Sunday, April 30, 2023

351. శ్రీ సూర్య నారాయణ

 

శ్రీ సూర్య నారాయణ



• నారాయణ     నారాయణ

  జగము ను     స్థితము చేసే

  శ్రీ మన్నారాయణ      సృష్టి *పారాయణ

  *హర్షవల్లి న      *సూతుడి గ

   వెలుగైన        క్షేత్ర నారాయణ.


• ఉష్ణ మై     ప్రాణము పోసి

  సర్వ జీవుల   యందు   ఆయు వై   నిలిచావు.

• భగ భగ   మండే    భానుడి వై

  శత్రు వధ   చేసి   రక్షకుడి   వైనావు.

• ధర్మార్థ   కామ   మోక్షముల నే

  చతుర్భుజముల తో   జగన్నాధుడైనావు.


• *క్రీగంట   నవ్వుతో     *శ్రీకంఠ  నాధుని చే

   వైభవోపేతుడైన     వైకుంఠ    నారాయణ

   శ్రీ లక్ష్మి   నారాయణ.


• నారాయణ    నారాయణ

  జగము ను     స్థితము చేసే

  శ్రీ మన్నారాయణ      సృష్టి *పారాయణ.

• హర్షవల్లి న    కొలువై    హర్షమును  పంచే

   శ్రీ సూర్య నారాయణ.


• కిరణముల శక్తి తో     *కరణ ధారణ   చేసే

  శ్రీ సూర్య నారాయణ   

  పాహిమాం   రక్షమాం.



*పారాయణ = కార్య సమాప్తి చేయు వాడు.

*హర్షవల్లి = అరసవల్లి గ్రామం, సంతోషాల నిలయం.

*సూతుడు = సూర్యుడు

*క్రీ గంట = కనులు క్రిందికి సగం మూసి తెరచినట్లు

*శ్రీకంఠ నాధుడు = శివుడు.

*కరణ ధారణ = కార్యము(పని) సిద్ధించు


ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 30 Apr 2023 8:00 pm















Saturday, April 29, 2023

350. శివుడు

 

శివుడు



• మూడు    నేత్రాల    శివుడు

  మా  ఇంటికొచ్చాడు   ఓ నాడు.

  మము     ఆడించి     పాడించి

  ఆనందమిచ్ఛి   వెళ్లాడు   నేడు.


• చీకటి తో    నిండిన    మా  ఇంటిని

  వెన్నెల    వెలుగులు    నింపాడు.

• సఖ్యత   లేని     మనుషుల   మధ్య

  ప్రేమ   సమన్వయము నే   నింపాడు.


• ఏ   కష్టమైన       ఏ   నష్టమైన 

  నేను   ఉన్నానని    అభయమిచ్చాడు.

• ఎంత     గొప్ప వాడు     శివుడు

  బూడిదను   వరము గ   ఇచ్ఛేటి  వాడు.


• మూడు     నేత్రాల     శివుడు

  మా   ఇంటికొచ్చాడు   ఓ నాడు.

  మము     ఆడించి      పాడించి

  ఆనందమిచ్ఛి    వెళ్లాడు  నేడు.


• శ్రేష్ట   కర్మల తో    లోక కళ్యాణం

  ఎట్టా గ     చేయాలో     చెప్పాడు.

• ఆత్మ శక్తి  తో     సాటి      ఆత్మ లకు

  శాంతిని   పంచుట  తెలియ చేసాడు.


• మూడు   లోకాలను    తిప్పి   చూపాడు

  మూడు    కాలల      దర్శనం   ఇచ్చాడు.

• ఎంత    గొప్ప వాడు    శివుడు

  బైరాగి  యై    కాపలా   కాసేటి  వాడు.


• మూడు      నేత్రాల    శివుడు

  మా   ఇంటికొచ్చాడు   ఓ నాడు.

  మము    ఆడించి    పాడించి

  ఆనందమిచ్ఛి   వెళ్లాడు   నేడు.


• *దక్షిణ గ   ఏమి కావాలని    అడిగితే

  మా  ప్రేమ ను    అడిగాడు.

• అను క్షణం    శివుని   స్మృతి   లో

   కొలువై   జీవించమని   చెప్పాడు.


• ఎంత      గొప్ప వాడు     నా శివుడు

  ఎందరికి   దొరుకుతాడో   ఈ విభుడు.


*దక్షిణ = గురువు ఆచార్యులకు ఇచ్ఛెడి   బహుమానం.


యడ్ల శ్రీనివాసరావు 29 Apr 2023 10:30 PM.









Thursday, April 27, 2023

349. సంసార సంగీతం

 

సంసార సంగీతం



• సరిగమల   తాళం   నా వయసు  కు   శ్రావ్యం

  హిందోళ      రాగం    నా మనసు  కు    ప్రాణం.


• శృతి   లయల    పల్లవి తో

  అయింది   జీవితం   సింధూరం.

  తకదిమిల    తానం  తో

  మోగింది   అంబరం  సంబరం.


• సరిగమల   తాళం   నా వయసు కు   శ్రావ్యం

  హిందోళ రాగం    నా   మనసు కు    ప్రాణం.


• సంసారం    కుడి ఎడమ  లై

  దోబూచు  లా టాడుతు    ఉంటే

  గతి   తప్పిన    తాళం లా

  *మేళం    అవుతుంది   గందరగోళం.


• సరిగమల   తాళం   నా వయసు కు   శ్రావ్యం

  హిందోళ     రాగం    నా మనసు  కు    ప్రాణం.


• జీవస్వరాలు   రస రంజన  మైనా

  లయం కాని      భావాలన్నీ

  శృతి    తప్పిన    గానం లా

  తాళిని    చేస్తున్నాయి   ఎగతాళి.


• సరిగమల    తాళం    నా వయసు కు   శ్రావ్యం

  హిందోళ     రాగం      నా మనసు  కు    ప్రాణం.


• గమకముల    ఆధిపత్యం తో

  సంసారమే   ఓ     సంగీతం.

  ఎగుడు దిగుడు   శృతి  రేఖలన్నీ

  అష్ట వంకర     జీవన   తరంగాలు.


• సరిగమల   తాళం   నా వయసు కు   శ్రావ్యం

  హిందోళ      రాగం    నా మనసు  కు   ప్రాణం.


* మేళం = కలయిక 

యడ్ల శ్రీనివాసరావు 27 Apr 2023 9:00 pm.








Monday, April 24, 2023

348. ఈ సమయం

 

ఈ సమయం


• సమయమే      సమయమే

  సంతోషాలను

  ధారగా    పోసింది    ఈ   సమయమే.

  ఆఆ…ఆఆ….ఆఆ…ఆఆ….


• కొలువు    లేని    ప్రేమకు

  హద్ధుల    కొలతే    లేదంటూ

  పావనం    చేసింది.

  సమయమే    సమయమే   ఈ   సమయమే.


• జ్ఞాపకాల     అనుభవాలు

  ముంగురులై

  చెక్కిలి     తాకుతుంటే

  కనురెప్పల    తపనను

  చూసి

  నాట్యమే     చేసింది.

  సమయమే    సమయమే    ఈ   సమయమే.


• సమయమే     సమయమే

  సంతోషాలను

  ధారగా    పోసింది    ఈ   సమయమే.

  ఆఆ…ఆఆ….ఆఆ…ఆఆ….

 

• గువ్వ లా      మనసు

  ఎగురుతుంటే

  బంధాల     బరువులు

  కరిగి

‌  అందాల   వయసు ను    పిలిచింది.

  సమయమే   సమయమే   ఈ సమయమే.


• స్వర్గమే     సావధాన మై

  ముంగిట్లో    మెరుస్తూ  ఉంటే

  నన్ను   నాకు

  పరిచయం   చేసింది.

  సమయమే   సమయమే   ఈ సమయమే.


• సమయమే    సమయమే

  సంతోషాలను

  ధారగా   పోసింది    ఈ సమయమే

  ఆఆ…ఆఆ….ఆఆ…ఆఆ….


• అలల    సవ్వడి         సమయమే

  గలగలల    ఒరవడి     సమయమే

  కలల    మెరుపులు     సమయమే

  రెపరెపల    ఆనందాలు  సమయమే


• సమయమే   సమయమే    సమయమే

  నా కై    నిలిచి  ఉండింది   

  ఈ    సమయమే.

• సమయమే    సమయమే   సమయమే

  సరి కొత్త    శ్వాస  ను   

  స్వాగతిస్తోంది

  ఈ ...  నా ...  స ...  మ ... య ...  మే.


ఓం నమఃశివాయ 🙏.

యడ్ల శ్రీనివాసరావు   25 Apr 2023    5:00 AM.













Sunday, April 23, 2023

347. మధుర క్షణం

 

మధుర క్షణం


• ఈ   " క్షణం "   నీకై    పుట్టింది

  మరు   క్షణం     నన్నే   తట్టింది

  తక్షణం    ఏదో   అయ్యింది.


• ఏమిటో    ఈ    వింత

  ప్రతి క్షణం   ఎందు కీ     కలవరింత.

• ఏనాటి   దీ  పులకరింత

  అను క్షణం   వెంటాడుతుంది   మనసంతా.


• చెప్పవే    కాలమా

  మౌనంగా   నిలిచిన   సాక్ష్యమా.

• చూపవే    ప్రేమమా

  ఆశల     హరివిల్లు కి   ఆధారమా.


• ఈ   " క్షణం "    నీకై   పుట్టింది

  మరు  క్షణం      నన్నే  తట్టింది

  తక్షణం   ఏదో   అయ్యింది.


• గంధం   పూసిన    ఓ  *కుందనమా

  నీ మెరుపు లో    నేను    పరిమళం   కానా.


• పాశం    వేసిన    ఓ   ప్రణయమా

  నీ మమత లో    నేను   ప్రియతమం   కానా.


• ఏమిటో    ఈ   వింత

  ప్రతి క్షణం   ఎందు కీ    కలవరింత.

• ఏనాటి   దీ    పులకరింత

  అను క్షణం   వెంటాడుతుంది  మనసంతా.


• రూపం    తెలియని    స్వరూపమా

  ఆనందం     నీ     చిరునామా.

• కాలం     చెప్పని        కమనీయమా

  ఆస్వాదన    నీ    రంజనమా.

• మార్గం     చూపని      మనోగతమా

  నిరీక్షణ        నీ     నివేదనమా.


• ఏమిటో     ఈ    వింత

  ప్రతి క్షణం   ఎందు కీ    కలవరింత.

• ఏనాటి   దీ   పులకరింత

  అను క్షణం   వెంటాడుతుంది    మనసంతా.


• ఈ   " క్షణం "    నీకై    పుట్టింది

  మరు  క్షణం      నన్నే   తట్టింది

  తక్షణం   ఏదో    అయ్యింది.



కుందనము = బంగారం , స్వర్ణం.


యడ్ల శ్రీనివాసరావు  24 Apr 2023 , 12:00 PM.










Saturday, April 22, 2023

346. ఆకలి కేకలు

 

ఆకలి కేకలు


• కాలమా    కాలమా

  చలనం గా    మారేటి   గమ్యమా.

  కరుణ     లేదు   ఎందుకు

  కనికరం   లేదు   ఎందుకు.

• కాలే     కడుపుల కీ    కన్నీళ్లు    ఎన్నాళ్ళు

  పేగుల   రోదన     కీ    కేకలు      ఎన్నేళ్ళు

• ఇంకా    ఎన్నాళ్ళు

  ఇంకా     ఎన్నేళ్ళు


• కాలమా     కాలమా

  చలనం గా    మారేటి   గమ్యమా.

  కరుణ     లేదు     ఎందుకు

  కనికరం   లేదు    ఎందుకు


• దైవం ఎరుగని     దీనులపై    

   జాలి   ఎవరికో

  అన్నెం పున్నెం ఎరుగని  వారికి  

  అన్నం    పెట్టేది   ఎవరో.


• ఏమి   పాపమో   ఈ కర్మ

  ఏమి   నేరమో     ఈ శిక్ష


• చాపిన      చేతులకు     ఎంగిలి     కరువయ్యేను

  చూస్తున్న   చూపులకు   పూట       కష్టమయ్యేను


• కాలమా    కాలమా

  చలనం గా    మారేటి    గమ్యమా.

  కరుణ     లేదు   ఎందుకు

  కనికరం   లేదు   ఎందుకు

• కాలే   కడుపుల కీ    కన్నీళ్లు    ఎన్నాళ్ళు

  పేగుల  రోదన    కీ    కేకలు      ఎన్నేళ్ళు

  ఇంకా    ఎన్నాళ్ళు

  ఇంకా    ఎన్నేళ్ళు


• ఊపిరి  ఆడే    ఆటతో   దేహం అయింది  మైదానం

  ఆకలి    చేసే    నాట్యం తో  జీవం  అయింది  శవం.

• ఇంకా   ఎన్నాళ్ళు

  ఇంకా     ఎన్నేళ్ళు


యడ్ల శ్రీనివాసరావు 21 Apr 2023 7:00 pm.









Friday, April 14, 2023

345. జడి ఎందుకో

 

జడి ఎందుకో 



• జడి ఎందుకే   జవరాల    జడి ఎందుకే

  అలజడి తో   తడబడి తే    *ఒరవడి  పోతుందే

  స్థిరము తో   నిలబడితే  నే   స్థితి గతుల  వెలుగు

  అస్థిరము గయితే  చివరికి ఆందోళనే  మిగులు.


• జడి ఎందుకే    జవరాల    జడి ఎందుకే

  అలజడి తో   తడబడి తే   *ఒరవడి  పోతుందే

  మది ని   రాయిగ   చేస్తే   రత్నమై   మెరవదా 

  వ్యధ ను   మౌనం  చేస్తే    దగ్దమే    కాదా.


• ఆటలు పాటలు   ఆటుపోటు లయినంత లో

  సాగరం లో   అలలకు   ఆనందమే   కరువా.


• జడి ఎందుకే    జవరాల    జడి ఎందుకే

  అలజడి తో    తడబడి తే   *ఒరవడి  పోతుందే.

  బుద్ధి  సరి   ఉంటే నే     మాయ భయపడేది

  యుక్తి సరి   ఉంటే నే     శక్తి  నిలబడేది.


• కాగల  కార్యం   గంధర్వుడే  చేస్తాడు

  భారతాన్ని   మించిన  మనుధర్మమే లేదు.


• జడి ఎందుకే    జవరాల జడి   ఎందుకే

  అలజడి తో    తడబడి తే   *ఒరవడి  పోతుందే

  జడి పెరిగితే   తడి ఆరదు  …  కంటతడి అరదు.



జడి = బాధ, దుఃఖం

*ఒరవడి. = కట్టుబాటు, ఆచారం, మర్యాద, ఆదర్శం.


యడ్ల శ్రీనివాసరావు 14 Apr 2024 , 6:00 AM.









Thursday, April 13, 2023

344. వచ్చాడండి శివుడు

 

 వచ్చాడండి  శివుడు


• వచ్ఛాడండి    వచ్చాడు

  శివుడే   *సఖుడై    వచ్చాడు

  సంగమ  యుగాన  వచ్చాడు

  జనుల    కోసమే   ఉన్నాడు.

• వేదన   రోదన  లన్ని ….

  హ ...

  మన   వేదన   రోదన  లన్ని

  తనకే   అర్పణ   మిమ్మని  అడిగాడు.

  ప్రతిగా  ...  

  తన నే  స్మృతిని  చేయమని  అడిగాడు.

  సుఖ సంతోషాలను  ఇస్తానని  అన్నాడు.


• వచ్ఛాడండి   వచ్చాడు

  శివుడే    *సఖుడై    వచ్చాడు

  సంగమ   యుగాన   వచ్చాడు

  జనుల      కోసమే   ఉన్నాడు.


• పాప భారాల తో   

   పెదవి మెదప  లేని

   దుఃఖ పీడుతుల కు 

   అభయం ఇచ్ఛుట   కొచ్చాడు.


• అంధకారం తో 

  మాయ కు వశమై

  విల విల లాడే 

  పిల్లల   రక్షణ  కోసం   వచ్చాడు.


• వచ్ఛాడండి    వచ్చాడు

  శివుడే   తండ్రిగా    వచ్చాడు

  కలి  అంత్య కాలమున   వచ్చాడు

  స్వర్గ స్థాపనకు   వేచి    ఉన్నాడు.


• జ్ఞానము తోను 

  యోగము   చేయుట   చెపుతాడు.

  పాప కర్మలు   కరుగుటకు 

  మార్గం   ఏమిటో   చూపిస్తాడు.


• ఆది సనాతన   దేవి దేవత 

  ధర్మం   తిరిగి   స్థాపిస్తాడు.

  సత్యయుగపు 

  స్వర్గ పాలన ను   అందిస్తాడు.


• వచ్ఛాడండి     వచ్చాడు

  శివుడే    రక్షకు డై  నిలిచాడు 

  కళ్యాణ  కారి యై   ఉన్నాడు.


సఖుడు = సహాయకారి , ఇష్టుడు , ఆప్తుడు


ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 13 APR 2023 , 10:00 PM.











Wednesday, April 12, 2023

343. ఓ పాప - స్త్రీ మూర్తి


ఓ పాప - స్త్రీ మూర్తి


• లోకం  తెలియని  పాప

  బోసి   నవ్వుల    పసి బొమ్మ.

  చిరు    నవ్వులు   చిందిస్తూ

  చినుకుల  హర్షం  కురిపించావు.


• చిగురించే   వయసు లో   

  అమ్మనాన్నల కు

  ఆనందం   ఇచ్చావు     

  ఆశలను   కలిగించావు.

• నువు  మూర్తి వి   కాదు 

  దయా మూర్తి వి    అసలే  కాదు.

• పల్లవించు    హృదయం తో 

  నాన్నకు   చేయి   నిచ్ఛావు

• నీ ప్రేమ తో   

  నాన్న  గుండె  నిబ్బరం   చేశావు.



• లోకం   తెలియని  పాప 

  బోసి     నవ్వుల  పసి బొమ్మ.

  చిరు  నవ్వులు   చిందిస్తూ 

  చినుకుల  హర్షం  కురిపించావు.


• ఎదుగుతున్న    మనసు తో 

  అమ్మనాన్నల కు

  భారం   తగ్గించావు 

  భవ బంధాలకు   భరోస  అయ్యావు.

• నువు  లక్ష్మి వి    కాదు 

  సౌభాగ్య లక్ష్మి వి   అసలే కాదు.

• సిరులు   తెలియని    ఇంట 

  కాలి    గజ్జె ను    మోపావు.

• కంచు  మోగేటి   మెట్టింట 

   కనకమును     నింపావు.



• లోకం   తెలియని   పాప 

  బోసి    నవ్వుల    పసి బొమ్మ

  చిరు   నవ్వులు   చిందిస్తూ 

  చినుకుల   హర్షం  కురిపించావు.


• ఎదిగిన   వయసు లో 

  మాతృమూర్తి   వై

  బాధ్యత లను    మోసావు 

  సహనంతో      నిలిచావు.

• నువు   దేవి వి   కాదు 

  భూదేవి వి   అసలే  కాదు.

• దిక్కులు   తెలియని    సాగరం లో

  సంసార  నౌక కు   దిక్సూచి  అయ్యావు

• తీరం  చేరిన   ఆనందం తో

  కుటుంబానికి    ఆదర్శం   అయ్యావు.



• లోకం   తెలియని   పాప 

  బోసి     నవ్వుల    పసి బొమ్మ

  చిరు  నవ్వులు  చిందిస్తూ 

  చినుకుల  హర్షం  కురిపించావు.


• ఎదిగిన  మనసు తో

   అమ్మనాన్నల కు   

   తల్లివి   అయ్యావు.

   అత్తమామలకు     

   దేవత   అయ్యావు.

• నువు   మనిషి వి   కాదు 

  అందరిలాంటి   మనిషి వి   అసలే  కాదు.

• విలువలు  లేని     కలి కాలం లో

  దేవుని సృష్టి కి   ప్రతి రూపం   అయ్యావు.

• నిను  భోగ లాలన తో   చూసే   కీచకులను

  అపర  కాళివై   అంగాంగాలను   వధిస్తావు.



యడ్ల శ్రీనివాసరావు 12 APR 2023 9:30 PM.






Tuesday, April 11, 2023

342. అవసరాలు - మనుషులు

 

అవసరాలు – మనుషులు


• మనిషి జీవించేది అవసరాల కోసమా? అవసరాలు తీర్చుకునేందుకేనా?  అందుకోసమే నిత్యం మనిషి ఆలోచనలు ప్రతిబబింబాలై మనసు లో పరిభ్రమిస్తూ ఉంటాయా?  ఈ అవసరాలు తీర్చుకునే క్రమంలో    మనిషి ఎన్నో రకాల పాత్రలు, అభినయాలు చేస్తూ ఉంటాడా? ఇవి ప్రాధమిక మైన కనీస అవసరాలా లేక కోరికలతో నిండిన విలాసాలా ? అసలు  మనిషి  తన  అవసరాలను  నిజమైన అవసరాలు గా గుర్తించే  ఆలోచన కలిగి  ఉంటున్నాడా ?  లేక  ప్రతీది తనకి అవసరమే అనే భ్రమ తో  ఉంటున్నాడా ?  

 


• అవును … మనిషి స్వార్థ జీవి. జీవించేది తన అవసరాలను తీర్చుకునేందుకే మనుగడ చేస్తాడు. ఇందులో నే  ఒక విపరీతమైన ఇంటెలిజెన్స్ మనిషి కి ఉంటుంది. తనకు ఏది ఎలా కావాలో, అలా ప్రణాళికలు వేసుకుంటాడు. తన రక్షణ చూసుకుంటాడు. ఇదంతా సహజంగా ప్రతి మనిషి చేసేదే.


• కానీ ఈ అవసరాలు అనేవి ఎటువంటివి. శారీరకమైన వా,  మానసికమైన వా,    భౌతిక మైనవా? అంటే…. అన్నీ ఉంటాయి అది సహజం.


• కానీ ఈ అవసరాలు తీర్చుకునేందుకు మనిషి   ఏ మార్గం ఆచరిస్తున్నాడు. ధర్మబద్ధంగా నా లేక అధర్మం గానా?


• అసలు ఎందుకు ఇదంతా…. అంటే,   నేటి కాలంలో మనిషి తన అవసరాలు తీర్చుకునేందుకు,   ఎలాంటి దారుణాలకు  అయినా ఒడిగట్టవచ్ఛు   తద్వారా ఇష్టం వచ్చినట్టు  జీవించవచ్చు,  అనే  పనికి మాలిన సిద్ధాంతం తో  కూడిన  ఒక విపరీత ధోరణి  నేటి  సమాజం లో పెరిగి పోతూ వస్తుంది.  దీనికి మనిషి  తిరిగి చెపుతున్న సమాధానం ఏంటో తెలుసా,  నచ్చినట్టు బ్రతకడానికి కాకపోతే ఇంకెందుకు ఈ జన్మ.  ఉన్నది ఏ విధంగా  అయినా అనుభవించడానికే  కదా ... ఇది,  ఒక విచ్చల విడి తనంతో  మనిషి  ఇస్తున్న  సమాధానం. దీనికి కారణం మనిషి తాను ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదు అనే నిర్లక్ష్యం.


• ప్రతి మనిషి కూడా తనకు నచ్చినట్లు అవసరాలు తీర్చుకునే విధంగా జీవిస్తే,  మరి మనిషి కి మనిషి కి మధ్య సఖ్యత,   సమన్వయం ఎక్కడ కుదురుతుంది? ….. అంటే తప్పకుండా కుదురుతుంది,   ఒక మనిషి కి మరో మనిషి తో  ఏ  అవసరం లేదని భావించినపుడు లేదా   ఒక  మనిషి  మరో మనిషి పై పూర్తి గా ఆధారపడకుండా ఉన్నపుడు,   స్వతంత్రంగా  జీవిస్తున్నపుడు   కుదురుతుంది.  ఇందులో ఏ ఇబ్బందీ లేదు.


ఈ రోజు మనిషి జీవితాన్ని, జీవనవిధానాన్ని శాసించేది అవసరాలు.  వాటి ని  బట్టే  మనిషి , మనిషి లా జీవిస్తున్నాడా లేక   ఒక అతీతమైన జీవి లా మనుగడ చేస్తున్నాడా అనేది తెలుస్తుంది.


• మనిషి తన అవసరాలు తీర్చుకునే క్రమంలో ఎలా ప్రవర్తిస్తుంటాడు ?   అవసరాలు తీరిపోయాక ఇంకెలా ప్రవర్తిస్తున్నాడు ?   అనేది చాలా ముఖ్యం,   అదే  చివరికి   కర్మ ఫలం అవుతుంది.  అంటే  నేటి కాలంలో “అందితే జుట్టు అందకపోతే కాళ్ళు “  లేదా  “ ఏరు దాటగానే తెప్ప తగలబెట్టడం “  లేదా  “ పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్లట్లు “  అనే సామెతలు సార్థకం చేసే విధంగా జనజీవనం సాగుతుంది. దీనికి బహుశా ఎవరు అతీతం కాదు. అంటే మనిషి తన అవసరం కోసం, స్వలాభం కోసం ఎంతకైనా దిగజారడం అనేది సర్వసాధారణం అయిపోయింది. గమనించి చూడండి నిజమో కాదో తెలుస్తుంది.


• కానీ విచిత్రం ఏమిటంటే, ఇలా తన అవసరాలు కోసం మాత్రమే జీవించే ఒక మనిషి, , తనతోగాని, తనచుట్టూ జతపడిన మనుషుల కోసం గాని, లేదా ఎవరైనా శక్తి హీనులై సహాయం అభ్యర్థించే వారి కోసం గాని  ఆలోచించాలంటేే   లెక్కలు వేస్తూ తనకేంటి లాభం లేదా నాకెందుకు ఈ రిస్క్ అని ఆలోచిస్తాడు. లేదా ఆ సమయంలో తన పరిమితులు, హద్దులు, రక్షణ గుర్తుకు వచ్చి తన తెలివికి పదును పెట్టి అమాయకుడిలా ఉంటాడు. కానీ అదే మనిషి తనకు ఇతరులతో అవసరం పడినపుడు కాళ్ల వేళ్ల పడి బ్రతిమిలాడుతూ, దిగజారి బ్రతిమాలాడడం లేదా హక్కు గా అజమాయిషీ చేస్తూ  ఉంటాడు. అంటే తాను ఏది చేసినా ఎవరూ చూడడం లేదని అనుకోవడం మనిషి యొక్క అమాయకత్వం.


• ఏ రోజు అయితే మనిషి భూమి మీద పడతాడో, అప్పటి నుంచి మనిషి చేసే ప్రతి చర్య రికార్డు అవ్వవలసిన చోట అవుతూనే ఉంటాయి. అవే తిరిగి ఫలితాలు ఇస్తుంటాయి .  ఈ విషయం గ్రహించలేక పోవడం మనిషి దురదృష్టం.  ఎన్నో  తెలివితేటలు తో అద్బుతాలు  సృష్టించే,   మనిషి ని   సృష్టించిన భగవంతుడు కి   లెక్కలు వేయడం తెలియదంటే ఎలా ?.


• ముఖ్యంగా  మనుషుల లో వ్యాపారాత్మక దృక్పథంతో  ఉండే వారిలో  ఒక విచిత్రమైన ధోరణి కనిపిస్తుంది.  వ్యాపారాత్మక దృక్పథం అంటే,  కొందరు అందరు మనుషుల లా కాకుండా , వారు ఏ వృత్తి ఉద్యోగాలలో ఉన్నప్పటికీ కూడా  స్వభావ రీత్యా  తమ బుద్ది ని,  సమస్త శక్తి ని , దృష్టి ని, తెలివి తేటలని ,   మాటలను  అమాయకులను  ఆకర్షించే విధంగా ,  ఒక వ్యాపారి ఎలా ఆలోచిస్తాడో  అలా  లాభ నస్టాలు బేరీజు లతో,  నిత్య  జీవనం సాగిస్తూ  ఉంటారు.

ఇటువంటి వారి స్థితి ఎలా ఉంటుంది అంటే,  తమ అవసరాలు తీర్చుకునేందుకు  ఎన్నో కిటుకులు  ప్రదర్శిస్తారు.  

వీరిలో ఉన్న అతి తెలివితేటలు వారికే,  రాను రాను బలహీనత గా మారి  విలువలు కోల్పోతారు. చివరికి ఆ తెలివితేటలే ఒక శాపం గా మారి, ఎన్నో పాపాలకు చేసేందుకు  శ్రీకారం చుడతాయి.  ఇటువంటి మనుషులు వ్యక్తి గత కోరికల కోసం, అవసరాల కోసం  కపట నాటకం చూపిస్తూ, అవి తీర్చుకునేందుకు ఎలాగైనా ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో ఏ మాత్రం మొహమాటం ఉండదు సరికదా అదే తమ బలం  అనుకుంటూ,    ఆరితేరిపోయామని అనుకుంటారు.

ఇటువంటి వారు  ఇతరుల అవసరాలకు ఏ మాత్రం ఉపయోగపడరు. ఒకవేళ ఉపయోగపడినా , లాభం ఏమిటా  అని ఆలోచిస్తారు. ఆఖరికి వీరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నేను మాత్రమే మనిషి ని, మరెవ్వరూ కాదు అనే స్వార్థంతో  జీవిస్తూ ఉంటారు.  ఇదంతా వారి  అంతరంగం లో నడిచే ప్రక్రియ మరియు మానసిక స్థితి.   

ఒకసారి ఆలోచిస్తే,  ఇటువంటి వారు దైనందిన జీవితంలో  మనకు  తారసపడ్డారా లేదా  అనేది  ఒకసారి ఆలోచిస్తే  తెలుస్తుంది.


• ఒక మనిషి ఎప్పుడైనా వస్తువుల పట్ల లెక్కలు అంచనాలు వేస్తూ , అవసరాలు తీర్చుకుంటూ జీవితం గడపడం లో ఏ ఇబ్బందీ ఉండదు. కానీ అదే లెక్కలు అంచనాలు జీవితం పట్ల, తోటి   సాటి మనుషుల  పట్ల వేస్తే, పరిస్థితులు తారుమారు అయిపోయి తన ఉనికి కే ‌సమాధానం చెప్పుకో లేని స్థితి  వస్తుంది.


• మనిషి తోటి మనిషి ని మాయ చెయ్యడం, మోసం చెయ్యడమే విజయం గా భావిస్తున్న దుస్థితి నేటి పరిస్థితి. ఇది ప్రాధమిక స్థాయిలోనే కాదు అత్యంత ఉన్నతంగా కనిపించే ప్రతీ అభివృద్ధి చెందుతున్న అంశం లో సూక్ష్మంగా దాగి ఉంది, ఈ దౌర్భాగ్యపు స్థితి. ఉదాహరణకు అణు మూలకాలను విద్యుత్ తయారీ  కోసం ఉపయోగిస్తూ , అభివృద్ధి అంటారు.  కానీ ప్రమాదకరమైన అణుబాంబులను తయారు చేస్తూ వినాశనానికి ఒడిగడతారు. అది ఒక విజయం అని భావిస్తారు.


• ఓ మనిషి .... నీ అవసరాలు ఇతరులతో తీర్చుకునేందుకు కోసం మాత్రమే నువ్వు జీవించడానికి పుట్టలేదు. ధర్మ బద్ధంగా ఇతరుల అవసరాలు కూడా తీర్చేందుకు నువ్వు ఉన్నావని గ్రహించడం లో  ఇతరుల పట్ల,  నీ  బుణం ఏమిటో నువ్వు ఉన్న బంధం లో తెలుస్తుంది.    లేదంటే ఈ క్షణమే ఊపిరి కూడా అనుకోవచ్చు,  నేను నీకు అవసరం లేదని. 


• ఓ మనిషి .... నువ్వు, ఒకరి అవసరాలు తీర్చలేని స్థితి లో ఉంటే , ఒకరికి సహాయం చేయలేని స్థితిలో ఉంటే, ఎవరిని సహాయం అడుగుకు , ఇతరులను నీ అవసరాలు తీర్చమని అడగకు.    ఒకవేళ నీ అవసరం ధర్మబద్ధ మైనది అయితే , నువు కోరుకునే సహాయం సరైనది అయితే , నీ గత కర్మ ఫలం శ్రేష్టమైనది అయితే నీ అవసరం తీర్చడానికి, నీకు సహాయం చేయడానికి ఈశ్వరుడే ఏదొక రూపం లో తప్పకుండా నీ దగ్గరకు వస్తాడు.


• కృతజ్ఞత ఉన్నచోట మాత్రమే  దైవత్వం నిలుస్తుంది.

నేటి సమాజంలో , జీవితం లో ఒక పరిపక్వత వయసు కి వచ్చిన వారు కూడా వ్యక్తిత్వ విలువలను పాటించక పోతే, తరువాత తరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే తరచూ వార్తలలో చూడడం జరుగుతుంది. అటువంటి స్థితి సమాజం లో, ఎక్కడో కాదు కదా స్వయం కుటుంబాలలో, జీవితాలలో ఎదుర్కొనే స్థితి రాకూడదనే సంకల్పం తో ..... ఒక చిన్న విలువతో  రాసినది.


ఇది ప్రతి మనిషి కూడా ఎవరికి తోచిన విధంగా వారు మనసులో  అన్వయం చేసుకుంటే  ఎంతో కొంత అర్దం తెలుస్తుంది,  తమకు తాము ఏమిటో ... తాము ఏ స్థితిలో ఉన్నామో.... ఇది రాస్తున్న వాడితో సహ.


ధర్మో రక్షతి రక్షితః .


ఓం నమఃశివాయ 🙏.


యడ్ల శ్రీనివాసరావు 11 Apr 2023 , 10:00 PM .












Monday, April 10, 2023

341. సదా శివ సాంబ శివ

 

సదా శివ సాంబ శివ




• సాంబ శివ     సదా శివ

  సాంబ శివ      సదా శివ.

  శివ శివ         శివ శివ

  సదా శివ       సాంబ శివ.


• ఏమని     చెప్పేది 

  నీ మహిమను    ఎలాగ   చెప్పేది.

  హర హర    అంటే   పాప హరణమని

  నవ నాడులు   సైతం    ఘోషిస్తుంటే.

  శివ శివ       అంటే   ముక్తి   భాగ్యమని 

  నవ గ్రహములు   నిత్యం  ఆలపిస్తుంటే.

  ఏమని    చెప్పేది 

  నీ మహిమను    ఎలాగ   చెప్పేది.


• సాంబ శివ     సదా శివ

  సాంబ శివ     సదా శివ.

  శివ శివ         శివ శివ

  సదా శివ     సాంబ శివ.


• మానవులందరి   తండ్రి వి

  మననము తోనే   మది న   కొలువై  ఉంటావు.


• సత్యము   నందలి   శక్తి వి

  నిత్యము   సన్మార్గము న   నడిపించు  వాడవు.


• బుద్ధి ని    నీ పై    జోడిస్తే

  జ్ఞానము ను  చెపుతావు    శ్రేష్టం గా   చేస్తావు.


• సాంబ శివ      సదా శివ

  సాంబ శివ      సదా శివ

  శివ శివ         శివ శివ

  సదా శివ       సాంబ శివ


• ఏమని   చెప్పేది 

  నీ మహిమను   ఎలాగ    చెప్పేది.

  హర హర    అంటే    జీవ శక్తి అని

  ముల్లోకాలన్నీ    మారుమ్రోగుతుంటే.

• శివ శివ     అంటే    ఆశీస్సుల తో 

  అష్టదిక్పాలకులు   నాట్యం చేస్తుంటే 

  ఏమని చెప్పేది 

  నీ మహిమను   ఎలాగ    చెప్పేది.


• సాంబ శివ    సదా శివ

  సాంబ శివ    సదా శివ

  శివ శివ        శివ శివ

  సదా శివ      సాంబ శివ


• నిఖిలం   నీవని     అఖిలం   అంతయు

  ఓం కారంతో   మా   హంకారాన్ని    హరించావు.


• కర్మలకు నీవు  అతీతం కాదని అంటూ 

  ఎవరు  చేసిన   కర్మలకు   వారే  బాధ్యులంటావు.


• సాంబ శివ     సదా శివ

   సాంబ శివ     సదా శివ.

  శివ శివ         శివ శివ

  సదా శివ       సాంబ శివ.


యడ్ల శ్రీనివాసరావు 11 Apr 2023 6:00 AM.








Sunday, April 9, 2023

340. వ్యక్తిత్వం పరిమళ పుష్పం

 

వ్యక్తిత్వం పరిమళ పుష్పం



• సృష్టి లో ప్రతి మనిషి కి రెండు వ్యక్తిత్వాలు అయితే తప్పనిసరిగా ఉంటాయి. అవి outer personality and inner personality బాహ్య వ్యక్తిత్వం మరియు అంతర్గత వ్యక్తిత్వం. ఈ రెండు వ్యక్తిత్వాలు మధ్య దూరం ఎంత తక్కువగా ఉంటే మనిషి జీవితం అంత సజావుగా జరుగుతుంది.

• ఏ మనిషి అయినా పైకి కనిపించేది వేరు, లోపల ఉండేది వేరు.   ఎక్కడైనా సరే  బయటకు కనిపించే మనిషి కోరుకునెది ఒకటేే.  తన ప్రవర్తన నలుగురిలో  ఎలా కనిపించాలని  ఆశిస్తాడో,   అదే తన అసలు వ్యక్తిత్వం అనుకుంటూ,   అందుకోసం శత విధాల సమాజం లో  అందరికీ  చూపించే  విధంగా  ప్రయాత్నాలు చేస్తూ నే ఉంటాడు. 

ముఖ్యంగా మనిషి జీవితంలో ఒక  ప్రౌడ  వయసు, ఒక స్థితి కి చేరిన తరువాత ఇది మొదలవుతుంది. బంధువులతో, స్నేహితులతో, వృత్తి ఉద్యోగాలలో తోటి వారితో ఉన్నప్పుడు ఈ బాహ్య వ్యక్తిత్వం మంచిగా కనపడాలనే తాపత్రయం ఉంటుంది. 

ఈ సమయంలో  మనిషి కి తనలోని బలహీనతలు బయటపడకుండా ఉండేందుకు చేసే అంతర్గత పోరాటం తనపై తనకు మొదలవుతుంది. ఎందుకంటే బయటకు కనపడే వ్యక్తిత్వ లక్షణాలే అసలైన వి, నిజమైనవి అని వాటి ద్వారా నే తనకు మంచి గా గుర్తింపు వస్తుంది లేదా తోటి సాటి మనుషులు విలువ ఇస్తారని అనుకుంటూ, ఒక భ్రమలో ఉంటాడు.

• సమాజం లో లేదా నలుగురిలో ఉండేటప్పుడు మాట, ప్రవర్తన, వ్యక్తిత్వం మంచి గా , ఉత్తమం గా, ఉన్నతంగా సభ్యుతగా ఉండడం చాలా అవసరం. కానీ దాని కోసం మనిషి లో అంతర్గతం గా లేని  వ్యక్తిత్వాన్ని, గుణాలను, స్వభావాన్ని ప్రదర్శిస్తే నవ్వుల పాలు అవడం ఖాయం. లేదా ఎవరో ఉత్తములను ఆదర్శం గా తీసుకుని అనుకరించడం ప్రమాదం. ఒకరిని  అనుకరించడం కంటే ముందు పరివర్తన చెందడం ముఖ్యం.


• మనిషి ఎప్పుడూ ఇతరుల కోసం , ఇతరుల మెప్పు కోసం , అవసరాల కోసం  తన వ్యక్తిత్వం తీర్చి దిద్ధుకోకూడదు.  ధర్మానుసారంగా మనిషి    జీవించాలి   అనుకొని  ,   తన వ్యక్తిత్వాన్ని  బాహ్యం గా  అంతర్గతం గా  ఒకే విధంగా ఉంచుకుంటాడో ,  అప్పుడు  మనిషి దృఢం గా చిత్తశుద్ధితో ఉంటాడు. ఇలా ఉన్న స్థితిలో మనిషి ఎక్కడా నటించవలసిన అవసరం ఉండదు, పాటించవలసిన నియమం అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. లేదంటే అంతర్గత వ్యక్తిత్వానికి, బాహ్య వ్యక్తిత్వానికి సమన్వయం లోపించి ఏదొక సమయం లో సంఘర్షణ , నలుగురి లో నవ్వుల పాలు కావలసివస్తుంది.

• మేకప్ అనేది ఎప్పుడూ మేకప్పే. ఎప్పుడైనా వర్షం వస్తే వెలిసి పోతుంది. సహజ సిద్ధమైనది ఎప్పుడూ సహజంగా నే ఉంటుంది.

• పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతుంది అనే సామెత ఉంది. అదే విధంగా బయటకు కనిపించే మనిషి యొక్క ప్రవర్తన నిజం అని,    సమాజం లో అందరూ అదే అసలైన వ్యక్తిత్వం  గా భావించాలని, ఏ మనిషైనా ఆశిస్తే,   అది ఒకవిధమైన తెలియని అమాయకత్వం.  చెప్పాలంటేే మనిషి తనను తాను మోసం చేసుకుంటున్నట్లు.  ఎందుకంటే  ఎవరికి తెలియకుండా  మనిషి  గుప్త నిధులు, ఆస్తులు దాచవచ్ఛు కానీ   తన  గుణగణాలను, వ్యక్తిత్వాన్ని ఎంతో కాలం దాచలేడు.  ఎందుకంటే మనిషి ప్రాణం తో జీవిస్తూ ఉంటాడు కాబట్టి.

• బాహ్య వ్యక్తిత్వం ఎంత మంచిగా మనిషి కనపడాలి అని అనుకుంటాడో, అంతర్గత వ్యక్తిత్వం కూడా దాదాపుగా అలా ఉంటే ప్రతి మనిషి పరిమళించే పుష్పం అవుతాడు. అంతకు మించి జీవితం సజావుగా సాగుతుంది.


• ఒక పెద్ద భవనం ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని కూలిపోకుండా నిలబడాలంటే , పునాది బలంగా ఉండాలి. అంతేకానీ భవనానికి రంగులు వేసి, ఆకారాలతో దిద్ది , మెరుగులు పెట్టినా  ఎంతో కాలం నిలవక  కూలిపోతుంది. అదే విధంగా ఒక వృక్షం మంచి ఫలాలు, నీడ ఇవ్వాలి అంటే వేర్లు కు  చీడ పట్టకూడదు. వేర్లు ఆరోగ్యం గా , బలంగా ఉండాలి.

• అదే విధంగా మనిషి జీవితంలో ఎన్నో సమస్యల్ని, పరిస్థితులను ధైర్యం గా ఎదుర్కొని నిలబడాలంటే అంతర్గత వ్యక్తిత్వం , మనసు బలం గా ఉండాలి. అంతే కానీ బయట ప్రపంచానికి అందంగా కనిపించే విధంగా, గుర్తింపు కోసమో మరే ఇతర ప్రయోజనాల కోసమో వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తే చివరికి బాధ మిగులుతుంది.  మనిషికి మొదట తన కుటుంబం వృద్ధి, ఆ తరువాత సమాజ అభివృద్ధి కావాలని కోరుకుంటే ముందు తనలో అంతర్గత వ్యక్తిత్వం స్థిరం గా ఉంచుకోవాలి.

• మనిషి జీవిత ప్రయాణం అంటే ప్రతీ వయసు లో, ప్రతీ పరిస్థితి లో ఎంతో కొంత నేర్చుకోవడం, తనను తాను సరిదిద్ది కోవడం.

• బహుశా ఇదంతా అంత సులభంగా అయిపోయే ప్రక్రియ కాదు. నిరంతర అభ్యాసం ఎంతో కొంత ఉంటే, సాధ్యం అవుతుంది, పైగా తనకు తాను ఉద్ధరించ బడతాడు. అందుకు చేయవలసింది ఒకటే , మనిషి తనను తాను విశ్లేషించుకోవడం. తనలోని లోపాలు లేదా నెగెటివ్ అంశాలను అంగీకరించడం. ఎందుకంటే ఎప్పుడైతే ఏదైనా అంగీకరించడం జరుగుతుందో అహం నశిస్తుంది. అహం నశిస్తే, తనలో మాయ తొలగి మనిషి కి తన గురించి తనకు నిజం తెలుస్తుంది.


• Name, Fame కోసం మనిషి పరిగెత్తి నా, అష్ట కష్టాలు పడినా దొరకవు. ఒకవేళ దొరికినా నీటి బుడగలా కొంతసేపు మాత్రమే. మనిషి మంచి కర్మలు చేస్తూ  పరిమళ భరితమైన స్థితి కి ఎప్పుడు వస్తాడో, Name, Fame అవే వెతుక్కుంటూ మనిషి దగ్గరకు వస్తాయి. అటువంటివి మనిషి కి చరిత్ర లో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఎందుకంటే ఎందరో మహానుభావులు నేటికీ జీవించి లేకపోయినా వారి పేరు, కీర్తి, ఆదర్శాలు భూమి మీద బ్రతికే ఉన్నాయి. ఎందుకంటే వారు ఉన్నతమైన అంతర్గత వ్యక్తిత్వాన్నే , బాహ్య వ్యక్తిత్వం గా అతి సామాన్యంగా  ఆచరించి జీవించారు.


• నేడు ఏ మనిషి అయినా బయటకు చక్కగా కనిపిస్తూ, నిత్యం లోపల బాధ అనుభవిస్తు ఉన్న లేదా అవలక్షణాలు, వికారాల తో సతమతం అవుతు ఉన్న తప్పకుండా అంతర్గత వ్యక్తిత్వం బలోపేతం చేసుకోవాల్సిందే. మనిషి బ్రతికేది ఎవరి కోసమో కాదు, తన కోసమే కాబట్టి.

• ఎప్పుడైతే మనిషి ఎక్కువగా ఇతరుల అంతరంగం లోనికి దృష్టి పెట్టకుండా (తొంగి చూడకుండా) ఉండగలడో అప్పుడు మాత్రమే తన అంతరంగం, వ్యక్తిత్వం స్పష్టం గా కనిపిస్తుంది. ఈ స్థితి చాలా మంది మనుషులకు అనారోగ్యం బారిన పడి , కదలలేకుండా మంచం మీద ఉన్న ఆఖరి సమయం లో మాత్రమే తెలుసుకుంటారు, అటువంటి వారు దురదృష్ట వంతులు అని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటికే కాలాతీతం అయిపోతుంది.

• జీవితం లో ప్రతీ ఒక్కరికీ అరుదైనవి, అపురూపమైనవి, విలువైనవి, మేలు చేసేవి ఏదో ఒక సందర్భంలో, ఒక సమయంలో మాత్రమే దొరుకుతాయి. వాటిని జాగ్రత్త పరుచుకొంటే ఆరోగ్యం, సంపద, సంతోషం పెరుగుతాయి.


ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 9 Apr 2023 7:30 PM.


Friday, April 7, 2023

339. నవ జీవన వేదం

 

నవ జీవన వేదం



• కనులు   చెప్పే    మాటలతో

  మనసు    తేలికవుతుంది ...

  భావం   ఓ రాగం   అనురాగం.

• వ్యధలు   మాసిన    సమయం లో

  ఎద   ఎగసి ఎగసి   పడుతుంది ...

  భావం   ఓ గీతం      సంగీతం.


• మౌనం   వేసే   అడుగుల కు

  హృదయం   హారతి   నిస్తుంటే 

  దూరం   తెలియని   ఈ దిక్కులకు

  వెలుగే   దారి   నిస్తుంది.


• ఊసులు    చెప్పని    భాసలు

  ఊహలు    దాటి     ఎగిరిపోతే

  రెక్కలు    విడిచిన    పక్షి

  వెన్నెల    తీరం    తాకింది.


• మధురం     నింపిన     కాలం

  సుమధురంగా   తోడవుతుంది ...

  భావం   ఓ *తానం   *సనాతనం.

• ఆశలు   కలిగిన     అనుభవాలు

  ఆనందంగా   ఆవిరైపోయాయి ...

  భావం   ఓ *పల్లవి   జీవనపల్లవి.


• *ఉమంగ     ఉత్సాహాలతో

   ఉరకలు  వేస్తుంది    శేష కాలం.

   అది    సరికొత్త   లోకానికి

   ద్వారం   తెరచిన  ఆహ్వానం.


• తావే   లేని    *తమకంతో

  తకదిమి    బాజాల   మేళం

  అదే    నవజీవన    వేదం

  మనసు  కార్యానికి   సఫలం.



*తానం = మెరుగుదల యొక్క రూపం.

*సనాతనం = శాశ్వతం, కాలానికి అతీతం.

*పల్లవి. = పాట సాహిత్యంలో తిరిగి పదే పదే చెప్పేది.

*ఉమంగ = ఉవ్విళ్లూరించె సంతోషం

*తమకం = మోహం, కోరికలు.



యడ్ల శ్రీనివాసరావు 7 Apr 2023 10:00 pm


Wednesday, April 5, 2023

338. చైత్ర ఫౌర్ణోదయం

 

చైత్ర ఫౌర్ణోదయం


• ఈ ఉదయం   పూర్ణోదయం

  ఉగాది తెచ్ఛిన    తొలి    సంపూర్ణోదయం


• పౌర్ణమి    చంద్రుని   కాంతితో

  నేడు  సూర్యుని  రూపం   పరిపూర్ణం.


• సూర్యచంద్రుల  కలయిక 

  ఈ  చైత్ర  పౌర్ణమి  విశేషం.

• ఆత్మ    మనసు ల 

  సమతుల్యం   దీని  ప్రాధాన్యం.

• విశ్వ వలయం లో  ఇది  

   అపురూప సంయోగం.

• ప్రకృతి   పురుష 

   పుంగవులు కి  *తలమానికం.


• ఈ ఉదయం     పూర్ణోదయం

  ఉగాది   తెచ్ఛిన.   తొలి సంపూర్ణోదయం.


• విష్ణు  సహస్రనామ  పఠనం 

  దుఃఖ   సంకట   హరణం.

• సత్యదేవుని స్మరణం 

  సకల కార్యసిద్ధి కి సోపానం.


• శివుని ఆదేశం తో  బ్రహ్మ విశ్వాన్ని 

  సృష్టించిన  మాసం  చైత్రం.

• గ్రహములను  అనుసంధాన

   కాలం   ఈ పుణ్య మాసం.


•  పాప కర్శల విముక్తి  కై 

  తపస్సు చేసిన ఇంద్రుని కి

  కదంబ వృక్షం  చెంతన 

  నేడే జరిగెను శివుని సాక్షాత్కారం.

• మధుర మీనాక్షి  ఆలయం 

  ఈ వృత్తాంతపు  సన్నిధానం.


• ఈ ఉదయం    పూర్ణోదయం

  ఉగాది తెచ్ఛిన    తొలి   సంపూర్ణోదయం


• పౌర్ణమి    చంద్రుని    కాంతితో

  నేడు   సూర్యుని  రూపం   పరిపూర్ణం.


• ఆత్మలో   చీకటి  నశించే

  నేటి  చంద్రకాంతి  శక్తి తో.

• జ్ఞానం   వెలుగై    నిండే 

  నేటి   సూర్య కాంతి శక్తి  తో.


• చిత్ర గుప్తుని కి   పూజలు 

  చేసే   ఏకైక     పర్వ దినం.

• యమధర్మరాజు  పాపులపై 

   కరుణ  చూపే  మోక్ష  దినం.


• ఈ ఉదయం     పూర్ణోదయం

• ఉగాది  తెచ్ఛిన    తొలి   సంపూర్ణోదయం


*తలమానికం = శిరస్సు మీద ఉంచుకునే దివ్యమైన మణి


ఈ రోజు చైత్ర పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు. చంద్రుని యొక్క కాంతి సూర్యుని పై పడి ప్రభావితం అయ్యే రోజు. ఈ విధంగా ఒక్క చైత్ర పౌర్ణమి నాడు మాత్రమే జరుగుతుంది. చంద్రుడు అంటే మనసు, సూర్యుడు అంటే ఆత్మ. మనసు ఆత్మను చైతన్యం చేసే అద్భుతమైన శక్తి చంద్రుని యొక్క కాంతి ద్వారా సృష్టి లో సకల జీవుల కు చేరుతుంది.

అదే విధంగా ఇంద్రుడు తాను తెలిసి తెలియక చేసిన పాపము లకు విముక్తి కోసం బృహస్పతి ని అడుగగా,…. బృహస్పతి చెప్పిన సలహ ప్రకారం కదంబ వృక్షం క్రింద తపస్సు చేస్తాడు ఇంద్రుడు. ఆ వృక్షం క్రింద శివుడు ఉండి రోజు రోజుకు ఇంద్రుని యెక్క పాపాలను శివుడు కరిగించి , నేటి దినమైన చైత్ర పౌర్ణమి నాడు శివుడు ఇంద్రుని కి శివలింగ రూపంలో దర్శనం ఇస్తాడు. ఇది జరిగిన ప్రదేశమే నేడు మధురై లో మీనాక్షి అమ్మవారి దేవాయలయ ప్రాంగణ ప్రదేశం.

ఈ రోజు విష్ణు సహస్రనామ పఠనం, సత్యన్నారాయణ స్వామి వ్రతం, కధ వినడం, స్మరించడం సాయంత్రం వేళలో అంటే చంద్రోదయ సమయంలో  చేస్తే పాపాలు నశించే మార్గం తెలిసి, జ్ఞానం లభిస్తుంది.

హనుమంతుని జయంతి  చైత్ర పౌర్ణమి రోజున జరుగుతుంది . 

కాంచీపురం  ఈ సమస్త భూమండలానికి గరిమనాభి స్థానం.  కంచిలో 108 దేవాలయాలు కలవు.  చిత్ర గుప్తుని కి కేవలం కంచిలో మాత్రమే ఆలయం కలదు.  చిత్రగుప్తుని కి కంచిలో నేడు విశేషమైన పూజలు చేసే ఏకైక దినం చైత్ర పౌర్ణమి.  ఎప్పుడూ కఠినం గా శిక్ష లు అమలు చేసే యమధర్మరాజు , నేటి  దినమున మాత్రమే కరుణ చూపిస్తాడు.  ఇది అంతా శివుని అనుగ్రహం వలన చంద్రుని  కాంతి  శక్తి తో  సాధ్యం  అయింది.

ఉగాది ఆరంభం నుంచి బ్రహ్మ చే  సృష్టి ని కొత్త గా స్థాపింప బడుతుంది. మరియు గ్రహాలను అనుసంధానం చేసే పవిత్ర మాసం చైత్ర మాసం.

నదీ స్నానం, పూజ, ధ్యానం చేయడం వలన ఎంతో మేలు జరుగుతుంది మానవుని కి.

ఇది గ్రహించి అమలు చేసుకున్న వారు ధన్యులు.

ఇది అంతయు విశ్వం లో ని శక్తి వలన జరుగుతుంది. ఆ శక్తి తో నే సకల జీవులు, మానవుడు జీవిస్తాడు. మనిషి కూడా ఈ విశ్వ శక్తి తో అనుసంధానం ధ్యానం ద్వారా అయినపుడు అద్బుతాలు జరుగుతాయి.

యడ్ల శ్రీనివాసరావు 6 Apr 2023. 3:30 AM.





Tuesday, April 4, 2023

337. జిగురు మట్టి


 జిగురు మట్టి





• మట్టి మట్టి    నల్ల మట్టి      నల్లనైన మట్టి

  గోదావరి  కడుపులో    జీవించే    జిగురు మట్టి.

• విత్తుల ను    పెంచి   పెద్ద     చేసేటి     *ఉట్టి

  వృక్షాల ను    నిలిపేను    తన కడుపున కట్టి.


• మట్టి మట్టి     నల్ల మట్టి     నల్లనైన మట్టి

  గోదావరి  కడుపులో    జీవించే   జిగురు మట్టి.


• విగ్రహల రూపం గా   మారేను   మనిషి  చేత పట్టి

  నున్న గ    నాణ్యమై    ఆరేను    ఎండ బెట్టి.

• లక్కపిడత   బొమ్మల కై   నలిగేను    ప్రాణం  పెట్టి

   పిల్లల   మనసు లలో    నిలిచే ను    జై కొట్టి.


• మట్టి మట్టి    నల్ల మట్టి      నల్లనైన మట్టి

  గోదావరి కడుపులో    జీవించే   జిగురు  మట్టి.


• చేల గట్ల   కోసం  సమిధ లా    వెలిగేను   చిట్టి

  ఆదమరచి   అందు అడుగేసిన   లేపేను   తట్టి.

• ప్రతి ఇంటా   మొక్క కి    కొలువయ్యేను  తొట్టి

  వరద లో  కరిగి పోయి   మిగిలెను  అంతా *వట్టి.


• మట్టి మట్టి     నల్ల మట్టి     నల్లనైన మట్టి

  గోదావరి  కడుపులో    జీవించే    జిగురు మట్టి.

• పావు వంతు   భూగోళం  నిండేను   అంతా చుట్టి

  చివరికి  సర్వ జీవులు  కలిసే నీలో   తిరిగి రానట్టి.



*ఉట్టి = మట్టితో చేసి మట్టి నింపినది.

*వట్టి = నిష్ప్రయోజనం, ఏమీ లేకుండా


యడ్ల శ్రీనివాసరావు 5 Apr 2023 4:00 AM.








336. స్థితి గతులు

 

స్థితి గతులు



• జీవితం లో జరిగే ప్రతీ అంశానికి ఒక కారణం తప్పక ఉంటుంది. కానీ, ఆ కారణాలు అందరూ తమకు ఉన్న సహజ సిద్ధ స్వభావం తో తెలుసుకోలేరు. ప్రతీ మనిషికి తన జీవితంలో జరుగుతున్న మంచి చెడు, సుఖం దుఃఖం , బంధాలు వివాదాలు ఇలా ఎన్నో రకాలైన అంశాల తో ముడిపడి ఉంటుంది. దీని యొక్క స్పష్టత మనిషి కి తెలియాలంటే కొంత సాధన తప్పని సరిగా చేయాలి.

• మనుషుల కు కొన్ని సార్లు ఊహించని సంఘటనలు జీవితం లో జరుగుతాయి. అదే విధంగా కొన్ని సార్లు ఊహించినవి కూడా జరుగుతాయి. సాధారణంగా ఊహించి న సంఘటన లేదా అంశం జరిగినపుడు కొంత ఉద్వేగం మాత్రమే ఉంటుంది. అదే ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు చాలా ఎక్కువ ఉద్వేగం ఉంటుంది. అలా తరచుగా ఊహించని సంఘటనలు తరచూ జరుగుతుంటే ఏదో ఒక రోజుకు ఉద్వేగం కాస్త పూర్తిగా పోయి,. అసలు ఎందుకు ఇలా నాకు జరుగుతుంది అనే ఆలోచన మొదలవుతుంది. అక్కడ నుండే కారణం తెలుసు కునే స్థితి సాధ్యం అవుతుంది. ఇక్కడ ఉద్వేగం అంటే ఆనందం లేదా బాధ అనేది సంఘటన బట్టి ఉంటుంది.

• ఒక మనిషి ఉన్నత స్థితికి చేరడం అనేది కొందరికి తమ జీవితం లో ఆకస్మికంగా జరగవచ్చు లేదా స్వయం కృషి వలన కావచ్చు. ఉన్నత స్థితి అంటే ఈ లోకంలో చాలా మంది అనుకునే విధంగా ధనం సంపాదించడం, వృత్తి ఉద్యోగాలలో శిఖర స్థాయికి ఎదగడం, విలాసవంతమైన జీవనం గడపడం కాదు. ఎందుకంటే ఇవి మనిషి కి ఒకరోజు ఉండొచ్చు, మరొక రోజు ఉండక పోవచ్చు, పైగా ఇవన్నీ ఉన్నా సరే మనిషి లో లోపల చాలా అధమ స్థితి (దుఃఖం, అశాంతి) అనుభవిస్తూ ఉండొచ్చు. చెప్పాలంటే నేటి కాలంలో ఇటువంటి వారే తొంభై తొమ్మిది శాతం ఉన్నారు. ఎందుకంటే ఎంత ధనవంతుడిని పలకరించినా నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పలేని పరిస్థితులు వ్యక్తులలో నెలకొన్నాయి.

• కానీ వీటన్నింటికీ అతీతంగా, అతి సాధారణమైన మనిషి కూడా(ధనవంతులు కాని వారు ) తన జీవితంలో అత్యున్నత స్థితి పొందవచ్చు. అదే మానసిక పరిపక్వ స్థితి. అంటే మనసు కి చపలత్వం లేని స్థితి.

• ఎలాంటి మనిషి అయినా ఉన్నత స్థితి అనుభవాన్ని పొందాలంటే ఆర్థిక, సామాజిక అంశాల ప్రభావం అవసరం లేదు. శ్రేష్టమైన కర్మ లు, ఆలోచనలు, సంకల్పాలు, సహాయగుణం చాలు. ఇవి ఏనాడైతే మనిషి లో ఉత్పన్నమవుతాయో , ఆనాటి నుండి ఆధ్యాత్మికత, దైవం యొక్క అనుభవాలు మరియు సాక్షాత్కారాలు అవడం మొదలవుతాయి.

• కోరికల కోసం భక్తి తో ఎన్నో సంవత్సరాలుగా పూజలు, జపాలు చేసిన కూడా లభించని ఫలితాలు కేవలం పైన పేర్కొన్న అంశాలతో అనుభవం అవుతుంది. అప్పుడు మనిషి కి తన జీవితంలో జరిగే ప్రతీ సంఘటన యొక్క విశేషత అర్దం అవుతుంది. కాకపోతే ఈ స్థితి పొందడానికి కొందరికి కొన్ని నెలలు, సంవత్సరాలు, అవసరమైతే కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు. ఎందుకంటే మారావలసింది, మార్పు రావలసింది మనిషి  అంతరంగం  లో నుంచే గాని , మనిషి చుట్టూ ఉన్న ప్రపంచం లేదా చుట్టూ ఉన్న ఇతర మనుషుల నుంచి కాదు.

• మనిషి యొక్క ఉన్నత మైన స్థితి కి పెట్టుబడి మంచి ఆలోచన మాత్రమే. మనిషి కి తన అంతరంగపు లేదా లోపలి చీకటి ద్వారాలు ఏనాడైతే తెరుచుకోవడం మొదలెడతాయో ఆనాటి నుండి దేని కోసం, ఎవరి కోసం ఈ బాహ్య ప్రపంచంలో శోధించ వలసిన అవసరం ఉండదు, శోధించడు కూడా. ఎందుకంటే మానవుని యెక్క అంతరంగం ఈ విశ్వానికి, సృష్టి కి అనుసంధానం చేయబడి ఉంటుంది. అప్పుడు మనిషి చేసే కర్మలు సజావుగా, శ్రేష్టం గా సహజంగా జరిగిపోతూ ఉంటాయి. ఆ సమయంలో నే దైవ నిదర్శనం, పరమాత్ముని అనుభవాలు స్వయంగా తెలుస్తూ ఉంటాయి. భూత, వర్తమాన, భవిష్యత్తు సంబంధించిన అంశాలు చిన్న గా కొన్ని తెలియడం జరుగుతుంది.

• అదే విధంగా ఒక మనిషి అదమ స్థితి లో ఉండడం వలన పైకి కనిపించక పోయినా నిరంతరం బాధ, దుఃఖం, ఈర్ష్య, అసూయ , మాయ, అనవసరమైన కోరికలు, మోహం, అహంకారం తో కొట్టు మిట్టాడుతూ నిద్రలేని సమయం తో కాలం గడుపుతాడు . ఈ స్థితి కి కూడా పెట్టుబడి మనిషి ఆలోచనే. కానీ ఈ స్థితిలో ఉన్న మనిషి తనలో ని మార్పు ఆశించకుండా, తన చుట్టూ ఉన్న పరిస్థితులు, వ్యక్తులలో మార్పు ఆశిస్తాడు.

• ఈ సృష్టిలో ప్రతీ మనిషి ఏకైకం ( unique ). ఒకరిలా మరొకరు ఉండరు, ఉండలేరు. కానీ మనిషి మంచి మార్పు కోరుకుంటే లేదా ఆశిస్తే , తెలియనిది తెలుసు కోవాలి అనుకుంటే మొదట చిత్తశుద్ధి ఉండాలి, తరువాత తన లోని నెగెటివ్ అంశాలను గుర్తించాలి, అంగీకరించాలి. ఇవన్నీ రాత్రి కి రాత్రి జరిగిపోయే అంశాలు కాదు. అలాగని అసాధ్యం కాదు. కావాల్సిందల్లా ఒకటే మనిషి తనకు తాను నిత్యం, శాశ్వతం గా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించడం.

• చివరి గా ఒక మాట …. మనిషి ఉన్నత స్థితి కి చేరకపోయినా పరవాలేదు కానీ అధమ స్థితి లో మాత్రం ఉండకూడదు. ఎందుకంటే అధమ స్థితి వలన జరిగే నష్టం తనకే కాకుండా తనతో తను చుట్టూ ఉన్న వారికి కూడా ఎంతో కొంత ఉంటుంది.  ఇకపోతే ఉన్నత స్థితి అనుభవం పోందక పోయినా పరవాలేదు కానీ అతి సాధారణ మైన స్థితి తో ఉంటే, తనకు గాని, తన కుటుంబం, చుట్టూ ఉన్న సమాజం లోని వారికి ఏ ప్రమాదం ఉండదు.

• స్థితి ని బట్టే గతి ఉంటుంది .


• ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 4 Apr 2023 , 2:00 pm 

Sunday, April 2, 2023

335. ఆనంద నాధులు

 


ఆనంద నాధులు 


• అందమైన    మనసు లో

  ఆనందం     నింపేను    సొగసు.

• చందమైన     సరసు లో

  సంతోషం     నింపేను    కలువ.


• కలువ లాంటి    హృదయానికి

  ప్రతి    శ్వాస    మకరందం.

• సరసు లాంటి    మనసు కి

  ప్రతి    ఒక్కరు  హంసలం.


• గువ్వలు గా     ఎగరాలి

  గోరుముద్దలు    తినాలి.

• లాలి పాటలు    పాడాలి

  *లవలీల  గ      కావాలి.


• ఏమంటారు    చెప్పండి …

  చిట్టి  పొట్టి    పిల్లల్లా రా …

  చిన్ని చిన్ని    బుజ్జాయి ల్లారా.


• ఒక కధ చెపుతాను వినండి ...

• నేనోక     రాజ  కుమారుడు ని

  రాజ్యం    లేని   రణధీరుడి ని.

• యుద్ధాలను    చేస్తాను

  ఆయుధాలు    లేకుండా.

• పరిపాలన   చేస్తాను

  సామ్రాజ్యం   లేకుండా.

• కలల  కు    యువరాజు ని

  కధల  కు     కవిరాజు ని.


• ఏమంటారు  చెప్పండి …

  చిట్టి  పొట్టి   పిల్లల్లా రా …

  చిన్ని చిన్ని  బుజ్జాయి ల్లారా.


• కేరింతలు   కొట్టాలి

  కలకాలం  కలిసుండాలి.

• తారల్లా     మెరవాలి

  తకదిమి   నాట్యం  చెయ్యాలి.


• ఆనందం  ఆకాశం   దాటించే   నాధులే  అనాధలు

• దైవం  దగ్గర   ప్రమిదలు   మీ జీవిత  స్వరూపాలు.


• కలువ లాంటి    హృదయాని కి

  ప్రతి   శ్వాస      మకరందం

• సరసు లాంటి    మనసు కి

  ప్రతి   ఒక్కరు    హంసలం.


• అందమైన     మనసు లో

  ఆనందం   నింపేను    సొగసు.

• చందమైన     సరసు లో

  సంతోషం   నింపేను  కలువ.


*లవలీ = వెన్నెల  తీగ



యడ్ల శ్రీనివాసరావు 2 Apr 2023 11:00 pm.













334. పెట్టకు బాధ ఎవ్వరిని

 

పెట్టకు బాధ ఎవ్వరిని


• పెట్టకు    మిత్రమా    పెట్టకు

  బాధ      పెట్టకు     ఎవ్వరిని.

• ఇవ్వకు    సోదరా    ఇవ్వకు

  దుఃఖ      మివ్వకు   ఎవ్వరికి.

 

• మనిషి కి     తగిలిన    బాధ

  మట్టి లో    కలిసి    సమసి పోతుంది.

• మనసు కు  తగిలిన    బాధ

  జన్మలు     తిరిగి    నిన్నే   చేరుతుంది.


• పెట్టకు      మిత్రమా     పెట్టకు

  బాధ        పెట్టకు      ఎవ్వరిని.

• ఇవ్వకు     సోదరా      ఇవ్వకు

  దుఃఖ       మివ్వకు     ఎవ్వరికి.


• చేసిన  పాపం   పుణ్య కార్యాల తో   పోదు

  అనుభవిస్తేనే    తీరుతుంది.

• స్వర్గం నరకం     ఎక్కడో    లేవు

  సుఖదుఃఖాలు గ     నీ    తోనే   ఉన్నాయి.


• మాటలతో    మభ్య   పెట్టకు.

  చేతలతో      చేటు    చేయకు.

  చూపులతో   చండాలు డవ్వకు.

  విలువలు    దిగజారి   జీవించకు.


• పెట్టకు     మిత్రమా      పెట్టకు

  బాధ        పెట్టకు      ఎవ్వరిని.

• ఇవ్వకు    సోదరా      ఇవ్వకు

  దుఃఖ      మివ్వకు     ఎవ్వరికి.

 

• కష్టాలను    ఇష్టాలు గ     మార్చుకో

  నీ ధైర్యం    దారవుతుంది.

• స్థితి గతులను    ఆధీనం   చేసుకో

  నీ శక్తి        వెలుగవుతుంది.


• ఆలోచన    అలజడి   కానివ్వకు

  నీ కార్యం   సిద్ధిస్తుంది.

• చిరునవ్వును    కల్మషం   కానివ్వకు

  నీ భాగ్యం     వరిస్తుంది.


• మలినాలు   తయారు చేసే   శరీరానికి

  కామ వికారాల   బరువు     అవసరమా ...

• అనారోగ్యపు    దేహ   కర్మాగారానికి

  ఆడంబరాలు    ఆయువు   నిస్తాయా ...

 

• నిలకడ లేని     బుద్ధి కి

  నీరాజనాలు    అందని   ద్రాక్ష లే.

• మనసు ను      గెలవాలంటే

  మాయ మార్మాలతో   సాధ్యం  కాదు లే.


• పెట్టకు     మిత్రమా     పెట్టకు

  బాధ        పెట్టకు     ఎవ్వరిని.

• ఇవ్వకు    సోదరా      ఇవ్వకు

  దుఃఖ       మివ్వకు    ఎవ్వరికి.


• మనిషి కి     తగిలిన     బాధ

  మట్టి లో  కలిసి    సమసి  పోతుంది.

• మనసు కు    తగిలిన    బాధ

  జన్మలు  తిరిగి    నిన్నే    చేరుతుంది.



యడ్ల శ్రీనివాసరావు 2 April 2023  3:00 pm.


















488. నా ప్రపంచం

నా ప్రపంచం • నా దొక   ప్రపంచం   అది   సోయగాల   సౌందర్యం. • నా  మనసెరిగిన   ప్రపంచం   మధువొలికిన     అనందం. • అందాల   ఆరబోతలు   ఆదమరచి   ...