Wednesday, June 8, 2022

139. కళాశాల 1980 ఎపిసోడ్ - 10

 

కళాశాల 1980

ఎపిసోడ్ - 10



సీన్ -41


రాము చివరి సంవత్సరం పరీక్షలకు నెల రోజుల ముందే అమెరికా లో విదేశీ చదువుకు సంబంధించిన పరీక్ష రాసాడు. 

తరువాత నెల లో

ఫైనల్ ఇయర్ పరిక్షలు రాసాడు. పరిక్షలు అయ్యాక ఎంతో భారం దిగినట్లు అనిపించింది రాము కి. రాము ఒకసారి తాను సిరిసిల్ల ఇంటికి వెళ్లి చూసి రెండు రోజుల లో వచ్చెస్తానని , సంశయిస్తూ రాజారాం ని అడిగాడు. రాజారాం కాసేపు ఆలోచించి సరే …ఈ శనివారం ఉదయం వెళ్లి ఆదివారం సాయంత్రం వచ్చెద్దాం. నేను నీతో వస్తాను. మా వాడిని చూసి చాలా రోజులైంది. రాము మౌనంగా తల ఊపాడు.

శని వారం ఉదయం ఇద్దరూ కలిసి సిరిసిల్ల వెళ్లారు. ముందు రోజే  మిత్రుడి కి రాజారాం ఫోన్ లో సమాచారం ఇచ్చాడు, వస్తున్నట్లు.

బస్ లో ప్రయాణం చేస్తున్నాడు గాని రాము కి చేదు జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఇది వరకు ఉన్నంత సంతోషం లేదు. విమల కనిపిస్తుందా లేదా అని ఆలొచిస్తున్నాడు.

బస్ దిగంగానే ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్లారు. కులాసాగా కబుర్లు చెప్పుకున్నారు. ఆ రోజు సాయంత్రం రాజారాం గారితో కలిసి తన ఇంటికి వెళ్లాడు రాము. ఇల్లు శుభ్రం చెయ్యక పోవడం వలన బూజు లతో , అపరిశుభ్రంగా ఉంది. కొంత సమయం తరువాత ఇద్దరూ తిరిగి వచ్చేశారు.

మరుసటి రోజు ఉదయం రాము ప్రిన్సిపాల్ గారిని విమల గురించి అడుగుదామా లేదా అని సంశయం తో మౌనంగా ఉండి పోయాడు.

ప్రిన్సిపాల్ గారి తో కాసేపు అలా ఊరిలోకి వెళ్లి వస్తాను సార్ అన్నాడు.

రాము నడుచు కుంటూ వెళ్తు , ఊరు ఎంత మారిపోయింది అనుకుంటూ, చింతచెట్టు దగ్గరకు వెళ్ళాడు, కాసేపు ఒంటరిగా మౌనంగా కళ్లు మూసుకుని కూర్చుని, కాసేపు గడిచాక లేచి విమల ఉండే ఇంటి వైపు వెళ్లాడు. కాని మనసులో ధైర్యం చాలలేదు. వీధి మెదలు నుంచే వెనుతిరిగాడు.

ఆ క్షణంలో రాము కి తెలియదు. విమల ఆ ఊరిలో, తన ఇంటిలో డెలివరీ కోసం వచ్చి ఉన్నట్లు.

అదే రోజు సాయంత్రం రాజారాం, రాము కలిసి బస్టాండు కి వచ్చి హైదరాబాద్ బస్ ఎక్కారు. బస్ హైదరాబాద్ బయలు దేరింది. వారు నడిచి బస్టాండ్ కి వచ్చే దారిలో , అప్పుడే ఆసుపత్రిలో చూపించుకుని విమల తన తల్లి తో రిక్షాలో ఎదురుపడింది. రాము విమలను చూచూడలేదు రిక్షా టాప్ మూసి ఉంది . రిక్షాలో ఉన్న విమలకి మాత్రం రాము కనిపించాడు.

విమల కి రాము ను చూడగానే ఒక్కసారిగా గట్టిగా పిలవాలని అనిపించింది. రాము ను చూసి ఎన్ని రోజులయింది. రాము లో ఎంత మార్పు వచ్చింది. ఎంత మారిపోయాడో అనుకుంటూ , ఇంటికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని రాము గురించి ఆలోచిస్తుంది. భోజనం చెయ్యక పోయేసరికి, తల్లి మందలించి కడుపులో ఉన్న బిడ్డ కోసం  తిని ఏడు  అని తనదైన శైలిలో తల్లి అరిచింది. వెంటనే విమల కాస్త అన్నం తిని, తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకచేయి తలమీద, మరొక చేయి కడుపు లోని బిడ్డ మీద వేసుకుంది. కంట నుండి సన్నగా చారికలు చెవిని చేరి కిందికి జారుతున్నాయి.


సీన్ – 42


ఒక నెలరోజుల తరువాత రాము కి, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లో స్కాలర్షిప్ తో ఇంజనీరింగ్ పై చదువులు చదివడానికి సీటు మంజూరు అయినట్లు ఉత్తరం వచ్చింది. రాజారాం ఎగిరి గంతేసాడు. రాము ప్రిన్సిపాల్ గారి కి , విశ్వం గారి కి, స్నేహితులకు అందరికీ విషయం తెలియచేసాడు. సిరిసిల్ల లో ప్రిన్సిపాల్ గారి కి  కూడా ఫోన్ చేసి చెప్పాడు. అందరూ చాలా సంతోషించారు.

ఆ రోజు రాజారాం ఇంటిలో పండుగ వాతావరణం లా ఉంది. ఎందుకంటే విదేశాల్లో స్కాలర్షిప్ తో ఫ్రీ గా చదవడం అంటే అంత సాధారణ విషయం కాదు. రాజారాం భార్య పావని పాయసం చేసి తాను స్వయంగా చేతితో రాము కి తినిపించింది. ఆమె అలా తినిపిస్తున్న సమయం లో రాము గుండె బరువెక్కి ఉద్వేగం ఆపుకోలేక ఏడ్చేశాడు. అయ్యొ ఊరుకో రాము అని ఆమె కళ్లు తుడిచింది. రాము ఏడుపు కి కారణం విమల జ్ఞాపకం వచ్చి అని అక్కడి వారెవ్వరికి తెలియదు, ఒక్క శైలజ కి తప్ప.

శైలజ రాము కి అభినందనలు తెలియచేసింది.

రాము మేడమీద దిగులు గా కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఒక వైపు విమల గురించి, మరో వైపు తాను ఇప్పుడు విదేశాలకు వెళ్లడానికి కనీసం పాతిక వేలు పైనే కావాలని.

రాజారాం , రాము దగ్గరకు మేడమీద కి వచ్చాడు.

రాము : సార్ నేను ఇదివరకే ప్రిన్సిపాల్ సార్ కి చెప్పాను, మా ఇల్లు అమ్మి పెట్టమని. ఇప్పుడు డబ్బులు చాలా అవసరం కదా సార్, మీరు ప్రిన్సిపాల్ గారి కి చెప్పండి రేపు.

రాజారాం : సరే…రాము చెపుతాను. మనకు ఇంకా రెండు నెలలు సమయం ఉంది. ఈ లోగా అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. ఇప్పుడు సుమారు ముప్ఫై వేల రూపాయలు కావాలి…. సరే నేను చూసుకుంటాను.

మరుసటిరోజు రాజారాం , ఫోన్ చేసి తను మిత్రుడు తో  రాము ఇల్లు అమ్మకం గురించి మాట్లాడారు.

ఒక వారం రోజుల్లో ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి . రాము కి కాలేజీ మూడోవ రాంక్ వచ్చింది. రాము కి కావలసిన ఏర్పాట్లు రాజారాం చూస్తున్నాడు.

ఒక నెలరోజుల తరువాత ప్రిన్సిపాల్ గారి ద్వారా రాము ఇల్లు పదివేల రూపాయలకు అమ్మకం జరిగిపోయింది. ఇక సిరిసిల్ల తో రాముకు శాశ్వతం గా అనుబంధం వీడిపోయింది. ఆ డబ్బును రాజారాం కి అందచేశాడు, రాము.

ప్రిన్సిపాల్ గారు, రాజారాం కలిసి చెరొక పదివేలు సమకూర్చారు, రాము అమెరికా వెళ్లడం కోసం.

ఎవరికి తెలియని విషయం ఏమిటంటే, రాము ను ఎంసెట్ కోచింగ్ కి ప్రిన్సిపాల్ గారు హైదరాబాద్ పంపిన దగ్గర నుంచి, ప్రతీసారి ఇచ్చిన డబ్బులు, అలాగే రాజారాం గారు తన ఇంజనీరింగ్ చదువు లో మెదట నుండి ఇచ్చిన డబ్బులు, ప్రతీది ఒక లెక్క గా రాసుకుంటున్నాడు. ఎందుకంటే తాను మనసులో ఎప్పటికైనా తాను సంపాదించిన తర్వాత వారికి తిరిగి ఇచ్చెయ్యాలని ఆలోచన.

రాముకు ఇంకో వారం రోజుల్లో అమెరికా వెళ్లి పోతాడు. అన్ని ఏర్పాట్లు విమానం టికెట్, వీసా, రెడీ అయిపోయాయి. ప్రతీరోజూ రాజారాం, పావని జాగ్రత్తలు చెపుతున్నారు. రాము తన మనసు గాయం నుంచి చాలా వరకు బయట పడ్డాడు. జీవితం పై ఆశ కలుగుతుంది. ఆ ఆశలో స్వార్థం లేదు, అనామకుడైన తన కోసం ఇంత మంది కలిసి ఆదుకుంటే, తనలాంటి వారి కోసం తాను ఎప్పటికైనా ఏదైనా చెయ్యాలి, అందుకోసం తాను ఆర్థికంగా బలపడాలి అనుకున్నాడు.

ఇంకొక రెండు రోజుల్లో రాము ప్రయాణం. ఆ రోజు సాయంత్రం రాము ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు, విమల ఉంటే బాగుండేది, ఈ విషయం తెలిస్తే సంతోషించేది.. అసలు ఎలా ఉందో, ఏం చేస్తుందో…ప్రిన్సిపాల్ గారి ని అడిగితే , విమల కి పెళ్లి అయిపోయింది కదా ఎందుకు రాము ఆలోచిస్తావు అని మందలిస్తారని ఊరుకున్నాడు. మేడమీద కూర్చుని అలా ఆలోచిస్తున్న సమయంలో శైలజ మేడ మీదకు టీ, పకోడీలు తీసుకుని వచ్చింది. సాయంత్రం 6 గంటల సమయం అవడం వలన పక్షులు కిలకిలా శబ్దం చేసుకుంటూ గూడుకు చేరుకుంటున్నాయి. ఆకాశం నీలం రంగు నుండి నల్లగా చీకటి గా మారుతూ ఉంది.

శైలజ రావడం రాము గమనించలేదు. శైలజ నెమ్మదిగా రెండు సార్లు గొంతు సకిలించింది.

రాము : ఆ..ఆ…శైలజ , టీ తెచ్చావా…. ధాంక్యు…అన్నాడు నవ్వుతూ

శైలజ : పరవాలేదు…..

రాము : టీ…ఇచ్చేశావు కదా…(ఇంకా వెళ్ల లేదేం అన్నట్లు).

శైలజ : అంటే ఎల్లుండి అమెరికా వెళ్లి పొతున్నావు కదా…మరలా రెండు మూడు సంవత్సరాల వరకు రావంట కదా.

రాము : అవును…. శైలజ నీ జీవితం లో గోల్ ఏంటి…ఏం చదవాలి, ఏం చెయ్యాలి అనుకుంటున్నాను అని అడిగాడు.

శైలజ : సంశయం లేకుండా వెంటనే రాము దగ్గరకు వచ్చి గట్టిగా కౌగిలించుకొని…. నువ్వే నా గోల్…నిన్ను పెళ్లి చేసుకుని , కలిసి ఉండటం నా లక్ష్యం అని చెప్పింది.

రాము : శైలజ ఒక్క సారి అలా చేసే సరికి షాక్ అయ్యి, శైలజ నుండి దూరంగా జరిగి, …ఏం మాట్లాడుతున్నావు, శైలజ…. అసలు నీకు నా గురించి ఏం తెలుసు.

శైలజ : నీ గురించి అంతా తెలుసు రాము, విమల గురించి ఇంకా తెలుసు. అన్నీ తెలియక ముందే నువ్వంటే ఇష్టం…. ఇవన్నీ తెలిసిన తరువాత నిన్ను నేను అసలు వదలకూడదని ఇంకా గట్టిగా నిశ్చయించుకున్నాను. నువ్వు అంటే ఇష్టం రాము, ఎందుకో తెలియదు. ఒకరిని ప్రేమిస్తే కలిసి ఉండాలి రాము, ఆ అవకాశం, అదృష్టం నాకు నీతో ఉందనిపిస్తుంది. ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి అందం చూసి కాదు , వ్యక్తిత్వం చూసి ఇష్టపడుతుంది. నేను నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వంటే నాకు ఇష్టం……అయినా , రాము పరిస్థితులు నీ జీవితం లో కొన్ని అనుకూలతలను ఇచ్చాయి. కొన్ని సార్లు అనుకూలతలను ఇవ్వలేదు. అందులో నీ తప్పు ఏమీ లేదు…. ప్రేమించిన వారిని మరచి పోవాలన్నా, వదిలి ఉండాలన్నా ఆ బాధ ఎలా ఉంటుందో నేను నీకు చెప్పనవసరం లేదు. నీలాగే నన్ను ఉంచాలని అనుకుంటే నీ ఇష్టం…. అని స్థిరంగా, సూటిగా చెప్పింది శైలజ. నేను ఎన్నాళ్ళు అయినా ఎదురు చూస్తాను.

శైలజ మాటలు రాము మైండ్ బ్లాంక్ గా అయిపోయింది. అసలు శైలజ ఏం మాట్లాడుతుందో కూడా అర్దం కానట్లు అయిపోయాడు. తాను మనసు విమలకి ఇచ్చేసి, శైలజ అనుకున్నంత సులువుగా మారిపోగలనా అని మనసులో నవ్వుకున్నాడు. శైలజ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది.

రాము అమెరికా బయలు దేర వలసిన రోజు…సమయం దగ్గరపడింది. బయలు దేరే సమయం లో శైలజ ఎదురు వచ్చింది. రాజారాం, పావని, శైలజ ముగ్గురు కలిసి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం కి రాముతో వచ్చారు.

శైలజ రాము కళ్లల్లో కళ్లు పెట్టి, ఆర్తి గా, దిగులుగా చూస్తుంది. ఆ చూపు రాము కి ఏదో సందేశం ఇస్తున్నట్లు అనిపించి, దృష్టి మరల్చి కో లేక పోతున్నాడు.

టైం అయ్యాక, అందరికీ వీడ్కోలు చెప్పి, లోపలికి వెళ్ళి విమానం ఎక్కి కూర్చున్నాడు రాము. జీవితం లో మొదటిసారి విమానం లో కూర్చోవడం, ఎంత అదృష్టం, ఈ సమయంలో విమల ఉంటే ఎంత సంతోషించేది అని మనసు లో అనుకున్నాడు.

ఎయిర్ పోర్ట్ నుండి తిరుగు ప్రయాణంలో, రాజారాం మనసు లో గర్వం గా ఉంటూ, కంటనీరు పెట్టుకున్నాడు. రాము ఎంసెట్ కోచింగ్ కి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, ఈ అయిదు సంవత్సరాలలో ఎన్ని మార్పులు, స్వయం గా రాము ని అమెరికా పంపండం అంటే ఎంత గొప్ప విషయం తనకు అనుకున్నాడు.


సీన్ - 43


డెలివరీ కి అని వచ్చిన విమల తరువాత అయిదు నెలల వరకు సిరిసిల్ల లోనే ఉంది. బాబు పుట్టాడు విమలకి. బాబు పుట్టిన మూడు నెలలకు ప్రిన్సిపాల్ గారి ఇంటికి బాబును తీసుకుని వెళ్లింది. సరిగా అప్పటికి రాము అమెరికా వెళ్లి నెల దాటింది.

ప్రిన్సిపాల్ గారు విమల ను చూసి …

ప్రిన్సిపాల్ గారు : రా…రా…విమల కూర్చో…ఎలా ఉన్నావు…మీ బాబు….అని దగ్గర కి తీసుకున్నారు.

విమల : అవును సార్…అంది నవ్వుతూ…. విమల మనసు లో కొద్ది రోజుల క్రితం రాముని ఊరిలోకి చూసిన విషయం , రాము గురించి ప్రిన్సిపాల్ గారు ఏమైనా చెపుతారేమో అని ఎదురు చూసింది.

ప్రిన్సిపాల్ గారు రాము విషయం తప్ప అన్ని మాట్లాడుతున్నారు.

విమల : ఉండలేక…సార్ రాము ఎలా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు. క్రిందటి సారి రాము ని నేను ఊరిలో బస్టాండ్ వద్ద మరొకరితో చూసాను. తను మాత్రం నన్ను చూడలేదు. అని అమాయకంగా చెప్పింది.

ప్రిన్సిపాల్ గారు : కాసేపు మౌనం వహించి…. చూడమ్మా విమల అని, విమల పెళ్లి అయిన తరువాత నుండి రాము పరిస్థితి ఎలా మారిపోయిందో, తిరిగి మరలా ఈ మధ్యనే కోలుకుని , చదువులో ఫస్ట్ వచ్చి అమెరికా లో విదేశీ చదువుకు నెల రోజుల క్రితం వెళ్లాడు. ఇంకొక మూడు సంవత్సరాల వరకు ఇండియా రాడు. తాను ఇప్పుడిప్పుడే మాములు మనిషి అయ్యాడమ్మా.. అని చెప్పారు.

ఆ మాటలు విన్న విమలకి మనసు లో పట్టలేని సంతోషం , అదే విధంగా అంతే దుఃఖం తో ఉంది.

విమల : వెళ్లొస్తాను …సార్..

ప్రిన్సిపాల్ గారు : విమల... బాబు కు ఏం పేరు పెట్టారు.

విమల : రాంబాబు… సార్…అంది.

ప్రిన్సిపాల్ గారు ఒక్కసారి ఖంగు తిన్నారు…విమలకి ప్రేమ తగ్గిందా లేక పెరిగిందో అర్థం కాలేదు.



మిగిలినది ఎపిసోడ్ 11 లో

యడ్ల శ్రీనివాసరావు 8 June 2022.










No comments:

Post a Comment

488. నా ప్రపంచం

నా ప్రపంచం • నా దొక   ప్రపంచం   అది   సోయగాల   సౌందర్యం. • నా  మనసెరిగిన   ప్రపంచం   మధువొలికిన     అనందం. • అందాల   ఆరబోతలు   ఆదమరచి   ...