Sunday, June 5, 2022

139. కళాశాల 1980 ఎపిసోడ్ -8

 

కళాశాల 1980

ఎపిసోడ్ -8



సీన్ -36


రాము కాలేజీ టూర్ లో చాలా సంతోషంగా గా ఉన్నాడు. ఆ రోజు శ్రీహరి కోట లో ISRO కి వెళ్లారు. అక్కడ మూడు రోజులు ఉండి, రాకెట్లు తయారీ, శాస్త్రవేత్తల పరిశోధనలు, శాటిలైట్ లు పని చేసే విధానం, రాకెట్ లాంచింగ్ ప్యాడ్, అవన్నీ చూస్తుంటే, కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రపంచంలో ఎంత పాత్ర పోషిస్తుందో తెలుసు కున్నాడు. పుస్తకాల లో థియరీ కి, నిజం గా జరిగే ప్రాక్టీకల్ కి ఉన్న తేడా అర్దం అవుతుంది.

ఇంకా అక్కడి నుండి తమిళనాడు లో తారాపూర్ అణు పరీక్ష కేంద్రం, ఇలా ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటూ, తాను కూడా ఏదైనా సాధించాలి అని సంకల్పం పెట్టుకుని, సంతోషంగా ఉన్నాడు. టూర్ లో బస్ లో ప్రయాణం చేస్తూ, ఈ సంతోషం విమలతో పంచుకుంటే బాగుండేది…. అయినా విమల ఎలా ఉందో, ఏం చేస్తుందో అని మనసులో అనుకుని…. విమల తన జీవితాన్ని ఎంతగా మార్చేసిందో అని తన ఇంటర్ కాలేజి రోజులను తలుచుకుని కళ్లు మూసుకున్నాడు.

అప్పటి కి టూర్ మొదలై పది రోజులు గడిచాయి. ఇంకా భారతదేశం అంతటా తిరగవలసింది ఇరవై రోజులు ఉంది.

*****

ఊరిలో విమల పెళ్లి కి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇంకొక వారం రోజుల్లో పెళ్లి. విమల పరిస్థితి ఏమీ బాగాలేదు. జీవచ్ఛవంలా ఉంది. సరిగా తినడం లేదు. బయటకు ఎవరికి చెప్పలేక, నరకం అనుభవిస్తుంది. తాను పెళ్లి కి అంగీకరించింది కానీ, రాము ని ఎలా వదిలి ఉండాలో తెలియడం లేదు. రాము ను తనే మొదటినుంచీ ఇష్టపడి ప్రేమించింది. రాము ను అనుక్షణం ప్రోత్సాహించేది. రాము కి తనపై ఇష్టం కలిగే లా చేసుకుంది. అలాంటిది ఇప్పుడు రాము భవిష్యత్తు కోసం తనను తానే వదులు కోవడం భరించలేక పోతుంది.

ఇంతలో పెళ్లి రోజు రానే వచ్చింది. విమల అప్పటికే ఏడ్చి ఏడ్చి ఉండడం వలన ఇక కన్నీళ్లు ఇంకి పోయాయి.

విమల పెళ్లి జరిగిపోయింది. చుట్టూ పక్కల వారు , ప్రిన్సిపాల్ గారు వచ్చారు. పెళ్లి చాలా సాధా గా విమల ఇంటిముందు తాటాకు పందిరి లో వారి స్తోమత కు తగినట్టుగా జరిగింది. ప్రిన్సిపాల్ గారు విమల ను ఆశీర్వాదించి , కవరు లో కొంత డబ్బులు పెట్టి ఇచ్చారు. విమల ముఖం లో పెళ్లి సంతోషం లేకపోవడం గమనించారు.

విమల పెళ్లి అయి అత్తారింటికి జగిత్యాల భర్తతో కలిసి వెళ్ళిపోయింది. విమల భర్త శేఖర్ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. విమల కంటే 8 సంవత్సరాల పెద్ద వాడు. చూడడానికి రంగు లేక పోయినా బానే ఉంటాడు. విమల ఇంట్లో అత్త, మామ, మరదలు ఉంటారు. వారి ఇల్లు, స్థాయి విమల వాళ్లకంటే కొంచెం మెరుగు. విమల అందం చూసి కట్నం లేకుండా చేసుకున్నాడు శేఖర్.

పెళ్లి తరువాత జరిగే కార్యక్రమలు మొదలైయ్యాయి. విమల కి తన ప్రమేయం లేకుండా ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. ఒకోసారి తాను బ్రతికి ఉన్నానా, చనిపోయానా అని తనను తాను ప్రశ్నించుకుంటూ, ఒంటరిగా తనలో తాను మాట్లాడుకుంటూ మానసికంగా చాలా బలహీనం అయిపోయింది. ఆ మానసిక బలహీనత,. దుఃఖం లో బొమ్మ లా ఎవరు ఏం చెపితే అది తలాడిస్తూ చేస్తుంది.

ఆ రోజు …. శేఖర్ విమల ల తొలి రాత్రి. విమల పాలగ్లాసుతో గదిలో కి వచ్చింది. శేఖర్ పట్టలేనంత సంతోషంగా ఉన్నాడు. విమల స్థితి చనిపోయిన శవం లా ఉంది. ఆ క్షణం లో రాము గుర్తు వచ్చాడు. కానీ విమలకి ఏడుపు దుఃఖం రావడం లేదు…ఎందుకంటే అప్పటికే తన మనసు శిధిలం అయిపోయి తనకు స్పందనలు లేని శిల లా అయిపోయింది.

శేఖర్ కేవలం ఐదవ తరగతి వరకే చదివాడు. వ్యాపార తెలివి, ఆలోచనలు తప్ప, మనుషుల గురించి ఆలోచించే తెలివి లేదు.

విమల రాగానే, తీసుకొచ్చి తన పక్కనే కూర్చొ పెట్టుకుని , భుజం పై చేతులు వేసి దగ్గరకి తీసుకున్నాడు.

విమల కి జీవితం లో తాను ఊహించిన సంతోషాలన్ని మండుతున్న నిలువెత్తు అగ్ని జ్వాలలు లాగ, ఆ జ్వాల లో తాను నిలబడి దహనం అయిపోతున్నట్లు అనిపిస్తుంది. ఆ రాత్రి తాను ప్రాణం లేని విగత జీవి లా తనను భర్తకు అర్పించుకుంది. కళ్లు మూసుకున్న ఆసమయంలో కూడా రాముతో గడిపిన చింతచెట్టు దగ్గర జ్ఞాపకాలు , అనుభవాలు విమల కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఆ మూడు రాత్రులు కాళ రాత్రులు లా గడిచాయి విమలకి.

శేఖర్, విమల ను బాగానే చూసుకుంటున్నాడు.


సీన్ - 37


రాము టూర్ పూర్తి అయ్యింది. హైదరాబాద్ వచ్చేసాడు. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్న ఆనందం లో ఉన్నాడు. విమల కి, ప్రిన్సిపాల్ గారి కి టూర్ లో విషయాలు అన్నీ ఉత్తరం రాసాడు. విమల కి చేరిన ఉత్తరం పోస్టుమేన్ గుమ్మం లో పడేసి వెళ్ళిపోయాడు. ప్రిన్సిపాల్ గారు రాము ఉత్తరం చదివి తిరిగి ఉత్తరం రాసారు. ఆ ఉత్తరం ఒక పది రోజుల తరువాత రాము కి చేరింది. ఆ ఉత్తరం లో ప్రిన్సిపాల్ గారు విమల పెళ్లి జరిగిన విషయం రాశారు.

ఉత్తరం తెరిచి చదువుతున్న రాము కి, చేతులు వణుకుతున్నాయి. కళ్లు బైర్లు కుమ్ముతున్నాయి. అసలు ఏమీ నమ్మలేకపోతున్నాడు. అంతా చీకటిగా కనిపిస్తుంది. తన విమల వేరే పెళ్లి తనకు తెలియకుండా, ఇంత అకస్మాత్తుగా చేసుకోవడం , కాలితో నేలను తంతూ, గట్టిగా అరుస్తున్నాడు. ఏడుస్తున్నాడు. అది చూసిన స్నేహితులు వచ్చి రాముని పట్టుకుని , ఏం రాము ఏమైంది అని అడుగుతున్నారు.

రాము …ఏం లేదు, నేను మా ఊరు వెళ్ళాలి అని చెప్పి వెంటనే బయలుదేరి వెళ్ళాడు.

సిరిసిల్ల వెళ్లగానే నేరుగా ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్లాడు. రాము ను చూసి

ప్రిన్సిపాల్ గారు : రాము ఏంటి ఇంత సడెన్ గా వచ్చావు. ఏమైంది ఎందుకు అలా ఉంది ముఖం. ఏం జరిగింది.

రాము : ఉత్తరం చూపిస్తూ… మీరు రాసిన ఉత్తరం…విమల కి పెళ్లి అయిపోయిందా…సార్…ఏడుస్తూ.

ప్రిన్సిపాల్ గారు : అవును రాము. విమల తనను కలవడానికి వచ్చిన విషయం, తను ఎందుకో బాధగా ఉన్న విషయం చెప్పాడు. నీకు పెళ్ళి గురించి తెలియపరచాలనుకుంటే నువ్వు టూర్ లో ఉన్నావు……అయినా ఏమైంది రాము అని అమాయకంగా అడిగాడు.

రాము : అయ్యొ…అంతా అయిపోయింది సార్.. అని కిందపడి తలకొట్టుకుంటూ ఏడుస్తున్నాడు రాము.

ప్రిన్సిపాల్ గారి కి ఏమి అర్ధం కావడం లేదు.

ప్రిన్సిపాల్ గారు : రాము…లే…ఈ మంచినీళ్లు తాగు…. రాము నీళ్లు తాగాక …చెప్పు రాము అసలు ఏం జరిగింది.

రాము : ఏడుస్తూ…. విమల తన జీవితాన్ని ఎలా మార్చిందో, వారి ప్రేమ జీవితం, పెళ్లి చేసుకోవాలని అనుకోవడం అన్నీ… ఏదీ దాచుకోకుండా చెప్పాడు, రాము.

ప్రిన్సిపాల్ గారు : రాముని అలా చూసి కంట నీరు పెట్టుకున్నాడు. అప్పుడు అర్థం అయింది ఆ రోజు విమల తన ప్రేమ విషయం చెప్పుదామని వచ్చినప్పుడు, తాను రాము గొప్ప తనం ఎదుగుదల గురించి చెప్పడం తో, రాము కెరీర్ కి తాను అడ్డు అవుతానని ఏదో చెప్పబోయి ఆపేసింది. అని మనసు లో అనుకున్నాడు…. పేరుకి మట్టి మనుషులే కానీ మాణిక్యాలు అనుకున్నాడు.

రాముని సముదాయించడం కుదరడంలేదు. ప్రిన్సిపాల్ గారు రాముని తీసుకుని మరుసటిరోజు హైదరాబాద్ బయలు దేరి వెళుతూ దారి లో, జరిగింది మరచిపోయి భవిష్యత్తు మీద దృష్టి పెట్టమని రాము తో చెపుతున్నారు. కానీ రాము కి అదేమీ చెవికి ఎక్కడం లేదు.

హైదరాబాద్ చేరాక హాస్టల్ లో దించి, చివరి సారిగా జాగ్రత్తలు చెప్పారు ప్రిన్సిపాల్ గారు.

అటునుంచి తన మిత్రుడు రాజారాం ఇంటికి వెళ్లారు ప్రిన్సిపాల్ గారు.

రాజారాం మిత్రుడి రాక చూసి…ఆశ్చర్యం గా…ఏరా ఏంటి ఇంత సడెన్ గా

ప్రిన్సిపాల్ గారు : ఏం రాజారాం…ఎలా ఉన్నావు…ఇంట్లో కి కూడా రానివ్వకుండా..అడిగెస్తున్నావు…అన్నాడు నవ్వుతూ..

ఆ రాత్రి భోజనాలు అయిపోయాక , మిత్రులు ఇద్దరూ మేడ మీదకు చేరుకున్నారు.

రాజారాం : హు…ఇప్పుడు చెప్పు..ఇంత సడెన్ గా వచ్చావు.

ప్రిన్సిపాల్ గారు : రాము కి జరిగిన విషయం అంతా పూర్తి గా చెప్పాడు. ఇందులో పాపం ఆ పిల్లల తప్పు కూడా ఏం లేదురా… పరిస్థితులు అలా ఉన్నాయి.

రాజారాం కి అంతా వింటుంటే…గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు.

ప్రిన్సిపాల్ గారు : రాజారాం, రాము పరిస్థితి ఏం బాగోలేదు. చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. తనకి కొంచెం మన సహకారం ఈ సమయంలో అవసరం. నువ్వు వారం వారం రాము ను కలిసి గైడ్ చెయ్యి…అన్నారు.

రాజారాం : సరే …అలాగే…చేద్దాం.

రాజారాం : నీకు విమల, రాము బాగా తెలుసు కదా. వాళ్లు ఎలా ఉండేవారు.

ప్రిన్సిపాల్ గారు : ఇద్దరూ కడిగిన ముత్యాలు రా. వాళ్లు కుటుంబ పరిస్థితులు బలహీనం గాని, వాళ్ల వ్యక్తిత్వం చాలా బలమైనది, ఆదర్శమైనది. అది నేను గ్రహించక పోతే , నీ వరకు నేను పంపించను కదా. అన్నాడు.

రాజారాం : ఆ మాట విని కొంత ఊపిరి పీల్చుకున్నాడు. …సరే నేను చూసుకుంటాను.

మరుసటి రోజు ఉదయం ప్రిన్సిపాల్ గారు సిరిసిల్ల వెళ్లి పోయారు.

రాజారాం మాత్రం ఆలోచిస్తున్నాడు… రాము మంచి వ్యక్తిత్వం గురించి…

మిగిలినది ఎపిసోడ్ -9 లో

యడ్ల శ్రీనివాసరావు 5 June 2022.








No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...