార లా    నీడై   ఉంటే

  చక్కని   శోభ యే  నిండగా

  చుక్క ని   ఏమడగాలి


• మనసు లో ని    ఆనందం

  పల్లకీ లో  ఆభరణం గా     విహరిస్తూ ఉంటే ...

  వయసు ఎరగని   అందం

  వెన్నెల  నే    కురిపిస్తుంది

  కన్నుల  నే   మై మరపిస్తుంది.


• అనుభవాల   అనుభూతులు  ఎన్నో

  అటు ఇటు  చేరి   

  గుసగుసలాడుతు  ఉంటే ...

  రెక్కలు  తొడిగిన  మనసు

  చక్కిలి   గిలి   

  ఆడుతూ ...

  కీలుగుర్రమై   ఎగురుతూ  ఉంది.


• బంధమే  లేని   బాటసారులు

  సమయం తో    సంయమనం  

  అవుతుంటే ...

  భావాల   కలయిక 

  కలిసిన    

  కావ్యాలు గా   మారితే

  కాలం   అనురాగం   కురిపిస్తుంది.


• సాగే  పయనం లో

  తాకే  అలలు     కల్లోలం     

  ఆరి తేర్చ గా

  వీచే  గాలులు    ఆహ్లాదం    

  సేద తీర్చ గా

  హృదయం నిండిన   ఈ పరిమళం 

  ఆవిరి  అయ్యేది  ఎప్పటికో.


• అందమైన     మాటలు   

  మంత్రాల ని

  చందమైన     చేతలు     

  తంత్రాల ని ... 

• మనిషి   అనే   

  యంత్రాని కి

  ఆధునిక    ఆనందాలు

  మాధుర్యం   నింపలేవని

  మనసు లోని   అనుభవాల తో  

  వయసు  తెలిపింది.


యడ్ల శ్రీనివాసరావు  4 Dec 2022,  3:00 pm
















Thursday, December 1, 2022

278. హేమంతం

 

హేమంతం




• ఓ హో హో … ఆ హ హ

  హాయిని కలిపే     కాలం    ఈ శీతాకాలం

  మేనికి లాలన      కాలం    ఈ చల్లని కాలం.


• వీచే  గాలుల కు

  పూచే  కొమ్మలు  తోడై న

  సుందరం  ఈ సోయగం ... ఈ హేమంతం.


• ఓ హో హో … ఆ హ హ

  హాయిని  కలిపే      కాలం     ఈ శీతాకాలం

  మేనికి     లాలన    కాలం     ఈ చల్లని కాలం.


• తొలి  పొడుపు న          సూర్యుని  రాగం

  నుని  వెచ్చగా   తాకే     ఈ  ప్రకృతి  పాదం.


• తొలి మంచు లో     తడిసిన తానం

  సుతి మెత్త గా    పెరిగే    ఈ  పూల వనం.


• ఓ హో హో…ఆ హ హ

  హాయిని కలిపే     కాలం    ఈ శీతాకాలం

  మేనికి   లాలన    కాలం    ఈ చల్లని కాలం.


• నీటి  బిందువుల   నయగారం

  చిగురుటాకు న    జారుతు ఉంటే

  నిశి లో   నానిన   నీలాంబరి 

  నింగి ని చూస్తూ  భారం గా   రెక్కలే  విరిచింది.


• గరిక పై   నిలిచిన 

  ఈ మంచు  ముత్యాల హారం 

  తెల్లని చీర  వలె 

  ప్రకృతి  కాంత కు  సింగారం  .


మేని = శరీరం

లాలన = మృదువైన 

తానం = స్థానం, స్థలం, స్నానం.

నయగారము  = సొగసు, వన్నె, అందం.

నిశి  = రాత్రి 

నానిన = నీటిలో తడిచి ముద్దైన 

గరిక  =  గడ్డి 


యడ్ల శ్రీనివాసరావు 1 Dec 2022 11:00 PM.










490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...