Sunday, April 9, 2023

340. వ్యక్తిత్వం పరిమళ పుష్పం

 

వ్యక్తిత్వం పరిమళ పుష్పం



• సృష్టి లో ప్రతి మనిషి కి రెండు వ్యక్తిత్వాలు అయితే తప్పనిసరిగా ఉంటాయి. అవి outer personality and inner personality బాహ్య వ్యక్తిత్వం మరియు అంతర్గత వ్యక్తిత్వం. ఈ రెండు వ్యక్తిత్వాలు మధ్య దూరం ఎంత తక్కువగా ఉంటే మనిషి జీవితం అంత సజావుగా జరుగుతుంది.

• ఏ మనిషి అయినా పైకి కనిపించేది వేరు, లోపల ఉండేది వేరు.   ఎక్కడైనా సరే  బయటకు కనిపించే మనిషి కోరుకునెది ఒకటేే.  తన ప్రవర్తన నలుగురిలో  ఎలా కనిపించాలని  ఆశిస్తాడో,   అదే తన అసలు వ్యక్తిత్వం అనుకుంటూ,   అందుకోసం శత విధాల సమాజం లో  అందరికీ  చూపించే  విధంగా  ప్రయాత్నాలు చేస్తూ నే ఉంటాడు. 

ముఖ్యంగా మనిషి జీవితంలో ఒక  ప్రౌడ  వయసు, ఒక స్థితి కి చేరిన తరువాత ఇది మొదలవుతుంది. బంధువులతో, స్నేహితులతో, వృత్తి ఉద్యోగాలలో తోటి వారితో ఉన్నప్పుడు ఈ బాహ్య వ్యక్తిత్వం మంచిగా కనపడాలనే తాపత్రయం ఉంటుంది. 

ఈ సమయంలో  మనిషి కి తనలోని బలహీనతలు బయటపడకుండా ఉండేందుకు చేసే అంతర్గత పోరాటం తనపై తనకు మొదలవుతుంది. ఎందుకంటే బయటకు కనపడే వ్యక్తిత్వ లక్షణాలే అసలైన వి, నిజమైనవి అని వాటి ద్వారా నే తనకు మంచి గా గుర్తింపు వస్తుంది లేదా తోటి సాటి మనుషులు విలువ ఇస్తారని అనుకుంటూ, ఒక భ్రమలో ఉంటాడు.

• సమాజం లో లేదా నలుగురిలో ఉండేటప్పుడు మాట, ప్రవర్తన, వ్యక్తిత్వం మంచి గా , ఉత్తమం గా, ఉన్నతంగా సభ్యుతగా ఉండడం చాలా అవసరం. కానీ దాని కోసం మనిషి లో అంతర్గతం గా లేని  వ్యక్తిత్వాన్ని, గుణాలను, స్వభావాన్ని ప్రదర్శిస్తే నవ్వుల పాలు అవడం ఖాయం. లేదా ఎవరో ఉత్తములను ఆదర్శం గా తీసుకుని అనుకరించడం ప్రమాదం. ఒకరిని  అనుకరించడం కంటే ముందు పరివర్తన చెందడం ముఖ్యం.


• మనిషి ఎప్పుడూ ఇతరుల కోసం , ఇతరుల మెప్పు కోసం , అవసరాల కోసం  తన వ్యక్తిత్వం తీర్చి దిద్ధుకోకూడదు.  ధర్మానుసారంగా మనిషి    జీవించాలి   అనుకొని  ,   తన వ్యక్తిత్వాన్ని  బాహ్యం గా  అంతర్గతం గా  ఒకే విధంగా ఉంచుకుంటాడో ,  అప్పుడు  మనిషి దృఢం గా చిత్తశుద్ధితో ఉంటాడు. ఇలా ఉన్న స్థితిలో మనిషి ఎక్కడా నటించవలసిన అవసరం ఉండదు, పాటించవలసిన నియమం అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. లేదంటే అంతర్గత వ్యక్తిత్వానికి, బాహ్య వ్యక్తిత్వానికి సమన్వయం లోపించి ఏదొక సమయం లో సంఘర్షణ , నలుగురి లో నవ్వుల పాలు కావలసివస్తుంది.

• మేకప్ అనేది ఎప్పుడూ మేకప్పే. ఎప్పుడైనా వర్షం వస్తే వెలిసి పోతుంది. సహజ సిద్ధమైనది ఎప్పుడూ సహజంగా నే ఉంటుంది.

• పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతుంది అనే సామెత ఉంది. అదే విధంగా బయటకు కనిపించే మనిషి యొక్క ప్రవర్తన నిజం అని,    సమాజం లో అందరూ అదే అసలైన వ్యక్తిత్వం  గా భావించాలని, ఏ మనిషైనా ఆశిస్తే,   అది ఒకవిధమైన తెలియని అమాయకత్వం.  చెప్పాలంటేే మనిషి తనను తాను మోసం చేసుకుంటున్నట్లు.  ఎందుకంటే  ఎవరికి తెలియకుండా  మనిషి  గుప్త నిధులు, ఆస్తులు దాచవచ్ఛు కానీ   తన  గుణగణాలను, వ్యక్తిత్వాన్ని ఎంతో కాలం దాచలేడు.  ఎందుకంటే మనిషి ప్రాణం తో జీవిస్తూ ఉంటాడు కాబట్టి.

• బాహ్య వ్యక్తిత్వం ఎంత మంచిగా మనిషి కనపడాలి అని అనుకుంటాడో, అంతర్గత వ్యక్తిత్వం కూడా దాదాపుగా అలా ఉంటే ప్రతి మనిషి పరిమళించే పుష్పం అవుతాడు. అంతకు మించి జీవితం సజావుగా సాగుతుంది.


• ఒక పెద్ద భవనం ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని కూలిపోకుండా నిలబడాలంటే , పునాది బలంగా ఉండాలి. అంతేకానీ భవనానికి రంగులు వేసి, ఆకారాలతో దిద్ది , మెరుగులు పెట్టినా  ఎంతో కాలం నిలవక  కూలిపోతుంది. అదే విధంగా ఒక వృక్షం మంచి ఫలాలు, నీడ ఇవ్వాలి అంటే వేర్లు కు  చీడ పట్టకూడదు. వేర్లు ఆరోగ్యం గా , బలంగా ఉండాలి.

• అదే విధంగా మనిషి జీవితంలో ఎన్నో సమస్యల్ని, పరిస్థితులను ధైర్యం గా ఎదుర్కొని నిలబడాలంటే అంతర్గత వ్యక్తిత్వం , మనసు బలం గా ఉండాలి. అంతే కానీ బయట ప్రపంచానికి అందంగా కనిపించే విధంగా, గుర్తింపు కోసమో మరే ఇతర ప్రయోజనాల కోసమో వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తే చివరికి బాధ మిగులుతుంది.  మనిషికి మొదట తన కుటుంబం వృద్ధి, ఆ తరువాత సమాజ అభివృద్ధి కావాలని కోరుకుంటే ముందు తనలో అంతర్గత వ్యక్తిత్వం స్థిరం గా ఉంచుకోవాలి.

• మనిషి జీవిత ప్రయాణం అంటే ప్రతీ వయసు లో, ప్రతీ పరిస్థితి లో ఎంతో కొంత నేర్చుకోవడం, తనను తాను సరిదిద్ది కోవడం.

• బహుశా ఇదంతా అంత సులభంగా అయిపోయే ప్రక్రియ కాదు. నిరంతర అభ్యాసం ఎంతో కొంత ఉంటే, సాధ్యం అవుతుంది, పైగా తనకు తాను ఉద్ధరించ బడతాడు. అందుకు చేయవలసింది ఒకటే , మనిషి తనను తాను విశ్లేషించుకోవడం. తనలోని లోపాలు లేదా నెగెటివ్ అంశాలను అంగీకరించడం. ఎందుకంటే ఎప్పుడైతే ఏదైనా అంగీకరించడం జరుగుతుందో అహం నశిస్తుంది. అహం నశిస్తే, తనలో మాయ తొలగి మనిషి కి తన గురించి తనకు నిజం తెలుస్తుంది.


• Name, Fame కోసం మనిషి పరిగెత్తి నా, అష్ట కష్టాలు పడినా దొరకవు. ఒకవేళ దొరికినా నీటి బుడగలా కొంతసేపు మాత్రమే. మనిషి మంచి కర్మలు చేస్తూ  పరిమళ భరితమైన స్థితి కి ఎప్పుడు వస్తాడో, Name, Fame అవే వెతుక్కుంటూ మనిషి దగ్గరకు వస్తాయి. అటువంటివి మనిషి కి చరిత్ర లో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఎందుకంటే ఎందరో మహానుభావులు నేటికీ జీవించి లేకపోయినా వారి పేరు, కీర్తి, ఆదర్శాలు భూమి మీద బ్రతికే ఉన్నాయి. ఎందుకంటే వారు ఉన్నతమైన అంతర్గత వ్యక్తిత్వాన్నే , బాహ్య వ్యక్తిత్వం గా అతి సామాన్యంగా  ఆచరించి జీవించారు.


• నేడు ఏ మనిషి అయినా బయటకు చక్కగా కనిపిస్తూ, నిత్యం లోపల బాధ అనుభవిస్తు ఉన్న లేదా అవలక్షణాలు, వికారాల తో సతమతం అవుతు ఉన్న తప్పకుండా అంతర్గత వ్యక్తిత్వం బలోపేతం చేసుకోవాల్సిందే. మనిషి బ్రతికేది ఎవరి కోసమో కాదు, తన కోసమే కాబట్టి.

• ఎప్పుడైతే మనిషి ఎక్కువగా ఇతరుల అంతరంగం లోనికి దృష్టి పెట్టకుండా (తొంగి చూడకుండా) ఉండగలడో అప్పుడు మాత్రమే తన అంతరంగం, వ్యక్తిత్వం స్పష్టం గా కనిపిస్తుంది. ఈ స్థితి చాలా మంది మనుషులకు అనారోగ్యం బారిన పడి , కదలలేకుండా మంచం మీద ఉన్న ఆఖరి సమయం లో మాత్రమే తెలుసుకుంటారు, అటువంటి వారు దురదృష్ట వంతులు అని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటికే కాలాతీతం అయిపోతుంది.

• జీవితం లో ప్రతీ ఒక్కరికీ అరుదైనవి, అపురూపమైనవి, విలువైనవి, మేలు చేసేవి ఏదో ఒక సందర్భంలో, ఒక సమయంలో మాత్రమే దొరుకుతాయి. వాటిని జాగ్రత్త పరుచుకొంటే ఆరోగ్యం, సంపద, సంతోషం పెరుగుతాయి.


ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 9 Apr 2023 7:30 PM.


No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...