Wednesday, June 29, 2022

206. రాతలు – తల రాతలు

 

రాతలు – తల రాతలు


• రాతలు రాసే వాడున్నాడా…

• నీ తలరాతను మార్చే వాడున్నాడా.

• రేఖలు గీసే వాడున్నాడా…

• నీ చేతి రేఖలు దిద్ధే వాడున్నాడా.


• ఉంటే ఏడ ఉన్నాడు….కంటే ఏడ దాగున్నాడు.

• ఓ మనిషి…..అమాయకపు మనిషి.


• సుఖము సందడి లో అంతా నేనేనంటావు.

• దుఃఖదారిద్య్రం లో నాకేమీ తెలియదంటావు.


• కర్త వు నీవు… కర్మ వు నీవు….క్రియ వు నీవే…

• ఆ ఫలితమే నేటి నీ జీవితం.


• ఓ మనిషి….. తెలుసుకో… తెలుసుకో

• జ్ఞానం తెలుసుకో…అజ్ఞానం మరచిపో


• చేసిన కర్మలు నీవే అయితే ….

• ఆ కర్మలే నీ రాతలు‌… తలరాతలు.


• చేసిన చేతలు నీవే అయితే

• ఆ ఫలితాలే నీ గీతలు…. అరచేతి గీతలు.


• రాతలు రాసే వాడున్నాడా…

• నీ తలరాతను మార్చే వాడున్నాడా.

• రేఖలు గీసే వాడున్నాడా…

• నీ చేతి రేఖలు దిద్ధే వాడున్నాడా.


• ఉన్నాడు…ఒకడున్నాడు.

• నీలోనే ఉన్నాడు…. నీతోనే ఉన్నాడు.

• అది నువ్వే…అది నువ్వే…

• ఓ మనిషి అది నువ్వే‌


• నిన్ను నువ్వు తెలుసుకో…

• నీ రాతనే తిరగ రాసుకో.

• నిన్ను నువ్వు చూసుకో…

• నీ రేఖనే సరిదిద్దుకో.


• శాశ్వతం కాని దేహమే కర్మ చేసినా…

• శాశ్వతమైన ఆత్మయే ఫలితం మోస్తుంది.


• ఓ మనిషి….. తెలుసుకో….తెలుసుకో

• జ్ఞానం తెలుసుకో…అజ్ఞానం మరచిపో.


• ఓ మనిషి…. తెలుసుకో…తెలుసుకో

• నీ వోక ఆత్మవని తెలుసుకో.

• దేహం విడిచి పోవాలని తెలుసుకో


• శ్రేష్ట కర్మలను ఆచరించడం నేర్చుకో

• జన్మాంతరాల వేదనను కరిగించుకో.


• నీ ఆలోచనలే నీ కర్మలు

• నీ కర్మలే నీ తలరాతలు.


• పరమ సత్యమే ఇది

• పరమపిత తెలిపే జ్ఞానమిది.


యడ్ల శ్రీనివాసరావు 29 June 2022 10:00 PM.



















Monday, June 27, 2022

205. చిరు జల్లులు

 

చిరు జల్లులు


• జల్లులు జల్లులు జల్లులు…

• చిరు జల్లులు అల్లిన చినుకులు

• నా ప్రేయసి ముంగిట వలపులు.


•  నా చెలి అందం చూసి  

   నీలి మబ్బుల ఆకాశం 

• నల్లని మేఘమై వర్షిస్తూ  

  పలకరింపు కై వచ్చింది.


• కోయిల రాగాలు  వర్షపు హోరు తో  

  శృతి కలుపుతూ ఉంటే

• కొలను లోని  తామర వలే   

  నా చెలి వికసిస్తుంది.


• జల్లులు జల్లులు జల్లులు…

• చిరు జల్లులు అల్లిన చినుకులు

• నా ప్రేయసి ముంగిట వలపులు.


• ఆకుల జారిన చినుకులతో  

   పక్షులు ఆటలు ఆడుతూ ఉంటే

• నా చెలి వదనం  

   బుట్టబొమ్మలా  ఊగుతూ ఉంది.


• తకదిమి తకదిమి అంటూ 

  కాలి గజ్జెను ఊపుతూ ఉంటే.

• చిటపట చినుకుల శ్రావ్యంతో  

   చిందులేస్తుంది  నా చెలి పాదం.


• జల్లులు జల్లులు జల్లులు…

• చిరు జల్లులు అల్లిన చినుకులు.

• నా ప్రేయసి ముంగిట వలపులు.


• ఈ వర్షపు జోరు  

  కొత్త పులకింతయై  అగాధాలను నింపుతుంటే

• నా చెలి మనసున  మాత్రం  

  సుగంధాలను  వెదజల్లుతూ ఉంది.


• ఈ తడిచిన నేల  అమృతమై  

  మట్టి వాసనకు  మది    మైనమవుతుంటే

• నా చెలి కరుగుతూ ఉంది.  

  నా హృదయముపై మైమరచి నిదురవుతూ ఉంది.


• జల్లులు జల్లులు జల్లులు…

• చిరు జల్లులు అల్లిన చినుకులు.

• నా ప్రేయసి ముంగిట వలపులు.


యడ్ల శ్రీనివాసరావు 28 June 2022 10:00 AM.



204. ఆట

 

ఆట



• జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. చెప్పాలంటే ఒక పెద్ద ఆట,  ఆడే అవకాశం ఒక మనిషి  అనే జీవికి మాత్రమే దొరికింది. సంతోషం దుఃఖం, ధనం పేదరికం, ఆశ నిరాశ, ప్రేమలు, స్నేహాలు, కోరికలు, ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో…... జీవితం మనిషి తో ఆడే లేదా మనిషి జీవితం తో ఆడే విభిన్న రకాల ఆటలు.


• ఈ ఆటలే ఒక జీవితానికి అర్థం, పరమార్థం అవుతాయి. ఈ జీవితపు ఆటలు మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుతాయి. ఒకో వయసు లో ఒక్కోలా మనిషి ఆలోచన ఉంటుంది. చెప్పాలంటే చాలా సార్లు అవసరాలే ఆలోచనలు గా మారుతుంటాయి.


• జీవితం ఒక పోరాటం అంటారు. కానీ నాకు పోరాటం అనే పదం సరికాదు అనిపిస్తుంది. పోరాటం లో ఎప్పుడూ ఆతృత, ఆరాటమే గాని ఆనందం ఉండదు. నిత్యం యుద్దం చేస్తూ అలసిపోతే ఇక ఆనందం ఎప్పుడు ఉంటుంది. జీవితం ఒక ఆట. ఆటగాడు ఆట ఆడేటప్పుడు ఒక మానసిక ఆనందం తో ఎంజాయ్ చేస్తూ గెలవాలని ఆడుతాడు. ఆటలో ఓడినా, గెలిచినా ఆటగాడికి ఎంజాయ్ చేసాను అనే సంతృప్తి ఉంటుంది.


• జీవితం కూడా ఒక ఆటే. మనతో మనం చుట్టూ కలిసి మెలసి ఉన్న మిత్రులు, బంధువులు, ఆత్మీయులు, శత్రువులు ఎవరి ఆట వారు ఆడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే రిలేషన్స్ లో ఉండే ఎమోషన్స్ కూడా ఆటలు లాంటివే. అంటే ప్రేమ, కోపం, బాధలు, వాత్సల్యాలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఆధిపత్యాలు లాంటివి, ఇవన్నీ ఆటలో అప్పటికప్పుడు ఆటగాళ్లు తీసుకునే నిర్ణయాలు, గెలుపు కోసం చేసే ఆలోచనలు. వీటినే మనిషి కొన్ని సార్లు తెలివి తేటలు అని అనుకుంటూ ఉంటాడు.


• ఆట అన్నాక కొన్ని సార్లు ఓటమి , కొన్ని సార్లు విజయం అనేది సహజం. ప్రతీ ఆట ఆడడానికి ఒక విధానం, పద్దతి, రూల్స్ స్థిరం గా ఉంటాయి. ఆట ఆడేది కూడా మైదానం లో, ఇది కూడా ఎప్పుడు స్థిరం గానే ఉంటుంది.


• అలాగే జీవితం అనేది ఒక స్థిరమైన మైదానం అనుకుంటే, ఈ మైదానాన్ని మనిషి పుట్టుక నుండి చావు వరకు జీవించడం అనుకోవచ్చు.


• ఆటలు పలురకాలు అనుకుంటే , మనిషి కూడా ఒకోదశలో ఒకో ఆట ఆడుతుంటాడు, ఉదాహరణకు బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్దాప్యం లో జరిగే మార్పులు, సంఘటనలు, అనుభవాలు, చదువు, వృత్తి, వివాహం, ఆటలు అనుకుంటే…..


• వీటన్నింటినీ ఒక పద్దతి, విధానం తో అవలంభించినపుడు జీవితం అనే ఆటలో ఎత్తు పల్లాలు ఉన్నా ఎంజాయ్ చెయ్యవచ్చు.


• ఇక ఆటగాళ్లు అంటే జీవితంలో చుట్టూ అల్లుకుని ఉన్న మనుషులు అందరూ, అన్ని బంధాలలో ముడిపడి ఉన్నవారు .

• ఒక ఆటలో

1. మైదానం స్థిరం.

2. ఆటలు స్థిరం.

3. ఆటలు ఆడే విధానం, పద్దతి (రూల్స్) స్థిరం

4. ఆటగాళ్లు స్థిరం కాదు.

5. గెలుపు ఓటములు స్థిరం కాదు.


• మనిషి కి

1. జీవితం స్థిరం.

2. వయసు దశలు స్థిరం.

3. జీవిత విధానం పద్దతి స్థిరం.

4. జీవితం లో పాత్రధారులు స్థిరం కాదు, (అంటే నా ఉద్దేశ్యం ఒకటి ప్రతీ ఒక్కరి జీవితం లో మనుషులు కలుస్తారు, విడిపోతారు…వివాహ బంధం లో కూడా కొందరిలో జరుగుతుంది. రెండవది ఎప్పటి కైనా మనిషి కి మరణం తప్పదు),

5. సుఖదుఃఖాలు స్థిరం కాదు.


• జీవితం అంటే ఒక ఆట. ఆ ఆటను స్పోర్టీవ్ గా తీసుకుంటే ఒత్తిడి లేకుండా ఎంజాయ్ చేస్తూ జీవించవచ్చు. నువ్వే ఒక శాశ్వతం కాదు అనే నిజం తెలిసినపుడు , నీతో ఉన్న వారెవరూ శాశ్వతం కాదు కదా. అంటే ఈ విషయం పాజిటివ్ గా ఆలోచిస్తే, సాటి మను మనుషుల వలన బాధలు, సమస్యలు పడుతూ బయటకు చెప్పుకోలేక డిప్రెషన్ లో కి వెళ్ళి సంవత్సరాల తరబడి దుఃఖం లో ఉండి జీవితాన్ని ఆనందంగా గడపలేక పోతున్నారు నేటి కాలంలో చాలా మంది. అటువంటి వారు ఒకసారి ఆలోచించండి. పుట్టినందుకు ప్రతీ క్షణం మీదే. మీరు మీలా జీవించడానికే గాని మరొకరి లా బ్రతకడానికి కాదు. మీ ఇష్టాలను వదులుకోకండి, సాధ్యాసాధ్యాలను గమనించండి. కానీ ఎవరినీ హింసించకండి.


• నీ పుట్టుక నీది….నీ ఆకలి నీది…నీ ఊపిరి నీది…నీ బ్రతుకు నీది….నీ చావు నీది….. చేతనైతే నీవు నీవుగా ఉండి ఒకరికి చేయూత నివ్వు. నీ లోని శక్తి ని నువ్వు గ్రహించనంత కాలం పిరికితనం రాజ్యం ఏలుతుంది.


• జీవితం అనే మైదానం లో ఎన్ని ఆటలు ఆడినా గెలుపు ఓటములు కి అతీతంగా ఎంజాయ్ చెయ్యడం నేర్చుకో…..నీ కంటే గొప్ప జీవితం ఎవరికీ ఉండదు. నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో, నీలో ఆత్మవిశ్వాసం అన్నీ నీకు నేర్పిస్తుంది.


యడ్ల శ్రీనివాసరావు 27 June 2022 6:00 pm.







Sunday, June 26, 2022

203. ఉషోదయపు స్రవంతి


ఉషోదయపు స్రవంతి


• ఓ ప్రియతమా… 

  ఉషోదయపు తొలి కిరణమా 

  ఆశల హరివిల్లు కి ఆనంద కెరటమా


• నా జీవన ఉషస్సు లో… 

  ఓ స్రవంతి... మధురమైన ప్రేమ మరువలేనిది.


• నిను తలచిన క్షణము నే పుడుతున్నాను 

  నిను చేరలేక నే మరణిస్తున్నాను.


• జీవిత చక్రం లో ఎక్కడ ఉన్నామో తెలియదు 

  కానీ... ప్రేమ చక్రం లో ఎదురుగ నే ఉన్నాము.


• మనసు లోని ప్రేమ నోటికి తెలియదా 

  మదిలోని ఆశ మాటకు తెలియదా


• నీ తనువు ఎక్కడున్నా…

  తలపు ఎక్కడో తెలుసు. 

  ఆ తలపు ఆశలే ఈ వలపు రాతలు.


• నీ శ్వాసలో అణువణువై  నే  ఉన్నా 

  నా రూపమేమిటో తెలియకనే ఉన్నా


• కనిపించని బంధం ఏదో కనపడుతుంది.


• ఒకరికి ఒకరం ఎవరికి ఎవరమో.


• చిద్రమైన గుండె కి…. 

  మరొక గాయం తట్టుకునే శక్తి లేదు.


• నీవు కనికరిస్తే…. 

  నీ పాదాలను కడగాలనుంది... నా కన్నీటితో...


యడ్ల శ్రీనివాసరావు June 27 2022 6:30 am.




202. పల్లె సొగసు

 

పల్లె సొగసు


• పచ్చదనపు పైరు చేనులో

• పరువం నిండిన పరికిణీ లో

• గంతులేసే ఓ గడసరి పిల్ల

• దేనికోసం నీ చిర్రుబుర్రులు.

• ఎందుకో నీ ఎదురు చూపులు


• ఈ చల్లని గాలి లో

• నీ సుతిమెత్తని పాదాల కింద

• నే పొలము గట్టు గడ్డి నై

• మైమరచి నలుగుతు ఉన్నా.

• చూడు …ఓ సారి  ఇటు చూడు.


• లేగదూడ వై గెంతుతూ ఉంటే

• పైట జారిన వైనం లో

• నీ కొంగు చాటు బంగారంపై

• నే తుమ్మెద నై వాలి ఉన్నా

• చూడు…ఓ సారి ఇటు చూడు.


• ఈ భానుడి తాపం లో

• వంగచేను లో వంగి ఉంటే

• నే స్వేదము నై  నీ నాభి లో చేరి

• చల్లదనము నే ఇస్తున్నా

• చూడు…ఓ సారి ఇటు చూడు.


• పంట కాలువ దాటుతు ఉంటే

• నే  సెలయేటి  నీటినై  

• నీ మోకాలిని సాకుతూ ,

• అందాలను ఆస్వాదిస్తున్నా

• చూడు…ఓ సారి ఇటు చూడు.


• పచ్చదనపు పైరు చేనులో

• పరువం నిండిన పరికిణీ లో

• గంతులేసే  ఓ పడుచుపిల్ల

• దేనికోసం నీ చిర్రుబుర్రులు.

• ఎవరికోసం నీ ఎదురు చూపులు


• ఎందుకో ఏమో తెలియదు కానీ

• నిను తాకిన క్షణము నుండి

• నువ్వే నా సర్వస్వం…. నువ్వే నా సమస్తం.


యడ్ల శ్రీనివాసరావు 26 June 2022 , 4:00 pm.








Friday, June 24, 2022

201. మందారం

 

మందారం



• నవ్వుతోంది…నవ్వుతోంది…

• ఒక మందారం నవ్వుతోంది.


• మకరందం నిండిన మందారం

• ముసి ముసి గా నవ్వుతోంది…

• ఊగుతోంది…వయ్యారం వలకపోస్తుంది.


• అలసి సొలసిన మందారం ఓ నాడు…

• ఎగసి ఎగసి ఎదురు చూస్తుంది.

• ఎందుకోసమో…. దేనికోసమో.


• అంతనే ఒక తుంటరి తుమ్మెద

• మందారాన్ని చూసెను….మోహించెను.

• మకరందం కోసం దరి చేరెను.


• మురిసిన మందారం…పులకరించెను…

• పలకరించెను….తుమ్మెదను ప్రేమించెను…


• ఆ ప్రేమే వికసించెను.


• అరవిరిసిన మందారం

• సిగ్గులోలకబోస్తుంది….సిత్రాలు సూస్తుంది.

• నవ్వుల ముత్యాలు తుమ్మెద కై దారబోస్తుంది.


• నవ్వుతోంది…నవ్వుతోంది…

• ఒక మందారం నవ్వుతోంది.


• మకరందం నిండిన మందారం

• ముసి ముసి గా నవ్వుతోంది..

• ఊగుతోంది….వయ్యారం వలకపోస్తుంది.


• తోటమాలి చూపుతో ఓ నాడు

• ముద్దులొలికె మందారం మగువ సిగలో చేరేను.


• అది తెలియని తుమ్మెద

• వనమంతా తిరుగుతూ మందారం కై వెతికెను.


• మదనపడిన తుమ్మెద

• తుదకు మందారం కై శ్వాస విడిచెను.

• ఆ ప్రేమే వికటించెను.


యడ్ల శ్రీనివాసరావు 24 June 6:00 pm









Wednesday, June 22, 2022

200. లిపి లేని భాష

 

లిపి లేని భాష


• ఏనాడో చిగురించింది

  ఈనాడే తెలిసింది.

• మదికొక భాష ఉంటుందని

  ఆ భాషకొక లిపి ఉంటుందని.


• భాషలోని భావాలు ఊసులకు రూపాలు.

• లిపి లోని అక్షరాలు అక్షింతల సాక్ష్యాలు.


• ఏనాడో చిగురించింది

  ఈనాడే తెలిసింది.

• మదికొక భాష ఉంటుందని

  ఆ భాషకొక లిపి ఉంటుందని.


• ఆ పేరు లేని మది భాష

  జగమంతా అల్లుకొని ఉంది.

  హృదయాలకు మాటలు నేర్పిస్తుంది.

  మనుషుల తో ఆటలు ఆడిస్తుంది.


• ఆ రాయలేని లిపి భాష

  విశ్వమంతా వ్యాపించి  ఉంది.

  కావ్యాలను తలపిస్తుంది.

  కన్నీళ్లను పెట్టిస్తుంది.

  మనసులను ఏమైనా చేసేస్తుంది.


• ఏనాడో చిగురించింది

  ఈనాడే తెలిసింది.

• మదికొక భాష ఉంటుందని

  ఆ భాషకొక లిపి ఉంటుందని.


• కళ్లకు కు తెలిసిన మది భాష 

  చూపులతో పలకరిస్తుంది.

• రూపము తెలియని లిపి భాష 

  ఊహలతో రాసెస్తుంది.


• ఊహల చూపులతో 

  నింగి కి ఎగిరెను ఒక ఆశ

• ఆ ఆశల పల్లకిలో 

  కళ్లకు కనిపించెను ఒక రూపము.

• ఆ రాయలేని లిపి  భాషే  

   ప్రేమ…ప్రేమ…ప్రేమ.


• ఏనాడో చిగురించింది

  ఈనాడే తెలిసింది.

• మదికొక భాష ఉంటుందని

  ఆ భాషకొక లిపి ఉంటుందని.


యడ్ల శ్రీనివాసరావు 22 June 2022 , 11:00 am.



Sunday, June 19, 2022

199. రూపిణీ.. స్వరూపిణీ

 


రూపిణీ.. స్వరూపిణీ


• ఓ రూపిణీ…. నా స్వరూపిణీ.

• అంకితం…నీకే అంకితం


• కలలో కలిశావు….కనులను తెరిపించావు

• మనసును తట్టావు….కలమును కదిపావు


• ఓ రూపిణీ….నా స్వరూపిణి.

• ఊహలలో మురిపించావు….

• మమతలు కురిపించావు….

• బుణమును పెంచావు.


• రూపము లేని ఓ స్వరూపిణి

• నా ఊహలకే మహారాణి

• జీవము లేని ప్రేమ కరిగిపోయింది.

• సజీవము కాని ప్రేమ కలలోనే చెదిరిపోయింది.

• రాసిన రచనలు నీకే అంకితం….

• నాలో చిగురించిన ప్రేమ ప్రకృతి కే పునరంకితం.


• జన్మంటు ఉంటే….మరు జన్మంటూ ఉంటే

• ఈ కలలే నిజం కావాలి. 🌹


యడ్ల శ్రీనివాసరావు 19 June 2022 , 02:30 pm








Monday, June 13, 2022

198. ఏమవుతుందో ఏమో

 

ఏమవుతుందో ఏమో



• ఏమో…ఏమో…. ఏమవుతుందో ఏమో…

• ఏమో…ఏమో….నా లో ఏమవుతుందో ఏమో…


• ఈ చల్లని గాలులు తాకుతు ఉంటే

• ఏదో తెలియని వింతవుతుంది

• నాలో పులకింతకు తోడవుతుంది.


• వీచే ఈ గాలులు కనురెప్పల నే తాకుతూ

• సిగ్గులు కురిపిస్తున్నాయి.

• నాలో మెరుపులు కనిపిస్తున్నాయి.


• ఏమో…ఏమో…. ఏమవుతుందో ఏమో…

• ఏమో…ఏమో….నా లో ఏమవుతుందో ఏమో…

• ఏమిటో ఇలా….ఎందుకో ఇలా


• ఈ పిల్ల గాలి యే శ్వాస గ  మారి

• తెలిసిన స్పర్శను స్మరణ కి  తెస్తుంది

• నాలో పరిమళం నింపుతుంది.


• ఈ హాయి గాలి యే ఆరతి అవుతూ

• వెలుగు ను చూపిస్తుంది

• నా జీవన జ్యోతి ని తలపిస్తుంది.


• ఏమో…ఏమో…. ఏమవుతుందో ఏమో…

• ఏమో…ఏమో….నా లో ఏమవుతుందో ఏమో…

• ఏమిటో ఇలా….ఎందుకో ఇలా


• ఉండలేక  నే  గాలి ని  అడిగా…

• చల్లగాలిని అడిగా


• ఈ తియ్యని గాలి చెవిలో చేరి

• గుసగుసలాడుతూ

• చెలి చిరునామా చెబుతొంది.


• చెలి నే తాకివచ్చి నాకు సందేశం వినిపిస్తుంది.

• నాలో పరవశాన్ని పులకరింపు చేస్తుంది.


• ఏమో…ఏమో…. ఏమవుతుందో ఏమో…

• ఏమో…ఏమో….నా లో ఏమవుతుందో ఏమో….


యడ్ల శ్రీనివాసరావు 13 June 6:00 pm.





Sunday, June 12, 2022

197. అనాధలు

 

అనాధలు


• అనాధలం…అనాధలం…

• ఒక అమ్మకు పుట్టిన అభాగ్యులం

• అనాధలం…. అనాధలం…

• అమ్మనాన్న లెవరో తెలియని చిన్నారులం


• గుప్పెడు మెతుకులకు గుండె చప్పుడు తో

• ఆకలి డొక్కతో అర్రులుచాచే అల్పులం


• ఆకాశం లో చుక్కలం …. దారి తెలియని పిల్లలం

• రెక్కలు లేని పక్షులం …. ఎక్కడికైనా ఎగిరి పో గలం


• అనాధలం…అనాధలం…

• ఒక అమ్మకు పుట్టిన అభాగ్యులం

• అనాధలం…. అనాధలం…

• అమ్మనాన్న లెవరో తెలియని చిన్నారులం


• చిరిగిన బట్టల చల్లదనం …. స్వేచ్ఛని నింపే హాయిదనం

• కాలిబాట లో నిదరవుతాం …. కాళ రాత్రితో కలలు కంటాం.


• ఎంగిలి ఆకుల పై అన్నం, అమృతం మాకు పరమామృతం

• దొరల పిల్లలను చూసి, మేము కూడా దొరలమనుకునే దరిద్రులం.


• అనాధలం…అనాధలం…

• ఒక అమ్మకు పుట్టిన అభాగ్యులం

• అనాధలం…. అనాధలం….

• అమ్మనాన్న లెవరో తెలియని చిన్నారులం


• చదువు సంధ్యలు లేనివారము యాచనతో యాతన పడే బాలలము.

• కళ్లలో ఆశలు ఆరని వారము మా కనుపాపలు సైతం చేస్తాయి ఆకలి పై పోరాటం.


• అనాధ శరణాలయం లో కాకుండా రోడ్ పక్క పుట్ పాత్ లపై జీవిస్తూ, నిద్రిస్తూ, యాచన చేస్తూ తల్లి తండ్రులు ఎవరో కూడా తెలియక , ఎంగిలి ఆకులు కోసం చెత్తకుప్పల మీద నిలబడి ఎదురు చూస్తున్న చిన్న పిల్లలు ఎందరో ఉన్నారు. ఈ మధ్య ఒకసారి వారితో  ఒక పది నిమిషాలు మాట్లాడి తే మనసు వికలం అయిపొయింది. వారిని చూసి జాలిపడే కంటే , వారిని చూసిన తరువాత నాపై నాకు చాలా జాలి కలిగింది. ఎందుకంటే వారు అనుభవిస్తున్న బాధలు, సమస్యలు నాకు గాని, నాలా ఉన్న చాలా మంది కి లేనే లేవు. కానీ ఎందుకో ప్రతీ మనిషి అసలు సమస్యే కాని వాటి గురించి విపరీతంగా సతమతం అవుతుంటారు. పేరుకే అనాధలు కానీ వారు చాలా మంది కి ఎలా ధైర్యంగా బ్రతకాలో చెప్పే మార్గదర్శకాలు. వాళ్లతో మాట్లాడుతుంటే, వాళ్ల ప్రపంచం చాలా పెద్దది. వాళ్లకి ఐకమత్యం ఉంది. దొరికిన అన్నం అందరూ పంచుకుంటారు. నిరంతరం ప్రకృతి లో ఉంటూ అన్ని గమనిస్తూ ఉంటారు. వాళ్లు ధ్యేయం ఒక్కటే రోజుకు సరిపడా అన్నం కోసం వెతుక్కోవడం. వారు అన్నం దొరకక పోతే ఆకలి తట్టుకోలేక ఏడుస్తారు. కానీ చాలా మంది మనుషులు కడుపునిండా తిని బాధ పడుతూ ఏడుస్తుంటారు. ఇంతకన్నా మనిషికి మనోవైకల్యం ఇంకొకటి ఉండదు. దయచేసి ఒక్క నిమిషం అటువంటి వారి గురించి ఆలోచించండి. మీ ఆలోచన వారికే కాదు మీకు కూడా సహాయకారి కాగలదు,   మీ జీవిత కాలం లో ఏదొక సమయం లో.

అహంకారం అనేది పక్కన పెట్టి , సరిగ్గా ఆలోచించడం అంటూ మెదలు పెడితే ప్రతీ ఒక్కరి నుండి నేర్చుకోవడానికి చాలా చాలా ఉంటుంది.




 

యడ్ల శ్రీనివాసరావు 13 June 2022 11:30 AM.




196. బతుకు బాట

 

బతుకు బాట


• బతుకు బాట లో

  ఎన్ని వంపులో, ఎన్ని సొంపులో

• నడక నేర్చిన పాదము నిధానమే అయినా

  నడిచే బాటలో ఎన్ని గుంతలో

• గుంతలు దాటినా, వంపులు ఎరుగని

  మనసుకి గంతలు భారమే అయ్యేను.


• బతుకు బాట లో

  ఎన్ని వంపులో, ఎన్ని సొంపులో

• సొంపులు నిండిన దేహము అందమే అయినా 

  ఆశల బాటలో ఎన్ని నిరాశలో

• నిరాశలు దాటినా సొంపులు తెలియని

  వయసుకు ఆశలే భారము అయ్యేను.


• బతుకు బాట లో

  ఎన్ని వంపులో ఎన్ని సొంపులో

• బాటలో బాటసారులు 

  సేద తీర్చే సూత్రధారులయితే

• బతుకు పయనం 

  ఎంతో అలసట లేని వయనం

• బాటలో ఆటుపోటులు 

  యుక్తి నిచ్చే ఆటపాటలయితే

• బతుకు గమనము 

  ఎంత దూరమైన సుగమనం


• బతుకు బాట లో

  ఎన్ని వంపులో ఎన్ని సొంపులో

• వంపులు సొంపులైనా 

  సొంపులు వంపులైనా

• సాగే బతుకు కి జీవముంటే

   చేరే గమ్యమే బతుకు సార్థకం.



యడ్ల శ్రీనివాసరావు 12 June 2022 9:00 pm










139. కళాశాల 1980 ఎపిసోడ్ -12

 

కళాశాల 1980

ఎపిసోడ్ - 12




సీన్ – 48



రాము జగిత్యాల వెళ్లిన వెంటనే లాడ్జి లో రూం తీసుకొని , విమల కోసం వెతకడం మొదలు పెట్టాడు. దేవాలయాల వద్ద, కూరగాయలు మార్కెట్కు, హాస్పిటల్స్, రెసిడెన్షియల్ ఏరియాల్లో రెండు రోజుల పాటు తిరిగి అలసి పోయాడు. కాని విమల కనిపించలేదు. చేసేది ఏమీ లేక హైదరాబాద్ వెను తిరిగాడు.

హైదరాబాద్ రాగానే

రాజారాం : రాము ప్రయాణం బాగా జరిగిందా…మీ ఫ్రెండ్ ను కలిసావా…అన్నాడు యథాలాపంగా.

రాము : హ..హ..హ.. కలిసాను సార్…అన్నాడు తడబడుతూ…

రాము : సార్ నేను ఇంకొక పది రోజుల్లో అమెరికా వెళ్లాలి. ఫస్ట్ కి జాబ్ లో జాయిన్ అవ్వాలి.

రాజారాం : సరే…రాము….నీ ఇష్టం…. మరలా ఎప్పుడూ వస్తావు ఇండియా కు….ఈ సారి నువ్వు వచ్చాక పెళ్లి చేసుకొనే వెళ్లాలి .. అన్నాడు నవ్వుతూ.

రాము : నవ్వుతూ…సరే సార్…

ఒక రెండు రోజుల తరువాత…ఒక ఉదయం శైలజ తలకు స్నానం చేసి చీర కట్టుకుని అందం గా తయారయి, రాము దగ్గరకు గదిలోకి కాఫీ తీసుకుని వచ్చింది.

రాము కాఫీ తీసుకుని ధాంక్స్ చెప్పాడు.

రాము : ఏంటి…శైలజ ఈ రోజు స్పెషల్ గా కనపడుతున్నావు.

శైలజ : నా పుట్టిన రోజు…

రాము : వో….. అవునా…. హేపీ బర్త్ డే,.. అని విష్ చేసాడు.

శైలజ : ఏంటి….ఉత్తి …విషెస్…ఏ నా…ఇంకేం.. గిఫ్ట్ లేదా…

రాము : చెప్పు…ఏం కావాలి నీకు

శైలజ : హ…ఎవరైనా అడుగుతారేంటి…నీకు నచ్చింది ఇవ్వాలి కాని.

రాము : అంటే , నీకు ఏం ఇష్టమో నాకు తెలియదు కదా…అందుకని చాయిస్ నీకు ఇస్తున్నాను.

శైలజ కి రాము అలా మొదటిసారి సరదాగా మాట్లాడుతుంటే, రాము ను విడిచి వెళ్ళ బుద్ది కావడం లేదు.

శైలజ : సరే…నా ఛాయిస్ అన్నావు…కాబట్టి, నాకు నచ్చిందే తీసుకుంటాను…సాయంత్రం లోగా…. అంది……రాము నన్ను గుడికి తీసుకుని వెళ్తావా.

రాము : నేనా…బాగుండదు.

శైలజ : ఏంటి …బాగోక పోవడం…. నేను అమ్మతో చెపుతాను…. నువ్వు రెడీ అవ్వు…

శైలజ కిందికి వెళ్లి, పావని తో చెప్పింది…రాము తో కలిసి గుడికి వెళతానని. పక్కనే ఉన్న రాజారాం, సరేనమ్మా …నేను స్కూటర్ వదలి, బస్ లో వెళ్తాను ఆఫీస్ కి, మీరు గుడికి, వెళ్ళి రండి అన్నాడు.

కాసేపు తరవాత, రాము, శైలజ కలిసి స్కూటర్ మీద గుడికి వెళ్ళారు. ఇంటి దగ్గర బయలు దేరే ముందు శైలజ, తన తల్లితో చెవి లో ఏదో చెప్పింది. గుడిలో దర్శనం అయ్యాక ఇద్దరూ ఒకే చోట కూర్చున్నారు. శైలజ కొబ్బరి ప్రసాదం సగం కొరికి, సగం రాము కి ఇచ్చింది.

శైలజ రాము చేతిని, తన చేతిలోకి తీసుకుని , రాము కళ్లల్లో కి చూస్తుంది. రాము కి ఆ స్పర్శ తో గుండె భారం గా, వేగం గా కొట్టుకోవడం మొదలైంది.

శైలజ : రాము నిజం చెప్పు…నేనంటే నీకు ఇష్టమేనా

రాము : నువ్వంటే…ఎందుకు ఇష్టం ఉండదు.. శైలజా…కానీ చెప్పడానికి పెదాలు అంగీకరించినా…మనసు అంగీకరించడం లేదు.. అని రాము అనే లోపు

 శైలజ తన చేతితో రాము నోరు నొక్కి, గట్టిగా చెయ్యి అడ్డం పెట్టి, ఇంకేం మాట్లాడకు…అంది.

ఆ నిమిషం లో శైలజ కి ఒకటి అర్థం అయింది. రాము ను ఎలాగైనా విమల ఆలోచనలు లోనుంచి తన వైపు తిప్పుకోవాలని.

అప్పటికే ఉదయం సుమారు 10 గంటలైంది. శైలజ రాము తో మార్నింగ్ షో సినిమా కి వెళ్దామా…. అంది…

రాము : వద్దు.. బాగుండదు అన్నాడు.

శైలజ :  నేను అమ్మకి చెప్పాను, సినిమా కి వెళ్తాము అని…పరవాలేదు…బయలదేరు …టైం అవుతుంది.

ఇద్దరూ కలిసి సినిమా కి వెళ్లారు…. శైలజ కి తాను 9 వతరగతి చదివేటప్పుడు, రాము ప్రక్కన కూర్చుని సినిమా చూసిన సందర్భం గుర్తుకు వచ్చి నవ్వుకుంది.

సినిమా లో శైలజ రాము చేతిని తన చేతిలోకి తీసుకుని సినిమా చూస్తుంది.

రాము కి తన ప్రమేయం లేకుండా నే తన జీవితం లో మార్పులు వస్తున్నాయి అని మనసు లో అనుకున్నాడు.

సినిమా అయిపోయాక ఇంటికి వచ్చేశారు. ఇంటిలో కలిసి భోజనం చేసారు.

ఆ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో రాము మేడ మీద గది ఆరుబయట కుర్చీ లో కూర్చొని ఆకాశం లో చందమామ వైపు చూస్తున్నాడు. ఆ సమయంలో శైలజ పాయసం తీసుకుని మేడమీద కి వచ్చింది. పాయసం పక్కున పెట్టి, నెమ్మదిగా రాము వెనుకనుండి వచ్చి, రాము కళ్లను తన చేతులతో మూసి దాగుడుమూతలు ఆడుతుంది శైలజ.

రాము ఒక్కసారిగా తన రెండు చేతులతో తన కళ్లు మూసిన శైలజ చేతులను గట్టిగా లాగాడు. శైలజ ఒక్కసారిగా ముందుకి తూలి రాము బుగ్గలకు తన ఎదను ఆనించి , ముందుకు పడబోయి ఒక్క నిమిషం అలా ఉండిపోయింది. ఇద్దరికీ ఆ క్షణం మధురం గా అనిపించింది.

ఒక్క క్షణం ఆగి తేరుకుని, ఇద్దరూ నిలబడి పిట్టగోడ ని ఆనుకొని నిలబడి ఆకాశం లో చందమామ ను చూస్తున్నారు.

కొంత సమయం తరువాత

శైలజ : రాము ఐ లవ్ యూ…అంది.

రాము : తిరిగి అదే మాట చెప్పడానికి ఎందుకో మనసు లో అంగీకరించక....శైలజ చేతిని తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు.

శైలజ కిందికి వెళ్లి పోయేముందు రాము ను ఒకసారి కౌగిలించుకొని …నేను నీ నుంచి తీసుకున్న పుట్టిన రోజు గిఫ్ట్ ఇదే అని …వెళ్లి పోయింది.

ఇట్టే వారం రోజులు గడిచిపోయాయి… రాము అమెరికా ప్రయాణం అదే రోజు…. శైలజ దిగులు గా ఉంది. రాము సంతోషంగా అందరికీ వీడ్కోలు చెప్పి బయలు దేరాడు.

అమెరికా వెళ్లిన వెంటనే జాబ్ లో జాయిన్ అయ్యాడు రాము.


సీన్ – 49


విమల భర్త శేఖర్ వడ్డీ వ్యాపారం బాగా దిగజారింది. నష్టం బాగా వచ్చింది. విమల మీద ఇదివరకు లా కాకుండా తరచూ గొడవ పడుతున్నాడు. తనకి పుట్టిన అమ్మాయి వలనే ఇదంతా అని జరిగింది అనేవాడు.

ఇక లాభం లేదనుకుని హైదరాబాద్ లో కోళ్ల ఫారం పెడితే బాగుంటుందని , ఉన్న ఎకరం భూమి అమ్మేసి , కుటుంబం మొత్తం మకాం హైదరాబాద్ కి మారిపోయారు. హైదరాబాద్ ఊరి శివార్లలో నాచారం దగ్గర ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, ఆ దగ్గరలోనే ఖాళీ స్థలం లీజుకు తీసుకుని అందులో కోళ్ల ఫారం మొదలు పెట్టాడు శేఖర్.

విమల కూడా శేఖర్ తో పాటు కోళ్ల ఫారం పని లో సహాయం చేసేది. మెదటిలో బాగా ఇబ్బంది అనిపించినా, ఒక ఆరు నెలల తర్వాత కొంచెం వ్యాపారం నిలదొక్కుకుంది. శేఖర్ కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు.

రోజులు ప్రశాంతంగా గడుస్తున్నాయి. కాలం , పరిస్థితులు మనిషిని క్రుంగతీస్తాయి, లొంగదీస్తాయి , నిలబెడతాయి, అన్నీ గాయాలను మాన్పుతాయి అంటారు. అది అక్షరాలా విమల జీవితంలో ఇప్పుడు నడుస్తుంది. విమల తన ప్రేమ జీవితం పూర్తిగా మరచిపోయి భర్త, పిల్లలు లోకం గా బ్రతుకుతుంది.


సీన్ – 50


కాలం చాలా వేగంగా గడిచిపోయింది. రాము అమెరికా లో ఉద్యోగం లో బాగా స్థిరపడి సంపాదిస్తున్నాడు.

ఒక సంవత్సరం తరువాత రాము ఇండియా వచ్చాడు. రావడం తోనే రాజారాం గారి కి, ప్రిన్సిపాల్ గారి కి తనకు చేసిన మెత్తం సహాయం కంటే నాలుగు రెట్లు డబ్బు తిరిగి ఇచ్చేశాడు. వారు ఎంత వారించినా వినలేదు.

వారిద్దరూ రాము యెక్క ప్రయోజకత్వాన్ని చిన్న తనం లోనే గుర్తించారు. అది నిజం అవడం తో వారి ఆనందానికి హద్దులు లేవు. రాము వారికి ఒక రక్తసంబంధం మంచి అయిపోయాడు.

రాజారాం, ప్రిన్సిపాల్ గారు కలిసి రాము, శైలజ ల పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి కి ముందు అయినా సరే, విమల కనిపిస్తుందేమో, విమల తనకోసం ఎన్నో సార్లు డబ్బులు ఇచ్చింది, ఉంగరం కూడా అమ్మేసింది…. విమల పిల్లలు తో ఎలా ఉందో , ఒకోసారి చూసి, తాను విమల కి ఇవ్వవలసినవి , ఇస్తే బాగుంటుంది…. ఏం చేయాలి, ఎలా విమల ను కలవాలి అని ఆలోచిస్తున్నాడు. ఇక రాము ఉండలేక ప్రిన్సిపాల్ గారిని ధైర్యం చేసి, అడిగేసాడు.

రాము : సార్… విమల ను ఒకసారి చూడాలి. తనకి నేను చాలా బుణపడి ఉన్నాను. తిరిగి తనకు ఇచ్చెయ్యాలి.

ప్రిన్సిపాల్ గారు : చూడు రాము…నీ ఆలోచన మంచిదే….నీ ప్రేమ విషయం ఇక్కడ మా అందరికీ తెలుసు, అందువలన ఎవరికి ఏ ఇబ్బందీ లేదు. విమల కి పెళ్లి అయి అయిదు సంవత్సరాలు అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నువ్వు ఈ రోజు విమలను తిరిగి కలవడం పరవాలేదు. కానీ ఆ తరువాత నుండి మీ విషయం విమల కుటుంబం లో ఎవరికైనా తెలిస్తే, తన జీవితానికి లేని సమస్యలు మొదలవుతాయి…. ఇది నీకు అవసరమా చెప్పు…అన్నారు.

రాము : ప్రిన్సిపాల్ గారు అనుభవం తో చెప్తున్నారని గ్రహించి, మౌనంగా ఊరుకున్నాడు.

విమల కోసం అని తాను అమెరికా నుండి తెచ్చిన డైమండ్ రింగ్ తన ఫాంట్ జేబులో నే ఉంచి నిమురుతున్నాడు.

 శైలజ, రాము ల పెళ్లి చాలా వైభవంగా జరిగింది. రాజారాం, పావని లకు బాధ్యత తీరినట్లు అనిపించింది. ఒక నెలరోజుల లో శైలజ, రాము తో అమెరికా వెళ్లి పోయింది.

రాము జీవితం శైలజ తో సంతోషంగా గడుస్తుంది. రాము కంటే వయసులో నాలుగేళ్ల చిన్నదే అయినా, రాము ను చిన్న పిల్లాడిలా చూసుకునేది శైలజ. ఆ ప్రేమ వల్లనేమో రాము కి కూడా శైలజ సర్వస్వం అయిపోయింది. రాము కి సంవత్సరాలు గడిచేకొద్దీ ఉద్యోగం లో ప్రమోషన్లు, బాధ్యతలు పెరుగుతున్నాయి. కంపెనీ లో మెలకువలు అన్నీ తెలుస్తున్నాయి.

రాము తన సంపాదన ఇండియా కు పంపించి ప్రిన్సిపాల్ గారి చేత సిరిసిల్ల లో పొలాలు, స్థలాలు …. అదేవిధంగా రాజారాం తో హైదరాబాద్ లో స్థలాలు, స్థిర ఆస్తులు బాగా కొనిపిస్తున్నాడు.

రాము శైలజ ల కి మొదట ఆడపిల్ల, తరువాత బాబు పుట్టారు. డెలివరీ సమయంలో , రాజారాం, పావనీ లను అమెరికా లో తమతో నే ఉంచుకున్నారు. ప్రిన్సిపాల్ గారు కూడా ఒకసారి అమెరికా వెళ్లి వచ్చారు. ఇక రాజారాం దంపతులు ఏడాదికి ఒకసారైనా ఒక నెల వెళ్లి వస్తున్నారు. రాము ప్రతీసారి వారు వచ్చి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

రాము పిల్లలు ఇద్దరినీ అమెరికా లో మంచి స్కూల్లో చదువుతున్నారు. పిల్లల కి ఇంటిలో శైలజ తెలుగు బాగా నేర్పిస్తుంది.

రాము అమెరికా లో సెటిల్ అయ్యి, 15 సంవత్సరాలు అయింది. బాగా సంపాదించాడు. ప్రపంచం 2000 సంవత్సరం లో అడుగు పెట్టింది. తనకి ఇప్పుడు 41 సంవత్సరాల వయసు. పిల్లలు హైస్కూల్ చదువుతున్నారు.

అదే సమయంలో భారతదేశంలో అభివృద్ధి పరంగా మంచి సంస్కరణలకు ప్రభుత్వం తెర లేపింది. విదేశీ NRI లకు పెట్టుబడులు పెట్టి కంపెనీలు హైదరాబాద్ లో మెదలు పెడితే , రాయితీ లు ప్రకటిస్తుంది ప్రభుత్వం.

రాము కి అదే సమయంలో …తనకున్న అనుభవం తో, ఇండియా లో ఒక చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ మొదలు పెట్టి , సంపాదన కంటే కూడా యువతకు మంచి ఉపాధి కల్పించాలని అనుకున్నాడు. తన ఆలోచనను, కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడి వారి అంగీకారం తో ఓ కే అనుకున్నాడు.

తన అభిప్రాయాన్ని రాజారాం, ప్రిన్సిపాల్ గారి కి తెలియచేశాడు. వారు రాము తిరిగి ఇండియా లో సెటిల్ అవుతాడు, తమ దగ్గరే ఉంటాడని చాలా ఆనంద పడ్డారు.


మిగిలినది ఎపిసోడ్ 13 లో

యడ్ల శ్రీనివాసరావు 12 June 2022.











Friday, June 10, 2022

195. మేజర్

 

మేజర్


• మరణించా వా…. నీవు మరణించా వా

• మరణం కౌగిలి లో మంచువై 

  సేద తీరే కృష్ణుడా… ఉన్ని కృష్ణుడా


• మరణించా వా…. నీవు మరణించా వా

• కృష్ణుడా…ఓ ఉన్ని కృష్ణుడా….


• సూర్యుడి కి జీవం తేజం

• సైనికుడి ఆయువు ధైర్యం


• మరణం లేని సూర్యుడి లా 

  సైనికుడి వైన.

• కృష్ణుడా…ఓ ఉన్ని కృష్ణుడా….

• మరణించా వా…. నీవు మరణించా వా.


• నిను చూసి త్యాగం తలదించుకుంది.

• ప్రేమే అపరాథి అయింది.

• ప్రేమ త్యాగాలకు అందని వాడివైనావు.


• నిను చూసి పోరాటం గర్వం తో ఉంది.

• రక్తం ఉరకలు వేస్తోంది.

• పోరాడే రక్తం నీకు దాసోహం అంటోంది.


• కృష్ణుడా…ఓ ఉన్ని కృష్ణుడా….

• మరణించా వా…. నీవు మరణించా వా


• మరణం అంటే మనిషిని మరచి పోవడం కాదని…

• మనసులలో మననం కా బడాలని.

• జననం అంటే మనిషి జీవించడం కాదని…

• దేహం లేకున్నా ఎందరికో మార్గదర్శకం కావాలని.


• ఆశలైన  నీ ఆశయాలు తరంగాలై 

   అంతరంగాలను తాకుతున్నాయి.

• కృష్ణుడా…ఓ ఉన్ని కృష్ణుడా….

• మరణించా వా…. నీవు మరణించా వా


• మరణిస్తే మా గుండెల్లో 

  ఎలా జీవిస్తున్నావు.

  ఎందుకు జీవిస్తున్నావు.



యడ్ల శ్రీనివాసరావు 11 June 2022 4:00 am.

Inspiration from Sri Major Unnikrishnan…from the movie MAJOR by Adivi Sheshu.




139. కళాశాల 1980 ఎపిసోడ్ - 11

 

కళాశాల 1980

ఎపిసోడ్ - 11



సీన్ – 44


రాము అమెరికా లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లో MS Computer science engineering లో జాయిన్ అయ్యాడు. అమెరికా వాతావరణం, చదువు అంతా ఊహించని కొత్త ప్రపంచం రాము చూస్తున్నాడు. 1980-90 ల్లో కంప్యూటర్లు ఇంకా ప్రపంచంలో ఏ దేశంలో ను వాడకం లేదు. కేవలం అభివృద్ధి చెందిన అతి కొద్ది దేశాల్లో మినహా. అటువంటి ఎంతో భవిష్యత్తు ఉన్న, ప్రపంచాన్ని శాసించే కంప్యూటర్ చదువు చదువుతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు రాము.

రాము చదువు కి యూనివర్సిటీ స్టైఫండ్ ఇస్తుంది. అది కాక పెట్రోల్ బంక్ లో, షాపింగ్ మాల్ లో పార్ట్ టైం ఉద్యోగం తన ఖర్చుల కోసం చేస్తున్నాడు.

వారానికి ఒకరోజు రాజారాం గారి కి, ప్రిన్సిపాల్ గారి కి, ఫోన్ చేసి యోగ క్షేమాలు తెలుసు కుంటున్నాడు.

విమల గురించి అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ తీరిక లేకుండా గడుపుతున్నాడు రాము.

ఇండియా లో రాజారాం మాత్రం ఎంత తొందరగా రాము చదువు పూర్తి చేసి ఇండియా కు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు.


సీన్ – 45


రాము అమెరికా వెళ్లి సంవత్సరంన్నర కాలం గడిచిపోయింది. ఇంకో ఇద్దరు మిత్రులతో కలిసి ప్రాజెక్టు చేస్తున్నాడు రాము.

శైలజ డిగ్రీ పూర్తి అయిపోయింది. శైలజ కి పెళ్లి చెయ్యాలనే ఒత్తిడి రాజారాం దంపతులకు రోజు రోజుకు ఎక్కువయ్యింది. రాజారాం, పావని లో దృష్టి లో రాము ఉన్నా, ఏనాడూ ఆ అభిప్రాయం రాముతో వారు చెప్పలేదు.

అయినా ఒకసారి విమల మనసు లో ఏముందో తెలుసుకోవాలని, ఒకరోజు విమల తో…

రాజారాం , పావని :  శైలజ నీకు చదువు పూర్తి అయ్యింది. పెళ్లి సంబంధాలు చూడాలని అనుకుంటున్నాం …అన్నారు.

శైలజ : నేను.. రాము ని తప్పు మరొకరి ని పెళ్లి చేసుకోను.

రాజారాం : అదేంటమ్మా…. రాము ప్రేమ విషయం నీకు తెలుసు కదా…

శైలజ : అవును నాన్నా…. అందులో రాము తప్పు ఏముంది. పరిస్థితులు తన ప్రేమను సఫలం కానివ్వలేదు. అంత మాత్రాన రాము ను అలా వదిలెయ్యాలని ఉందా…. రాము మనసు ఏంటో నాకు , నేను 9 వ తరగతి చదివే నాటి నుండి తెలుసు. దగ్గర గా చూసిన ఏ అమ్మాయి రామును కావాలని దూరం చేసుకోదు.

రాజారాం : రాము కి నీ విషయం, అభిప్రాయం చెప్పావా…

శైలజ : రాము, అమెరికా వెళ్లే ముందు రోజు చెప్పాను.

రాజారాం : రాము…ఏమన్నాడు.

శైలజ : ఏమీ చెప్పలేదు…మౌనంగా ఉన్నాడు. తన లక్ష్యం వైపు, తన ఆలోచనలు ఉన్నాయి అన్నాడు.

రాజారాం : టెన్షన్ పెరుగుతుంది…. మరి ఏం చెయ్యాలి ఇప్పుడు.

శైలజ : రాము చదువు పూర్తి అయి, సెటిల్ అవనివండి…. అందుకు ఇంకో సంవత్సరం పడుతుంది. అప్పుడు రాము తో మాట్లాడుదురు.

రాజారాం, పావని లకు కొంచెం అయెమయం గా ఉంది. తరువాత కాలంలో రాము ఏం అంటాడో అని.

శైలజకి రాముతో పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న విషయం తన మిత్రుడు ప్రిన్సిపాల్ కి ఫోన్ లో చెప్పాడు రాజారాం. మిత్రుడు సంతోషంగా చాలా మంచి నిర్ణయం , రాము ఈ సారి ఇండియా వచ్చినప్పుడు అందరం కలిసి మాట్లాడుదాం రాజారాం అన్నాడు.


సీన్ – 46


విమల కి మొదటి కాన్పు అయిన ఈ సంవత్సరంన్నర లో రెండవ కాన్పు డెలివరీ అయింది. ఈ సారి పాప పుట్టింది. సిరిసిల్ల లో తల్లి వద్దనే ఉంది. శేఖర్ విమల ను ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ విమలకి రెండవ సారి పాప పుట్టడం పై అసంతృప్తి వెలిబుచ్చి , చిరాకు పడేవాడు. పిల్లలు పుట్టిన తరువాత విమల లో ఇదివరకటి మీద కొంచెం మార్పు వచ్చింది. పాపకి 5 నెలలు వయసు వచ్చాక పుట్టింటి లోనే పేరు , రామలక్ష్మి అని పేరు పెట్టారు.

విమల తాను అత్తారింటికి రేపు వెళుతుంది అనగా , ముందు రోజు తన బాబు, పాపలతో ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్ళింది. ప్రిన్సిపాల్ గారి కి పాపను చూపించి ఆశీస్సులు తీసుకుంది. ఈ సారి ప్రిన్సిపాల్ గారు పాప పేరు అడగకుండా నే రామలక్ష్మి అని చెప్పింది విమల.

ప్రిన్సిపాల్ గారు మనసు లో అనుకున్నారు. పిల్లలు కి రాంబాబు, రామలక్ష్మి పేర్లు పెట్టింది అంటే విమల , రాము ను మర్చిపోవడం అసాధ్యం అనుకున్నారు.

ప్రిన్సిపాల్ గారు ఏదో ఆలోచిస్తూ ఉండగా….

విమల : సార్…రాము అమెరికా లో నే ఉన్నాడా… ఎలా ఉన్నాడు సార్…ఫోటో ఏమైనా మీ దగ్గర ఉంటే చూపిస్తారా…అని అమాయకంగా అడిగింది.

ప్రిన్సిపాల్ గారు : పాపం…విమల అలా అడుగుతుంటే, ఆయన మనసు కరిగి పోయింది…. అవును విమల రాము కి ఇంకో ఆరు నెలల్లో చదువు పూర్తి అవుతుంది. చాలా పెద్ద చదువు చదువుతున్నాడు. ఆయన దగ్గర రాము అమెరికా నుండి పోస్ట్ లో పంపిన ఫోటోలు తీసి చూపించాడు.

విమల : ఆ ఫోటోలో రాము ను చూసి సంతోషం పట్టలేక పోయింది. ఫోటో లో రాము సూటు తో అంత పెద్ద కాలేజీ లో ఉన్న ఫోటోలను చూసి చేత్తో నిమురుతూ…మౌనంగా తిరిగి ఇచ్చేసి, వెను తిరిగింది విమల.

విమల తన అత్తారింటికి వెళ్లిపోయింది. …శేఖర్ చేస్తున్న వడ్డీ వ్యాపారం ఇదివరకటి లా లేదు. రైతులకు పంటలు పండక, నష్టం వచ్చి అప్పులు తిరిగి కట్టడం లేదు. చాలా మంది అసలు డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. లక్షరూపాయలు పైన నష్టం వచ్చింది. శేఖర్ మనసు లో ఒక దురుద్దేశం పెట్టు కున్నాడు, ఆడపిల్ల పుట్టడం వలనే ఇదంతా జరుగుతుంది అని అస్తమానూ విమలను పాపను తిట్టేవాడు. శేఖర్ తో పాటు, అత్త పోరు పెరిగింది.

కాలం గడుస్తుంది…..


సీన్ – 47


అమెరికా లో కాలేజీ లో రాము మిత్రులతో కలిసి చేసిన ప్రాజెక్టు IBM company వారు చూసారు. రాము కి చదువు పూర్తి అవగానే, IBM company లో ఊహించని జీతం తో ఉద్యోగం వచ్చింది. రాము వెంటనే రాజారాం కి, ప్రిన్సిపాల్ గారి కి ఫోన్ చేసి చెప్పాడు. జీతం 50,000 రూపాయలు అని, కొన్ని సంవత్సరాలు ఆ కంపెనీ లో నే పనిచెయ్యాలని చెప్పాడు. తాను ఒక పదిరోజుల్లో ఇండియా వస్తానని చెప్పాడు.

రాజారాం , ప్రిన్సిపాల్ గారు ఆ మాటలు విని చాలా సంతోషించారు. కానీ రాజారాం కి మాత్రం తెలియని దిగులు వేధిస్తుంది. రాము, శైలజ విషయం లో ఏమంటాడో అని.

 ఆదే రోజు, రాము తన గదిలో కూర్చుని తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. విమల ఉంటే ఈ విషయం తెలిస్తే ఎంత బాగుండేదో….తన ఉంగరాన్ని అమ్మి డబ్బులు ఇచ్చింది. ఈ రోజు ఇంత డబ్బులు తనకు వచ్చేసరికి తాను లేదు. సరియైన తిండి, బట్టలు లేని తనను విమల మెదలు అందరూ ఎలా చక్కదిద్దారు అని అనుకుంటున్నాడు.

IBM company లో కొత్త ఉద్యోగం , ఒక నెల రోజుల తరువాత జాయిన్ అవుతానని చెప్పి, ఈలోగా ఇండియా వెళ్ళి రావాలని అనుకున్నాడు.

రాము ఆ వారం లో ఇండియా వెళ్ళిడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.

రాము అమెరికా నుండి హైదరాబాద్ వచ్చాడు. అందరినీ చూసి రెండు సంవత్సరాలు అయిపోయింది. రాజారాం, పావని రాము రాగానే తలపై చెయ్యి వేసి నిమిరారు. కొంచెం ఒళ్లు వచ్చింది రాము కి. రాము తెచ్చిన సెంటు బాటిల్ రాజారాం కి, హేండ్ బాగ్ శైలజకి, పర్సు పావని కి ఇచ్చాడు.

ఆ రోజు అందరూ కలిసి భోజనం చేసారు. రాము అమెరికా విషయాలు కధలు గా చెపుతున్నాడు. రాము మాటల్లో తెలియకుండా నే అస్తమానూ ఇంగ్లీష్ వచ్చెస్తుంది.

రెండు రోజుల తరువాత ప్రిన్సిపాల్ గారు కూడా హైదరాబాద్ రాము ను చూడడానికి వచ్చారు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇదే సమయం అనుకొని రాజారాం, ప్రిన్సిపాల్ గారు కలిసి ఒకరోజు రాము ను ఒంటరిగా మేడమీద గదిలో కూర్చోబెట్టి పెళ్లి విషయం మాట్లాడుతున్నారు.

ప్రిన్సిపాల్ గారు : రాము.. నీ కంటూ ఉన్నది మేమే…మాకంటూ ఒక బాధ్యత ఉంది. ఇన్నాళ్లు నీ చదువు, భవిష్యత్తు కోసం రాజారాం గాని, నేను గాని చాలా ఆలోచించాం. అది మా బాధ్యత అనుకున్నాం. అన్నింటి కంటే చిన్న తనం నుంచి నీ ప్రవర్తన మాకు చాలా నచ్చింది. ఆ బాధ్యత తో నే నీకు పెళ్ళి చేస్తే మాకు తేలిక అవుతుంది.

నీ గతంలో జరిగిన విషయం ఇక్కడ అందరికీ తెలిసే అడుగుతున్నాం…. పెళ్లి అనేది ఎప్పటికైనా, ఎవరినైనా చేసుకోక తప్పదు. నీ అభిప్రాయం ఏంటి.

రాము : ఏదో చెప్పాలని సంశయించాడు…. మౌనంగా ఉన్నాడు. తనకు ఏం చెప్పాలో తెలియడం లేదు. విమల ను మరచి పోలేక పోతున్నాడు.

రాజారాం : పరవాలేదు…రాము నిధానంగా నే చెప్పు…

రాము : సార్…అది…. అది…. విమల ను మరచి పోలేక పోతున్నాను.

ప్రిన్సిపాల్ గారు : అదే కదా….నీ సమస్య….. చూడు రాము, విమలకి పెళ్లయి నాలుగు సంవత్సరాలు అయింది. ఇద్దరు పిల్లలతో హాయిగా ఉంటుంది. నువ్వు తన గురించి ఆలోచిస్తూ ఉండడం సరికాదు. నీకంటూ ఒక కుటుంబం ఉండాలి. మేము మాత్రం ఎన్నాళ్ళు ఎలా ఉంటామో తెలియదు.

 విమలకి ఇద్దరు పిల్లలు అనేసరికి …గుండె ను పిండేసి నట్లు అనిపించింది రాము కి.

రాము : సార్ …నాకు ఒక రోజు టైం ఇవ్వండి…

రాజారాం కి టెన్షన్ మొదలైంది…రాము ఏం చెపుతాడా అని.

ప్రిన్సిపాల్ గారు :  సరే రాము …రేపు సాయంత్రం మాట్లాడుదాం. ఆలోచించి చెప్పు.


అదే రోజు సాయంత్రం రాము ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. శైలజ రాము దగ్గరకు వచ్చింది. అమెరికా విషయాలు అడుగుతూ….

శైలజ : రాము , ఏం చెప్పావు …పెళ్లి గురించి.

రాము : ఏం చెప్పాలో తెలియక…టైం అడిగాను.

శైలజ : రాము నిజం చెప్పు…నేనంటే ఇష్టం లేదా…

రాము : మౌనంగా ఉన్నాడు…. కాసేపు ఆగి …జీవితం లో తొలి సారి ఒకరిని ప్రేమిస్తే, మరచి పోవడం అసాధ్యం శైలజ.

శైలజ : నువ్వు చెప్పింది…చాలా నిజం…నేను నీ లానే ఉన్నాను, మన విషయం లో.......అయినా , రాము నీకో విషయం తెలుసా ఒకరిని మనస్పూర్తిగా ప్రేమిస్తే మరచి పోవడం కష్టం , అది ఎప్పుడో తెలుసా, ఆ ప్రేమని మరపింప చేసే మరొక మనిషి దొరికితే అదేమీ కష్టం కాదు రాము…. అది నీ జీవితం లో నేనవుతాను.

రాము కి శైలజ ధైర్యం నచ్చింది…. అన్నింటి కంటే తన గతాన్ని బాగా అర్దం చేసుకుందని అనుకున్నాడు.

రాము : సరే …నువ్వు నన్ను అర్దం చేసుకుంటే అంత కంటే నాకు ఏం కావాలి….. కానీ నేను ఇంకా ఒక సంవత్సరం ఆగాలి. అన్నాడు.

విమల : సంతోషంగా…సరే అంది.

మరుసటిరోజు ప్రిన్సిపాల్ గారి కి, రాజారాం కి…తాను విమల ను పెళ్లి చేసుకుంటానని, కానీ ఒక సంవత్సరం తరువాత అని చెప్పాడు…. అందరూ సంతోషంగా ఉన్నారు.

రాము ఒక నాలుగు రోజుల తరువాత  రాజారాం తో చెపుతున్నాడు.......తనతో ఇంజనీరింగ్ చదివిన మిత్రుడు కరీంనగర్ లో ఉన్నాడని కలిసి ఒకరోజు తరువాత తిరిగి వస్తానని చెప్పి….. జగిత్యాల బయలు దేరి వెళ్లాడు…విమల కనిపిస్తుందేమో అని….


మిగిలినది ఎపిసోడ్ 12 లో

యడ్ల శ్రీనివాసరావు 10 June 2022.









Wednesday, June 8, 2022

139. కళాశాల 1980 ఎపిసోడ్ - 10

 

కళాశాల 1980

ఎపిసోడ్ - 10



సీన్ -41


రాము చివరి సంవత్సరం పరీక్షలకు నెల రోజుల ముందే అమెరికా లో విదేశీ చదువుకు సంబంధించిన పరీక్ష రాసాడు. 

తరువాత నెల లో

ఫైనల్ ఇయర్ పరిక్షలు రాసాడు. పరిక్షలు అయ్యాక ఎంతో భారం దిగినట్లు అనిపించింది రాము కి. రాము ఒకసారి తాను సిరిసిల్ల ఇంటికి వెళ్లి చూసి రెండు రోజుల లో వచ్చెస్తానని , సంశయిస్తూ రాజారాం ని అడిగాడు. రాజారాం కాసేపు ఆలోచించి సరే …ఈ శనివారం ఉదయం వెళ్లి ఆదివారం సాయంత్రం వచ్చెద్దాం. నేను నీతో వస్తాను. మా వాడిని చూసి చాలా రోజులైంది. రాము మౌనంగా తల ఊపాడు.

శని వారం ఉదయం ఇద్దరూ కలిసి సిరిసిల్ల వెళ్లారు. ముందు రోజే  మిత్రుడి కి రాజారాం ఫోన్ లో సమాచారం ఇచ్చాడు, వస్తున్నట్లు.

బస్ లో ప్రయాణం చేస్తున్నాడు గాని రాము కి చేదు జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఇది వరకు ఉన్నంత సంతోషం లేదు. విమల కనిపిస్తుందా లేదా అని ఆలొచిస్తున్నాడు.

బస్ దిగంగానే ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్లారు. కులాసాగా కబుర్లు చెప్పుకున్నారు. ఆ రోజు సాయంత్రం రాజారాం గారితో కలిసి తన ఇంటికి వెళ్లాడు రాము. ఇల్లు శుభ్రం చెయ్యక పోవడం వలన బూజు లతో , అపరిశుభ్రంగా ఉంది. కొంత సమయం తరువాత ఇద్దరూ తిరిగి వచ్చేశారు.

మరుసటి రోజు ఉదయం రాము ప్రిన్సిపాల్ గారిని విమల గురించి అడుగుదామా లేదా అని సంశయం తో మౌనంగా ఉండి పోయాడు.

ప్రిన్సిపాల్ గారి తో కాసేపు అలా ఊరిలోకి వెళ్లి వస్తాను సార్ అన్నాడు.

రాము నడుచు కుంటూ వెళ్తు , ఊరు ఎంత మారిపోయింది అనుకుంటూ, చింతచెట్టు దగ్గరకు వెళ్ళాడు, కాసేపు ఒంటరిగా మౌనంగా కళ్లు మూసుకుని కూర్చుని, కాసేపు గడిచాక లేచి విమల ఉండే ఇంటి వైపు వెళ్లాడు. కాని మనసులో ధైర్యం చాలలేదు. వీధి మెదలు నుంచే వెనుతిరిగాడు.

ఆ క్షణంలో రాము కి తెలియదు. విమల ఆ ఊరిలో, తన ఇంటిలో డెలివరీ కోసం వచ్చి ఉన్నట్లు.

అదే రోజు సాయంత్రం రాజారాం, రాము కలిసి బస్టాండు కి వచ్చి హైదరాబాద్ బస్ ఎక్కారు. బస్ హైదరాబాద్ బయలు దేరింది. వారు నడిచి బస్టాండ్ కి వచ్చే దారిలో , అప్పుడే ఆసుపత్రిలో చూపించుకుని విమల తన తల్లి తో రిక్షాలో ఎదురుపడింది. రాము విమలను చూచూడలేదు రిక్షా టాప్ మూసి ఉంది . రిక్షాలో ఉన్న విమలకి మాత్రం రాము కనిపించాడు.

విమల కి రాము ను చూడగానే ఒక్కసారిగా గట్టిగా పిలవాలని అనిపించింది. రాము ను చూసి ఎన్ని రోజులయింది. రాము లో ఎంత మార్పు వచ్చింది. ఎంత మారిపోయాడో అనుకుంటూ , ఇంటికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని రాము గురించి ఆలోచిస్తుంది. భోజనం చెయ్యక పోయేసరికి, తల్లి మందలించి కడుపులో ఉన్న బిడ్డ కోసం  తిని ఏడు  అని తనదైన శైలిలో తల్లి అరిచింది. వెంటనే విమల కాస్త అన్నం తిని, తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకచేయి తలమీద, మరొక చేయి కడుపు లోని బిడ్డ మీద వేసుకుంది. కంట నుండి సన్నగా చారికలు చెవిని చేరి కిందికి జారుతున్నాయి.


సీన్ – 42


ఒక నెలరోజుల తరువాత రాము కి, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లో స్కాలర్షిప్ తో ఇంజనీరింగ్ పై చదువులు చదివడానికి సీటు మంజూరు అయినట్లు ఉత్తరం వచ్చింది. రాజారాం ఎగిరి గంతేసాడు. రాము ప్రిన్సిపాల్ గారి కి , విశ్వం గారి కి, స్నేహితులకు అందరికీ విషయం తెలియచేసాడు. సిరిసిల్ల లో ప్రిన్సిపాల్ గారి కి  కూడా ఫోన్ చేసి చెప్పాడు. అందరూ చాలా సంతోషించారు.

ఆ రోజు రాజారాం ఇంటిలో పండుగ వాతావరణం లా ఉంది. ఎందుకంటే విదేశాల్లో స్కాలర్షిప్ తో ఫ్రీ గా చదవడం అంటే అంత సాధారణ విషయం కాదు. రాజారాం భార్య పావని పాయసం చేసి తాను స్వయంగా చేతితో రాము కి తినిపించింది. ఆమె అలా తినిపిస్తున్న సమయం లో రాము గుండె బరువెక్కి ఉద్వేగం ఆపుకోలేక ఏడ్చేశాడు. అయ్యొ ఊరుకో రాము అని ఆమె కళ్లు తుడిచింది. రాము ఏడుపు కి కారణం విమల జ్ఞాపకం వచ్చి అని అక్కడి వారెవ్వరికి తెలియదు, ఒక్క శైలజ కి తప్ప.

శైలజ రాము కి అభినందనలు తెలియచేసింది.

రాము మేడమీద దిగులు గా కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఒక వైపు విమల గురించి, మరో వైపు తాను ఇప్పుడు విదేశాలకు వెళ్లడానికి కనీసం పాతిక వేలు పైనే కావాలని.

రాజారాం , రాము దగ్గరకు మేడమీద కి వచ్చాడు.

రాము : సార్ నేను ఇదివరకే ప్రిన్సిపాల్ సార్ కి చెప్పాను, మా ఇల్లు అమ్మి పెట్టమని. ఇప్పుడు డబ్బులు చాలా అవసరం కదా సార్, మీరు ప్రిన్సిపాల్ గారి కి చెప్పండి రేపు.

రాజారాం : సరే…రాము చెపుతాను. మనకు ఇంకా రెండు నెలలు సమయం ఉంది. ఈ లోగా అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. ఇప్పుడు సుమారు ముప్ఫై వేల రూపాయలు కావాలి…. సరే నేను చూసుకుంటాను.

మరుసటిరోజు రాజారాం , ఫోన్ చేసి తను మిత్రుడు తో  రాము ఇల్లు అమ్మకం గురించి మాట్లాడారు.

ఒక వారం రోజుల్లో ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి . రాము కి కాలేజీ మూడోవ రాంక్ వచ్చింది. రాము కి కావలసిన ఏర్పాట్లు రాజారాం చూస్తున్నాడు.

ఒక నెలరోజుల తరువాత ప్రిన్సిపాల్ గారి ద్వారా రాము ఇల్లు పదివేల రూపాయలకు అమ్మకం జరిగిపోయింది. ఇక సిరిసిల్ల తో రాముకు శాశ్వతం గా అనుబంధం వీడిపోయింది. ఆ డబ్బును రాజారాం కి అందచేశాడు, రాము.

ప్రిన్సిపాల్ గారు, రాజారాం కలిసి చెరొక పదివేలు సమకూర్చారు, రాము అమెరికా వెళ్లడం కోసం.

ఎవరికి తెలియని విషయం ఏమిటంటే, రాము ను ఎంసెట్ కోచింగ్ కి ప్రిన్సిపాల్ గారు హైదరాబాద్ పంపిన దగ్గర నుంచి, ప్రతీసారి ఇచ్చిన డబ్బులు, అలాగే రాజారాం గారు తన ఇంజనీరింగ్ చదువు లో మెదట నుండి ఇచ్చిన డబ్బులు, ప్రతీది ఒక లెక్క గా రాసుకుంటున్నాడు. ఎందుకంటే తాను మనసులో ఎప్పటికైనా తాను సంపాదించిన తర్వాత వారికి తిరిగి ఇచ్చెయ్యాలని ఆలోచన.

రాముకు ఇంకో వారం రోజుల్లో అమెరికా వెళ్లి పోతాడు. అన్ని ఏర్పాట్లు విమానం టికెట్, వీసా, రెడీ అయిపోయాయి. ప్రతీరోజూ రాజారాం, పావని జాగ్రత్తలు చెపుతున్నారు. రాము తన మనసు గాయం నుంచి చాలా వరకు బయట పడ్డాడు. జీవితం పై ఆశ కలుగుతుంది. ఆ ఆశలో స్వార్థం లేదు, అనామకుడైన తన కోసం ఇంత మంది కలిసి ఆదుకుంటే, తనలాంటి వారి కోసం తాను ఎప్పటికైనా ఏదైనా చెయ్యాలి, అందుకోసం తాను ఆర్థికంగా బలపడాలి అనుకున్నాడు.

ఇంకొక రెండు రోజుల్లో రాము ప్రయాణం. ఆ రోజు సాయంత్రం రాము ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు, విమల ఉంటే బాగుండేది, ఈ విషయం తెలిస్తే సంతోషించేది.. అసలు ఎలా ఉందో, ఏం చేస్తుందో…ప్రిన్సిపాల్ గారి ని అడిగితే , విమల కి పెళ్లి అయిపోయింది కదా ఎందుకు రాము ఆలోచిస్తావు అని మందలిస్తారని ఊరుకున్నాడు. మేడమీద కూర్చుని అలా ఆలోచిస్తున్న సమయంలో శైలజ మేడ మీదకు టీ, పకోడీలు తీసుకుని వచ్చింది. సాయంత్రం 6 గంటల సమయం అవడం వలన పక్షులు కిలకిలా శబ్దం చేసుకుంటూ గూడుకు చేరుకుంటున్నాయి. ఆకాశం నీలం రంగు నుండి నల్లగా చీకటి గా మారుతూ ఉంది.

శైలజ రావడం రాము గమనించలేదు. శైలజ నెమ్మదిగా రెండు సార్లు గొంతు సకిలించింది.

రాము : ఆ..ఆ…శైలజ , టీ తెచ్చావా…. ధాంక్యు…అన్నాడు నవ్వుతూ

శైలజ : పరవాలేదు…..

రాము : టీ…ఇచ్చేశావు కదా…(ఇంకా వెళ్ల లేదేం అన్నట్లు).

శైలజ : అంటే ఎల్లుండి అమెరికా వెళ్లి పొతున్నావు కదా…మరలా రెండు మూడు సంవత్సరాల వరకు రావంట కదా.

రాము : అవును…. శైలజ నీ జీవితం లో గోల్ ఏంటి…ఏం చదవాలి, ఏం చెయ్యాలి అనుకుంటున్నాను అని అడిగాడు.

శైలజ : సంశయం లేకుండా వెంటనే రాము దగ్గరకు వచ్చి గట్టిగా కౌగిలించుకొని…. నువ్వే నా గోల్…నిన్ను పెళ్లి చేసుకుని , కలిసి ఉండటం నా లక్ష్యం అని చెప్పింది.

రాము : శైలజ ఒక్క సారి అలా చేసే సరికి షాక్ అయ్యి, శైలజ నుండి దూరంగా జరిగి, …ఏం మాట్లాడుతున్నావు, శైలజ…. అసలు నీకు నా గురించి ఏం తెలుసు.

శైలజ : నీ గురించి అంతా తెలుసు రాము, విమల గురించి ఇంకా తెలుసు. అన్నీ తెలియక ముందే నువ్వంటే ఇష్టం…. ఇవన్నీ తెలిసిన తరువాత నిన్ను నేను అసలు వదలకూడదని ఇంకా గట్టిగా నిశ్చయించుకున్నాను. నువ్వు అంటే ఇష్టం రాము, ఎందుకో తెలియదు. ఒకరిని ప్రేమిస్తే కలిసి ఉండాలి రాము, ఆ అవకాశం, అదృష్టం నాకు నీతో ఉందనిపిస్తుంది. ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి అందం చూసి కాదు , వ్యక్తిత్వం చూసి ఇష్టపడుతుంది. నేను నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వంటే నాకు ఇష్టం……అయినా , రాము పరిస్థితులు నీ జీవితం లో కొన్ని అనుకూలతలను ఇచ్చాయి. కొన్ని సార్లు అనుకూలతలను ఇవ్వలేదు. అందులో నీ తప్పు ఏమీ లేదు…. ప్రేమించిన వారిని మరచి పోవాలన్నా, వదిలి ఉండాలన్నా ఆ బాధ ఎలా ఉంటుందో నేను నీకు చెప్పనవసరం లేదు. నీలాగే నన్ను ఉంచాలని అనుకుంటే నీ ఇష్టం…. అని స్థిరంగా, సూటిగా చెప్పింది శైలజ. నేను ఎన్నాళ్ళు అయినా ఎదురు చూస్తాను.

శైలజ మాటలు రాము మైండ్ బ్లాంక్ గా అయిపోయింది. అసలు శైలజ ఏం మాట్లాడుతుందో కూడా అర్దం కానట్లు అయిపోయాడు. తాను మనసు విమలకి ఇచ్చేసి, శైలజ అనుకున్నంత సులువుగా మారిపోగలనా అని మనసులో నవ్వుకున్నాడు. శైలజ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది.

రాము అమెరికా బయలు దేర వలసిన రోజు…సమయం దగ్గరపడింది. బయలు దేరే సమయం లో శైలజ ఎదురు వచ్చింది. రాజారాం, పావని, శైలజ ముగ్గురు కలిసి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం కి రాముతో వచ్చారు.

శైలజ రాము కళ్లల్లో కళ్లు పెట్టి, ఆర్తి గా, దిగులుగా చూస్తుంది. ఆ చూపు రాము కి ఏదో సందేశం ఇస్తున్నట్లు అనిపించి, దృష్టి మరల్చి కో లేక పోతున్నాడు.

టైం అయ్యాక, అందరికీ వీడ్కోలు చెప్పి, లోపలికి వెళ్ళి విమానం ఎక్కి కూర్చున్నాడు రాము. జీవితం లో మొదటిసారి విమానం లో కూర్చోవడం, ఎంత అదృష్టం, ఈ సమయంలో విమల ఉంటే ఎంత సంతోషించేది అని మనసు లో అనుకున్నాడు.

ఎయిర్ పోర్ట్ నుండి తిరుగు ప్రయాణంలో, రాజారాం మనసు లో గర్వం గా ఉంటూ, కంటనీరు పెట్టుకున్నాడు. రాము ఎంసెట్ కోచింగ్ కి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, ఈ అయిదు సంవత్సరాలలో ఎన్ని మార్పులు, స్వయం గా రాము ని అమెరికా పంపండం అంటే ఎంత గొప్ప విషయం తనకు అనుకున్నాడు.


సీన్ - 43


డెలివరీ కి అని వచ్చిన విమల తరువాత అయిదు నెలల వరకు సిరిసిల్ల లోనే ఉంది. బాబు పుట్టాడు విమలకి. బాబు పుట్టిన మూడు నెలలకు ప్రిన్సిపాల్ గారి ఇంటికి బాబును తీసుకుని వెళ్లింది. సరిగా అప్పటికి రాము అమెరికా వెళ్లి నెల దాటింది.

ప్రిన్సిపాల్ గారు విమల ను చూసి …

ప్రిన్సిపాల్ గారు : రా…రా…విమల కూర్చో…ఎలా ఉన్నావు…మీ బాబు….అని దగ్గర కి తీసుకున్నారు.

విమల : అవును సార్…అంది నవ్వుతూ…. విమల మనసు లో కొద్ది రోజుల క్రితం రాముని ఊరిలోకి చూసిన విషయం , రాము గురించి ప్రిన్సిపాల్ గారు ఏమైనా చెపుతారేమో అని ఎదురు చూసింది.

ప్రిన్సిపాల్ గారు రాము విషయం తప్ప అన్ని మాట్లాడుతున్నారు.

విమల : ఉండలేక…సార్ రాము ఎలా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు. క్రిందటి సారి రాము ని నేను ఊరిలో బస్టాండ్ వద్ద మరొకరితో చూసాను. తను మాత్రం నన్ను చూడలేదు. అని అమాయకంగా చెప్పింది.

ప్రిన్సిపాల్ గారు : కాసేపు మౌనం వహించి…. చూడమ్మా విమల అని, విమల పెళ్లి అయిన తరువాత నుండి రాము పరిస్థితి ఎలా మారిపోయిందో, తిరిగి మరలా ఈ మధ్యనే కోలుకుని , చదువులో ఫస్ట్ వచ్చి అమెరికా లో విదేశీ చదువుకు నెల రోజుల క్రితం వెళ్లాడు. ఇంకొక మూడు సంవత్సరాల వరకు ఇండియా రాడు. తాను ఇప్పుడిప్పుడే మాములు మనిషి అయ్యాడమ్మా.. అని చెప్పారు.

ఆ మాటలు విన్న విమలకి మనసు లో పట్టలేని సంతోషం , అదే విధంగా అంతే దుఃఖం తో ఉంది.

విమల : వెళ్లొస్తాను …సార్..

ప్రిన్సిపాల్ గారు : విమల... బాబు కు ఏం పేరు పెట్టారు.

విమల : రాంబాబు… సార్…అంది.

ప్రిన్సిపాల్ గారు ఒక్కసారి ఖంగు తిన్నారు…విమలకి ప్రేమ తగ్గిందా లేక పెరిగిందో అర్థం కాలేదు.



మిగిలినది ఎపిసోడ్ 11 లో

యడ్ల శ్రీనివాసరావు 8 June 2022.










Monday, June 6, 2022

139. కళాశాల 1980 ఎపిసోడ్ -9

 

కళాశాల 1980

ఎపిసోడ్ -9


సీన్ -38

రాము కి చదువు మీద శ్రద్ధ తగ్గి పోయింది. కాలేజీ కి వెళ్ళకుండా హాస్టల్ లో నే విమలను తలుచుకుంటూ ఒంటరిగా ఉండిపోతున్నాడు. తనకి జీవితం లో పూర్తిగా ఏకాకి అయిపోయినట్లు భావిస్తున్నాడు. అసలు విమల ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడంలేదు. ఒకరోజు కాలేజీ మానేసి విమల కనిపిస్తుందేమో అని జగిత్యాల వెళ్లాడు. కానీ అడ్రస్ తెలియదు. అలా ఊరంతా తిరుగుతూ ఉన్నాడు. చేసేదేమీలేక మళ్లా హైదరాబాద్ వచ్చేశాడు. తన తోటి ఫ్రెండ్స్ చెపుతున్నా వినడం లేదు.

ఆ వారం రాజారాం వచ్చి , రాముని చూసి డబ్బులు ఇచ్చి జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. రాము జుత్తు పెంచుకొని , కళావిహీనంగా కనిపించడం తో రాజారాం చాలా బాధ పడ్డాడు. చురుకుగా ఉండే రాము ను ఇలా చూస్తానని అనుకోలేదు.

రాము కి కాలేజీ ఇష్టం ఉంటే వెళుతున్నాడు. లేకపోతే హాస్టల్ రూం లో నే పడుకొని విమల ను ఆలోచించుకుంటూ ఉంటున్నాడు.

రోజులు గడుస్తున్నాయి. రాము అటెండెన్స్ సరిగా లేకపోవడం, కాలేజీ ఇంటర్నల్ మార్క్స్ తగ్గడం ప్రిన్సిపాల్ గారు గమనించి ఆఫీస్ కి పిలిచి మందలించారు. అదే రోజు లెక్చరర్ విశ్వం గారు కూడా పిలిచి రాము చాలా వెనుక పడుతున్నావు ఇలా అయితే చాలా కష్టం అన్నారు.

రాము కి వారు చెబుతున్నవి ఏమీ మైండ్ కు ఎక్కడం లేదు. ఎందుకో రాము ఆరోగ్యం క్షీణిస్తుంది. ఒక రోజు బాగా జ్వరం వచ్చింది. జ్వరం తో అలా ఉన్నాడు. ఫ్రెండ్స్ రాము దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని రాజారాం గారి ఆఫీస్ కి ఫోన్ చేసారు. రాజారాం వెంటనే ఆఫీస్ నుండి వచ్చి రాముని హాస్పిటల్ కి తీసుకెళ్ళి వైద్యం చేయించి, హాస్టల్ కు కాకుండా తన ఇంటికి తీసుకెళ్ళాడు.

ఆ రోజు రాత్రి పడుకునే సమయంలో రాజారాం, పావని తో రాముకు జరిగిన విషయం పూర్తిగా చెప్పాడు. పావని అయ్యే పాపం అని బాధపడింది కానీ రాము పై కోపం రాలేదు. అదే సమయంలో శైలజ నిద్రలో , తండ్రి తల్లి తో రాము , విమల ప్రేమ గురించి చెప్పింది అంతా పూర్తి గా విని, కంట నీరు పెట్టుకుంది.

రాము మూడు రోజులు వరకు కోలుకోలేదు. పావని దగ్గర ఉండి అన్ని అందించేది. ఒకసారి మాత్రం శైలజ రాము ని చూడడానికి మేడమీద గదిలో కి వెళ్లింది. రాము నిద్రపోతుందటే దూరం నుంచి చూసి వచ్చేసింది.

రాము జ్వరం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఆ రోజు రాజారాం ఆఫీస్ నుండి వచ్చాక , రాము గదిలోకి వెళ్ళాడు.

రాజారాం : హాయ్…రాము ఎలా ఉంది. తేలికగా ఉందా.

రాము : లేచి కూర్చుని…పరవాలేదు సార్. అని ఒక్కసారిగా రాజారాం కాళ్లమీద పడి ఏడుస్తూ, మీరు నన్ను మీ సొంత మనిషిలా చూస్తున్నారు. అసలు నేను బ్రతికి ఉండడం వృధా. నాకు బ్రతకాలని లేదు సార్….

రాము పరిస్థితి అర్థం అయింది.

రాజారాం : రాము ఊరుకో…లే…ఏంటి చిన్న పిల్లాడిలా…. నువ్వు ఇంకొక నాలుగు రోజుల ఇక్కడే ఉండి పూర్తిగా కోలుకున్నాక వెళుదువు…హాస్టల్ కు.

రాము : లేదు సార్… రేపు వెళ్ళిపోతాను…కాలేజీ పోతుంది.

రాజారాం : గత రెండు నెలలుగా నువ్వు కాలేజీ కి వెళ్లింది కేవలం పదిహేను రోజులు మాత్రమే. ఇప్పుడు ఏం నష్టం లేదు. నేను డాక్టర్ సర్టిఫికేట్ ఎరేంజ్ చేస్తాను….. ఇంకో విషయం ఈ రోజు నుంచి రాత్రుళ్లు నేను నీతో పాటే ఇక్కడే పడుకుంటాను.

రాము కి రాజారాం తండ్రి లా కనపడ్డాడు.

ఆ రోజు రాత్రి భోజనం చేసాక రాజారాం రాము తో కలిసి పడుకుని… మాట్లాడుకుంటున్నారు.

రాజారాం : రాము నీకు అభ్యంతరం లేకపోతే నీ గురించి, విమల గురించి చెపుతావా….

రాము : ఆశ్చర్యం గా….తన ఇంటర్ నుంచి విమలతో కలిసి జరిగిన ప్రయాణం వివరం గా చెప్పాడు.

రాజారాం : చూడు రాము…విమల నీ భవిష్యత్తు కోసం తన జీవితం త్యాగం చేసింది. తాను ఎంతో దూరం ఆలోచించి.....నీ చదువు పూర్తయి, ఇంకా విదేశాల్లో చదివి అంతా అయ్యేటప్పటికి ఇంకా అయిదు సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు వాళ్ల ఇంటిలో ఆగరు. తను నీ మేలు, ఎదుగుదల చూడాలనుకుంది. ఇప్పుడు నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోమని అడిగితే నువ్వు ఎలాగైనా చేసుకుంటావు అని తనకు తెలుసు కానీ జీవితం ఇక్కడితో ఆగిపోతుంది అని గ్రహించి ఇంత నిర్ణయం తీసుకుంది.

నువ్వు ఈ రోజు ఇంత బాధ పడడం సహజం. కానీ ఆ బాధని నువ్వు కొనసాగిస్తే , నువ్వు విమల ను ప్రేమించిన దానికి అర్థం ఉండదు. ఏ రోజు అయితే నువ్వు ఒక మంచి స్థాయిలో ఉంటావో , ఆ రోజు ఆమె కల నెరవేరినట్లు, తన త్యాగానికి అర్దం ఉన్నట్లు. అయినా ప్రేమించడం అంటే కలిసి జీవించక పోయినా ఒకరిని ఒకరు గౌరవించుకోవడం. ఏ ప్రేమ కూడా మనిషి జీవితాన్ని అర్థాంతరంగా ముగించాలని అనుకోదు.

రాము కి రాజారాం మాటలు మొదటి సారి మనసు కి ఎక్కుతున్నాయి.

రాజారాం : చూడు రాము , నువ్వు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చావు. అటువంటి నువ్వు రేపు విదేశాల్లో చదివి మంచి స్థాయిలో ఉంటే , ఆ ఘనత కి కారణం విమల అవుతుంది.

ఉన్న నాలుగు రోజులు రాజారాం రాము తోనే పడుకొని రాముని తన లక్ష్యం వైపు నడిచేలా ప్రేరేపించాడు.

చివరి రోజు రాజారాం పావని తో కలిసి చర్చించి రాము తిరిగి మామూలుగా అవ్వాలంటే తనని ఇంకా మీదట ఒంటరిగా ఉంచకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాడు.

 ఆ రోజు రాత్రి రాము తో

రాజారాం : రాము రేపు కాలేజీ కి వెళ్ళి, వచ్చేటప్పుడు హాస్టల్ ఖాళీ చేసి లగేజీ తెచ్చుకో..ఇక నుంచి ప్రతీ రోజు బస్ మీద ఇంటి నుండి వెళుదువు. ఆంటీ శైలజ తో పాటు నీకు లంచ్ బాక్స్ ఇస్తుంది. ఇక మీదట మనం అందరం కలిసి ఇక్కడే ఉంటాం.

రాము కి నోట మాట రావడం లేదు.

రాము : సార్…ఏంటి…ఇప్పటికే మీకు నేను చాలా భారం.

రాజారాం : చెప్పినట్లు చెయ్యి.

రాము : సరే సార్…

ఆ మరుసటి రోజు రాజారాం ఆఫీస్ నుండి తన మిత్రుడు కి ఫోన్ చేసి రాము ని ఇక మీదట పూర్తిగా తనతో నే తన ఇంటిలో ఉంచుకుంటున్నట్ల చెప్పాడు.



సీన్ – 39


రోజులు గడుస్తున్నాయి… రాము మాములు మనిషి గా అయ్యాడు. కాలేజీ కి బస్ మీద వెళ్లి వస్తున్నాడు. ఇంతలో మూడవ సంవత్సరం పరీక్షలు రాసాడు. రాము పూర్తిగా రాజారాం ఇంటిలో మనిషి లా అయి , విమల బాధ నుండి కొంచెం కొంచెం బయటకు వచ్చాడు కానీ అప్పుడప్పుడు కాస్త ఒంటరిగా ఉన్నప్పుడు విమల తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ …కంటనీరు పెట్టుకునే వాడు.

 శైలజ ఇది వరకు లా రాముని ఆట పట్టించడం లేదు. రాము విషయం తెలిసినా తన ఇష్టాన్ని చంపుకో లేదు కానీ , ఇది వరకు లా రాము తో చనువు గా ఉండటం లేదు. ఎందుకంటే తాను రాము ను బాధ పెట్టకూడదని నిర్ణయించుకుంది.

 నెలలు గడుస్తున్నాయి…రాము ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం లోకి వచ్చాడు. కానీ మూడవ సంవత్సరం లో అనుకున్న విధంగా మార్కులు సాధించలేదు.

రాజారాం కి విషయం తెలిసి ….

రాజారాం : చూశావా…రాము , ఇదే నిదర్శనం నువ్వు కొంచెం చతికిలబడితే కాలం నిన్ను ఓడిస్తుంది. ఇది నీ ఆఖరి సంవత్సరం , నువ్వు విదేశాల్లో స్కాలర్షిప్ తో ఉచితంగా పై చదువులు చదివాలన్న నువ్వు అన్నీ మరిచి పోయి పరుగు పెట్టాలి. కాలం నిన్ను చూసి తలదించాలి.

రాజారాం ఇస్తున్న ప్రేరణ రాము కి వజ్రాయుధం లా పనిచేసేది.

శైలజ ఆ సంవత్సరం డిగ్రీ సెకండ్ ఇయర్ లో కి వచ్చింది.

రాము ఒకసారి సిరిసిల్ల వెళతానని అడిగినా…రాజారాం పంపించలేదు. అక్కడికి వెళితే మరలా పాత రోజులు గుర్తుకు వస్తాయని. రాము గురించి ఎప్పటికప్పుడు తన మిత్రుడు కీ ఫోన్ లో సమాచారం ఇస్తున్నాడు రాజారాం.

రాము ఒకవైపు ఆఖరి సంవత్సరం చదువుకే కాక విదేశాల్లో చదువుకు సీటు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు లెక్చరర్ విశ్వం గారు బాగా సహకారం ఇస్తున్నారు.

రాత్రుళ్లు చదువుతూ ఉంటే మధ్యలో పావని పాలు తెచ్చి ఇస్తుండేది. రాము అలాంటి సమయంలో అప్పుడప్పుడు, తానేంటి, తన తల్లి తండ్రి, విమల, ప్రిన్సిపాల్ గారు, రాజారాం గారి కుటుంబం అసలు ఇంత మంది కలిసి తనను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో అని కృతజ్ఞతా భావం తో అనుకునే వాడు.


సీన్ – 40


విమల కి పెళ్లి అయి అప్పటికే ఏడు నెలలు దాటాయి. భర్త బాగానే చూసుకుంటున్నాడు కానీ తన కోసం తాను జీవించడం లేదు. పైగా గర్భవతి అయింది.

సిరిసిల్ల తన తల్లి ఇంటికి వచ్చింది. ఒకరోజు తల్లి తో చెప్పి, ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్లింది. వెళుతుంది కానీ దారిలో సన్నగా వణుకు ప్రారంభమయింది విమలకి. రాము ఎలా ఉన్నాడో, రాము గురించి ఏమి వినవలసి వస్తుందో అని.

ప్రిన్సిపాల్ గారు విమల ను చూసి, బాగున్నావా విమల అన్నారు.

విమల : పరవాలేదు…సార్…. మీరు

ప్రిన్సిపాల్ గారు : బాగున్నాను అమ్మ…ఏంటమ్మా ఏమైనా విశేషమా…

విమల : అవును నాలుగవ నెల.

ప్రిన్సిపాల్ గారు : అవునా….. కానీ మనస్పూర్తిగా నవ్వలేక పోతున్నారు…..ఇంకేంటమ్మ విశేషాలు…

విమల : మనసులో రైళ్లు పరిగెడుతున్నంత గాభార గా ఉంది. రాము గురించి అడగుదామా లేదా అని సంశయం తో మౌనంగా ఉంది.

ప్రిన్సిపాల్ గారు : రాము గురించి విమల అడిగితే చెబుదామని మౌనంగా ఉన్నారు.

కాసేపు గడిచాక, ఏమనుకుందో ఏమో విమల లేచి వెళ్లొస్తాను సార్ అని వెను తిరిగి …నడుచుకుంటూ వస్తుంది. ఆ దారిలో చింతచెట్టు దగ్గర కి వచ్చేటప్పుటకి దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది.


ప్రిన్సిపాల్ గారు  తన  దగ్గర నుండి వెళుతున్న విమల ను చూసి , రాము గురించి అడగాలని వచ్చినా,   అడగకుండా వెళుతున్న విమల ను చూసి మనసు లోనే విమల సంస్కారానికి నమస్కరించి….ఇంత చిన్న పిల్లలకి ఎంత పెద్ద మనసులో అని అనుకున్నాడు.

ఆ మరుసటి రోజు ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి రాజారాం కి , విమల వచ్చిన విషయం , జరిగింది అంతా విపులంగా చెప్పాడు.


ఆ తర్వాత విమల కొన్ని రోజులు ఉండి అత్తారింటికి వెళ్లి పోయింది.



మిగిలినది ఎపిసోడ్ 10 లో

యడ్ల శ్రీనివాసరావు 6 June 2022 .





Sunday, June 5, 2022

139. కళాశాల 1980 ఎపిసోడ్ -8

 

కళాశాల 1980

ఎపిసోడ్ -8



సీన్ -36


రాము కాలేజీ టూర్ లో చాలా సంతోషంగా గా ఉన్నాడు. ఆ రోజు శ్రీహరి కోట లో ISRO కి వెళ్లారు. అక్కడ మూడు రోజులు ఉండి, రాకెట్లు తయారీ, శాస్త్రవేత్తల పరిశోధనలు, శాటిలైట్ లు పని చేసే విధానం, రాకెట్ లాంచింగ్ ప్యాడ్, అవన్నీ చూస్తుంటే, కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రపంచంలో ఎంత పాత్ర పోషిస్తుందో తెలుసు కున్నాడు. పుస్తకాల లో థియరీ కి, నిజం గా జరిగే ప్రాక్టీకల్ కి ఉన్న తేడా అర్దం అవుతుంది.

ఇంకా అక్కడి నుండి తమిళనాడు లో తారాపూర్ అణు పరీక్ష కేంద్రం, ఇలా ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటూ, తాను కూడా ఏదైనా సాధించాలి అని సంకల్పం పెట్టుకుని, సంతోషంగా ఉన్నాడు. టూర్ లో బస్ లో ప్రయాణం చేస్తూ, ఈ సంతోషం విమలతో పంచుకుంటే బాగుండేది…. అయినా విమల ఎలా ఉందో, ఏం చేస్తుందో అని మనసులో అనుకుని…. విమల తన జీవితాన్ని ఎంతగా మార్చేసిందో అని తన ఇంటర్ కాలేజి రోజులను తలుచుకుని కళ్లు మూసుకున్నాడు.

అప్పటి కి టూర్ మొదలై పది రోజులు గడిచాయి. ఇంకా భారతదేశం అంతటా తిరగవలసింది ఇరవై రోజులు ఉంది.

*****

ఊరిలో విమల పెళ్లి కి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇంకొక వారం రోజుల్లో పెళ్లి. విమల పరిస్థితి ఏమీ బాగాలేదు. జీవచ్ఛవంలా ఉంది. సరిగా తినడం లేదు. బయటకు ఎవరికి చెప్పలేక, నరకం అనుభవిస్తుంది. తాను పెళ్లి కి అంగీకరించింది కానీ, రాము ని ఎలా వదిలి ఉండాలో తెలియడం లేదు. రాము ను తనే మొదటినుంచీ ఇష్టపడి ప్రేమించింది. రాము ను అనుక్షణం ప్రోత్సాహించేది. రాము కి తనపై ఇష్టం కలిగే లా చేసుకుంది. అలాంటిది ఇప్పుడు రాము భవిష్యత్తు కోసం తనను తానే వదులు కోవడం భరించలేక పోతుంది.

ఇంతలో పెళ్లి రోజు రానే వచ్చింది. విమల అప్పటికే ఏడ్చి ఏడ్చి ఉండడం వలన ఇక కన్నీళ్లు ఇంకి పోయాయి.

విమల పెళ్లి జరిగిపోయింది. చుట్టూ పక్కల వారు , ప్రిన్సిపాల్ గారు వచ్చారు. పెళ్లి చాలా సాధా గా విమల ఇంటిముందు తాటాకు పందిరి లో వారి స్తోమత కు తగినట్టుగా జరిగింది. ప్రిన్సిపాల్ గారు విమల ను ఆశీర్వాదించి , కవరు లో కొంత డబ్బులు పెట్టి ఇచ్చారు. విమల ముఖం లో పెళ్లి సంతోషం లేకపోవడం గమనించారు.

విమల పెళ్లి అయి అత్తారింటికి జగిత్యాల భర్తతో కలిసి వెళ్ళిపోయింది. విమల భర్త శేఖర్ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. విమల కంటే 8 సంవత్సరాల పెద్ద వాడు. చూడడానికి రంగు లేక పోయినా బానే ఉంటాడు. విమల ఇంట్లో అత్త, మామ, మరదలు ఉంటారు. వారి ఇల్లు, స్థాయి విమల వాళ్లకంటే కొంచెం మెరుగు. విమల అందం చూసి కట్నం లేకుండా చేసుకున్నాడు శేఖర్.

పెళ్లి తరువాత జరిగే కార్యక్రమలు మొదలైయ్యాయి. విమల కి తన ప్రమేయం లేకుండా ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. ఒకోసారి తాను బ్రతికి ఉన్నానా, చనిపోయానా అని తనను తాను ప్రశ్నించుకుంటూ, ఒంటరిగా తనలో తాను మాట్లాడుకుంటూ మానసికంగా చాలా బలహీనం అయిపోయింది. ఆ మానసిక బలహీనత,. దుఃఖం లో బొమ్మ లా ఎవరు ఏం చెపితే అది తలాడిస్తూ చేస్తుంది.

ఆ రోజు …. శేఖర్ విమల ల తొలి రాత్రి. విమల పాలగ్లాసుతో గదిలో కి వచ్చింది. శేఖర్ పట్టలేనంత సంతోషంగా ఉన్నాడు. విమల స్థితి చనిపోయిన శవం లా ఉంది. ఆ క్షణం లో రాము గుర్తు వచ్చాడు. కానీ విమలకి ఏడుపు దుఃఖం రావడం లేదు…ఎందుకంటే అప్పటికే తన మనసు శిధిలం అయిపోయి తనకు స్పందనలు లేని శిల లా అయిపోయింది.

శేఖర్ కేవలం ఐదవ తరగతి వరకే చదివాడు. వ్యాపార తెలివి, ఆలోచనలు తప్ప, మనుషుల గురించి ఆలోచించే తెలివి లేదు.

విమల రాగానే, తీసుకొచ్చి తన పక్కనే కూర్చొ పెట్టుకుని , భుజం పై చేతులు వేసి దగ్గరకి తీసుకున్నాడు.

విమల కి జీవితం లో తాను ఊహించిన సంతోషాలన్ని మండుతున్న నిలువెత్తు అగ్ని జ్వాలలు లాగ, ఆ జ్వాల లో తాను నిలబడి దహనం అయిపోతున్నట్లు అనిపిస్తుంది. ఆ రాత్రి తాను ప్రాణం లేని విగత జీవి లా తనను భర్తకు అర్పించుకుంది. కళ్లు మూసుకున్న ఆసమయంలో కూడా రాముతో గడిపిన చింతచెట్టు దగ్గర జ్ఞాపకాలు , అనుభవాలు విమల కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఆ మూడు రాత్రులు కాళ రాత్రులు లా గడిచాయి విమలకి.

శేఖర్, విమల ను బాగానే చూసుకుంటున్నాడు.


సీన్ - 37


రాము టూర్ పూర్తి అయ్యింది. హైదరాబాద్ వచ్చేసాడు. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్న ఆనందం లో ఉన్నాడు. విమల కి, ప్రిన్సిపాల్ గారి కి టూర్ లో విషయాలు అన్నీ ఉత్తరం రాసాడు. విమల కి చేరిన ఉత్తరం పోస్టుమేన్ గుమ్మం లో పడేసి వెళ్ళిపోయాడు. ప్రిన్సిపాల్ గారు రాము ఉత్తరం చదివి తిరిగి ఉత్తరం రాసారు. ఆ ఉత్తరం ఒక పది రోజుల తరువాత రాము కి చేరింది. ఆ ఉత్తరం లో ప్రిన్సిపాల్ గారు విమల పెళ్లి జరిగిన విషయం రాశారు.

ఉత్తరం తెరిచి చదువుతున్న రాము కి, చేతులు వణుకుతున్నాయి. కళ్లు బైర్లు కుమ్ముతున్నాయి. అసలు ఏమీ నమ్మలేకపోతున్నాడు. అంతా చీకటిగా కనిపిస్తుంది. తన విమల వేరే పెళ్లి తనకు తెలియకుండా, ఇంత అకస్మాత్తుగా చేసుకోవడం , కాలితో నేలను తంతూ, గట్టిగా అరుస్తున్నాడు. ఏడుస్తున్నాడు. అది చూసిన స్నేహితులు వచ్చి రాముని పట్టుకుని , ఏం రాము ఏమైంది అని అడుగుతున్నారు.

రాము …ఏం లేదు, నేను మా ఊరు వెళ్ళాలి అని చెప్పి వెంటనే బయలుదేరి వెళ్ళాడు.

సిరిసిల్ల వెళ్లగానే నేరుగా ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్లాడు. రాము ను చూసి

ప్రిన్సిపాల్ గారు : రాము ఏంటి ఇంత సడెన్ గా వచ్చావు. ఏమైంది ఎందుకు అలా ఉంది ముఖం. ఏం జరిగింది.

రాము : ఉత్తరం చూపిస్తూ… మీరు రాసిన ఉత్తరం…విమల కి పెళ్లి అయిపోయిందా…సార్…ఏడుస్తూ.

ప్రిన్సిపాల్ గారు : అవును రాము. విమల తనను కలవడానికి వచ్చిన విషయం, తను ఎందుకో బాధగా ఉన్న విషయం చెప్పాడు. నీకు పెళ్ళి గురించి తెలియపరచాలనుకుంటే నువ్వు టూర్ లో ఉన్నావు……అయినా ఏమైంది రాము అని అమాయకంగా అడిగాడు.

రాము : అయ్యొ…అంతా అయిపోయింది సార్.. అని కిందపడి తలకొట్టుకుంటూ ఏడుస్తున్నాడు రాము.

ప్రిన్సిపాల్ గారి కి ఏమి అర్ధం కావడం లేదు.

ప్రిన్సిపాల్ గారు : రాము…లే…ఈ మంచినీళ్లు తాగు…. రాము నీళ్లు తాగాక …చెప్పు రాము అసలు ఏం జరిగింది.

రాము : ఏడుస్తూ…. విమల తన జీవితాన్ని ఎలా మార్చిందో, వారి ప్రేమ జీవితం, పెళ్లి చేసుకోవాలని అనుకోవడం అన్నీ… ఏదీ దాచుకోకుండా చెప్పాడు, రాము.

ప్రిన్సిపాల్ గారు : రాముని అలా చూసి కంట నీరు పెట్టుకున్నాడు. అప్పుడు అర్థం అయింది ఆ రోజు విమల తన ప్రేమ విషయం చెప్పుదామని వచ్చినప్పుడు, తాను రాము గొప్ప తనం ఎదుగుదల గురించి చెప్పడం తో, రాము కెరీర్ కి తాను అడ్డు అవుతానని ఏదో చెప్పబోయి ఆపేసింది. అని మనసు లో అనుకున్నాడు…. పేరుకి మట్టి మనుషులే కానీ మాణిక్యాలు అనుకున్నాడు.

రాముని సముదాయించడం కుదరడంలేదు. ప్రిన్సిపాల్ గారు రాముని తీసుకుని మరుసటిరోజు హైదరాబాద్ బయలు దేరి వెళుతూ దారి లో, జరిగింది మరచిపోయి భవిష్యత్తు మీద దృష్టి పెట్టమని రాము తో చెపుతున్నారు. కానీ రాము కి అదేమీ చెవికి ఎక్కడం లేదు.

హైదరాబాద్ చేరాక హాస్టల్ లో దించి, చివరి సారిగా జాగ్రత్తలు చెప్పారు ప్రిన్సిపాల్ గారు.

అటునుంచి తన మిత్రుడు రాజారాం ఇంటికి వెళ్లారు ప్రిన్సిపాల్ గారు.

రాజారాం మిత్రుడి రాక చూసి…ఆశ్చర్యం గా…ఏరా ఏంటి ఇంత సడెన్ గా

ప్రిన్సిపాల్ గారు : ఏం రాజారాం…ఎలా ఉన్నావు…ఇంట్లో కి కూడా రానివ్వకుండా..అడిగెస్తున్నావు…అన్నాడు నవ్వుతూ..

ఆ రాత్రి భోజనాలు అయిపోయాక , మిత్రులు ఇద్దరూ మేడ మీదకు చేరుకున్నారు.

రాజారాం : హు…ఇప్పుడు చెప్పు..ఇంత సడెన్ గా వచ్చావు.

ప్రిన్సిపాల్ గారు : రాము కి జరిగిన విషయం అంతా పూర్తి గా చెప్పాడు. ఇందులో పాపం ఆ పిల్లల తప్పు కూడా ఏం లేదురా… పరిస్థితులు అలా ఉన్నాయి.

రాజారాం కి అంతా వింటుంటే…గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు.

ప్రిన్సిపాల్ గారు : రాజారాం, రాము పరిస్థితి ఏం బాగోలేదు. చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. తనకి కొంచెం మన సహకారం ఈ సమయంలో అవసరం. నువ్వు వారం వారం రాము ను కలిసి గైడ్ చెయ్యి…అన్నారు.

రాజారాం : సరే …అలాగే…చేద్దాం.

రాజారాం : నీకు విమల, రాము బాగా తెలుసు కదా. వాళ్లు ఎలా ఉండేవారు.

ప్రిన్సిపాల్ గారు : ఇద్దరూ కడిగిన ముత్యాలు రా. వాళ్లు కుటుంబ పరిస్థితులు బలహీనం గాని, వాళ్ల వ్యక్తిత్వం చాలా బలమైనది, ఆదర్శమైనది. అది నేను గ్రహించక పోతే , నీ వరకు నేను పంపించను కదా. అన్నాడు.

రాజారాం : ఆ మాట విని కొంత ఊపిరి పీల్చుకున్నాడు. …సరే నేను చూసుకుంటాను.

మరుసటి రోజు ఉదయం ప్రిన్సిపాల్ గారు సిరిసిల్ల వెళ్లి పోయారు.

రాజారాం మాత్రం ఆలోచిస్తున్నాడు… రాము మంచి వ్యక్తిత్వం గురించి…

మిగిలినది ఎపిసోడ్ -9 లో

యడ్ల శ్రీనివాసరావు 5 June 2022.








Saturday, June 4, 2022

139. కళాశాల 1980 ఎపిసోడ్ - 7

 

కళాశాల 1980

ఎపిసోడ్ -7



సీన్ -32


రాము రెండవ సంవత్సరం పరీక్షలు అయిపోయాయి. విమల కి ఉత్తరం రాసాడు. కాలేజీ కి శెలవులు ఇంకో వారం లో ఇస్తారు. వచ్చేటప్పుటకి ఇల్లు కొంచెం శుభ్రం చేసి పెట్టమని అందులో రాసాడు.

రాజారాం రాము ను చూడడానికి వచ్చాడు.రాము : సర్ వచ్చే వారం, శెలవులు ఇచ్చాక ఇంటికి వెళతాను.

రాజారాం : రాము, ఆ ఊరిలో ఎవరు లేరు కదా…మా ఇంటికి రా…ఆంటీ కూడా నిన్ను తీసుకు రమ్మంది.

రాము :  లేదు సార్….ఆ ఊరిలో ఎవరు లేకపోయినా …నా ప్రాణం ఆ ఊరిలో, ఆ ఇంటి లో నే ఉంది. తరువాత వస్తాను సార్

రాము, శైలజ సంఘటన జరిగిన దగ్గర నుండి రాజారాం ఎన్నిసార్లు పిలిచినా ఇంటికి వెళ్ళడం లేదు. రాజారాం కి ఒకింత బాధ గా ఉన్న రాము మీద గౌరవం పెరుగుతుంది రోజు రోజుకు.

సెలవులకు రాము సిరిసిల్ల ఇంటికి బయలు దేరాడు. బస్ లో ప్రయాణం చేస్తున్నాడు గాని, సిరిసిల్ల లో విమల , పాత ఇల్లు తప్ప తనకు ఇక ఎవరు ఉన్నారు అని బాధపడుతున్నాడు. గతం గుర్తుకు చేసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.

సిరిసిల్ల ఇంటికి రాగానే, విమల ఇల్లు శుభ్రం చేసి ఉంచడం కొంచెం తేలికగా అనిపించింది. రాము ఆ సాయంత్రం ప్రిన్సిపాల్ గారి ని కలిసాడు.

ప్రిన్సిపాల్ గారు : రాము బాగున్నావా…పరిక్షలు బాగా రాశావా.

రాము : రాశాను సార్..

రాము : సార్…మా ఇల్లు ఎవరికైనా అమ్మి పెట్టుకున్నాను కదా…

ప్రిన్సిపాల్ గారు : రాము, పెద్దవాడిగా చెపుతున్నాను. ఆ ఇల్లు ఎందుకు అమ్మాలనుకుంటున్నావు.

రాము : నా చదువు కోసం అని.

ప్రిన్సిపాల్ గారు : వద్ధు రాము…నీకు ప్రభుత్వం ఇప్పుడు ఉచితం గా స్కాలర్షిప్ మీదే ఫీజు, హాస్టల్ వసతి కలిపించింది. నీకు మిగిలిన అవసరాలకు రాజారాం, నేను ఉన్నాం…. అంతకు అవసరం అయితే అప్పుడు అమ్ముదాం…. సరేనా అన్నారు.

రాము : చేసేది లేక సరే సార్ అన్నాడు.

ప్రిన్సిపాల్ గారు : రాము ఇక్కడ ఉన్న అన్ని రోజులు ఉదయం, రాత్రి ఇంటికి వచ్చి భోజనం చెయ్యి.

రాము : సరే సార్.

ఇంటికి వెళ్లేటప్పుడు విమల ను కలిసి ప్రిన్సిపాల్ గారి తో జరిగిన విషయం అంతా విమలకి చెప్పాడు.

రాము కి ఊరిలో ఉన్నాడు కానీ ఏదో వెలితిగా ఉంది. విమల రోజు ఏదోక సమయం లో ఇంటికి వచ్చేది. విమల తనతో సరదాగా మాట్లాడుతున్న తన జీవితం ఎటు వెళ్తుందో అర్దం అయ్యేది కాదు.

శెలవులు అయ్యాక హైదరాబాద్ బయలు దేరాడు రాము.


సీన్ - 33


మూడవ సంవత్సరం కాలేజీ మొదలైంది. రాము దృష్టి అంతా చదువు కి సంబంధించిన ప్రాజెక్టు లు, మీదే ఉంది. అన్ని పరీక్షల్లో టాప్ లో ఉంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.

ఒకరోజు రాము ప్రతిభను గుర్తించిన లెక్చరర్ విశ్వం , రాము ను పిలిచి

విశ్వం : రాము నీ అకాడమిక్స్ చాలా బాగున్నాయి. నువ్వు ఇప్పటి నుండి GRE ,TOEFFEL exams ప్రిపేర్ అయితే అమెరికా లో మంచి యూనివర్సిటీ లో MS చదవవచ్చు. నీకు మంచి score వస్తే free seat వస్తుంది.

రాము : నాకు అంత స్థోమత లేదు సార్.

విశ్వం : లేదు రాము…నువ్వు ముందు ప్రయత్నం చెయ్…. నేను నీకు సపోర్ట్ చేస్తాను. నీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో గైడ్ చేస్తాను.

రాము : సరే సార్.

రాము , లెక్చరర్ విశ్వం గారి శిష్యుడిలా, ఆయన చెప్పినట్లు చదవడం మెదలు పెట్టాడు.

శైలజ ది ఇంటర్ పూర్తి అయ్యి…డిగ్రీ జాయిన్ అయ్యింది. రాము వాళ్ళ ఇంటికి రావడం మానేసినా శైలజకి రాము పై ఇష్టం పోలేదు.

ఒకరోజు శైలజ ఇంటిలో తెలియకుండా, తన కాలేజీ మానేసి రాము ని కలవాలని యూనివర్సిటీ కి వెళ్లింది. అక్కడ రాము వివరాలు చెప్పి, రాముని పిలిపించింది.

రాము ఒక్కసారి శైలజని చూసి ఖంగు తిన్నాడు.

రాము : ఏంటి శైలజ బాగున్నావా…నాన్నగారు రాలేదా…. ఏంటి నువ్వు ఒక్కదానివే ఇలా వచ్చావు…అని వరుసగా ప్రశ్నలు వేసాడు.

శైలజ : నేను ఎవరో గుర్తు ఉన్నానా…నువ్వు ఇంటికి రాకపోతే నిన్ను చూడలేమనుకున్నావా…. జరిగింది మా నాన్న కి చెప్పి మంచి పని చేసావు….. ఏంటి రాము .. నేను నీకు చిన్న పిల్లలా కనిపిస్తున్నానా…. నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకునేదే లేదు…అది నీకు తెలియదేమో…మా అమ్మా నాన్న కి బాగా తెలుసు.

రాము కి కాళ్ల కింద భూమి బద్దలు అయినట్లు అనిపిస్తుంది.

రాము :  అది కాదు.. శైలజా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నానో నీకు అర్దం అవుతుందా…నేను మా ఊరిలో ఇంటర్ నుంచి ఒక అమ్మాయి ని ప్రేమిస్తున్నాను. తన వలనే నేను ఇంత దూరం వచ్చి చదువుకుంటున్నాను. నా చదువు అయిపోయి ఉద్యోగం వచ్చిన తరువాత మేము పెళ్లి చేసుకుంటాము.

శైలజ : వావ్…. సూపర్ స్టోరీ రాము. ఇంత తక్కువ టైం లో భలే చెప్పావు. నీ స్టోరీ లో నాకు నచ్చని పాయింట్ ఏంటో తెలుసా. నువ్వు ఇంటర్ లో ఒక అమ్మాయి ని ప్రేమించావు. అదే ఇంటర్ చదివే నేను ప్రేమిస్తే నీకు చిన్న పిల్ల లా కనిపిస్తున్నాను….. సూపర్..‌అని నవ్వుతూ అంది.

రాము చెప్పిన మాటలు శైలజ అర్దం చేసుకోకుండా లైట్ గా తీసుకుంటుంటే, రాము కి పిచ్చి పట్టినట్లు అవుతుంది.

శైలజ : ఈ సారి ఇంకో స్టోరీ రెడీ చేసుకో…నేను వచ్చినట్లు నాన్నతో చెప్పకు…. ప్లీజ్….చెప్పావంటే నీ కే రిస్క్…. ఇదిగో ఈ చాక్లెట్ లు, స్వీట్స్ నీ కోసం తెచ్చాను. తిను.

రాము కి అసలు శైలజ ని ఎలా వదిలించుకోవాలో తెలియక మౌనంగా ఉన్నాడు. కానీ మనసు లో చాలా సీరియస్ గా ఉన్నాడు.

కొన్ని రోజుల తర్వాత రాజారాం రాము ను కలవడానికి వచ్చాడు.

రాజారాం రామును కలిసి, వచ్చే ఆదివారం నా పుట్టిన రోజు , ఇంటికి రా రాము అన్నాడు.

రాము : సరే సార్

రాము : సార్… అని తనకు లెక్చరర్ విశ్వం ఇస్తున్న కోచింగ్ గురించి వివరంగా చెప్పాడు.

రాజారాం : వెరీ గుడ్…రాము మంచి విషయం చెప్పావు……తప్పకుండా ఇంటి కి రా…. అని చెప్పి వెళ్ళాడు.

రాము ఈ సారి వెళ్లాలి…శైలజకి సీరియస్ గా చెప్పాలి అనుకున్నాడు.


సీన్ - 34


రాము రాజారాం గారి ఇంటికి వెళ్లాడు.

రాజారాం, పావని చాలా సంతోషించారు. శైలజ చూసి కూడా కావాలనే పలకరించకుండా ముఖం తిప్పుకుంది.

రాజారాం గారి పుట్టిన రోజు వేడుకలా చేసుకున్నారు. రాము మేడ మీద ఉండడం చూసి శైలజ వెళ్లింది. రాము ఇదే మంచి సమయం శైలజ కి సీరియస్ గా విమలతో ఉన్న తన ప్రేమ విషయం చెప్పాలనుకున్నాడు.

శైలజ వస్తునే…

శైలజ : హాయ్ రాము….ఈ సారి ఏం స్టోరీ చెపుతున్నావు. కానీ నాకు తెలియదు నువ్వు కధలు బాగా చెపుతావని.

రాము కి శైలజ మాటలు వింటూనే నషానికి అంటుకుంటుంది. అసలు తినకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని మనసు లో అనుకుంటున్నాడు.

శైలజ : ఇదిగో నాన్న బర్త్ డే కేక్ అని …చిన్న కేక్ ముక్క రాము కి ఇచ్చి …తిను అంది.

రాము : తీసుకుని తింటుంటే…చాలు తిన్నది…తినమంటే మొత్తం తినెయ్యమని కాదు…అని సగం తిన్న కేక్ లాక్కుని, తాను గబుక్కున తినేసింది.

రాము కి చెయ్యి లేపి కొట్టాలని అనిపించింది. తన పరిస్థితిని గమనించి మౌనంగా ఊరుకున్నాడు.

విమల రాము ను ఆట పట్టించడం మానడం లేదు.

మరుసటిరోజు ఉదయమే రాము ను రాజారాం కాలేజీ లో వదిలి పెట్టాడు.

రాజారాం కి , పావని కి రాము రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఓ రోజు రాత్రి రాజారాం , తన భార్య పావని తో అంటున్నాడు.

రాజారాం : పావని…రాము మీద నీ అభిప్రాయం ఏమిటి.

పావని : మంచివాడు…అయినా ఎందుకు అడుగుతున్నారు.

రాజారాం : ఆ…ఏం.. లేదు అని నసుగుతున్నాడు…. పాపం తనకు తల్లి తండ్రి లేరు. నా అనే వాళ్లు లేరు. చాలా తెలివైన వాడు. భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థాయికి వెళతాడు. రాము ను మనం శాశ్వతం గా మనతో ఉంచేసుకుంటే…అన్నాడు.

పావని : అంటే మీ ఉద్దేశ్యం…

రాజారాం : మన శైలజ కి రాము అంటే ఇష్టమే కదా…వాళ్లకి పెళ్లి చేస్తే బాగుంటుంది…కదా.

పావని : తన మనసు లో మాట భర్త నోట విన్నందుకు సంతోషంగా…అవును…కానీ రాము ఉద్దేశ్యం తెలుసు కోవాలి కదండి. అంది.

రాజారాం : అవును…. ఇంకా రాము చదువు పూర్తి చెయ్యాలి. తను విదేశాల్లో చదవడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాడు.

పావని : అవునా….మన అదృష్టం బాగుండి అన్ని సజావుగా జరిగితే చాలు.

నెలలు గడుస్తున్నాయి….

రాము కి కాలేజీ లో, వాళ్లు బ్రాంచి విద్యార్థులు అందరికీ ఇండస్ట్రీయల్ టూర్ అని దేశం లో ని ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ తో నడిచే పెద్ద పెద్ద ప్రభుత్వ సంస్థలు ఏ విధంగా పని చేస్తాయో, చూపించడానికి ఒక నెల రోజులు కాలేజీ వారు ఏర్పాటు చేశారు.

రాము ఈ విషయం , ఊరిలో ఉన్న ప్రిన్సిపాల్ గారి కి, రాజారాం కి తెలియచేసీ టూర్ వెళ్లాడు.


సీన్ - 35


అదే సమయంలో విమల పరిస్థితి ఇంటిలో ఏం బాగోలేదు. తను ఇంటిలో తల్లి కి చెప్పినట్లు పెళ్లి కి తీసుకున్న రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. తల్లి ఈ సారి బాగా ఒత్తిడి చేస్తుంది. విమల కి ఏం చేయాలో తోచడం లేదు.

ఒకరోజు విమలకి తెలియకుండా, జగిత్యాల వెళ్లారు. ఇది వరకే దూరపు బంధువు విమలను ఒక పెళ్లి లో చూసి విమల తల్లి ని సంబంధం కోసం అడిగారు. వారి దగ్గరకు విమల తల్లి తండ్రులు వెళ్లి పెళ్లి కి అంగీకరించి వచ్చారు.

మరుసటిరోజు విమల తో తల్లి నీ పెళ్లి కి లగ్గాలు పెట్టేసాం, ఈ నెలలో నే పెళ్లి అనేటప్పటికీ విమల కి గుండె ఆగినంత పనైంది.

ఏం చేయాలో తోచడం లేదు. ఎవరికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. రాము కి విషయం ఎలా చెప్పాలి అని ఏడుస్తుంది.

విమల తల్లి , విమల ను బయటకు కూడా పంపడం మానేసింది.

విమల కి ఒక ఆలోచన వచ్చింది. ప్రిన్సిపాల్ గారి దగ్గర కి వెళ్లి రాము తో తన ప్రేమ, ఇంటి లో బలవంతపు పెళ్లి గురించి చెపితే పరిష్కారం దొరుకుతుంది అనుకుంది.

మూడు రోజుల తర్వాత విమల తల్లి ని అడిగి ప్రిన్సిపాల్ గారి ఇంటికి కి వెళ్తాను. పని ఉంది. సరే అని తండ్రి ని తోడు ఇచ్చి పంపింది. విమల ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్ళాకా తండ్రి ని బయట ఉండమని చెప్పి , లోపలికి వెళ్లింది.

విమల ను చూసి …ప్రిన్సిపాల్ గారు రా .. విమల కూర్చో అన్నారు.

ప్రిన్సిపాల్ గారు : విమల ముఖం చూసి ఏంటి విమల నీరసంగా, ఉన్నావు .... ఒంట్లో బాగాలేదా.

విమల : బాగానే ఉంది సార్…మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. రాము ….

అనగానే …వెంటనే అడ్డు తగిలి

ప్రిన్సిపాల్ గారు : ఆ…ఆ…ఆ.‌.. అదేనమ్మా రాము గురించి నేను నీకు ముఖ్య విషయం చెప్పాలి. నాకు నిన్న నే ఉత్తరం రాసాడు. ఒక నెలరోజుల పాటు కాలేజీ టూర్ దేశమంతా వెళ్తున్నారంట…బహుశా నిన్ననే బయలు దేరి ఉండవచ్చు. ఇంకో విషయం విమల, రాము ప్రతిభ, తెలివి తేటలు చూసి అమెరికా లో పై చదువులు చదివించడానికి, తన కాలేజీ లో లెక్చరర్ గారు ట్రైనింగ్ ఇస్తున్నారంట. మనం రాము తప్పకుండా అమెరికా లో చదివి చాలా గొప్ప వాడు అయిపోతాడమ్మ…. అని సంతోషంగా ఆయన పంథా లో చెప్పుకు పోతున్నారు.

అదంతా విని విమల కి కాసేపు శూన్యం లా అనిపించింది.

ప్రిన్సిపాల్ గారు : విమల…విమల… ఏంటి అదోలా ఉన్నావు…ఆ.. ఇందాక ఏదో చెప్పాలి అన్నావు…. రాము తో ఏమైనా చెప్పాలా…

విమల కి అంతా చీకటిగా కనిపిస్తుంది.

విమల : అవును సార్… నాకు పెళ్లి కుదిరింది. ఈ నెలలో నే, మీకు చెప్పుదామని వచ్చాను. వీలైతే రాము కి తెలియ పరచండి.

ప్రిన్సిపాల్ గారు : అలాగే విమల.

విమల తండ్రి తో తిరిగి ఇంటికి వస్తూ,.. మనసు లో అనుకుంటుంది. ఇప్పుడు ఎదిరించి రాము ను పెళ్లి చేసుకుంటే, రాము భవిష్యత్తు ఇక్కడి తో ఆగిపోతుంది. రాము ఇంకా విదేశాల్లో చదవాలి, పెద్ద స్థాయిలో కి రావాలి. ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు ఇంటిలో ఆగరు…. విమల కి ఆసమయంలో ఆత్మహత్య చేసుకుందామని అనిపించింది. మరలా కాసేపు ఆగి తాను అలా చేస్తే రాము బ్రతకడు అని తెలిసి , తన జీవితం త్యాగం చేసుకోవాలని నిర్ణయించుకుంది. తల్లి తో పెళ్ళి కి ఒప్పుకుంది.

ఆ రోజు రాత్రి విమల రాము తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.

విమలకి పరిణీతి గా ఆలొచిస్తుంది గాని, ఆ పరిణితి తోనే తన జీవితం త్యాగం అవుతుందని ఏనాడూ ఊహించుకోలేదు.


మిగిలినది ఎపిసోడ్ - 8 లో

యడ్ల శ్రీనివాసరావు 5 June 2022.







Friday, June 3, 2022

139. కళాశాల 1980 ఎపిసోడ్ -6

 


కళాశాల 1980

ఎపిసోడ్ -6



సీన్ -29


బస్ హైదరాబాద్ చేరుకుంది. రాజారాం బస్ స్టేషన్ కు వచ్చి రాముని తీసుకుని ఇంటికి వెళ్ళారు. రాజారాం గారి భార్య పావని, కూతురు శైలజ అందరూ కలిసి రాముని సంతోషంగా పలకరించి , మంచి రాంక్ సాధించినందుకు అభినందించారు.

ఆ రోజు రాత్రి భోజనాలు అయిన తరువాత, రాజారాం , రాము ని పిలిచి చెపుతున్నాడు.

రాజారాం : రాము రేపు నిన్ను కాలేజీ లో జాయిన్ చేసి, హాస్టల్ లో జాయిన్ చేస్తాను. హాస్టల్ లో తోటి వారితో జాగ్రత్త, నీకు ఇంకా మీదట ఏ అవసరం వచ్చినా నాతోనే చెప్పు. నీకు నెలసరి అవసరాలకు ప్రతీ నెలా డబ్బులు ఇస్తుంటాను. దిగులు పడకు, నువ్వు మంచి ఉద్యోగం వచ్చిన తరువాత నాకు ఇచ్చెద్ధువు అని నవ్వుతూ అన్నాడు…. ఇంకా రాగింగ్, కాలేజీ లో ఎలా ఉండాలో చెపుతున్నాడు.

రాము : అలాగే సార్ .

మరుసటి రోజు ఉదయం రాము , రాజారాం టిఫిన్ చేసి కాలేజీ కి బయలు దేరడానికి సిద్ధం అయ్యారు. రాము , రాజారాం పావని దంపతుల ఆశీస్సులు తీసుకున్నాడు. బయలు దేరే ముందు శైలజ నవ్వుతూ ఎదురు వచ్చింది.

రాము మనసు లో శైలజను అలా చూసేసరికి విమల గుర్తుకు వచ్చింది.

కాలేజీ లో అడ్మిషన్ అయ్యాక, హాస్టల్ కు వెళ్లారు. రాము కి ఆ వాతావరణం అంతా బాగా నచ్చింది.

రాజారాం : అక్కడి నుంచి వెళుతూ ,రాము ఈ 400 రూపాయలు ఉంచు...

రాము : సార్ నాకు ప్రిన్సిపాల్ గారు 600 రూపాయలు ఇచ్చారు. ప్రస్తుతం అవి సరిపోతాయి, తరువాత. నెలలో ఇద్దురు అన్నాడు.

రాజారాం : పరవాలేదు అవి దాచుకో…. ప్రతీ ఆదివారం మాత్రం ఇంటికి రా, భోజనం చేసి మరుసటి రోజు ఉదయం వెళుదువు .

రాజారాం కి ఎందుకో రాము ని సొంత మనిషిలా ఫీల్ అవుతూ అంటున్నాడు.

రాము : సరే సార్.

రోజులు గడుస్తున్నాయి…రాము కి కాలేజీ బాగుంది. కొత్త పరిచయాలు, ఏర్పడ్డాయి.

మధ్యలో వీలైనప్పుడు రాజారాం గారి ఇంటికి వెళ్ళి వస్తున్నాడు. రాజారాం నెల నెలా ఖర్చు లకి డబ్బులు ఇస్తున్నాడు.

రాము చదువు లో మంచి మార్కులు సాధిస్తూ కాలేజీ లో ఫ్రోఫెసర్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు.

నెలకు ఒకసారి ఇంటికి, విమల కి, ప్రిన్సిపాల్ గారి కి ఉత్తరం రాస్తున్నాడు. రాము దృష్టి రోజు రోజుకు చదువు లో ఏదో సాధించాలనే పట్టుదల పెరుగుతూ ఉంది.

ఇంతలో కాలేజీ కి దసరా శెలవులు ఇచ్చారు. రాము , రాజారాం తో చెప్పి ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్ళగానే తల్లి, రాము ను చూసి ఆశ్చర్య పోయింది. రాము నడవడిక, మాట తీరు, బట్టలు విధానం మారింది.

ఆ రోజే రాము ప్రిన్సిపాల్ గారి ని కలిసి , తిరిగి వచ్చేటప్పుడు విమలను కలిసాడు. చాలా రోజుల తరువాత విమల రాము ను చూసి చిన్న పిల్లలా గెంతులు వేసింది. ఇద్దరూ చింత చెట్టు దగ్గర మాట్లాడు కున్నారు.

రాము కి వారం రోజుల శెలవులు గడిచిపోయాయి. తిరిగి హైదరాబాద్ కాలేజీ కి వెళ్ళి పోయాడు.

శైలజ 10 వతరగతి చదువుతుంది. రాము రాజారాం గారి ఇంటికి వెళ్ళి నపుడు , శైలజకి లెక్కలు, సైన్స్ చెపుతూ ఉండేవాడు రాము.

రాముకు మొదటి సంవత్సరం పరీక్షలు అయ్యాయి. శెలవులు ఇచ్చారు. రాజారాం గారి తో చెప్పి ఇంటికి వెళ్ళాడు. శైలజ కూడా పదవతరగతి పరీక్షలు రాసింది.

రాము సిరిసిల్ల ఇంటికి వచ్చాడు…తల్లితో అమ్మా నెలరోజుల శెలవులు అని సంతోషం గా చెప్పాడు. రాము తల్లి కూడా తాను పని చేసే కాలేజీ కి వేసవి శెలవులు అవడం వలన ఇంటి దగ్గరే ఉంది.

రాము ప్రిన్సిపాల్ గారిని కలిసి వచ్చాడు.

ఆ మరుసటి రోజు విమల , రాముని కలిసింది.

విమల ఎందుకో కాస్త దిగులు గా ఉంది.

రాము : విమల ఎందుకు అలా ఉన్నావు

విమల : ఏం లేదు.

రాము : ఓహో …అంత రహస్యం అయితే చెప్పకు.

విమల : ఎలా రాసావు …ఎగ్జామ్స్.

రాము : నిశ్శబ్దం

విమల : ఎన్ని రోజులు శెలవులు

రాము : నిశ్శబ్దం

విమల : హు…ఏంటి అలక…రాము నీకోకటి చెప్పనా…నువ్వు ఇలా అలిగినప్పుడు , భలే ఉంటావు తెలుసా…నీ బుగ్గలు గట్టిగా గిల్లాలని అనిపిస్తుంది.

రాము : సీరియస్ గా చూసాడు

విమల : సరే…సరే…చెపుతాను…. కాసేపు నిశ్శబ్దం….. ఇంటిలో ప్రతీ రోజు పెళ్లి గురించి గొడవ రాము. అమ్మ వాళ్ల బంధువు లు ఒకరు నన్ను చేసుకుంటారని పదే పదే అడుగుతున్నారు….అమ్మ కాళ్ల దగ్గర కి వచ్చిన వాళ్లను వదులుకుంటే నీకు పెళ్ళి అవదు అని తిడుతుంది. ప్రతీ రోజు ఇదే గొడవ. నా వలన కావడం లేదు. మనం పెళ్లి చేసుకోవాలని అంటే ఇంకా మూడేళ్ళ పడుతుంది కదా …. అని అమాయకంగా అంది.

రాము కి ఆ పరిస్థితి అంతా మింగుడు పడటం లేదు. విమల తన కోసం పడుతున్న బాధకు ఆ సమయంలో పరిష్కారం కూడా తెలియక మౌనంగా ఉన్నాడు.

ఆ నెల సరదాగా గడిచిపోయాయి…వారిద్దరికి.


సీన్ – 30


కాలేజీ లు తెరిచారు. రాము కి మొదటి సంవత్సరం కాలేజీ రెండవ రాంక్ వచ్చింది.

విషయం తెలిసిన రాజారాం, ప్రిన్సిపాల్ గారు చాలా ఆనంద పడ్డారు. శైలజ పదవతరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి, ఇంటర్ లో జాయిన్ అయ్యింది.

రాము రాజారాం గారి ఇంటికి సమయం వీలైనపుడు వెళ్ళి వస్తున్నాడు. రాజారాం కుటుంబం లో ఒక మనిషి లా అయిపోయాడు. రాజారాం భార్య పావని కూడా, రాము ఎప్పుడైనా ఇంటికి రాకపోయినా, వెంటనే భర్తను అడిగేది.

కొద్ది రోజుల తర్వాత ఒకరోజు హైదరాబాద్ లో అల్లర్లు, మతకక్షలు జరిగాయి. ఆ సమయంలో కాలేజీ హాస్టల్ లో కూడా మత ఘర్షణలు ఉండడం వలన కొద్ది రోజులు కాలేజీ, హాస్టల్ మూసేశారు. రాజారాం కి విషయం తెలిసి, రాము ను ఇంటికి వచ్చెయ్యమన్నాడు. రాము ఊరు వెళతానని చెప్పినా, రాజారాం ఊరుకో లేదు. పుస్తకాలు తెచ్చుకుని ఇంటి దగ్గరే చదువుకో అన్నాడు. చేసేదేమీలేక సరే అన్నాడు రాము.

రాము రాజారాం ఇంటికి వచ్చాడు. రోజు శైలజకి ఇంటర్ పాఠాలు చెపుతూ ఉండేవాడు. రాము కి ఇది వరకు ఉన్న బిడియం పోయింది.

రాము ఒకరోజు మధ్యాహ్నం విమల రాసిన పాత ఉత్తరాలు చదువుతూ, గతాన్ని ఆలోచిస్తూ కాస్త దిగులు గా ఉన్నాడు.

ఆ రోజు సాయంత్రం శైలజ రాము తో ట్యూషన్ చెప్పించు కోవడానికి మేడ మీద కి వచ్చింది.

రాము : శైలజ ఈ రోజు నాకు ఆసక్తి లేదు, తలనొప్పి గా ఉంది. రేపు చెపుతాను.

శైలజ : సరే….

అని కిందికి వెళ్లి టీ పెట్టి, టీ తో పాటు జండుబామ్ తెచ్చి ఇచ్చింది.

రాము : ఎందుకు ఇది. నేనేం అడగలేదే.

శైలజ : నవ్వుతూ…నాకే తెచ్చి ఇవ్వాలని పించింది.

రాము : సరే…అక్కడ పెట్టి…. వెళ్లు.

శైలజ : ఏం….పెట్టి వెళ్లి పోవాలా….మా ఇంటిలో కూడా నాకు స్వాతంత్ర్యం లేదా…అంది నవ్వుతూ.

రాముకు ఎప్పుడూ లేనిది శైలజ అంత చనువుగా మాట్లాడుతుంటే , ఆశ్చర్యం కలిగింది.

ఆ రోజు నుండి రాము తో శైలజ మాట్లాడే ధోరణి , రాము కి నెమ్మదిగా అర్దం అయి, చాలా తక్కువగా మాట్లాడేవాడు.

శైలజ కి, వయసు ప్రభావమో ఏమో, ఉన్న ఆ తక్కువ రోజుల్లోనే, రాము అంటే రోజు రోజుకు దగ్గర అవ్వాలని ప్రయత్నించేది .

ఒకరోజు రాము చదువు కోవడానికి అని పుస్తకం తెరిచి చూస్తే ఒక కాగితం కనిపించింది.

అది శైలజ రాము కి రాసిన లవ్ లెటర్.

రాము కి అది చదివిన తరువాత ఒక్క క్షణం ఏం జరుగుతుందో, ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఆ రోజు రాత్రి రాజారాం కుటుంబం తో కలిసి రాము భోజనం చేస్తున్నాడు. కానీ తల పైకి ఎత్తకుండా నే భోం చేస్తున్నాడు. అది గమనించిన పావని ఏం రాము ఈ రోజు కూరలు నచ్చలేదా అంది నవ్వుతూ…..

ఆ…అది కాదండి…అని సైలెంట్ అయిపోయాడు రాము.

అదంతా గమనించిన రాజారాం, ఆ రోజు రాత్రి మేడ మీద రాము గది లో కి వెళ్ళి,

రాజారాం : రాము, మీ కాలేజీ, హాస్టల్ ఎల్లుండి నుంచి తెరుస్తారంట.

రాము : సరే సార్…నేను రేపు సాయంత్రం వెళతాను.

రాజారాం : రేపు ఎందుకు…ఎల్లుండి ఉదయం నేను దించుతాను.

రాము : కాస్త ముభావంగా…సరే సార్.

రాజారాం కి రాము ఏదో దిగులు గా ఉన్నాడు అనిపించింది.

రాజారాం వెళ్లిన తర్వాత,  రాము కి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. శైలజ చిన్న పిల్ల , ఈ విషయం ఎలా చెప్పాలి అని మదనపడుతున్నాడు.

మరుసటి రోజు శైలజ రాము దగ్గరకు వచ్చి,

శైలజ : ఏంటి రాము, రేపు వెళ్లి పోతున్నావా మళ్లీ ఎప్పుడు వస్తావు .…

రాము : కాస్త సీరియస్ గా నాతో పనేంటి. నీ చదువు మీద శ్రద్ధ పెట్టు.

శైలజ : నాకు తెలుసు, నా చదువు గురించి.

రాము అక్కడి నుంచి కింద పావని ఉన్నచోట హాలులోకి వచ్చేసాడు.

ఇక ఈ విషయం అశ్రద్ధ చేయకూడదు అని , ఆ రోజు రాత్రి రాజారాం తో

రాము : సార్…భోజనం చేసాకా మీతో కొంచెం మాట్లాడాలి, పైకి వస్తారా..

రాజారాం : సంతోషంగా, సరే…రాము.

ఆ రాత్రి భోజనం చేసిన తరువాత రాజారాం రాము గదికి వెళ్లాడు.

రాజారాం : రాము చెప్పు…పిలిచావు ఎందుకు

రాము : సంశయిస్తూ…నీళ్లు నములుతున్నాడు. ఎలా మొదలు పెట్టాలో తెలియక.

రాజారాం : చెప్పు రాము, నా దగ్గర మొహమాటం ఎందుకు. డబ్బులు ఏమైనా కావాలా…ఎంత కావాలి.

రాము : ఒక సారిగా కళ్లు నీళ్లు పెట్టుకుని, శైలజ ప్రవర్తన లో వచ్చిన మార్పుల గురించి చెపుతూ, లవ్ లెటర్ చదవమని ఇచ్చాడు.

రాజారాం : ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది.

రాము : సార్, శైలజ చిన్న పిల్ల, తెలియదు. నెమ్మదిగా చెప్పండి. నేను ఇంకా మీదట మీ ఇంటికి రాను. మీకు రావాలనిపించినపుడు హాస్టల్ కు రండి. నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు లాంటి వారు మీరు. మీరు నా వలన సమస్యలు ఉండకూడదు.

రాజారాం నెమ్మదిగా కిందికి వెళ్లి పడుకొని , ఆలోచిస్తున్నాడు. తన కూతురు చేసిన పని వయసు ప్రభావం వలన అనిపించి, గట్టిగా మందలించాలి అని అనుకొని…. రాము పరిణితి, విశ్వాసం చూసి రాజారాం కి రాము మీద గౌరవం పెరిగింది. అప్పటి వరకు ఏ నాడూ రాని ఒక ఆలోచన మనసులో కలిగింది.

మరుసటి రోజు ఉదయం రాము టిఫిన్ తినకుండా నే బయలు దేరాడు.

పావని : అదేంటి రాము, నీకు ఇష్టం అని జీడిపప్పు ఉప్మా చేసాను…. ఎందుకు తినవు.

రాము : లేదండి, రాత్రి నుంచి కడుపులో బాలేదు.

రాజారాం కి అర్థం అయింది.

శైలజ కూడా కాలేజీ కి రెడీ అవుతూ, తిను రాము అంది.

రాము తినకుండా నే, రాజారాం తో కలిసి కాలేజీ కి వెళ్లాడు. ఎప్పుడూ ఏదోకటి మాట్లాడే రాజారాం చాలా నిశ్శబ్దంగా స్కూటర్ నడుపుతున్నాడు.

కాలేజీ వచ్చాక , రాము , రాజారాం ముఖం లోకి చూడకుండానే , తలదించుకుని ఉంటాను సార్ అన్నాడు.

రాజారాం : రాము …ఈ 200 రూపాయలు ఉంచు.

రాము : వద్దు సార్…నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి…తరువాత ఎప్పుడైనా ఇవ్వండి.

రాజారాం కి రాము ను చూసి గుండె చెమ్మగిల్లుతుంది.

రాజారాం : రాము, నువ్వు ఏ తప్పు చెయ్యలేదు. నాకు తెలుసు. చదువు మీద శ్రద్ధ పెట్టు….. వెళ్లు…జాగ్రత్త.

రాజారాం ఆ రోజు రాత్రి జరిగింది అంతా తన భార్య పావని తో చెప్పాడు. ఆమె చాలా బాధపడింది. మరుసటి రోజు కూతురు శైలజ ని ఇద్దరూ కలిసి మందలించి, చదువు పై దృష్టి పెట్టమని చెప్పారు.

శైలజ కి తల్లి తండ్రులు తిడుతుంటే భయం లేదు సరికదా చాలా తేలికగా తీసుకుంది మనసులో.


సీన్ -31


రోజులు గడుస్తున్నాయి. రాజారాం ప్రతినెలా రాము ను కలిసి డబ్బులు ఇస్తున్నాడు. ఇంటికి రమ్మన్నా , రాము రాను సార్ అని చెప్పెవాడు. అలా రాము అన్న ప్రతి సారి, రాము కి చాలా దగ్గర అయ్యేవాడు రాజారాం.

రాము చదువు లో బాగా అభివృద్ధి చెందుతున్నాడు.

సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంకో నెలలో ఉన్నాయనగా, ఒకరొజు రాము క్లాస్ లో ఉండగా అటెండర్ వచ్చి , రాము నీకు ఫోన్ వచ్చింది ప్రిన్సిపాల్ గారు రూం కి రమ్మన్నారు అని చెప్పాడు.

రాము కంగారుగా వెళ్లాడు. ప్రిన్సిపాల్ గారు రాము ను చూసి, రాము మీ ఊరినుంచి ఫోన్ వచ్చింది మీ అమ్మగారి కి ఆరోగ్యం బాలేదంట , వెంటనే బయలుదేరి వెళ్ళు అని చెప్పారు.

రాము తన స్నేహితులతో విషయం చెప్పి, తన కోసం రాజారాం గారు వస్తే చెప్పమని, ఊరు బయలు దేరాడు.

రాము సిరిసిల్ల వెళ్లి, ఇంటికి చేరగానే బయట జనం ఉన్నారు. లోపలికి వెళ్ళి చూస్తే తల్లి అప్పటికే ప్రాణం వదలి నిర్జీవంగా ఉంది. అక్కడే విమేల, ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. విమల దగ్గరకు వచ్చి మూడు రోజుల నుండి జ్వరం అంట, ఈ ఉదయమే ఇలా అయింది. రాము తనకంటూ ఎవరూ లేరని ఏడుస్తున్నాడు. ప్రిన్సిపాల్ గారు, మిగిలిన వారు కలిసి కొంత డబ్బులు వేసుకొని కార్యక్రమాలు ముగించారు.

ఆ పది రోజులు విమల రాము కి కారేజి తెచ్చేది.

రాము కి ఇక ఆ ఊరిలో ఉన్న పాత ఇల్లు తప్ప ఏమీ లేనట్లు అనిపిస్తుంది.

తల్లి పెద్ద కార్యక్రమం అయ్యాక, ప్రిన్సిపాల్ గారు రాముని హైదరాబాద్ పంపించేసారు. రాము వెళ్లేటప్పుడు ప్రిన్సిపాల్ గారి తో …సార్ ఇల్లు ఎవరికైనా అమ్మి పెట్టండి. అని దీనంగా అడిగాడు. సరే రాము.. నేను చూస్తాను. అన్నారు.

రాజారాం కి ఫోన్ లో జరిగిన విషయం అంతా ప్రిన్సిపాల్ గారు చెప్పారు.

ఆ మరుసటి రోజు రాజారాం, పావని కలిసి రాము కాలేజీ కి వెళ్ళి పలకరించారు. ఇంటికి రమ్మన్నా, తరువాత వస్తాను అని చెప్పాడు రాము.

ఆ రోజు రాత్రి రాము ఆలోచిస్తున్నాడు. జరుగుతున్న ప్రతీ బాధాకరమైన సంఘటన తనకు ఏదో నేర్పిస్తున్నట్లు అనుకున్నాడు.


మిగిలినది ఎపిసోడ్ 7 లో

యడ్ల శ్రీనివాసరావు 4 June 2022.






 

488. నా ప్రపంచం

నా ప్రపంచం • నా దొక   ప్రపంచం   అది   సోయగాల   సౌందర్యం. • నా  మనసెరిగిన   ప్రపంచం   మధువొలికిన     అనందం. • అందాల   ఆరబోతలు   ఆదమరచి   ...