కళాశాల 1980
ఎపిసోడ్ -6
సీన్ -29
బస్ హైదరాబాద్ చేరుకుంది. రాజారాం బస్ స్టేషన్ కు వచ్చి రాముని తీసుకుని ఇంటికి వెళ్ళారు. రాజారాం గారి భార్య పావని, కూతురు శైలజ అందరూ కలిసి రాముని సంతోషంగా పలకరించి , మంచి రాంక్ సాధించినందుకు అభినందించారు.
ఆ రోజు రాత్రి భోజనాలు అయిన తరువాత, రాజారాం , రాము ని పిలిచి చెపుతున్నాడు.
రాజారాం : రాము రేపు నిన్ను కాలేజీ లో జాయిన్ చేసి, హాస్టల్ లో జాయిన్ చేస్తాను. హాస్టల్ లో తోటి వారితో జాగ్రత్త, నీకు ఇంకా మీదట ఏ అవసరం వచ్చినా నాతోనే చెప్పు. నీకు నెలసరి అవసరాలకు ప్రతీ నెలా డబ్బులు ఇస్తుంటాను. దిగులు పడకు, నువ్వు మంచి ఉద్యోగం వచ్చిన తరువాత నాకు ఇచ్చెద్ధువు అని నవ్వుతూ అన్నాడు…. ఇంకా రాగింగ్, కాలేజీ లో ఎలా ఉండాలో చెపుతున్నాడు.
రాము : అలాగే సార్ .
మరుసటి రోజు ఉదయం రాము , రాజారాం టిఫిన్ చేసి కాలేజీ కి బయలు దేరడానికి సిద్ధం అయ్యారు. రాము , రాజారాం పావని దంపతుల ఆశీస్సులు తీసుకున్నాడు. బయలు దేరే ముందు శైలజ నవ్వుతూ ఎదురు వచ్చింది.
రాము మనసు లో శైలజను అలా చూసేసరికి విమల గుర్తుకు వచ్చింది.
కాలేజీ లో అడ్మిషన్ అయ్యాక, హాస్టల్ కు వెళ్లారు. రాము కి ఆ వాతావరణం అంతా బాగా నచ్చింది.
రాజారాం : అక్కడి నుంచి వెళుతూ ,రాము ఈ 400 రూపాయలు ఉంచు...
రాము : సార్ నాకు ప్రిన్సిపాల్ గారు 600 రూపాయలు ఇచ్చారు. ప్రస్తుతం అవి సరిపోతాయి, తరువాత. నెలలో ఇద్దురు అన్నాడు.
రాజారాం : పరవాలేదు అవి దాచుకో…. ప్రతీ ఆదివారం మాత్రం ఇంటికి రా, భోజనం చేసి మరుసటి రోజు ఉదయం వెళుదువు .
రాజారాం కి ఎందుకో రాము ని సొంత మనిషిలా ఫీల్ అవుతూ అంటున్నాడు.
రాము : సరే సార్.
రోజులు గడుస్తున్నాయి…రాము కి కాలేజీ బాగుంది. కొత్త పరిచయాలు, ఏర్పడ్డాయి.
మధ్యలో వీలైనప్పుడు రాజారాం గారి ఇంటికి వెళ్ళి వస్తున్నాడు. రాజారాం నెల నెలా ఖర్చు లకి డబ్బులు ఇస్తున్నాడు.
రాము చదువు లో మంచి మార్కులు సాధిస్తూ కాలేజీ లో ఫ్రోఫెసర్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు.
నెలకు ఒకసారి ఇంటికి, విమల కి, ప్రిన్సిపాల్ గారి కి ఉత్తరం రాస్తున్నాడు. రాము దృష్టి రోజు రోజుకు చదువు లో ఏదో సాధించాలనే పట్టుదల పెరుగుతూ ఉంది.
ఇంతలో కాలేజీ కి దసరా శెలవులు ఇచ్చారు. రాము , రాజారాం తో చెప్పి ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్ళగానే తల్లి, రాము ను చూసి ఆశ్చర్య పోయింది. రాము నడవడిక, మాట తీరు, బట్టలు విధానం మారింది.
ఆ రోజే రాము ప్రిన్సిపాల్ గారి ని కలిసి , తిరిగి వచ్చేటప్పుడు విమలను కలిసాడు. చాలా రోజుల తరువాత విమల రాము ను చూసి చిన్న పిల్లలా గెంతులు వేసింది. ఇద్దరూ చింత చెట్టు దగ్గర మాట్లాడు కున్నారు.
రాము కి వారం రోజుల శెలవులు గడిచిపోయాయి. తిరిగి హైదరాబాద్ కాలేజీ కి వెళ్ళి పోయాడు.
శైలజ 10 వతరగతి చదువుతుంది. రాము రాజారాం గారి ఇంటికి వెళ్ళి నపుడు , శైలజకి లెక్కలు, సైన్స్ చెపుతూ ఉండేవాడు రాము.
రాముకు మొదటి సంవత్సరం పరీక్షలు అయ్యాయి. శెలవులు ఇచ్చారు. రాజారాం గారి తో చెప్పి ఇంటికి వెళ్ళాడు. శైలజ కూడా పదవతరగతి పరీక్షలు రాసింది.
రాము సిరిసిల్ల ఇంటికి వచ్చాడు…తల్లితో అమ్మా నెలరోజుల శెలవులు అని సంతోషం గా చెప్పాడు. రాము తల్లి కూడా తాను పని చేసే కాలేజీ కి వేసవి శెలవులు అవడం వలన ఇంటి దగ్గరే ఉంది.
రాము ప్రిన్సిపాల్ గారిని కలిసి వచ్చాడు.
ఆ మరుసటి రోజు విమల , రాముని కలిసింది.
విమల ఎందుకో కాస్త దిగులు గా ఉంది.
రాము : విమల ఎందుకు అలా ఉన్నావు
విమల : ఏం లేదు.
రాము : ఓహో …అంత రహస్యం అయితే చెప్పకు.
విమల : ఎలా రాసావు …ఎగ్జామ్స్.
రాము : నిశ్శబ్దం
విమల : ఎన్ని రోజులు శెలవులు
రాము : నిశ్శబ్దం
విమల : హు…ఏంటి అలక…రాము నీకోకటి చెప్పనా…నువ్వు ఇలా అలిగినప్పుడు , భలే ఉంటావు తెలుసా…నీ బుగ్గలు గట్టిగా గిల్లాలని అనిపిస్తుంది.
రాము : సీరియస్ గా చూసాడు
విమల : సరే…సరే…చెపుతాను…. కాసేపు నిశ్శబ్దం….. ఇంటిలో ప్రతీ రోజు పెళ్లి గురించి గొడవ రాము. అమ్మ వాళ్ల బంధువు లు ఒకరు నన్ను చేసుకుంటారని పదే పదే అడుగుతున్నారు….అమ్మ కాళ్ల దగ్గర కి వచ్చిన వాళ్లను వదులుకుంటే నీకు పెళ్ళి అవదు అని తిడుతుంది. ప్రతీ రోజు ఇదే గొడవ. నా వలన కావడం లేదు. మనం పెళ్లి చేసుకోవాలని అంటే ఇంకా మూడేళ్ళ పడుతుంది కదా …. అని అమాయకంగా అంది.
రాము కి ఆ పరిస్థితి అంతా మింగుడు పడటం లేదు. విమల తన కోసం పడుతున్న బాధకు ఆ సమయంలో పరిష్కారం కూడా తెలియక మౌనంగా ఉన్నాడు.
ఆ నెల సరదాగా గడిచిపోయాయి…వారిద్దరికి.
సీన్ – 30
కాలేజీ లు తెరిచారు. రాము కి మొదటి సంవత్సరం కాలేజీ రెండవ రాంక్ వచ్చింది.
విషయం తెలిసిన రాజారాం, ప్రిన్సిపాల్ గారు చాలా ఆనంద పడ్డారు. శైలజ పదవతరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి, ఇంటర్ లో జాయిన్ అయ్యింది.
రాము రాజారాం గారి ఇంటికి సమయం వీలైనపుడు వెళ్ళి వస్తున్నాడు. రాజారాం కుటుంబం లో ఒక మనిషి లా అయిపోయాడు. రాజారాం భార్య పావని కూడా, రాము ఎప్పుడైనా ఇంటికి రాకపోయినా, వెంటనే భర్తను అడిగేది.
కొద్ది రోజుల తర్వాత ఒకరోజు హైదరాబాద్ లో అల్లర్లు, మతకక్షలు జరిగాయి. ఆ సమయంలో కాలేజీ హాస్టల్ లో కూడా మత ఘర్షణలు ఉండడం వలన కొద్ది రోజులు కాలేజీ, హాస్టల్ మూసేశారు. రాజారాం కి విషయం తెలిసి, రాము ను ఇంటికి వచ్చెయ్యమన్నాడు. రాము ఊరు వెళతానని చెప్పినా, రాజారాం ఊరుకో లేదు. పుస్తకాలు తెచ్చుకుని ఇంటి దగ్గరే చదువుకో అన్నాడు. చేసేదేమీలేక సరే అన్నాడు రాము.
రాము రాజారాం ఇంటికి వచ్చాడు. రోజు శైలజకి ఇంటర్ పాఠాలు చెపుతూ ఉండేవాడు. రాము కి ఇది వరకు ఉన్న బిడియం పోయింది.
రాము ఒకరోజు మధ్యాహ్నం విమల రాసిన పాత ఉత్తరాలు చదువుతూ, గతాన్ని ఆలోచిస్తూ కాస్త దిగులు గా ఉన్నాడు.
ఆ రోజు సాయంత్రం శైలజ రాము తో ట్యూషన్ చెప్పించు కోవడానికి మేడ మీద కి వచ్చింది.
రాము : శైలజ ఈ రోజు నాకు ఆసక్తి లేదు, తలనొప్పి గా ఉంది. రేపు చెపుతాను.
శైలజ : సరే….
అని కిందికి వెళ్లి టీ పెట్టి, టీ తో పాటు జండుబామ్ తెచ్చి ఇచ్చింది.
రాము : ఎందుకు ఇది. నేనేం అడగలేదే.
శైలజ : నవ్వుతూ…నాకే తెచ్చి ఇవ్వాలని పించింది.
రాము : సరే…అక్కడ పెట్టి…. వెళ్లు.
శైలజ : ఏం….పెట్టి వెళ్లి పోవాలా….మా ఇంటిలో కూడా నాకు స్వాతంత్ర్యం లేదా…అంది నవ్వుతూ.
రాముకు ఎప్పుడూ లేనిది శైలజ అంత చనువుగా మాట్లాడుతుంటే , ఆశ్చర్యం కలిగింది.
ఆ రోజు నుండి రాము తో శైలజ మాట్లాడే ధోరణి , రాము కి నెమ్మదిగా అర్దం అయి, చాలా తక్కువగా మాట్లాడేవాడు.
శైలజ కి, వయసు ప్రభావమో ఏమో, ఉన్న ఆ తక్కువ రోజుల్లోనే, రాము అంటే రోజు రోజుకు దగ్గర అవ్వాలని ప్రయత్నించేది .
ఒకరోజు రాము చదువు కోవడానికి అని పుస్తకం తెరిచి చూస్తే ఒక కాగితం కనిపించింది.
అది శైలజ రాము కి రాసిన లవ్ లెటర్.
రాము కి అది చదివిన తరువాత ఒక్క క్షణం ఏం జరుగుతుందో, ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఆ రోజు రాత్రి రాజారాం కుటుంబం తో కలిసి రాము భోజనం చేస్తున్నాడు. కానీ తల పైకి ఎత్తకుండా నే భోం చేస్తున్నాడు. అది గమనించిన పావని ఏం రాము ఈ రోజు కూరలు నచ్చలేదా అంది నవ్వుతూ…..
ఆ…అది కాదండి…అని సైలెంట్ అయిపోయాడు రాము.
అదంతా గమనించిన రాజారాం, ఆ రోజు రాత్రి మేడ మీద రాము గది లో కి వెళ్ళి,
రాజారాం : రాము, మీ కాలేజీ, హాస్టల్ ఎల్లుండి నుంచి తెరుస్తారంట.
రాము : సరే సార్…నేను రేపు సాయంత్రం వెళతాను.
రాజారాం : రేపు ఎందుకు…ఎల్లుండి ఉదయం నేను దించుతాను.
రాము : కాస్త ముభావంగా…సరే సార్.
రాజారాం కి రాము ఏదో దిగులు గా ఉన్నాడు అనిపించింది.
రాజారాం వెళ్లిన తర్వాత, రాము కి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. శైలజ చిన్న పిల్ల , ఈ విషయం ఎలా చెప్పాలి అని మదనపడుతున్నాడు.
మరుసటి రోజు శైలజ రాము దగ్గరకు వచ్చి,
శైలజ : ఏంటి రాము, రేపు వెళ్లి పోతున్నావా మళ్లీ ఎప్పుడు వస్తావు .…
రాము : కాస్త సీరియస్ గా నాతో పనేంటి. నీ చదువు మీద శ్రద్ధ పెట్టు.
శైలజ : నాకు తెలుసు, నా చదువు గురించి.
రాము అక్కడి నుంచి కింద పావని ఉన్నచోట హాలులోకి వచ్చేసాడు.
ఇక ఈ విషయం అశ్రద్ధ చేయకూడదు అని , ఆ రోజు రాత్రి రాజారాం తో
రాము : సార్…భోజనం చేసాకా మీతో కొంచెం మాట్లాడాలి, పైకి వస్తారా..
రాజారాం : సంతోషంగా, సరే…రాము.
ఆ రాత్రి భోజనం చేసిన తరువాత రాజారాం రాము గదికి వెళ్లాడు.
రాజారాం : రాము చెప్పు…పిలిచావు ఎందుకు
రాము : సంశయిస్తూ…నీళ్లు నములుతున్నాడు. ఎలా మొదలు పెట్టాలో తెలియక.
రాజారాం : చెప్పు రాము, నా దగ్గర మొహమాటం ఎందుకు. డబ్బులు ఏమైనా కావాలా…ఎంత కావాలి.
రాము : ఒక సారిగా కళ్లు నీళ్లు పెట్టుకుని, శైలజ ప్రవర్తన లో వచ్చిన మార్పుల గురించి చెపుతూ, లవ్ లెటర్ చదవమని ఇచ్చాడు.
రాజారాం : ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది.
రాము : సార్, శైలజ చిన్న పిల్ల, తెలియదు. నెమ్మదిగా చెప్పండి. నేను ఇంకా మీదట మీ ఇంటికి రాను. మీకు రావాలనిపించినపుడు హాస్టల్ కు రండి. నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు లాంటి వారు మీరు. మీరు నా వలన సమస్యలు ఉండకూడదు.
రాజారాం నెమ్మదిగా కిందికి వెళ్లి పడుకొని , ఆలోచిస్తున్నాడు. తన కూతురు చేసిన పని వయసు ప్రభావం వలన అనిపించి, గట్టిగా మందలించాలి అని అనుకొని…. రాము పరిణితి, విశ్వాసం చూసి రాజారాం కి రాము మీద గౌరవం పెరిగింది. అప్పటి వరకు ఏ నాడూ రాని ఒక ఆలోచన మనసులో కలిగింది.
మరుసటి రోజు ఉదయం రాము టిఫిన్ తినకుండా నే బయలు దేరాడు.
పావని : అదేంటి రాము, నీకు ఇష్టం అని జీడిపప్పు ఉప్మా చేసాను…. ఎందుకు తినవు.
రాము : లేదండి, రాత్రి నుంచి కడుపులో బాలేదు.
రాజారాం కి అర్థం అయింది.
శైలజ కూడా కాలేజీ కి రెడీ అవుతూ, తిను రాము అంది.
రాము తినకుండా నే, రాజారాం తో కలిసి కాలేజీ కి వెళ్లాడు. ఎప్పుడూ ఏదోకటి మాట్లాడే రాజారాం చాలా నిశ్శబ్దంగా స్కూటర్ నడుపుతున్నాడు.
కాలేజీ వచ్చాక , రాము , రాజారాం ముఖం లోకి చూడకుండానే , తలదించుకుని ఉంటాను సార్ అన్నాడు.
రాజారాం : రాము …ఈ 200 రూపాయలు ఉంచు.
రాము : వద్దు సార్…నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి…తరువాత ఎప్పుడైనా ఇవ్వండి.
రాజారాం కి రాము ను చూసి గుండె చెమ్మగిల్లుతుంది.
రాజారాం : రాము, నువ్వు ఏ తప్పు చెయ్యలేదు. నాకు తెలుసు. చదువు మీద శ్రద్ధ పెట్టు….. వెళ్లు…జాగ్రత్త.
రాజారాం ఆ రోజు రాత్రి జరిగింది అంతా తన భార్య పావని తో చెప్పాడు. ఆమె చాలా బాధపడింది. మరుసటి రోజు కూతురు శైలజ ని ఇద్దరూ కలిసి మందలించి, చదువు పై దృష్టి పెట్టమని చెప్పారు.
శైలజ కి తల్లి తండ్రులు తిడుతుంటే భయం లేదు సరికదా చాలా తేలికగా తీసుకుంది మనసులో.
సీన్ -31
రోజులు గడుస్తున్నాయి. రాజారాం ప్రతినెలా రాము ను కలిసి డబ్బులు ఇస్తున్నాడు. ఇంటికి రమ్మన్నా , రాము రాను సార్ అని చెప్పెవాడు. అలా రాము అన్న ప్రతి సారి, రాము కి చాలా దగ్గర అయ్యేవాడు రాజారాం.
రాము చదువు లో బాగా అభివృద్ధి చెందుతున్నాడు.
సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంకో నెలలో ఉన్నాయనగా, ఒకరొజు రాము క్లాస్ లో ఉండగా అటెండర్ వచ్చి , రాము నీకు ఫోన్ వచ్చింది ప్రిన్సిపాల్ గారు రూం కి రమ్మన్నారు అని చెప్పాడు.
రాము కంగారుగా వెళ్లాడు. ప్రిన్సిపాల్ గారు రాము ను చూసి, రాము మీ ఊరినుంచి ఫోన్ వచ్చింది మీ అమ్మగారి కి ఆరోగ్యం బాలేదంట , వెంటనే బయలుదేరి వెళ్ళు అని చెప్పారు.
రాము తన స్నేహితులతో విషయం చెప్పి, తన కోసం రాజారాం గారు వస్తే చెప్పమని, ఊరు బయలు దేరాడు.
రాము సిరిసిల్ల వెళ్లి, ఇంటికి చేరగానే బయట జనం ఉన్నారు. లోపలికి వెళ్ళి చూస్తే తల్లి అప్పటికే ప్రాణం వదలి నిర్జీవంగా ఉంది. అక్కడే విమేల, ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. విమల దగ్గరకు వచ్చి మూడు రోజుల నుండి జ్వరం అంట, ఈ ఉదయమే ఇలా అయింది. రాము తనకంటూ ఎవరూ లేరని ఏడుస్తున్నాడు. ప్రిన్సిపాల్ గారు, మిగిలిన వారు కలిసి కొంత డబ్బులు వేసుకొని కార్యక్రమాలు ముగించారు.
ఆ పది రోజులు విమల రాము కి కారేజి తెచ్చేది.
రాము కి ఇక ఆ ఊరిలో ఉన్న పాత ఇల్లు తప్ప ఏమీ లేనట్లు అనిపిస్తుంది.
తల్లి పెద్ద కార్యక్రమం అయ్యాక, ప్రిన్సిపాల్ గారు రాముని హైదరాబాద్ పంపించేసారు. రాము వెళ్లేటప్పుడు ప్రిన్సిపాల్ గారి తో …సార్ ఇల్లు ఎవరికైనా అమ్మి పెట్టండి. అని దీనంగా అడిగాడు. సరే రాము.. నేను చూస్తాను. అన్నారు.
రాజారాం కి ఫోన్ లో జరిగిన విషయం అంతా ప్రిన్సిపాల్ గారు చెప్పారు.
ఆ మరుసటి రోజు రాజారాం, పావని కలిసి రాము కాలేజీ కి వెళ్ళి పలకరించారు. ఇంటికి రమ్మన్నా, తరువాత వస్తాను అని చెప్పాడు రాము.
ఆ రోజు రాత్రి రాము ఆలోచిస్తున్నాడు. జరుగుతున్న ప్రతీ బాధాకరమైన సంఘటన తనకు ఏదో నేర్పిస్తున్నట్లు అనుకున్నాడు.
మిగిలినది ఎపిసోడ్ 7 లో
యడ్ల శ్రీనివాసరావు 4 June 2022.
No comments:
Post a Comment