కళ్ళు
• కళ్ళు ... తెలవారిన తొలి కళ్ళు...
• పచ్చని చిగురుటాకుల పలకరింపుల
ఆనందానికి ఆనవాళ్లు.
• కళ్ళు ... ప్రార్థించే కళ్ళు...
• దివి నుండి భువికేగిన తేజస్సుతో
నిండిన దైవత్వానికి వాకిళ్ళు.
• కళ్ళు ... నిత్యకృత్యమైన కళ్ళు...
• సమయంతో పరిగెడుతున్న ఆయాస
ప్రయాసలకు నెమ్మది నిచ్చే నెమళ్లు.
• కళ్ళు ... ఆకలితో ఉన్న కళ్ళు...
• రుచిని ఆస్వాదించ లేని ఆత్రానికి
ఆరాటానికి వెక్కిళ్లు.
• కళ్ళు ... జాలి కళ్లు...
• ఆర్ద్రతతో బరువెక్కిన ఇనుప గుళ్లు.
• కళ్ళు ... లాలించే కళ్ళు...
• పాటలతో జో కొట్టే సరిగమల సెలయేళ్ళు.
• కళ్ళు ... ప్రేమించే కళ్ళు…
• ప్రకృతి పురుషుల పులకరింత తో
మమేకమైన పరవళ్ళు.
• కళ్ళు ... సిగ్గుపడే చిలిపి కళ్ళు…
• ముఖారవిందాన్ని అరచేతుల
మాటున చిన్నగా చూసే లోగిళ్ళు.
• కళ్ళు ... భయపడే కళ్ళు…
• తడపడే గుండెలయకు చిక్కులు పడిన ముళ్ళు.
• కళ్ళు ... బాధించే కళ్ళు...
• జర జర రాలే నీటి చారికలకు పందిళ్లు.
• కళ్ళు ... తేజోవంతమైన కళ్లు...
• నిశి రాత్రుళ్లు కు వెన్నెల నిచ్చే చంద్రుళ్లు.
• కళ్ళు ... మత్తెక్కించే కళ్ళు ...
• నిషా కెరటాలలో ఊయల ఊగే నల్లని ద్రాక్షపళ్ళు.
• కళ్ళు ... ఆనందించే కళ్ళు...
• గలగలలాడే పెదవులకు చక్కిలిగిళ్లు.
• కళ్ళు ... ఆశ్చర్యం మైన కళ్ళు...
• వింతగా విప్పారిన పులకింతకు గొబ్బిళ్ళు.
• కళ్ళు ... ఓరచూపు కళ్లు...
• తహ తహ లాడే తనువుకి తియ్యని
పుల్లని కమ్మని రేగుపళ్లు.
• కళ్ళు ... పరవశమైన కళ్ళు...
• వెన్నెల చొరబడని ప్రియుని బాహువు లో
బందీయైన ప్రేయసికి సంకెళ్ళు.
• కళ్ళు ... నిజ స్వరూపమైన కళ్ళు...
• ఈ అనంతమైన సృష్టికి నిదర్శనం
నేనే అనే పెరుమాళ్ళు (విష్ణువు).
యడ్ల శ్రీనివాసరావు 20 May 2020
No comments:
Post a Comment