Wednesday, March 30, 2022

154. మేఘమా... వర్షించే మేఘమా

 

మేఘమా…వర్షించే మేఘమా


• మేఘమా …ఓ మే ఘమా….

• ఎందుకు ఆగావు…. దేనికి ఆగావు.

• సాగే నీ పయనం….సంతోషాల రాచబాట.

• నడిచే నీ మార్గం ….ఆనందాల పూలతోట.


• మేఘమా …ఓ మే ఘమా….

• ఎందుకు ఆగావు….దేనికి ఆగావు.

• చూడు ఇటు చూడు…తల దించి చూడు.

• ఈ భూమి ఎంత బంజరో …

• ఈ నేల ఎంత కరువైనదో…


• ఇది చూసిన నీకు…

• జాలితో కరగాలనిపిస్తుందా….

• శ్యామలం చేయాలనిపిస్తుందా.

• అవును కదా…నిజమే కదా.


• మేఘమా …ఓ మే ఘమా….

• ఎందుకు ఆగావు…ఇచట దేనికి ఆగావు.

• కరగడమంటే  అర్పించు కోవడం.

• శ్యామలమంటే జన్మకు సార్థకం.

• ఎందుకంత త్యాగం….ఆలోచించావా….

• ఆలోచించావా.


• బంజరు కి  మేఘమంటే  ప్రాణం.

* కరువు కి  మబ్బులంటే లావణ్యం.

• కరిగి పోతే….ఇది నీకు ఆఖరి మజిలీ. 

• ఒదిగి పోతే...నీ తోటి మేఘాల మాటేమిటి.


• మేఘమా …ఓ మే ఘమా….

• ఎందుకు ఆగావు….ఇచటే ఎందుకు ఆగావు.

• నీ రూపం సుందరం…

• నీ స్వరూపం చల్లదనం….

• ఇది చాలు ఈ బంజరు భూమి కి.

• మేఘమా…నీ గమ్యం సుందర గమనం.


యడ్ల శ్రీనివాసరావు 31 మార్చి 2022, 5:00 am.



153. మనిషి లోని నిజం

 

మనిషి లోని నిజం


• మనిషి జననం తో రోదిస్తూ కనులు తెరిచావు. “మతిమరుపు” అనే ఔషధం తో,  ఆది అంతం తెలియకుండా జీవిస్తున్నావు.

• జీవనం అంటే ప్రకృతి వనములో గల పంచభూతాల తో కలిసి ఉండే, సెలయేరు లు, వృక్షాలు, పశుపక్ష్యాదులు, సమస్త జీవకోటి.

• “జీవితము”…ఆమోద్యయోగమైన , అంగీకరించబడిన విధానము.

• ఓ మనిషి….మరి నేటి కాలంలో నీ యొక్క జీవనం లోని జీవితం ఎలా, ఏ దిశలో సాగుతుంది. ఏ విధంగా ఉంది.

• నీ మోహం ఎటు మరలుతుంది. ఉక్కు సంకెళ్ళ సాధనాలను ఊపిరి గా చేసుకుని ఊరేగే నీకు …. నేడు సహజసిద్ధమైన ఊపిరే కరువు అవుతుంది. ఇది ఏ జీవనమో…ఏ జీవితమో ఆలోచించి చూడు ఒకసారి.


• భోగాలు, భాగ్యాలు అనుకునే భౌతిక సాధనాలు,  నీ దేహాన్ని దహియించే భోగిమంటలు.

• అబద్ధాన్ని ఆస్వాదిస్తూ…. నిజాన్ని అంగీకరించ లేక జీవిస్తూ ఉన్నావే  అదే  “మాయ”.

• శాశ్వతం కాని అద్దె ఇంటికి ఎన్ని రంగులు వేసినా, ఎన్ని మెరుగులు దిద్దినా నిరుపయోగం. మరి అద్దెకు వచ్చిన నీ శరీరం పై,  నీకు ఇంత వ్యామోహం ఎందుకు. నీ సొంత ఇల్లు పరమాత్ముని సన్నిదైన పరంధామము….చూడు , అటు చూడు ఒకసారి , నీ కోసం వజ్రతుల్యమైన విశేషములు ఎన్నో ఎదురు చూస్తున్నాయి అక్కడ. కానీ శ్రేష్టమైన, శుద్ధమైన ఆత్మ తోనే నీ సొంత ఇంటి లోనికి అడుగు పెట్టాలి. ఎందుకంటే నీ సొంత ఇల్లు చాలా పవిత్రమైనది.


• ధర్మ అర్థ కామ మోక్షాలే,  నీ ఇహ లోక జీవితానికి నాలుగు స్తంభాలు.

• ధర్మం ఆచరించినపుడు ( స్థితి, పరిస్థితి ని బట్టి ధర్మం మారుతుంది) అర్దం (ధనం) చేకూరుతుంది. కామము అంటే సహేతుకమైన కోరికలు తీరి, మోక్షం (ఇహ లోక జీవన ముక్తి, జ్ఞానం ) లభిస్తుంది.

• బాధ్యతలను నీవు ఎప్పుడు బరువు తో, భారంతో మోయవలసిన అవసరం లేదు…. ఎందుకంటే పరమాత్మకు తెలుసు , ఏ భాధ్యత ఎప్పుడు, ఎలా, ఎవరికోసం నిర్వర్తించాలో….ఆ బరువు, భారం లేకుండా ఆ బాధ్యతను పరమాత్మే నీ నుంచి నిర్వర్తింప చేస్తాడు. నీ పని మాత్రం ఒకటే ధర్మాచరణ.

• జననమన్నది రోదన, మరణమన్నది యాతన….మరి నడి మధ్యన ఉన్నది అంతా సుఖమా? సంతోషమా? శాశ్వతమా?

• నువ్వు అనుకునే శరీరం శాశ్వతం కానే కాదు…. నువ్వు అనుకునే ఆత్మ మాత్రమే శాశ్వతం…మరి ఎందుకని గుర్తించవు నీ వొక ఆత్మవని.

• జననం మరణం రెండు ఒక్కటే. శివ అంటే శుభం. శివుని లోనే శవం ఉంది.

• భోగం అంటే పరమాత్మ సన్నిధి…భాగ్యం అంటే శాంతి. అనగా భోగభాగ్యాలు అంటే పరమాత్మ సన్నిధి లో లభించే శాంతి.

• విరక్తి లోనే శాశ్వతమైన రక్తి ఉంది.

• ప్రకృతి ని మరచి, ప్రకృతి ని హింసించి నీ కంటూ సాధనాల సామ్రాజ్యం నిర్మిస్తున్నావు. చివరికి ప్రకృతి విలయతాండవం లో కలిసి పోతున్నావు. దీనికి సమాధానం ఆలోచించి చూడు. భగవంతుడు ప్రకృతి లో నే నిన్ను సృష్టించాడు, ప్రకృతి పై ఆధారపడి జీవించమన్నాడు కానీ ప్రకృతి ని హింసించి జీవించమన లేదు.


• అవసరమును మించినది, శక్తి కి మించినది ఏదైనా భారమే, ప్రమాదమే…..నీ లో నువ్వు ఆలొచించి చూడు , నీతో నువ్వు మాట్లాడి చూడు నిజమో కాదో తెలుస్తుంది. నిజం తెలిసి నా అంగీకరించలేవు. ఎందుకంటే మాయ చాలా శక్తివంతమైనది. నిన్ను అంత వేగంగా మారనివ్వదు. ……నీ అంతర్మధనం లో అనాదిగా దాగి ఉన్న కొన్ని ప్రశ్నలకైనా ఈ రోజు నీకు సమాధానము దొరికింది….కదా.


యడ్ల శ్రీనివాసరావు , 30 మార్చి 2022 6:00 pm.



Tuesday, March 29, 2022

152. పెళ్లి

 

పెళ్లి



• తకదిమి తకదిమి బాజాలే మోగుతు ఉన్నాయి.

• సరిగమ సరిగమ సన్నాయిలు ఆడుతు ఉన్నాయి.


• ఊరంత పందిరి తో…

• ఇల్లంతా తోరణాలై ...

• పచ్చదనపు ముస్తాబు లతో…

• పలకరింపు ఆప్యాయత లతో…

• పెళ్లి శోభ పులకరిస్తుంది.

• కన్నులకు పండుగ నిస్తుంది.


• పూలమాలల పరిమళాలతో పెళ్లి పందిరి ఇంద్రలోకం ను మరిపిస్తూ ఉంటే...

• కాంతి దీపాల ప్రకాశం హరివిల్లు ను తలపిస్తూ…

• ఆకాశం లో తారలకు ఆహ్వనపు పిలుపు నిస్తుంది.


• అగ్ని సాక్షిగా వేద మంత్రాలు స్వర్గము చేరుతు ఉంటే…

• దేవతలందరూ అరచేతితో ఆయుషు ను అక్షతలుగ చేసి ఆశీర్వదిస్తున్నారు.


• వధువరులను చూసి ముచ్చట గా వరుణుడు వరదానం ఇస్తున్నాడు…

• చల్లని గాలి తో , సన్నటి చినుకులను తలంబ్రాలు గా పోస్తున్నాడు.


• పారాణి పాదాలు అడుగు లో అడుగు వేస్తుంటే…

• యువరాణి గృహరాణి గా మారుతు ఉంటే, గృహమే కదా స్వర్గసీమ.


• జనన మరణాల మధ్య ఒక జన్మకు జరిగే పండుగ పెళ్లి…

• ఒక జన్మకు సరిపడ తోడు…. మరు జన్మకు సరిపడ నీడ.

• ఈ పండుగ…

• ఎందరికి నిండు…ఎందరికి మెండు.


• మనుషుల ను ముడి పెడితే…

• మనసులు ముడిపడుతున్నవా లేక తడబడుతున్నవా.

• మనసులు ముడిపడితే ఏకం….తడబడితే ఏకాకులం.


• ఆడించెడు వాడు ఈశ్వరుడు అయితే…

• ఆడే బొమ్మల మే  కద.

• జగన్నాటక సూత్రధారి వైకుంఠ వాసి…

• నటన నేర్పే నటరాజు కైలాస వాసి.


యడ్ల శ్రీనివాసరావు 30 మార్చి 2022 , 5:00 am.





151. పట్నం పోయానే... పిల్లా

 

పట్నం పోయానే... పిల్లా



• పట్నం పోయానే….

• పిల్లా…పట్నం పోయానే.

• పట్నం పోయి….

• పల్లెకు వస్తూ...పట్టీలు తెచ్చానే.


• నీకై పట్టీలు తెచ్చానే….

• పిల్లా…పట్టీలు తెచ్చానే.


• నీ కాలి కోసమే

• మువ్వలు కలిగిన పట్టీలు తెచ్చానే.

• నీ పాదాలకు చుట్టీ

• నీ అరచేతులు పట్టే

• సంబరానికై పట్టీలు తెచ్చానే…

• వెండి పట్టీలు తెచ్చానే…

• పిల్లా పట్టీలు తెచ్చానే.


• పట్నం పోయానే…

• పిల్లా….పట్నం పోయానే.

• పట్నం లోని సంతకు పోయి….

• గాజులు తెచ్చానే…

• పిల్లా…. నీకై మట్టి గాజులు తెచ్చానే.


• గాజులు తెస్తూ….

• దారిలో వస్తూ….

• గుసగుసలే విన్నానే…..

• పిల్లా గాజుల గుసగుసలే విన్నానే‌.


• సంచిలో ఉన్న....గాజులు అన్నీ….

• గుసగుసలాడుతూ

• సింగారానికా..…అంటూ ఉంటే

• ముసిగా నవ్వా నే….

• పిల్లా….ముసి ముసి గా నవ్వా నే.


• పట్నం పొయానే

• పిల్లా…పట్నం పోయానే…

• పట్నం పోయి దారిలో వస్తూ

• మల్లెలు కొన్నానే…

• నీ సిగలో కొప్పు కి….

• మల్లెలు తెచ్చానే.


• పట్నం పోయానే….

• పిల్లా…పట్నం పోయానే.

• పట్నం పోయి….

• పల్లెకు వస్తూ….

• పరికిణీ తెచ్చానే….

• పిల్లా…పచ్చటి పరికిణీ తెచ్చానే.


• పరికిణీ కట్టి….

• మల్లెలు పెట్టి….

• పట్టీలు చుట్టీ.…

• గాజులు వేసి….


• సినిమా కి పోదామే.…పిల్లా

• సినిమా కి పోదామే.

• సినిమా చూసి…సోడా తాగి

• ఇంటికి పోదామే…పిల్లా

• చెట్టా పట్టాల తో ఇంటికి పోదామే.


• మరు జన్మ కి సరిపడా సంతోషాలను

• మూటలు కడదామే…పిల్లా

• మాటలతో మూటలు కడదామే.


యడ్ల శ్రీనివాసరావు 23 మార్చి 2022, 2:00 pm.




150. జీవన శూన్యం

 

జీవన శూన్యం 



ఇటీవల బంధువుల అబ్బాయి చేసుకున్న అంశం, నా  పై విపరీతమైన ప్రభావం చూపించింది. చిన్న వయసులోనే ఇలా జరగడం ఎవరికైనా చాలా బాధాకరం. బహుశా కొంతమంది కి , తమ జీవితకాలంలో ఏదొక వయసు లో, ఏదొక సమయం లో, ఏదొక సమస్య వలన, జీవించడానికి తనకున్న శక్తి సరిపోక ఇటువంటి ఆలోచన కలుగుతుందేమో ….. అటువంటి వారికి అంకితమిస్తూ 🙏…. ఇది చదివిన వారికి , ఇసుక రేణువంత మార్పు ఆలోచన లో రాక పోతుందా…. అనే ఆశతో …పరమేశ్వరుడు రాయి స్తున్న రచన ఇది.🙏


• రెండు పదులు నిండకనే…

• నీ రెండు కాళ్ళుకు రెక్కలు వచ్చేనా.

• ఎందుకంత ఆరాటం…

• ఎందుకంత ఆవేశం.


• తమ ఊపిరి నే నీ రూపం గా జీవిస్తున్న…

• నీ తల్లి తండ్రులకు నీ విచ్చిన బహుమానం పేరు కడుపు కోత.

• ఏం….ఏమంత బరువై పోయింది ఈ లోకం నీకు.


• నీ పిరికి తనం తో నిను నమ్ముకున్న వారిని…

• పిరికి వారిగా చెయ్యాలనుకున్నావా….

• లేక పిచ్చివారిగా చూడాలనుకున్నావా


• నీ మనసు లో గుప్పెడంత బాధని భరించలేని వాడివి…

• బండెడంత శోకం తో నీ శరీరాన్ని ఎందుకు హింసించుకున్నావు.

• భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని కాలరాసే హక్కు నీకెక్కడిది..


• ఆత్మ ను సంరక్షించు కోవాలిసింది పోయి ఆత్మను హత్య చేస్తావా…

• హత్య చేసే హక్కు నీ కెక్కడిది.


• కూడు గూడు లేని చిన్న చిన్న పక్షులు కూడా ప్రకృతి తో పోరాటం చేస్తూ ఆహారం కోసం ఆనందంగా, ధైర్యంగా తిరుగుతూ ఉంటాయి…

• చిన్న పక్షి సరి సాటిది కాదా నీ జీవితం.


• నేటి లోకం లో ఏ మనిషైనా బ్రతాకాలంటే….బ్రతుకుతూ ఉండాలి అంటే…

• బాధలే బంగారం…

• అవమానాలే అందం…

• ఛీత్కారాలు చప్పట్లు…

• ధృడంగా నిలబడాలి అంటే వీటిని ప్రేమించడం నేర్చుకో…


• ఒకరికి మానసికంగా భయపడుతూ ఉంటే….

• నీ వెనుక దాగి ఉన్న వెన్ను కూడా నిన్ను చూసి చీదరించుకుంటుంది.

• ధైర్యం తో బ్రతకడం నేర్చుకో….

• బ్రతుకుతూ నలుగురిలో ధైర్యం నింపడం తెలుసుకో.


• నువ్వేంటో ఈ ప్రపంచానికి పరిచయం అవ్వాలి అంటే ధైర్యంగా నిలబడాలని తెలుసుకో….నీ కంటూ రాబోయే కాలం కోసం ఓర్పు సహనం తో ఎదురు చూడు.


• ఈ సృష్టి లో పగలు రాత్రి, చీకటి వెలుగు ల ప్రాముఖ్యత సరి సమానము…

• మానవ జన్మ లో సంతోషం దుఃఖం, కలిమి లేమి కూడా సరి సమానమే.


• ఆత్మతో చూడు నీ వారు అందరు నీ కోసం ఎలా తపిస్తున్నారో….

• అయినా చూసి ఇప్పుడేం చెయ్యగలవు నీకు శరీరం లేదు కదా.


• ఎవరో ఏదో అన్నారని…

• అనుకున్నది జరగలేదని…

• ప్రేమలు సఫలం కాలేదని…

• అప్పులు తీర్చలేక పోయామని…

• పరీక్షలు ఫెయిల్ అయ్యామని…

• ప్రతీది ఒక సమస్య గా అనుకుంటే…

• నీ పుట్టుకకు అర్దం ఏముంది.


• ఒకసారి ఆకాశం వైపు చూడు , దాని వైశాల్యం లెక్క గట్టగలవా….

• నీ ఆలోచన కూడా ఆకాశమంతా విశాలంగా ఉంటే నీ లో ఉన్న సమస్య నీకు దుఃఖం కలిగించదు. సరికదా పరిష్కారం చూపిస్తుంది.

• కష్టానికి, సుఖానికి…పాపానికి, పుణ్యానికి నీ కంటు ఒక సరియైన తోడు పెట్టుకో…ఆ తోడుకు పేరు అంటూ ఉండక్కర్లేదు…. కేవలం నమ్మకం ఉంటే చాలు.

• మాసిన బట్టలు విప్పినంత సులువు కాదు …శరీరం విడిచిపెట్టడం.

• చనిపోవాలని నీకు బలంగా అనిపిస్తుంది అంటే….ఆ క్షణాలు, ఆ సమయం, ఆ రోజు నీది కాదు.

• ఒంటరితనాన్ని వదిలి పెట్టి , నీ తోడు తో కాలక్షేపం చెయ్యి….

• నీ వైన క్షణాలు, నీ దైన సమయం, నీ దైన రోజు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కాలక్షేమాన్ని ఇస్తాయి.


యడ్ల శ్రీనివాసరావు 29 మార్చి 2022 12:30 pm.




Sunday, March 27, 2022

149. స్వర్ణ కమలం

 

స్వర్ణ కమలం


• స్వర్ణమా….నా సువర్ణ మా…

• నీ అరచేతుల దోసిలి తో…

• అమృతమే పోసిన కమల మా…

• నా స్వర్ణ కమల మా.


• నందము అంటే నీ మోము అంటూ…

• ఆనందమే చెపితే  నేనేమీ అంటా.

• స్వర్ణమా….నా సువర్ణ మా.


• నీ చేతి స్పర్శ…నా జన్మ కి హర్షం.

• నీ కంటి భాసే….నా లిపి కి శ్వాసై.

• నీ రెప్పల ఊసే….నా గొప్ప కి ఆశై.

• స్వర్గము నే మరిచానే…

• ఆత్మ నై ఉన్నానే…

• స్వర్ణమా…నా సువర్ణ మా.


• నీ మాటల మంత్రం తో…

• పుష్పాలను వేసి.

• నీ నవ్వుల తంత్రం తో…

• మాలలు గా చేసి.

• ఆ యుగము ను కాస్త…

• స్వర్ణ యుగమే చేసావు.

• స్వర్ణముఖి.…నా సువర్ణ ముఖీ.


• ఏ జన్మలో కలిసామో…

• ఏమని అనుకున్నామో.

• నీ ప్రేమ ను పొందక…

• అర్థాంతరమై నేను…

• ప్రాణాన్ని వదిలాను.

• శేషం గా ఉన్నాను.


• స్వర్ణమా…నా సువర్ణ మా.

• ఈ జన్మలో నిను కలిసై నా…

• నేనెవరిని చెప్పే నా…

• నీ ప్రేమను పొందే నా…

• ప్రాణం తో ఉండే నా…

• సశేషం  అయ్యే నా.


• స్వర్ణమా….నా సువర్ణ మా.

• నేనంటూ నిజమైతే...

• నా కంటూ నువ్వుంటే.

• నా ప్రేమ అంటూ నిజమైతే…

• నా కోసం వస్తావు.

• ఈ యుగము ను కాస్త…

• స్వర్ణయుగము నే చేస్తావు.


• స్వర్ణమా….నా సువర్ణ మా.

• నీ అరచేతుల దోసిలి తో…

• అమృతమే పోసిన కమల మా…

• నా స్వర్ణ కమల మా.

• కలవాలని ఉందే…

• నిను కలవాలని ఉంది.

• విడవాలని ఉంది.

• నీ ఒడిలో శ్వాసను…

• విడవాలని ఉంది.

• నా తుది శ్వాస ను…

• విడవాలని ఉంది.


యడ్ల శ్రీనివాసరావు 27 మార్చి 2022 3:30 pm.

నందము = ప్రీతి, సంతోషం.

హర్ష = సంతోషం.

శేషం = ఇంకా మిగిలి , Balance

సశేషం = పూర్తి అయ్యింది, Fulfillment.





Friday, March 25, 2022

148. అక్క – సోదరి – సహోదరి

 

అక్క – సోదరి – సహోదరి


• అక్క  అంటూ   ఉంటే

  నాకంటూ   ఉంటే.

• అక్క  అంటూ  ఉంటే

  నాకంటూ   తోడుంటే.

• నే   వేసే  అడుగుకు  

  నీడై   నను  తాకేది .

• అక్క అంటూ  ఉంటే

  బాల్యమే  గారం  అయ్యే

  నా బాల్యమే   ప్రేమ  రాగం  అయ్యే.


• అన్నా చెల్లెళ్ల  ... అక్కా తమ్ముళ్ల  బంధం 

  ఎంత  బలమో   బాల్యానికి  ఎరుక

  ఒక్క  బాల్యానికే   ఎరుక.


•  అక్కా ...

   మన రూపం వేరయినా

   మన వర్ణం    వేరయినా

   మన భేదం    వేరయినా

   మన రక్తంలో నే   ఉన్నారు...

• అమ్మ నాన్నలు  ఉన్నారు...

   సజీవ మై  పెనవేసుకొని   ఉన్నారు.


• సోదరి   అంటే    సహా దరి   అని ...

  సహా దరి   అంటే   వెన్నంటి  ఉండెడిది  అని.

• సోదరి   అంటే    సహా ఉదరి  అని …

  సహా ఉదరి  అంటే   హృదయమునకు  తోడు అని.

• ఎవరికి   తెలుసు    ఎందరికి  తెలుసు.

  ఎవరు లేని నాకే     ఎందుకు తెలుసు.


• అక్క అంటూ  ఉంటే 

  నాకంటూ ఉంటే

• నేలన   ప్రాకే   వయసు న 

  నా చేతికి   చెయ్యందిస్తావు.

• అమ్మ  కాని   అమ్మ వై

  అమ్మను  నీలో   చూపిస్తావు.

• అమ్మ లేని   నాడు   తుదకు

  అమ్మ వే   అవుతావు.

• నాకు  అమ్మ వే  అవుతావు.


• అమ్మానాన్నల   సంతోషాలకు

  ప్రతి రూపాలుగా   మనమై  ఉంటే.

• మన   లోని   సంతోషాలకు 

  మన  బాల్యమే   నిదర్శనము.


• నాటి  మన   బాల్యము   నేడు లేదు

  కానీ,  

  నాటి సంతోషం    నేడు  మనలో ఉందా.

• అమ్మ నాన్నలు   ఉన్నారు

  మన రక్తం లో    ఇంకా   జీవిస్తూ  ఉన్నారు

• మనం ఉన్నంత వరకు 

  మనతో నే   మనలో నే  ఉంటారు … కద అక్కా.


• అక్క  అంటూ  ఉంటే

  నాకంటూ  ఉంటే.

• అక్క   అంటూ  ఉంటే

   నాకంటూ  తోడుంటే

• నా జీవితమే  బంగారం  అయ్యే

  ప్రేమ గారం  అయ్యే.

• ఎన్ని  బంధములు   తోడై  ఉన్న

  రక్త సంబంధము   ఒక  సాక్షిభూతం.



యడ్ల శ్రీనివాసరావు 25 మార్చి 2022 , 11:00 pm.








147. ఎద మది

 

ఎద మది


• పద పద మని పరుగులు పెడుతూ

• ఎద వదలని మదిని వెతుకుతూ

• జర జర మని జలము లా జారుతూ

• తుది ఎరుగని మనసుకు చలనం


• గతి తెలియని ఎద

• జగతి లో జన్మ జన్మలు గా జత కోసం

• శృతి తెలిసిన సొద

• కమ్మగా తలచి వలచి పిలచి

• గిరులు‌ కొడుతుంటే


• కనులు కంట నీరు ఇంకి రకతం

• రాయిలాగ మారిన వేళ

• కదము తొక్కి కవితలన్ని నాలో

• నాట్యమాడే వేళ


• పద పద మని పరుగులు పెడుతూ

• ఎద వదలని మదిని వెతుకుతూ

• జరజరమని జలములా జారుతూ

• తుది ఎరుగని మనసుకు చలనం


• అలసి సొలసి బిగిసిన ఎదకి

• మంచు లాగా మది చేరువ కాగా

• తలపు లోని ఊహవు నీవై

• తపన  తో   నే జపము చేసానే


• ఎద ఎవరి దని చూస్తే ...

• ఎద లో ఉన్నది……నేను


• మది ఎవరి దని చూస్తే …

• మది లో ఉన్నది…. నీవు.


• నిన్ను నే నెరిగి ఉన్నా

• నన్ను నీ వెరిగి ఉన్నా


• గుండె , గూడు చెదిరి శూన్యమై నే ఉన్నా


• నా ఎద నీ మది కోసము అని

• నీ మది నా ఎద కోసమే అని

• తెలియలేదే….తెలియలేదే…తెలియలేదే.


యడ్ల శ్రీనివాసరావు 25 March 2022 , 2:00 pm.





Wednesday, March 23, 2022

146. శివ బాబా _ ఓం శాంతి

 

శివ బాబా…‌ఓం శాంతి



• బాబా…శివ బాబా…

• బాబా…శివ బాబా.


• చింతలతో చేరిన నీ చెంతకు…

• చిరునవ్వు తో చూస్తావు.

• మాపై చిరు హాసం కురిపిస్తావు.


• బాబా…శివ బాబ…

• బాబా…శివ బాబా.


• చలి చీమల వంటి మాకు…

• చలనము లో తోడై…

• గమనము లో నీడై…

• నడిపిస్తూ ఉంటావు.

• మా ఆత్మలకు తోడు నీడై ఉంటావు.


• అనుభూతులు కే గాని ఆహర్యానికి …

• అందని రూపం …నీ స్వరూపం.


• ఆప్యాయత లో తండ్రివి అయ్యావు.

• అనురాగం లో అమ్మవి అయ్యావు.

• గమనము లో గురువువి అయ్యావు.


• బాబా…శివ బాబా…

• బాబా….శివ బాబా.


• దుఃఖము పై దుందుభి వాయిస్తూ…

• ఆనంద మనే ఆయుధం ఇస్తూ…

• పిల్లలు కు రక్షకుడివై ఉన్నావు…

• నీ ఈ చిన్ని పిల్లలకు…

• సంరక్షకుడివై ఉన్నావు.


• మము నీ లాలన లో ఉంచు…

• నీ పాలన లో పెంచు…

• మా చింతలను చెరపి…

• నీ చెంతను ఉంచు.


• ఇక మిగిలినది స్మరణే….

• నీ నామ స్మరణే.

• మా పై కలుగునది దానమే…

• వరదానమే.

• బాబా…శివ బాబా...

• బాబా…శివ బాబా.

• ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 24 మార్చి 2022. 9:00 am .





Friday, March 18, 2022

145. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

 

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః


• నాథాయ నాథాయ గణనాథాయ.

• నాధులచే స్మరణ చేయబడు ఆదిదేవ పుత్రాయ.


• ఇంద్రాది దేవతలు ప్రణమిల్లే శివపుత్రాయ.

• తల్లి పార్వతి కి నీవు అపురూపమై….

• తోడ నిన్ను కలిగి ఆనందముతో ఉండే.


• జావళి తో జలకమాడే జగజ్జనని కి , నీవు రక్షకుడివై ఉంటే.

• తండ్రి ముక్కంటి కి , నీవెవరో అనకుండే….

• అడ్డగించిన నీకు ఆక్షేపణ మయ్యే.


• తండ్రి సంధించిన శిరస్సు చూసి తల్లడిల్లె,  నీ తల్లి పార్వతి దేవి.

• తప్పు తెలిసిన తండ్రి, గజరాజ శిరసు ను ఆవిష్కరించే…


• గణములకు నిన్ను అధిపతిని గాంచిన గణనాధాయ.

• ఏకదంతాయ…వక్రతుండాయ…బుద్ధి త్రిలోచనాయ.


• సర్వజన సర్వ స్త్రీ పురుష ఆకర్షణాయ, కలికల్మష నాశానాయ.

• సర్వ విఘ్నములు నీ పాదమున మోకరిల్లే….

• సర్వేశ్వర పుత్రాయ, కేతు గ్రహ పాలకాయ.


• మూషికమున నీవు ముల్లోకములను ఏలే….

• ముక్తి వరప్రదాయ, శ్రీ గణేశాయ.

• అది దేవుని చేరుటకు అనుమతి ని ఇచ్చే….

• దేవదేవుడివైన నీకు ప్రణామము….

• ఆత్మ ప్రణామము.


నాధుడు = మహర్షి, ముని.

జావళి = మధురమైన గీతము.

జగజ్జనని = పార్వతి దేవి.

గణములు = దేవతగణం, రాక్షసగణం, మనుష్యగణం, సృష్టిలో సమస్త బుధ్ధి.


యడ్ల శ్రీనివాసరావు 19 మార్చి 2022, 10:00 am.





144. రంగుల హోళీ - రంగేళి

 రంగుల హోళీ - రంగేళి


• రంగులు కలబోసిన నా రతనాల వల్లి.

• ముంగురులు విరబూసిన నా ముత్యాల మల్లి.

• అంగురుల లయలతో వీణను మీటే ఆనందవల్లి.

• వంకరల నడుమ వయలతో హొయలాడే నా విరజాబిల్లి.

• చింపిరి చూపుల చారు చామంతుల చిన్మయవల్లి.

• హరివిల్లుని నీ హసముతో దారణ చేసే నా కల్పవల్లీ.

• సుందర మందర అందర వందర సౌందర్య వల్లి.

• రంగు రంగుల రంగవల్లి…నా రంగేళీ‌.

• ఆనందాల హేలా హేలీ.

• ఇదే ఈ వసంతాన నీకు .....నా అక్షర హోళీ.



అంగురుల = చేతి వేళ్ళ చివరి

చింపిరి = రుసరుసలాడుతూ, బిరుసుగా.

చారు = మనోహరమైన.

దారణ = చీల్చు 

మందర = ప్రకాశవంతమైన.

అందర = లోపల, అంతరంగం.

వందర = small fragment, తునక, చిన్న


యడ్ల శ్రీనివాసరావు , 18 మార్చి 2022, 1:40 pm.






Thursday, March 17, 2022

139. కళాశాల 1980 ఎపిసోడ్ -4

 

కళాశాల 1980

ఎపిసోడ్ -4



   సీన్ – 24


రాము ఎక్కిన బస్ హైదరాబాద్ నుంచి సిరిసిల్ల చేరుకుంది. బస్ దిగి ఊర్లో కి అడుగు పెట్టగానే రాము చిన్న పిల్లాడిలా ఎగిరి గంతులు వేస్తూ, చాలా రోజుల తర్వాత ఊరు చూసిన ఆనందంలో , ఉత్సాహం తో ఉరకలు వేస్తూ , రెండు చేతులతో సంచులు మోస్తూ , ఇంటికి వస్తున్నాడు.

దారిలో రాము ను చూసి , కొందరు ఆపి ఇంటర్ రాంక్ వచ్చి నందుకు, పేపర్ లో రాము ఫోటో వేసినందుకు, ఊరికి మంచి పేరు తెచ్చాడని అభినందిస్తున్నారు.

రాము ఇంటికి రాగానే, తల్లి ఒక్కసారిగా పరుగున వచ్చి

రాము తల్లి : ఎంత సిక్కిపోయావు…రాము…ఎలా ఉన్నావు రా…ఎన్నాళ్ళయిందో బిడ్డని చూసి….. పరిచ్ఛ బాగా రాసావా….. పోయి కాళ్లు సేతులు కడుక్కు రా….అన్నం తిందువు గాని…..

రాము : సరే అమ్మా.

అక్కడే ఉన్న రాము తండ్రి…. రాము ని చూసి గొప్పవాడు అవుతున్నాడని…. లో లో సంతోషిస్తున్నాడు.

రాము కంగారుగా అన్నం తినేసి…సైకిల్ తీస్తున్నాడు…. ఊరిలోకి వెళ్లడానికి.

రాము తల్లి : ఎక్కడికి రా….ఇంత మధ్యాన్నం…సూరీడు కాలి పోతుంటే….

రాము : మరి…. ప్రిన్సిపాల్ గారిని కలిసొత్తా….

రాము తల్లి : ఆనక…సల్లబడ్డాక పో…ఈ ఎండలో ఎందుకు…

రాము , తల్లి చెప్పిన మాట వినకుండా …సైకిల్ తొక్కుతూ …. తిన్నగా విమల ఇంటి ముందు కి వచ్చి, సైకిల్ బెల్ మోగించి మోగించి కొడుతూ…అటు ఇటు ఆ వీధిలో రెండు సార్లు తిరిగాడు. నిద్రపోతూ , ఆ సైకిల్ బెల్ శబ్ధం విన్న విమల ఒక్కసారిగా లేచి, ఇది కలా…నిజమా…అని కళ్లు తుడుచుకుంది…. ఇంతలో సైకిల్ బెల్ మళ్లీ మోగింది…..ఇక విమలకి అర్థం అయిపోయింది, తన రాము యే అని…. వెంటనే ఇంటి లో నుంచి బయటకు పరిగెత్తింది……రాము బయట నిలబడి సైగ చేసాడు…చింత చెట్టు దగ్గరకు రమ్మని….

విమల వెంటనే సైకిల్ మీద చింత చెట్టు దగ్గరకు వచ్చింది.

సుమారు 60 రోజుల తర్వాత ఎదురు పడిన విమలను చూస్తూ ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నాడు రాము.

విమల, రాము కళ్లల్లో కి చూస్తూ…. పట్నం వలన వచ్చిన మార్పులు చూసి …కొత్తగా , వింతగా , కళ్లు ఆర్పకుండా చూస్తుంది.

రాము : విమల కళ్లల్లో కి చూస్తూ…. చిటికె వేస్తూ…వోయ్…విమల…విమల…నిన్నే…. ఏం.. నేను ఎవరో తెలియడం లేదా….

విమల : ఒక్కసారిగా ఈ లోకంలో కి వచ్చి …రాము…ఎంత మారిపోయావో…అసలు నువ్వేనా….ఈ బట్టలు ఎంత బాగున్నాయో…. అని తన చేతులతో రాము భుజాలను సంతోషంగా, స్వతంత్రం గా కుదిపెస్తుంది.

రాము : హ..… ఎస్….నేనే…రాము ని అని ఆనందంగా ఫోజు కొడుతూ, రాని మీసం మీద చెయ్యి పెట్టి తిప్పుతున్నాడు.

విమల : అబ్బో…చాల్లే…సంబరం…అని రాగం సాగదీసి …చెవి మెలి తిప్పింది.

రాము : ఆ…ఆ…చెవి వదిలెయ్…ఏదో సరదాగా విమల.

ఇద్దరూ కింద కూర్చున్నారు…. సరదా గా కబుర్లు చెప్పుకుంటున్నారు. రాము ఈ రెండు నెలలు ఎలా గడిచిందో…రాజారాం గారి కుటుంబం, భార్య, శైలజ తనను ఎలా ఇన్నాళ్లు చూసారో, తను వారితో సినిమా కి వెళ్లిన విషయం , ఇంత కాలం విమల ను గుర్తు చేసుకున్న సందర్భం, తన చదువు గురించి , ప్రతీది పూసగుచ్చినట్లు విమల తో చెప్పాడు.

అది అంతా విన్న, విమల రాము ను చూసి ఇదివరకటి కంటే రాము పై ఎక్కువగా నమ్మకం, ప్రేమ , సంతోషం ఆ సమయంలో మనసు లో పొందుతూ ఉంది. ఎందుకంటే , రాము తన నుంచి దూరం గా అన్ని రోజులు ఉన్న, ఎప్పటికీ తనవాడే అని రాము మాట్లాడే మాటల్లో నమ్మకం కనిపించింది.

కాసేపు తరువాత, విమల ఇంట్లో తన పెళ్లి గురించి జరిగిన సంభాషణ పూర్తిగా చెప్పింది. అది విన్న రాము మూడ్ ఆఫ్ అయి, ఒక్కసారిగా దిగులు పడి, నీరసంగా అయ్యాడు. వెంటనే విమల రాము పరిస్థితి చూసి, పరవాలేదు ఇంకో రెండు సంవత్సరాల వరకు పెళ్లి వాయిదా వేయించాను, అంది.

కొంత సమయం మౌనంగా ఉన్నారు…ఇద్దరూ.

విమల : రాము…నీకు నేను అంటే ఇష్టమే నా…. నన్ను పెళ్ళి చేసుకుంటావా…

రాము : అదేం మాట విమల…. నేను బ్రతికేదే నీ కోసం…

విమల : ఏడుస్తూ…రాము ను గట్టిగా కౌగలించుకుని…నా వలన కావడం లేదు రాము…నిన్ను వదిలి ఉండలేను…ఇన్ని రోజులు, నిన్ను చూడకుండా ఎలా ఉన్నానో నాకే తెలీదు.

రాము : తన రెండు చేతుల్లోకి , విమల ముఖాన్ని తీసుకుని, తన బొటన వేలితో విమల కళ్లను తుడుస్తూ….. ఊరుకో…విమల…ఏది ఏమైనా సరే , నేను నిన్ను వదిలి పెట్టను.

కొంచెం సమయం తర్వాత

విమల : రాము నిన్ను అందరూ గొప్పగా…సినిమా హీరో లా మాటాడుకుంటున్నారు…తెలుసా….

రాము : అవునా…ఏ…ఎందుకు.

విమల : అబ్బా…ఏం తెలియనట్టు…అమాయకంగా…నీ ఇంటర్ రాంక్ గురించి పేపర్ లో వచ్చింది…కదా.

రాము : ఓ…అదా…. ఏం ఉంది…. విమల అంతా నీ వలనే కదా…నువ్వు ఆ రోజు క్లాసులో సార్ చేతిలో దెబ్బలు తినకపోతే…. నాలో ఇంత మార్పు…ఇదంతా సాధ్యం అయ్యేది కాదు కదా…. చెప్పాలంటే ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు , ఇంకా ఎక్కువ భాధ పడ్డాను…నువ్వు నా దగ్గర లేకపోయే సరికి…. మిగిలిన వాళ్లు గొప్పగా ఏం …..అన్నా, కూడా నాకు మాములుగా నే అనిపించింది…విమల.

విమల : నా …రాము…గుడ్ బాయ్……ముద్దు గా, చిలిపిగా అంది.

అప్పటికే సమయం సాయంత్రం 5 గంటలు కావస్తోంది…

రాము : విమల చాలా టైం అయింది. నేను ప్రిన్సిపాల్ గారిని కలవాలి….. మనం మళ్లీ కలుద్దాం.

విమల : సరే…. రాము….

ఇద్దరూ సైకిళ్ళు పై బయలు దేరి వెళ్లి పోయారు….. రాము ప్రిన్సిపాల్ గారు ఇంటికి వచ్చాడు.

ప్రిన్సిపాల్ గారు : ఆ…ఆ…రాము…రా…రా…అని ఆప్యాయంగా దగ్గరకు పిలిచి, షేక్ హ్యాండ్ ఇచ్చి, కౌగిలించుకున్నారు…. ఎలా ఉన్నావు రాము…. ఎంసెట్ బాగా రాసావా…..

రాము : బాగున్నాను సార్…పరిక్ష బాగా రాసాను. …. సార్ …ఈ కవరు మీకు రాజారాం సార్ ఇమ్మన్నారు.

ప్రిన్సిపాల్ గారు : కవరు తీసుకుంటూ…. మొత్తానికి మన కాలేజీ పేరు, ఊరి పేరు నిలబెట్టావు …. నేను నీ మీద పెట్టిన నమ్మకం నిజం చేశావు….

రాము : అంతా మీ దయ…సార్…అని చేతులు కట్టుకుని వినయం గా అన్నాడు.

ప్రిన్సిపాల్ గారు : రాముని…చూస్తూ చాలా ముచ్చట పడి….నీ లో చాలా మార్పు కనిపిస్తుంది…రాము…..

రాము : అవును సార్…. అంతా రాజారాం సార్ వలనే…. నన్ను చాలా బాగా చూసుకున్నారు సార్…

ప్రిన్సిపాల్ గారు : మరో 15 రోజుల్లో ఎంసెట్ ఫలితాలు వస్తాయి...అందులొ కూడా మంచి రాంక్ వస్తుంది, మంచి కాలేజీ లో సీటు వస్తుంది …నీకు….. అని ఇంట్లో లడ్డూలు ఉంటే తెచ్చి ఇచ్చారు…రాము కి తినమని.

రాము : ధాంక్స్ సార్…. అని…. లడ్డూలు తినేసి….వెళ్లోస్తాను సార్ అని చెప్పి…బయలు దేరాడు.

రాము వెళ్లి న తరువాత…. ప్రిన్సిపాల్ గారు రాజారాం పంపిన కవరు తెరిచి ఉత్తరం చదివారు……

మిత్రమా….నీ ఆలోచనలతో ఉన్న జీవితం ఎంత గొప్పదో, నువ్వు సేవతో సమాజానికి చేస్తున్నది ఎంత మంచో…రాము ద్వారా చూపించావు……. రాము ఈ రోజు , మా కుటుంబంలో మనిషి అయిపోయాడు…. తను ఏ వర్ణమో, తల్లి తండ్రులు ఎవరో నాకు తెలియదు కానీ, వారి పూర్తి పరిస్థితులు ఏంటో తెలియదు కానీ…. రాము కి మంచి భవిష్యత్తు ఉంది…. రాము కి ఎప్పుడు ఏ సహాయం కావలసి వచ్చినా నాకు చెప్పు…. సంకోచించకు, ఉంటాను…. అంతా చదివి సంతోషించారు ప్రిన్సిపాల్ గారు.


  సీన్ – 25


రోజులు గడుస్తున్నాయి…

ఒక రోజు ప్రిన్సిపాల్ గారు, రాము ని కలవమని కబురు పెట్టారు.

రాము ఎందుకో…ఏంటో అని వెళ్లాడు.

ప్రిన్సిపాల్ గారు : రాము ని , అభినందిస్తూ…. నీకు ఇంటర్ లో రాష్ట్ర స్థాయిలో 5 రాంక్ వచ్చి నందుకు ప్రభుత్వం 350/- రూపాయలు బహుమతిగా ఇచ్చారు…ఇదిగో ఈ రోజే వచ్చాయి…

రాము : ధాంక్స్ సార్…అని…ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి…తల్లి కి ఇచ్చి , అంతా వివరంగా చెప్పాడు.

విమల టైలరింగ్ అదే ఊరిలో ఒకరి దగ్గర ఉదయం పూట రోజు రెండు గంటలు నేర్చుకునేది. విమల తల్లి కి మాత్రం , ఎలా గైనా విమలకి పెళ్లి చేసెయ్యాలనే తాపత్రయం రోజూ పడుతూనే ఉంది.

ఒక రోజు మధ్యాహ్నం…. రాము ఇంటిలో ఉండగా, పరుగు పరుగున పొలం లోని కూలి వచ్చి…. రాము తోను, తన తల్లి తోను ఇలా అంటున్నాడు…

రాము మీ అయ్య…పోలం పని సేత్తు…ఒక్కసారికే కుప్ప కూలిపోయాడు….ఎంత లేపినా లేవడం లేదు….. జమీందారు కి కూడా ఇప్పుడే సెప్పి వచ్చాను.

వెంటనే , రాము , తన తల్లితో కలిసి కంగారుగా పొలం దగ్గర కి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అప్పటికే జమీందారు వచ్చాడు, ఇంకా జనం చుట్టూ మూగి ఉన్నారు. తన తండ్రి అచేతనంగా పడి ఉన్నాడు. రాము తల్లి కిందపడి….ఎవరయ్యా, లే….లే…అని భోరున ఏడుస్తుంది…..

ఇంతలో ఎవరో అంటున్నారు ఆసుపత్రి కి తీసుకెళ్దాం అని……జమీందారు నాడీ పట్టుకు చూసి , ప్రాణం పోయింది…బాగా తాగున్నాడేమో, గుండె ఆగిపోయి నట్టుంది…అన్నాడు.

అది విన్న రాము కి దుఃఖం ఆగలేదు…తండ్రి శవం పై పడి ఏడుస్తున్నాడు, అక్కడి నుంచి శవాన్ని ఇంటికి తీసుకువచ్చారు…..ఆ నోటా, ఈ నోటా విమల కి విషయం తెలిసి , పరిగెత్తుకుంటూ రాము ఇంటికి వచ్చింది…దూరంగా నిలబడి చూస్తుంది. రాము ని అలా చూస్తూ , విమల ఉండలేక , ఏం చేయాలో తెలియక వెక్కి వెక్కి ఏడుస్తుంది.

కొంత సమయం తర్వాత, జమిందారు సహకారం తో , కూలి జనం కలిసి దహన కార్యక్రమాలు జరిపించారు.

ఆ రోజు రాత్రి….

రోజు ఉన్న తండ్రి…ఇంకా లేడు, రాడు అనే విషయం రాము జీర్ణించుకోలేక , ఏడుస్తూ, బాధగా, కోపం గా, పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు ఒకోసారి. ఎందుకంటే తండ్రి, ఏనాడూ తనని ఒక మాట అనేవాడు కాదు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాడు.

రాము తల్లి కూడా , భర్తను గుర్తుకు తెచ్చుకుని…. ముందు ముందు ఎలా బతకాలో అర్థం కాక ఏడుస్తుంది.

నాలుగు రోజులయ్యాక …రాము, జమీందారు దగ్గరకు వెళ్ళాడు…. రాము రావడం చూసి

జమీందారు : రా…రాము…ఏంటి ఇలా వచ్చావు…. డబ్బులు ఏమైనా, కావాలా….మీ నాన్న ఇప్పటికే ఎక్కువ వాడకం వాడేసాడు…. అయినా , ఆ డబ్బులు నేను అడగదలచుకోలేదు….

రాము : లేదయ్యా…డబ్బులు కోసం కాదు…నేను రేపటి నుండి పొలం లో కూలి కి వస్తావయ్యా….

జమీందారు : ఖంగు తిన్నాడు…ఏంటి పొలం పని సేత్తావా…. అది చదువు కున్నంత సులువు కాదు , రాము…. నువ్వు చెయ్యలేవు…

రాము : అయ్యా…అలా అనుకండి, ఇంట్లో చాలా కష్టం గా ఉంది. కొన్ని రోజులు చూడండి…. పని చెయ్యలేక పోతే తీసెయ్యండయ్యా…. అని బ్రతిమాలాడు

జమీందారు : సరే….నీ ఇష్టం…రేపట్నుంచి రా…

రాము ఇంటికి వెళ్ళి తల్లి తో చెప్పాడు…. రేపటి నుంచి పొలం పనికి వెళ్తున్నట్లు.


  సీన్ – 26


రోజులు గడుస్తున్నాయి, రాము రోజు పనికి వెళ్తున్నాడు…..తన కంటికి అంతా శూన్యం లా అనిపిస్తుంది . చలాకి గా లేడు. విమలను కూడా కలవాలని అనిపించడం లేదు.

ఒక రోజు సాయంత్రం పొలం పని ముగించుకుని, చేతిలో కారేజీ పట్టుకొని, పొలం గట్టుపై ఒంటరిగా ఇంటికి వస్తూన్న, రాము ని విమల చూసి…రాము…. రాము…అని పిలిచింది.

రాము : చెప్పు విమల..

విమల : ఏంటి రాము…. ఇదంతా…ఇలా అయిపొయావేంటి….

రాము : ఏం చెయ్యను చెప్పు…. ఇల్లు గడవాలి కదా…

విమల , ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనం గా వెళ్లి పోయింది.

ఆ రోజు విమల , నేరుగా ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్లింది. కానీ ప్రిన్సిపాల్ గారు అప్పటికే హైదరాబాద్ వెళ్లి పదిహేను రోజులు అయింది. రాము తండ్రి చనిపోయిన విషయం కూడా ఆయనకు తెలియదు…. చేసేది ఏమీ లేక, వెను తిరిగింది విమల.

వారం రోజుల తరువాత…. విమల మళ్లీ ప్రిన్సిపాల్ గారు ఇంటికి వెళ్ళింది. ప్రిన్సిపాల్ గారు ఇంటిలో ఉండడం చూసి …హమ్మయ్య అనుకొని……రాము విషయాలన్నీ పూర్తిగా , వివరంగా పూసగుచ్చినట్లు చెప్పింది…..

అంతా విన్న ప్రిన్సిపాల్ గారు చాలా బాధపడ్డారు.

సరే విమల నువ్వు ఇంటికి వెళ్ళు…. నేను సాయింత్రం, రాము వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నారు ప్రిన్సిపాల్ గారు.

ఆ రోజు సాయంత్రం…

ప్రిన్సిపాల్ గారు …రాము ఇంటికి వెళ్లారు..

రాము తల్లి : సారు….నమస్కారమయ్యా…అంతా అయిపోయిందయ్యా…. అని భోరున ఏడుస్తూ…భర్త మరణం గురించి చెప్పింది.

ప్రిన్సిపాల్ గారు : అయ్యొ…ఊరుకోమ్మా….నేను ఊర్లో లేను, నిన్ననే వచ్చాక విషయం తెలిసింది…. అవును , రాము ఏడి…..

రాము తల్లి : ఆడు…పోలం లో కూలి కి ఎల్లాడయ్యా…..యేళ అయింది, వచ్చెత్తాడయ్యా…..

ఇంతలో రాము , అన్నం కారేజీ చేతిలో పెట్టుకొని , ఇంటి లో కి వచ్చాడు…. అక్కడ కూర్చుని ఉన్న , ప్రిన్సిపాల్ గారిని చూసి ఆశ్చర్యపోయాడు.

రాము : నమస్కారం సార్.

ప్రిన్సిపాల్ గారు : రాము…ఎలా ఉన్నావు…నాకు అంతా నిన్ననే తెలిసింది. నేను కూడా చాలా రోజుల నుండి ఊర్లో లేను….ఏది ఏమైనా ఇలా జరగకూడదు…అన్నారు బాధపడుతూ.

రాము : రాము దిగులు తో , దుఃఖం తో ఉన్నాడు……ఎవరు చెప్పారు సార్ విషయం.

ప్రిన్సిపాల్ గారు : హు…. విమల చెప్పింది…నిట్టూరుస్తూ అన్నారు…. రాము ఇంకొక వారం రోజుల్లో ఎంసెట్ ఫలితాలు వస్తాయి…. తరువాత నన్ను కలువు….. నీ తో మాట్లాడాలి….. అని రాము భుజం తట్టి…వెళ్లొస్తానని చెప్పి బయలు దేరారు.

ప్రిన్సిపాల్ గారు వెళ్లాక, రాము స్నానం చేసి , ఆరు బయట నులక మంచం మీద పడుకుని , ఆకాశం వైపు నిరాశగా చూస్తున్నాడు. తన చదువు, విమల, ఇంకా తన జీవితం…ఏమీ అర్ధం కాక…. రాము కంట నీరు నెమ్మదిగా జారుతూ.. చెవులను చేరుతుంది.

 ఆ రోజు రాత్రి ప్రిన్సిపాల్ గారు ఇంటికి వెళ్ళారు, కానీ భోజనం చెయ్యకుండా నే పడుకుని…. దీర్ఘంగా ఆలోచిస్తున్నారు , రాము గురించి.

ఆ రోజు రాత్రి విమల ... ప్రిన్సిపాల్ గారు రాము ఇంటికి వెళ్ళి ఉంటారు, ఏమన్నారో , ఏమో అని రాము గురించి ఆలోచిస్తూ పడుకుంది.


మిగిలినది  ఎపిసోడ్ -5 లో

యడ్ల శ్రీనివాసరావు. 16 మార్చి 2022.







Wednesday, March 16, 2022

143. ఎడారి పువ్వు

 

ఎడారి పువ్వు


• పువ్వంటే పరిమళమని…..

• నువ్వంటే పరవశమని…. తెలిసింది.

• నీ రాక తో....

• నా ఆలోచనల పై పన్నీరు కురిసింది.


• కరిగిన కాలం,  మదిలో….

• ఎదలో… వ్యధలా…. ఉంటే….

• బ్రహ్మ జముడు నై ఉండి పోయాను.


• ఈ ఎడారి జీవనం లో……

• బ్రహ్మ జముడు లా ఉండి పోయాను.


• బ్రహ్మ జముడు పై ముళ్లే…..

• ఉంటాయనుకున్నాను.


• తెలియలేదు…నాకు తెలియలేదు…

• బ్రహ్మ జముడు లో నీరు దాగి ఉంటుందని.


• తెలియలేదు….నాకే తెలియలేదు…..

• ఆ నీరు ఎంతో మధురమైనదని.


• తెలియలేదు….నాకూ తెలియలేదు….

• ఆ నీరు ఎడారి లో  కుడా  ఆవిరి అవ్వదని.



• హరితమే లేని ఎడారికి…

• నా జీవన ఎడారి కి …

• మేఘం లా వచ్చావు….

• వర్షం కురిపించావు.


• బ్రహ్మ జముడు లోని నీరే…..

• నా లోని ప్రేమ అని తెలియచేసావు.


• నా జీవన ఎడారికి వెన్నెల కావాలి…..

• ఆ జాబిలి వి  నువ్వై ఉండాలి.


• ఉంటావా….మరి ఉంటావా…


• బ్రహ్మ జముడు ముళ్లను…

• పువ్వులు గా మారుస్తావా.

• నా ప్రేమ కు రూపం నువ్వవుతావా.


• పువ్వంటే పరిమళమని…..

• నువ్వంటే పరవశమని…..తెలిసింది.

• నీ రాక తో.....

• నా ఆలోచనల పై పన్నీరు కురిసింది.


యడ్ల శ్రీనివాసరావు , 16 మార్చి 2022, 11:30 am















Sunday, March 13, 2022

142. తారామృతము

 

తారామృతము



• ఆశ కలిగెనే…

• ఆశ కలిగెనే…

• అందమైన తారపై...

• ఆశయే కలిగెనే.


• తార లోని తళకులకు…..

• నా తరంగాలు మెలి తిరిగె నే.

• నా హృదయ అంతరంగం…..

• తార తలంపుతో తలుపులు తెరిచెనే.


• నా అంతరంగము లో తన అందమును….

• చూసి తార ఎంతో పరవశించెనే…‌.

• తార మన‌సు ఎంతో వికసించెనే.


• వికసించిన తార పై….

• నే తపన ఎంత చెందెనో….

• నా తనువు ఎంత తల్లడిల్లెనో.


• నే చేతులెంత చాచినా….

• చామంతులెన్ని విసిరినా....

• తారా  తీరమును   నే    చేరలే.…

• తార   దరికి   నను  చేరనీయ  లే.


• తార తళుకు  నను  తాకుతునే ఉంది….

• నా లో ప్రేమను పెంచుతునే ఉంది.


• తార కంట నీరు.‌….

• కన్నీరై…మున్నీరై…..

• జాలు వారుతుంది….

• నా  దోసిలి  లో   చేరుతుంది.


• దోసిట నీరు…అమృతమై….

• నా జీవామృతం అవుతూ ఉంటే.


• ఇక  తార నుంచి నే  ఆశించేదేమి…..

• తారకు నే నివ్వగలిగేదేమి.


తార ఉన్నది నింగి లోన….

• నేనున్నది నేల పైన.


యడ్ల శ్రీనివాసరావు, 11:45 pm , 13 March 2022.







Saturday, March 12, 2022

139. కళాశాల 1980 - ఎపిసోడ్ -3

 

కళాశాల 1980

ఎపిసోడ్ -3



సీన్ – 20


రాము హైదరాబాద్ బస్టాండు లో బస్ దిగాడు. సరిగ్గా అదే సమయానికి రాజారాం గారు వచ్చి, రాము ని గుర్తు పట్టారు.

రాజారాం : రాము…. రాము వి నువ్వే కదా…సిరిసిల్ల నుంచి….అంటూ ఉండగా….

రాము : ఆ…ఆ…నేనేనండి రాముని…ప్రిన్సిపాల్ గారు పంపించారు…

రాజారాం : ఆ…ఆ….సరే…సరే…రా… మా ఇంటికి వెళదాం.

రాము ని తన పాత స్కుటరు మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లాడు.. రాజారాం.

రాజారాం వయసు సుమారు 48 సంవత్సరాలు ఉంటాయి. ఆదాయపన్ను లో శాఖలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. రాజారాం కి, భార్య , 9 వ తరగతి చదువుతున్న కూతురు శైలజ ఉన్నారు.

రాజారాం , రాముని ఇంట్లో కి తీసుకెళ్ళి భార్యకు, కూతురు కి పరిచయం చేశాడు. రాము కోసం ఇంటి డాబా పైన ఉన్న చిన్న గదిలో బస ఏర్పాటు చేశాడు.

రాజారాం : రాము ఇదిగో నువ్వు ఉండే గది. ఈ పక్కనే బాత్ రూం ఉంది. భోజనానికీ మాత్రం కింద ఇంట్లో నే తిందువు…. రేపు నిన్ను కోచింగ్ సెంటర్ కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను.

రాము : వెంటనే సంచి లో నుంచి ఒక కవరు తీసి …. సార్…ప్రిన్సిపాల్ గారు మీకు ఇమ్మన్నారు…అని ఇచ్చాడు.

రాజారాం : కవర్ తీసుకొని…. రాము, ప్రయాణం చేసి వచ్చావు కదా…. కాళ్లు చేతులు ముఖం కడుక్కుని కిందికి వచ్చెయ్, భోజనం చేద్ధువు గాని….

రాము : అలాగే సార్…

రాము కి ఆ ఇల్లు, గది ఆ వాతావరణం అంతా కొత్తగా ఉన్నా , బాగా నచ్చింది. ముఖ్యంగా రాజారాం గారు మాట్లాడే విధానం , తనకు సొంత మనిషి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.

రాజారాం కిందికి వెళ్లి , తన స్నేహితుడు పంపిన కవరు తెరిచాడు. అందులో 800/- రూపాయలతో పాటు…ఉత్తరం ఉంది…. అందులో…

రాజారాం…. రాము చాలా మంచి వాడు, తెలివైన వాడు. పేదరికంలో పెరిగినా సరే మట్టి లో మాణిక్యం, మంచి భవిష్యత్తు ఉంది…ఈ డబ్బులు తో ఫీజు కట్టు…. జాగ్రత్తగా చూసుకో…. ఫోన్ చెయ్యి…అని రాసి ఉంది.

ఇంతలో రాము వచ్చాడు…రాజారాం గారు భోజనానికి వారి పక్కనే కూర్చొ పెట్టుకుని... ఎప్పుడూ మొహమాటం పడకు, శుభ్రం గా తిను, బాగా చదివి, మంచి రాంక్ తో సీటు తెచ్చుకొవాలి….అంటుంటే, రాము సరే సర్…అన్నాడు.

ఆ రోజు అంతా కొత్తగా అనిపించింది రాము కి…. రాత్రి పడుకోబోయే ముందు అమ్మ, నాన్న, విమల ఎలా ఉన్నారో అని అనుకున్నాడు.

రాజారాం గారు రాత్రి పడుకునే టప్పుడు భార్యతో అంటున్నారు ,

రాజారాం : రాము సుమారు రెండు నెలలు ఇక్కడే ఉంటాడు. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అని తన స్నేహితుడు ఇచ్చిన ఉత్తరం భార్యకు చూపించాడు.

రాజారాం భార్య : ఉత్తరం చదివి….సరే నుండి …. మీరు చెప్పి న ట్లే…. చేస్తానండి..

తన భార్య మాట కి రాజారాం చాలా సంతోషించాడు.

సిరిసిల్ల లో అదే రోజు రాత్రి…

రాము తల్లి, మొదటి సారి తన కొడుకు దగ్గర లేకపోవడం తో కాస్త బెంగ గా ఉంది.

విమల ఆ రాత్రి భోజనం చెయ్యకుండా, రాము నే తలుచుకుంటూ పడుకుంది.



సీన్ – 21



మరుసటి రోజు రాజారాం గారు, రాము ని కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేసి, ఇంటికి వచ్చేటప్పుడు ఏ సిటీ బస్ మీద ఎలా రావాలో , రాము కి వివరంగా చెప్పి ఆఫీసుకు వెళ్లి పోయారు రాజారాం గారు.

రాము కి కోచింగ్ సెంటర్ వాతావరణం చాలా గొప్ప అనుభూతి ని ఇస్తుంది.

రోజులు గడుస్తున్నాయి. రాము చదువు లో లీనమై , పట్టుదలగా చదువుతున్నాడు. రాజారాం గారి కుటుంబం రాము ను సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. రాజారాం గారి కూతురు శైలజ కు చదువు లో గణితంలో అప్పుడప్పుడు సందేహాలు సమాధానాలు చెప్పి సహాయం చేసేవాడు రాము.

కోచింగ్ సెంటర్ లో పెట్టిన పరిక్షల లో రాము కి చాలా మంచి మార్కులు, రాంక్ లు వచ్చెవి. ఆ మార్కులు చూసి రాజారాం గారు చాలా సంతోషించి, రాము ను ప్రోత్సాహించే వారు మరియు తన స్నేహితుడైన ప్రిన్సిపాల్ కి, ఫోన్ లో రాము గురించి ఎప్పటికప్పుడు చెపుతూ ఉండేవారు.

రాము కి నిజం గా , రాజారాం గారు కుటుంబ అనుబంధం , తనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు నేర్పించాయి. తన బట్టలు తానే ఉతుక్కోవడం, పరిశుభ్రత, ఎదుటి వారితో మాట్లాడే విధానం, ఇలా ఎన్నో అంశాలు , రాజారాం గారిని చూసి ప్రభావితం అయ్యేవాడు , రాము.

ఆ రోజు మే 1 వ తేదీ, సెలవుదినం. రాము, రాజారాం అందరూ ఇంటి లో నే ఉన్నారు. ఆ రోజు ఇంటిలో ప్రత్యేకంగా రాజారాం భార్య పాయసం, పులిహోర చేసింది. ఆ రోజు సాయింత్రం రాజారాం కి , సినిమా కు వెళదాం అనిపించి , తన భార్య తో..

రాజారాం : ఏమోయ్…మనం సినిమా కి, వెళ్లి చాలా రోజులయ్యింది…అందరం వెళ్దామా…..

రాజారాం భార్య : ఏం పాపం…చాలా రోజుల కి , సినిమా గుర్తొచ్చింది…

రాజారాం : ఆ…ఏం లేదు…అందరం కలిసి సినిమా కి వెళ్లి చాలా రోజులయ్యింది. కదా సరదాగా…

రాజారాం భార్య : సరే నండి…. మీ ఇష్టం…మరి శైలజ …అని సందేహం గా అంది.

రాజారాం : హు….శైలుని కూడా తీసుకెళ్దాం…

సరే అనుకుని…. సినిమా కి తయారవుతూ ఉండగా….. రాము, మంచినీళ్ల కోసం, మేడ మీద తన గది నుండి కిందకు వచ్చి , మంచినీళ్లు అడిగాడు.

రాజారాం భార్య మంచినీళ్లు ఇచ్చింది…రాము వెళ్లి పోయిన తరువాత,..

రాజారాం భార్య : ఏమండీ…. సినిమా కి మనం వెళ్తున్నాం కదా…. పాపం రాము ను తీసుకు వెళ్టామా....‌మనతోపాటు…అంది భర్తతో.

రాజారాం : సంతోషించి …. సరే…నేను రాము కి చెపుతాను , తయారు అవమని…అని అన్నాడు.

నిజానికి రాజారాం కి రాము ను తమతో సినిమా కి తీసుకు వెళ్లాలని ముందే అనిపించినా, భార్య అంగీకరించదేమో అని చెప్పలేదు.

అందరూ కలిసి సినిమా కి వెళ్లారు…. హాలు లో రాజారాం గారు, తన భార్య, శైలజ, రాము వరుసగా కుర్చీ లలో కూర్చుని సినిమా చూస్తున్నారు. రాము కి శైలజ పక్కనే కూర్చునే సరికి , చాలా ఇబ్బందికరంగా ఉంది. మనసు లో ఒక్కసారిగా విమల గుర్తు కి వచ్చి, తన కళ్ల ముందు ఉన్నట్లు అనిపించింది. రాము సినిమా చూస్తున్నాడు గాని , తన కంటికి విమల తో మాట్లాడిన మాటలు, చింత చెట్టు దగ్గర వారి అనుభవాలు, గుర్తు వచ్చి , తెలియకుండా నే కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయి. ….

సినిమా సగం అయింది. ఇంటర్ వెల్ లో లైట్లు వేసేటప్పటికి, పక్కనే ఉన్న శైలజ రాము ముఖం లోకి చూసి, తన తల్లి తో చెప్పింది….. వెంటనే

రాజారాం భార్య : ఏం రాము…. ఏం అయ్యింది…. అలా ఉన్నావే…. సినిమా బాగోలేదా…. అంది నెమ్మదిగా.

రాము :  అదేమీ కాదండి…. కళ్లు తుడుచుకుంటూ

రాజారాం భార్య : మరి ఎందుకు ఏడుస్తున్నావు…. మీ ఊరు, అమ్మ నాన్న గుర్తుకు వచ్చారా….

రాము :  ఆ..ఆ… అవునండీ…

రాజారాం భార్య , నెమ్మదిగా భర్త చెవిలో ఏదో చెప్పింది. …. రాజారాం బయటకు వెళ్లి , తినుబండారాలు తెచ్చాడు.

సినిమా నుంచి ఇంటికి వచ్చాక…. రాము భోజనం చెయ్యకుండా నే పడుకున్నాడు.

ఆ రోజు రాత్రి , రాజారాం దంపతులకు రాము పై, జాలి మరియు ఏదో తెలియని అనుబంధం కలిగింది.



సీన్ - 22


రాజారాం ఫోన్ లో తనతో రాము గురించి చెప్పిన విషయాలు విని ప్రిన్సిపాల్ గారు సంతోషించి, ఊరిలో ఉన్న రాము తల్లి తండ్రులను కలిసి విషయాలు చెప్పెవారు.

ఒక రోజు విమల ఉండలేక రాము గురించి విషయాలు ఏమైనా ఎలాగైనా తెలుసుకోవాలనే వంక తో ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్ళింది. వెళుతూనే…

ప్రిన్సిపాల్ గారు : ఆ..రామ్మా…. విమల…ఎలా ఉన్నావు…. ఇలా వచ్చావేంటమ్మా….ఆ బల్ల మీద కూర్చో.

విమల :   నమస్కారం సార్…. మరేమో…ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడూ వస్తాయి సార్…కనుక్కుందామని వచ్చాను….. సార్.

ప్రిన్సిపాల్ గారు : ఈ వారం చివరిలో వస్తాయి విమల. ఈ సారి మన కాలేజీ కి రాష్ట్రస్థాయిలో రాంక్ రావాలమ్మ…. రాము కి ….

విమల :  అవును సార్…. రాము కి ఫస్ట్ ఇయర్ లో స్టేట్ రాంక్ మార్కులు వచ్చాయి కదా……. సార్ రాము మీ దగ్గర కి , ఈ శెలవుల్లో వచ్చాడా…అని అమాయకంగా అడిగింది.

ప్రిన్సిపాల్ గారు : లేదు విమల, రాము ను ఇంజనీరింగ్ కోచింగ్ కోసం, నా మిత్రుడు దగ్గరకు హైదరాబాద్ పంపించాను. అక్కడే ఉన్నాడు…. బాగా చదువుకుంటున్నాడు. అక్కడ కూడా మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడని , నా మిత్రుడు చెప్పాడు.

విమల : అవునా…సార్…చాలా సంతోషం గా ఉంది…..తను వచ్చిన పని అయిపోయింది అని మనసులో అనుకుంటూ…..వెళ్లోస్తాను …సార్ అని లేచింది.

 ఆ మాటలు విన్న విమల కి, రాము ను చూసినంత ఆనందం కలిగింది.

ఒక వారం రోజుల తర్వాత … ఒక రోజు…..ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. అనుకున్నట్లే… రాము కి రాష్ట్ర స్థాయిలో 5 వ రాంక్ వచ్చింది. ప్రిన్సిపాల్ గారి నమ్మకం నిజమైంది. ఆయన ఆనందానికి అవధులు లేవు. వెంటనే రాము తల్లి తండ్రుల కి విషయం చెప్పారు.

అదే రోజు ఉదయం పేపర్ లో , రాజారాం గారు రాము రిజల్ట్స్ చూసి , 5 వ రాంక్ అని చెప్పి, రాము ను కౌగిలించుకున్నారు. పక్కనే ఉన్న శైలజ తో నువ్వు కూడా రాము లా చదవాలి అన్నారు. రాము ఒక ప్రముఖ వ్యక్తి లా అయిపొయాడు , ఆ రోజు…..

పత్రికా విలేఖరులు, ప్రిన్సిపాల్ గారి ద్వారా రాము అడ్రస్ తెలుసు కొని, రాము కోసం రాజారాం గారి ఇంటికి వచ్చారు.

విలేఖరులు అడిగిన ప్రశ్నలకు రాము , వినయం గా, తన కుటుంబ నేపథ్యం, తనకు ప్రోత్సాహం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారు గురించి, టీచర్లు , తల్లి తండ్రుల గురించి చెపుతున్నాడు , కానీ విచారం గా ఉన్నాడు. నవ్వు కూడా సహజం గా లేదు. రాజారాం అది గమనించి…

రాజారాం : ఏం రాము…ఏంటి అలా ఉన్నావు.

రాము : ఏం లేదు సార్…

రాజారాం : చెప్పు రాము…ఏదో దాస్తున్నావు..

రాము : ఏం లేదు…సార్…అని ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు.

రాజారాం : రాము…ఊరుకో…. ఏడవకు…నాకు అర్దం అయింది…ఇంత మంచి సమయం లో, మీ అమ్మ నాన్న లేరనే కదా…ఏడుస్తున్నావు…. నాకు తెలుసు….

రాము : ఏం చెప్పాలో తెలియక….తన మనసు లో ఇంత పేరు కి కారణమైన విమల, ఈ సంతోష సమయంలో తన దగ్గర లేకపోవడం, ఆ రోజు విమల తన గురించి దెబ్బలు తినడం, అసలు విమల ఎలా ఉందో, ఎన్ని రోజులు అయిందో అని గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తను ఈ రోజు సాధించిన విజయానికి మూలం విమల అని తెలిసినా ఎవరికి చెప్పుకోలేక , దుఃఖం ఆపుకోలేక పోతున్నాడు.

రాజారాం : రాము…. ఊరుకో…ఇంకో పది రోజుల లో ఎంసెట్ పరీక్ష అయిపోతుంది కదా…అప్పుడు ఎలాగో మీ అమ్మ నాన్నలను కలుస్తావు కదా…ఊరుకో…..ఈ పది రోజులు ఇంకా దృష్టి పెట్టి బాగా చదువు….

అదే రోజు …

విమల కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. విమల , రాము లేని వెలితి తో అంత సంతోషంగా లేదు. తన నుంచి ఏదో తనకు దూరం అయిపోతుంది అనే దిగులు తో ఉంది. ఇంతలో విమల స్నేహితులు , ఇంటికి వచ్చారు. ….

ఒక స్నేహితురాలు : విమల…. తరువాత ఏం చదువుతావే అని అడిగింది.

విమల…సమాధానం చెప్పే లో పే

విమల తల్లి :  ఆ….ఏముందమ్మా….ఇంకా సదివి ఏం ఉద్ధరించాలి…. ఈ ఏడాది ఏదో సంబంధం సూసి…..తొందరగా పెళ్లి సెసేత్తే….ఓ పనైపోతాది…..

అది విన్న విమల …బాధ తో .‌ఏం చెప్పాలో తెలియక …మౌనం గా ఉంది. రాము గుర్తు వచ్చాడు విమల కి.

ఆ రోజు రాత్రి

విమల తల్లి : తన భర్త తో …..ఈ ఏడాది విమలకి సంబంధం సూడు …పెళ్లి సేసెద్దాం అంది.

విమల తండ్రి :  ఏంటే…. అది సిన్న పిల్ల…అప్పుడే , ఈడు రాకుండానే పెళ్లి ఏంటి….

విమల తల్లి : నీ కేం తెలుసు.... 16 సంవత్సరాల నిండిన ఆడపిల్ల , కుంపటి బరువే మనకి….సెప్పినట్లు చెయ్యి….

విమల తండ్రి : చేసేది ఏం లేక…. సరే అన్నాడు.

వారి మాటలు అన్ని , విమల నిధానంగా వింటూ ... ఏడుస్తుంది.

మరుసటి రోజు ఉదయం …అమ్మ నాన్న లు ఎదురుగా …..విమల తన తల్లి తో

విమల : అమ్మా…. నాకు అప్పుడే పెళ్లి వద్దు…ఇంకో రెండు సంవత్సరాల‌ తరువాత చేసుకుంటాను.

విమల తల్లి : ఏం పాపం…ఏంటి ఏమైనా కత ఉందా….సెప్పు….

విమల : చూడు నాన్నా….నా తోటి వాళ్లు ఇంకా చదువు కుంటుంటే …అంది ఏడుస్తూ..

విమల తండ్రి : అది కాదమ్మా…. మనకు ఇంకా సదుం కునే స్తొమత లేదు తల్లి …అర్థం చేసుకో…

విమల : ఆ…. చదువు కోక పోతే…పోనీ నాన్న…. నేను కుట్లు అల్లికలు నేర్చుకుంటాను…..జాకీట్లు కుట్టి నాలుగు డబ్బులు సంపాదిస్తాను. ఇంకో రెండేళ్లు తరువాత పెళ్లి చేసుకుంటాను. అంది.

విమల తండ్రి : విమల మాట కి అడ్డు చెప్పలేక…. సరే నమ్మ….నీ ఇష్టం. అన్నాడు.

విమల అప్పటికి…హమ్మయ్య…అనుకుంది.



సీన్ – 23



ఆ రోజు ఎంసెట్ పరీక్ష . రాజారాం ఆఫీసుకు శెలవు పెట్టి , రాముని దగ్గర ఉండి ఎగ్జామ్ సెంటర్ కి చేర్చి, పరిక్ష అయ్యే వరకు సెంటర్ దగ్గరే వేచి ఉన్నాడు. ….

ఇంతలో పరిక్ష రాసి వస్తున్న రాము తో…..

రాజారాం : ఎలా రాసావు….రాము.

రాము : బాగా రాసాను సర్…. అన్నాడు నమ్మకం రాము లో సంతోషం ఎక్కువ అయింది, ఆ రోజు……తిరిగి రేపు ఉదయం ఇంటికి వెళ్తాడనే ఆనందం తో.

ఆ రోజు సాయంత్రం రాజారాం, రాము ను బజారు తీసుకెళ్ళి బట్టలు కొన్నాడు.

మరుసటి రోజు ఉదయం రాము రాజారాం ఇంటి నుంచి బయలుదేరుతూ….

రాజారాం తో సార్…చాలా ధాంక్స్ అండి …అని వంగి , రాజారాం కాళ్లకు దణ్ణం పెట్టాడు. వెంటనే రాజారాం …లే…లే…రాము. అని పైకి లేపాడు కానీ, తనకు రాము తో ఇవన్నీ రోజుల అనుబంధం తో వదల్లేక పోతున్నాడు. రాము…ఇంకా రాజారాం భార్య కు నమస్కారం చేసి, శైలజ కు టాటా చెప్పి బయలు దేరాడు.

రాజారాం గారు …తన స్కుటర్ పై తీసుకెళ్ళి రాము ను సిరిసిల్ల బస్ ఎక్కించారు.


 మిగిలినది  ఎపిసోడ్ – 4 లో

యడ్ల శ్రీనివాసరావు 11 మార్చి 2022.






Thursday, March 10, 2022

141. ఓంకార రుద్రుడు

 

ఓంకార రుద్రుడు




• ఓం నమఃశివాయ…. ఓం నమఃశివాయ

• ఓంకారం లో ప్రణవ నాదమే…

• మూలాధారానికి శ్రీ కారం.


• నాదము లోని శబ్ధ స్వరము లే….

• జీవకోటికి శక్తి తరంగములు.



• ఓం నమఃశివాయ…..శివాయ నమః ఓం

• ఆకారం లేని నిరాకారికి….

• ఓం కారమే సర్వా కారం…..

• అదియే ఈ విశ్వానికి రూపాకారం.


• మమకారాలను మురిపించి …..

• సూక్ష్మాకారం తెరిపించే జ్ఞానా కారం ఓం కారం…..

• అదియే ఆత్మ సాక్షాత్కారం.



• ఓం నమఃశివాయ…ఓం నమఃశివాయ

• అంధకారమే తొలగించి…..

• మందకారాన్ని మరిపించె….

• మకరందకారమే ఓం కారం.


• ఢమరుక నాదం మోగుతూ ఉంటే…..

• ప్రకృతి తాండవం ఆడుతూ ఉంటూ….

• ఊయల ఊగే రుద్రాకారం ఓం కారం.


• ఓం నమఃశివాయ…. శివాయ నమః ఓం

• ఆత్మల యందు ధర్మాత్మలను…..

• ఆత్మల యందు పుణ్యాత్మలను….

• పరమాత్మ కు చేర్చే…..

• దిశాకారమే ఓం కారం.


యడ్ల శ్రీనివాసరావు 10 మార్చి 2022 5:00 am.



Monday, March 7, 2022

140. స్త్రీ మూర్తులు నాడు నేడు 2022

 

💐స్త్రీ మూర్తులు నాడు నేడు💐





🙏🙏🙏

• స్త్రీ, ప్రకృతి, మహిళ, మగువ ఇలా ఎన్ని పేర్లతో... ఏ మనిషి పిలిచినా లేదా పలికే శబ్దం లో ఒక మమకారం, ఒక మమత, ఒక మనసుకు కావలసిన శక్తి గా అనిపిస్తుంది, అనడం లో అతిశయోక్తి లేదు…

ఎందుకంటే ఈ సృష్టి కే ప్రతి సృష్టి స్త్రీ.  ఓర్పు, సహనం లో స్త్రీ మూర్తి ని భూదేవి తో సమానం గా, శక్తి కి మూలాధారం అయిన దైవం గా చెపుతారు. అది దేవుని సృష్టి యెక్క గొప్పదనం.

☘️☘️☘️☘️☘️

• పూర్వం మన తల్లి , నానమ్మల కాలం లోకి చూస్తే వారి కుటుంబాలు,  జీవనవిధానం,  ఆలోచనలు, ఆహార్యం ఎంత చక్కగా,  అందంగా ఉండేదో.  కేవలం ఇంటిలో ఉన్న ఈ స్తీ మూర్తుల వలన,  ఇల్లంతా కళకళలాడుతూ,  చక్కటి పాజిటివ్ ఎనర్జీ తో ఆనందంగా ఉండేది.  కాసేపు కళ్లు మూసుకుని ఆలోచించండి,  ఇది  ఎంత నిజమో తెలుస్తుంది. 

మన బాల్యం లో , మన ఇంటి లో అమ్మ, అమ్మమ్మా, నానమ్మ లను చూసినా, వారి మాటలు విన్నా, మనకి ఏరోజు , ఏ విషయం లోను,  ఏ  లోటు లేకుండా హాయిగా ఉండేవాళ్లం.  ఎందుకంటే వారు కుటుంబ సంతోషానికి ప్రతినిధులు గా విలువలతో ఉండేవారు. ఎన్నో కుటుంబ సమస్యలను మాటలతో పరిష్కరించేవారు.  సంతోషాన్ని ఇచ్చే వారు. ఎంతమంది నైనా సంతోషం గా పెంచేవారు. నిజం గా ఆ రోజుల్లో కనీసం చదువు కూడా చదవని తల్లి , కుటుంబ సంస్కరణలు అమలు చే‌సే విధానం ఎంతో ఆదర్శనీయం.  అదే పిల్లల పై చాలా మంచి ప్రభావం చూపేది.  ఆనాడు తండ్రి లేదా మగవారు వృత్తి ని మినహా,   ఇంటిని చక్కదిద్దే ఆలోచన ఎక్కువ గా ఎవరికీ ఉండేది కాదు.  అంటే పిల్లల ను పెంచడం కావచ్చు,  బాల్యం లో పిల్లల యెక్క మానసిక భయాలు తొలగించడం , వారిని ధృడంగా తయారు చేయడం, మంచి కధలు చెప్పడం , ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలపై విపరీతమైన చక్కటి ప్రభావం , పాత్ర తల్లి దే ఉండేది. ఒక మనిషికి స్తీ మూర్తి యెక్క చేయి, ఆశీస్సులు తగలనిదే, నాడైనా నేడైనా మనుగడే లేదు.

☘️☘️☘️☘️☘️

• ఈ రోజు ధైర్యంగా నిజం చెప్పాలంటే, ఏ మగవాడు అయినా తనకంటూ ఒక మనసు ఉంది అని ఆలోచించ గలిగే వాడయితే ……. అతని మనసు ముమ్మాటికీ ఒక స్తీ మూర్తి దై ఉంటుంది…..అది తల్లి, సోదరి, భార్య, కూతురు, ప్రియురాలు, స్నేహితురాలు, ఆత్మబంధువు ఏ బంధం అయినా కావచ్చు. 

అందుకే అంటారు జీవితం లో స్థిరపడినా, లేదా విజయం పొందిన ప్రతీ మగవాని వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని. 

మనసు అనే పదం సున్నితమైనది, అది స్త్రీ కు ఒక హక్కు వంటిది.

☘️☘️☘️☘️☘️

• కానీ నేటి ఆధునిక కాలంలో ప్రతీ ఒక్కరి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. చెప్పాలంటే నేటి మహిళల జీవన విధానం ఒక ఛాలెంజింగ్ లా అయిపొయింది. ఒకవైపు ఇల్లు , పనులు మరోవైపు ఉద్యోగం, వ్యాపారం చేయవలసి రావడం, ఇంకా పరిస్థితులు , అవసరాలు, జీవన విధానం వలన విపరీతమైన మానసిక ఒత్తిడి తో కూడిన జీవితం వందకు తొంభై మంది(బయటకు చెప్పుకోలేక) స్త్రీ లు అనుభవిస్తున్నారు. 

అందుకే నేటి మహిళల కు చిన్న వయసులోనే రక్త హీనత, థైరాయిడ్, హార్మోన్ సమస్యలు, యుక్త వయసు లోనే గర్భకోశ సమస్యలు వంటివి చాలా సహజం అయిపొయాయి. అందువలన ఆరోగ్యం సహకరించక, వారిలో సహజంగా ఉండవలసిన ఓర్పు, ‌సహనం కొరవడుతోంది, ఇది నిజం. కానీ నేటి కాలంలో చాలా మంది మహిళలు ఈ విషయం గమనించ లేక , వారి ఆరోగ్య సమస్యలని తాము వెంటనే గుర్తించలేక, అవగాహన లోపం తో బాధ పడేవారు చాలా మంది ఉన్నారు. దీని వలన నిరంతరం ఒత్తిడి కి లోనవుతూ , చిరాకు, విసుగు, కోపం, ఆందోళన పెరిగి , వారు మాట్లాడే విధానం తీరు మారడం వలన కుటుంబ సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి……ఈ విషయంలో ముమ్మాటికీ కొంత తప్పు మగవారిలో ఉంది అనిపిస్తుంది ….మహిళలను అర్దం చేసుకోవడం, వారికి కుటుంబ అవసరాలు, మరియు ఇంటి పనులు అవసరమైనపుడు సహకరించడం, స్త్రీ ల మానసిక ఒత్తిడి ని అర్దం చేసుకోవడం అనేది నేటి కాలంలో ప్రతీ మగవాడి కనీస బాధ్యత. (క్షమించాలి నా ఉద్దేశం ఆడవారిని జాలితో చూడమని కాదు.) వారి మనోభావాలను గౌరవించాలి. 

పురుషులు శారీరకం గా బలవంతులైతే,   స్త్రీ లు మానసికంగా చాలా బలవంతులు. 

ఒక శరీరం బలంగా ఉండాలంటే శరీరం (మగవారు) వెనుక మానసికంగా మనసు (స్త్రీ) మరింత బలంగా ఉండాలి. 

అందుకే నవ సమాజ స్థాపన ఆరోగ్యం గా, ఆనందంగా ఉండాలి అంటే స్త్రీ లను గౌరవించాలి, అభిమానించాలి, ప్రేమించాలి, రక్షించుకోవాలి, వారిని  బలోపేతం చెయ్యాలి. ఇది ప్రతి ఒక్కరి భాధ్యత.

☘️☘️☘️☘️☘️

• మహిళా దినోత్సవం అంటే మహిళల అనేక రంగాలలో సాధించిన విజయాలను ప్రశంసించుకోవడమే కాదు, వారి పట్ల సమాజం మరియు కుటుంబం లో నిర్లక్ష్యం తో ఉన్న ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగించాలని , అదే మహిళల కు ఇచ్చే గౌరవంగా భావిస్తూ రాస్తున్నాను…… 

నా ఈ ఆలోచనల వెనుక కనిపించని భగవంతుడు ఉంటే, నేను రాస్తున్న రచనల వెనుక నన్ను ప్రోత్సహించిన స్త్రీ మూర్తి పూర్వ కాలంలో ఉండేది....

ఇది చదివిన తరువాత,  కొద్ది మంది లో నైనా ఒక చిన్న మార్పు, అవగాహన కలిగి, అర్దం చేసుకుని వారి కుటుంబాలను సంతోషమయం చేసుకుంటారని ఆశతో…

🙏 స్త్రీ మూర్తులు అందరికి శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు , పాదాభివందనాలు.🙏

☘️☘️☘️☘️☘️

• ఏ బంధం అయినా బలోపేతం అవ్వాలంటే ప్రేమ ఉన్నా లేకపోయినా పరవాలేదు కానీ అవసరాన్ని మించిన అహంకారం మాత్రం ఉండకూడదు. అదే విధంగా లోకం లో మంచి, చెడు అనేవి చాలా సహజం. లింగభేదం తో సంబంధం లేకుండా మంచి, చెడు అనేవి అందరిలోను ఉంటాయి. ఎవరిలో నైనా ఉన్న లక్షణాలు, గుణగణాలు అనేవి భగవంతుని కే వదిలేసి మనం మాత్రం పాజిటివ్ గా నే ఆలోచిద్ధాం…. ఎందుకంటే మనిషి లోని పాజిటివ్ శక్తి ని మాత్రమే ప్రకృతి అంగీకరిస్తుంది. అదే మనం సంతోషంగా జీవించడానికి ఉపయోగపడుతుంది.

☘️☘️☘️☘️☘️

గమనిక : ఇదంతా నీతి బోధ గా భావించే వారికోసం కాదు. అన్నీ మాకు తెలుసు అనుకునే వారి కోసం అంతకన్నా కాదు. ఇంకా నేటి సమాజంలో అవగాహన లేమితో చాలా మంది ఉన్నారు …వారి కోసం మాత్రమే. 🤝




యడ్ల శ్రీనివాసరావు, 1 మార్చి 2022 11:45 pm.




Saturday, March 5, 2022

139. కళాశాల 1980 - ఎపిసోడ్ -2

 కళాశాల 1980 

ఎపిసోడ్ -2


సీన్ – 16


ఆ రోజు రాము పుట్టినరోజు. తల్లి తలంటి… అన్నం తో పాటు, పాయసం చేసి బాక్స్ లో పెట్టి…

రాము తల్లి : రాము…ఈ చిన్న టిపినీ లో పాయసం సేసాను…..ఆనాక అన్నం తినేటప్పుడు తిను…ఈ రోజు నీ పుట్టిన రోజు కదా..

రాము : సరేమ్మా…అలాగే….ఒక క్షణం ఆగి, మరలా ఏదో గుర్తుకు వచ్చినట్టు….అమ్మ..అమ్మ…ఇంకా పాయసం ఉందా…

రాము తల్లి : అయ్యొ…పందార కొంతే ఉంటే…నీ వరకే సేసాను…. సాయింత్రం పోయి పందార తెచ్చి, సేత్తాను లే…కాలేజీ కి వెల్లి రా…

రాము : అయితే సరే అమ్మ.…ఒక పని చెయ్యి…ఈ టిపినీ లో కొంచెం పాయసం తీసి ఇంకో చిన్న బాక్స్ లో పెట్టు…నా ఫ్రెండ్ గిరి కి పాయసం అంటే ఇష్టం…ఇస్తాను.

రాము తల్లి: సరే…అని పాయసం రెండు చిన్న బాక్స్ ల్లో వేసి ఇచ్చింది.

రాము వేగం గా సైకిల్ తొక్కుతూ కాలేజీ కి వెళ్లే దారిలో..…ఎప్పుడూ ఆగే చోటే ఆగాడు.. విమల కోసం.

ఇంతలో విమల సైకిల్ మీద వస్తూ…రాము దగ్గర ఆగింది.

విమల : ఆయ్…కొత్త బట్టలు…ముఖం వెలిగిపోతోంది…ఏంటి బాబు విశేషం.. అని ఆనందంగా అంది.

రాము : మరేమో….ఈ రోజు నా పుట్టిన రోజు…అని కొంచెం సిగ్గుపడుతూ అని…ఇదిగో పాయసం…అమ్మ చేసింది..నీ కోసమే…ఎక్కువ లేదు కొంచెమే ఉంది…మధ్యాహ్నం తిను…సాయంత్రం వెళ్లేటప్పుడు బాక్స్ ఇచ్చెయ్…మళ్లీ అమ్మ బాక్స్ అడుగుతాది.

విమల : సరే…

ఇద్దరూ ఒక నిమిషం తరువాత అక్కడ నుంచి సైకిళ్ళు పై కాలేజీ కి కలిసి బయలు దేరారు.

విమల కి దారి లో వెళ్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది…వెంటనే..

విమల : రాము.. సాయింత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు .. గుడి వెనుక చింత చెట్టు దగ్గర రెండు నిమిషాలు ఆగి వెళ్దామా…

రాము : సరే..



సీన్ – 17



ఇద్దరూ కాలేజీ కి వచ్చారు…రాము క్లాస్ లో కి వచ్చాడు…చూస్తే విమల కనిపించలేదు, సరే పక్కకి వెళ్ళి ఉంటుంది లే…అనుకుని…పాఠం వింటున్నాడు. ఉదయం అంతా తనతో ఉన్న విమల కనిపించక పోయే సరికి కంగారు పడ్డాడు.

మధ్యాహ్నం లంచ్ బెల్ సమయానికి విమల క్లాసులో కి కంగారుగా వచ్చింది.

రాము , విమలను చూసి హమ్మయ్య అనుకున్నాడు.

లంచ్ లో… రాము, అమ్మ చేసిన పాయసం తింటూ , చాలా బాగుంది , విమలకి కూడా నచ్చుతుంది, అనుకున్నాడు.

సాయింత్రం కాలేజీ అయిపోయింది.

విమల, రాము ఇద్దరూ చింత చెట్టు దగ్గర కి చేరి కూర్చున్నారు.

విమల : రాము చేతిని తన చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకొని…హేపీ బర్త్ డే రాము…ఇదిగో అని పుస్తకాల సంచి లో నుంచి , ఖరీదయిన పెన్ను , పెద్ద చాక్లెట్ లు మూడు ఇచ్చింది.

రాము సిగ్గు గా… విమల చేతి లో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకొని, విమల ముద్దు పెట్టిన చోట తన చేతిని ముద్దు పెట్టుకున్నాడు….విమల ఇచ్చిన పెన్ను, చాక్లెట్ లు తీసుకున్నాడు.

రాము : ఉదయం అంతా కాలేజీ లో లేవు ఎక్కడికి వెళ్ళావు…

విమల మౌనం గా ఉంది.

రాము : నిన్నే విమలా…

విమల : ఇంటి కి వెళ్లాను…నేను పెట్టె లో దాచుకున్న డబ్బులు కోసం…

రాము : ఎందుకు…ఇయన్నీ కొనడానికా…అవసరమా….మీ అమ్మ అప్పుడే వచ్చావేం అని అడగలేదా….

విమల : అడిగింది…కొంచెం, కడుపు నొప్పి గా ఉంది, ఒక గంట పడుకుని వెళ్తాను అని చెప్పాను.

రాము : హు…నా పుట్టిన రోజు కోసం అబద్ధం ఆడావా….

విమల : సరే…అదంతా వదిలెయ్…ఇంకేంటి చెప్పు…

రాము : మధ్యాహ్నం పాయసం తిన్నావా…ఆ బాక్స్ ఇవ్వు…

విమల : బాక్స్ తీసి తెరిచింది. పాయసం అలాగే ఉంది.

రాము : అదేంటి…విమల…తినలేదు…నచ్చలేదా..

విమల : నాకు అప్పుడు తిన బుద్ధి కాలేదు…చిలిపి గా అంది….చెంచా తో పాయసం తీసి , పుట్టిన బాలుడు కి ఇదిగో నా స్వీటు అని రాము కి తినిపించి….ఆ చెంచా లో సగం తాను తింటూ…ఇదిగో నాకు ఇప్పుడు ఇలా తినాలనిపిస్తుంది…. తింటున్నాను…అంది.

రాము కి అదంతా కల లేక నిజమో అర్ధం కావడం లేదు. విమల ప్రేమ కి రాము కళ్లలో నీళ్లు వచ్చెస్తున్నాయి.

విమల : రాము…ఊరుకో పుట్టిన పిల్లోడు అమ్మ దగ్గర ఏడాలి…. కానీ అమ్మాయి దగ్గర కాదు…..లే.. చాలా టైం అయింది…పోదాం.

ఇద్దరూ పైకి లేచి నిలబడ్డారు….

రాము ఒక్కసారిగా విమల ను గట్టిగా కౌగలించుకుని , విమల చెవి కింద ముద్దు పెట్టుకొని, ఒక నిమిషం అలా గే ఉండి పోయాడు…. విమల కి ఏదో లోకం లో కి వెళ్ళి పోయింది. అభ్యంతరం కూడా చెప్పలేదు.

రాము ఇంటికి వెళ్ళి అద్దం లో తన ముఖాన్ని చూసుకుంటూ మురిసి పోతూ , గాలి లో తేలుతున్నాడు.

ఆ రోజు రాత్రి పడుకుంటూ…. విమల కి తన పై ఉన్న ప్రేమ పూర్తిగా అర్థం అయింది…ఇక తన జీవితం విమల తోనే చివరి వరకు అనుకున్నాడు.



సీన్ – 18



రోజులు గడుస్తున్నాయి…

ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు తేదీ వచ్చింది. రాము కష్టపడి పట్టుదలగా చదువుతున్నాడు. రాముని చూసి ఇంకా చాలా మంది పట్టుదలగా, పోటీ గా చదువు తున్నారు.

పరీక్షలు పూర్తి అయ్యాయి…చివరి రోజు పరీక్ష అయ్యాక …రాము, విమల చింత చెట్టు దగ్గరకు వెళ్ళి కూర్చుని…దిగులు గా ఉన్నారు.

రాము : కాలేజీ చదువు అయిపోయింది ….తరువాత ఏం చెయ్యాలో , తెలియడం లేదు విమల.

విమల : భయపడకు…ఇంకా రిజల్ట్స్ రానీ…అప్పుడు ఆలోచిద్దాం.

రాము : మనం ప్రతీ ఆదివారం ఉదయం ఇక్కడ కలుసుకుందామా…

విమల : సరే…

కొంచెం సేపు తరువాత ఇద్దరూ వెళ్లి పోయారు.

ఆ రోజు సాయంత్రం రాము ఇల్లు వెతుక్కుంటూ కాలేజీ ప్రిన్సిపాల్ గారు వచ్చారు. ప్రిన్సిపాల్ గారిని చూసి రాము కుర్చీ తెచ్చి, శుభ్రం గా తుడిచి కూర్చోమని నమస్కారం చేసాడు. రాము తండ్రి కూడా ఆ సమయంలో ఇంట్లో నే ఉన్నాడు.

ప్రిన్సిపాల్ : రాము…. పరీక్షలు అన్నీ బాగా రాసావా…ఈ సారి నీ వలన మన కాలేజీ కి స్టేట్ రాంక్ రావాలి….. మీ అమ్మ, నాన్నలను పిలు మాట్లాడాలి….

ఇంతలో రాము తల్లి తండ్రి వచ్చి…నమస్కారం చేసారు. రాము వెంటనే కొట్టు దగ్గర కి వెళ్లి డ్రింక్ తెచ్చి ఇచ్చాడు…ప్రిన్సిపాల్ గారికి.

ప్రిన్సిపాల్ గారు డ్రింక్ తాగుతూ…తను వచ్చిన విషయం రాము అమ్మ నాన్న లకు చెపుతున్నారు.

ప్రిన్సిపాల్ : చూడండి…రాము చాలా తెలివైన పట్టుదల కలిగిన వాడు. బాగా చదువు తాడు. రాము వలన పోయిన సంవత్సరం కాలేజీ కి గుర్తింపు వచ్చింది. ఈ సారి కూడా వస్తుంది అనే నమ్మకం ఉంది. రాము ని మంచి పై చదువు ఇంజనీరింగ్ చదివిస్తే చాలా ఉపయోగం ఉంటుంది. అది ఖర్చుతో కూడుకున్నది.….. నాకు తెలుసు మీ కుటుంబ పరిస్థితి…..ఇంటర్ అయిన వారికి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కోసం , గవర్నమెంట్ ఈ సంవత్సరం నుంచి ఎంసెట్ అనే పోటీ పరీక్ష పెడుతుంది. దీనికి హైదరాబాద్ లో కోచింగ్ ఇస్తారు. 45 రోజులు ఉంటుంది. దీనికి ఫీజు, ఇతర ఖర్చులు నేను ఇస్తాను…హైదరాబాద్ లో భోజనం, బస నా స్నేహితుడి ఇంట్లో ఏర్పాటు చేస్తాను. ఇది మీకు , రాము కి మంచి అవకాశం…. బాగా ఆలోచించి రేపు సాయంత్రం లోగా చెప్పండి…. అని వెళ్లి పోయారు.

అది విన్న రాము తల్లి తండ్రులు సంతోషించి, రాము తో అదృష్టవంతుడివి…నువ్వైనా బాగా చదువు కో , దేవుడు అవకాశం ఇచ్చాడు అంటుంటే…. రాము కి ఒక వైపు వెళ్ళి చదువు కోవాలి అని ఉన్నా…విమలని వదిలి వెళ్ళాలంటే ఎలా అని అనుకుంటున్నాడు.

మరుసటి రోజు ఉదయం విమల ఇంటి ముందు కి వెళ్లి అదే పనిగా సైకిల్ బెల్ మోగిస్తుంటే…. అది విన్న విమల బయటికి వచ్చింది. సైగ చేసాడు చింత చెట్టు దగ్గర కి రమ్మని.

విమల చింత చెట్టు దగ్గర కి వచ్చింది...

విమల : ఏంటి అబ్బాయ్ గారు…ఒక్క రోజు కూడా ఉండలేక పోతున్నారా….. పొద్దున్నే ఇంటికి వచ్చే సారు…ఇప్పుడే ఇలా అయితే చాలా కష్టమండీ…. అంది చిలిపిగా.

రాము మాత్రం …విమల మాట్లాడేది ఏమీ వినిపించు కోకుండా…. ముందు రోజు సాయంత్రం ప్రిన్సిపాల్ గారు ఇంటికి వచ్చి చెప్పింది అంతా వివరం గా చెప్పాడు.

విమల…ఒక్కసారి ఎగిరి గంతేసింది…

విమల : నిజమా…. ఆలోచించకు రాము…ఇది మంచి అవకాశం…వెంటనే వెళ్ళి ప్రిన్సిపాల్ గారికి చెప్పు…నువ్వు తప్పకుండా గొప్ప వాడివి అవుతావు.

రాము కి విమల మాటలు చాలా ధైర్యం గా అనిపించింది.

రాము : సరే విమల…నువ్వు చెప్పినట్లే చేస్తాను….ఈ రోజు ప్రిన్సిపాల్ గారిని కలుస్తాను…. విమల రేపు ఇదే టైం కి ఇక్కడ కలుసుకుందామా…

విమల : సరే…

రాము ఆ రోజు సాయంత్రం ప్రిన్సిపాల్ గారిని కలిసి…తన ఆమోదం చెప్పాడు. ప్రిన్సిపాల్ గారు వెంటనే ఫోన్ ట్రంకాల్ బుక్ చేసి, హైదరాబాద్ లో ఉన్న తన స్నేహితుడు రాజారాం తో అన్నీ వివరంగా చెప్పి, రాము కోసం ఏర్పాట్లు చేసి….. ఎల్లుండి ఉదయం మంచి రోజు…నిన్ను బస్ ఎక్కిస్తాను, నా స్నేహితుడు రాజారాం నిన్ను బస్టాండు కి వచ్చి తీసుకెళ్తాడు….. అన్నారు.

రాము ఇంటికి వెళ్ళి అమ్మానాన్న ల తో, ప్రిన్సిపాల్ సార్ ని కలిసాను…ఎల్లుండే ప్రయాణం అని చెప్పాడు.



సీన్ – 19


మరుసటి రోజు ఉదయం లేచి…బట్టలు, పుస్తకాలు అన్నీ రెండు సంచుల్లో , ప్రయాణానికి కావలసిన వన్నీ సర్థుకున్నాడు.

రాము కి ఒక వైపు దిగులు గా ఉన్నాడు …విమల ను చూడకుండా ఎలా ఉండాలో అని …

సమయం ఉదయం 11 గంటలకు రాము చింతచెట్టు దగ్గరకు వచ్చాడు…అప్పటికే విమల అక్కడ రాము కోసం ఎదురు చూస్తుంది.

రాము ని చూసి , విమల చిన్నగా నవ్వింది…కానీ ఆ నవ్వు లో జీవం లేదు. దగ్గరగా చూస్తున్న రాము కు విమల ముఖం కందినట్లు, కొంచెం కళ్లు ఉబ్బినట్లు గమనించాడు.

రాము : ఏమైంది విమల…. అలా ఉన్నావు.

విమల : ఏం లేదు…బాగానే ఉన్నా…

రాము : నిజం చెప్పు…రాత్రంతా , ఏడ్చావు కదా.‌..

విమల దుఃఖం ఆపుకోలేక ఒక్కసారిగా కళ్లలో నీళ్లు తిరిగాయి. రాము చెయ్యి పట్టుకుని భుజం పై వాలి పోయి .. ఏడ్చేసింది…

రాము : పోనీ…నేను..ఊరెళ్ళడం..‌మానెయ్యనా…

విమల : వద్దు.. వద్దు…ఆ మాట అనకు…నువ్వు బాగా చదివి .. గొప్ప వాడివి అవ్వాలి. …ఇదంతా ఊరికే అని వోణి తో కళ్లు తుడుచుకుంది…. రేపు ఎన్నింటికి నీ బస్సు…

రాము : ఉదయం 10 గంటలకు….

విమల : నేను ఏదో పని ఉన్నట్లు…బస్టాండు దగ్గరకు వస్తాను…

రాము : సరే…విమల.

కొంచెం సమయం తర్వాత

రాము : సరే విమల…బయలు దేరుదాం…ఇంకా చిన్న పనులు ఉన్నాయి…

విమల : రాము….‌ఇదిగో…ఇది ఉంచు అని , తను అప్పటి వరకు దాచుకున్న డబ్బులు వంద రూపాయలు చేతి రుమాలు లోంచి తీసి రాము చేతిలో పెట్టింది.

రాము కి కళ్లలో నీళ్లు వచ్చాయి…

హే…ఊరుకో…అని విమల రాము కళ్లు తుడిచి…. బాగా చదివి…రాంక్ రావాలి.. అని నుదుటి పై ముద్దు పెట్టుకుంది.

ఇద్దరూ ఇళ్లకు వెళ్లి పోయారు.

రాము మరుసటి రోజు ఉదయం లేచి , తయారయ్యి....అమ్మనాన్నలతో కలిసి బస్టాండు కు బయలుదేరాడు. దారిలో…

రాము తల్లి : రాము …జాగర్త రా….కొత్త ఊరు…ఎవరితోనూ గొడవ పెట్టుకోకు…ఉత్తరం ముక్క రాయి…యేళకి తిను…

రాము : సరే నమ్మా….

ఇంతలో బస్టాండు కు చేరుకున్నారు…

బస్టాండు లో దూరంగా కిళ్లీ షాపు దగ్గర నిలబడి విమల సోడా తాగుతూ…రాము ను చూస్తూ…సైగ చేసింది.

రాము కూడా విమల వైపు చూసి…. సోడా తాగాలన్నట్లు, తల్లి కి చెప్పి …. విమల దగ్గర కి వచ్చాడు.

రాము సోడా తాగి…విమల తో .. వస్తాను విమల అని నెమ్మదిగా చెప్పి…వచ్చెసాడు…

ఇంతలో ప్రిన్సిపాల్ గారు వచ్చి…రాము కి కొంత డబ్బులు ఇచ్చి…. రాము నువ్వు బస్ దిగే సమయానికి, నా స్నేహితుడు రాజారాం వస్తాడు…అని చెప్పారు…

బస్ వచ్చింది…. రాము బస్ ఎక్కి కిటికీ పక్కన కూర్చుని.. దూరం గా ఉన్న విమలని, ప్రక్కనే ఉన్న తల్లి తండ్రి, ప్రిన్సిపాల్ గారిని చూస్తూ …చేయి ఊపాడు…బస్ సిరిసిల్ల నుంచి హైదరాబాద్ బయలు దేరింది.


మిగిలినది.... ఎపిసోడ్ 3 లో

యడ్ల శ్రీనివాసరావు,  5 మార్చి 2022








Friday, March 4, 2022

139. కళాశాల 1980 - ఎపిసోడ్ -1


కళాశాల 1980
ఎపిసోడ్ - 1




అది 1980 ల కాలం. ఆ ఊరు పేరు సిరిసిల్ల. ఒక గ్రామ పంచాయతీ. హైదరాబాద్ కు 100 కి.మీ దూరం లో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అది పల్లే కాదు పట్నం కాదు. ఆ ఊరిలో ఎక్కువ మంది చేతి వృత్తుల వారే. కాయ కష్టం తో బ్రతికే వారే ఎక్కువ. దిగువ మధ్యతరగతి కుటుంబం లో ఉన్న 16 సంవత్సరాల రాము, విమల ల జీవితమే ఈ కధ.
ఆ ఊరిలో ఒక ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీ ఉంది. ఉదయం 9:00 గంటలకు కాలేజీ మొదలయ్యే సమయం కావస్తోంది.

సీన్ -1

రాము : అమ్మా …ఏంటమ్మా ఇంకా లేటు…కాలేజీ టైం అయిపోతుంది. కారేజీ వద్దు లే , ఈ రోజు కాంటీన్ లో తింటాను. డబ్బులు ఇచ్చెయ్…

రాము తల్లి : చాలు చాల్లే…ఆ…ఏంటి కాంటీన్ లో తినేది. బయట తినడం బాగా అలవాటు అవుతుందా.. ఏంటి…….ఇందా బాక్స్, శుభ్రం గా తిను, వదిలేసినా కిందపడేసినా వీపు విమానం మోత మోగుతాది ఏమనుకుంటున్నావో.

రాము : ఆ..సరే అమ్మా. వెళ్లొస్తాను.

రాము తల్లి : వినాయకుడు కి దణ్డం పెట్టుకుని వెళ్లు.



సీన్ -2



రాము రివ్వున సైకిల్ స్టాండ్ తీసుకుని గబగబా తొక్కుతూ కాలేజీ కి బయలుదేరాడు. దారిలో మనసు లో ఇలా అనుకుంటున్నాడు. అయ్యబాబోయ్ ఈ రోజు సోమవారం మేథ్స్ మూడు పిరిడ్లు ఉన్నాయి. చచ్చాం ఎలారా బాబు… అసలే అర్దం అయి చావదు.
రాము వెనుకే విమల సైకిల్ తొక్కితూ వస్తుంది. విమల అదే కాలేజీ , రాము క్లాస్…. విమల , రాము ప్రక్కనే తొక్కుతూ….

విమల : హాయ్..రాము…మొన్న లెక్కలు సార్ ఇచ్చిన హోం వర్క్ చేశావా.

విమలను చూసి ఒక్కసారి ఖంగు తిన్నాడు రాము. సైకిల్ ఆపి తలపట్టుకుని...

రాము : అయ్య బాబోయ్…నేను హోం వర్క్ చెయ్యలేదు. నాకు అసలు గుర్తే లేదు. ఈ రోజు క్లాసులో నాకు దెబ్బలు తప్పవు. అని భయం గా , విచారం గా….మరి విమల నువ్వు చేశావా.

విమల : హ…. చేశాను….ఒక పని చెయ్యి రాము , సార్ అబ్బాయిలని బాగా గట్టిగ కొడతారు కదా…అమ్మాయిల్ని అయితే తిట్టి వదిలెస్తారు కదా…...నా పుస్తకం నీకు ఇస్తాను.  నా పేరు కొట్టేసి , నీ పేరు రాసి , సార్ కి చూపించు …ఈ సారికి….

రాము పై మనసు లో ఉన్న ఇష్టాన్ని అలా చూపించింది విమల.

రాము : ధాంక్స్.. విమల…

అని పుస్తకం అక్కడే తీసుకున్నాడు.



సీన్-3


ఇద్దరూ కాలేజీ లో క్లాస్ రూం లో కి ఎంటర్ అయ్యారు. ఇంకా సార్ రాలేదు …. క్లాసు అంతా గందరగోళంగా గోల గోల గా ఉంది. లెక్కల సార్ సుందరం గారు క్లాసులో కి వస్తూనే కాస్త కోపం గా ఉన్నారు.
స్టూడెంట్స్ అందరు లేచి గుడ్ మార్నింగ్ సార్ అంటున్నారు.

సుందరం సార్ :  సైలెన్స్…సైలెన్స్… గుడ్ మార్నింగ్ …. కూర్చోండి.  పేజి నెంబర్ 128 probability chapter exercise 2, first theorm నోట్ చేసుకోండి.

(అని బోర్డు మీద తీరమ్ రాసారు…కాసేపు తరువాత)

సుందరం సార్ : మొన్న ఇచ్చిన హోం వర్క్ నొట్స్ one by one తీసుకురండి.

వరుసగా అబ్బాయిలు ముందు తీసుకు వస్తున్నారు.

 రాము వంతు వచ్చింది. రాము కు కొంచెం చేతులు వణుకుతూ, చెమటలు పట్టాయి. 
హోం వర్క్ చెయ్యని అబ్బాయిలని ఒక రకం గా కర్రతో కొడుతున్నారు సార్….
ఇక అమ్మాయిల వంతు వచ్చింది.

సుందరం సార్ : విమల…విమల…నీ బుక్ తీసుకురా…

విమల : సార్.. మరేమో .. మరేమో హోం వర్క్ చెయ్యలేదండి.

సుందరం సార్ :  కోపం గా రా…ఇలాగ…బాగా చదివే పిల్లవి …ఏం పొగరు బలిసిందా… అమ్మాయిల ని ఊరుకుంటుంటే నెత్తిన ఎక్కుతున్నారు, చెయ్యి చాపు…

అని విమల రెండు అర చేతులు పై కర్ర తో చాలా గట్టిగా పది దెబ్బలు కొట్టారు.

విమల తట్టుకోలేక , అవమానం, బాథ తో ఏడుస్తూ వచ్చి కూర్చుంది.

రాము ఇదంతా గమనిస్తూ, సార్ అకస్మాత్తుగా ఎప్పుడూ లేనిది ఆడపిల్ల విమల ని కొట్టడం జీర్ణించుకోలేక , కోపం తో ,తన గుప్పెడు గట్టిగా బిగించి, తన వలనే ఇదంతా... అని బెంచి ని కొడుతున్నాడు.

మధ్యాహ్నం లంచ్ సమయం…

విమల కి రెండు అర చేతులు వాచిపోయి , కనీసం భోజనం బాక్స్ తెరిచి తినలేక అలాగే క్లాసులో కూర్చుని ఏడుస్తూ ఉంది.

రాము ఇదంతా గమనిస్తూ తనకు కూడా అన్నం తినబుద్ధి కాక, మౌనంగా కూర్చున్నాడు.

సాయింత్రం లాంగ్ బెల్ కొట్టారు. క్లాసులో అందరూ వెళ్ళిపోతున్నారు. రాము మాత్రం ఒంటరిగా బెంచి మీద కూర్చోని , విమల కు తన వలన జరిగిన అవమానానికి కృంగి పోతున్నాడు. 
ఇంతలో వాచ్ మెన్ తలుపులు మూయడానికి వచ్చాడు. 
వెంటనే రాము కళ్లు తుడుచుకుంటూ సైకిల్ స్టాండ్ కి వెళ్లి సైకిల్ తొక్కితూ , ఇంటికి బయలు దేరాడు.


సీన్ – 4


ఆ రోజు సాయంత్రం కాలేజీ నుండి వెళుతూ....
దారిలో విమల తన సైకిల్ తో నెమ్మదిగా నడుచు కుంటూ వెళ్తుంది. 
అది చూసిన రాము సైకిల్ దిగి, విమల ప్రక్కగా వచ్చి , విమల తో సమానంగా నడుస్తూ…

రాము :  సారీ విమల….నా వలనే ఇదంతా ….. సారీ…. ఏమైంది సైకిల్ నడిపిస్తున్నావు.

విమల :  బొబ్బలెక్కిన రెండు అరచేతులు చూపిస్తూ….
సైకిల్ పట్టుకొని తొక్కడం నా వలన కావడం లేదు.

రాము : విమల చేతులు చూసి , దుఃఖం ఆపుకోలేక దుర్మార్గుడు మరీ ఆడపిల్ల ని కూడా ఇలా కొట్టాలా …. అని కోపం తో అరిచాడు.

విమల : తప్పు రాము…సార్ ని అలా అనకూడదు.

ఇద్దరూ సైకిళ్ళు తో అలా నడుస్తూ ఉన్నారు.
విమల కూడా తనలాగే మధ్యాహ్నం భోజనం చెయ్యలేదని …. 
రాము ఒకచోట చెరకు రసం బండి దగ్గర విమల ని ఆపి రెండు రూపాయలిచ్చి చెరకు రసం ఇద్దరికీ కొన్నాడు. 
గ్లాసు విమల కి ఇస్తూ…

రాము : ఇదిగో విమల .. మధ్యాహ్నం నువ్వు అన్నం తినలేదు కదా…ఇది తాగు నీరసం ఉండదు.

విమల : నీ కెలా తెలుసు….

రాము :  నేను మధ్యాహ్నం అంతా నిన్నే చూస్తూ ఉన్నాను….. నేను కూడా తినలేదు.

అది విని విమల కి చాలా బాధగా అనిపించింది…
కానీ మనసు లో రాము తో అలా ఉండడం సంతోషంగా అనిపించింది…
ఇళ్లు దగ్గర అవుతుండడం తో ఎవరి దారిలో వారు వెళ్లి పోయారు.


సీన్ – 5


ఇంటికి వచ్చిన విమల నిజం చెపితే , తండ్రి తిడతాడని కాలేజీ లో జరిగినదంతా దాచిపెట్టి…..

ఇంటికి వచ్చే దారిలో సైకిల్ తో గోతిలో పడడం వలన , రెండు చేతులు నేలపై ఆన్చడం వలన చేతులు అలా వాచాయని చెప్పింది. 
తల్లి వెంటనే కొబ్బరి నూనె రాసింది.

ఆ రాత్రి కి విమల కి విపరీతమైన జ్వరం వచ్చింది.

కానీ విమల కి రాము ను తలచుకున్నప్పుడల్లా ధైర్యంగా, తేలికగా, ఆనందంగా ఉండేది.



సీన్ – 6


అదే రోజు....
ఇంటికి చేరిన రాము , చాలా దిగులు గా ఉన్నాడు. ఇంతలో తల్లి...

రాము తల్లి : గట్టి గా అరుస్తూ..…
అన్నం తినకుండా తిరిగి తెచ్చావు….
రుచులు కావాల్సి వస్తన్నాయా….
అని వీపు మీద రెండు బాదింది….

మీ అయ్య.... ఎంత కష్టం సేత్తే….
ఈ ముద్ధ దొరుకుతుందో తెలుసా నీకు…
రాత్రి కి ఇదే తిను అని అక్కడే పెట్టింది.

ఆ రాత్రి రాము కు నిద్ర పట్టలేదు. అసలు తనకి చదువు మీద అంత శ్రద్ధ లేదు. 
అసలు నేను దేనికి ఉపయోగం అవుతాను అని అనుకుంటూ….అంత బాగా చదివే విమల తనకు ఎందుకు ఇంత సాయం చేసింది. అని అతిగా ఆలోచిస్తూ ఆ రాత్రంతా మదన పడుతూనే ఉన్నాడు రాము.


సీన్ -6


మరుసటి రోజు ఉదయం, రోజూ కంటే ఆరగంట ముందుగా కాలేజీ కి బయలు దేరాడు రాము. 

దారిలో ఒక చోట ఆగి విమల కోసం ఎదురు చూస్తున్నాడు. 
విమల ఎంతకీ రాక పోయేసరికి చేసేది లేక కాలేజీ కి వెళ్లాడు. 
విమల క్లాసులో కనిపించక పోయేసరికి చాలా ముభావంగానే ఉన్నాడు.  
సరిగా పాఠం కూడా వినలేక పోయాడు.

రాము ఆ రోజు రాత్రి , విమల కి ఏమైందో , ఏంటో, ఎలా ఉందో అని ఆలోచిస్తూ నే పడుకున్నాడు.



సీన్ -7



ముందు రోజు లాగే, రాము తొందరగా కాలేజీ కి బయలు దేరి , విమల రాక కోసం ఎదురు చూసాడు.

విమల ఆ రోజు రాకపోయేసరికి రాము కి పిచ్చిగా, కంగారుగా, చికాకు గా అనిపిస్తుంది. 
తెలియకుండా నే ఏడుస్తూ చొక్కా తో కన్నీళ్లు తుడుచు కున్నాడు....
కాలేజీ నుండి తిరిగి వెళ్లేటప్పుడు , 
విమల కనిపిస్తుందేమో అని విమల ఇంటి ముందు నుంచి సైకిల్ బెల్ కొట్టుకుంటూ వెళ్లాడు. 

మరల తిరిగి వెనక్కి విమల ఇంటి ముందు కి వచ్చి సైకిల్ ఆపి , 
ఏదో రిపేర్ చేస్తున్నట్లు పది నిమిషాలు వేచి చూసాడు కానీ, విమల కనిపించలేదు. 
చేసేది లేక ఇంటికి వెళ్ళి పోయాడు.



సీన్ – 8

అదే రోజు న సాయంత్రం....
అప్పటికే మూడు రోజుల నుండి జ్వరం తో ఉన్న విమలకి, ఆ రోజు తగ్గుముఖం పట్టింది. 

రాము సైకిల్ బెల్ మోగించి తన ఇంటి ముందు నుంచి వెళ్లి రావడం.....   
తన ఇంటి ముందు నిలబడి సైకిల్ రిపేర్ చేస్తున్నట్లు నటించడం, 
రాము ముఖ కవళికలు గమనించి, 
తన కోసమే వచ్చాడని తెలిసి , 
తన ఇంటి చెక్క తలుపు రంధ్రం లో నుండి అంతా చూస్తూ, 
మనసు లో నే నవ్వుకుంటూ , ఆనందం లో తేలిపోతుంది విమల.

ఆ రాత్రి విమల కి నిద్ర పట్ట లేదు ఆనందం తో….

రాము కి కూడా నిద్ర పట్టలేదు విమల కనపడలేదనే బాధతో….



సీన్ – 9


ఆ తర్వాత రోజు కూడా , ముందు రెండు రోజుల్లాగే కాలేజీ కి అరగంట ముందు బయలు దేరాడు రాము….
కాలేజీ కి తొందరగా బయలుదేరడాన్ని,  
అప్పటికే రోజు గమనిస్తున్న తల్లి…

రాము తల్లి : ఏం రాచ కార్యాలు యెలగ బెడతున్నావు.....
ఊరికి ముందే‌ బయలు దేరుతున్నావు.....
సదివేది ఏమైనా ఉందా…..
లేకపోతే మీ అయ్యతో కూలి పనికి యెళ్లి…
నాలుగు రూపాయలు సంపాదించు.

రాము :  ఆ..ఆ.. చదువుతున్నాను….
ప్రైవేటు క్లాస్ ఉంది, 
అందుకే తొందరగా వెళ్తున్నా…
బాక్స్ ఇలా ఇవ్వు…

అని సైకిల్ మీద బయలు దేరి, రోజు ఆగే చోటే , విమల కోసం ఆగి ఎదురు చూస్తున్నాడు రాము.

ఆ రోజు,  సైకిల్ మీద పసుపు పచ్చని పరికిణీ లో , నవ్వుతూ వస్తున్న విమలను , కాస్త దూరం నుంచి చూస్తే సరికి ...రాము పట్టలేని సంతోషం తో ఎగిరి గంతేసి....
విమల తన దగ్గర గా రాగానే…

రాము : విమల ఎలా ఉన్నావు….
ఏమైంది మూడు రోజుల నుండి కాలేజీకి రాలేదు. 
నాకు చాలా భయం వేసింది. 
నీకు ఏమయ్యిందో అని. 
ఇదిగో ఈ బొట్టు పెట్టుకో…..
నువ్వు ఈ రోజు ఎలాగైనా నాకు కనపడాలని , నూకాలమ్మ తల్లి గుడి కి వెళ్లోచ్చాను.

విమల: ఆ రోజు రాత్రి నుండి జ్వరం రాము…
ఈ రోజే తగ్గింది..... నువ్వెలా ఉన్నావు....
రోజు కాలేజీ కి వెళ్తున్నావా....
ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా …

అని అనుకుంటూ ఇద్దరూ కాలేజీ కి సైకిల్ తొక్కుతూ వెళ్లారు.

విమల తో స్నేహం రాము లో చాలా మార్పు తీసుకువచ్చింది.


సీన్-10


ఒకరోజు రాత్రి రాము ఇంటి లో పెద్ద గొడవ. 
తండ్రి కూలి డబ్బులు ఇంట్లో ఇవ్వక పోగా, 
బాగా తాగి , తన తల్లి ని కొట్టడం చూసి తట్టుకోలేక …
బాగా ఏడుస్తూ, ఆలోచిస్తున్నాడు రాము ఇలా….. 

నాకు చదువు ఎందుకు అబ్బడం లేదు, 
నా కుటుంబ పరిస్థితి అంతంతే, 
రేపు ఇంటర్ అయ్యాక కూలి పనులకే వెళ్లాలా….. 

నేను విమల లాగా బాగా ఎందుకు శ్రద్ద గా చదువు కోలేను. 
మంచి గా చదివితే ఉద్యోగం చెయ్యొచ్చు కదా, అప్పుడు నాకు నచ్చినట్టు ఉండొచ్చు కదా అనుకున్నాడు.

ఆ మరుసటి రోజు విమల కి, ముందు రోజు రాత్రి ఇంట్లో జరిగిన తండ్రి గొడవ, తన మనసు లో బాగా చదువుకుని ఉద్యోగం చెయ్యాలనే కోరిక చెప్పాడు రాము.

అది విన్న విమల, రాము లో మార్పు కి చాలా చాలా సంతోషించి ….
లో లోపల , నీ లో నాకు కావాల్సింది ఇదే. 
అని తన జీవితం గురించి ఆనందం గా ఊహించుకుంటూ మనసు లో అనుకుంది విమల.


సీన్ – 11


రోజులు గడుస్తున్నాయి. రాము కి విమల మరియు మిగిలిన స్నేహితులు చదువు లో అర్దం కాని అంశాలు మరలా చెబుతూ సహాయం చేస్తున్నారు.

రాము కి క్రమేపీ చదువు పై బాగా శ్రద్ద పెరిగి, క్లాసులో జరిగే పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకుంటూ , మొదటి పది మంది లో ఒకడిగా నిలబడుతున్నాడు.

అది చూసిన విమల , రాము ఎప్పటి కైనా గొప్ప వాడు అవుతాడని అనుకునేది. 
రాము లో మార్పు కి తనే కారణం అని మనసు లో గర్వం గా ఫీల్ అయ్యేది.


సీన్ – 12



బోణాల పండుగ వచ్చింది. 
ఊరంతా తిరణాళ్లు తో కోలాహలం గా ఉంది. 
రాము పండుగ రోజు సాయంత్రం తిరణాలకి వెళ్లాడు. అక్కడ విమల తన స్నేహితులతో ఉండడం చూసి, వెళ్లి పలకరించాడు.

అక్కడ విమల, ఆ పండుగ, ఆ కోలాహలం అంతా చూస్తూ ఉంటే రాము కి , విమల పై మనసు లో ఏదో తెలియని, ఆపుకోలేని ఇష్టం మొదలైంది. 
విమల తో మాట్లాడుతున్నా గాలి లో తేలితున్నట్లు ఉంది రాము కి.

అలా రాము విమల తో మాట్లాడుతున్నా సమయం లో, విమల భుజం పై లో బనియన్ తెల్లగా కనిపిస్తుంది. 
అది చూసిన రాము సరిచేసుకోమని సైగ చేసి తల దించుకున్నాడు. 
విమల సిగ్గు పడుతూ సరిచేసుకుంది. 
ఇంకా కలర్ సోడా కొని తాగమని ఇచ్చాడు, రాము.

ఆ రోజు రాత్రి రాము కి నిద్ర పట్టలేదు. 
విమల తో ఉంటే తనలో చాలా మంచి మార్పులు వస్తున్నాయి. 
చాలా సంతోషం గా కూడా ఉంటుంది. అదే విమల తనతో ఎప్పుడూ ఉంటే ఇంకా ఎంత బాగుంటుందో అని కలలు కన్నాడు.

మరో వైపు విమల స్థితి కూడా అలాగే ఉంది.
చెప్పాలంటే రాము కంటే ముందు నుంచే విమలకి , రాము అంటే తెలియని ఇష్టం ఉండేది.


అది ప్రేమో, స్నేహమో తెలియని స్థితికి ఇద్దరూ చేరుకున్నారు.


సీన్ – 13


ఇంతలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు వచ్చాయి. 
రాము తన జీవితం లో ఎప్పుడూ లేనిది ఒక ఉద్యమం లా, పగలు రాత్రి చదువుతున్నాడు.

ఆ రోజు ఆఖరి పరిక్ష  రాసేసిన తరువాత,
రాము , విమల కలిసి నడిచి వస్తున్నారు.

విమల :  అన్నీ పరీక్షలు బాగా రాసావా..

రాము : హు…చాలా బాగా రాశాను… నీ వలనే.

విమల : ఆ.…నేనేం చేశాను బాబు…
నువ్వే చదివావు, రాసావు….
రేపటి నుంచి రెండు నెలలు శెలవులు కదా….
నీ కేమి అనిపించడం లేదా…

రాము : ఎందుకు లేదు....
నువ్వు నా కు రేపటి నుంచి కనిపించవు కదా…..
ఎలా ఉండాలో తెలియడం లేదు…దిగులు గా.

విమల : కాసేపు , ఈ గుడి పక్కన చింత చెట్టు దగ్గర కూర్చుని వెళ్దామా…

రాము : సరే…

ఇద్దరూ సైకిళ్ళు పక్కన పెట్టి…కూర్చున్నారు. 

సమయం ఉదయం 11:30 గంటలు కావస్తోంది. 
ఎండ పెరుగుతుంది. కానీ పల్లే గ్రామం వలన చుట్టూ పొలాలు, పెద్ద చింత చెట్టు, నీడ వలన చల్లదనం, నిశ్శబ్దం …. వాతావరణం హాయిగా ఉంది.

రాము : దిగులు గా తల దించుకుని ఉన్నాడు.

విమల : ఏంటి రాము…ఏదైనా మాట్లాడు.

రాము : ఏం మాట్లాడను…..
ఏం మాట్లాడాలో తెలియడం లేదు.

విమల : నెమ్మదిగా ధైర్యం చేసి…
నేను లేకుండా నువ్వు ఉండగలవా రాము. అంది.

అది విన్న రాము కి కళ్లలో నీళ్లు వచ్చెస్తున్నాయి…
ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు….వెంటనే

రాము : విమల వైపు చూడకుండానే….
నేల వైపు చూస్తూ....
నువ్వు అంటే నాకు చాలా ఇష్టం విమల....
నువ్వు లేకపోతే నేను ఉండలేను.....
బాగా చదివి, మంచి ఉద్యోగం వచ్చాక....
నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది…..

అని పాఠం అప్ప చెప్పినట్లు కంగారుగా, బాధతో, భయం గా చెప్పాడు.


విమల : ఏయ్…ఇలా చూడు...

రాము : నేల వైపు చూస్తున్నాడు.

విమల : ఏయ్…నిన్నే.. దిక్కులు చూస్తావేం…
ఇలా నా కళ్లల్లోకి చూడు...

రాము : చలనం లేదు….

విమల : సంతోషం ఆపుకోలేక…
ఒక్కసారిగా రాము ని దగ్గరకు తీసుకొని...
రెండు బుగ్గల పై గట్టి గా ముద్దు పెట్టుకుంది.

ఆ ఊహించని సంఘటన కి రాము కి చెమటలు పట్టాయి….
జీవితం లో మొదటిసారి ఒక అమ్మాయి స్పర్స తగలేటప్పటికి కళ్లు తిరిగినట్లు అయింది.

కాసేపు ఆగి లేచి నిలబడిన తరువాత….
ఒకరి చేతులు మరొకరు పట్టు కొని , నడిచి వెళ్లారు.

వారిద్దరి కి …..ఆ రోజు..…జీవితం లో మరచి పోలేని రోజు.



సీన్ – 14



ఆ వేసవి శెలవులంతా ఒకరిని మరొకరు చూసుకోకుండా నే గడిచిపోయాయి.
రెండవ సంవత్సరం కాలేజీ తిరిగి పునః ప్రారంభం అయింది.
అదే రోజు ఇంటర్మీడియట్ మెదటి సంవత్సరం ఫలితాలు వచ్చాయి. 
అందరూ కాలేజి లో హడావుడి గా ఫలితాలు బోర్డు లో చూసుకుంటున్నారు. 

మంచి మార్కులు వచ్చిన వారు గెంతులు, ఫెయిల్ అయిన వారు ఏడుపు ముఖం తో ఉన్నారు.

విమల కి 70 శాతం మార్కులు అని ఆనందంగా వచ్చి క్లాసులో చెపుతుంటే రాము విన్నాడు. 
తను ఇంకా నెంబర్ నోటీసు బోర్డు లిస్ట్ లో చూసుకోలేదు.

విమల సైగ చేసింది. నీ కెన్ని మార్కులు అని. 
పెదవి విరిచాడు రాము.

కాసేపు తరువాత రాము వెళ్లి తన నెంబర్ చూసుకున్నాడు. 
92 శాతం మార్కులు, కాలేజీ ఫస్ట్ రాంక్ మార్కులు వచ్చాయి.
చాలా సేపు నమ్మలేక నెంబర్ తనదా కాదా అని చూసుకున్నాడు.

రాము ఆనందంగా వచ్చి విమలకి తన నోటితో చెప్పుదామనే లోపు.....
క్లాసులో క్లాస్ టీచర్ కూర్చోని ఉన్నారు.

రాము నెమ్మదిగా తన బెంచి దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు.

ఇంతలో కాలేజీ ప్రిన్సిపాల్ వచ్చి…

ప్రిన్సిపాల్ : ఈ ఏడాది, ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో మన కాలేజీ కి జిల్లాలో నే ప్రధమ స్థానం....
రాష్ట్రంలో 8 వ స్థానం లో ఉంది....
కాలేజీ చరిత్ర లో ఇదే ప్రథమం....
అది రాము ద్వారా వచ్చింది......
రాము కి 92 శాతం మార్కులు వచ్చాయి.... 
అని పిలిచి అభినందించారు.

అందరూ రాము ని అభినందిస్తూ ఉంటే …
విమలకి మరో ప్రపంచం లా ఉంది.

ప్రిన్సిపాల్ : రాము… ఇలాగే రెండవ సంవత్సరం మంచి మార్కులు తెచ్చుకొని..... 
కాలేజీ కి రాష్ట్ర స్థాయిలో రాంక్ తీసుకురావాలని అభినందించారు.

ఆ నోటా , ఈ నోట రాము గురించి ఆ ఊరిలో, అందరి ఇళ్ళలో తెలిసింది. 
న్యూస్ పేపర్ లో కూడా చిన్నగా రాసారు.

ఆ రోజు రాత్రి రాము, ఇదంతా విమల వలనే కదా…తను దెబ్బలు తినకపోతే నాకు ఇంత మేలు జరిగేది కాదు కదా.....అని అనుకున్నాడు.

ప్రిన్సిపాల్ చెప్పింది కూడా నిజం చెయ్యాలి, అంతకంటే తనకు వేరే మార్గం లేదు, అనుకున్నాడు.

రాము తల్లి కూడా ఇంతకు ముందు లా రాము ని , ఏమీ అనడం లేదు.


సీన్ – 15


ఒక రోజు , ఆదివారం నాడు  రాము ఇంటి దగ్గర ఉండగా నే….
తన తండ్రి పని చేసే యజమాని, భూస్వామి రంగారావు వచ్చాడు.

తల్లి, తండ్రి, రాము ఆ సమయంలో అక్కడే ఉన్నారు.

రంగారావు : ఏ రా అప్పి (రాము తండ్రి)…ఏం టి ..
రెండు రోజుల నుండి పొలం లో పనికి రావడం లేదు…ఓపిక లేదా…
లేక చుక్క పడలేదా….
నీ వాడకం ఎంతుందో తెలుసా…
ఆరువేల రూపాయలు…
ఎవడు తీరుస్తాడు, నువ్వు పని ఎగదొబ్బితే…

ఆ….ఈడేనా…నీ కొడుకు…
ఏరా నువ్వు సాలా గొప్ప గా సదువు తావంట గదా…ఊరిలో సెపితే యిన్నాను….
ఈ సదువు, నీకు కూడు, గుడ్డ ఎట్టదు గాని..... 
మీ అయ్య బదులు నువ్వు రా పనికి …

రాము తల్లి : అయ్య…ఆడు సిన్న పిల్లోడు అయ్య…
ఆడినేటి అనకండి....
రేపటి నుండి నా మొగుడు పనిలోకి వత్తాడయ్యా....
మీకు దణ్డం పెడతాను…
మీరు ఎల్లండి....

రంగారావు : ఆ ..ఆడదానివి …సెబుతున్నావు,
కాబట్టి వెళ్తున్న…
తేడా వస్తే ఊరుకునేది లేదు.


అదంతా.. చూసి.. రాము కి తన ఇంటి పరిస్థితి బాగా అర్దం అయింది. 
మరుసటి రోజు కాలేజీ నుండి వస్తూ , విమల కి తన ఇంటి లో జరిగిన భూస్వామి గొడవ అంతా చెప్పాడు….. విమల నిట్టూర్చింది.



మిగిలినది.... ఎపిసోడ్ -2 లో....


యడ్ల శ్రీనివాసరావు.... 3 , 4 మార్చి 2022.


https://yedlathoughts.blogspot.com
yedlasrinivasrao@gmail.com
WhatsApp +91 9293926810
              📞  +91 8985786810














488. నా ప్రపంచం

నా ప్రపంచం • నా దొక   ప్రపంచం   అది   సోయగాల   సౌందర్యం. • నా  మనసెరిగిన   ప్రపంచం   మధువొలికిన     అనందం. • అందాల   ఆరబోతలు   ఆదమరచి   ...