కళాశాల 1980
ఎపిసోడ్ - 12
సీన్ – 48
రాము జగిత్యాల వెళ్లిన వెంటనే లాడ్జి లో రూం తీసుకొని , విమల కోసం వెతకడం మొదలు పెట్టాడు. దేవాలయాల వద్ద, కూరగాయలు మార్కెట్కు, హాస్పిటల్స్, రెసిడెన్షియల్ ఏరియాల్లో రెండు రోజుల పాటు తిరిగి అలసి పోయాడు. కాని విమల కనిపించలేదు. చేసేది ఏమీ లేక హైదరాబాద్ వెను తిరిగాడు.
హైదరాబాద్ రాగానే
రాజారాం : రాము ప్రయాణం బాగా జరిగిందా…మీ ఫ్రెండ్ ను కలిసావా…అన్నాడు యథాలాపంగా.
రాము : హ..హ..హ.. కలిసాను సార్…అన్నాడు తడబడుతూ…
రాము : సార్ నేను ఇంకొక పది రోజుల్లో అమెరికా వెళ్లాలి. ఫస్ట్ కి జాబ్ లో జాయిన్ అవ్వాలి.
రాజారాం : సరే…రాము….నీ ఇష్టం…. మరలా ఎప్పుడూ వస్తావు ఇండియా కు….ఈ సారి నువ్వు వచ్చాక పెళ్లి చేసుకొనే వెళ్లాలి .. అన్నాడు నవ్వుతూ.
రాము : నవ్వుతూ…సరే సార్…
ఒక రెండు రోజుల తరువాత…ఒక ఉదయం శైలజ తలకు స్నానం చేసి చీర కట్టుకుని అందం గా తయారయి, రాము దగ్గరకు గదిలోకి కాఫీ తీసుకుని వచ్చింది.
రాము కాఫీ తీసుకుని ధాంక్స్ చెప్పాడు.
రాము : ఏంటి…శైలజ ఈ రోజు స్పెషల్ గా కనపడుతున్నావు.
శైలజ : నా పుట్టిన రోజు…
రాము : వో….. అవునా…. హేపీ బర్త్ డే,.. అని విష్ చేసాడు.
శైలజ : ఏంటి….ఉత్తి …విషెస్…ఏ నా…ఇంకేం.. గిఫ్ట్ లేదా…
రాము : చెప్పు…ఏం కావాలి నీకు
శైలజ : హ…ఎవరైనా అడుగుతారేంటి…నీకు నచ్చింది ఇవ్వాలి కాని.
రాము : అంటే , నీకు ఏం ఇష్టమో నాకు తెలియదు కదా…అందుకని చాయిస్ నీకు ఇస్తున్నాను.
శైలజ కి రాము అలా మొదటిసారి సరదాగా మాట్లాడుతుంటే, రాము ను విడిచి వెళ్ళ బుద్ది కావడం లేదు.
శైలజ : సరే…నా ఛాయిస్ అన్నావు…కాబట్టి, నాకు నచ్చిందే తీసుకుంటాను…సాయంత్రం లోగా…. అంది……రాము నన్ను గుడికి తీసుకుని వెళ్తావా.
రాము : నేనా…బాగుండదు.
శైలజ : ఏంటి …బాగోక పోవడం…. నేను అమ్మతో చెపుతాను…. నువ్వు రెడీ అవ్వు…
శైలజ కిందికి వెళ్లి, పావని తో చెప్పింది…రాము తో కలిసి గుడికి వెళతానని. పక్కనే ఉన్న రాజారాం, సరేనమ్మా …నేను స్కూటర్ వదలి, బస్ లో వెళ్తాను ఆఫీస్ కి, మీరు గుడికి, వెళ్ళి రండి అన్నాడు.
కాసేపు తరవాత, రాము, శైలజ కలిసి స్కూటర్ మీద గుడికి వెళ్ళారు. ఇంటి దగ్గర బయలు దేరే ముందు శైలజ, తన తల్లితో చెవి లో ఏదో చెప్పింది. గుడిలో దర్శనం అయ్యాక ఇద్దరూ ఒకే చోట కూర్చున్నారు. శైలజ కొబ్బరి ప్రసాదం సగం కొరికి, సగం రాము కి ఇచ్చింది.
శైలజ రాము చేతిని, తన చేతిలోకి తీసుకుని , రాము కళ్లల్లో కి చూస్తుంది. రాము కి ఆ స్పర్శ తో గుండె భారం గా, వేగం గా కొట్టుకోవడం మొదలైంది.
శైలజ : రాము నిజం చెప్పు…నేనంటే నీకు ఇష్టమేనా
రాము : నువ్వంటే…ఎందుకు ఇష్టం ఉండదు.. శైలజా…కానీ చెప్పడానికి పెదాలు అంగీకరించినా…మనసు అంగీకరించడం లేదు.. అని రాము అనే లోపు
శైలజ తన చేతితో రాము నోరు నొక్కి, గట్టిగా చెయ్యి అడ్డం పెట్టి, ఇంకేం మాట్లాడకు…అంది.
ఆ నిమిషం లో శైలజ కి ఒకటి అర్థం అయింది. రాము ను ఎలాగైనా విమల ఆలోచనలు లోనుంచి తన వైపు తిప్పుకోవాలని.
అప్పటికే ఉదయం సుమారు 10 గంటలైంది. శైలజ రాము తో మార్నింగ్ షో సినిమా కి వెళ్దామా…. అంది…
రాము : వద్దు.. బాగుండదు అన్నాడు.
శైలజ : నేను అమ్మకి చెప్పాను, సినిమా కి వెళ్తాము అని…పరవాలేదు…బయలదేరు …టైం అవుతుంది.
ఇద్దరూ కలిసి సినిమా కి వెళ్లారు…. శైలజ కి తాను 9 వతరగతి చదివేటప్పుడు, రాము ప్రక్కన కూర్చుని సినిమా చూసిన సందర్భం గుర్తుకు వచ్చి నవ్వుకుంది.
సినిమా లో శైలజ రాము చేతిని తన చేతిలోకి తీసుకుని సినిమా చూస్తుంది.
రాము కి తన ప్రమేయం లేకుండా నే తన జీవితం లో మార్పులు వస్తున్నాయి అని మనసు లో అనుకున్నాడు.
సినిమా అయిపోయాక ఇంటికి వచ్చేశారు. ఇంటిలో కలిసి భోజనం చేసారు.
ఆ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో రాము మేడ మీద గది ఆరుబయట కుర్చీ లో కూర్చొని ఆకాశం లో చందమామ వైపు చూస్తున్నాడు. ఆ సమయంలో శైలజ పాయసం తీసుకుని మేడమీద కి వచ్చింది. పాయసం పక్కున పెట్టి, నెమ్మదిగా రాము వెనుకనుండి వచ్చి, రాము కళ్లను తన చేతులతో మూసి దాగుడుమూతలు ఆడుతుంది శైలజ.
రాము ఒక్కసారిగా తన రెండు చేతులతో తన కళ్లు మూసిన శైలజ చేతులను గట్టిగా లాగాడు. శైలజ ఒక్కసారిగా ముందుకి తూలి రాము బుగ్గలకు తన ఎదను ఆనించి , ముందుకు పడబోయి ఒక్క నిమిషం అలా ఉండిపోయింది. ఇద్దరికీ ఆ క్షణం మధురం గా అనిపించింది.
ఒక్క క్షణం ఆగి తేరుకుని, ఇద్దరూ నిలబడి పిట్టగోడ ని ఆనుకొని నిలబడి ఆకాశం లో చందమామ ను చూస్తున్నారు.
కొంత సమయం తరువాత
శైలజ : రాము ఐ లవ్ యూ…అంది.
రాము : తిరిగి అదే మాట చెప్పడానికి ఎందుకో మనసు లో అంగీకరించక....శైలజ చేతిని తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు.
శైలజ కిందికి వెళ్లి పోయేముందు రాము ను ఒకసారి కౌగిలించుకొని …నేను నీ నుంచి తీసుకున్న పుట్టిన రోజు గిఫ్ట్ ఇదే అని …వెళ్లి పోయింది.
ఇట్టే వారం రోజులు గడిచిపోయాయి… రాము అమెరికా ప్రయాణం అదే రోజు…. శైలజ దిగులు గా ఉంది. రాము సంతోషంగా అందరికీ వీడ్కోలు చెప్పి బయలు దేరాడు.
అమెరికా వెళ్లిన వెంటనే జాబ్ లో జాయిన్ అయ్యాడు రాము.
సీన్ – 49
విమల భర్త శేఖర్ వడ్డీ వ్యాపారం బాగా దిగజారింది. నష్టం బాగా వచ్చింది. విమల మీద ఇదివరకు లా కాకుండా తరచూ గొడవ పడుతున్నాడు. తనకి పుట్టిన అమ్మాయి వలనే ఇదంతా అని జరిగింది అనేవాడు.
ఇక లాభం లేదనుకుని హైదరాబాద్ లో కోళ్ల ఫారం పెడితే బాగుంటుందని , ఉన్న ఎకరం భూమి అమ్మేసి , కుటుంబం మొత్తం మకాం హైదరాబాద్ కి మారిపోయారు. హైదరాబాద్ ఊరి శివార్లలో నాచారం దగ్గర ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, ఆ దగ్గరలోనే ఖాళీ స్థలం లీజుకు తీసుకుని అందులో కోళ్ల ఫారం మొదలు పెట్టాడు శేఖర్.
విమల కూడా శేఖర్ తో పాటు కోళ్ల ఫారం పని లో సహాయం చేసేది. మెదటిలో బాగా ఇబ్బంది అనిపించినా, ఒక ఆరు నెలల తర్వాత కొంచెం వ్యాపారం నిలదొక్కుకుంది. శేఖర్ కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు.
రోజులు ప్రశాంతంగా గడుస్తున్నాయి. కాలం , పరిస్థితులు మనిషిని క్రుంగతీస్తాయి, లొంగదీస్తాయి , నిలబెడతాయి, అన్నీ గాయాలను మాన్పుతాయి అంటారు. అది అక్షరాలా విమల జీవితంలో ఇప్పుడు నడుస్తుంది. విమల తన ప్రేమ జీవితం పూర్తిగా మరచిపోయి భర్త, పిల్లలు లోకం గా బ్రతుకుతుంది.
సీన్ – 50
కాలం చాలా వేగంగా గడిచిపోయింది. రాము అమెరికా లో ఉద్యోగం లో బాగా స్థిరపడి సంపాదిస్తున్నాడు.
ఒక సంవత్సరం తరువాత రాము ఇండియా వచ్చాడు. రావడం తోనే రాజారాం గారి కి, ప్రిన్సిపాల్ గారి కి తనకు చేసిన మెత్తం సహాయం కంటే నాలుగు రెట్లు డబ్బు తిరిగి ఇచ్చేశాడు. వారు ఎంత వారించినా వినలేదు.
వారిద్దరూ రాము యెక్క ప్రయోజకత్వాన్ని చిన్న తనం లోనే గుర్తించారు. అది నిజం అవడం తో వారి ఆనందానికి హద్దులు లేవు. రాము వారికి ఒక రక్తసంబంధం మంచి అయిపోయాడు.
రాజారాం, ప్రిన్సిపాల్ గారు కలిసి రాము, శైలజ ల పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి కి ముందు అయినా సరే, విమల కనిపిస్తుందేమో, విమల తనకోసం ఎన్నో సార్లు డబ్బులు ఇచ్చింది, ఉంగరం కూడా అమ్మేసింది…. విమల పిల్లలు తో ఎలా ఉందో , ఒకోసారి చూసి, తాను విమల కి ఇవ్వవలసినవి , ఇస్తే బాగుంటుంది…. ఏం చేయాలి, ఎలా విమల ను కలవాలి అని ఆలోచిస్తున్నాడు. ఇక రాము ఉండలేక ప్రిన్సిపాల్ గారిని ధైర్యం చేసి, అడిగేసాడు.
రాము : సార్… విమల ను ఒకసారి చూడాలి. తనకి నేను చాలా బుణపడి ఉన్నాను. తిరిగి తనకు ఇచ్చెయ్యాలి.
ప్రిన్సిపాల్ గారు : చూడు రాము…నీ ఆలోచన మంచిదే….నీ ప్రేమ విషయం ఇక్కడ మా అందరికీ తెలుసు, అందువలన ఎవరికి ఏ ఇబ్బందీ లేదు. విమల కి పెళ్లి అయి అయిదు సంవత్సరాలు అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నువ్వు ఈ రోజు విమలను తిరిగి కలవడం పరవాలేదు. కానీ ఆ తరువాత నుండి మీ విషయం విమల కుటుంబం లో ఎవరికైనా తెలిస్తే, తన జీవితానికి లేని సమస్యలు మొదలవుతాయి…. ఇది నీకు అవసరమా చెప్పు…అన్నారు.
రాము : ప్రిన్సిపాల్ గారు అనుభవం తో చెప్తున్నారని గ్రహించి, మౌనంగా ఊరుకున్నాడు.
విమల కోసం అని తాను అమెరికా నుండి తెచ్చిన డైమండ్ రింగ్ తన ఫాంట్ జేబులో నే ఉంచి నిమురుతున్నాడు.
శైలజ, రాము ల పెళ్లి చాలా వైభవంగా జరిగింది. రాజారాం, పావని లకు బాధ్యత తీరినట్లు అనిపించింది. ఒక నెలరోజుల లో శైలజ, రాము తో అమెరికా వెళ్లి పోయింది.
రాము జీవితం శైలజ తో సంతోషంగా గడుస్తుంది. రాము కంటే వయసులో నాలుగేళ్ల చిన్నదే అయినా, రాము ను చిన్న పిల్లాడిలా చూసుకునేది శైలజ. ఆ ప్రేమ వల్లనేమో రాము కి కూడా శైలజ సర్వస్వం అయిపోయింది. రాము కి సంవత్సరాలు గడిచేకొద్దీ ఉద్యోగం లో ప్రమోషన్లు, బాధ్యతలు పెరుగుతున్నాయి. కంపెనీ లో మెలకువలు అన్నీ తెలుస్తున్నాయి.
రాము తన సంపాదన ఇండియా కు పంపించి ప్రిన్సిపాల్ గారి చేత సిరిసిల్ల లో పొలాలు, స్థలాలు …. అదేవిధంగా రాజారాం తో హైదరాబాద్ లో స్థలాలు, స్థిర ఆస్తులు బాగా కొనిపిస్తున్నాడు.
రాము శైలజ ల కి మొదట ఆడపిల్ల, తరువాత బాబు పుట్టారు. డెలివరీ సమయంలో , రాజారాం, పావనీ లను అమెరికా లో తమతో నే ఉంచుకున్నారు. ప్రిన్సిపాల్ గారు కూడా ఒకసారి అమెరికా వెళ్లి వచ్చారు. ఇక రాజారాం దంపతులు ఏడాదికి ఒకసారైనా ఒక నెల వెళ్లి వస్తున్నారు. రాము ప్రతీసారి వారు వచ్చి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.
రాము పిల్లలు ఇద్దరినీ అమెరికా లో మంచి స్కూల్లో చదువుతున్నారు. పిల్లల కి ఇంటిలో శైలజ తెలుగు బాగా నేర్పిస్తుంది.
రాము అమెరికా లో సెటిల్ అయ్యి, 15 సంవత్సరాలు అయింది. బాగా సంపాదించాడు. ప్రపంచం 2000 సంవత్సరం లో అడుగు పెట్టింది. తనకి ఇప్పుడు 41 సంవత్సరాల వయసు. పిల్లలు హైస్కూల్ చదువుతున్నారు.
అదే సమయంలో భారతదేశంలో అభివృద్ధి పరంగా మంచి సంస్కరణలకు ప్రభుత్వం తెర లేపింది. విదేశీ NRI లకు పెట్టుబడులు పెట్టి కంపెనీలు హైదరాబాద్ లో మెదలు పెడితే , రాయితీ లు ప్రకటిస్తుంది ప్రభుత్వం.
రాము కి అదే సమయంలో …తనకున్న అనుభవం తో, ఇండియా లో ఒక చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ మొదలు పెట్టి , సంపాదన కంటే కూడా యువతకు మంచి ఉపాధి కల్పించాలని అనుకున్నాడు. తన ఆలోచనను, కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడి వారి అంగీకారం తో ఓ కే అనుకున్నాడు.
తన అభిప్రాయాన్ని రాజారాం, ప్రిన్సిపాల్ గారి కి తెలియచేశాడు. వారు రాము తిరిగి ఇండియా లో సెటిల్ అవుతాడు, తమ దగ్గరే ఉంటాడని చాలా ఆనంద పడ్డారు.
మిగిలినది ఎపిసోడ్ 13 లో
యడ్ల శ్రీనివాసరావు 12 June 2022.
No comments:
Post a Comment