Sunday, July 31, 2022

222. మాటలు _ చూపులు

 

 మాటలు _ చూపులు


• నీ మాట లోని మధురం

  మనసు లాలన కి లౌక్యం

• నీ  తీయని   అధరం తో

   తేనెలొలుకు  మన  పరవశం.


• నువు పలికిన పలుకులే

  చిన్న చిన్న ముత్యాలు గా

• మెరిసెను నా మదిలో

  చిన్ని చిన్ని ఆశలు గా


• నీ పలుకులు పగిలితే

  ఆశలు అడియాశలై

• మధురం  మసకబారి

  మౌనం రాజ్యమేలుతుంది.


• నీ మాట లోని మధురం

  మనసు  లాలన కి లౌక్యం

• నీ  తీయని  అధరం తో   

  తేనెలొలుకు  మన  పరవశం.


• మాటలు పలకని  నీ  మౌనం  నా మరణం

• మాటలు పలికిన  నీ  నాదం   నా జీవ నాదం.



• నా చూపు లోని పదిలం

  సొగసు పాలన కి  సౌఖ్యం.

• నీ  మీనపు నయనాల లో

   దాగి  ఉంది  మన  మనోహరం.


• నే చూసిన  చూపులు

  ఇంద్రధనుస్సు  వర్ణము లై

• రవి వర్మ   చిత్రము గా

  నిలిచింది  నీ  రూపం.


• నా చూపు లోని చిత్రం

  తనను తాను మరచి

• తిరుగుతుంది విచిత్రం గా

  ఎందుకోసమో  దేనికోసమో.


• నా  చూపు లోని పదిలం

  సొగసు పాలన కి సౌఖ్యం

• నీ మీనపు  నయనాల లో  

   దాగి  ఉంది  మన  మనోహరం.


• చుక్కలు   కారని   నా  కనులు   భాగ్యం

• చుక్కలా   నింపిన  నీ   వెలుగు  సౌభాగ్యం.



యడ్ల శ్రీనివాసరావు 1 Aug  2022 12:40 AM








Saturday, July 30, 2022

221. చిరునవ్వు


చిరునవ్వు


• ఈ నవ్వులే  నీ నవ్వులే  పువ్వులై పులకరించాయి.

  చిరునవ్వులై   నా లో   చిగురుతొడిగాయి.


• ఆహా ఏమీ ఈ తరుణం

  ఆహా ఏమీ ఈ వరుణం.


• నిను తలచి న     నిను మరచి న

  నీవే నా అదృష్టము.

  నీ నవ్వే నా సంతుష్టము.


• నిండు జాబిలి   కాన రాలేదు

  నగుమోము న   నీ నవ్వుని  చూసి.

• పండు వెన్నెల  జాడ నే  లేదు

  వెలుగు విరిసిన  నీ నవ్వుని  చూసి.



• ఈ నవ్వులే  నీ నవ్వులే  పువ్వులై  పలకరించాయి.

   చిరు గాలులై  నను  చిలకరించాయి.


• ఆహా ఏమీ ఈ తరుణం

  ఆహా ఏమీ ఈ వరుణం.


• నిను  వలచి న    నిను  విడచి నా

  నీవే  నా  భాగ్యము.

  నీ  నవ్వే  నా సౌభాగ్యము.


• సిరులు కురులుగా సాగే

  సిగమోము న    నీ చిలకనవ్వును   చూసి.

• రతనాలు ఏరులా  జారే

  పంటి చాటు న    నీ  చిలిపినవ్వును  చూసి.



• ఈ నవ్వులే  నీ నవ్వులే  పువ్వులై  పరవశించాయి.

  చిరుజల్లులై   నా లో   అంకురమైనాయి.


• ఆహా ఏమీ ఈ తరుణం.

  ఆహా ఏమీ ఈ వరుణం.


• నిను  తలచి నే   మరువ ను

  నిను  వలచి నే    విడువ ను.

• నీవే నా సర్వస్వము

  నీ నవ్వే నా ప్రాణము.



యడ్ల శ్రీనివాసరావు 31 July 2022 12:30 AM.









Thursday, July 28, 2022

220. సదా శివ మహేశ్వర


సదా శివ మహేశ్వర


• సదాశివ మహేశ్వర      సర్వవిద మహీశ్వర

• సదాశుభ మహేశ్వర    సర్వలయ మహీశ్వర


• అంతులేని  లోకం లో  అనంతమైన రూపాలలో

• ఎన్నెన్నో దేహాలు    మరెన్నెన్నో బంధాలు

• బంధాల వలలో నే   బ్రతుకు జీవన బాటలు

• బాటలో నడిచేది బ్రతుకు నిండిన మనుషులా 

   లేక బానిసయిన మనసులా.


• ఏది బంధం…. ఏది సంబంధం

• ఏది అనుబంధం…. ఏది కర్మ బంధం


• సదాశివ మహేశ్వర      సర్వవిద మహీశ్వర

• సదాశుభ మహేశ్వర    సర్వలయ మహీశ్వర

• బ్రతకలేని మనసులకి బంధాలు ఎందుకో

• బ్రతుకు రాసిన నీకు ఈ ఆటలు ఎందుకో

• ఆడేందుకు మనుషులు ఆట బొమ్మలా

• పాడేందుకు జీవితాలు పాట పదనిస లా.


• సదాశివ మహేశ్వర       సర్వవిద మహీశ్వర

• సదాశుభ మహేశ్వర      సర్వలయ మహీశ్వర

• బంధం అనే పాత్ర తో   కర్మను కొలిచేది ఎందుకు

• సంబంధం అనే నాటకం తో ముడి కలిపేది ఎందుకు

• అనుబంధం అనే మాయలో ముంచేది ఎందుకు

• చివరికి కర్మ బంధాలను  బుణానుబంధాలనేది   ఎందుకు.


• సదాశివ మహేశ్వర సర్వవిద మహీశ్వర

• సదాశుభ మహేశ్వర సర్వలయ మహీశ్వర

• నీ శిరసున నెలవైన జ్ఞానగంగను జల్లు

• నీ స్మృతి లోని  స్థితి తో  సద్గతి  దొరుకుతుంది.


యడ్ల శ్రీనివాసరావు 29 July 2022 11:30 AM.


సర్వవిద = సకల జ్ఞాన పండితుడు

మహీ = పూజింపబడు

సర్వలయ = సర్వం వినాశనము








219. శ్రావణ శుభ లక్ష్మీ వ్రతం

 


శ్రావణ శుభ లక్ష్మీ వ్రతం



• శ్రావణమాసం వచ్చింది…సకల శుభాలను తెచ్చింది.

• సంతోషాలను ఇచ్చింది…సిరులను ధారణ చేసింది.


• మామిడి తోరణాలతో మా సుందర సదనము నందన హరితమై

• ఉత్సాహం నింపింది…మా ఇలలో ఆహ్లాదం పొంగింది.


• పసుపును పసిడి గా చేసి ధారబంధము కు పూయగా

• మా తల్లి వరలక్ష్మి వచ్చింది…మా ఇంట ముంగిట నిలిచింది


• శ్రావణమాసం వచ్చింది…సకల శుభాలను తెచ్చింది

• సంతోషాలను ఇచ్చింది…సిరులను ధారణ చేసింది.


• గృహలక్ష్మి లందరూ లక్షణముగ కలశ పూజను చేసాము.

• తోరమును చేత కట్టి వరలక్ష్మీ వ్రతమును ఆచరించాము.


• పండు ఫలములను నైవేద్యాలు గా పెట్టాము.

• ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చాము.


• అష్టలక్ష్ములందరు మా నట్టింట కొలువైన వేళ

• ఇష్టకామ్యాల సిద్ది కి విఘ్నములే లేవు.


• శ్రావణమాసం వచ్చింది సకల శుభాలను తెచ్చింది

• సంతోషాలను ఇచ్చింది సిరులను ధారణ చేసింది.


• మా నూలు చీర అందము చూసి 

  మట్టి గాజులు సందడి చేస్తే

• చామంతులు చందము తో 

  మా ఇంట శోభను నింపాయి.


• మనసున కొలువై న మహారాజు కోసం 

  గృహలక్ష్మి నై   చూస్తున్నా…. ఎదురు చూస్తున్నా….



యడ్ల శ్రీనివాసరావు 28 July 2022 10:00 pm.





Tuesday, July 26, 2022

218. ఓం నమో నారాయణాయ

 

ఓం నమో నారాయణాయ


• దయ చూపు నా స్వామి….

• దయ చేయు నా స్వామి….

• దరి చేర  నీ సన్నిధికి  దారి చూపు  నా స్వామి.


• వల్లభుడివై 

  విరిసిన కమలము లో  

  తేజము తో 

  నిలిచిన తామరకంటి వాడ.

• కనుసైగన 

‌  చిరునవ్వు తో 

  జగమంత నాటకం 

  జడి తోన నడుపుతున్నావు.


• మానవ జన్మంటే 

  మహిమాన్వితము కాదని …

  దుఃఖ సాగరం   ఈదేటి    

  జీవన నౌకని  తెలిసింది.


• మాయ మర్మము లలో  

  మునిగిన  మెదడు కి 

• మోహమే  సింహాసనం

   కామమే  సుఖాసనం.


• దయ చూపు నా స్వామి….

• దయ చేయు నా స్వామి….

• దరి చేర  నీ సన్నిధికి  దారి చూపు  నా స్వామి.


• వేయి పడగల  నీడ  

  వేణువూదేటి వాడ

• పంచ వికారముల 

  పల్లకీలో  పవళించే 

  పతితులను పావనము చేయు స్వామి.


• కల్ప కల్పముల నుండి 

  శక్తి హీనమై 

  మాయకు వశమైన 

  విగతులము స్వామి.

• జ్ఞాన బిందువు తో 

  కనులు తెరిపించు స్వామి.


• దయ చూపు నా స్వామి….

• దయ చేయు నా స్వామి….

• దరి చేర  నీ సన్నిధి కి దారి  చూపు  నా స్వామి.


• నారాయణ శబ్దం 

  నరుల నవనీతానికి అర్దం.

• స్వరము న పలికే  మంత్రం 

  మాధవుని చేరే తంత్రం.


యడ్ల శ్రీనివాసరావు 26 July 2022 5:00 PM.


జడి = నిరంతరం

నవనీతం = చిలికిన తాజా వెన్న

పతిత = భ్రష్టులు, ధర్మం చెడిన వారు.

తంత్రం = దేవతలను చేరే మార్గం.


Sunday, July 24, 2022

217. చిలుక చెలి

 

చిలుక చెలి



• చిలక పలుకుల చెలి వలపు ఎక్కడ దాచేవే

• చిలికి చిలికిన గాని నీ చిరునవ్వు దొరకలేదే


• చిలకపచ్చ చీరలో చిత్రాంగి చందాన ...

  నీ పైట రెప రెప లాడుతుంటే

• చిగురుటాకుల వలె నా చిలిపి ...

  కన్నులు టప టప లాడుతున్నాయి.


• చలువ చందనము తో నీ కంఠము శంఖమై ...

   ప్రేమ పరిమళం పొదిగి ఉంటే.

• చల్లని గాలులతో ఈ వనమున ...

   సుగంధం నింపుతున్నావు.


• చిలక పలుకుల చెలి వలపు ఎక్కడ దాచేవే

• చిలికి చిలికిన గాని నీ చిరునవ్వు దొరకలేదే.


• దొండపండు లాంటి 

  నీ ముక్కున  మెరిసే ముక్కెర చూసి

• దొరసాని లెక్కన మెదిలే 

   నీ రూపం నా మదిలో.


• తీగ జాజి వైన జాబిలి 

  తనివి తీరలేదెందుకో ... నీ పై తపన పోలేదెందుకో.

• శిల్పమంటి  నీ సౌందర్యం  కింద  

   శిధిలమై ఉన్నాను.


• చిలక పలుకుల చెలి వలపు ఎక్కడ దాచేవే

• చిలికి చిలికిన గాని నీ చిరునవ్వు దొరకలేదే


• నీ నెమలి నడకకు  

  సంపెంగ నడుము    హారమై కనిపిస్తుంటే

• వేణు గానాన  రాగాలు  

   నా హృదయాన  రేగుతున్నాయి.


• నీ వాలు జడ  నిండా  మల్లెలు  

  మురిసి  అలసి పోతుంటే

• ఈ రేయి నా మీద వైరమవుతుంది.  

   ఏమి చేసేది ... ఎవరినడిగేది.


• చిలక పలుకుల చెలి వలపు ఎక్కడ దాచేవే

• చిలికి చిలికిన గాని నీ చిరునవ్వు దొరకలేదే


యడ్ల శ్రీనివాసరావు 25 July 2022 , 10:45 AM.





Friday, July 22, 2022

216. మౌన తార

 

మౌన తార



• ఆహా… హహహ …. ఓహో… హోహోహో.

  గోదావరి తీరం లో ... నడిరేయిన గాలిలో

  ఓ తార చెపుతుంది … నిశి రాతిరి వింటోంది.


• ఆకాశం లో 

  తళుకు బెళుకు తారలు 

  తహతహతో చూస్తున్నాయి.

• తారల నవ్వులు 

  దివ్వెలై వికసిస్తున్నాయి.


• చందమామ సాక్షి గా ….

  వెలుగు లేని ఒక తార మౌనంగా ఉంది.

• పాలపుంతల చెంతలో ….

  నవ్వడమే తెలియక వింతగా చూస్తుంది.


• చీకటి చూపుల  భూమి ని   

  ప్రేమతో చూస్తుంది   ఆ తార.

• తన  వెలుగుతో   రేయి ని   

  పగలు గ   చేయాలని ఆశపడుతోంది.


• ఆహా…ఆహహహ … ఓహో… హోహోహో.

  గోదారి తీరం లో … నడిరేయిన  గాలిలో

  ఓ తార చెపుతుంది ... నిశి రాతిరి వింటోంది.


• వెలుగు లేని  ఆ తార   

  వెలుగు నింపాలని   ఓ నాడు

  భూమి  చేరువ కి   పయనం   అయింది.

• మౌనమైన ఆ తార  

  భూమి కెంత దగ్గరైనా  

  వెలుగే కాన రాలేదు.


• ఆశ విడువని 

  ఆ తార  భూమి పై నిలిచింది.

• వెలుగు నింపలేదని  నిరాశ తో ఉంది.

• తారలన్నీ నవ్వుకున్నాయి  

  మౌన తార అమాయకానికి.


• మౌన తార ప్రేమ ను చూసి

  చందమామ నిండు వెన్నెల నింపుతుంది.

  భూమిని విడువక తిరుగుతుంది.


• ఆహా…ఆహహహ….ఓహో… హోహోహో.

  గోదారి తీరం లో ….. నడిరేయిన గాలిలో.

  ఓ తార చెపుతుంది….నిశి రాతిరి వింటోంది.


•  ఆ తార ను .... ఆ మౌన తార ను నేనే....


యడ్ల శ్రీనివాసరావు 23 July 2022 12:30 AM.








Thursday, July 21, 2022

215. తెలవారుతుంది _ ఓం శాంతి.

 

తెలవారుతుంది … ఓం శాంతి.


• తెలవారుతుంది 

  తెలవారుతుంది 

  తెల తెల వారుతుంది.

• నీ మురళి రాగం 

  మగత మౌఢ్యాని కి   తెరదించుతుంది.


• కనులు తెరిచే నాటికి 

  కదలని రూపమై

• కదిలే మా కనులలో 

  కళ కళ లతో కనిపిస్తున్నావు.

• మెదిలే మా మదిలో 

   మిల మిల లతో మెరుస్తున్నావు.

• బాబ శివ బాబ

  ఓ బాబ శివబాబ.


• తెలవారుతుంది  

  తెలవారుతుంది 

  తెల తెల వారుతుంది.

• నీ మురళి రాగం 

  మగత మౌఢ్యాని కి  తెరదించుతుంది.


• బంధం అనే దుఃఖం లో 

  బందీలుగా ఉన్నాము.

• నీ సంబంధం అనే సౌఖ్యం తో 

  సంపన్నం చేయి బాబ  శివబాబ


• త్రికాల జ్ఞానివి నీవు 

  పరమాత్మవి నీవు.

• నీ పిలుపు కై 

  జన్మ జన్మలు గా వేచి ఉన్నాము.


• నీ దివ్యత్వం తో 

  ఆత్మలను మధురం గా చేస్తున్నావు.

• జ్ఞాన ధారణ ను 

  ఊపిరిగా చేసి  

  సేవ ధారణ ను చేయిస్తున్నావు.

• కరుగుతున్న 

  మా కర్మలకు ఇదియే భాగ్యం

  ఇంతకన్నా ఏమి సౌభాగ్యం.


• తెలవారుతుంది  

  తెలవారుతుంది  

  తెల తెల వారుతుంది.

• నీ మురళి రాగం 

  మగత మౌఢ్యాని కి తెరదించుతుంది.


• ఈ సుఖధామములో 

  శాంతి కాముకులమై   తేలియాడుతున్నాము

• నీ వెలుగు లోని తేజము తో 

  పరంధామము పయనిస్తున్నాము‌.

• బాబ  శివ బాబ.


యడ్ల శ్రీనివాసరావు 22 July 2022 10:00 AM.








214. హృదయ రాణి

 

హృదయ రాణి



• ఓ వనితా    నా అనిత 

  నీవే   నా కవిత.

  వలపించావు   విలపించావు   

  మై మరపించావు.


• ఓ వనితా  నా అనిత 

  నీవే   నా  కవిత.

• నా ప్రేమ పాశం లోని  ఆనందిని

  గడచిన   జన్మమెంతో   మధురం.

  మన  జీవితమంతా  సుందరం.

• ఆలుమగలమై  ఉన్నాము.

  రేయి పగలు ఎరగక ఉన్నాము.


• కధ కై   ఒడి లో  

  సవ్వడి  సేసిన  సుందరి

  ఓ సుందరీ

• కవిత లోని  పదము కంటే

  నా స్వరము లోని శ్రావ్యమే  

  నీకు లాలన

• నాకు ఆలన   మనకు పాలన.


• నా మాట లోని తరంగాలు 

  నీ ఎద పొంగుకి లావణ్యమై

• నీ చూపు లోని పిలుపులే 

   నను కౌగిట్లో ముంచాయి.


• ఓ వనితా    నా అనిత

   నీవే నా కవిత

  వలపించావు   విలపించావు  మై మరపించావు.


• నీ పెదవి ని  తాకిన  

  నా పదము  నలుగుతూనే ఉంది.

• నా మనసు ని  చేరిన  

  నీ రూపము  వెలుగుతూనే ఉంది.


• నాటి స్మృతుల నీడలే 

  నడిపిస్తున్నాయి.

  నేటికీ    నీ   కోసం.

• ఎలా చూసేది నిన్ను  

  ఎక్కడ వెతికేది నిన్ను


• నా ప్రేమ మిగిలింది 

  ఈ రాత లో ... విధి రాత లో

• నా మనసు ఉండింది 

  ఈ భాషలో ... మూగ భాషలో.



యడ్ల శ్రీనివాసరావు 21 July 2022 7:00 pm.


Tuesday, July 12, 2022

213. జ్ఞాన సాగరుడు _ ఓం శాంతి

 


జ్ఞాన సాగరుడు – ఓం శాంతి

(గురు పూర్ణిమ శుభాకాంక్షలతో)


• బాబ… శివ బాబా….ఓ బ్రహ్మ బాబా

• నీ మననం శాంతి మదనం.

• నీ వదనం ప్రశాంత సదనం.


• నీ వెలుగు లోని శూన్యం….

• సూక్ష్మాతి దర్శనం.

• అదియే ఆత్మ సందర్శనం.

• ఆ పరమాత్మ ఉనికి కి నిదర్శనం.


• నాడు నీ నీడను చేరిన కాకులము

• నేడు కోయిలలై కూస్తున్నాము

• ప్రకృతి ఒడిలో నివసిస్తున్నాము

• చిన్ని పిల్లలమై జీవిస్తున్నాము.


• బాబ… శివ బాబా….ఓ బ్రహ్మ బాబా

• నీ మననం శాంతి మదనం

• నీ వదనం ప్రశాంత సదనం.


• తండ్రి వై మా కోసం చేతులు చాచావు…

• మనసారా అక్కున చేర్చుకున్నావు.


• జ్ఞాన సాగరుడివై నిలిచావు…

• పాప పుణ్యాల ను తెలిపావు.


• మా మదిలో తలపులు నదిలో…

• అలలై అలజడి తో ఉన్నాయి.

• ఆ నది నే అమృతం చేసావు.


• మా మతిలో చింతలు చితిలో …

• మంటలై జ్వలనం తో ఉన్నాయి.

• ఆ చితి నే మలయమారుతం చేసావు.


• బాబ… శివ బాబా….ఓ బ్రహ్మ బాబా

• నీ మననం శాంతి మదనం

• నీ వదనం ప్రశాంత సదనం.


• నీ కంటి కిరణమే పరమాత్మ సన్నిధి కి బాట

• నీ నామ స్మరణమే ఆత్మల పెన్నిధి కి మాట.


యడ్ల శ్రీనివాసరావు 13 July 2022. 1:00 AM







Monday, July 11, 2022

212. విరజాబిలి

 

విరజాబిలి


(నింగి లోని  జాబిలి … నేల నున్న  మొక్కతో...)


• చూస్తున్నా…చూస్తున్నా…

• నిను చూస్తూనే ఉన్నా.

• నీవెంత దూరమేగినా చూస్తూనే ఉన్నా

• నీవెంత మౌనమేగినా చూస్తూనే ఉన్నా

• నీవు నన్ను చూడకున్నా చూస్తూనే ఉన్నా


• ఈ వెన్నెల వసంతమున   దాగి ఉండ గలవా

• ఈ చల్లని  మనసున    సేద తీరకుండ గలవా


• ఈ అందం నీ కోసం….ఈ చందం నీ కోసం

• ఈ వలపు నీ కోసం….ఈ సొగసు నీ కోసం


• కారు మబ్బులను తెరలుగా  ఉంచితే కాన రాననుకున్నావా.

• మనసు భాసను మౌనం గా  ఉంచితే వినలే ననుకున్నావా.

• ఈ నిశి రాతిరి కి తెలియదా మన బంధమేమిటో.

• ఈ వెన్నెల కి తెలియదా మన సంబంధమేమిటో.


• మేఘము చాటు  నే  మసకబారిన…

• నా వెన్నెల నిను తాకక  ఉండదు.


• మౌనము మాటు  నీ ఊరకుండినా…

• నా లోని వన్నె  నీకై చూడక మానదు.


• చూస్తున్నా…చూస్తున్నా…

• నిను చూస్తూనే ఉన్నా.

• నీవెంత దూరమేగినా చూస్తూనే ఉన్నా

• నీవెంత మౌనమేగినా చూస్తూనే ఉన్నా


యడ్ల శ్రీనివాసరావు 12 July 2022, 12:40 AM






Thursday, July 7, 2022

211. జీవిత చదరంగం

 


జీవిత చదరంగం



• జీవితమే ఒక ఆట….జీవనమే ఒక పాట

• ఆటపాటల  నాటకమే  జీవన రంగస్థలం.


• ఆట నేర్పిస్తుంది అనుభవాల బాట

• పాట నేర్పిస్తుంది సుఖదుఃఖాల నాట


• పూల బాటలో కొందరు

  ముళ్ల బాటలో ఇంకొందరు.

• సొగసు పాటతో కొందరు

  ఎగసి పాటుతో ఇంకొందరు.


• ఆటలో విజేతలు ఎందరో

• పాటతో గాయకులు మరెందరో

• ఆటపాటలతో ఆరితేరిన వారు ఇంకెందరో


• జీవితమే ఒక ఆట….జీవనమే ఒక పాట

• ఆటపాటల నాటకమే జీవన రంగస్థలం.


• కలవని మనసుల తో

• కలసిన జీవితం ఒక ఆట.


• కలవని మనుషుల తో

• కలిసిన జీవనం ఒక పాట.


• మనుషుల మనసుల నాటకమే

• జీవిత చదరంగం.....జీవన రణరంగం


• విధి రాసిన బంధాలు   

  విడలేని నిర్బంధాలైతే

• మనసు కి వేసే సంకెళ్లు 

  మరణానికి శాసనాలు.


• మరణానికి కాదు కదా 

  మనిషి మనుగడ

• బంధం నిర్బంధమైతే 

  మనసుకెందుకు బానిసత్వము.


• జీవితమే ఒక ఆట….జీవనమే ఒక పాట

• ఆటపాటల నాటకమే జీవన రంగస్థలం.



• నాట = రాగ విశేషము.


యడ్ల శ్రీనివాసరావు 8 July 2022 12:30 AM.



Wednesday, July 6, 2022

210. స్మృతి లేఖనము

 

స్మృతి  లేఖనము



• కన్నులే తెరవక

• నా కను రెప్పలతో రాస్తున్నా

• నీ ఎద పై ఈ లేఖని


• తమకము నే  తపన తో   తపము లా  రాస్తున్నా

• గమకము తో  గతము నే  తెరిచి   చూ పిస్తున్నా


• కన్నులే తెరవక

• నా కను రెప్పలతో రాస్తున్నా

• నీ ఎద పై ఈ లేఖని


• ఎగుడు దిగుడు లెన్ని ఉన్నా

• ఈ అక్షరాల ఒంపులు నీ సొంపులకు తోడు.


• దిగులు గుబులు ఎంత ఉన్నా

• ఈ రాతలోని శ్రావ్యమే నీ ఇంపులకు నీడ.


• నీ కనులకు కనపడని

• ఈ పద కావ్యమును నీ మదిని అడిగి చూడు.

• నిజమో…కాదో.



• నీ ఊహకు అందని

• ఈ రస రమ్యమును నీ తనువు నడిగి చూడు.

• నిజమో…కాదో.



• ఈ పదములు చేసే అల్లరి

• నీ ఎద నీకు చెప్పగలదా.


• ఈ రాతలు చేసే ఉక్కిరిబిక్కిరి

• నీ ఎద నీ శ్వాస కి చేర్చగలదా.


• కన్నులే తెరవక

• నా కను రెప్పలతో రాస్తున్నా

• నీ ఎద పై ఈ లేఖని


• భావము తెలిసాక

• బంధము కలిసాక


• నీ ఎద పైన భారం ఎగసి ఎగసి పడుతుంటే

• నా మది లోన రాగం వగసి సొగసి పోతుంది.


• నేను లేక పోయినా….

• ఈ లేఖనమే  జన్మాంతర సాక్ష్యం.


యడ్ల శ్రీనివాసరావు 7 July 2022 ,1:30 AM.


• గుబులు = భయము.

* ఇంపు = ప్రియం, ఇష్టం, ఆనందం, విలాసం, వలపు

• తమకము = ఇష్టము, ప్రేమ, మోహము

• తపన = ఆసక్తి

• తపము = తపస్సు, దృష్టి, ఆలోచన.

• గమకము = నిరూపించిన, మనోజ్ఞము


Sunday, July 3, 2022

209. పారిజాతం

 

పారిజాతం


• ఉదయం

  ఈ ఉదయం

  ఎన్నో జన్మల సాకారం.

• కనులు తెరవగా 

  ఎదురుగ  నిలిచిందొక  పారిజాతం.


• పారిజాతపు పరిమళం 

  పిలుస్తోంది ప్రేమగా.

• ఆ పిలిచే పలుకులో 

  ఒక రాగం వినపడుతోంది.

• ఆ రాగమే 

  నా మనసును  మీటిన స్వరాగం.

• ఆ పిలుపే 

  ఎన్నో తలపుల వలపుల తరంగం.



•  ఉదయం

   ఈ ఉదయం

   ఎన్నో జన్మల సాకారం.

• కనులు తెరవగా

  ఎదురుగ నిలిచిందొక పారిజాతం.


• విరిసిన పారిజాతం 

 విరజిల్లే సోయగం తో 

 నా మది తలుపులు తెరిచింది.

• నా మదిలో మెదిలే 

  తలపులకు తన నుదుటి తిలకం దిద్దింది.


• వికసించిన పారిజాతం 

  నా ఎదపై వాలి చూస్తోంది

  గుండె చప్పడు వింటోంది.

• తన రెక్కల పై నా మనసును 

  శిశువు లా లాలిస్తుంది

  ప్రేమనే కురిపిస్తోంది.



• ఉదయం

  ఈ ఉదయం

  ఎన్నో జన్మల సాకారం.

• కనులు తెరవగా 

  ఎదురుగ నిలిచిందొక పారిజాతం.


• ఇంద్రుని వనము లో 

  పారిజాతం 

  ఈ చంద్రుని చెంతకు చేరింది.

• ఆ చల్లని వెన్నెల లో 

  తన తెల్లని రూపును కలిపింది

  సేద తీరుతూ వాడింది.


• ఉదయం

  ఈ ఉదయం

  ఎన్నో జన్మల సాకారం.


యడ్ల శ్రీనివాసరావు 3 July 2022 11:30 PM








Friday, July 1, 2022

208. జలపాతం

   

జలపాతం



• కొండ కోనల్లో   నిండిన వాగుల్లో   జారే జలపాతమా

• ఎక్కడికి పోతావు… ఏడ దాగుంటావు.

• ఉరకలేసేటి నీ పరువం, ఉవ్విళ్లూరించే నీ సోయగం

• ఈ పచ్చని ఆకుల్లో దాగిన చక్కని ప్రకృతి కే సొంతం.


• శిలలు శిధిలమై జలధారల లో తాకుతు సాకుతు ఉంటే

• సుందరమైన శిల్పాలు గా చేసి ప్రకృతి కి వరమిచ్చావు.



• కొండ కోనల్లో   నిండిన వాగుల్లో   జారే జలపాతమా

• ఎక్కడికి పోతావు… ఏడ దాగుంటావు.

• వనమున వోంపులు సోంపులు తిరుగుతూ మూలాల లోని మూలికలపై పారుతూ

• నీ ధారలు జలధారలై ఔషధమై జీవులకు ఆరోగ్య దాయిని అయ్యావు.


• నిను చూసిన పక్షులు ఆటల పాటల విహారం తో కిలకిల కేరింతలు కొడుతుంటే

• వీచే గాలుల తో రెప రెపలాడే ఆకులు , మిల మిల మెరిసే సూర్యుడు నిశ్చేష్టులై చూస్తున్నారు.


• కొండ కోనల్లో   నిండిన వాగుల్లో   జారే జలపాతమా

• ఎక్కడికి పోతావు… ఏడ దాగుంటావు.

• పరవళ్లు తొక్కే నీ పరుగులకు అలుపేముండదు కానీ

• అలజడులు తో అలసిన మా మనసులు నిను చూసి ఉరకలు వేస్తాయి.


• కాకులు దూరని కారడవులున్నా, చీమలు దూరని చిట్టడవులున్నా

• జలపాతము లేని వనము సింగారము లేని ప్రకృతి.


యడ్ల శ్రీనివాసరావు 2 July 2022, 10:00 AM.


207. శుభ తరుణం


శుభ తరుణం



• ఈ తరుణం శుభ తరుణం

  ఎదురు చూసిన వసంతాల

  ఆశలకు సమ్మతమైన తరుణం

  ఈ తరుణం శుభ తరుణం.


• కురిసే వానలో   మెరిసే మెరుపులా 

   విరిసెను నా ఆలాపన

• అంతరంగము లో   అనురాగం 

   వెల్లువవుతోంది వరదలా

• సమ్మోహనమే   సంశయమై 

   సన్నగిల్లింది    ఈ సమయాన

• ఏదో మత్తుగా ఉందిలే 

   గమ్మత్తుగా ఉందిలే


• ఈ తరుణం శుభ తరుణం

  ఎదురు చూసిన వసంతాల

  ఆశలకు సమ్మతమైన తరుణం

  ఈ తరుణం శుభ తరుణం.


• నింగి లోని నక్షత్రాలు  

  నాతో నడిచి వస్తుంటే

  నా ఉనికి కి వెలుగై 

  దారి చూపిస్తుంటే

  ఆకాశమంత ఆనందం 

  నాకే సొంతం.


• మట్టిలోని మాణిక్యాలు 

  నాతో కలిసి ఉంటుంటే

• నా సిరుల కి కొలువై 

  భాగ్యమ వుతుంటే

• భూదేవంత లావణ్యం 

   నాకే సొంతం.


• ఈ తరుణం శుభ తరుణం

  ఎదురు చూసిన వసంతాల

  ఆశలకు సమ్మతమైన తరుణం

  ఈ తరుణం శుభ తరుణం.


• చెప్పలేని మాటలు 

  ఎన్నో చెపుతున్నా

• రాయలేని రాతలు 

  ఎన్నో రాస్తున్నా

• తుమ్మెద లా ఎగిరి 

  ఎగసి పడుతున్నా

• మందారం లా విరిసి 

  సొగసి పడుతున్నా

• అది నేనేనా 

  నేనేనా….నేనేనా….


యడ్ల శ్రీనివాసరావు 1July 2022  1:00 PM.


488. నా ప్రపంచం

నా ప్రపంచం • నా దొక   ప్రపంచం   అది   సోయగాల   సౌందర్యం. • నా  మనసెరిగిన   ప్రపంచం   మధువొలికిన     అనందం. • అందాల   ఆరబోతలు   ఆదమరచి   ...