Wednesday, March 27, 2024

481. పరిమళ భాష

 

పరిమళ భాష


• ఏమిటో     ఈ  భాష

  ఎద కే    తెలియని   ఆశ.

  అనుభవం  లేని   యాస

  సృష్టి   మూలానికి    శ్వాస.


• అక్షరాలు   ఉండవు  కానీ

  భావం  పలుకుతు  ఉంటుంది.

• కనులు    చూడలేవు  కానీ

  మనసు  చదువుతూ   ఉంటుంది.


• ఏమిటో   ఈ  భాష

  ఎదకే   తెలియని  ఆశ.

  అనుభవం   లేని   యాస

  సృష్టి  మూలానికి   శ్వాస.


• గజిబిజిల   గందరగోళం లో  నైనా 

  పులకింతలు   నింపుతుంది.

• ఎగుడు దిగుడు   తలంపుల  కైనా

  మధురిమలు   పలికిస్తుంది.


• ఎవరూ  నేర్పని   ఈ భాష

  సహజమై   ప్రకృతి లో  ఉంది.

• సకల   జీవుల    ఊపిరి కి

  ఆయువై   మూలం గా  ఉంది.


• ఏమిటో    ఈ  భాష

  ఎదకే   తెలియని  ఆశ.

  అనుభవం   లేని   యాస

  సృష్టి   మూలానికి    శ్వాస.


• అంతరంగం లో   అలజడి అయినా 

  అంతరాత్మ లో   ఆనందం  అయినా 

  భాష లో ని      భావం

  పరిమళమైన   భాగ్యం.


• ఏమిటో    ఈ  భాష

  ఎదకే   తెలియని  ఆశ.

  అనుభవం   లేని   యాస

  సృష్టి   మూలానికి    శ్వాస.


యడ్ల శ్రీనివాసరావు 27 March 2024 9:00 pm.


Sunday, March 24, 2024

480. పౌర్ణమి గ్రహణం

 

పౌర్ణమి గ్రహణం 


• మనసు  లోగి  లో   వెలసింది

  వెన్నంటి    జాబిలి

• తనువు  ముంగిట  మెరిసింది

  మిన్నంటి   వెన్నెల


• మౌనమ నే    వెలుగు తో

  మదిని    పులకరింప చేసింది.

• శాంతమ నే     శోభతో

  కాంతి   వికసింప  చేసింది.


• మనసు   లోగి లో    వెలసింది

  వెన్నంటి    జాబిలి.

• తనువు   ముంగిట  మెరిసింది

  మిన్నంటి    వెన్నెల.


• అమావాస్య     చీకట్లయినా

  గ్రహణాల         సర్పాలయినా

  చంద్రుని కి     చేటేముంది.

  మనసు కి      పొటేముంది.


• పూర్ణ కుంభం     తరిగినా 

  వికాసానికి     లోటేముంది. 

  కనులకు        కానరాకున్నా 

  హృదయం లో   మాటేసుంది.


• మనసు    లోగి లో   వెలసింది

  వెన్నంటి    జాబిలి.

• తనువు   ముంగిట  మెరిసింది

  మిన్నంటి    వెన్నెల.


• పౌర్ణమి    పరిమళం

  పాలపొంగు తో   నిండింది.

• తారల     తళుకులు

  మేఘాలలో    దాగాయి.


• కాలం ఆడే   సయ్యాటే 

‌  గ్రహణమనే   దోబూచి.

• ఈ  క్షణికమైన   చీకటే

   వెలుగు కి    సోపానం.


• మనసు  లోగి లో    వెలసింది

  వెన్నంటి   జాబిలి.

• తనువు  ముంగిట  మెరిసింది

  మిన్నంటి     వెన్నెల.



యడ్ల శ్రీనివాసరావు 24 March 2024, 11:00 pm.


Saturday, March 23, 2024

479. లక్ష్యం ( Goal) - కోరిక (Desire)

 

లక్ష్యం ( Goal) - కోరిక (Desire)


 మనిషి తల్లి గర్భంలో నుంచి పసికందు గా భూమి పైకి వస్తూనే అరచేతి గుప్పెడు బిగించి ✊ చూపిస్తూ       “ నేను  ఏదో  సాధించడానికి భూమి పైకి వచ్చాను “ అనే సంకేతం చూపిస్తాడు.

 

అందుకోసం పుట్టిన క్షణం నుండి చేసే ప్రయత్నాలు, చెప్పాలంటే పడే పాట్లు ఇన్ని అన్నీ కావు. చదువు లో, చేసే వృత్తి లో,   సమాజం లో,  వైవాహిక జీవితం లో, కుటుంబ జీవనం లో   ఇలా ఒకటేమిటి  అన్నింటిలో అత్యుత్తమంగా కావాలని అలుపెరుగని పరుగు పెడుతూనే ఉంటాడు.  ఈ పరుగు లో  అన్నీ లక్ష్యాలు , కోరికలు  సాధనలు  కనపడుతుంటాయి.    ఒక లక్ష్యం లేదా కోరిక   పూర్తి అయితే మరొకటి.  కానీ ఒక లక్ష్యం చేరిన తరువాత సంతృప్తి చెందుతున్నాడా, అంటే అది మనసు కే తెలియాలి. ఇక్కడ గమనిస్తే లక్ష్యం, కోరిక ఒకేలా అనిపించినా, తేడా ఉంటుంది.


 లక్ష్యాలకు ,  ఆరంభం మరియు అంతం అనేది ఉంటుంది.    కానీ మనిషి ఒక లక్ష్యం సాధించిన తరువాత సంతృప్తి పడి ఆగిపోతే,   అదే తన ఓటమి గా భావించే స్థితి గా భావిస్తాడు.

 ఈ లక్ష్యాలు అనేవి మనిషి , తాను ఎదగడం కోసం అంటుంటాడు .  అందులో డబ్బు సంపాదించడం, ఉద్యోగ స్థాయి పెంచుకోవడం, నాయకుడు గా ఎదగడం,   కుటుంబం తన ఆధీనంలో ఉండాలనుకోవడం,   సమాజం లో గుర్తింపు స్థానం కోసం, పారిశ్రామిక వేత్త గా ఎదగాలనుకోవడం,  ఇలా లక్ష్యం అనేది   ఎప్పుడూ చాలా చాలా  ఉన్నతంగా కనిపిస్తూనే ఉంటుంది.  దాని వెనుక పరుగు పెడుతూనే ఉంటాడు. విచిత్రం ఏమిటంటే ఇదే ఈనాడు మనిషి కి అసలు సిసలైన జీవితం అనే భావన కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఇందులో నే తొంభై శాతం మనిషి జీవిత కాలం గడుస్తుంది.


 లక్ష్యం సాధించాలి అంటే అహర్నిశలు కష్టపడాలి. నిజమే కష్టపడాలి. లేదంటే లక్ష్యం సాధించలేం. ఒక లక్ష్యం సాధించే దిశలో పరిస్థితి నా బట్టి ఎన్నో వదులు కోవలసినవి ఉంటాయి. అందులో , సమయం, విలువలు, ప్రేమ, ధనం ఆహారం, నిద్ర, మనుషులు , జీవితం , సుఖం, ఇలా ఎన్నో ఎన్నెన్నో వదులు కోవాలి.

 ఇలా ప్రతీ వయసు లో జీవితాంతం గడిపితే , అంటే మనిషి తన మనసు ను ఈ లక్ష్యాల పరుగు పందెంలో తాకట్టు పెడితే తన జన్మ సార్థకం అయినట్లే నా. అసలు ఈ లక్ష్య సాధన కి ఒక అంతం అనేది ఉంటుందా?.

 నిజానికి మనిషి తాను అనుకుంటున్నవి లక్ష్యాలా? లేక లక్ష్యం రూపం లో ఉండే కోరికలా?   ఎందుకంటే లక్ష్యం లో ఉన్నతి ఉంటుంది,  అది స్వయం గా తనతో పాటు కుటుంబం, నలుగురి, లేదా సమాజ శ్రేయస్సు ఉంటుంది.   కానీ కోరిక లో స్వలాభపేక్ష,  స్వార్థం ఉంటుంది.  కోరికలకు ఆరంభం మాత్రమే ఉంటుంది, అంతం ఉండదు.


 ఒక లక్ష్యం చిన్న దైనా, పెద్ద దైనా తీరినప్పడు మనిషి కి పూర్ణ మైన సంతృప్తి లభిస్తుంది.    కానీ కోరికలు తీరినప్పడు ముమ్మాటికీ  సంతృప్తి  ఉండదు. ఎందుకంటే ఆక్షణమే మరో కోరిక  అంతకు మించి మొదలవుతుంది.  కానీ నేటి కాలపు మనిషి ఈ తేడా గమనించే స్థితిలో ఉన్నాడా? అనేది ప్రశ్న.

 ఎందుకంటే లక్ష్యానికి కోరికకు తేడా తెలియని జీవిత పరుగు నేడు యువత కనపడుతుంది.

 లక్ష్యానికి ఒక పుల్స్ స్టాప్ ఉంటుంది. కానీ కోరికకు కామా మాత్రమే ఉంటుంది.

 లక్ష్యం అనేది ఆత్మ సంతృప్తి కోసం , కోరిక అనేది దేహ సంతృప్తి కోసం. దేహం లో కోరికలు అనేవి పుడుతూనే ఉంటాయి. కానీ లక్ష్యం చేరుకుంటే ఆత్మ పొందే సంతృప్తి ,  అనుకున్నది సాధించాను చాలు అనుకుంటుంది.   ఈ స్థితి పొందడం ఒక అదృష్ట యోగం గానే చెప్పాలి.   ఎందుకంటే నేడు యువత తన ఆలోచనలను నిజం చేసుకునే దిశలో పయనిస్తూ ఉంటారు,  కానీ ఆ ఆలోచనలు   సమన్వయం చేసుకునే స్థితిలో లేరు.  సమన్వయం అంటే, తమ లక్ష్య లేదా కోరికల సాధనలో తమను తాము సవ్య మైన దిశలో మరల్చు కోవడం. అలా కాకుండా ఎలాంటి అడ్డదారుల్లో నైనా లక్ష్య, కోరికల సాధన చేస్తే ఫలితం తిరిగి మనసు పై దుర్భరం గా ఉంటుంది.


 ఇదివరకటి కాలంలో లో మనుషుల మనసు ఒక స్థిరత్వమైన స్థితి తో ఉండేది. కానీ నేడు మనిషి, యువత జీవన విధానం లో మనసు ఒక అస్థిరత్వం తో ఉండడం అధిక శాతం గమనిస్తూనే ఉన్నాం. బహుశా అందుకే నేటి తరం శారీరకంగా బలం గా కనపడుతున్నా, మానసికంగా బలహీనం గా ఉంటూ, లక్ష్య సాధనలో వైఫల్యాలను అంగీకరించ లేకపోతున్నారు. ఇది రోజు రోజుకు పెరుగుతోంది.


 ఏది ఏమైనా , మనిషి ఏది సాధించినా తాను ఏకాంతం గా ఉన్నప్పుడు, నేను సంతోషం గా ఉన్నాను అని తనకు తాను అనుకో గలుగుతున్నాడా అనేది ముఖ్యం. ఎందుకంటే జీవితం లో ఏదొక దశలో తప్పని సరిగా ఒంటరి తనం, ఏకాంతం మనిషి అనుభవిస్తాడు. అది వరం అవ్వాలి కానీ శాపం కాకూడదు.


 మనిషి గా పుట్టిన ప్రతీ ఒక్కడూ తన జీవిత కాలం లో ఈ భౌతిక ప్రపంచంలో , తన కోసం ఏదో ఒకటి సాధిస్తూనే ఉంటాడు. కానీ వాస్తవం ఏమిటంటే మనిషి తన ప్రాణం విడిచిన తరువాత లేదా ప్రాణం విడవ బోయే ముందు తన గుప్పెడు తెరిచి 🫴 ”నేను ఇక్కడ ఏమీ సాధించలేదు, అని ఖాళీ గా చేతులు పైకి తెరిచి, నా కర్మ ను అనుభవించ డానికి మాత్రమే వచ్చాను “ అనే సత్యం తప్పకుండా గ్రహిస్తాడు.


 మనిషి కి బాధ్యతలు తీర్చు కోవడం లో పరిధి ఉండాలి. ఆ పరిధి పెంచుకుంటే భారం పెరుగుతుంది. అంటే శక్తి కి మించిన బాధ్యత లను పెంచుకోకూడదు. బాధ్యత లనేవి తప్పని సరి కర్మ స్థితి తో ముడి పడి ఉంటాయి.

 లక్ష్యం అనేది ఆత్మ సంతృప్తి సాధన కోసం ఉంటుంది.

 కోరిక అనేది దేహ సంతృప్తి కోసం ఉంటుంది.

 మూడింటిని గమనిస్తే ఒకేలా అనిపించినా, చాలా వ్యత్యాసం ఉంటుంది.


 యడ్ల శ్రీనివాసరావు 23 March 2024 11:00 pm.


Friday, March 22, 2024

478. రాజ యోగిని

 

 రాజ యోగిని




• హృదయ   మోహిని     రాజయోగిని

  మధువనం   కొలువులో   దైవ సంభూతిని.


• శివుని    శాంతి రాజ్యం  లో

   ప్రేమ  కిరీటమైన   సమ్మోహిని .

• మనసు   పాలన   లాలన లో

  మధువామృతం   నింపిన  మన్మోహిని.


• హృదయ   మోహిని   రాజయోగిని

  మధువనం   కొలువులో   దైవ సంభూతిని.


• ఆత్మల    భాగ్యం   కోసం

  శక్తిధార   కళ్యాణ కారిణి.

• పరమాత్ము ని    సందేశానికి

  సారధి అయిన  అశ్విని.


• హృదయ  మోహిని    రాజయోగిని

  మధువనం    కొలువులో   దైవ సంభూతిని.


• దృష్టి   మౌన యుక్తం తో

  స్వస్థ  కిరణాల   మాలిని.

• సంకల్పాల   సిద్ది   కలిగిన

  ఐశ్వర్య     స్వరూపిణి.

• విశ్వ కళ్యాణ పరివర్తన లో 

  ప్రకృతి సహాయోగిని.


• హృదయ   మోహిని    రాజయోగిని

 మధువనం   కొలువులో   దైవ సంభూతిని.


యడ్ల శ్రీనివాసరావు 22 March 2024 10:00 PM


Thursday, March 21, 2024

477. చూసుకో … ఒకసారి చూసుకో

 

చూసుకో … ఒకసారి చూసుకో


• చూసుకో

  ఒకసారి   చూసుకో

  నిన్ను నువ్వు   చూసుకో

  నీ లో లోన    ఏమి దాగుందో    తెలుసుకో.


• బంధాల    వలలే నా      బ్రతుకు.

  కోరికల     కలలే నా        ఎదుగు.

• సంకెళ్ల    సంతోషం తో    ఏమి సాధించావు.

  సందిగ్ధ     బుద్ధి తో         ఏమి సంపాదించావు.


• చూసుకో

  ఒకసారి    చూసుకో

  నిన్ను  నువ్వు    చూసుకో

  నీ  లో లోన   ఏమి దాగుందో    తెలుసుకో.


• ఆశల       అలలే నా        ఆనందం

  విలాసాల   లీలలే నా       జీవితం.


• సరళం   లేని   నీ మనసు    

  ఎలా    ఎగరగలదు.

• నిన్ను  నీవు  వదలక   పొతే 

  ఎలా   వదులు గవుతావు.


• చూసుకో

  ఒకసారి    చూసుకో

  నిన్ను   నువ్వు  చూసుకో

  నీ  లో  లోన   ఏమి దాగుందో   తెలుసుకో.


• మాయ   కోరల్లో

  చిద్రం అవుతుంది   నీ ఆత్మ.

• మోహ  ఊబిలో

  నలిగి  పోతుంది    నీ  దేహం.


• సజీవం  లోని    జీవం

  భారమనిపించ    లేదా.

• నిర్జీవం లోని      జీవం

  సారమని     తోచ లేదా.


• విడుదలవ్వాలి   అంటే

  నీ వెవరో        తెలుసుకున్నావా.

• ఎగిరి పోవాలి      అంటే

  నీ గమ్యం      తెలుసుకున్నావా.


• చూసుకో

  ఒకసారి     చూసుకో

  నిన్ను   నువ్వు   చూసుకో

  నీ  లో  లోన    ఏమి దాగుందో   తెలుసుకో.


యడ్ల శ్రీనివాసరావు 22 March 2024 10:00 am



Wednesday, March 20, 2024

476. కాలచక్రం

 

కాలచక్రం 


• ఏనాటి దో    ఈ కాలం 

  ఈనాటి కి    తిరిగొచ్చెను.

• ఏపాటి దో    ఈ ఆనందం 

  విడనాడక    వరమయ్యెను.


• కవ్వింత   నవ్వులతో

  పువ్వ ల్లే   సాగుతోంది  సమయం.

• తుళ్లింత    సిగ్గుల తో 

  మంచ ల్లే    జారుతోంది    వదనం.

• రవ్వంత    రవళి లతో

  మువ్వ ల్లే   మోగుతుంది  మదనం.



• ఏనాటి దో    ఈ కాలం 

  ఈనాటి కి    తిరిగొచ్చెను.

• ఏపాటి దో    ఈ ఆనందం 

  విడనాడక    వరమయ్యెను.


• ఏకాంతపు   సోయగం లో

  విరజిల్లెను    విరజాజులు.

• అంతరాన   ఆ లయం లో

  ఆలపించెను   ఆమనులు.


• మౌనం లో     మధురం

  మరు లోకపు     వికాసం.

• శాంతం లో     సౌమ్యం

  సుఖ వాసపు    రధం.


• ఏనాటి దో    ఈ కాలం 

  ఈనాటి కి     తిరిగొచ్చెను.

• ఏపాటి దో    ఈ ఆనందం

  విడనాడక    వరమయ్యెను.


• రాసిన  తల  రాతలు  రమణీయం.

  గీసిన నొస   గీతలు  గమనీయం.

  నిండిన    కాంతులు  కమనీయం.

  తలచిన   తలంపులు   పూరణం.


గమనీయం = పొందగలిగేది.


యడ్ల శ్రీనివాసరావు 20 March 2024 9:45 pm





Saturday, March 9, 2024

475. కాలుడు కమనీయం


కాలుడు  కమనీయం


• కాలుడు   కమనీయం

  కాలుడు    కమనీయం

• భైరవ    భవధీయం

  భైరవ    భవధీయం


• కల్పాన    కాలగతి లో

  కల్పతరువైనాడు 

• జ్ఞానమనే    అమృతం తో

  దాహాన్ని     తీర్చాడు.


• కాలుడు  కమనీయం

  భైరవ    భవధీయం


• అంధకార   ఆక్రందనలకు    కైవల్య  మిచ్చాడు.

  బానిస    బంధాల నుంచి    విముక్తి  నిచ్చాడు.

• ఊహించిన   క్షణాలను     ప్రత్యక్షం చేసాడు.

  ఊహించని   అద్బుతాలు   ఎన్నో  చూపాడు.


• కాలుడు  కమనీయం

  భైరవ  భవధీయం

• కాలుడు కమనీయం

  భైరవ  భవధీయం


• కల్పాన    కాలగతి లో

  కల్పతరువైనాడు

• జ్ఞానమనే   అమృతం తో

  దాహాన్ని    తీర్చాడు.


• మందగతి న     శనైశ్చరుని 

  కర్మాతీతుని గా    చేసాడు.

• శుభ స్థితి న      బృహస్పతి తో 

  జీవాత్మ ను    జాగృతం  చేసాడు.


• అధోగతి న     శ్రీ రాహువు తో

  భౌతికత కు     వెలి వేసాడు.

• ఊర్ధ్వగతి న     శ్రీ కేతువు చే 

  పరమాత్మ తో   అను సంధానం  చేసాడు.


• కాలుడు   కమనీయం

  కాలుడు   కమనీయం.

• భైరవ    భవధీయం

  భైరవ    భవధీయం.


యడ్ల శ్రీనివాసరావు 9 March 2024, 2:45 pm.


Friday, March 8, 2024

474. గవ్వను కాదు గువ్వను

 

గవ్వను   కాదు   గువ్వను



• గువ్వను  నేను

  ఎగిరే  గువ్వను  నేను.

• గవ్వను    కాను 

  కదలని  గవ్వను  కాను.


• సూక్ష్మమైన    లోకంలో

  సోయగాల   సోయి  నాది.

• అందమైన     వనంలో

  అంతులేని   హాయి   నాది.


• గువ్వను   నేను

  ఎగిరే   గువ్వను  నేను.


• గవ్వ    నున్నగున్న

  గీతలతో    గందరగోళం

• గవ్వ     తెల్లనైనా

  ఇసుక లో     నిర్జీవం.

• గవ్వను   కాను.

  కదలని   గవ్వను  కాను.


• విహరించే     మనసు తో

  విరహలను    వీడుతాను.

• విహంగమై     వెన్నెల లో

  విలాసి గా      తిరుగుతాను.


• సెలయేటి      సవ్వడి లో 

  సరోవరం పై      తేలుతాను.

• గిరులు   చుట్టి    పల్లె

  రాగాలు    వల్లె   వేస్తాను. 


• గువ్వను నేను

  ఎగిరే గువ్వను నేను.


• నింగి లో     నిలబడి 

  నేల  ను      చూస్తుంటాను.

• పల్టీలు     కొడుతూ 

  పరంధామము  చేరుతాను.


• గువ్వను   నేను

  ఎగిరే  గువ్వను  నేను.

• గవ్వను   కాను 

  కదలని  గవ్వను  కాను.

  

యడ్ల శ్రీనివాసరావు  8 March 2024, 9:30 pm.


Wednesday, March 6, 2024

473. మనో శతకం - 8


మనో శతకం - 8



సౌష్టవంబున  మెరుగుల్   శ్రేష్టంబాయెనా

దేహంబున   మోహంబు   దేహి జేయ

ఆత్మ  నెరిగి నందం  అంబర  మల్లే 

పరమాత్మయని   పలుకు  పతిత  పావనంబాయే.

సుందర గుణేశ్వరా!   సంపన్నేశ్వరా !      |20|


భావం :


శరీరానికి  ఆకృతులు  మెరుగులు దిద్ది నంతలో సౌందర్యం   అద్బుతం  అగునా.

శరీరం పై కోరిక, మోహం  అల్పునిగా   చేయును.

నేనొక ఆత్మనని ఎరిగినపుడు  అందం  ఆకాశమంత అల్లు కొని   విస్తారం  అగును. 

పరమాత్మ అయిన  శివుని జపించిన  యెడల  భ్రష్టులు కూడా   శ్రేష్టం గా   అవుతారు.

సుందరమైన  గుణములు  కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన  ఈశ్వరా!.


🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️


శూన్యంబున   దిక్కుల్   సమము గాంచే 

మరజీవికి  బంధమల్   ఎండమావులాయే

గమ్యమెరిగిన  గతి కి    దిక్సూచి ఏల

మౌనమున మది పయనించు విశ్వమున.

సుందర గుణేశ్వరా!   సంపన్నేశ్వరా !   |21|


భావం :

శూన్యమున   అన్ని దిక్కులు,  దిశలు   ఒకే విధంగా సమానం గా  ఉండును.

కోరికలు లేని జీవికి   బంధములు  ఎండమావులు అగును.  (ఎండమావి లో నీరు ఉన్నట్లు కనిపించును, కానీ నీరు ఉండదు.  అదే విధంగా   మరజీవికి  బంధములతో  అనుబంధం  ఉండునట్లు ఉండును, కాని   ఉండదు. 

గమ్యం తెలిసిన   దారికి  మార్గ దర్శకం  ఎందుకు.

ఆలోచన రహిత   మనసు  విశ్వం లో ప్రయాణం చేస్తుంది.

సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!.


యడ్ల శ్రీనివాసరావు 6 March 2024 , 9:15 pm


Saturday, March 2, 2024

472. కళ్యాణం – వివాహం

 

కళ్యాణం(శుభం) – వివాహం(బంధం)


• సాధారణంగా  ఒక పదం యొక్క  అర్దం పూర్తిగా తెలియనప్పుడు  లేదా అర్దం  చేసుకోవడం లో  లోపం ఉన్నప్పుడు  భావం పూర్తిగా మారిపోతుంది.  దీనినే భావరహిత  సమస్య అని అంటారు.  ఇదంతా ఎందుకు అంటే,  జ్ఞానం అజ్ఞానం ఈ రెండు పదాల  మధ్య ఉన్న   “అ”  అనే అక్షరం  వలన ఎంతో వ్యత్యాసం  కనపడుతుంది.


• అదే విధంగా తెలుగు లో  వాడుక భాషలో ఒక పదానికి అనేక పర్యాయపదాలు చేర్చడం వలన కొన్ని సందర్భాల్లో   జ్ఞాన వంతంగా   చెప్పిన విషయాల అర్థాన్ని కూడా   ఎవరి అనుసారం వారు   మార్చుకొని అజ్ఞాన మార్గం వైపు  మరలతూ  ఉంటారు.  అందుకు ఇది ఒక నిదర్శనం. ఈ సామెత.


• “ వెయ్యి అబద్ధాలు ఆడి ఒక కళ్యాణం / పెళ్లి / వివాహం  చెయ్యాలి “.


• కళ్యాణం  అనే మాట  చాలా  పవిత్రమైనది. వాస్తవానికి  దీని అర్ధం శుభం ,  శుభకరం.  జ్ఞాన వంతులు, పండితులు కలిసి  మనిషికిి   కళ్యాణం  తలపెట్టడం లేదా   కళ్యాణం చేయడం  అంటే ,   ఒక ఆత్మ కి  శుభం  లేదా  మంచి చేయడం  అని చెప్పారు . అదే విధంగా  లోక కళ్యాణం  అంటే  సృష్టిలో సమస్త జీవులకు శుభం,   మంచి   తలపెట్టడం అని అర్థం. ఇక్కడ శుభం అంటే  ఆనందంగా, సంతోషంగా జీవించడం అని అర్దం.


• సాధారణంగా  ఒకరికి  ఏదైనా  మంచి, శుభం , శుభకార్యం  తలపెట్టేటప్పడు  మాయా వలన విఘ్నాలు ఉత్పన్నమయ్యే అవకాశం   ,  ఈ మాయా లోకం లో ఉంటుంది  కాబట్టి ,  కొందరు గణపతిని పూజిస్తారు. మరికొందరు “ వెయ్యి అబద్ధాలు ఆడైనా సరే  ఆ కళ్యాణం చెయ్యాలి ” అంటారు.  అంటే ఇక్కడ ఉద్దేశం   ఒక శుభం,  ఒక మంచి,  ఒక లోక కల్యాణం తలపెట్టినపుడు  ఆ శ్రేయస్సు కోసం  వెయ్యి అబద్ధాలు ఆడడం లో  తప్పు లేదు  అని జ్ఞాన యుక్తం లో  ఈ సామెత  యెక్క భావం.


• కానీ సమస్య అంతా ఇక్కడే మొదలవుతుంది.

• నేటి లౌకిక ప్రపంచంలో కళ్యాణం అంటే కేవలం స్త్రీ పురుష వివాహం బంధం  అని , మానవుడు  తన అవసరం కోసం  ఈ భావనను తీసుకు వచ్చాడు.  అనగా వివాహం అంటేనే,   మనిషి కి ఎంతో శుభం తలపెట్టడం అనే భావన కల్పించారు. ఈ వివాహం అనేది మనిషి కి మంచి చేయడం గా భావించారు.  ఇదంతా  మనిషి కి ,  శారీరక  భౌతిక అవసరాల రీత్యా,  సృష్టించబడింది.

దీనిని దృష్టిలో పెట్టుకొని వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలని ,  సామెత ను ఆచరించడం మెదలు పెట్టి ….. నేడు సమాజంలో , వెయ్యి కాదు లక్ష అబద్ధాలు ఆడుతూ పెళ్లిళ్లు చేయడం మొదలు పెట్టారు.  కుటుంబాలకు, వ్యక్తులకు సంబంధించిన ఎన్నో నిజాలను దాచి ఒక వివాహం చేయడానికి అష్ట కష్టాలు పడుతూ ఒక యజ్ఞం లా భావిస్తున్నారు. 


• ఇది సరియైన విధానమా?  అబద్ధాలు ఆడి పెళ్లిళ్లు చేయడం ద్వారా, అంటే శుభం తలపెట్టడం అవుతుందా ?  నేడు సమాజంలో వివాహ వ్యవస్థ ఉన్నతంగా ఉందా?  వివాహితులు అందరూ ఆనందం గా ఉంటున్నారా ? …. ఇలా వెయ్యి అబద్ధాలు ఆడి వివాహాలు కుదర్చుడం అనేది పాపమా? పుణ్యమా? .….

సామెతలను ప్రామాణికంగా తీసుకుని , వాటి అసలు అర్దం తెలుసుకోకుండా, విచ్చలవిడి తనంతో  ధైర్యంగా నేడు పూర్తి అబద్ధాల మయంతో   మధ్య వర్తులు వివాహాలు కుదర్చుడం అనేది ఒక పాపపు ఖాతాను వారి కర్మ లో జమ చేసుకోవడమే అవుతుంది.

• పెళ్లి చెయ్యాలనుకునేటప్పుడు కుటుంబ, వ్యక్తి గత వాస్తవాలు లోటుపాట్లు,  నిజాలు  చెప్పి,  కాస్త ఆలస్యం  అయినా సరే, ఇరువురికి ఆమోద యోగ్యం  అయితేనే  అప్పుడు వివాహం కుదర్చుడం  మంచిది.


• ఎవరు ఎవరికి శుభం, మంచి చేసినా అది కళ్యాణమే అవుతుంది.

• సూక్ష్మం గా చూస్తే కళ్యాణానికి (శుభం), వివాహానికిి  (బంధం) చాలా తేడా ఉంది.

• ప్రతి కళ్యాణం ( శుభం, శుభకరం, మంచి) వివాహం (బంధం) కానక్కర్లేదు.

• ప్రతి వివాహం (బంధం)  కళ్యాణం గా (శుభం గా) కావాలి.


• తిరుపతి లో వెంకటేశ్వరస్వామి కి మరియు శ్రీశైలం లో శివుని కి నిత్యం కళ్యాణం జరుగుతుంది. నిరంతరం, అనుక్షణం ఈ సృష్టిలో సమస్త జీవకోటికి లోక కల్యాణం చేసేటి పరమేశ్వరుని సంస్మరణకు ప్రతీకగా ఆయా దేవస్థానాలలో ప్రతీ రోజు అర్చకులు కళ్యాణం చేస్తారు.


• ఈ దైవ కల్యాణం, అంటే దైవ వివాహం ద్వారా మనుషులు గ్రహించవలసిలనది సందేశం ఒకటి ఉంది. అది , స్తీ పురుషులు విభిన్నమైన శక్తి కలిగిన వారు. ఈ కలయికల తో కూడిన వివాహం ఏకరసం గా జీవితకాలం మనుగడ సాధించడం అంటే, కలియుగంలో అంత సర్వ సాధారణం విషయం కాదు. సాక్షాత్తు విష్ణు సహస్రనామం లో సంసారాన్ని మహ సాగరం గా అభివర్ణించారు. దంపతులు తమ వైవాహిక జీవితాలలో ఎన్ని అవాంతరాలు, విపత్తులు వచ్చినా అధిగమించి, ఆ భగవంతుని చూసి , ఆ నిత్య కల్యాణ శోభ తాము కూడా సంతరించు కోవాలి, అనేది నిత్య దైవ కల్యాణం యెక్క సూక్ష్మ సందేశం.


• చివరిగా … ఒకటి కాదు, వంద కాదు, వెయ్యి అబద్ధాలు ఆడి ఒకరికి శుభం, కల్యాణం, మంచి తలపెట్టినా …. ఈ అబద్ధాల వలన ఇతరులలో ఏ ఒక్కరికీ అపకారం గాని, చేటు గాని, నమ్మక ద్రోహాం గాని జరగ కూడదు. స్వయానికి నష్టం జరిగినా పరవాలేదు.


యడ్ల శ్రీనివాసరావు 3 March 2024 , 11:00 AM.


490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...