Tuesday, April 11, 2023

342. అవసరాలు - మనుషులు

 

అవసరాలు – మనుషులు


• మనిషి జీవించేది అవసరాల కోసమా? అవసరాలు తీర్చుకునేందుకేనా?  అందుకోసమే నిత్యం మనిషి ఆలోచనలు ప్రతిబబింబాలై మనసు లో పరిభ్రమిస్తూ ఉంటాయా?  ఈ అవసరాలు తీర్చుకునే క్రమంలో    మనిషి ఎన్నో రకాల పాత్రలు, అభినయాలు చేస్తూ ఉంటాడా? ఇవి ప్రాధమిక మైన కనీస అవసరాలా లేక కోరికలతో నిండిన విలాసాలా ? అసలు  మనిషి  తన  అవసరాలను  నిజమైన అవసరాలు గా గుర్తించే  ఆలోచన కలిగి  ఉంటున్నాడా ?  లేక  ప్రతీది తనకి అవసరమే అనే భ్రమ తో  ఉంటున్నాడా ?  

 


• అవును … మనిషి స్వార్థ జీవి. జీవించేది తన అవసరాలను తీర్చుకునేందుకే మనుగడ చేస్తాడు. ఇందులో నే  ఒక విపరీతమైన ఇంటెలిజెన్స్ మనిషి కి ఉంటుంది. తనకు ఏది ఎలా కావాలో, అలా ప్రణాళికలు వేసుకుంటాడు. తన రక్షణ చూసుకుంటాడు. ఇదంతా సహజంగా ప్రతి మనిషి చేసేదే.


• కానీ ఈ అవసరాలు అనేవి ఎటువంటివి. శారీరకమైన వా,  మానసికమైన వా,    భౌతిక మైనవా? అంటే…. అన్నీ ఉంటాయి అది సహజం.


• కానీ ఈ అవసరాలు తీర్చుకునేందుకు మనిషి   ఏ మార్గం ఆచరిస్తున్నాడు. ధర్మబద్ధంగా నా లేక అధర్మం గానా?


• అసలు ఎందుకు ఇదంతా…. అంటే,   నేటి కాలంలో మనిషి తన అవసరాలు తీర్చుకునేందుకు,   ఎలాంటి దారుణాలకు  అయినా ఒడిగట్టవచ్ఛు   తద్వారా ఇష్టం వచ్చినట్టు  జీవించవచ్చు,  అనే  పనికి మాలిన సిద్ధాంతం తో  కూడిన  ఒక విపరీత ధోరణి  నేటి  సమాజం లో పెరిగి పోతూ వస్తుంది.  దీనికి మనిషి  తిరిగి చెపుతున్న సమాధానం ఏంటో తెలుసా,  నచ్చినట్టు బ్రతకడానికి కాకపోతే ఇంకెందుకు ఈ జన్మ.  ఉన్నది ఏ విధంగా  అయినా అనుభవించడానికే  కదా ... ఇది,  ఒక విచ్చల విడి తనంతో  మనిషి  ఇస్తున్న  సమాధానం. దీనికి కారణం మనిషి తాను ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదు అనే నిర్లక్ష్యం.


• ప్రతి మనిషి కూడా తనకు నచ్చినట్లు అవసరాలు తీర్చుకునే విధంగా జీవిస్తే,  మరి మనిషి కి మనిషి కి మధ్య సఖ్యత,   సమన్వయం ఎక్కడ కుదురుతుంది? ….. అంటే తప్పకుండా కుదురుతుంది,   ఒక మనిషి కి మరో మనిషి తో  ఏ  అవసరం లేదని భావించినపుడు లేదా   ఒక  మనిషి  మరో మనిషి పై పూర్తి గా ఆధారపడకుండా ఉన్నపుడు,   స్వతంత్రంగా  జీవిస్తున్నపుడు   కుదురుతుంది.  ఇందులో ఏ ఇబ్బందీ లేదు.


ఈ రోజు మనిషి జీవితాన్ని, జీవనవిధానాన్ని శాసించేది అవసరాలు.  వాటి ని  బట్టే  మనిషి , మనిషి లా జీవిస్తున్నాడా లేక   ఒక అతీతమైన జీవి లా మనుగడ చేస్తున్నాడా అనేది తెలుస్తుంది.


• మనిషి తన అవసరాలు తీర్చుకునే క్రమంలో ఎలా ప్రవర్తిస్తుంటాడు ?   అవసరాలు తీరిపోయాక ఇంకెలా ప్రవర్తిస్తున్నాడు ?   అనేది చాలా ముఖ్యం,   అదే  చివరికి   కర్మ ఫలం అవుతుంది.  అంటే  నేటి కాలంలో “అందితే జుట్టు అందకపోతే కాళ్ళు “  లేదా  “ ఏరు దాటగానే తెప్ప తగలబెట్టడం “  లేదా  “ పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్లట్లు “  అనే సామెతలు సార్థకం చేసే విధంగా జనజీవనం సాగుతుంది. దీనికి బహుశా ఎవరు అతీతం కాదు. అంటే మనిషి తన అవసరం కోసం, స్వలాభం కోసం ఎంతకైనా దిగజారడం అనేది సర్వసాధారణం అయిపోయింది. గమనించి చూడండి నిజమో కాదో తెలుస్తుంది.


• కానీ విచిత్రం ఏమిటంటే, ఇలా తన అవసరాలు కోసం మాత్రమే జీవించే ఒక మనిషి, , తనతోగాని, తనచుట్టూ జతపడిన మనుషుల కోసం గాని, లేదా ఎవరైనా శక్తి హీనులై సహాయం అభ్యర్థించే వారి కోసం గాని  ఆలోచించాలంటేే   లెక్కలు వేస్తూ తనకేంటి లాభం లేదా నాకెందుకు ఈ రిస్క్ అని ఆలోచిస్తాడు. లేదా ఆ సమయంలో తన పరిమితులు, హద్దులు, రక్షణ గుర్తుకు వచ్చి తన తెలివికి పదును పెట్టి అమాయకుడిలా ఉంటాడు. కానీ అదే మనిషి తనకు ఇతరులతో అవసరం పడినపుడు కాళ్ల వేళ్ల పడి బ్రతిమిలాడుతూ, దిగజారి బ్రతిమాలాడడం లేదా హక్కు గా అజమాయిషీ చేస్తూ  ఉంటాడు. అంటే తాను ఏది చేసినా ఎవరూ చూడడం లేదని అనుకోవడం మనిషి యొక్క అమాయకత్వం.


• ఏ రోజు అయితే మనిషి భూమి మీద పడతాడో, అప్పటి నుంచి మనిషి చేసే ప్రతి చర్య రికార్డు అవ్వవలసిన చోట అవుతూనే ఉంటాయి. అవే తిరిగి ఫలితాలు ఇస్తుంటాయి .  ఈ విషయం గ్రహించలేక పోవడం మనిషి దురదృష్టం.  ఎన్నో  తెలివితేటలు తో అద్బుతాలు  సృష్టించే,   మనిషి ని   సృష్టించిన భగవంతుడు కి   లెక్కలు వేయడం తెలియదంటే ఎలా ?.


• ముఖ్యంగా  మనుషుల లో వ్యాపారాత్మక దృక్పథంతో  ఉండే వారిలో  ఒక విచిత్రమైన ధోరణి కనిపిస్తుంది.  వ్యాపారాత్మక దృక్పథం అంటే,  కొందరు అందరు మనుషుల లా కాకుండా , వారు ఏ వృత్తి ఉద్యోగాలలో ఉన్నప్పటికీ కూడా  స్వభావ రీత్యా  తమ బుద్ది ని,  సమస్త శక్తి ని , దృష్టి ని, తెలివి తేటలని ,   మాటలను  అమాయకులను  ఆకర్షించే విధంగా ,  ఒక వ్యాపారి ఎలా ఆలోచిస్తాడో  అలా  లాభ నస్టాలు బేరీజు లతో,  నిత్య  జీవనం సాగిస్తూ  ఉంటారు.

ఇటువంటి వారి స్థితి ఎలా ఉంటుంది అంటే,  తమ అవసరాలు తీర్చుకునేందుకు  ఎన్నో కిటుకులు  ప్రదర్శిస్తారు.  

వీరిలో ఉన్న అతి తెలివితేటలు వారికే,  రాను రాను బలహీనత గా మారి  విలువలు కోల్పోతారు. చివరికి ఆ తెలివితేటలే ఒక శాపం గా మారి, ఎన్నో పాపాలకు చేసేందుకు  శ్రీకారం చుడతాయి.  ఇటువంటి మనుషులు వ్యక్తి గత కోరికల కోసం, అవసరాల కోసం  కపట నాటకం చూపిస్తూ, అవి తీర్చుకునేందుకు ఎలాగైనా ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో ఏ మాత్రం మొహమాటం ఉండదు సరికదా అదే తమ బలం  అనుకుంటూ,    ఆరితేరిపోయామని అనుకుంటారు.

ఇటువంటి వారు  ఇతరుల అవసరాలకు ఏ మాత్రం ఉపయోగపడరు. ఒకవేళ ఉపయోగపడినా , లాభం ఏమిటా  అని ఆలోచిస్తారు. ఆఖరికి వీరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నేను మాత్రమే మనిషి ని, మరెవ్వరూ కాదు అనే స్వార్థంతో  జీవిస్తూ ఉంటారు.  ఇదంతా వారి  అంతరంగం లో నడిచే ప్రక్రియ మరియు మానసిక స్థితి.   

ఒకసారి ఆలోచిస్తే,  ఇటువంటి వారు దైనందిన జీవితంలో  మనకు  తారసపడ్డారా లేదా  అనేది  ఒకసారి ఆలోచిస్తే  తెలుస్తుంది.


• ఒక మనిషి ఎప్పుడైనా వస్తువుల పట్ల లెక్కలు అంచనాలు వేస్తూ , అవసరాలు తీర్చుకుంటూ జీవితం గడపడం లో ఏ ఇబ్బందీ ఉండదు. కానీ అదే లెక్కలు అంచనాలు జీవితం పట్ల, తోటి   సాటి మనుషుల  పట్ల వేస్తే, పరిస్థితులు తారుమారు అయిపోయి తన ఉనికి కే ‌సమాధానం చెప్పుకో లేని స్థితి  వస్తుంది.


• మనిషి తోటి మనిషి ని మాయ చెయ్యడం, మోసం చెయ్యడమే విజయం గా భావిస్తున్న దుస్థితి నేటి పరిస్థితి. ఇది ప్రాధమిక స్థాయిలోనే కాదు అత్యంత ఉన్నతంగా కనిపించే ప్రతీ అభివృద్ధి చెందుతున్న అంశం లో సూక్ష్మంగా దాగి ఉంది, ఈ దౌర్భాగ్యపు స్థితి. ఉదాహరణకు అణు మూలకాలను విద్యుత్ తయారీ  కోసం ఉపయోగిస్తూ , అభివృద్ధి అంటారు.  కానీ ప్రమాదకరమైన అణుబాంబులను తయారు చేస్తూ వినాశనానికి ఒడిగడతారు. అది ఒక విజయం అని భావిస్తారు.


• ఓ మనిషి .... నీ అవసరాలు ఇతరులతో తీర్చుకునేందుకు కోసం మాత్రమే నువ్వు జీవించడానికి పుట్టలేదు. ధర్మ బద్ధంగా ఇతరుల అవసరాలు కూడా తీర్చేందుకు నువ్వు ఉన్నావని గ్రహించడం లో  ఇతరుల పట్ల,  నీ  బుణం ఏమిటో నువ్వు ఉన్న బంధం లో తెలుస్తుంది.    లేదంటే ఈ క్షణమే ఊపిరి కూడా అనుకోవచ్చు,  నేను నీకు అవసరం లేదని. 


• ఓ మనిషి .... నువ్వు, ఒకరి అవసరాలు తీర్చలేని స్థితి లో ఉంటే , ఒకరికి సహాయం చేయలేని స్థితిలో ఉంటే, ఎవరిని సహాయం అడుగుకు , ఇతరులను నీ అవసరాలు తీర్చమని అడగకు.    ఒకవేళ నీ అవసరం ధర్మబద్ధ మైనది అయితే , నువు కోరుకునే సహాయం సరైనది అయితే , నీ గత కర్మ ఫలం శ్రేష్టమైనది అయితే నీ అవసరం తీర్చడానికి, నీకు సహాయం చేయడానికి ఈశ్వరుడే ఏదొక రూపం లో తప్పకుండా నీ దగ్గరకు వస్తాడు.


• కృతజ్ఞత ఉన్నచోట మాత్రమే  దైవత్వం నిలుస్తుంది.

నేటి సమాజంలో , జీవితం లో ఒక పరిపక్వత వయసు కి వచ్చిన వారు కూడా వ్యక్తిత్వ విలువలను పాటించక పోతే, తరువాత తరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే తరచూ వార్తలలో చూడడం జరుగుతుంది. అటువంటి స్థితి సమాజం లో, ఎక్కడో కాదు కదా స్వయం కుటుంబాలలో, జీవితాలలో ఎదుర్కొనే స్థితి రాకూడదనే సంకల్పం తో ..... ఒక చిన్న విలువతో  రాసినది.


ఇది ప్రతి మనిషి కూడా ఎవరికి తోచిన విధంగా వారు మనసులో  అన్వయం చేసుకుంటే  ఎంతో కొంత అర్దం తెలుస్తుంది,  తమకు తాము ఏమిటో ... తాము ఏ స్థితిలో ఉన్నామో.... ఇది రాస్తున్న వాడితో సహ.


ధర్మో రక్షతి రక్షితః .


ఓం నమఃశివాయ 🙏.


యడ్ల శ్రీనివాసరావు 11 Apr 2023 , 10:00 PM .












No comments:

Post a Comment

494. Failures Are Accurate Winners

  Failures Are Accurate Winners • అపజయం అనే పదం వినగానే ప్రతి మనిషి లో కలిగేది ఒక భయం, మానసిక ఆందోళన. మనిషి ఏదైతే కోరుకుంటాడో అది పొందక పో...