Monday, September 27, 2021

91. ”శ్రీ” చరితం

 

         ”శ్రీ” చరితం



• ఎందుకో తెలియదు ఇది జీవితంలో ఒక అందమైన అనుభవం, జ్ఞాపకం… పేపర్ పై రాయాలని అనిపించింది ... ఒక మంచి కథ అవుతుందనుకున్నాను. కానీ రాయడం అనే అనుభవం లేని నేను , నాకు తోచిన విధంగా రాసుకున్నాను…అని మనసు లో అనుకుంటూ రాయడం మొదలు పెట్టింది సరిత.

🌷🌷🌷🌷🌷

• సరిత తను దిగాల్సిన స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి లగేజీ అంతా సర్దుకుని ట్రైన్ దిగడానికి సిద్ధం గా ఉంది. ఇంతలో స్టేషన్ రానే వచ్చింది. అక్కడ ట్రైన్ పది నిమిషాలు అగుతుంది కాబట్టి, కాస్త నిధానంగా దిగుదామని అనుకుంది. స్టేషన్ అంతా వచ్చిపోయే ప్రయాణికులతో సందడిగా ఉంది. ట్రైన్ దిగిన, సరితకు ఫోన్ రావడంతో , ఒక పక్కగా వచ్చి, ఫ్లాట్ ఫామ్ మీద నిలబడి మాట్లాడుతుంది. ఇంతలో హలో మేడం, అని ఎవరో పిలిచినట్లు అనిపించింది, సరిత ఫోన్ కట్ చేసి , ఎవరా తనను పిలిచేది అని , పక్కకు తిరిగి ఆశ్చర్యంగా చూసింది ... అంతే ఊహించని ఆశ్చర్యం, ఒక్కసారిగా సరిత తను కళ్లు పెద్దవి గా చేసి….. శ్రీ కాంత్ అని అంటూ….తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకాంత్ అక్కడ కనిపించేసరికి ఒక్కసారిగా సంతోషంతో ఓయ్.. నువ్వేంటి ఇక్కడ అని అడిగింది సరిత. వెంటనే శ్రీకాంత్ ఇది మా ఊరు, ఒక ఫ్రెండ్ ని, ట్రైన్ ఎక్కించడానికి వచ్చాను. వెళ్తూ వెళ్తూ నిన్ను చూసేసరికి, అరె సరితలా ఉందే, సరితే కదా అని సందేహం తో నిన్ను పలకరించాను. నువ్వు గుర్తు పట్టేసరికి హమ్మయ్య అనిపించింది.

• ఇలా నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలయ్యింది, నువ్వేమీ మారలేదు సరిత , అలాగే ఉన్నావు. ఈ రోజు నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదు అంటూ, తన ఆనందం అంతా మాటల్లో చూపించేస్తున్నాడు శ్రీకాంత్. కాఫీ అయినా ఇప్పిస్తావా లేక ఇలాగే నిలబెట్టి మాట్లాడెస్తావా అని సరిత అడిగేసరికి, సారీ సరిత అంటూ, అక్కడే ఉన్న కేంటీన్ లోకి వెళ్ళి కూర్చున్నారు ఇద్దరూ. ఊ... ఇప్పుడు చెప్పు " శ్రీ" ఏం చేస్తున్నావు, చెప్పు చెప్పు అని సంతోషం గా అడిగింది, సరిత. “ శ్రీ “ అని నువ్వు మాత్రమే పిలుస్తావు సరిత ... నువ్వు ఏదీ మర్చిపోలేదు అని చిన్నపిల్లాడిలా సంబరంగా అన్నాడు.

🌷🌷🌷🌷🌷

• ఇంతలో కాఫీ వచ్చింది. నవ్వేస్తూ కప్ తీసుకుంటూ ఇంకేంటి చెప్పు అంది సరిత. శ్రీకాంత్ ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయాడు...

• సరిత, శ్రీకాంత్ స్కూల్ నుండి డిగ్రీ కాలేజ్ వరకు కలిసే చదువుకున్నారు. వాళ్ళ ఇళ్ళు కూడా దగ్గర్లోనే ఉండేవి. చిన్నప్పటి నుండి శ్రీకాంత్ ఎప్పుడూ ముభావంగానే ఉండేవాడు, అందరితో కలవ లేక పోయేవాడు, అంతో ఇంతో సరిత తోనే మాట్లాడే వాడు. సరిత స్వభావం వేరు, తనకు నచ్చితే , వాళ్ళతో ఇట్టే స్నేహం చేసేస్తుంది. సరదాగా కలిసిపోతుంది. ఈ స్వభావమే బహుశా శ్రీకాంత్ కు, సరితలో నచ్చిందేమో, తనతో స్నేహంగా ఉండేవాడు. కాని ఏదో తెలియని బిడియం అయితే ఉండేది. కానీ సరిత అంటే ఇష్టం కూడా ఉండేది. చదువులు అయిపోయాక ఎవరి దారులు , వాళ్ళవి అయిపోయాయి. మళ్ళీ సరితను ఇంత కాలానికి ఇలా చూస్తానని అనుకోలేదు , అని మనసు లో శ్రీకాంత్ అనుకుంటున్నాడు.

• సరిత పిలవడంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఏంటి అబ్బాయ్ ఎక్కడికి వెళ్ళి పోయావు మళ్ళీ చిన్నతనంలోకి వెళ్ళిపోయావా? అని సరిత అంటుంటే, అవును సరిత” నిన్ను చూసేసరికి మళ్ళీ ఆ జ్ఞాపకాలు అన్ని గుర్తొచ్చాయి, అంటూ, ప్రస్తుతం తను ఏం చేస్తున్నది, తన కుటుంబ వివరాలు అన్నీ సరితకు చెప్పాడు శ్రీకాంత్. మరి నువ్వెక్కడ సరిత, నీ గురించి చెప్పు అనేసరికి ఆ ఏముంది, మామూలే అందరిలా, రోటీన్ జీవితం , మంచి కుటుంబం, ముగ్గురు పిల్లలు అని క్లుప్తంగా చెప్పింది సరిత. బంధువుల పెళ్ళికి వెళ్తూ ఇలా ఇక్కడ దిగి, వేరే ట్రైన్ మారాల్సి వచ్చింది, “శ్రీ” అని సరిత అనగానే, సరే నువ్వు ఎక్కవలసిన ట్రైన్ ఎక్కించి వెళ్తా అన్నాడు ”శ్రీ”. సరే అనేసింది సరిత. ఇన్నాళ్ళకు “శ్రీ” ని చూసేసరికి సరితకు తనతో, ఇంకా మాట్లాడాలి అని చాలా కుతూహలంగా అనిపించింది. ఇంతలో తను ఎక్కాల్సిన ట్రైన్ కూడా చాలా ఆలస్యంగా వస్తుందని, అని రైల్వే స్టేషన్ లో చెప్పారు. మామూలుగా అయితే అంత వెయిటింగ్ ను చిరాకుగా భరించేదేమో, కాని సరిత కు ఇప్పుడు అది సంతోషంగా అనిపిస్తుంది.

• “శ్రీ” వెంటనే, అంత సేపు ఈ స్టేషన్ లో వెయిటింగ్ ఎందుకు, నాకు నచ్చిన ప్రదేశం ఒకటుంది, ఇక్కడికి చాలా దగ్గర, నిన్ను తీసుకెళ్తాను సరేనా అనేసరికి, ఎక్కడికి , అని అడిగింది సరిత. శ్రీకాంత్ తను తీసుకువెళ్లాలి అనుకునే ప్రదేశం గురించి చెప్పగానే, సరిత ఒప్పుకునేసరికి “శ్రీ” సంతోష పడిపోయాడు.

🌷🌷🌷🌷🌷

• లగేజీ మొత్తం క్లాక్ రూం లో పెట్టి , స్టేషన్ బయటకు వచ్చారు. శ్రీ తన బైక్ తీసుకొచ్చాడు. ఇద్దరు బయలు దేరారు, దారిలో అంతా చూపిస్తూ చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు “శ్రీ”. సరిత మనసులో అనుకుంటుంది, చిన్నప్పుడు ఎంత బిడియం గా, సిగ్గు గా ఉండేవాడు. ప్రక్కన కూర్చున్న ముడుచుకు పోయేవాడు అని తలచుకొని మనసులోనవ్వుకుంది సరిత. ఇంతలో తీసుకెళ్తానన్న ప్రదేశం రానే వచ్చింది. అది అందమైన గోదావరి తీరంలోని ఘాట్. ఇద్దరూ బైక్ దిగి నడుచుకుంటూ ఘాట్ లోపలికి వెళ్తే అద్భుతంగా ఉంది. పరవళ్లు తొక్కుతున్న విశాలమైన గోదావరి, తీరం అంతా నడవడానికి అనుకూలంగా అందమైన టైల్స్ వేసారు. అక్కడక్కడ రంగు రంగుల సిమెంట్ బెంచీలు , చుట్టూ చెట్లు, మధ్య మధ్యలో క్రోటన్ మొక్కలు, ఇంకా రకరకాల పూల మొక్కలు, పచ్చని మెత్తని లాన్, తీరం లో ఉన్న నావలు, ఒక ప్రక్క గోదావరి నీరును తాకుతూ ఉన్న అమ్మవారి దేవాలయం, గోదావరి లో దూరం గా వెళ్తున్న పడవ, ఆకాశం అంతా మేఘాలతో నీలివర్ణమయం, ఎంత బావుందంటే చూడడానికి సరితకు రెండుకళ్ళు సరిపోలేదు. సరితకు ఆ ప్రదేశం చూస్తుంటే మనసు సంతోషంతో పురి విప్పి నాట్యం చేసే నెమలిలా అనిపిస్తుంది.

• “శ్రీ” మృదువుగా, నెమ్మదిగా చెప్తున్నాడు, ఇది నాకు చాలా ఇష్టమైన ప్రదేశం, రోజు లో ఒకసారి అయినా ఇక్కడ ఏకాంతం గా పదినిమిషాలు కూర్చొని వెళ్తుంటా, అని ఇంకా ఏదే ఏదో చెప్తూ తన పక్కనే నడుస్తున్నాడు. నిజంగా ఆ వాతావరణం, అలా చూసేసరికి “సరిత” కు చెప్పలేని ఆనందం అనిపించింది. ఇద్దరూ ఒక సిమెంట్ బెంచీ పై పక్క పక్కనే కూర్చున్నారు. చల్లని ఆహ్లాదకరమైన గోదావరి గాలి, “శ్రీ” ని తాకుతూ , సరిత ముంగురులు తాకుతూ ఉంటే, సరితకు అది ఒక పారిజాతపు పరిమళంలా మనసులో అనిపిస్తుంది. “శ్రీ” ముఖం అయితే ఆనందంతో వెలిగిపోతుంది. “శ్రీ” ఎప్పుడూ అనుకోలేదు. ఇలా తనకు ఇష్టమైన వ్యక్తితో, ఇష్టమైన ప్రదేశంలో కూర్చుని మాట్లాడే అవకాశం వస్తుందని. సరిత కి కూడా అలానే ఉంది.

• ఇద్దరూ ఏ మాత్రం గమనించలేదు, ఊహించలేదు. అప్పటికే ఆకాశం మేఘలతో , కారు మబ్బులతో నిండిపోయింది. వర్షం వచ్చేలా ఉంది, సరిత భయపడుతూ వెళ్ళిపోదాం ‘శ్రీ’ అంది. శ్రీకాంత్ ధైర్యం చెప్తూ, నిన్ను క్షేమంగా ట్రైన్ ఎక్కిస్తా, సరేనా ఇప్పడు ఈ అందమైన వాతావరణం ఎంజాయ్ చెయ్యి, అని భరోసా ఇచ్చేసరికి, నెమ్మదిగా వర్షం మొదలయ్యింది. వర్షం గోదావరి మీద కురవడం సరిత నిజ జీవితం లో, ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి అరుదైన అందమైన అనుభవాలు అందరి జీవితాల్లో రావు దానికి కూడా అదృష్టం ఉండాలి, అని ఒక మంచి జ్ఞాపకం గా మార్చుకుంది సరిత. ఇద్దరూ అప్పటికే వర్షం లో కొంచెం తడిచి పోయారు, నెమ్మదిగా అక్కడే ఉన్న అమ్మవారి దేవాలయం లో కి వెళ్ళి నిలబడ్డారు.

🌷🌷🌷🌷🌷

• “శ్రీ” మాట్లాడుతున్నాడు, ఆ క్షణం, ఆ సందర్భం, ఆ సమయం, ఆ ప్రదేశం, ఆ వాతావరణం అంతా మరచి పోయి, కాసేపు “శ్రీ” కి ఏమీ తెలియనట్టుగా అయిపోయి, విచారం వదనంతో మాట్లాడుతున్నాడు. చిన్నప్పటి నుండి తన మనస్సులో దాగి ఉన్నదంతా ప్రవాహంలా వచ్చేస్తుంది. “శ్రీ” ఇంత ఎలా దాచుకున్నాడో , అవును లే తాను కాదు కదా, తన మనస్సు మాట్లాడుతుంది…. అనుకుంది సరిత. వర్షం పెద్దదయ్యింది, “ శ్రీ” తన పట్ల చిన్నప్పటి నుండి పెంచుకున్న ఇష్టం, స్నేహం, ప్రేమ అన్నీ చెప్పాడు. సరిత వింటూనే ఉంది. తనకు కూడా తెలియదు, ఒక మనిషి పట్ల ప్రేమ ఉంటే, ఆరాధన ఇలా ఉంటుందా, ఇంతగా ఉంటుందా... తనకు అసలు ఎలా స్పందించాలో కూడా తెలియలేదు కానీ బాధ మాత్రం విపరీతంగా అనిపించింది. ఇంతలో వర్షం తగ్గిపోయింది. అంతా నిధానంగా విన్న సరిత ఏమీ మాట్లాడక పోయేసరికి, “ శ్రీ “ ముఖం చిన్నబోయింది. అక్కడినుంచి అయిష్టంగానే స్టేషన్ కి బయలుదేరాడు. ఇద్దరూ స్టేషన్ కు చేరారు. మౌనంగా ఉన్నారు ఇద్దరూ, ఇంతలో సరిత ట్రైన్ వచ్చింది . సరిత తన కోచ్ లో ఎక్కి కిటికీ పక్కన కూర్చుంది. అక్కడ ఫ్లాట్ ఫామ్ మీద షెల్టర్ లేదు. ఇంకా నెమ్మదిగా వర్షం పడుతూనే ఉంది. “శ్రీ” తడుస్తూనే ఉన్నాడు. ట్రైన్ నెమ్మదిగా కదిలింది, వెళ్ళిపోతుంది. “శ్రీ” కళ్ళల్లో కన్నీళ్లు వర్షంలో కలిసిపోతున్నాయి. అంత దుఃఖం శ్రీకాంత్ కు ఎప్పుడూ రాలేదేమో అని సరిత “ శ్రీ “ ని చూస్తూ అనుకుంది. “శ్రీ” మాత్రం పుట్టినప్పుటి నుండి, నిత్యం అనుభవించే, అలవాటైన దుఃఖమే కదా అనిపించింది. కానీ ఆ దుఃఖం తట్టుకునే శక్తి , “శ్రీ” శరీరానికి గాని, మనసుకు గాని లేవు. ఎందుకంటే “శ్రీ” ఇంకా ఎంతో కాలం, ఈ భౌతిక ప్రపంచంలో ఉండడని తనకు మాత్రమే తెలుసు.

• ఆనాటి నుండి సరితకు తన మనసు ని, “శ్రీ” లాక్కొని వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తూ ఉండేది. కొన్ని కొన్ని ఆందోళనలు, భయాలు, ఆలస్యాలు ఎవరి జీవితానైనా మార్చేస్తాయేమో కానీ, ఒకరి పై ఇష్టం, ప్రేమ ఒకసారి కలిగితే, ఆ మనిషి ఉన్నా, లేకపోయినా ఎప్పటికి పోవు కదా, అని మనసుకు సమాధానం చెప్పుకునేది సరిత. “శ్రీ” చాలా, చాలా బావుండాలి, “శ్రీ” జీవితంలో ఏ వెలితి ఉండకూడదు, సంతోషంగా ఉండాలి, ఇంత కంటే ఇంకేమి ఇవ్వగలను తన చిన్ననాటి నేస్తం లోని ప్రేమకి, అని సరిత అనుకునేది……కానీ “శ్రీ” జీవితంలో వెలితే “సరిత” నాటికి, నేటికీ, ఉంటే మరు జన్మకి.


25 sep 21  


No comments:

Post a Comment

498. మనసా తెలుసా

  మనసా తెలుసా  • మనసా   మనసా   ఇది  నీకు  తెలుసా. • మదిలో   కలిసే   సుధ ఏమిటో  తెలుసా. • ఇది  తెలియక   కలవరమై    వ్యధ  కిచ్చావు   అలుసు....