Thursday, March 17, 2022

139. కళాశాల 1980 ఎపిసోడ్ -4

 

కళాశాల 1980

ఎపిసోడ్ -4



   సీన్ – 24


రాము ఎక్కిన బస్ హైదరాబాద్ నుంచి సిరిసిల్ల చేరుకుంది. బస్ దిగి ఊర్లో కి అడుగు పెట్టగానే రాము చిన్న పిల్లాడిలా ఎగిరి గంతులు వేస్తూ, చాలా రోజుల తర్వాత ఊరు చూసిన ఆనందంలో , ఉత్సాహం తో ఉరకలు వేస్తూ , రెండు చేతులతో సంచులు మోస్తూ , ఇంటికి వస్తున్నాడు.

దారిలో రాము ను చూసి , కొందరు ఆపి ఇంటర్ రాంక్ వచ్చి నందుకు, పేపర్ లో రాము ఫోటో వేసినందుకు, ఊరికి మంచి పేరు తెచ్చాడని అభినందిస్తున్నారు.

రాము ఇంటికి రాగానే, తల్లి ఒక్కసారిగా పరుగున వచ్చి

రాము తల్లి : ఎంత సిక్కిపోయావు…రాము…ఎలా ఉన్నావు రా…ఎన్నాళ్ళయిందో బిడ్డని చూసి….. పరిచ్ఛ బాగా రాసావా….. పోయి కాళ్లు సేతులు కడుక్కు రా….అన్నం తిందువు గాని…..

రాము : సరే అమ్మా.

అక్కడే ఉన్న రాము తండ్రి…. రాము ని చూసి గొప్పవాడు అవుతున్నాడని…. లో లో సంతోషిస్తున్నాడు.

రాము కంగారుగా అన్నం తినేసి…సైకిల్ తీస్తున్నాడు…. ఊరిలోకి వెళ్లడానికి.

రాము తల్లి : ఎక్కడికి రా….ఇంత మధ్యాన్నం…సూరీడు కాలి పోతుంటే….

రాము : మరి…. ప్రిన్సిపాల్ గారిని కలిసొత్తా….

రాము తల్లి : ఆనక…సల్లబడ్డాక పో…ఈ ఎండలో ఎందుకు…

రాము , తల్లి చెప్పిన మాట వినకుండా …సైకిల్ తొక్కుతూ …. తిన్నగా విమల ఇంటి ముందు కి వచ్చి, సైకిల్ బెల్ మోగించి మోగించి కొడుతూ…అటు ఇటు ఆ వీధిలో రెండు సార్లు తిరిగాడు. నిద్రపోతూ , ఆ సైకిల్ బెల్ శబ్ధం విన్న విమల ఒక్కసారిగా లేచి, ఇది కలా…నిజమా…అని కళ్లు తుడుచుకుంది…. ఇంతలో సైకిల్ బెల్ మళ్లీ మోగింది…..ఇక విమలకి అర్థం అయిపోయింది, తన రాము యే అని…. వెంటనే ఇంటి లో నుంచి బయటకు పరిగెత్తింది……రాము బయట నిలబడి సైగ చేసాడు…చింత చెట్టు దగ్గరకు రమ్మని….

విమల వెంటనే సైకిల్ మీద చింత చెట్టు దగ్గరకు వచ్చింది.

సుమారు 60 రోజుల తర్వాత ఎదురు పడిన విమలను చూస్తూ ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నాడు రాము.

విమల, రాము కళ్లల్లో కి చూస్తూ…. పట్నం వలన వచ్చిన మార్పులు చూసి …కొత్తగా , వింతగా , కళ్లు ఆర్పకుండా చూస్తుంది.

రాము : విమల కళ్లల్లో కి చూస్తూ…. చిటికె వేస్తూ…వోయ్…విమల…విమల…నిన్నే…. ఏం.. నేను ఎవరో తెలియడం లేదా….

విమల : ఒక్కసారిగా ఈ లోకంలో కి వచ్చి …రాము…ఎంత మారిపోయావో…అసలు నువ్వేనా….ఈ బట్టలు ఎంత బాగున్నాయో…. అని తన చేతులతో రాము భుజాలను సంతోషంగా, స్వతంత్రం గా కుదిపెస్తుంది.

రాము : హ..… ఎస్….నేనే…రాము ని అని ఆనందంగా ఫోజు కొడుతూ, రాని మీసం మీద చెయ్యి పెట్టి తిప్పుతున్నాడు.

విమల : అబ్బో…చాల్లే…సంబరం…అని రాగం సాగదీసి …చెవి మెలి తిప్పింది.

రాము : ఆ…ఆ…చెవి వదిలెయ్…ఏదో సరదాగా విమల.

ఇద్దరూ కింద కూర్చున్నారు…. సరదా గా కబుర్లు చెప్పుకుంటున్నారు. రాము ఈ రెండు నెలలు ఎలా గడిచిందో…రాజారాం గారి కుటుంబం, భార్య, శైలజ తనను ఎలా ఇన్నాళ్లు చూసారో, తను వారితో సినిమా కి వెళ్లిన విషయం , ఇంత కాలం విమల ను గుర్తు చేసుకున్న సందర్భం, తన చదువు గురించి , ప్రతీది పూసగుచ్చినట్లు విమల తో చెప్పాడు.

అది అంతా విన్న, విమల రాము ను చూసి ఇదివరకటి కంటే రాము పై ఎక్కువగా నమ్మకం, ప్రేమ , సంతోషం ఆ సమయంలో మనసు లో పొందుతూ ఉంది. ఎందుకంటే , రాము తన నుంచి దూరం గా అన్ని రోజులు ఉన్న, ఎప్పటికీ తనవాడే అని రాము మాట్లాడే మాటల్లో నమ్మకం కనిపించింది.

కాసేపు తరువాత, విమల ఇంట్లో తన పెళ్లి గురించి జరిగిన సంభాషణ పూర్తిగా చెప్పింది. అది విన్న రాము మూడ్ ఆఫ్ అయి, ఒక్కసారిగా దిగులు పడి, నీరసంగా అయ్యాడు. వెంటనే విమల రాము పరిస్థితి చూసి, పరవాలేదు ఇంకో రెండు సంవత్సరాల వరకు పెళ్లి వాయిదా వేయించాను, అంది.

కొంత సమయం మౌనంగా ఉన్నారు…ఇద్దరూ.

విమల : రాము…నీకు నేను అంటే ఇష్టమే నా…. నన్ను పెళ్ళి చేసుకుంటావా…

రాము : అదేం మాట విమల…. నేను బ్రతికేదే నీ కోసం…

విమల : ఏడుస్తూ…రాము ను గట్టిగా కౌగలించుకుని…నా వలన కావడం లేదు రాము…నిన్ను వదిలి ఉండలేను…ఇన్ని రోజులు, నిన్ను చూడకుండా ఎలా ఉన్నానో నాకే తెలీదు.

రాము : తన రెండు చేతుల్లోకి , విమల ముఖాన్ని తీసుకుని, తన బొటన వేలితో విమల కళ్లను తుడుస్తూ….. ఊరుకో…విమల…ఏది ఏమైనా సరే , నేను నిన్ను వదిలి పెట్టను.

కొంచెం సమయం తర్వాత

విమల : రాము నిన్ను అందరూ గొప్పగా…సినిమా హీరో లా మాటాడుకుంటున్నారు…తెలుసా….

రాము : అవునా…ఏ…ఎందుకు.

విమల : అబ్బా…ఏం తెలియనట్టు…అమాయకంగా…నీ ఇంటర్ రాంక్ గురించి పేపర్ లో వచ్చింది…కదా.

రాము : ఓ…అదా…. ఏం ఉంది…. విమల అంతా నీ వలనే కదా…నువ్వు ఆ రోజు క్లాసులో సార్ చేతిలో దెబ్బలు తినకపోతే…. నాలో ఇంత మార్పు…ఇదంతా సాధ్యం అయ్యేది కాదు కదా…. చెప్పాలంటే ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు , ఇంకా ఎక్కువ భాధ పడ్డాను…నువ్వు నా దగ్గర లేకపోయే సరికి…. మిగిలిన వాళ్లు గొప్పగా ఏం …..అన్నా, కూడా నాకు మాములుగా నే అనిపించింది…విమల.

విమల : నా …రాము…గుడ్ బాయ్……ముద్దు గా, చిలిపిగా అంది.

అప్పటికే సమయం సాయంత్రం 5 గంటలు కావస్తోంది…

రాము : విమల చాలా టైం అయింది. నేను ప్రిన్సిపాల్ గారిని కలవాలి….. మనం మళ్లీ కలుద్దాం.

విమల : సరే…. రాము….

ఇద్దరూ సైకిళ్ళు పై బయలు దేరి వెళ్లి పోయారు….. రాము ప్రిన్సిపాల్ గారు ఇంటికి వచ్చాడు.

ప్రిన్సిపాల్ గారు : ఆ…ఆ…రాము…రా…రా…అని ఆప్యాయంగా దగ్గరకు పిలిచి, షేక్ హ్యాండ్ ఇచ్చి, కౌగిలించుకున్నారు…. ఎలా ఉన్నావు రాము…. ఎంసెట్ బాగా రాసావా…..

రాము : బాగున్నాను సార్…పరిక్ష బాగా రాసాను. …. సార్ …ఈ కవరు మీకు రాజారాం సార్ ఇమ్మన్నారు.

ప్రిన్సిపాల్ గారు : కవరు తీసుకుంటూ…. మొత్తానికి మన కాలేజీ పేరు, ఊరి పేరు నిలబెట్టావు …. నేను నీ మీద పెట్టిన నమ్మకం నిజం చేశావు….

రాము : అంతా మీ దయ…సార్…అని చేతులు కట్టుకుని వినయం గా అన్నాడు.

ప్రిన్సిపాల్ గారు : రాముని…చూస్తూ చాలా ముచ్చట పడి….నీ లో చాలా మార్పు కనిపిస్తుంది…రాము…..

రాము : అవును సార్…. అంతా రాజారాం సార్ వలనే…. నన్ను చాలా బాగా చూసుకున్నారు సార్…

ప్రిన్సిపాల్ గారు : మరో 15 రోజుల్లో ఎంసెట్ ఫలితాలు వస్తాయి...అందులొ కూడా మంచి రాంక్ వస్తుంది, మంచి కాలేజీ లో సీటు వస్తుంది …నీకు….. అని ఇంట్లో లడ్డూలు ఉంటే తెచ్చి ఇచ్చారు…రాము కి తినమని.

రాము : ధాంక్స్ సార్…. అని…. లడ్డూలు తినేసి….వెళ్లోస్తాను సార్ అని చెప్పి…బయలు దేరాడు.

రాము వెళ్లి న తరువాత…. ప్రిన్సిపాల్ గారు రాజారాం పంపిన కవరు తెరిచి ఉత్తరం చదివారు……

మిత్రమా….నీ ఆలోచనలతో ఉన్న జీవితం ఎంత గొప్పదో, నువ్వు సేవతో సమాజానికి చేస్తున్నది ఎంత మంచో…రాము ద్వారా చూపించావు……. రాము ఈ రోజు , మా కుటుంబంలో మనిషి అయిపోయాడు…. తను ఏ వర్ణమో, తల్లి తండ్రులు ఎవరో నాకు తెలియదు కానీ, వారి పూర్తి పరిస్థితులు ఏంటో తెలియదు కానీ…. రాము కి మంచి భవిష్యత్తు ఉంది…. రాము కి ఎప్పుడు ఏ సహాయం కావలసి వచ్చినా నాకు చెప్పు…. సంకోచించకు, ఉంటాను…. అంతా చదివి సంతోషించారు ప్రిన్సిపాల్ గారు.


  సీన్ – 25


రోజులు గడుస్తున్నాయి…

ఒక రోజు ప్రిన్సిపాల్ గారు, రాము ని కలవమని కబురు పెట్టారు.

రాము ఎందుకో…ఏంటో అని వెళ్లాడు.

ప్రిన్సిపాల్ గారు : రాము ని , అభినందిస్తూ…. నీకు ఇంటర్ లో రాష్ట్ర స్థాయిలో 5 రాంక్ వచ్చి నందుకు ప్రభుత్వం 350/- రూపాయలు బహుమతిగా ఇచ్చారు…ఇదిగో ఈ రోజే వచ్చాయి…

రాము : ధాంక్స్ సార్…అని…ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి…తల్లి కి ఇచ్చి , అంతా వివరంగా చెప్పాడు.

విమల టైలరింగ్ అదే ఊరిలో ఒకరి దగ్గర ఉదయం పూట రోజు రెండు గంటలు నేర్చుకునేది. విమల తల్లి కి మాత్రం , ఎలా గైనా విమలకి పెళ్లి చేసెయ్యాలనే తాపత్రయం రోజూ పడుతూనే ఉంది.

ఒక రోజు మధ్యాహ్నం…. రాము ఇంటిలో ఉండగా, పరుగు పరుగున పొలం లోని కూలి వచ్చి…. రాము తోను, తన తల్లి తోను ఇలా అంటున్నాడు…

రాము మీ అయ్య…పోలం పని సేత్తు…ఒక్కసారికే కుప్ప కూలిపోయాడు….ఎంత లేపినా లేవడం లేదు….. జమీందారు కి కూడా ఇప్పుడే సెప్పి వచ్చాను.

వెంటనే , రాము , తన తల్లితో కలిసి కంగారుగా పొలం దగ్గర కి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అప్పటికే జమీందారు వచ్చాడు, ఇంకా జనం చుట్టూ మూగి ఉన్నారు. తన తండ్రి అచేతనంగా పడి ఉన్నాడు. రాము తల్లి కిందపడి….ఎవరయ్యా, లే….లే…అని భోరున ఏడుస్తుంది…..

ఇంతలో ఎవరో అంటున్నారు ఆసుపత్రి కి తీసుకెళ్దాం అని……జమీందారు నాడీ పట్టుకు చూసి , ప్రాణం పోయింది…బాగా తాగున్నాడేమో, గుండె ఆగిపోయి నట్టుంది…అన్నాడు.

అది విన్న రాము కి దుఃఖం ఆగలేదు…తండ్రి శవం పై పడి ఏడుస్తున్నాడు, అక్కడి నుంచి శవాన్ని ఇంటికి తీసుకువచ్చారు…..ఆ నోటా, ఈ నోటా విమల కి విషయం తెలిసి , పరిగెత్తుకుంటూ రాము ఇంటికి వచ్చింది…దూరంగా నిలబడి చూస్తుంది. రాము ని అలా చూస్తూ , విమల ఉండలేక , ఏం చేయాలో తెలియక వెక్కి వెక్కి ఏడుస్తుంది.

కొంత సమయం తర్వాత, జమిందారు సహకారం తో , కూలి జనం కలిసి దహన కార్యక్రమాలు జరిపించారు.

ఆ రోజు రాత్రి….

రోజు ఉన్న తండ్రి…ఇంకా లేడు, రాడు అనే విషయం రాము జీర్ణించుకోలేక , ఏడుస్తూ, బాధగా, కోపం గా, పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు ఒకోసారి. ఎందుకంటే తండ్రి, ఏనాడూ తనని ఒక మాట అనేవాడు కాదు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాడు.

రాము తల్లి కూడా , భర్తను గుర్తుకు తెచ్చుకుని…. ముందు ముందు ఎలా బతకాలో అర్థం కాక ఏడుస్తుంది.

నాలుగు రోజులయ్యాక …రాము, జమీందారు దగ్గరకు వెళ్ళాడు…. రాము రావడం చూసి

జమీందారు : రా…రాము…ఏంటి ఇలా వచ్చావు…. డబ్బులు ఏమైనా, కావాలా….మీ నాన్న ఇప్పటికే ఎక్కువ వాడకం వాడేసాడు…. అయినా , ఆ డబ్బులు నేను అడగదలచుకోలేదు….

రాము : లేదయ్యా…డబ్బులు కోసం కాదు…నేను రేపటి నుండి పొలం లో కూలి కి వస్తావయ్యా….

జమీందారు : ఖంగు తిన్నాడు…ఏంటి పొలం పని సేత్తావా…. అది చదువు కున్నంత సులువు కాదు , రాము…. నువ్వు చెయ్యలేవు…

రాము : అయ్యా…అలా అనుకండి, ఇంట్లో చాలా కష్టం గా ఉంది. కొన్ని రోజులు చూడండి…. పని చెయ్యలేక పోతే తీసెయ్యండయ్యా…. అని బ్రతిమాలాడు

జమీందారు : సరే….నీ ఇష్టం…రేపట్నుంచి రా…

రాము ఇంటికి వెళ్ళి తల్లి తో చెప్పాడు…. రేపటి నుంచి పొలం పనికి వెళ్తున్నట్లు.


  సీన్ – 26


రోజులు గడుస్తున్నాయి, రాము రోజు పనికి వెళ్తున్నాడు…..తన కంటికి అంతా శూన్యం లా అనిపిస్తుంది . చలాకి గా లేడు. విమలను కూడా కలవాలని అనిపించడం లేదు.

ఒక రోజు సాయంత్రం పొలం పని ముగించుకుని, చేతిలో కారేజీ పట్టుకొని, పొలం గట్టుపై ఒంటరిగా ఇంటికి వస్తూన్న, రాము ని విమల చూసి…రాము…. రాము…అని పిలిచింది.

రాము : చెప్పు విమల..

విమల : ఏంటి రాము…. ఇదంతా…ఇలా అయిపొయావేంటి….

రాము : ఏం చెయ్యను చెప్పు…. ఇల్లు గడవాలి కదా…

విమల , ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనం గా వెళ్లి పోయింది.

ఆ రోజు విమల , నేరుగా ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్లింది. కానీ ప్రిన్సిపాల్ గారు అప్పటికే హైదరాబాద్ వెళ్లి పదిహేను రోజులు అయింది. రాము తండ్రి చనిపోయిన విషయం కూడా ఆయనకు తెలియదు…. చేసేది ఏమీ లేక, వెను తిరిగింది విమల.

వారం రోజుల తరువాత…. విమల మళ్లీ ప్రిన్సిపాల్ గారు ఇంటికి వెళ్ళింది. ప్రిన్సిపాల్ గారు ఇంటిలో ఉండడం చూసి …హమ్మయ్య అనుకొని……రాము విషయాలన్నీ పూర్తిగా , వివరంగా పూసగుచ్చినట్లు చెప్పింది…..

అంతా విన్న ప్రిన్సిపాల్ గారు చాలా బాధపడ్డారు.

సరే విమల నువ్వు ఇంటికి వెళ్ళు…. నేను సాయింత్రం, రాము వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నారు ప్రిన్సిపాల్ గారు.

ఆ రోజు సాయంత్రం…

ప్రిన్సిపాల్ గారు …రాము ఇంటికి వెళ్లారు..

రాము తల్లి : సారు….నమస్కారమయ్యా…అంతా అయిపోయిందయ్యా…. అని భోరున ఏడుస్తూ…భర్త మరణం గురించి చెప్పింది.

ప్రిన్సిపాల్ గారు : అయ్యొ…ఊరుకోమ్మా….నేను ఊర్లో లేను, నిన్ననే వచ్చాక విషయం తెలిసింది…. అవును , రాము ఏడి…..

రాము తల్లి : ఆడు…పోలం లో కూలి కి ఎల్లాడయ్యా…..యేళ అయింది, వచ్చెత్తాడయ్యా…..

ఇంతలో రాము , అన్నం కారేజీ చేతిలో పెట్టుకొని , ఇంటి లో కి వచ్చాడు…. అక్కడ కూర్చుని ఉన్న , ప్రిన్సిపాల్ గారిని చూసి ఆశ్చర్యపోయాడు.

రాము : నమస్కారం సార్.

ప్రిన్సిపాల్ గారు : రాము…ఎలా ఉన్నావు…నాకు అంతా నిన్ననే తెలిసింది. నేను కూడా చాలా రోజుల నుండి ఊర్లో లేను….ఏది ఏమైనా ఇలా జరగకూడదు…అన్నారు బాధపడుతూ.

రాము : రాము దిగులు తో , దుఃఖం తో ఉన్నాడు……ఎవరు చెప్పారు సార్ విషయం.

ప్రిన్సిపాల్ గారు : హు…. విమల చెప్పింది…నిట్టూరుస్తూ అన్నారు…. రాము ఇంకొక వారం రోజుల్లో ఎంసెట్ ఫలితాలు వస్తాయి…. తరువాత నన్ను కలువు….. నీ తో మాట్లాడాలి….. అని రాము భుజం తట్టి…వెళ్లొస్తానని చెప్పి బయలు దేరారు.

ప్రిన్సిపాల్ గారు వెళ్లాక, రాము స్నానం చేసి , ఆరు బయట నులక మంచం మీద పడుకుని , ఆకాశం వైపు నిరాశగా చూస్తున్నాడు. తన చదువు, విమల, ఇంకా తన జీవితం…ఏమీ అర్ధం కాక…. రాము కంట నీరు నెమ్మదిగా జారుతూ.. చెవులను చేరుతుంది.

 ఆ రోజు రాత్రి ప్రిన్సిపాల్ గారు ఇంటికి వెళ్ళారు, కానీ భోజనం చెయ్యకుండా నే పడుకుని…. దీర్ఘంగా ఆలోచిస్తున్నారు , రాము గురించి.

ఆ రోజు రాత్రి విమల ... ప్రిన్సిపాల్ గారు రాము ఇంటికి వెళ్ళి ఉంటారు, ఏమన్నారో , ఏమో అని రాము గురించి ఆలోచిస్తూ పడుకుంది.


మిగిలినది  ఎపిసోడ్ -5 లో

యడ్ల శ్రీనివాసరావు. 16 మార్చి 2022.







No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...