శివ గణం
• శివుని గురించి రాయడానికి , మాట్లాడటానికి , ఆలోచించడానికి , తెలుసుకోవడానికి శివ తత్వం బోధ పడక్కర్లేదు శివుని పై అనురక్తి కలిగితే చాలు.
ఆయన్ను మనసులో స్మృతి చేస్తూ ఉంటే చాలు , శివుని తో మొదలవుతుంది శివ బంధం . ఆ పరిచయం , ప్రయాణం , ఆయన తోడు ఉన్నాడు అనే అనుభూతి నీకు కైలాస శిఖరాల వెండి కొండలపై నడయాడు వేల వేల మధుర స్మృతులను తలపిస్తుంది. ఇది అనుభవించిన వాడికి మాత్రమే ఎరుక.
• నువ్వు పరమ జ్ఞానివా లేక అక్షరం ముక్క తెలియని అవివేకివా అన్న భేదం శివ సాధనలో అణువంత కూడా లేదు . ఇక్కడ అందరూ సమానులే . ఒక్క సారి శివుడితో నీ నడక మొదలు అయితే , నీ జీవితపు నడవడిక దిశ దశ మారిపోతుంది.
• నువ్వు ఏనాడైనా ప్రేమతో నో , కోపంతో నో నాకు దేవుడితో పని లేదు అనే పరిస్థితి లోకి వెళ్ళవా , అదికూడా అలకతో కూడిన సరియైన స్థితితో మాత్రమే సుమా ! . . . నీ వెంట భగవంతుడు పరుగెడుతూ వస్తాడు. ఒక స్వచ్చమైన అమాయకత్వ మనసు కలిగి సన్మార్గంలో నడిచే భక్తుని కొరకు భగవంతుడు తనంతట తాను గా వెతికి వెతికి వస్తాడు. ఎందుకంటే , ఏ తండ్రి తన పిల్లల కు దూరంగా ఉండలేడు . . . ఉండాలని అనుకోడు . . . ఉండడు కూడా .
పంచభూతాలను నియంత్రించేవాడికి , నీ పంచ కర్మేంద్రియాలను , నీ భావోద్వేగాలను కట్టడి చేయడం అంత కష్టం ఏమీ కాదుకదా ! . . . కానీ నిన్ను నిన్నుగా ఆలోచింప చేసే పరిస్థితులు కలిగిస్తాడు , నీ లోని చైతన్యం మేల్కొనే లా చేస్తాడు . నీ అవశేష కర్మలను (Pending Karmas) ఆధార భరితంగా ప్రత్యక్షం గా చూపించి అనుభవించేలా చేస్తాడు . వాటిని మరల బేరీజు వేసి , అప్పుడు వాటికి ఫలితాలు నిర్ణయిస్తాడు. ఇది శివ గణం లక్షణం . అందుకే అంటున్నా , ఒక మానవ కణం ( అంటే నీ పుట్టుకలో నువ్వు ఒక కణం మాత్రమే ) శివ గణం గా మారటానికి బుద్ధి కుశలతే ప్రధానం . మంచి చెడుల విచక్షణ శోధన సాధన ఇవన్నీ ఆచరణ మార్గాలే .
నిన్ను సర్వ శక్తి వంతుని గా చేయడానికే శివుడు ఉన్నది . అందుకు ఆయన శక్తి ని నీకు ధారణ చేస్తూ నే ఉంటాడు . అందుకు నువ్వు చేయవలసినది ఒక్కటే , అది మనసున "శివయ్య" అనే ప్రేమ పూర్వక పిలుపు తో కూడిన స్మృతి.
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏 .
యడ్ల శ్రీనివాసరావు 29 JAN 2026 10:30 AM.

No comments:
Post a Comment