Friday, December 9, 2022

283. బంధుత్వాలు – స్నేహాలు

 

బంధుత్వాలు – స్నేహాలు



• బంధుత్వాలు, బంధాలు, స్నేహాలు మనిషి ని  నిజం గా  చైతన్యపరిచే వే  నా ....మనిషి ప్రభావం  తోటి మనిషి పై ఎలా?  ఎందుకు?  ఉంటుంది....మనిషి తోటి మనిషి పై మానసికంగా ఎందుకు ఆధారపడతాడు?  మనుషులకు తమ తోటి వారితో ఉండే బంధం జీవిత కాలక్షేపం కోసమా లేక ఏదైనా purpose ఉండి ఉంటుందా?.


• ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి నుంచి ఏదో ఒక సందర్భం లో తరచుగా వినపడే మాట “ బంధువుల కంటే స్నేహితులు నయం. స్నేహితులు అన్నీ చక్కగా అర్దం చేసుకుంటారు, కానీ ఈ బంధువులు మాత్రం రాబందులు కంటే దారుణం” . ఈ మాట ప్రతీ మనిషి తన జీవిత కాలంలో ఎవరో ఒకరి దగ్గర నుండి వింటూనే ఉంటాడు.


• కానీ ఈ మాట సబబేనా ….. సరిగ్గా ఆలోచించి చూడండి మీకే తెలుస్తుంది. మనిషి అనాదిగా సమాజం లో తన మనగడ కి అనుగుణంగా కొన్ని బంధాలను రూప కల్పన చేసుకుని, తన అవసరాలను బట్టి ఈ బంధాలకు సామాజిక పరంగా హద్దులు, పరిమితులు, విధి విధానాలు కల్పించుకుని జీవిస్తున్నాడు. ఈ బంధాలే స్నేహాలు మరియు బంధుత్వాలు.


• మొదట గమనించ వలసినది బంధువులైనా స్నేహితులైనా రెండింటి లోను ఉండేది మనుషులే. మనిషి కి జీవితం, జీవనం అంటే బ్రతకడం. ఈ బ్రతకడం అనేది ఒక అవసరం తో కూడిన నిత్య చర్య. ఈ చర్యలో ఉండేవి అన్నీ మానవుని అవసరాలే. ఆ యా అవసరాలను బట్టి సాటి మనుషులతో బంధుత్వమైనా, స్నేహమైనా, శత్రుత్వమైనా ఇలా ఏదోకటి ఏర్పడుతుంది. దీని కోసం మనిషి పరి విధాలుగా రూపాలు ఎత్తుతూ ఉంటాడు.


• ఏ బంధం లో చూసినా ఉండేది మనుషులు, వారి స్వభావాలు, సంస్కారాలు, ప్రవర్తనలు …


• ఏ మనుషులైనా తమ అవసరాలను బట్టి ఒకరికొకరు దగ్గర అవుతారు. ఇది మానవ నైజం. (అవసరం అనే పదాన్ని తప్పు గా భావించవద్దు.) అవసరం అనేది మనిషి కి సహజం. మనుషుల మధ్య అవసరాలు తీరి పోయాక లేదా అవసరాలు ఇక తీరవు అనుకున్నప్పుడు సహజంగా దూరం అయిపోతుంటారు. ఇది బంధువు లలో, స్నేహితుల లో కూడా ఉంటుంది. మరి అలాంటప్పుడు బంధువుల కంటే స్నేహితులు నయం లేదా స్నేహితుల కంటే బంధువులు నయం అని ఎలా చెప్పగలం.


• బంధువులలో బంధుత్వం ఒకసారి ఏర్పడితే (కుటుంబ బంధాలు వావి వరసలు చాలా ఉంటాయి) జీవిత కాలం ఇష్టం ఉన్నా లేకపోయినా, మనుషుల మనస్తత్వాలు సరిపడక పోయినా సరే బంధం భరించాల్సి ఉంటుంది. ఛాయిస్ ఉండదు. ఇంకా బంధుత్వ బంధాలలో విలువలు తప్పనిసరిగా భరించి ఆచరించాల్సి వస్తుంది. నేటి కాలంలో కొన్ని సార్లు అది చాలా కష్టం గా అనిపిస్తుంది . అందుకనే బంధువుల లో ఉండే మనుషులతో లో లోపల ఇబ్బంది పడుతూ , బయట కు ప్రేమగా ఉంటారు. ఇంకా బంధుత్వ మనుషుల లో వయసు వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఒకరి భావాలు మరొకరికి అర్దం కావు. మనం ఎదుగుతుంటే బంధువులు ఓర్వలేక ఏడుస్తుంటారు అంటారు, అంటే ఈర్ష్య, అసూయ అనేవి బంధువులలో ఎక్కువ గా ఉంటాయి అనే ముద్ర బలపడి ఉంటుంది.


• అదే స్నేహం లో అయితే కావల్సినంత ఛాయిస్ ఉంటుంది. మనిషి తన మనస్తత్వానికి తగినట్లు, లేదా తన అవసరాలకు తగినట్లుగా మనుషులను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే అవసరాలు తీరి పోయినా లేదా  ఆశించిన  విధంంగా  స్నేహితులు ఉండకపోయినా    సునాయాసంగా , రాజకీయ నాయకులు పార్టీలు మార్చినట్లు మనుషులతో స్నేహం మార్చుకోవచ్చు. ఎందుకంటే స్నేహం లో ఉండేదే స్వేచ్ఛ, వెసులు బాటు. ఇక్కడ అంతగా విలువలు ఆచరించాల్సిన అవసరం లేదు. ఇది నేటి కాలంలో మనుషుల తీరు. కానీ స్నేహితుల లో ఈర్ష్య, అసూయ అనేవి ఉండవు అని నమ్మకం గా చెప్పగలమా? నమ్మక ద్రోహం తలపెట్టరు అని అనుకోగలమా? స్నేహితులు అనే బంధం లో ఉన్న వారు అందరూ సహయకారులు గా ఉంటూ సాటి వారికి మంచే చేస్తారు అని గట్టిగా చెప్పగలమా? స్నేహితులు ఏ ఎండకి ఆ గొడుగు పట్టకుండా ఉంటారని అనుకోగలమా?... స్నేహితులు ఒకరిని మరొకరు పూర్తిగా అర్దం చేసుకోగలరు అని చెప్పగలమా?.... ఆలోచించండి.


• మనిషి అమాయకత్వం ఏమిటంటే అటు బంధుత్వాల లో ను, ఇటు స్నేహితుల లో ను ఉండేది అందరూ  మనుషులే , మానవమాతృలే  అని  ఆలోచించ లేక పోవడం.  

ఒక మనిషి తోటి మనిషి తో కలిసి ఉండాలన్నా, విడిపోవాలన్నా ముఖ్యమైనది అది ఏ రకమైన బంధం, బంధుత్వం, స్నేహం అనేది కాదు. మనిషి కి మనిషి తో ఉండే ప్రవర్తన, స్వభావం, సంస్కారం, బుద్ది, ఆలోచన లలో ఉండే సమతుల్యత ముఖ్యం. ఈ గుణాలు సమపాళ్లలో ఇరువురి లో ఉంటే అది ఏ బంధం అయినా నిలబడుతుంది. ఇవి హెచ్చు తగ్గులు తో ఉన్నప్పుడు అంటే ఒకరికి కావలసింది మరొకరి దగ్గర లేనప్పుడు లేదా మరొకరు ఇవ్వనప్పుడు ఈ విడిపోవడం, దూరం, ఎడబాటు అనేది జరుగుతుంది.


• మనుషులు చాలా చాలా మంచి వారు…అలాగే అత్యంత ప్రమాదకారులు కూడా. అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి ఎప్పుడు, ఎలా మారుతూ ఉంటారో లేదా అవసరాలు మనుషుల ను ఎలా మార్చేస్తూ ఉంటాయో తెలియదు.


• మనుషుల తో ఏ బంధం అయినా సరే నిలబడాలి అంటే మనిషి లో ముందుగా ఉండవలసింది కొంతైనా స్వచ్చత (fairness) . ఈ స్వచ్ఛత లోపిస్తే ఎక్కడా ఎప్పుడూ ఎవరితో ఎక్కువ కాలం ఏ సంబంధమూ దీర్ఘ కాలం  కొనసాగదు .


• ఈ సృష్టిలో జీవన సత్యం ఏంటంటే,  ఏ  మానవ బంధం శాశ్వతం కాదు. ఎందుకంటే మనిషే శాశ్వతం కాదు కాబట్టి.   కానీ మనిషి తన బ్రతుకుతున్న జీవితానికి అర్థం ఉండాలంటే కష్టమైనా సుఖమైనా కనీసం కొన్ని మంచి విలువలకు కట్టుబడి ఉండాలి. మరొకరికి ఆదర్శం గా ఉండాలి. ఈ విలువలు అనేవి బయటకు కనిపించే లా,  అర్దం అయ్యేలా ప్రవర్తించనవసరం లేదుు .  అంతరంగం లో ఉంటే చాలు. చుట్టూ ఉన్న   ప్రకృతి కి  సహజంగా అర్దం అవుతుంది.


• మనుషులు ఏ బంధం లో నైనా సరే కొంతైనా తోటి సాటి మనుషులతో స్వచ్చత గా, నిజాయితీగా ఉండండి.  కానీ మితిమీరిన అనుబంధం పెట్టుకోకండి. ఎందుకంటే ఎవరు ఎవరితో ఎంతకాలం ఉంటారో తెలియదు. కానీ కలిసి ఉన్నంత కాలం ఒక మంచి పుస్తకం లా ఉండగలిగితే చాలు.  ఎందుకంటే అది ఏ బంధమైనా ఆ బంధం లోని జ్ఞాపకాలు మంచి శక్తి ని ఇస్తూ ఉంటాయి, ఆ తోటి మనుషులు మనతో లేకపోయినా…..


• ఓ మనిషి నువ్వేంటో నీకు తెలియాలంటే, ప్రతీ రోజూ నీ గురించి నువ్వు కొంత సమయం ఏకాంతంగా ఉండి విశ్లేషించుకో …. అప్పుడు నీ చుట్టూ ఉన్న వారు ఏంటో అర్దం అవుతారు.


• నేటి కాలంలో మానవ బంధాలు అర్థవంతం గా, సమర్థ వంతంగా ఉండాలనే ఆలోచనతో ఈ చిన్న రచన.


• జీవితం విలువైనది… ఎవరికి వారే ఉత్తములు ఆత్మశక్తి ని, ఆత్మవిశ్వాసాన్ని గ్రహిస్తే….🙏


ఓం నమఃశివాయ 🙏.


యడ్ల శ్రీనివాసరావు 9 Dec 2022 9:30 pm.





No comments:

Post a Comment

490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...