నీ తలరాతలో నీ మర్మం
• దైవం తన ఉనికిని తెలియజేయడానికి అను నిత్యం నీతో మమేకమై ఉంటుంది ఇందులో అతిశయోక్తి లేదు , సందేహం అంతకంటే లేదు.
కానీ కాలగమనంలో నీ ప్రయాణం , సమయాసమయాలు సందర్భాలు సరిచూసుకుని మాత్రమే దైవం యొక్క అనుభవాలు నీకు ప్రస్పుటం అవడం ఆరంభమౌతాయి . నీ లోని , లో లోని అహాన్ని కాస్త ప్రక్కన పెట్టి , నీ మనస్సులో వాటి (అనుభవాల) జాడను గమనించే కుతూహలం రవ్వంత ఉంటే చాలు . అవి నీకు కష్టమో , నష్టమో , లాభమో , ప్రకోపమో (Emotional Excitement) , ప్రేమో , వేటిలోనైనా ఏ రూపంలోనైనా ఉండి ఉండచ్చు . కానీ నువ్వు దైవాన్ని అంగీకరించగలిగే శక్తి , నీకు ఆ సమయానికి కలిగితే చాలు నీ జన్మ ధన్యం అయినట్లే .
• దేవుడు భక్తి లోనే , భక్తి ఆరాధన తోనే ఇమిడి ఉంటాడు అన్నదానికి ప్రమాణాలు ఎన్ని ఉన్నాయో , దానికి అతీతంగా నీకు సంబంధించిన మరికొన్ని విషయాలలో కూడా నీ వెంట ఉంటాడు అన్నది కుడా అంతే సత్యం . ఆ ఒక్క నీ నమ్మకం నిన్ను గెలిపిస్తుంది అదే నిను దేవుని వైపు నడిపిస్తుంది .
ఇదంతా నువ్వు దేవుని నమ్మినపుడు మాత్రమే , లేదంటే నీ వెంటే ఉన్న వాడు నిరాకారిగా నిర్గుణుడిగా నిర్వికారిగా నిశ్చలంగా నీ వెనుక మౌనం గా నిలిచిపోతాడు .
ఆట వాడిది , ఆడేది నువ్వు . . .
మాట వాడిది , పలికేది నువ్వు . . .
నడిపించేది వాడు , నడిచేది నువ్వు ,
ఇదే సత్యం . ఇవి చాలు నీ జత యై తోడు గా పరమాత్మ శివుడు ఉన్నాడు అని నీకు తెలియడానికి . . . ఇదంతా తెలిసి బ్రతుకు సార్ధకం చేసుకుంటావో , తెలియనట్టు ఉండి నీ జన్మ వ్యర్థ పరచుకుంటావో నీ ఇష్టం .
• ఎందుకంటే , గత జన్మలో చేసిన కర్మల ద్వారా ఎప్పటికప్పుడు నీ తలరాతను కాలం సాక్షి గా , తదుపరి జన్మ కోసం నువ్వు రాసుకున్న దే . అదే ప్రస్తుతం ఈ కాలంలో నువ్వు అనుభవిస్తున్న నీ జీవితం .
• బ్రహ్మ పని అందరి తల రాతలు రాయడం , మార్చడం కానే కాదు . బ్రహ్మ కేవలం జ్ఞాన సాగరుడైన శివుని యొక్క జ్ఞానాన్ని రచించడం . అదే బ్రహ్మ జ్ఞానం అంటారు. దీనినే శ్రీకృష్ణుడు భగవద్గీతగా వినిపించాడు .
• నువ్వు రాసుకున్న , రాసుకుంటూ ఉన్న తలరాతను , తిరిగి నువ్వే మార్చుకోవాలి . అందుకు చేయవలసింది . . .
ఒకటి శ్రేష్టమైన ఆలోచన తో కూడిన కర్మలు (పనులు) . రెండవది అన్ని కార్యకలాపాలు నిర్వర్తిస్తూ , మనసు లో నిరంతర శివ స్మృతి కలిగి ఉండడం .
కర్మ అంటే శిక్ష కాదు . . . ప్రతిబింబం .
ఏది చేస్తే అదే తిరిగి ఫలితంగా అనుభవించడం.
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 28 January 9:00 PM.



No comments:
Post a Comment