నీ దైవం ఎక్కడ ?
అక్షరాలకు అలసట లేనేలేదు పదాలకు పొంతన తెలియదు. అది రాసే వాడికి వాటిని పొందు పరచే వాడికే ఇది ఎరుక.
నువ్వు నేర్చిన కూర్పు నీకు తోచిన మార్పు . అదే పద సంకలనముగా మారి ప్రకంపనల ప్రభంజనం అవుతుంది.
మాట మనిషిని బ్రతికిస్తుంది , అదే మాట మానవ సమూహాన్ని చంపేస్తుంది . మంచితనం మాటలోనే కాదు వాటి అమరికలులో కూడా ఉంటుంది.
ప్రతి మనసుకు మాటలు చెప్పాలని , ఇంకో మనసు మాటలు వినాలని ఉంటుంది. కానీ అది అక్షర రూపం దాల్చడం దాన్ని ఎదుటివారికి నచ్చేలా ప్రతిసారి రాయటం కష్టమేమో. అందుకే నా మనసు మాటలు ఇంకా ఎన్నో మూటలు గా మిగిలి పోతూనే ఉన్నాయి.
నాకే కాదు మీలో చాలామందికి ఇదే ప్రశ్న.
భావానికి బాధ్యతకు ప్రేమకు రూపం ఎక్కడని ఎలా అని వెతకగలం చెప్పండి. బహుశా దైవం కూడా ఇదే కోవలోకి వస్తుంది అనిపిస్తుంది . దేవుడు ఉన్నాడు నన్ను నిన్ను రక్షిస్తూ ఉన్నాడు . . . రక్షిస్తాడు అన్నది నిజమనే మన భావనలకు రూపం ఎక్కడా వెతకలేం . అది కేవలం అనుభవాలతో నే సాధ్యం.
అక్షరాలలో చిత్రాలలో శిల్పాలలో ప్రకృతిలో దైవ భావనను నింపుకుని జీవించే మనకు , మనసును అంగీకరించిన ప్రతి మనిషి కూడా దైవం ఉనికిని అంగీకరించి తీరాలి. అది శివుడు , విష్ణువు లేదా మరో రూపం ఏదైనా సరే నీ మనసుకు నచ్చి , నిను మెప్పించిన రూపమే నీ దైవం. ఇదే సత్యం. కాదని నీ మనసుని చంపుకొని నీకు దైవం ఉనికి తెలియదు అని ఉండటం అంటే అది అజ్ఞానం తో నిండిన , వృధా జీవ ప్రయాణమే.
తీపి లేని మకరందం సువాసన లేని మల్లెలు ప్రకృతి విరుద్ధం , ఇది ఊహకు అందని విషయం. అందుకే అంటున్నా . . . బతికి ఉన్నంత కాలం మనిషిగా బ్రతుకు , మనసున్న మనిషిగా బ్రతుకు , దైవ చింతనతో కూడిన మనిషిగా బ్రతుకు , మంచి మనసులతో కూడిన మానవ సమాజమే మనందరి కోరిక అదే దైవ కాంక్ష.
నచ్చిన దైవాన్ని , రూపాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు , ఏదో నాడు . . .
మనిషి ఎవరు ? . . . మతం అంటే ఏమిటి ?
గురువు ఎవరు ? . . . సద్గురువు ఎవరు ?
ధర్మ పితలు ఎవరు ? . . . దైవం అంటే ఏమిటి ?
భగవంతుడు ఎవరు ? . . . పరమాత్మ ఎవరు ?
అనే ప్రతీ విషయానికి అనుభవాల స్వాగతం లభిస్తుంది.
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 23 Jan 2026 , 1:00 PM.

No comments:
Post a Comment