బలహీనతలే - లోపాలు - శాపాలు
• మనిషికి తన బలహీనతలే లోపాలు శాపాలా ?
అవును ముమ్మాటికీ . . . మనిషి కి తన లోలోని బలహీనతలే లోపాలు గా అయి శాపాలు గా మారుతాయి . ఇందులో ఏ సందేహమూ లేదు.
• మనిషి బలహీనతలను తన స్పృహ కి (Continuousness) తెలియకుండా నే బయటకు ఏదో రూపంలో ప్రదర్శిస్తూ నే తన ప్రవర్తనను నిత్యం కొనసాగిస్తూ ఉంటాడు . వాస్తవానికి ఈ బలహీనతలకు మూలం మనసు మరియు ఆలోచన . మానసిక పరిపక్వత (Maturity) లేనపుడు, మనసు పై నియంత్రణ (Controlling) కోల్పోయి మనిషి లో బలహీనతలు దృఢం గా బీజం వేసుకుంటాయి. ఇందుకు ప్రధాన కారణం ఆలోచనల లో సమతుల్యం లోపించడం .
• మనిషి తన బలహీనతలను తాను అంత సులభంగా ఆది లో గుర్తించలేడు . ఎందుకంటే జనన మరణ చక్రంలో తిరుగాడే మనిషి కి , అనేక జన్మలు గా అలవాటు పడి చేసిన కర్మలు , సంస్కార భూతమై వారసత్వంగా సంక్రమించినవే ఈ బలహీనతలు .
పైగా మనిషి ఆ బలహీనతలనే తన బలం గా భావిస్తూ , జీవనం సాగిస్తాడు . చివరికి ఏదో రోజు తన బలహీనతల వలన విపరీతమైన నష్టం జరిగినపుడు మాత్రమే మేల్కొంటాడు . అప్పటికి జీవితకాలం గడిచిపోతుంది .
• బలహీనతలు అనేవి పూర్తిగా మానసికమైనవి . అవి శరీరం ద్వారా ప్రభావం చూపిస్తాయి . బలహీనతలు జీవన వికాసానికి అత్యంత అవరోధాలు.
బలహీనతలే మనిషి ఎదుగుదలకు నిరోధకాలు , అందుకే తలపెట్టిన కార్యాలకు విఘ్నాలు గా అవుతాయి .
• అసలు ఒక మనిషి యొక్క బలహీనతలు , తన ఎదుగుదలకు మరియు తాను తలపెట్టే కార్యాల పై ప్రభావం ఉంటుందా ? అంటే . . .
సమాధానం . . . ముమ్మాటికీ ఉంది.
మానసిక బలహీనతలు అనేవి మనిషి ఆలోచనల ద్వారా బుద్ధి లో శక్తి లోపించడం వలన ప్రేరేపిత మైన నెగెటివ్ భావాలు . ఇంకా చెప్పాలంటే ఇవి మనిషి లో అంతర్భాగంగా విచ్చలవిడితనం తో చలామణి అవుతున్న నెగెటివ్ శక్తులు.
• ఇద్దరు మనుషుల మధ్య . . . లేదా ఒక మనిషి ద్వారా బాహ్య ప్రపంచం లో జరుగుతున్న ఏదైనా ఒక సంఘటన కి మధ్య కంటికి కనిపించని సూక్ష్మమైన అంశాలు రెండు ఉంటాయి.
అది ఒకటి భగవంతుడు (దైవం, పాజిటివ్ నెస్) రెండవది మాయ (మిధ్య , నెగెటివ్ నెస్).
ఈ రెండు కూడా మనిషి కంటికి ఏనాడూ కనపడవు. కానీ మనిషి కి ఆత్మానందం , దుఃఖం . . . ఆత్మ తృప్తి , అసంతృప్తి అనే అనుభవాలను ఇస్తూ ఉంటాయి .
☘️ ☘️ ☘️ ☘️ ☘️
• ఎలా అంటే ఉదాహరణకు మొదటి అంశం అయిన దైవం తీసుకుంటే . . .
ఒక మనిషి దైవాన్ని , ధర్మాన్ని అనుసరించి హేతుబద్ధమైన ఆలోచనలతో జీవనం సాగించినపుడు తన లోని బలహీనతలను సహజ సిద్ధంగా సునాయాసంగా అధిగమించి, ఎటువంటి పరిస్థితుల నైనా ఎదుర్కొని , తనకు ఎదురైన సమస్యలను తానే పరిష్కరించుకుంటాడు . ఇక్కడ దైవబలం ఒక శక్తి గా , సహాయకారిగా మనిషి కి తోడు అయి విజయునిగా చేస్తుంది .
ఈ దశలో మనిషి తన బలహీనతలను తాను స్వయంగా గ్రహించి, పరివర్తన చెంది అధిగమిస్తాడు . అందుకే బలహీనతలు లోపాలు గా అయి శాపాలు గా మారే విషయం ఈ దశలో ఉండదు.
☘️ ☘️ ☘️ ☘️ ☘️
• ఇక రెండవ అంశం తీసుకుంటే మిధ్య అనగా మాయ. మాయ భౌతిక ఆకర్షణలకు , మానసిక మోహలకు , వికారాలకు , హద్దు లేని కోరికలకు , వ్యర్థ మైన విషయాల పట్ల ఆసక్తి , అసత్యమైన మాటల జీవనం , మోసపూరిత చేతలతో కూడిన జీవిత విధానానికి దాసోహం అయినపుడు . . . ఇవన్నీ కలిసి బలహీనతలు గా అయి లోపాలు గా మారి , నెగెటివ్ శక్తి ని తనలో వృద్ధి చేసుకుంటాడు.
ఇవి మనిషి మనసు లో అంతర్లీనంగా కలిసిపోయి ఉండడం వలన , ఇవన్నీ తన ప్రవర్తన లో బలహీనతలు లోపాలు అని గ్రహించలేడు . ఎందుకంటే మాయ చాలా శక్తివంతమైనది . మాయా వలన పోందే మైకం మనిషి ని మానసిక అంధుడిగా చేసేస్తుంది. క్రమేపీ కొంత కాలానికి మనిషి లోని ఈ లోపాలే శాపాలు గా అయి ఏదొక సమస్యలు , విఘ్నాలు తరచూ కలగడం, తద్వారా దుఃఖం అనుభవించడం జరుగుతుంది. వీటినే మనిషి అనుకుంటాడు తనకు మాత్రమే అవరోధాలు , విఘ్నాలు కలుగుతున్నాయి అని , తలపెట్టిన ఏ పని సజావుగా సాగడం లేదని చింతిస్తాడు . వాస్తవానికి అది తన బలహీనతల లోని నెగెటివ్ శక్తి తిరగబడి తనకు అవరోధం కలిగిస్తుంది అని గ్రహించ లేడు .
మనిషి లోని మానసిక బలహీనతలను ఈ సృష్టి లోని భగవంతుడు , ప్రకృతి , పంచభూతాలు అంగీకరించవు . అందుకే అవి లోపాలు గా అయి తిరిగి మనిషి కి శాపాలు గా తయారవుతాయి. ఇందులో ఏ సందేహమూ లేదు.
☘️ ☘️ ☘️ ☘️ ☘️
మరి బలహీనతలను అధిగమించడం ఎలా ?
• భగవద్గీత జ్ఞానం నిత్యం వినడం ద్వారా మనిషికి తనలోని బలహీనతలను తాను గుర్తించగలడు మరియు అద్దం లో తన ముఖం వలే తన అంతరంగం యొక్క యదార్ధ స్థితి మనిషి కి కనిపించగలదు .
భగవంతుని తో కలిసి నిత్యం ధ్యానం చేయడం వలన బలహీనతలను అధిగమించగలడు . ఈ పరివర్తన కేవలం జ్ఞాన మార్గంలో మాత్రమే సాధ్యం అవుతుంది, భక్తి మార్గం లో సాధ్యపడదు . ఎందుకంటే భగవద్గీత జ్ఞానం , మనిషి కి తానెవరో తన మూలం ఏమిటో తెలియచేస్తుంది . దైవ ధ్యానం మనిషి పరివర్తన కి కావలసిన శక్తిని సమకూరుస్తుంది. భక్తి మార్గం భగవంతుడిని కేవలం విగ్రహాలు, పూజలు , కోరికలు , అవసరాలు వరకే మనిషి ని పరిమితం చేసి అల్ప కాలిక ప్రాప్తి నిస్తుంది . జ్ఞాన మార్గం సదా కాలిక ప్రాప్తి నిస్తుంది .
• భగవంతుడు మనిషికి ఉన్నతిని సమకూర్చి పైపైకి ఎదుగుదలతో తీసుకు వెళతాడు. ఎందుకంటే పరమాత్ముడు పైన ఉంటాడు . అందుకు నిదర్శనం భగవంతుని తలుచుకునేటప్పుడు మనం పైకి చూడడమే .
• మనిషి, మాయ కి దాసోహం అయి వశమైనపుడు అధఃపాతాళానికి దిగజారిపోవడం జరుగుతుంది. అందుకు నిదర్శనం తల దించుకుని దుఃఖం తో సమస్యలతో దిగులు తో నేలను చూస్తుండడమే .
• మనిషిని పాతాళానికి తీసుకు వెళ్లేది మాయ . మనిషి ని ఉన్నతంగా చేయగలిగే వాడు భగవంతుడు .
• భగవంతుడు ఒక్కడే . అతడే శివ పరమాత్ముడు. శివుని యధార్థం రూపం ప్రకాశవంతమైన జ్యోతి బిందు స్వరూపం .
మాయ బహురూపి. అనేక వికారాల ఆలోచనల రూపాలలో మనిషి ని మైకం లో ముంచి కబళిస్తుంది . అందుకు నిదర్శనం గా శాస్త్రాలలో రావణాసురుడికి పది తలలతో రాక్షసుడి గా చూపించారు .
మాయ వలన బలహీనతలను పొంది ఉన్న మనిషిని తిరిగి బలవంతుడి గా చేయు వాడు భగవంతుడి జ్ఞానం మాత్రమే .
• బలహీనతలు లోపాలు గా అయి, శాపాలు గా కాకముందే మేల్కోవడం ప్రతి మనిషికి ఉత్తమం .
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 16 Jan 2026. 9:00 PM.

No comments:
Post a Comment