Monday, September 27, 2021

91. ”శ్రీ” చరితం

 

         ”శ్రీ” చరితం



• ఎందుకో తెలియదు ఇది జీవితంలో ఒక అందమైన అనుభవం, జ్ఞాపకం… పేపర్ పై రాయాలని అనిపించింది ... ఒక మంచి కథ అవుతుందనుకున్నాను. కానీ రాయడం అనే అనుభవం లేని నేను , నాకు తోచిన విధంగా రాసుకున్నాను…అని మనసు లో అనుకుంటూ రాయడం మొదలు పెట్టింది సరిత.

🌷🌷🌷🌷🌷

• సరిత తను దిగాల్సిన స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి లగేజీ అంతా సర్దుకుని ట్రైన్ దిగడానికి సిద్ధం గా ఉంది. ఇంతలో స్టేషన్ రానే వచ్చింది. అక్కడ ట్రైన్ పది నిమిషాలు అగుతుంది కాబట్టి, కాస్త నిధానంగా దిగుదామని అనుకుంది. స్టేషన్ అంతా వచ్చిపోయే ప్రయాణికులతో సందడిగా ఉంది. ట్రైన్ దిగిన, సరితకు ఫోన్ రావడంతో , ఒక పక్కగా వచ్చి, ఫ్లాట్ ఫామ్ మీద నిలబడి మాట్లాడుతుంది. ఇంతలో హలో మేడం, అని ఎవరో పిలిచినట్లు అనిపించింది, సరిత ఫోన్ కట్ చేసి , ఎవరా తనను పిలిచేది అని , పక్కకు తిరిగి ఆశ్చర్యంగా చూసింది ... అంతే ఊహించని ఆశ్చర్యం, ఒక్కసారిగా సరిత తను కళ్లు పెద్దవి గా చేసి….. శ్రీ కాంత్ అని అంటూ….తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకాంత్ అక్కడ కనిపించేసరికి ఒక్కసారిగా సంతోషంతో ఓయ్.. నువ్వేంటి ఇక్కడ అని అడిగింది సరిత. వెంటనే శ్రీకాంత్ ఇది మా ఊరు, ఒక ఫ్రెండ్ ని, ట్రైన్ ఎక్కించడానికి వచ్చాను. వెళ్తూ వెళ్తూ నిన్ను చూసేసరికి, అరె సరితలా ఉందే, సరితే కదా అని సందేహం తో నిన్ను పలకరించాను. నువ్వు గుర్తు పట్టేసరికి హమ్మయ్య అనిపించింది.

• ఇలా నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలయ్యింది, నువ్వేమీ మారలేదు సరిత , అలాగే ఉన్నావు. ఈ రోజు నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదు అంటూ, తన ఆనందం అంతా మాటల్లో చూపించేస్తున్నాడు శ్రీకాంత్. కాఫీ అయినా ఇప్పిస్తావా లేక ఇలాగే నిలబెట్టి మాట్లాడెస్తావా అని సరిత అడిగేసరికి, సారీ సరిత అంటూ, అక్కడే ఉన్న కేంటీన్ లోకి వెళ్ళి కూర్చున్నారు ఇద్దరూ. ఊ... ఇప్పుడు చెప్పు " శ్రీ" ఏం చేస్తున్నావు, చెప్పు చెప్పు అని సంతోషం గా అడిగింది, సరిత. “ శ్రీ “ అని నువ్వు మాత్రమే పిలుస్తావు సరిత ... నువ్వు ఏదీ మర్చిపోలేదు అని చిన్నపిల్లాడిలా సంబరంగా అన్నాడు.

🌷🌷🌷🌷🌷

• ఇంతలో కాఫీ వచ్చింది. నవ్వేస్తూ కప్ తీసుకుంటూ ఇంకేంటి చెప్పు అంది సరిత. శ్రీకాంత్ ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయాడు...

• సరిత, శ్రీకాంత్ స్కూల్ నుండి డిగ్రీ కాలేజ్ వరకు కలిసే చదువుకున్నారు. వాళ్ళ ఇళ్ళు కూడా దగ్గర్లోనే ఉండేవి. చిన్నప్పటి నుండి శ్రీకాంత్ ఎప్పుడూ ముభావంగానే ఉండేవాడు, అందరితో కలవ లేక పోయేవాడు, అంతో ఇంతో సరిత తోనే మాట్లాడే వాడు. సరిత స్వభావం వేరు, తనకు నచ్చితే , వాళ్ళతో ఇట్టే స్నేహం చేసేస్తుంది. సరదాగా కలిసిపోతుంది. ఈ స్వభావమే బహుశా శ్రీకాంత్ కు, సరితలో నచ్చిందేమో, తనతో స్నేహంగా ఉండేవాడు. కాని ఏదో తెలియని బిడియం అయితే ఉండేది. కానీ సరిత అంటే ఇష్టం కూడా ఉండేది. చదువులు అయిపోయాక ఎవరి దారులు , వాళ్ళవి అయిపోయాయి. మళ్ళీ సరితను ఇంత కాలానికి ఇలా చూస్తానని అనుకోలేదు , అని మనసు లో శ్రీకాంత్ అనుకుంటున్నాడు.

• సరిత పిలవడంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఏంటి అబ్బాయ్ ఎక్కడికి వెళ్ళి పోయావు మళ్ళీ చిన్నతనంలోకి వెళ్ళిపోయావా? అని సరిత అంటుంటే, అవును సరిత” నిన్ను చూసేసరికి మళ్ళీ ఆ జ్ఞాపకాలు అన్ని గుర్తొచ్చాయి, అంటూ, ప్రస్తుతం తను ఏం చేస్తున్నది, తన కుటుంబ వివరాలు అన్నీ సరితకు చెప్పాడు శ్రీకాంత్. మరి నువ్వెక్కడ సరిత, నీ గురించి చెప్పు అనేసరికి ఆ ఏముంది, మామూలే అందరిలా, రోటీన్ జీవితం , మంచి కుటుంబం, ముగ్గురు పిల్లలు అని క్లుప్తంగా చెప్పింది సరిత. బంధువుల పెళ్ళికి వెళ్తూ ఇలా ఇక్కడ దిగి, వేరే ట్రైన్ మారాల్సి వచ్చింది, “శ్రీ” అని సరిత అనగానే, సరే నువ్వు ఎక్కవలసిన ట్రైన్ ఎక్కించి వెళ్తా అన్నాడు ”శ్రీ”. సరే అనేసింది సరిత. ఇన్నాళ్ళకు “శ్రీ” ని చూసేసరికి సరితకు తనతో, ఇంకా మాట్లాడాలి అని చాలా కుతూహలంగా అనిపించింది. ఇంతలో తను ఎక్కాల్సిన ట్రైన్ కూడా చాలా ఆలస్యంగా వస్తుందని, అని రైల్వే స్టేషన్ లో చెప్పారు. మామూలుగా అయితే అంత వెయిటింగ్ ను చిరాకుగా భరించేదేమో, కాని సరిత కు ఇప్పుడు అది సంతోషంగా అనిపిస్తుంది.

• “శ్రీ” వెంటనే, అంత సేపు ఈ స్టేషన్ లో వెయిటింగ్ ఎందుకు, నాకు నచ్చిన ప్రదేశం ఒకటుంది, ఇక్కడికి చాలా దగ్గర, నిన్ను తీసుకెళ్తాను సరేనా అనేసరికి, ఎక్కడికి , అని అడిగింది సరిత. శ్రీకాంత్ తను తీసుకువెళ్లాలి అనుకునే ప్రదేశం గురించి చెప్పగానే, సరిత ఒప్పుకునేసరికి “శ్రీ” సంతోష పడిపోయాడు.

🌷🌷🌷🌷🌷

• లగేజీ మొత్తం క్లాక్ రూం లో పెట్టి , స్టేషన్ బయటకు వచ్చారు. శ్రీ తన బైక్ తీసుకొచ్చాడు. ఇద్దరు బయలు దేరారు, దారిలో అంతా చూపిస్తూ చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు “శ్రీ”. సరిత మనసులో అనుకుంటుంది, చిన్నప్పుడు ఎంత బిడియం గా, సిగ్గు గా ఉండేవాడు. ప్రక్కన కూర్చున్న ముడుచుకు పోయేవాడు అని తలచుకొని మనసులోనవ్వుకుంది సరిత. ఇంతలో తీసుకెళ్తానన్న ప్రదేశం రానే వచ్చింది. అది అందమైన గోదావరి తీరంలోని ఘాట్. ఇద్దరూ బైక్ దిగి నడుచుకుంటూ ఘాట్ లోపలికి వెళ్తే అద్భుతంగా ఉంది. పరవళ్లు తొక్కుతున్న విశాలమైన గోదావరి, తీరం అంతా నడవడానికి అనుకూలంగా అందమైన టైల్స్ వేసారు. అక్కడక్కడ రంగు రంగుల సిమెంట్ బెంచీలు , చుట్టూ చెట్లు, మధ్య మధ్యలో క్రోటన్ మొక్కలు, ఇంకా రకరకాల పూల మొక్కలు, పచ్చని మెత్తని లాన్, తీరం లో ఉన్న నావలు, ఒక ప్రక్క గోదావరి నీరును తాకుతూ ఉన్న అమ్మవారి దేవాలయం, గోదావరి లో దూరం గా వెళ్తున్న పడవ, ఆకాశం అంతా మేఘాలతో నీలివర్ణమయం, ఎంత బావుందంటే చూడడానికి సరితకు రెండుకళ్ళు సరిపోలేదు. సరితకు ఆ ప్రదేశం చూస్తుంటే మనసు సంతోషంతో పురి విప్పి నాట్యం చేసే నెమలిలా అనిపిస్తుంది.

• “శ్రీ” మృదువుగా, నెమ్మదిగా చెప్తున్నాడు, ఇది నాకు చాలా ఇష్టమైన ప్రదేశం, రోజు లో ఒకసారి అయినా ఇక్కడ ఏకాంతం గా పదినిమిషాలు కూర్చొని వెళ్తుంటా, అని ఇంకా ఏదే ఏదో చెప్తూ తన పక్కనే నడుస్తున్నాడు. నిజంగా ఆ వాతావరణం, అలా చూసేసరికి “సరిత” కు చెప్పలేని ఆనందం అనిపించింది. ఇద్దరూ ఒక సిమెంట్ బెంచీ పై పక్క పక్కనే కూర్చున్నారు. చల్లని ఆహ్లాదకరమైన గోదావరి గాలి, “శ్రీ” ని తాకుతూ , సరిత ముంగురులు తాకుతూ ఉంటే, సరితకు అది ఒక పారిజాతపు పరిమళంలా మనసులో అనిపిస్తుంది. “శ్రీ” ముఖం అయితే ఆనందంతో వెలిగిపోతుంది. “శ్రీ” ఎప్పుడూ అనుకోలేదు. ఇలా తనకు ఇష్టమైన వ్యక్తితో, ఇష్టమైన ప్రదేశంలో కూర్చుని మాట్లాడే అవకాశం వస్తుందని. సరిత కి కూడా అలానే ఉంది.

• ఇద్దరూ ఏ మాత్రం గమనించలేదు, ఊహించలేదు. అప్పటికే ఆకాశం మేఘలతో , కారు మబ్బులతో నిండిపోయింది. వర్షం వచ్చేలా ఉంది, సరిత భయపడుతూ వెళ్ళిపోదాం ‘శ్రీ’ అంది. శ్రీకాంత్ ధైర్యం చెప్తూ, నిన్ను క్షేమంగా ట్రైన్ ఎక్కిస్తా, సరేనా ఇప్పడు ఈ అందమైన వాతావరణం ఎంజాయ్ చెయ్యి, అని భరోసా ఇచ్చేసరికి, నెమ్మదిగా వర్షం మొదలయ్యింది. వర్షం గోదావరి మీద కురవడం సరిత నిజ జీవితం లో, ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి అరుదైన అందమైన అనుభవాలు అందరి జీవితాల్లో రావు దానికి కూడా అదృష్టం ఉండాలి, అని ఒక మంచి జ్ఞాపకం గా మార్చుకుంది సరిత. ఇద్దరూ అప్పటికే వర్షం లో కొంచెం తడిచి పోయారు, నెమ్మదిగా అక్కడే ఉన్న అమ్మవారి దేవాలయం లో కి వెళ్ళి నిలబడ్డారు.

🌷🌷🌷🌷🌷

• “శ్రీ” మాట్లాడుతున్నాడు, ఆ క్షణం, ఆ సందర్భం, ఆ సమయం, ఆ ప్రదేశం, ఆ వాతావరణం అంతా మరచి పోయి, కాసేపు “శ్రీ” కి ఏమీ తెలియనట్టుగా అయిపోయి, విచారం వదనంతో మాట్లాడుతున్నాడు. చిన్నప్పటి నుండి తన మనస్సులో దాగి ఉన్నదంతా ప్రవాహంలా వచ్చేస్తుంది. “శ్రీ” ఇంత ఎలా దాచుకున్నాడో , అవును లే తాను కాదు కదా, తన మనస్సు మాట్లాడుతుంది…. అనుకుంది సరిత. వర్షం పెద్దదయ్యింది, “ శ్రీ” తన పట్ల చిన్నప్పటి నుండి పెంచుకున్న ఇష్టం, స్నేహం, ప్రేమ అన్నీ చెప్పాడు. సరిత వింటూనే ఉంది. తనకు కూడా తెలియదు, ఒక మనిషి పట్ల ప్రేమ ఉంటే, ఆరాధన ఇలా ఉంటుందా, ఇంతగా ఉంటుందా... తనకు అసలు ఎలా స్పందించాలో కూడా తెలియలేదు కానీ బాధ మాత్రం విపరీతంగా అనిపించింది. ఇంతలో వర్షం తగ్గిపోయింది. అంతా నిధానంగా విన్న సరిత ఏమీ మాట్లాడక పోయేసరికి, “ శ్రీ “ ముఖం చిన్నబోయింది. అక్కడినుంచి అయిష్టంగానే స్టేషన్ కి బయలుదేరాడు. ఇద్దరూ స్టేషన్ కు చేరారు. మౌనంగా ఉన్నారు ఇద్దరూ, ఇంతలో సరిత ట్రైన్ వచ్చింది . సరిత తన కోచ్ లో ఎక్కి కిటికీ పక్కన కూర్చుంది. అక్కడ ఫ్లాట్ ఫామ్ మీద షెల్టర్ లేదు. ఇంకా నెమ్మదిగా వర్షం పడుతూనే ఉంది. “శ్రీ” తడుస్తూనే ఉన్నాడు. ట్రైన్ నెమ్మదిగా కదిలింది, వెళ్ళిపోతుంది. “శ్రీ” కళ్ళల్లో కన్నీళ్లు వర్షంలో కలిసిపోతున్నాయి. అంత దుఃఖం శ్రీకాంత్ కు ఎప్పుడూ రాలేదేమో అని సరిత “ శ్రీ “ ని చూస్తూ అనుకుంది. “శ్రీ” మాత్రం పుట్టినప్పుటి నుండి, నిత్యం అనుభవించే, అలవాటైన దుఃఖమే కదా అనిపించింది. కానీ ఆ దుఃఖం తట్టుకునే శక్తి , “శ్రీ” శరీరానికి గాని, మనసుకు గాని లేవు. ఎందుకంటే “శ్రీ” ఇంకా ఎంతో కాలం, ఈ భౌతిక ప్రపంచంలో ఉండడని తనకు మాత్రమే తెలుసు.

• ఆనాటి నుండి సరితకు తన మనసు ని, “శ్రీ” లాక్కొని వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తూ ఉండేది. కొన్ని కొన్ని ఆందోళనలు, భయాలు, ఆలస్యాలు ఎవరి జీవితానైనా మార్చేస్తాయేమో కానీ, ఒకరి పై ఇష్టం, ప్రేమ ఒకసారి కలిగితే, ఆ మనిషి ఉన్నా, లేకపోయినా ఎప్పటికి పోవు కదా, అని మనసుకు సమాధానం చెప్పుకునేది సరిత. “శ్రీ” చాలా, చాలా బావుండాలి, “శ్రీ” జీవితంలో ఏ వెలితి ఉండకూడదు, సంతోషంగా ఉండాలి, ఇంత కంటే ఇంకేమి ఇవ్వగలను తన చిన్ననాటి నేస్తం లోని ప్రేమకి, అని సరిత అనుకునేది……కానీ “శ్రీ” జీవితంలో వెలితే “సరిత” నాటికి, నేటికీ, ఉంటే మరు జన్మకి.


25 sep 21  


Wednesday, September 22, 2021

90. మనిషి భాష…. మనసు భాస


మనిషి భాష…. మనసు భాస


• మనిషి భాష మనిషికి ఎరుక,
  మనసు భాస ఎవరికి ఎరుక.
  మనిషి భాష మనిషికి ఎరుక,
  మనసు భాస ఎవరికి ఎరుక…..

• మనిషి ఉన్నది మనిషి కోసం,
  మనసు ఉన్నది ఎవరి కోసం.
  మనిషి ఉన్నది మనిషి కోసం,
  మరి మనసు ఉన్నది ఎవరి కోసం…..

• మనిషి లో న మనసు ఉంటే,
  మనసు లో మనిషి ఉన్నాడా
  మనిషి లో న మనసు ఉంటే,
  మరి మనసు లో మనిషి ఉన్నాడా…..

🌱🌱🌱🌱🌱

• మనిషి భాష మనిషికి ఎరుక,
   మనసు భాస ఎవరికి ఎరుక

• కనుల ముందు జీవితం,
  కావ్యమే అయితే కనుక.
  కనులు ముందు జీవితం,
  కావ్యమే అయితే కనుక.
  కంటి వెనుక జీవితం, కాష్ఠమే అవునా…కాదా..

• ఎదురు చూసిన క్షణాలన్ని,
   ఆవిరే అవుతూ ఉంటే.
   ఎదురు చూసిన క్షణాలన్ని,
   ఆవిరే అవుతూ ఉంటే.
   ఎదురయ్యే వన్ని కూడా,
   ఎండమావు లే గా…..

🌱🌱🌱🌱🌱

• మనిషి భాష మనిషికి ఎరుక,
  మనసు భాస ఎవరికి ఎరుక.

• జననమన్నది జన్మకు ఒకటే,
  మరణమన్నది మనిషి కి ఒకటే.
  జననమన్నది మనసు కు లేదు, 
  మరణమన్నదిి మనసు కు రాదు.

• నావ లోని ప్రయాణమంతా,
  ఊయలై సాగుతూ ఉంటే.
  నావ లోని ప్రయాణమంతా,
  ఊయలై సాగుతూ ఉంటే.
  నా లోని ప్రయాణమంతా,
  అలలు గా సాగుతు ఉంది.

• చుక్కాని లేని నావ,
  చుక్కాని లేని నావ ,
  ఏ తీరం చేరునో…..
  చక్కని అయిన మనసు కి,
  యేల తెలుస్తూ ఉంది.
  చక్కని అయిన మనసు కి,
  యేల తెలుస్తూ ఉంది.

🌱🌱🌱🌱🌱

• మనిషి భాష మనిషికి ఎరుక,
   మనసు భాస ఎవరికి ఎరుక.

• నీ నడక ఎంత దూరమైనా,
  నీ నడక ఎంత భారమైనా,
  నీ నడక ఎందరి తో సాగినా,
  నీ అడుగులు నీ వే లే……నీ అడుగులు నీ వే లే

• నీ బంధం ఎందరి తో ఉన్నా,
  నీ బంధం ఎవరి సొంతమో అనుకున్న,
  నీ మనసు నీ దే లే,
  నీ మనసు నీ దే లే.

• ప్రేమ లేని జీవిత మంటే,
  ప్రేమ లేని జీవిత మంటే.
  నీడ లేని నిరీక్షణే గా,
  నీడ లేని నిరీక్షణే గా.

• మనిషి నెంత తాకితే,
  మనసు నెంత సాకితే.
  మనిషి నెంత తాకితే,
  మనసు నెంత సాకితే......
  మనిషి మనసు తోడై రాదా….
  మరు జన్మకు నీడై రాదా…..
  మనిషి మనసు తోడై రాదా….
  మరు జన్మకు నీడై రాదా…..

• మనిషి భాష మనిషికి ఎరుక,
  మనసు భాస ఎవరికి ఎరుక.

YSR...9293926810…18 sept 21 , 10:30 pm.

Sunday, September 19, 2021

89. ఓయ్ నిన్నే నిన్నే

 

                   ఓయ్ నిన్నే నిన్నే


• ఓయ్ నిన్నే నిన్నే

  ఏయ్ నిన్నే నిన్నే  

  వినిపిస్తుందా ... నా మాట వినిపిస్తుందా.


• కోపమా ... కోమలమైన కోమలాంగికి 

  కోపమా చిరు తాపమా.


• విసురుగా చూసే నీ చూపులతో 

  విరహం చూపిస్తూ  

  విల్లును సంధిస్తావా.


• ప్రియా ఓ ప్రియా … నిన్నే నిన్నే ఓయ్ నిన్నే

• నీ మనసు నే  దోచలే 

  నా ప్రేమ నే  దాచలే

  అదియే శాపమా.


• నీ వలపుల గాలంతో 

  తగిలిన మన్మధ బాణానికి 

  విలవిలలాడే ... నా మది కలవరమాయే.


• ఎందుకీ మౌనం 

  ఏమిటీ కోపం

  ఓయ్ నిన్నే నిన్నే వినిపిస్తుందా.


• బంథమే అనుబంధమైతే 

   జననమొక యోగం.

• అనుబంధమే ఆత్మబంధమైతే 

   జన్మమొక భోగం.


• మనది యోగమా 

  భోగమా ... ప్రియా ఓ ప్రియా.


• రుసరుసలాడే నీ రూపాని కే 

  ఎగసి పడినె నా సంతోషం.

 చిర్రుబుర్రుల చిన్న దానా ...  ఓ చిన్న దానా.


• ఓయ్ నిన్నే నిన్నే వినిపిస్తుందా ... వినిపిస్తుందా.

• నా భుజము నే తట్టినా 

  నీ చేయికై  ఈ చేయి 

  ఎంత  చేసెనో,  రాసెనో.


• మరి మనిషి నెంత తాకితే

  మనసు నెంత సాకితే 

  ఇంకేమి అధ్బుతం జరుగునో  

  జరుగునో  .... ప్రియా ఓ ప్రియా.


YSR 19 Sep 2021 6:30 am.









88. ఎదురు చూపుల క్షణాలు

 

ఎదురు చూపుల క్షణాలు


• నది కనపడని మదిలో 

  నీరు ఎక్కడిదో

  ఇంత కన్నీరు ఎక్కడిదో.


• పొంగి పొరలుతున్న నీరు

  కంటి పొరలలో  

  ఎక్కడ దాగి ఉందో.


• మదిలోని మదనం “ఆవిరై” 

  కంటి లోని “కలవరంతో” కనపడె 

  నీ రూపం  కన్నీటి స్వరూపం.


• సముద్రం లో  నీరంతా    ఉప్పే అయితే

  నా కంటి   వెనుక 

  ఎంత లోతైన   సముద్రం ఉందో.


• తియ్యని మనసులకేనా 

  ఇంత ఉప్పుటి   నీరు   కన్నీరు.


• కంటజారే  కన్నీరు  తొలిసారి 

  నా పై  కనికరం   చూపిస్తుంది.


• ఎందుకంటే     ఎందుకంటే

• చెలి  చేరువతో   కన్నీరు

  నా కన్నీరు  అమృతం  కురిపిస్తుంది.


• ఈ అమృతం తో   మృత్యువే  లేదు 

   నా హృదయానికి


• కనులు  తెరిచి  చూస్తే…

  కలలోని చెలి   కంటి ముందు లేదు…

  కాని…..కానీ…. 

  కంటనీరు మాత్రం   ఉప్పగా   కా రు తూ నే....

  కా రు తూ నే   ఉంది.

  సన్నగా….చెమ్మగా…ముద్దగా.


Gift of God on auspicious Day.


18 sept 6:30pm… YSR.








Sunday, September 12, 2021

87. ఆలోచనల తో.. నీ......జీవితం లో... నీ...ఆలోచనలు

 

ఆలోచనల తో.. నీ......జీవితం  లో... నీ...ఆలోచనలు



·        ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఈ బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే అద్భుతమైన పదాలు ఆలోచన,  జీవితం.  ఈ రెండు ఒకటేనా అంటే, ప్రతి ఒక్కరు ఇచ్చే సమాధానం ఒకటే...ఆలోచన లే జీవితం అంటారు.  కానీ , నాకు మాత్రం ఆలోచనా సరళి మీదే జీవితం ఆధారపడి నడుస్తుంది అనేది పూర్తిగా నిజం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి తన ఆలోచనలను ఏ విధంగానైనా ఆలోచించుకోవచ్చు , కానీ దానిని అమలు పరచడం అనేది మనిషికి కృషి, స్థితి , గతి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఆలోచన కార్యరూపం దాల్చలేదు. ఆలోచన అనేది మనిషి మేధస్సును సూచిస్తుంది. కానీ ఆ ఆలోచన అనేది మాట రూపంలో గానీ , చేతల రూపంలో గానీ అమలు జరిగినప్పుడే అర్థం, పరమార్థం ఉంటుంది .

·        మనిషి ఉదయం నిద్రలేచిన నుండి రాత్రి పడుకునే వరకూ, కొన్ని సార్లు, నిద్రలో కూడా నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంటాడు.  కానీ వాస్తవిక జీవితంలో చూస్తే చాలా మందికి ఆలోచన వేరు,  జీవితం వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆలోచనలనేవి  వాస్తవికత , నిజం , సాధ్యం,  అసాధ్యం ఇలా ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది.   ఇక జీవితం అంటే పరిస్థితులు, శైలి , అలవాట్లు మనిషితో ఉండే సాటి మనుషుల ప్రభావంతో నడుస్తుంది.  అంటే మనిషికి జీవితంలో చేస్తున్న కర్మలు, పనులు మాత్రమే కేవలం ఆలోచనలు గా ఎవరికీ, ఎప్పటికి ఉండవు.  ఆలోచనలు అనేవి ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితానికి అతీతంగా మాత్రం చాలా వరకు తప్పక ఉంటాయి. ఒక ఆలోచనలో నిజం ఉంటుంది, ఊహా ఉంటుంది, నటన కూడా ఉంటుంది.

·        ఒక మనిషి కి ఆలోచన ద్వారా వచ్చిన వాక్కు (మాట)  మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కొంతవరకు నిర్ణయిస్తుంది అనడం లో సందేహం ఏమీ లేదు కానీ , మనిషి జీవితం ఇందుకు భిన్నంగా చాలా సార్లు ఉంటుంది. ఒక ఆలోచన అనేది తరంగం (wave) అయితే , దాని ప్రకంపనలు అనేవి emotions, feelings అవుతుంటాయి.

·        ఆలోచనలకి మూలం మనసు. కానీ మనస్సు అనేది మనిషికీ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏ వయసులో, ఏ సమయంలో, ఎలా స్పందిస్తుందో భగవంతుడికి కూడా అర్థం కాదు. అందుకేనేమో భగవంతుడు కూడా మనిషికి ఆలోచనలతో చేసిన కర్మలను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ గమనించవలసినది మనిషి శరీరంలో ప్రతి అవయవానికి ఒక నిర్దిష్టమైన పరిమాణం,  అలాగే శరీరానికి కొలత కొలమానం ఉంటాయి. కానీ  మనసుకు,, మనసులోని ఆలోచన మాత్రం  ఇవేమి ఉండవు.

·        కొందరికి ఆలోచనలు స్థిరంగా , దృఢంగా ఉన్నా  జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది, అది పరిస్థితుల ప్రభావం.   మరికొందరికి జీవితం మంచి స్థిరత్వం తో ఉన్నా ఆలోచనలు మాత్రం అల్లకల్లోలంగా ఉంటాయి.  కంటికి కనిపించని సూక్ష్మజీవులు ప్రకృతిలో ఎలా ఉన్నాయో అదేవిధంగా మనకే తెలియని సూక్ష్మాతి సూక్ష్మమైన అంశంగా ఈ ఆలోచన జీవితం ను పేర్కొనవచ్చు.

·        అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే ఒకటి మాత్రం అనిపిస్తుంది, మనిషి జన్మతః మహానటుడు. క్యాలిక్యులేటర్ అనేది కేవలం గణితంలో అంశాలను మాత్రమే గణాంకం చేయగలదు, కానీ మనిషి మెదడు లోని ఆలోచన అన్నింటికీ అతీతంగా అవసరాలు,  సందర్భాలు,  పరిస్థితులను బట్టి ఎత్తులు,  పై ఎత్తులూ వేయడం ఒకటేంటి ఇలా ఎన్నో అంశాలను క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. చెప్పాలంటే ఇదే  మనిషి అసలు సిసలైన ఆలోచన జీవితం.  ఇందులోనే జననం మరణం,  ప్రేమలు ద్వేషాలు,  ప్రతీకారం సహాయం,  మిత్రత్వం శత్రుత్వం,  బంధాలు,  సంతోషం దుఃఖం,  అబద్దాలు నిజాలు అన్నీ కలగూర లాగా వీటితో మిళితం అయిపోయి ఉంటాయి.

·        వడకట్టి నీరు శుభ్రమై మంచినీరై,  మనిషి ఆరోగ్యానికి ఎంత దోహదం చేస్తుందో,  అలాగే వడకట్టి ఆలోచన కూడా,  అంటే మలినం లేని  ఆలోచన మనిషి జీవితానికి తేజస్సు అవుతుంది అనడంలో,  ఏమాత్రం సందేహం లేదు.   ఆలోచనలు శక్తివంతంగా, తేజోవంతంగా ఉండాలంటే చేయవలసినది  ఒకటే,  మెదడుకి విశ్రాంతినివ్వడం, దీనినే ధ్యానం అంటారు.  శరీరాన్ని మెలకువగా ఉంచి మెదడుకు విశ్రాంతి ఇస్తే,  నీలో సమస్త విశ్వం , భూమి, ఆకాశం,  ప్రకృతి,  నక్షత్రాలు, తోకచుక్కలు,  గ్రహాలు విశ్వమంతా కనిపిస్తుంది.  అదే మనిషికి అసలు సిసలైన చిరునామా.

·        ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితం ద్వారా వచ్చే ఆలోచనల కంటే కూడా ధ్యానం ద్వారా వచ్చే ఆలోచనలు చాలా శక్తివంతంగా వుండి,  జీవనం మార్గదర్శకం అవుతుంది.   జీవితాన్ని అనుభవిస్తూ ఉండడం ద్వారా కలిగే ఆలోచనలలో   సమతుల్యం  ఎన్నటికీ ఉండదు.   ఏదో ఒక అసంతృప్తి, emotional inbalance ఉంటుంది.  అదే ధ్యానశక్తి తో వచ్చే ఆలోచనలలో దేహానికి సరిపడా సమతుల్యం కలిగి,  హార్మోనులను, జీవన క్రియలు metabolism, catabolism) సజావుగా జరగడం తో పాటు మంచి జీవనం,  జీవితం ఉంటాయి.

·        సహజంగా మనిషి ఆలోచనలో ఉండేది ఒకటి మాట్లాడేది మరొకటి…. జీవితంలో చేసేది ఇంకొకటి….. ఇది మనిషికి తెలియకుండానే ( అంటే తన గురించి తాను ఆలోచించుకో లేక,  గమనించుకో లేక )  నిరంతరం అలవోకగా జరుగుతున్న  జీవన ప్రక్రియ ...ఔనన్నా,  కాదన్నా ఇది నిజం.

·          ఒక మనిషికి శరీరం,  జీవితం రెండూ బలహీనంగా ఉన్నా  ఆలోచన స్థిరమైనది,  బలమైనది అయితే మాత్రం మరణం వరకూ అత్యుత్తమం గా సాగుతుంది. 

·         మనిషి తన  ఆలోచనని  గొప్పగా ను,  ఉన్నతంగాను  అదే విధంగా అత్యల్పంగానూ ఉంచుకోనవసరం లేదు. కేవలం సమతుల్యంతో ఉంచుకుంటే చాలు...అప్పుడు ప్రకృతే నిర్ణయిస్తుంది,  మనిషి జీవితాన్ని స్థాయికి తీసుకు వెళ్ళాలి అనేది.

 

Yedla Srinivas Rao 9293926810,  12 sep 21 6:30 am.

 

 

Wednesday, September 8, 2021

86. ఓం శ్రీ సత్యదేవాయ నమః

 ఓం శ్రీ సత్యదేవాయ నమః


• సర్వ జనులకు సన్మార్గదాతవై న సత్య దేవాయ నమః

• సత్యము నిత్యము కాని కలి కాలమున ఈ జగమున అవతరించావయా....

• నీ సాక్షిగా కలిసిన పరిణయ జంటలకు పరమ రక్షకుడివి అవుతావయా.....

• రత్నగిరికి రాజువై, రారాజు వైన నీకు వ్రతములు ఆచరిస్తామయా..... సత్యదేవాయ నమః…..సత్య నారాయణ నమః

• నారాయణుడివై నరులను తీర్చ వెలసినావయా.... పాహిమాం పాహిమాం...రక్షమాం రక్షమాం.

• సత్య దేవాయ నమః....సర్వరూపాయ నమః....సకల జీవాశ్రయ నమః

• శరణు వేడుకుంటామయా....స్మరణ చేసుకుంటామయా....శాప విముక్తులను చేయవయా..

• సత్య దేవాయ నమః….సర్వ ప్రియాయ నమః

• పంపా నదిన పరవశుడై నావయా, నారాయణాయ, నమో నారాయణాయ…

• అనంత లక్ష్మి ని కుడి భాగాన, పరమ శివుని ఎడమ భాగాన కొలువై సేద తీరుతున్నావయా భాగ్యప్రధాత…

• అన్నము నే వరము గా ఇచ్చి ఆహర్తిని తీర్చే ధాతవయా…..అన్నధాతవయా…

• సర్వదేవాయ నమః….సత్య నారాయణ నమః

🙏🙏🙏

YSR 8 sept 21 9 30 pm.


Monday, September 6, 2021

85. ఎవరు మంచి…ఎవరు చెడు

 

ఎవరు మంచి…ఎవరు చెడు


• మంచి చెడు , పాపం పుణ్యం, దుఃఖం సంతోషం ఇటువంటివన్నీయు, మానవ జన్మలో మనుషులు కేవలం తమ కర్మలు అనుసారం, మానసిక ,శారీరక పరిస్థితులకు అనుగుణంగా ఏర్పరుచుకున్నవి. అంటే ఒక విధముగా అజ్ఞానంతో సృష్టించుకున్నవే. నిజానికి మంచి అంటే ఉపకారం, సంతోషం…. చెడు అంటే అపకారం, దుఃఖం అని అనుకోవడం అవివేకం.

ఎందుకంటే, ఒక వ్యసనానికి బానిస అయిన వాడు, ఎవరికి అపకారం తలపెట్టకపోయినా చెడ్డవాడు అని అంటారు, కానీ వాడు ఆ వ్యసనంలో ఎంతో సంతోషం పొందుతూ ఉంటాడు , వాడి జ్ఞానానికి ఆదే సంతోషం. కానీ వాడు జీవించినంత కాలం ఆ వ్యసనం అని చెపుతున్న అలవాటు లోనే సంతోషంగా ఉంటాడు.

• అదేవిధంగా మంచివాడు అనబడే గుర్తింపు తో ఉన్న ఒక మనిషి లోపల ఎంతో దుఃఖాన్ని, చెడుని, బాధని, మానసిక వ్యధని అనుభవిస్తూ , పైకి శాంతంగా, నిదానంగా , ఆదర్శం గా కనిపిస్తూ ఉంటాడు. అటువంటి వాడిని చూసి అందరూ మంచివాడు అంటుంటారు. కానీ ఆ మనిషి అంతర్గతం పరమ వేదనతో ఉంటుంది. ఇటువంటి విభిన్నమైన పరిస్థితుల్లో ఎవరు మంచిని, ఎవరు చెడుని అనుభవిస్తున్నట్లు..? ఇవన్నియు కేవలం మనిషి తనకు ఉన్న, మానసిక శక్తి గ్రహిస్తున్న స్పందనలు మాత్రమే అనిపిస్తాయి.

• ఒక విషం ను(poison), మనం చెడు అనుకుంటే , అదే విషం ను మందుగా ఉపయోగిస్తూ (medicine) ఎన్నో రుగ్మతలను నయం చేస్తారు. అంటే ఇక్కడ చెడు అనుకునే విషం కూడా ఒక శ్రేయస్సు, మంచి కొరకు ఉపయోగపడుతుంది .

• మనుషులకు  ఈ రోజు ఒకటి మంచి అనిపిస్తుంది . అదే రేపు చెడుగా అనిపిస్తుంది.....అదే చెడు రేపు మంచి గా కనిపిస్తుంది.

• ఈ సృష్టి చక్రం గాని, మానవ జీవన చక్రం గాని సమతూకం (balance) అవ్వాలంటే మంచి, చెడు…పాపం, పుణ్యం…సంతోషం, దుఃఖం అన్ని ఉండవలసిందే. ఎందుకంటే positive, negative లను వాటికి ఉండే ప్రాముఖ్యత లతో భగవంతుడు సమ దృష్టితోనే సృష్టించాడు.

• అందువలన మంచివారు , చెడ్డవారు , గుణగణాలు ఇటువంటి వాటి మీద పెట్టే దృష్టి కంటే వీటికి అతీతంగా పరమాత్మను తెలుసుకునే మార్గంలో ప్రయాణిస్తే ప్రతి వ్యక్తికి తాను మంచి వాడా? చెడ్డవాడా? లేక ఇతరులు మంచివారా? చెడ్డవారా? .....అసలు తాను ఎవరు.... అనే ఒక స్వీయ అనుభవం తోడైనపుడు, సరాసరి పరమాత్మ నుంచే సమాధానం తెలుస్తుంది.

• స్థితప్రజ్ఞత కలిగిన మానవునికి , అంతరాత్మను గుర్తించిన మనిషికి శూన్యం , శూన్యం లో మౌనం, మౌనంలో సర్వ సమానత్వం కనిపిస్తుంది.     

• చేసిన కర్మల అనుసారంగా నే ఫలితాన్ని అనుభవించే నిర్ణయం మనిషి పుట్టుక తోనే భగవంతుడు అమలు చేశాడు. నీవు ఎవరివో, నీ జన్మకు మూలం ఏమిటో నీకు ఒక స్పష్టత కలిగినపుడు మంచి చెడు, సంతోషం బాధ, అనే వాటికి తేడా తెలియదు , అప్పుడు నీకు తెలిసేది ఒక్కటే సర్వం ఏకం సమానం.

• పరిస్థితులను దృష్ట్యా మనిషి లో మారే లక్షణాలను గురించి ఆలోచించి , మనిషి ని నిర్ణయించే(మంచి, చెడు) కంటే ….. పరిస్థితులను అర్థం చేసుకోవడం ప్రతి మనిషి మనుగడకు చాలా అవసరం. ఇదే చివరిగా నీవు ఎవరివో, ఈ బాహ్య ప్రపంచానికి కనిపించేది…శరీరం ఉన్నా, లేకున్నా.


యడ్ల శ్రీనివాసరావు  5 sep 2021 , 10:30 pm


Saturday, September 4, 2021

84. వెన్నెల వే...ద...న

 

                    వెన్నెల వే...ద...న



• నిండు పౌర్ణమి రాత్రి సమయం 8 గంటలు ....


• చంద్రుని వెన్నెల....

   గోదావరి తీరం....

   ఇసుక తిన్నెలు.


• గోదావరి తీరంలో 

  ఇసుక తిన్నెలపై ఏకాంతం గా 

  వాలు జారి చూస్తుంటే….

  ఒకవైపు గోదావరి....మరో వైపు నిండు వెన్నెల.


• వెన్నెల్లో గోదారి 

  ముత్యాల తలంబ్రాలలా 

  మిలమిలలాడుతూ ఉంది.


• ఆ రేయి లో....

  గోదావరి పై తెల్లని కొంగల సమూహం....

  సందడిగా ఎగురుతూ ఉంటే....

  ఆశగా ఆకాశాన్ని చూసే 

  నా కళ్ళకి ఆనందంతో 

  చుక్కలు రా... రా... అని పిలుస్తున్నాయి.


• గోదావరి నావ లోని తెరచాప 

  రెపరెపలాడుతూ ఉంటే.... 

  పురివిప్పిన నెమలిలా  మనసు నాట్యం చేస్తోంది.


• ప్రియా....ఇసుకతో చేసిన నీ శిల్పం, 

  నా అరచేతిలో  మెరుస్తూ ఉంటే....

  వీచే గాలిలో నీవే కనిపిస్తున్నావు.

  నను తాకే పారిజాతపు పరిమళం....

  నీవే అనిపిస్తున్నావు.


• సకలము నీవైనా....త్యాగము నేనైనా.


• ఎదురుపడవని తెలిసినా....

  ఎదురు చూపులతో

  ఎన్ని రాత్రులో నీ కోసం.


• నా కన్నీటి మసకకి, 

  గోదావరి తోడై….వెన్నెల నీడై….

  నా జీవన నాడవుతుంటే....

  ఊపిరి ఆగిపోతే బాగుండనిపిస్తుంది.


YSR 2 Sept 21 10:00 pm


494. Failures Are Accurate Winners

  Failures Are Accurate Winners • అపజయం అనే పదం వినగానే ప్రతి మనిషి లో కలిగేది ఒక భయం, మానసిక ఆందోళన. మనిషి ఏదైతే కోరుకుంటాడో అది పొందక పో...