Sunday, May 24, 2020

10. బిచ్చగాడు

బిచ్చగాడు

అమ్మా దానం
  అయ్యా  ధర్మం 
  రెండు దినాలు అయింది తిని
  జీవం లేని కంఠంతో పీలగా.

అందుకు సాక్ష్యం 
  ఈ మెట్లు .... ఆ గుడి గంట.

గుడి కి  వచ్ఛేపోయే వారిని 
  చూస్తే కోటి వెలుగుల కాంతి.

భగవంతుని ముందు భక్తులు
  భక్తుల ముందు మేము.

మూతపడే మా కళ్ళకు
  మీ చిల్లర శబ్దం ఓ మెరుపు.

గుప్పెడు నాణెల కోసం 
  బరువు మోయలేనంత గుండె భాథ.

ఛీ .. ఛీ ... ఛీత్కారాలే మాకు ఆశీస్సులు
  పో‌ .. పో ... ఈసడింపులే మాకు ఆప్యాయతలు.

అలంకార వి-గ్రహానికి నైవేద్యం
  ఆకలి ని-గ్రహానికి  దారిద్ర్యం.

ఏమిటో ఈ మాయ
  ఏమిటో ఈ వింత.

దేవుని మొక్కే మీకు అను-గ్రహం
  మిమ్మల్ని మొక్కే మాకు ఉత్త-గ్రహం.

గుప్పెడు మెతుకులు కోసం ఆరాటం
  చావలేక బ్రతుకు తో పోరాటం.

ఎంగిలి ఆకుల కోసం పడే అన్వేషణ 
   కొంచెం అయినా తీరక పోతుందా 
   మా ఆకలి నిరీక్షణ.

బిచ్చగాడికి దేవుడు లేడా
  ఉంటే గుడిలోని దేవుడు మాకు కాడా.


భగవంతుడా
  ఎందుకీ శిక్ష … ఎందుకీ కక్ష
  మా పై ఎందుకీ వివక్ష.

అమ్మా దానం
  అయ్యా ధర్మం రెండు దినాలైంది తిని.


యడ్ల శ్రీనివాసరావు  May 2021











Thursday, May 21, 2020

9. కళ్లు

కళ్ళు



• కళ్ళు ... తెలవారిన తొలి కళ్ళు...
• పచ్చని చిగురుటాకుల పలకరింపుల 
  ఆనందానికి ఆనవాళ్లు.

• కళ్ళు ... ప్రార్థించే కళ్ళు...
• దివి నుండి భువికేగిన తేజస్సుతో 
   నిండిన దైవత్వానికి వాకిళ్ళు.

• కళ్ళు ... నిత్యకృత్యమైన కళ్ళు...
• సమయంతో పరిగెడుతున్న ఆయాస
  ప్రయాసలకు నెమ్మది నిచ్చే నెమళ్లు.

• కళ్ళు ... ఆకలితో ఉన్న కళ్ళు...
• రుచిని ఆస్వాదించ లేని ఆత్రానికి
  ఆరాటానికి వెక్కిళ్లు.

• కళ్ళు ... జాలి కళ్లు...
• ఆర్ద్రతతో బరువెక్కిన ఇనుప గుళ్లు.

• కళ్ళు ... లాలించే కళ్ళు...
• పాటలతో జో  కొట్టే  సరిగమల సెలయేళ్ళు.

• కళ్ళు ... ప్రేమించే కళ్ళు…
• ప్రకృతి పురుషుల పులకరింత తో 
   మమేకమైన పరవళ్ళు.

• కళ్ళు ... సిగ్గుపడే చిలిపి కళ్ళు…
• ముఖారవిందాన్ని అరచేతుల 
  మాటున చిన్నగా చూసే లోగిళ్ళు.

• కళ్ళు ... భయపడే కళ్ళు…
• తడపడే గుండెలయకు చిక్కులు పడిన ముళ్ళు.

• కళ్ళు ... బాధించే కళ్ళు...
• జర జర రాలే నీటి చారికలకు పందిళ్లు‌.

• కళ్ళు ... తేజోవంతమైన కళ్లు...
• నిశి రాత్రుళ్లు కు వెన్నెల నిచ్చే చంద్రుళ్లు.

• కళ్ళు ... మత్తెక్కించే కళ్ళు ...
• నిషా కెరటాలలో ఊయల ఊగే నల్లని ద్రాక్షపళ్ళు.

• కళ్ళు ... ఆనందించే కళ్ళు...
• గలగలలాడే పెదవులకు చక్కిలిగిళ్లు.

• కళ్ళు ... ఆశ్చర్యం మైన కళ్ళు...
• వింతగా విప్పారిన పులకింతకు గొబ్బిళ్ళు.

• కళ్ళు ... ఓరచూపు కళ్లు...
• తహ తహ లాడే తనువుకి తియ్యని
   పుల్లని  కమ్మని రేగుపళ్లు.

• కళ్ళు ... పరవశమైన కళ్ళు...
• వెన్నెల చొరబడని ప్రియుని బాహువు లో 
   బందీయైన ప్రేయసికి సంకెళ్ళు.

• కళ్ళు ... నిజ స్వరూపమైన కళ్ళు...
• ఈ అనంతమైన సృష్టికి నిదర్శనం 
   నేనే అనే పెరుమాళ్ళు (విష్ణువు).



యడ్ల శ్రీనివాసరావు  20 May 2020



Monday, May 18, 2020

8. పిట్ట కధ..... స్నేహితుల యెుక్క మనోభావాలు

పిట్ట కథ



సుమారు 30 సంవత్సరాల తర్వాత 30 మంది చిన్ననాటి  స్నేహితులు కలిసారు. వీరంతా ఒక పార్కులో రౌండ్ గా ఉన్న ఒక పెద్ద రౌండు బెంచి మీద కూర్చుని నిత్యం మాట్లాడుకునేవారు . రోజుకు కొంతమంది చొప్పున వారి భావాలను చెప్పేవారు. మిగతా వారు విని ఆనందించే వారు. కానీ కొంతమంది ఎప్పుడూ వినడమే తప్ప మాట్లాడే వారు కాదు. అది మితభాషం లేదా సిగ్గు లేదా అందరిలాగా మాట్లాడలేరు అని మిగతా మిత్రులు అర్థం చేసుకునే వారు, సంతోషం గా కాలం గడిచిపోతుంది. 

సుమారు 100 రోజు ల తరువాత అర్థాంతరంగా , రోజుకు ఒకరు చొప్పున నలుగురు మిత్రులు నిష్క్రమించారు.  మిగిలిన  స్నేహితులకి ఆశ్చర్యం,  కారణం కోసం వెతికారు…. ఫలితం శూన్యం….. అందరు బాధ పడ్డారు.   అందరి తో కలిసి మెలసి  కొంత కాలం ఉన్నప్పుడు , వ్యక్తిగత కారణాల వల్ల నిష్క్రమించాలనుకున్నపుడు మిగిలిన స్నేహితులకి తెలియపరచాలి అనే కనీస ధర్మం తెలియని  వారి పరిణితి చూసి  మిగతా వారు భాథపడ్డారు.

ఆ తర్వాత కలిసి ఉన్న మిగతా స్నేహితులు మాత్రం  యధాలాపంగా పార్క్ లో కూర్చుని ఇలా అనుకున్నారు. ” సరే పోనీలే…పాపం…విడిపోయన వాళ్లు కూడా మన స్నేహితులే కదా……ఎక్కడ….ఎలా.....ఏపరిస్థితిలో ఉన్నా సంతోషం గా ఉంటే చాలు. జీవితం లో ఎవరు ఇంకొకరికి  పూర్తిగా అర్థం అవ్వాలనే నియమం ఏమీ లేదు.  కానీ కనీసం ఎవరికి వారిమే కొంతైనా మిగతా వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, చేతనైతే చేయూత ఇవ్వాలి. ……. ఎందుకంటే ప్రతీ ఒక్కరూ ఎవరికి వారే చాలా విలువైన వారు.   ఎప్పుడు,  ఏ వయసులో, ఏ సమయంలో, ఎవరి నుండి ఎటువంటి సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందో మనకి తెలియదు.  దీనికి ఎవరూ……అతీతం కాదు. ఎందుకంటే మనం  బ్రతికేసిన కాలం కంటే కూడా బ్రతకాల్సిన  కాలం చాలా తక్కువ. “ అని  మిగతా స్నేహితులు అనుకున్నారు.  ఎందుకంటే మిగతా స్నేహితులకు తెలుసు …వారంతా సంతోషం గా శేష జీవితాన్ని గడపగలరని.


యడ్ల శ్రీనివాసరావు 18 May 2020.








7. అమ్మ...మాత్రృదినోత్సవం

అమ్మ 
(మూలం : అమ్మ- నాడు-నేడు సమాజ తీరు  )



బాధ్యత నెరిగిన కూతురివి కాగలిగావో లేదో.... తెలియదు.

ప్రేమను పంచే సోదరివి కాగలిగావో లేదో.... తెలియదు.

సహనం కలిగిన భార్యవి కాగలిగావో లేదో.... తెలియదు.

ఎందుకు తెలియదు అంటే నిన్ను అర్థం చేసుకోగల వయసు లేక.

పరిపూర్ణత్వం తో  దైవానికి ప్రతిరూపమైన  అమ్మవు అయ్యావు.

అమ్మ...ఓ అమ్మ ...ఈ సృష్టి నే  ప్రతి సృష్టి చేయగల శక్తివి నీవు.

నాన్న ఎవరో చూడక ముందే నిన్ను  అణువణువు తాకాను  గర్భంలో.

నన్ను మోస్తూ నువ్వు ఆనందంగా పడే బాధ కు అర్థం....దైవమని తెలిసింది ఆలస్యంగా.

సంతోషాన్ని ఇచ్చే నీలాంటి కూతురే కావాలనుకున్నాను.

ప్రేమను పంచే నీలాంటి సోదరే  కావాలనుకున్నాను.

ఓర్పుకు ప్రతిరూపమైన నీలాంటి భార్యనే కావాల నుకున్నాను.

ఎన్నో సుగుణాల కలబోత అయిన నువ్వే నాకు అమ్మ గా ఎన్ని జన్మలైనా కావాలనుకుంటున్నాను.

ఇన్ని  సులక్షణాల మిళితమైన  నీ రక్తం నుండి ఉద్భవించిన నేను నీలా కాక....ఎలా ఉండాలి.

నా ఈ జన్మ ఎంత పాపిష్టి ది కాకపోతే....నేను వృద్ధాప్యంలో  నిన్ను విస్మరిస్తాను....నువ్వు నా బాల్యంలో ఇలా చేయలేదు కదమ్మా.

నా ఈ జన్మ ఎంత నికృష్టమైనది కాకపోతే....నేను నీకు గంజి పోయ లేక పోతాను....నువ్వు నా బాల్యంలో ఇలా చేయలేదు కదమ్మా.

ఉన్నతంగా బ్రతకమని....ఉన్నతమైన జన్మనిచ్చావు.

నేను చేసిన కర్మలకు, అకృత్యాలకు ....బ్రతికుండగానే నిన్ను  అంటరానిదానిలా ఉంచడం నా పుట్టుకకు అర్థం ఉందా....ఓ భగవంతుడా....అర్థం ఉంటే చెప్పు.

అందరి అమ్మలకు అంకితం ----కొందరి కొడుకులకు మాత్రం కనువిప్పు.



యడ్ల శ్రీనివాసరావు  8  May 2020


 

Friday, May 15, 2020

6. కళాశాల

కళాశాల
(మూలం:  ఇంటర్మీడియట్ కళాశాలలో తన వద్దకు వచ్చిన ఎంతో మంది యువతీ యువకులను  చూసి కళాశాల తనలో తను అనుకుంటుంది )



ఎన్నో చూసా
  నేను ఎన్నో చూసా
  రంగురంగుల చొక్కాలు
  రంగురంగుల పైజామాలు
  రంగురంగుల పరికిణీీలు.


సిగ్గు తెరల మాటున 
  చిలిపి జంటల హొయలు ఎన్నో చూశా.


నూనూగు మీసాల పలకరింపులు
  చిలక నవ్వుల తొలకరి సిగ్గులు.


ఓరచూపు నీలి కళ్లు
  అదిమిపట్టే పెదవులు.


ఎదురే  లేదన్న  దైర్యం తో  
  గోడలెక్కిన   ఎన్నో  క్రాఫులు (అబ్బాయిలు).
  భయం  మాటున  దాగి  దాగి 
  నడుస్తున్న  ఎన్నో  కొప్పులు (అమ్మాయిలు).


కండ కలిగిన బాహువులు
  కోయిల లాంటి కంఠస్వరాలు  
  ఎన్నో చూసా ... నేను ఎన్నో చూసా.


నాలో (కళాశాల) అడుగు పెట్టగానే
  ఆవిరైన  బాధలు,  
  చిగురు తొడిగిన చిరునవ్వులు.


చెట్టు  చాటు  మాటలు
  గడ్డిపైన   బాటలు
  చేయి  చేయి  స్పర్శలు.


గాలికి   ఊగే  ఝంకాలు
  అలజడి  చేసే  అధరాలు.


బొద్దుగా  ఉండే  చెక్కిళ్ళు
  గోదావరి  పాయ లాంటి  పాపిళ్లు.


వాలు  జడల  వలపు హోయలు
  జడ గంటల గలగలు.


కాలి మువ్వల సవ్వడులు
  నిటారు  నడకలు. 
  రివ్వున  ఎగిరే  పరికిణీలు
  వేయికళ్లకు  ఆనందాలు.


ఊగిసలాడే  మనసులు
  ఊహలో  తేలే  వయసులు
  ఆనందం....ఆనందం 
  ఎటు చూసిన  హద్దే లేని ఆనందం.


ఒకటేమిటి
  ఎన్నో చూసాను
  నేను ఎన్నో చూసాను.


ఆకలి లేని రోజులు
  నిద్రలేని  రాత్రులు 
  తొలి పొద్దు   కోసం  ఎదురుచూపులు.


ఉనికి  చాటుకునేందుకు  ఉపాయాలు
  ఉరకలు  వేసే  ఉత్సాహాలు
  లక్ష్యాల  కోసం   విశ్రాంతి లేని పోరాటాలు


ఒకరి కష్టానికి పదిమంది చేయూత
  పదిమంది సంతోషానికి వందమంది ప్రేరణ


కాలచక్రం తిరిగిపోయింది
  రెండు సంవత్సరాలు

దగ్గరలోనే దూరం 
  దూరం లోనే దగ్గర

భారమైన మనసులు
  మూగబోయిన ఆశలు

ఏకాకిలా వచ్చారు
  జంటలుగా వెళుతున్నారు

కొందరిది  స్నేహం 
  కొందరిది ప్రేమ
  మరి కొందరిది ఏకాంతం

అర్థం కాని అనుభవాల తో  
  వయసు పడే ఆరాటం
  మనసు చేసే పోరాటం.


జీవితం  ఎవరిని   గెలిపిస్తుందో 
  ఎవరిని  ఓడిస్తుందో
  కానీ   ఉండాలి    అందరూ ఆనందంగా .


ఎందుకంటే 
నా (కళాశాల) సాక్ష్యం తోనే 
కలిశారు కదా మీరంతా!


 యడ్ల శ్రీనివాసరావు 16 May 2020








Tuesday, May 5, 2020

5. విద్యార్ధి....ఓ.... విద్యార్ధి


విద్యార్థి…….ఓ……విద్యార్థి
(విద్యార్ధి…జీవితం….. లక్ష్యం)


విద్యార్థి...ఓ విద్యార్థి...విద్యను అర్జించే  ఓ ఆర్థి.

మేలుకో....మేలుకో ఇకనైనా మేలుకో.

చదువంటే పుస్తకాలే కాదు....చదువంటే జీవితం.

జీవితమంటే బ్రతకడమే కాదు....బ్రతికి       చూపించటం.

బ్రతుకంటే సంపాదనే కాదు.....బ్రతుకంటే బాధ్యత.

విద్యార్థి....ఓ విద్యార్ధి.....మేలుకో ఇకనైనా మేలుకో.

బాధ్యతంటే కుటుంబం....కుటుంబం అంటే రక్తసంబంధం….రక్తసంబంధం అంటే నీ రక్తం ఆవిరైయంత వరకూ ఎన్నో జీవుల తో ముడిపడిన బంధం.

బాధ్యత అంటే సమాజం....సమాజం అంటే నీ ఉనికి....ఉనికి అంటే నీ ఆలోచనల ప్రభావం.

విద్యార్థి....ఓ విద్యార్ధి....మేలుకో ఇకనైనా మేలుకో.

బ్రతికి చూడు.....‌బ్రతుకు చూడు.

లక్ష్యం వైపు నీ పయనం లో మొదటి ఓటమి నీ బలం అని తెలుసుకో.

నీ బలం లోని శక్తిని స్పృశించి చూడు.....అది నీకు దాసోహం కాకపోతే చూడు.

దాసోహమైన నీ శక్తి నిన్ను కీర్తి శిఖరాలకు చేర్చినపుడు....నీ కనుపాప లోని భాష్పం ఈ విశ్వానికి ఓ సాక్ష్యం.

విద్యార్థి....ఓ విద్యార్ధి...మేలుకో ఇకనైనా
 మేలుకో.

జవాబులేని గణితం లేదు....పరిష్కారం లేని సమస్య లేదు.

కేంద్ర బిందువు లేని వృత్తం  లేదు.....నీ ఉనికి లేని భూ వృత్తం లేదు.

చాటుకో.....చాటుకో.....చోటు లేని చోట కూడ చాటుకో.....హద్దులే లేని ఆలోచనల ఆకాశంలో  నీ అంశని.


యడ్ల శ్రీనివాసరావు 4 May 2020

Saturday, May 2, 2020

4. ఏది సత్యం...... ఏది అసత్యం



ఏది సత్యం........ ఏది అసత్యం
(మనిషి ఆలోచనా…ధర్మం…ఆచరణ)



మాట్లాడేవా ....ఏరోజైనా మాట్లాడేవా ....మాట్లాడి చూడు ....నీతో నువ్వు మాట్లాడి చూడు ...అద్భుతం జరగకపోతే చూడు

నీ సృష్టికి మూలం కణం ...కణానికి మూలం శక్తి (దైవం)...శక్తి కి మూలం పంచభూతాల సమ్మేళనం (పరమాత్మ)

భౌతిక ధర్మప్రకారం( as per physics/material) ఒక పెద్ద రాయి నుండి చిన్న రాయి వేరుపడితే రెండింటికీ ఒకే లక్షణాలు ,గుణగణాలు (physical/ material properties)ఉంటాయి . అంటే పెద్ద రాయి స్వభావం ఎలా ఉంటుందో చిన్న రాయి  స్వభావం కూడా అంతే. జీవం లేని  రాయి భౌతిక ధర్మాన్ని ఆచరిస్తూ కూడా సృష్టి ధర్మాన్ని అనుసరిస్తుంది . మరి జీవమున్న మనిషి ఆచరిస్తున్నాడా.......

అలాగే పంచభూతాల మిళితమైన పరమాత్మ యొక్క మూలకణం లోంచి వచ్చిన నీ ఆత్మ ...మాయ .... మిథ్యలో...పడి పంచభూతాలను విస్మరిస్తే ... దుఃఖం, క్షోభ కాక ఇంకేముంటుంది ఈ జీవాత్మ కి .  సృష్టి ధర్మాన్ని మరచి భౌతిక ధర్మాన్ని ఆచరిస్తే మోక్షం సాధ్యం ఎలా.

తెలుసుకో... ఇకనైనా తెలుసుకో... నీ గురించి తెలుసుకో ...ఏది సత్యం... ఏది అసత్యమో  తెలుసుకో.     భౌతిక సాధనాల సుఖం ఏ రోజుకైనా నశించేదే నీ శరీరం లాగా ..........ఆంతరంగిక సాధనల సుఖం శాశ్వతం నీ ఆత్మ లాగా .

జీవంలేని మట్టి కాలే కొద్దీ దృఢంగా గట్టిపడి ఇటుక అవుతుంది...........జీవంతో ఉన్న నువ్వు బాధలతో, దుఖంతో కాలే కొద్దీ ఇంకేంత గట్టిపడాలో ఆలోచించు...

పరమాత్మ లో ఉండాల్సిన నీ ఆత్మ... భౌతిక ప్రపంచం లోకి వచ్చిందంటే కారణం ఏమిటో తెలుసుకో ........ఏ కారణం లేకుండా నువ్వు  ఏ చర్య (కర్మ, పని)చెయ్యవు. అలాగే ఏ కారణమూ లేకుండా నువ్వు జన్మించవు . ఏ కారణం కోసం నువ్వు జన్మించావో ఆలోచించు, అది నిర్వర్తించు .

ఒంటరితనం నీకు ఎప్పుడూ శాపం కాదు .....ఒంటరితనమే నిన్ను ఈ విశ్వానికి చక్రవర్తిని చేస్తుంది .....ఒక్కసారి ఆలోచించి చూడు ...అందుకు చెయ్యాల్సింది నీతో నువ్వు అంతర్ముఖ ప్రయాణం .

నీ ఏకాంతానికి  నువ్వు రారాజు అయినా కూడా  నీ సామ్రాజ్యానికి పదిమంది శ్రేయోభిలాషులు అవసరం అని తెలుసుకో.

నీ చుట్టూ ఉన్న వారు నీకు అర్థం కావడం లేదు.......లేదా ..... నీ చుట్టూ ఉన్న  వారు నిన్నుఅర్థం చేసుకోవడం లేదు అని క్షోభించే బదులు .....నీకు నువ్వు అర్థం అవుతున్నావా  లేదా అనేది  ఆలోచించి  చూడు..

వైరాగ్యం అంటే సర్వం త్యజించడం ,  బాధ్యతల నుండి తప్పుకోవడం కాదు.  వైరాగ్యం అంటే సత్యం , నిజం.

జ్ఞాన వైరాగ్యం అంటే భౌతిక ఆధ్యాత్మిక బాధ్యతలను ఏ మార్గంలో నిర్వర్తించాలో తెలుసుకోవటం.

బంధించకు...  బాధించకు...  ఎవరిని... దేనిని. ఎందుకంటే నీ నుండి నువ్వు తప్పించుకు తిరగలేవు. నీ ఆలోచనే  నీకు శిక్ష కాగలదు .

రెండు నేత్రాలతో చూసిన నీకు ఈ భౌతికమే కనిపించును. పరమాత్మ యొక్క మూల కణ రూపమైన  నీవు…..నీలో ఉన్న మూడో నేత్రం (భృకుటి మధ్య పినియల్ గ్రంథికి అనుసంధానమై ఉంటుంది. విశ్వంలోని సమస్త శక్తి పినియల్ లో నిక్షిప్తమై ఉంటుంది) తోచూడు ఈ విశ్వంలో జరిగే ప్రతిదీ నీకు స్పష్టంగా కనిపిస్తుంది .

భయాన్ని వీడు ....ధైర్యం తో స్నేహం చెయ్ . ధర్మం కోసం నిలబడు .అది నిన్ను ఎంత ఎత్తులో నిలబెడుతుందో చూడడానికి నీ పాదాలు కూడా నీకు  కనపడవు .


   
 యడ్ల శ్రీనివాసరావు  3 May 2020

3. ఏమైపోతుంది లే ......ఏమై పోదులే ఓ చిన్న నాటి స్నేహమా

ఏమై పోతుందిలే....ఏమై పోదులే




• ఏమైపోతుంది లే....ఏమై పోదులే....ఓ నేస్తమా నా చిన్ననాటి నేస్తమా.

• నీ కళ్ళు చెప్పకనే చెపుతున్నాయి...నీలో అంతర్ముఖాన్ని.

• చెప్పినంత మాత్రాన చిన్నబోవు...చెప్పనంత మాత్రాన దాచలేవు.

• బాధలనేవి పంచుకోడానికే....కానీ పెంచుకోవడానికి కాదు.

• సంతోషాలఅనేవి పెంచుకోవడానికే....కాని దాచుకోవడానికి కాదు.

• నా మనసు తరంగాలు చెపుతున్నాయి...నీ మాటల మౌనాన్ని.

• ఏమైపోతుంది లే....ఏమై పోదులే.…ఓ నేస్తమా నా చిన్ననాటి నేస్తమా.

• మనసులోని బరువు శరీరానికి భారం....శరీరంలోని బరువు భూమికి భారం.

• ఉన్నాను కదా నేను ఉన్నాను కదా....నీ మనసులో బాధ పంచుకోవడానికి.

• ఏల ఈ మౌనం....ఎందుకు ఈ దిగులు.

• నా మౌనం నీకు భారమైనపుడు…..నీ మౌనం నాకు కాదా భారం.

• నువ్వు నాకు ప్రేరణ అయినపుడు....నేను నీకు కాలేనా ప్రేరణ.

• ఏమైపోతుంది లే....ఏమై పోదులే....ఓ నేస్తమా నా చిన్ననాటి నేస్తమా.

• ప్రేమ , స్నేహం అతీంద్రియ శక్తులు....అవి కోరుకునేవి త్యాగం, మంచి.

• చూస్తుంటాడు....చూస్తూ ఉంటాడు....పై వాడు అన్ని చూస్తూనే ఉంటాడు.

• ఎవరికీ....ఏది....ఎప్పుడు....ఎలా....అవసరమో అది ఏదోక రూపంలో ఇస్తూనే ఉంటాడు.

• కడతేరబోతున్న నా జీవితానికి....అర్థం చేసుకోగల ఆశయాలు ఎన్నో ఉన్నాయి.

• ఏమైపోతుంది లే....ఏమై పోదులే...నేస్తమా నా చిన్ననాటి నేస్తమా.

• వీక్షించకపోయినా నా రోదన నీకు తెలిసినపుడు.... నీ రోదన నాకు తెలియదా.

• నా కోసం నువ్వు పుట్టలేదు....నీకోసం నేను పుట్టలేదు...కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి పుట్టామని తెలుసుకో నేస్తమా....ఓ చిన్ననాటి నేస్తమా.

• ఇది మోహం కాదు.....వ్యామోహం అంతకన్నా కాదు.

• మన జీవిత పయనం వేరు కావచ్చు.....కూడలిలో కలవక ఉండగలమా.

• బాటలు వేరు కావచ్చు......మన గమ్యం ఒకటే కదా.

• అర్థంలేని బంధం కాదు....వ్యర్థం కాని సంబంధం అంతకంటే కాదు మనది.

• సమయం ఆసన్నమైంది నేస్తమా....ఓ చిన్ననాటి నేస్తమా....వీడు....ఇకనైనా వీడు నీ మౌనాన్ని.

• ఏమైపోతుంది లే...ఏమై పోదులే....మిగిలిన క్షణాలు కొన్నే.....అవి నీ కోసమే.


యడ్ల శ్రీనివాసరావు 3 May 2020




2. బడి లో ఒక రోజు

బడిలో ఒక రోజు 



• ఉంటాయి ...ఉంటాయి…..తెరిచి తరచి చూస్తే అన్నీ మధురంగానే ఉంటాయి.

• ఉదయాన్నే బడి లో పుస్తకాల సంచి బరువు.

• తరగతి గదిలో మాస్టారు పాఠాలు అర్థం కాకపోయినా అయినట్లు తలాడిస్తు నటించే నటన.

• ఉదయం విరామంలో చిరు తిళ్లు కోసం బడిగేటు బయట పడిన పడిగాపులు.

• పసుపు రంగు ప్రోగ్రెస్ కార్డులు ఫాదర్ ఇవ్వడానికి పేరు పిలిచినప్పుడు అరికాళ్ళలో ,అరచేతులలో, నుదిటి కణతలో భయంతో కారే చెమటను తుడుచుకో లేకపోవడం.

• మధ్యాహ్నం 12 గంటల నుండి ఆకలి రోదనతో జార్జి తాత గంట కోసం ఎదురుచూపులు.

• మధ్యాహ్న భోజనానికి స్కూల్ గ్రౌండ్ లో నీడ కోసం వెతుకులాట.

• మధ్యాహ్నం అమ్మ చేతి వంట తో కడుపునిండిన మధురం.

• భోజనం తర్వాత స్నేహితులతో చేసిన పరుగులు , సంభాషణలు (నువ్వేంట్రా గొప్ప అంటే ...ఆ నువ్వేంట్రా గొప్ప ).

• తిరిగి జార్జి తాత గంట తో తరగతి పునః ప్రారంభం .

• మాస్టారు పాఠం చెబుతుంటే నిద్ర ఆపుకోవటానికి చిత్రవిచిత్రమైన హావభావాలతో యోధుడిలా చేసే విశ్వ ప్రయత్నం.

• మధ్యాహ్నం నిద్ర ఆపుకోలేక ఆఖరి బెంచి కింద పడుకోవడానికి మిగతా స్నేహితులతో చేసుకున్న ఒప్పందం.

• మధ్యాహ్న విరామం లో ఎదురు పడిన అమ్మాయిలను చూడలేక చూసిన......... మనసు లో భయం, అలజడి, అర్థం కాని సంఘర్షణ తో తల దించుకుని నేల చూపుల తో ప్రక్కకు తప్పుకోవడం.

• సాయంత్రం గంట కొట్టగానే రెక్కలు విప్పిన పక్షిలాగా , లేగదూడ లాగ గెంతుకుంటూ ఇంటి వైపు పయనం.

• సాయంత్రం ఇంటిలో చిరుతిళ్లు కోసం డబ్బాలలో వెతుకులాట.

• సాయంత్రం ఆటలాడి నాన్న వచ్చే సమయానికి బుద్ధిగా పుస్తకాలతో చేసే స్నేహం.

• రాత్రి చదువుతూ చదువుతూ ఆవలింత లతో కునుకుతూంటే అమ్మ చూసి అన్నం పెట్టి పడుకో పెట్టే వయనం.

• ఉంటాయి....ఉంటాయి....తెరిచి తరచి చూస్తే అన్నీ మధురంగానే ఉంటాయి.

• నీలో ఉన్న నీ మనసు తెరిచి చూస్తే బాధలను మించిన సంతోషాలు అనుభూతులు ఎన్నో ఉంటాయి ......అందుకు నువ్వు చేయవలసినది ఒకటే.... నీతో నువ్వు ప్రయాణం చేయటం.

• పదిమందితో పంచుకున్న సంతోషానికి మూలం....ఏకాంతంలో ఉన్న ఏకాగ్రత కాగలదు.

• మనవాళ్లు ఇందులో ఎంతమంది తమను తాము చూసుకోగలరు లేదో నాకు తెలియదు....కానీ నిలువెల్ల ప్రతి అక్షరంలో నేనున్నాను,  అని తెలియ చేసుకోవటానికి చాలా సంతోష పడుతున్నాను.


యడ్ల శ్రీనివాసరావు, 2 May 2020
St.RCM High School, 
Pedaboddepalli, Narsipatnam, SSC 1988.

Friday, May 1, 2020

1. ఎవరు నీవు

ఎవరు నీవు



• ఎలా ఉన్నావో తెలియదు …
• ఏం చేస్తుంటావో తెలియదు ...
• ఏమవుతావో తెలియదు ...
• ఎందుకు చూసానో తెలియదు.


• ఇంతలోనే అంత దగ్గర ...
• అంతలోనే ఎంతో దూరం.

• దూరంలో ఉన్న భారం....
• శ్వాస కే ఆధారం.

• నేనున్నాను అంటావు....
• పలికే లోపు శూన్యం.

• ఇంద్ర ధనస్సులా  నవ్వుతావు....
• చూసే లోపు మౌనం.

• ఏదో చెప్పాలనిపిస్తుంది.....
• అది నాకే అర్థం కానట్టు ఉంటుంది.

• ఏదో తెలియని సంతోషం…
• మంచు ముక్కలాగా .

• ఏదో తెలియని బాధ…
• రాతి బండ లాగా.

• ఇలా ఎలా....
• ఇది నిజం కాబట్టి ఇలా...
• మరి ఎందుకు అలా .


• అర్థమైతే అంకితం....
• కాకపోతే పునఃరంకితం.


 యడ్ల శ్రీనివాసరావు, 1 May 2020

https://yedlathoughts.blogspot.com
yedlasrinivasrao@gmail.com
WhatsApp +91 9293926810
              📞  +91 8985786810









488. నా ప్రపంచం

నా ప్రపంచం • నా దొక   ప్రపంచం   అది   సోయగాల   సౌందర్యం. • నా  మనసెరిగిన   ప్రపంచం   మధువొలికిన     అనందం. • అందాల   ఆరబోతలు   ఆదమరచి   ...