Sunday, September 12, 2021

87. ఆలోచనల తో.. నీ......జీవితం లో... నీ...ఆలోచనలు

 

ఆలోచనల తో.. నీ......జీవితం  లో... నీ...ఆలోచనలు



·        ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఈ బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే అద్భుతమైన పదాలు ఆలోచన,  జీవితం.  ఈ రెండు ఒకటేనా అంటే, ప్రతి ఒక్కరు ఇచ్చే సమాధానం ఒకటే...ఆలోచన లే జీవితం అంటారు.  కానీ , నాకు మాత్రం ఆలోచనా సరళి మీదే జీవితం ఆధారపడి నడుస్తుంది అనేది పూర్తిగా నిజం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి తన ఆలోచనలను ఏ విధంగానైనా ఆలోచించుకోవచ్చు , కానీ దానిని అమలు పరచడం అనేది మనిషికి కృషి, స్థితి , గతి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఆలోచన కార్యరూపం దాల్చలేదు. ఆలోచన అనేది మనిషి మేధస్సును సూచిస్తుంది. కానీ ఆ ఆలోచన అనేది మాట రూపంలో గానీ , చేతల రూపంలో గానీ అమలు జరిగినప్పుడే అర్థం, పరమార్థం ఉంటుంది .

·        మనిషి ఉదయం నిద్రలేచిన నుండి రాత్రి పడుకునే వరకూ, కొన్ని సార్లు, నిద్రలో కూడా నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంటాడు.  కానీ వాస్తవిక జీవితంలో చూస్తే చాలా మందికి ఆలోచన వేరు,  జీవితం వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆలోచనలనేవి  వాస్తవికత , నిజం , సాధ్యం,  అసాధ్యం ఇలా ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది.   ఇక జీవితం అంటే పరిస్థితులు, శైలి , అలవాట్లు మనిషితో ఉండే సాటి మనుషుల ప్రభావంతో నడుస్తుంది.  అంటే మనిషికి జీవితంలో చేస్తున్న కర్మలు, పనులు మాత్రమే కేవలం ఆలోచనలు గా ఎవరికీ, ఎప్పటికి ఉండవు.  ఆలోచనలు అనేవి ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితానికి అతీతంగా మాత్రం చాలా వరకు తప్పక ఉంటాయి. ఒక ఆలోచనలో నిజం ఉంటుంది, ఊహా ఉంటుంది, నటన కూడా ఉంటుంది.

·        ఒక మనిషి కి ఆలోచన ద్వారా వచ్చిన వాక్కు (మాట)  మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కొంతవరకు నిర్ణయిస్తుంది అనడం లో సందేహం ఏమీ లేదు కానీ , మనిషి జీవితం ఇందుకు భిన్నంగా చాలా సార్లు ఉంటుంది. ఒక ఆలోచన అనేది తరంగం (wave) అయితే , దాని ప్రకంపనలు అనేవి emotions, feelings అవుతుంటాయి.

·        ఆలోచనలకి మూలం మనసు. కానీ మనస్సు అనేది మనిషికీ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏ వయసులో, ఏ సమయంలో, ఎలా స్పందిస్తుందో భగవంతుడికి కూడా అర్థం కాదు. అందుకేనేమో భగవంతుడు కూడా మనిషికి ఆలోచనలతో చేసిన కర్మలను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ గమనించవలసినది మనిషి శరీరంలో ప్రతి అవయవానికి ఒక నిర్దిష్టమైన పరిమాణం,  అలాగే శరీరానికి కొలత కొలమానం ఉంటాయి. కానీ  మనసుకు,, మనసులోని ఆలోచన మాత్రం  ఇవేమి ఉండవు.

·        కొందరికి ఆలోచనలు స్థిరంగా , దృఢంగా ఉన్నా  జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది, అది పరిస్థితుల ప్రభావం.   మరికొందరికి జీవితం మంచి స్థిరత్వం తో ఉన్నా ఆలోచనలు మాత్రం అల్లకల్లోలంగా ఉంటాయి.  కంటికి కనిపించని సూక్ష్మజీవులు ప్రకృతిలో ఎలా ఉన్నాయో అదేవిధంగా మనకే తెలియని సూక్ష్మాతి సూక్ష్మమైన అంశంగా ఈ ఆలోచన జీవితం ను పేర్కొనవచ్చు.

·        అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే ఒకటి మాత్రం అనిపిస్తుంది, మనిషి జన్మతః మహానటుడు. క్యాలిక్యులేటర్ అనేది కేవలం గణితంలో అంశాలను మాత్రమే గణాంకం చేయగలదు, కానీ మనిషి మెదడు లోని ఆలోచన అన్నింటికీ అతీతంగా అవసరాలు,  సందర్భాలు,  పరిస్థితులను బట్టి ఎత్తులు,  పై ఎత్తులూ వేయడం ఒకటేంటి ఇలా ఎన్నో అంశాలను క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. చెప్పాలంటే ఇదే  మనిషి అసలు సిసలైన ఆలోచన జీవితం.  ఇందులోనే జననం మరణం,  ప్రేమలు ద్వేషాలు,  ప్రతీకారం సహాయం,  మిత్రత్వం శత్రుత్వం,  బంధాలు,  సంతోషం దుఃఖం,  అబద్దాలు నిజాలు అన్నీ కలగూర లాగా వీటితో మిళితం అయిపోయి ఉంటాయి.

·        వడకట్టి నీరు శుభ్రమై మంచినీరై,  మనిషి ఆరోగ్యానికి ఎంత దోహదం చేస్తుందో,  అలాగే వడకట్టి ఆలోచన కూడా,  అంటే మలినం లేని  ఆలోచన మనిషి జీవితానికి తేజస్సు అవుతుంది అనడంలో,  ఏమాత్రం సందేహం లేదు.   ఆలోచనలు శక్తివంతంగా, తేజోవంతంగా ఉండాలంటే చేయవలసినది  ఒకటే,  మెదడుకి విశ్రాంతినివ్వడం, దీనినే ధ్యానం అంటారు.  శరీరాన్ని మెలకువగా ఉంచి మెదడుకు విశ్రాంతి ఇస్తే,  నీలో సమస్త విశ్వం , భూమి, ఆకాశం,  ప్రకృతి,  నక్షత్రాలు, తోకచుక్కలు,  గ్రహాలు విశ్వమంతా కనిపిస్తుంది.  అదే మనిషికి అసలు సిసలైన చిరునామా.

·        ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితం ద్వారా వచ్చే ఆలోచనల కంటే కూడా ధ్యానం ద్వారా వచ్చే ఆలోచనలు చాలా శక్తివంతంగా వుండి,  జీవనం మార్గదర్శకం అవుతుంది.   జీవితాన్ని అనుభవిస్తూ ఉండడం ద్వారా కలిగే ఆలోచనలలో   సమతుల్యం  ఎన్నటికీ ఉండదు.   ఏదో ఒక అసంతృప్తి, emotional inbalance ఉంటుంది.  అదే ధ్యానశక్తి తో వచ్చే ఆలోచనలలో దేహానికి సరిపడా సమతుల్యం కలిగి,  హార్మోనులను, జీవన క్రియలు metabolism, catabolism) సజావుగా జరగడం తో పాటు మంచి జీవనం,  జీవితం ఉంటాయి.

·        సహజంగా మనిషి ఆలోచనలో ఉండేది ఒకటి మాట్లాడేది మరొకటి…. జీవితంలో చేసేది ఇంకొకటి….. ఇది మనిషికి తెలియకుండానే ( అంటే తన గురించి తాను ఆలోచించుకో లేక,  గమనించుకో లేక )  నిరంతరం అలవోకగా జరుగుతున్న  జీవన ప్రక్రియ ...ఔనన్నా,  కాదన్నా ఇది నిజం.

·          ఒక మనిషికి శరీరం,  జీవితం రెండూ బలహీనంగా ఉన్నా  ఆలోచన స్థిరమైనది,  బలమైనది అయితే మాత్రం మరణం వరకూ అత్యుత్తమం గా సాగుతుంది. 

·         మనిషి తన  ఆలోచనని  గొప్పగా ను,  ఉన్నతంగాను  అదే విధంగా అత్యల్పంగానూ ఉంచుకోనవసరం లేదు. కేవలం సమతుల్యంతో ఉంచుకుంటే చాలు...అప్పుడు ప్రకృతే నిర్ణయిస్తుంది,  మనిషి జీవితాన్ని స్థాయికి తీసుకు వెళ్ళాలి అనేది.

 

Yedla Srinivas Rao 9293926810,  12 sep 21 6:30 am.

 

 

No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...