కళాశాల 1980
ఎపిసోడ్ -5
సీన్ -27
ఒక పది రోజులు గడిచాయి. ఎంసెట్ రిజల్ట్ పేపర్లో వచ్చాయి. రాము కి రాష్ట్రస్థాయిలో 300 రాంక్ వచ్చింది. రాము రాంక్ చూసిన వెంటనే విమలతో కలిసి ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్లాడు. అప్పటికే ప్రిన్సిపాల్ గారు విషయం తెలిసి రాము కోసం ఎదురు చూస్తున్నారు.
రాము : నమస్కారం సార్…నాకు 300 రాంక్ వచ్చింది.
ప్రిన్సిపాల్ గారు : హ…రాము, విమల రండి కూర్చోండి. నేను పేపర్ లో చూసాను రాము. చాలా మంచి రాంక్ రాము. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది. నేను ఈ లోపు రాజారాం తో మాట్లాడి వివరాలు వాకబు చేస్తాను.
రాము : సంశయం తో దిగులుగా …సార్ హైదరాబాద్ లో చదువు అంటే…అని తల దించుకున్నాడు.
ప్రిన్సిపాల్ గారు : రాము నాకు అర్ధం అయ్యింది. నీకు మంచి రాంక్ రావడం వలన , కులం రిజర్వేషన్ వలన ఫీజులు ప్రభుత్వం చెల్లిస్తుంది. కాలేజీ లో హాస్టల్ ఉంటుంది, వెనుక బడిన వారికి హాస్టల్ స్కాలర్షిప్ వస్తుంది. ఇకపోతే పై ఖర్చులు మాత్రమే చూసుకోవాలి. నువ్వు ఏమి ఆలోచించకు, నేను చూస్తాను….. అప్లికేషన్, మిగిలిన ఏర్పాట్లు కు సిద్ధం అయి ఉండు.
రాము : కృతజ్ఞతగా నిలబడి ప్రిన్సిపాల్ గారు కాళ్లు మీద పడి, కళ్లు నీళ్లు పెట్టుకున్నాడు.
ప్రిన్సిపాల్ గారు : రాము…లే..లే ఏంటిది. అని భుజం పట్టుకుని పైకి లేపి ఆప్యాయంగా రాముని కౌగిలించుకున్నారు.
రాము , విమల అక్కడి నుంచి బయలు దేరి వచ్చి, దారిలో కాసేపు చింతచెట్టు కింద ఆగారు.
విమల : ప్రిన్సిపాల్ గారు ఎంత మంచివారో..
రాము : అవును.
విమల : నువ్వు ఇంకో నాలుగు సంవత్సరాలు దూరం గా ఉంటావు కదా.
రాము : హు….
విమల : రాము చెయ్యి పట్టుకొని, భుజం పై తల అనుస్తూ…ఎలా ఉండాలి... నిన్ను విడిచి.
రాము : నిశ్శబ్దం
విమల : పరవాలేదు లే…జీవితాంతం కలిసి ఉంటాం కదా… ఓపిక పడతాను.
రాము : నువ్వే నా ధైర్యం విమల. మనం కలిసి జీవించాలంటే ఇదంతా తప్పదు కదా.
రాము మాటల్లో పరిణితి కి విమల సంతోషపడింది.
కొంతసమయం తరువాత ఇద్దరూ ఇళ్లకు వెళ్లి పోయారు.
రాము ఇంటికి వచ్చి తల్లి తో జరిగిన దంతా చెప్పాడు. కానీ, తాను చదువు కి వెళితే, తల్లి పోషణ ఎలాగ అర్థం కావడం లేదు.
రాము తల్లి : నువ్వు సార్ సెప్పినట్లు యిను, బాగా సదివి మంచి ఉద్యోగం సెయ్యాలా….నా కోసం ఆలోసించక…నేను ఎలాగైనా బతుకుతా లే…
తల్లి మాటలకు రాము కి బాధ కలిగింది.
అదే రోజు సాయంత్రం ప్రిన్సిపాల్ గారు తన స్నేహితుడు రాజారాం కి, ఫోన్ చేసి రాము చదువు విషయం పూర్తిగా చెప్పారు.
రాజారాం : రాము ను పూర్తిగా నేను చదివిస్తాను. అటువంటి వారు సమాజానికి ముందు ముందు చాలా అవసరం. ఏర్పాట్లు చూడు.
ప్రిన్సిపాల్ గారు : చాలా సంతోషం రా… రాజారాం.
ఆ రాత్రి ప్రిన్సిపాల్ గారు రాము తల్లి గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు తన కాలేజీ లో ఆయాగా పని కల్పించాలనుకున్నారు.
సీన్- 28
రాము కి అనుకున్న విధంగా నే హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో సీటు వచ్చింది.
ప్రిన్సిపాల్ గారు ఆ రోజు రాము ఇంటికి వెళ్ళి రాముకు, రాము తల్లి కి సీటు విషయం చెప్పారు.
ప్రిన్సిపాల్ గారు : రాము నీకు సీటు వచ్చింది. హాస్టల్ కాలేజీ లో ఉంటుంది. నీకు ఇంకా మీదట ఏ అవసరం అయినా, నా స్నేహితుడు రాజారాం చూస్తాడు. నువ్వు ఈ ఆదివారం హైదరాబాద్ బయలు దేరాలి. …మీ అమ్మకు ఇక్కడ కాలేజీ లో ఆయాగా పని ఇస్తున్నాను. ఆమె నా కళ్ల ముందు ఉంటుంది. నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ……ఇది నీకు అంగీకారమేనా అన్నారు.
రాము , రాము తల్లి మారు మాట్లాడకుండా చేతులెత్తి నమస్కరించారు.
ఆ రోజు సాయంత్రం రాము విమలను కలిసి ప్రిన్సిపాల్ గారు ఉదయం ఇంటికి వచ్చి చెప్పింది అంతా చెప్పాడు.
విమల చాలా సంతోషించింది.
రాము హైదరాబాద్ వెళ్లడానికి రోజులు దగ్గర పడుతున్నాయి.
ఆ రోజు శనివారం, మరుసటి రోజు ఉదయం రాము హైదరాబాద్ ప్రయాణం.
రాము విమల చింతచెట్టు కింద కలుసుకున్నారు. విమల చేతి లో ఒక సంచి తో వచ్చింది.
రాము : ఏ విమల …ఏంటి సంచి
విమల : ఇంట్లో అమ్మ కజ్జికాయలు, జంతుకలు వండింది. ఎవరికి తెలియకుండా నీకోసం తెచ్చాను. తిను..ఊరు పట్టుకెళ్ళు…అక్కడ నువ్వు ఏం తింటావో, ఎలా ఉంటావో.
రాము : సరే…అని తీసుకున్నాడు.
సరదాగా మాట్లాడుకుంటున్నారు. కొంత సేపు తరువాత.
విమల : రాము ఇది ఉంచు…అని సీక్రెట్ గా జాకెట్ లోపల నుంచి తీసి చిన్న కవరు తీసి ఇచ్చింది.
రాము : ఏయ్.. విమల ఏం చేస్తున్నావు…ఏంటిది అని ఆశ్చర్యం గా చూసాడు…. నెమ్మదిగా తెరిచి చూస్తే 600 రూపాయలు ఉన్నాయి…..
వెంటనే రాము…విమల తో ఎక్కడివి ఇన్ని డబ్బులు.
విమల : మౌనం గా ఉంది.
రాము : నువ్వు చెప్పక పోతే నేను తీసుకోను.
విమల : నేను దాచుకున్న డబ్బు.
రాము : అబద్దం ఆడకు విమల. మన స్థితి మనకు తెలియనిదా అని గట్టిగా అన్నాడు.
విమల : తల దించుకొని… నా చేతి బంగారం ఉంగరం షావుకారు కొట్లో అమ్మెసాను.
రాము : ఏంటి…ఉంగరమా…ఏం ఉంగరం.
విమల : అవును… నేను పెద్దమనిషి అయినపుడు మా పెద్దమ్మ పెట్టిన ఉంగరం.
రాము : మీ ఇంట్లో తెలిస్తే…
విమల : చెప్పేసాను…. ఉంగరం ఎక్కడో జారి పడి పోయిందని.
రాము : మీ అమ్మ ఏమీ అనలేదా….
విమల : నిన్ననే కొట్టింది…. వీపు మీద ఎర్రగా కందిపోయిన దెబ్బలు చూపిస్తూ….
రాము : అసలు ఎందుకు ఇదంతా… ఇప్పటికే ఒకసారి కాలేజీ లో నా కోసం సార్ తో దెబ్బలు తిన్నావు…. మరలా రెండో సారి…. నాకు అసలు ఇదంతా నచ్చలేదు. నీ మీద కోపం వస్తుంది.
విమల : నేను దెబ్బలు తిన్న ప్రతి సారి…నీ జీవితం లో మార్పులు వస్తున్నాయి. నీకు మంచి జరుగుతుంది. అంతకంటే నాకు ఏం కావాలి…. అని రామును గట్టిగా కౌగిలించుకొని…గుండెలపై అని , నెమ్మదిగా చెపుతుంది, నీ చదువు కి ఈ డబ్బు అవసరం, నాకు ఏం చెయ్యాలో తెలియలేదు.
రాము : నుదుటి నుండి సన్నగా చెమట కారుతుంది. విమలకి తన పై ఉన్న ప్రేమ కి తిరిగి తాను ఏమి చెయ్యాలో ఆ స్థితి లో అర్థం కాలేదు. విమల నుదుటి పై ముద్దు పెట్టుకుని, ఏదో తెలియనంత దూరంగా ఆలోచిస్తున్నాడు , మనసు లో.
కొంత సమయం తరువాత ఇద్దరూ ఇంటికి వెళ్ళి పోయారు.
రాము ఇంటికి వెళ్ళి బట్టలు సర్దుకున్నాడు మరుసటి రోజు ప్రయాణానికి.
ఆదివారం ఉదయం 8:00 గంటలు సిరిసిల్ల బస్టాండ్.
రాము తల్లి తో వచ్చాడు. తల్లి జాగ్రత్తలు చెపుతుంది. ప్రిన్సిపాల్ గారు , విమల కూడా కొంత సమయం తేడాలో బస్థాండు కి చేరుకున్నారు.
ప్రిన్సిపాల్ గారు : రాము తో…. హైదరాబాద్ లో దిగిన వెంటనే రాజారాం గారు వస్తారు….. ఇదిగో ఈ కవరు నీ కోసమే ఉంచు , జాగ్రత్త గా ఉపయోగించుకో…. నీకు ఏం కావాలన్నా రాజారాం గారి తో , సంశయం లేకుండా చెప్పు…
రాము : అలాగే సార్ .అని పాదాలకు నమస్కరించి ప్రిన్సిపాల్ గారి ఆశీర్వాదం తీసుకున్నాడు.
రాము : విమల తో, అప్పుడప్పుడు మా ఇంటికి వెళ్ళి అమ్మను కొంచెం చూడు…. ఉత్తరం రాస్తుంటాను.
విమల : అలాగే…నువ్వు దిగులు పడకు.. బాగా చదువు…ఆల్ ది బెస్ట్ అని చెప్పి చెయ్యి ఇచ్చింది.
రాము బస్ ఎక్కాడు…. తల్లి కి, విమలకి, ప్రిన్సిపాల్ గారి కి టాటా చెప్పాడు…. బస్ బయలు దేరి వెళ్లిపోయింది.
ప్రిన్సిపాల్ గారు : సైకిల్ పై ఇంటికి వెళుతూ, గుండె నిండా ఒక బరువు తో, మనసు లో ఒక మంచి పనికి శ్రీకారం చుట్టాను అనే సంతోషం తో ఆత్మ సంతృప్తి గా , ఆనంద బాష్పాలు రాలుస్తూ వెళుతున్నారు.
రాము తల్లి : ఇంటికి నడుచుకుంటూ వెళుతూ, భర్త దూరం అయిన కొన్ని నెలల లోపే కొడుకు చదువు కోసం దూరం గా తనను విడిచి వెళ్ళి పోతుంటే, గుండె కోతతో కంటనీరు ని కొంగు తో తుడుచుకుంటూ, భారంగా అడుగులు వేస్తూ నడుస్తుంది….
విమల : సైకిల్ పై ఇంటికి వెళుతూ…. రాము ను విడిచి ఉండలేక, ఇంకా ఎన్నాళ్ళో ఈ ఒంటరి జీవితం, ఇంటి లో తల్లి పెళ్లి పోరు, అంతా తలచుకొని కళ్ల నీళ్లతో సైకిల్ నెమ్మదిగా తొక్కుతోంది.
రాము : బస్ లో నుండి పచ్చని పొలాలు చూస్తూ, ప్రిన్సిపాల్ గారు ఇచ్చిన కవరు తెరిచి చూస్తే అందులో 500 రూపాయలు ఉన్నాయి. తన జీవితంలో తల్లి, విమల, ప్రిన్సిపాల్ గారు కలిసి అతి మామూలుగా, ఏమీ లేని తనకు సహాయం చేసి, ఇలా నడిపిస్తుంటే, వారందరి కోసం భవిష్యత్తు లో తాను తిరిగి ఏం చెయ్యాలో ఒక ధృడ నిశ్చయంతో ఆలోచిస్తూ ఉన్నాడు. బస్ చాలా వేగంగా వెళుతుంది తన ఆలోచనల లాగా.
మిగిలినది ఎపిసోడ్ -6 లో
యడ్ల శ్రీనివాసరావు 3 June 2022
No comments:
Post a Comment