💐స్త్రీ మూర్తులు నాడు నేడు💐
🙏🙏🙏
• స్త్రీ, ప్రకృతి, మహిళ, మగువ ఇలా ఎన్ని పేర్లతో... ఏ మనిషి పిలిచినా లేదా పలికే శబ్దం లో ఒక మమకారం, ఒక మమత, ఒక మనసుకు కావలసిన శక్తి గా అనిపిస్తుంది, అనడం లో అతిశయోక్తి లేదు…
ఎందుకంటే ఈ సృష్టి కే ప్రతి సృష్టి స్త్రీ. ఓర్పు, సహనం లో స్త్రీ మూర్తి ని భూదేవి తో సమానం గా, శక్తి కి మూలాధారం అయిన దైవం గా చెపుతారు. అది దేవుని సృష్టి యెక్క గొప్పదనం.
☘️☘️☘️☘️☘️
• పూర్వం మన తల్లి , నానమ్మల కాలం లోకి చూస్తే వారి కుటుంబాలు, జీవనవిధానం, ఆలోచనలు, ఆహార్యం ఎంత చక్కగా, అందంగా ఉండేదో. కేవలం ఇంటిలో ఉన్న ఈ స్తీ మూర్తుల వలన, ఇల్లంతా కళకళలాడుతూ, చక్కటి పాజిటివ్ ఎనర్జీ తో ఆనందంగా ఉండేది. కాసేపు కళ్లు మూసుకుని ఆలోచించండి, ఇది ఎంత నిజమో తెలుస్తుంది.
మన బాల్యం లో , మన ఇంటి లో అమ్మ, అమ్మమ్మా, నానమ్మ లను చూసినా, వారి మాటలు విన్నా, మనకి ఏరోజు , ఏ విషయం లోను, ఏ లోటు లేకుండా హాయిగా ఉండేవాళ్లం. ఎందుకంటే వారు కుటుంబ సంతోషానికి ప్రతినిధులు గా విలువలతో ఉండేవారు. ఎన్నో కుటుంబ సమస్యలను మాటలతో పరిష్కరించేవారు. సంతోషాన్ని ఇచ్చే వారు. ఎంతమంది నైనా సంతోషం గా పెంచేవారు. నిజం గా ఆ రోజుల్లో కనీసం చదువు కూడా చదవని తల్లి , కుటుంబ సంస్కరణలు అమలు చేసే విధానం ఎంతో ఆదర్శనీయం. అదే పిల్లల పై చాలా మంచి ప్రభావం చూపేది. ఆనాడు తండ్రి లేదా మగవారు వృత్తి ని మినహా, ఇంటిని చక్కదిద్దే ఆలోచన ఎక్కువ గా ఎవరికీ ఉండేది కాదు. అంటే పిల్లల ను పెంచడం కావచ్చు, బాల్యం లో పిల్లల యెక్క మానసిక భయాలు తొలగించడం , వారిని ధృడంగా తయారు చేయడం, మంచి కధలు చెప్పడం , ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలపై విపరీతమైన చక్కటి ప్రభావం , పాత్ర తల్లి దే ఉండేది. ఒక మనిషికి స్తీ మూర్తి యెక్క చేయి, ఆశీస్సులు తగలనిదే, నాడైనా నేడైనా మనుగడే లేదు.
☘️☘️☘️☘️☘️
• ఈ రోజు ధైర్యంగా నిజం చెప్పాలంటే, ఏ మగవాడు అయినా తనకంటూ ఒక మనసు ఉంది అని ఆలోచించ గలిగే వాడయితే ……. అతని మనసు ముమ్మాటికీ ఒక స్తీ మూర్తి దై ఉంటుంది…..అది తల్లి, సోదరి, భార్య, కూతురు, ప్రియురాలు, స్నేహితురాలు, ఆత్మబంధువు ఏ బంధం అయినా కావచ్చు.
అందుకే అంటారు జీవితం లో స్థిరపడినా, లేదా విజయం పొందిన ప్రతీ మగవాని వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని.
మనసు అనే పదం సున్నితమైనది, అది స్త్రీ కు ఒక హక్కు వంటిది.
☘️☘️☘️☘️☘️
• కానీ నేటి ఆధునిక కాలంలో ప్రతీ ఒక్కరి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. చెప్పాలంటే నేటి మహిళల జీవన విధానం ఒక ఛాలెంజింగ్ లా అయిపొయింది. ఒకవైపు ఇల్లు , పనులు మరోవైపు ఉద్యోగం, వ్యాపారం చేయవలసి రావడం, ఇంకా పరిస్థితులు , అవసరాలు, జీవన విధానం వలన విపరీతమైన మానసిక ఒత్తిడి తో కూడిన జీవితం వందకు తొంభై మంది(బయటకు చెప్పుకోలేక) స్త్రీ లు అనుభవిస్తున్నారు.
అందుకే నేటి మహిళల కు చిన్న వయసులోనే రక్త హీనత, థైరాయిడ్, హార్మోన్ సమస్యలు, యుక్త వయసు లోనే గర్భకోశ సమస్యలు వంటివి చాలా సహజం అయిపొయాయి. అందువలన ఆరోగ్యం సహకరించక, వారిలో సహజంగా ఉండవలసిన ఓర్పు, సహనం కొరవడుతోంది, ఇది నిజం. కానీ నేటి కాలంలో చాలా మంది మహిళలు ఈ విషయం గమనించ లేక , వారి ఆరోగ్య సమస్యలని తాము వెంటనే గుర్తించలేక, అవగాహన లోపం తో బాధ పడేవారు చాలా మంది ఉన్నారు. దీని వలన నిరంతరం ఒత్తిడి కి లోనవుతూ , చిరాకు, విసుగు, కోపం, ఆందోళన పెరిగి , వారు మాట్లాడే విధానం తీరు మారడం వలన కుటుంబ సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి……ఈ విషయంలో ముమ్మాటికీ కొంత తప్పు మగవారిలో ఉంది అనిపిస్తుంది ….మహిళలను అర్దం చేసుకోవడం, వారికి కుటుంబ అవసరాలు, మరియు ఇంటి పనులు అవసరమైనపుడు సహకరించడం, స్త్రీ ల మానసిక ఒత్తిడి ని అర్దం చేసుకోవడం అనేది నేటి కాలంలో ప్రతీ మగవాడి కనీస బాధ్యత. (క్షమించాలి నా ఉద్దేశం ఆడవారిని జాలితో చూడమని కాదు.) వారి మనోభావాలను గౌరవించాలి.
పురుషులు శారీరకం గా బలవంతులైతే, స్త్రీ లు మానసికంగా చాలా బలవంతులు.
ఒక శరీరం బలంగా ఉండాలంటే శరీరం (మగవారు) వెనుక మానసికంగా మనసు (స్త్రీ) మరింత బలంగా ఉండాలి.
అందుకే నవ సమాజ స్థాపన ఆరోగ్యం గా, ఆనందంగా ఉండాలి అంటే స్త్రీ లను గౌరవించాలి, అభిమానించాలి, ప్రేమించాలి, రక్షించుకోవాలి, వారిని బలోపేతం చెయ్యాలి. ఇది ప్రతి ఒక్కరి భాధ్యత.
☘️☘️☘️☘️☘️
• మహిళా దినోత్సవం అంటే మహిళల అనేక రంగాలలో సాధించిన విజయాలను ప్రశంసించుకోవడమే కాదు, వారి పట్ల సమాజం మరియు కుటుంబం లో నిర్లక్ష్యం తో ఉన్న ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగించాలని , అదే మహిళల కు ఇచ్చే గౌరవంగా భావిస్తూ రాస్తున్నాను……
నా ఈ ఆలోచనల వెనుక కనిపించని భగవంతుడు ఉంటే, నేను రాస్తున్న రచనల వెనుక నన్ను ప్రోత్సహించిన స్త్రీ మూర్తి పూర్వ కాలంలో ఉండేది....
ఇది చదివిన తరువాత, కొద్ది మంది లో నైనా ఒక చిన్న మార్పు, అవగాహన కలిగి, అర్దం చేసుకుని వారి కుటుంబాలను సంతోషమయం చేసుకుంటారని ఆశతో…
🙏 స్త్రీ మూర్తులు అందరికి శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు , పాదాభివందనాలు.🙏
☘️☘️☘️☘️☘️
• ఏ బంధం అయినా బలోపేతం అవ్వాలంటే ప్రేమ ఉన్నా లేకపోయినా పరవాలేదు కానీ అవసరాన్ని మించిన అహంకారం మాత్రం ఉండకూడదు. అదే విధంగా లోకం లో మంచి, చెడు అనేవి చాలా సహజం. లింగభేదం తో సంబంధం లేకుండా మంచి, చెడు అనేవి అందరిలోను ఉంటాయి. ఎవరిలో నైనా ఉన్న లక్షణాలు, గుణగణాలు అనేవి భగవంతుని కే వదిలేసి మనం మాత్రం పాజిటివ్ గా నే ఆలోచిద్ధాం…. ఎందుకంటే మనిషి లోని పాజిటివ్ శక్తి ని మాత్రమే ప్రకృతి అంగీకరిస్తుంది. అదే మనం సంతోషంగా జీవించడానికి ఉపయోగపడుతుంది.
☘️☘️☘️☘️☘️
• గమనిక : ఇదంతా నీతి బోధ గా భావించే వారికోసం కాదు. అన్నీ మాకు తెలుసు అనుకునే వారి కోసం అంతకన్నా కాదు. ఇంకా నేటి సమాజంలో అవగాహన లేమితో చాలా మంది ఉన్నారు …వారి కోసం మాత్రమే. 🤝
యడ్ల శ్రీనివాసరావు, 1 మార్చి 2022 11:45 pm.
No comments:
Post a Comment