కళాశాల 1980
ఎపిసోడ్ -3
సీన్ – 20
రాము హైదరాబాద్ బస్టాండు లో బస్ దిగాడు. సరిగ్గా అదే సమయానికి రాజారాం గారు వచ్చి, రాము ని గుర్తు పట్టారు.
రాజారాం : రాము…. రాము వి నువ్వే కదా…సిరిసిల్ల నుంచి….అంటూ ఉండగా….
రాము : ఆ…ఆ…నేనేనండి రాముని…ప్రిన్సిపాల్ గారు పంపించారు…
రాజారాం : ఆ…ఆ….సరే…సరే…రా… మా ఇంటికి వెళదాం.
రాము ని తన పాత స్కుటరు మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లాడు.. రాజారాం.
రాజారాం వయసు సుమారు 48 సంవత్సరాలు ఉంటాయి. ఆదాయపన్ను లో శాఖలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. రాజారాం కి, భార్య , 9 వ తరగతి చదువుతున్న కూతురు శైలజ ఉన్నారు.
రాజారాం , రాముని ఇంట్లో కి తీసుకెళ్ళి భార్యకు, కూతురు కి పరిచయం చేశాడు. రాము కోసం ఇంటి డాబా పైన ఉన్న చిన్న గదిలో బస ఏర్పాటు చేశాడు.
రాజారాం : రాము ఇదిగో నువ్వు ఉండే గది. ఈ పక్కనే బాత్ రూం ఉంది. భోజనానికీ మాత్రం కింద ఇంట్లో నే తిందువు…. రేపు నిన్ను కోచింగ్ సెంటర్ కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను.
రాము : వెంటనే సంచి లో నుంచి ఒక కవరు తీసి …. సార్…ప్రిన్సిపాల్ గారు మీకు ఇమ్మన్నారు…అని ఇచ్చాడు.
రాజారాం : కవర్ తీసుకొని…. రాము, ప్రయాణం చేసి వచ్చావు కదా…. కాళ్లు చేతులు ముఖం కడుక్కుని కిందికి వచ్చెయ్, భోజనం చేద్ధువు గాని….
రాము : అలాగే సార్…
రాము కి ఆ ఇల్లు, గది ఆ వాతావరణం అంతా కొత్తగా ఉన్నా , బాగా నచ్చింది. ముఖ్యంగా రాజారాం గారు మాట్లాడే విధానం , తనకు సొంత మనిషి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.
రాజారాం కిందికి వెళ్లి , తన స్నేహితుడు పంపిన కవరు తెరిచాడు. అందులో 800/- రూపాయలతో పాటు…ఉత్తరం ఉంది…. అందులో…
రాజారాం…. రాము చాలా మంచి వాడు, తెలివైన వాడు. పేదరికంలో పెరిగినా సరే మట్టి లో మాణిక్యం, మంచి భవిష్యత్తు ఉంది…ఈ డబ్బులు తో ఫీజు కట్టు…. జాగ్రత్తగా చూసుకో…. ఫోన్ చెయ్యి…అని రాసి ఉంది.
ఇంతలో రాము వచ్చాడు…రాజారాం గారు భోజనానికి వారి పక్కనే కూర్చొ పెట్టుకుని... ఎప్పుడూ మొహమాటం పడకు, శుభ్రం గా తిను, బాగా చదివి, మంచి రాంక్ తో సీటు తెచ్చుకొవాలి….అంటుంటే, రాము సరే సర్…అన్నాడు.
ఆ రోజు అంతా కొత్తగా అనిపించింది రాము కి…. రాత్రి పడుకోబోయే ముందు అమ్మ, నాన్న, విమల ఎలా ఉన్నారో అని అనుకున్నాడు.
రాజారాం గారు రాత్రి పడుకునే టప్పుడు భార్యతో అంటున్నారు ,
రాజారాం : రాము సుమారు రెండు నెలలు ఇక్కడే ఉంటాడు. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అని తన స్నేహితుడు ఇచ్చిన ఉత్తరం భార్యకు చూపించాడు.
రాజారాం భార్య : ఉత్తరం చదివి….సరే నుండి …. మీరు చెప్పి న ట్లే…. చేస్తానండి..
తన భార్య మాట కి రాజారాం చాలా సంతోషించాడు.
సిరిసిల్ల లో అదే రోజు రాత్రి…
రాము తల్లి, మొదటి సారి తన కొడుకు దగ్గర లేకపోవడం తో కాస్త బెంగ గా ఉంది.
విమల ఆ రాత్రి భోజనం చెయ్యకుండా, రాము నే తలుచుకుంటూ పడుకుంది.
సీన్ – 21
మరుసటి రోజు రాజారాం గారు, రాము ని కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేసి, ఇంటికి వచ్చేటప్పుడు ఏ సిటీ బస్ మీద ఎలా రావాలో , రాము కి వివరంగా చెప్పి ఆఫీసుకు వెళ్లి పోయారు రాజారాం గారు.
రాము కి కోచింగ్ సెంటర్ వాతావరణం చాలా గొప్ప అనుభూతి ని ఇస్తుంది.
రోజులు గడుస్తున్నాయి. రాము చదువు లో లీనమై , పట్టుదలగా చదువుతున్నాడు. రాజారాం గారి కుటుంబం రాము ను సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. రాజారాం గారి కూతురు శైలజ కు చదువు లో గణితంలో అప్పుడప్పుడు సందేహాలు సమాధానాలు చెప్పి సహాయం చేసేవాడు రాము.
కోచింగ్ సెంటర్ లో పెట్టిన పరిక్షల లో రాము కి చాలా మంచి మార్కులు, రాంక్ లు వచ్చెవి. ఆ మార్కులు చూసి రాజారాం గారు చాలా సంతోషించి, రాము ను ప్రోత్సాహించే వారు మరియు తన స్నేహితుడైన ప్రిన్సిపాల్ కి, ఫోన్ లో రాము గురించి ఎప్పటికప్పుడు చెపుతూ ఉండేవారు.
రాము కి నిజం గా , రాజారాం గారు కుటుంబ అనుబంధం , తనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు నేర్పించాయి. తన బట్టలు తానే ఉతుక్కోవడం, పరిశుభ్రత, ఎదుటి వారితో మాట్లాడే విధానం, ఇలా ఎన్నో అంశాలు , రాజారాం గారిని చూసి ప్రభావితం అయ్యేవాడు , రాము.
ఆ రోజు మే 1 వ తేదీ, సెలవుదినం. రాము, రాజారాం అందరూ ఇంటి లో నే ఉన్నారు. ఆ రోజు ఇంటిలో ప్రత్యేకంగా రాజారాం భార్య పాయసం, పులిహోర చేసింది. ఆ రోజు సాయింత్రం రాజారాం కి , సినిమా కు వెళదాం అనిపించి , తన భార్య తో..
రాజారాం : ఏమోయ్…మనం సినిమా కి, వెళ్లి చాలా రోజులయ్యింది…అందరం వెళ్దామా…..
రాజారాం భార్య : ఏం పాపం…చాలా రోజుల కి , సినిమా గుర్తొచ్చింది…
రాజారాం : ఆ…ఏం లేదు…అందరం కలిసి సినిమా కి వెళ్లి చాలా రోజులయ్యింది. కదా సరదాగా…
రాజారాం భార్య : సరే నండి…. మీ ఇష్టం…మరి శైలజ …అని సందేహం గా అంది.
రాజారాం : హు….శైలుని కూడా తీసుకెళ్దాం…
సరే అనుకుని…. సినిమా కి తయారవుతూ ఉండగా….. రాము, మంచినీళ్ల కోసం, మేడ మీద తన గది నుండి కిందకు వచ్చి , మంచినీళ్లు అడిగాడు.
రాజారాం భార్య మంచినీళ్లు ఇచ్చింది…రాము వెళ్లి పోయిన తరువాత,..
రాజారాం భార్య : ఏమండీ…. సినిమా కి మనం వెళ్తున్నాం కదా…. పాపం రాము ను తీసుకు వెళ్టామా....మనతోపాటు…అంది భర్తతో.
రాజారాం : సంతోషించి …. సరే…నేను రాము కి చెపుతాను , తయారు అవమని…అని అన్నాడు.
నిజానికి రాజారాం కి రాము ను తమతో సినిమా కి తీసుకు వెళ్లాలని ముందే అనిపించినా, భార్య అంగీకరించదేమో అని చెప్పలేదు.
అందరూ కలిసి సినిమా కి వెళ్లారు…. హాలు లో రాజారాం గారు, తన భార్య, శైలజ, రాము వరుసగా కుర్చీ లలో కూర్చుని సినిమా చూస్తున్నారు. రాము కి శైలజ పక్కనే కూర్చునే సరికి , చాలా ఇబ్బందికరంగా ఉంది. మనసు లో ఒక్కసారిగా విమల గుర్తు కి వచ్చి, తన కళ్ల ముందు ఉన్నట్లు అనిపించింది. రాము సినిమా చూస్తున్నాడు గాని , తన కంటికి విమల తో మాట్లాడిన మాటలు, చింత చెట్టు దగ్గర వారి అనుభవాలు, గుర్తు వచ్చి , తెలియకుండా నే కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయి. ….
సినిమా సగం అయింది. ఇంటర్ వెల్ లో లైట్లు వేసేటప్పటికి, పక్కనే ఉన్న శైలజ రాము ముఖం లోకి చూసి, తన తల్లి తో చెప్పింది….. వెంటనే
రాజారాం భార్య : ఏం రాము…. ఏం అయ్యింది…. అలా ఉన్నావే…. సినిమా బాగోలేదా…. అంది నెమ్మదిగా.
రాము : అదేమీ కాదండి…. కళ్లు తుడుచుకుంటూ
రాజారాం భార్య : మరి ఎందుకు ఏడుస్తున్నావు…. మీ ఊరు, అమ్మ నాన్న గుర్తుకు వచ్చారా….
రాము : ఆ..ఆ… అవునండీ…
రాజారాం భార్య , నెమ్మదిగా భర్త చెవిలో ఏదో చెప్పింది. …. రాజారాం బయటకు వెళ్లి , తినుబండారాలు తెచ్చాడు.
సినిమా నుంచి ఇంటికి వచ్చాక…. రాము భోజనం చెయ్యకుండా నే పడుకున్నాడు.
ఆ రోజు రాత్రి , రాజారాం దంపతులకు రాము పై, జాలి మరియు ఏదో తెలియని అనుబంధం కలిగింది.
సీన్ - 22
రాజారాం ఫోన్ లో తనతో రాము గురించి చెప్పిన విషయాలు విని ప్రిన్సిపాల్ గారు సంతోషించి, ఊరిలో ఉన్న రాము తల్లి తండ్రులను కలిసి విషయాలు చెప్పెవారు.
ఒక రోజు విమల ఉండలేక రాము గురించి విషయాలు ఏమైనా ఎలాగైనా తెలుసుకోవాలనే వంక తో ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్ళింది. వెళుతూనే…
ప్రిన్సిపాల్ గారు : ఆ..రామ్మా…. విమల…ఎలా ఉన్నావు…. ఇలా వచ్చావేంటమ్మా….ఆ బల్ల మీద కూర్చో.
విమల : నమస్కారం సార్…. మరేమో…ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడూ వస్తాయి సార్…కనుక్కుందామని వచ్చాను….. సార్.
ప్రిన్సిపాల్ గారు : ఈ వారం చివరిలో వస్తాయి విమల. ఈ సారి మన కాలేజీ కి రాష్ట్రస్థాయిలో రాంక్ రావాలమ్మ…. రాము కి ….
విమల : అవును సార్…. రాము కి ఫస్ట్ ఇయర్ లో స్టేట్ రాంక్ మార్కులు వచ్చాయి కదా……. సార్ రాము మీ దగ్గర కి , ఈ శెలవుల్లో వచ్చాడా…అని అమాయకంగా అడిగింది.
ప్రిన్సిపాల్ గారు : లేదు విమల, రాము ను ఇంజనీరింగ్ కోచింగ్ కోసం, నా మిత్రుడు దగ్గరకు హైదరాబాద్ పంపించాను. అక్కడే ఉన్నాడు…. బాగా చదువుకుంటున్నాడు. అక్కడ కూడా మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడని , నా మిత్రుడు చెప్పాడు.
విమల : అవునా…సార్…చాలా సంతోషం గా ఉంది…..తను వచ్చిన పని అయిపోయింది అని మనసులో అనుకుంటూ…..వెళ్లోస్తాను …సార్ అని లేచింది.
ఆ మాటలు విన్న విమల కి, రాము ను చూసినంత ఆనందం కలిగింది.
ఒక వారం రోజుల తర్వాత … ఒక రోజు…..ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. అనుకున్నట్లే… రాము కి రాష్ట్ర స్థాయిలో 5 వ రాంక్ వచ్చింది. ప్రిన్సిపాల్ గారి నమ్మకం నిజమైంది. ఆయన ఆనందానికి అవధులు లేవు. వెంటనే రాము తల్లి తండ్రుల కి విషయం చెప్పారు.
అదే రోజు ఉదయం పేపర్ లో , రాజారాం గారు రాము రిజల్ట్స్ చూసి , 5 వ రాంక్ అని చెప్పి, రాము ను కౌగిలించుకున్నారు. పక్కనే ఉన్న శైలజ తో నువ్వు కూడా రాము లా చదవాలి అన్నారు. రాము ఒక ప్రముఖ వ్యక్తి లా అయిపొయాడు , ఆ రోజు…..
పత్రికా విలేఖరులు, ప్రిన్సిపాల్ గారి ద్వారా రాము అడ్రస్ తెలుసు కొని, రాము కోసం రాజారాం గారి ఇంటికి వచ్చారు.
విలేఖరులు అడిగిన ప్రశ్నలకు రాము , వినయం గా, తన కుటుంబ నేపథ్యం, తనకు ప్రోత్సాహం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారు గురించి, టీచర్లు , తల్లి తండ్రుల గురించి చెపుతున్నాడు , కానీ విచారం గా ఉన్నాడు. నవ్వు కూడా సహజం గా లేదు. రాజారాం అది గమనించి…
రాజారాం : ఏం రాము…ఏంటి అలా ఉన్నావు.
రాము : ఏం లేదు సార్…
రాజారాం : చెప్పు రాము…ఏదో దాస్తున్నావు..
రాము : ఏం లేదు…సార్…అని ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు.
రాజారాం : రాము…ఊరుకో…. ఏడవకు…నాకు అర్దం అయింది…ఇంత మంచి సమయం లో, మీ అమ్మ నాన్న లేరనే కదా…ఏడుస్తున్నావు…. నాకు తెలుసు….
రాము : ఏం చెప్పాలో తెలియక….తన మనసు లో ఇంత పేరు కి కారణమైన విమల, ఈ సంతోష సమయంలో తన దగ్గర లేకపోవడం, ఆ రోజు విమల తన గురించి దెబ్బలు తినడం, అసలు విమల ఎలా ఉందో, ఎన్ని రోజులు అయిందో అని గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తను ఈ రోజు సాధించిన విజయానికి మూలం విమల అని తెలిసినా ఎవరికి చెప్పుకోలేక , దుఃఖం ఆపుకోలేక పోతున్నాడు.
రాజారాం : రాము…. ఊరుకో…ఇంకో పది రోజుల లో ఎంసెట్ పరీక్ష అయిపోతుంది కదా…అప్పుడు ఎలాగో మీ అమ్మ నాన్నలను కలుస్తావు కదా…ఊరుకో…..ఈ పది రోజులు ఇంకా దృష్టి పెట్టి బాగా చదువు….
అదే రోజు …
విమల కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. విమల , రాము లేని వెలితి తో అంత సంతోషంగా లేదు. తన నుంచి ఏదో తనకు దూరం అయిపోతుంది అనే దిగులు తో ఉంది. ఇంతలో విమల స్నేహితులు , ఇంటికి వచ్చారు. ….
ఒక స్నేహితురాలు : విమల…. తరువాత ఏం చదువుతావే అని అడిగింది.
విమల…సమాధానం చెప్పే లో పే
విమల తల్లి : ఆ….ఏముందమ్మా….ఇంకా సదివి ఏం ఉద్ధరించాలి…. ఈ ఏడాది ఏదో సంబంధం సూసి…..తొందరగా పెళ్లి సెసేత్తే….ఓ పనైపోతాది…..
అది విన్న విమల …బాధ తో .ఏం చెప్పాలో తెలియక …మౌనం గా ఉంది. రాము గుర్తు వచ్చాడు విమల కి.
ఆ రోజు రాత్రి
విమల తల్లి : తన భర్త తో …..ఈ ఏడాది విమలకి సంబంధం సూడు …పెళ్లి సేసెద్దాం అంది.
విమల తండ్రి : ఏంటే…. అది సిన్న పిల్ల…అప్పుడే , ఈడు రాకుండానే పెళ్లి ఏంటి….
విమల తల్లి : నీ కేం తెలుసు.... 16 సంవత్సరాల నిండిన ఆడపిల్ల , కుంపటి బరువే మనకి….సెప్పినట్లు చెయ్యి….
విమల తండ్రి : చేసేది ఏం లేక…. సరే అన్నాడు.
వారి మాటలు అన్ని , విమల నిధానంగా వింటూ ... ఏడుస్తుంది.
మరుసటి రోజు ఉదయం …అమ్మ నాన్న లు ఎదురుగా …..విమల తన తల్లి తో
విమల : అమ్మా…. నాకు అప్పుడే పెళ్లి వద్దు…ఇంకో రెండు సంవత్సరాల తరువాత చేసుకుంటాను.
విమల తల్లి : ఏం పాపం…ఏంటి ఏమైనా కత ఉందా….సెప్పు….
విమల : చూడు నాన్నా….నా తోటి వాళ్లు ఇంకా చదువు కుంటుంటే …అంది ఏడుస్తూ..
విమల తండ్రి : అది కాదమ్మా…. మనకు ఇంకా సదుం కునే స్తొమత లేదు తల్లి …అర్థం చేసుకో…
విమల : ఆ…. చదువు కోక పోతే…పోనీ నాన్న…. నేను కుట్లు అల్లికలు నేర్చుకుంటాను…..జాకీట్లు కుట్టి నాలుగు డబ్బులు సంపాదిస్తాను. ఇంకో రెండేళ్లు తరువాత పెళ్లి చేసుకుంటాను. అంది.
విమల తండ్రి : విమల మాట కి అడ్డు చెప్పలేక…. సరే నమ్మ….నీ ఇష్టం. అన్నాడు.
విమల అప్పటికి…హమ్మయ్య…అనుకుంది.
సీన్ – 23
ఆ రోజు ఎంసెట్ పరీక్ష . రాజారాం ఆఫీసుకు శెలవు పెట్టి , రాముని దగ్గర ఉండి ఎగ్జామ్ సెంటర్ కి చేర్చి, పరిక్ష అయ్యే వరకు సెంటర్ దగ్గరే వేచి ఉన్నాడు. ….
ఇంతలో పరిక్ష రాసి వస్తున్న రాము తో…..
రాజారాం : ఎలా రాసావు….రాము.
రాము : బాగా రాసాను సర్…. అన్నాడు నమ్మకం రాము లో సంతోషం ఎక్కువ అయింది, ఆ రోజు……తిరిగి రేపు ఉదయం ఇంటికి వెళ్తాడనే ఆనందం తో.
ఆ రోజు సాయంత్రం రాజారాం, రాము ను బజారు తీసుకెళ్ళి బట్టలు కొన్నాడు.
మరుసటి రోజు ఉదయం రాము రాజారాం ఇంటి నుంచి బయలుదేరుతూ….
రాజారాం తో సార్…చాలా ధాంక్స్ అండి …అని వంగి , రాజారాం కాళ్లకు దణ్ణం పెట్టాడు. వెంటనే రాజారాం …లే…లే…రాము. అని పైకి లేపాడు కానీ, తనకు రాము తో ఇవన్నీ రోజుల అనుబంధం తో వదల్లేక పోతున్నాడు. రాము…ఇంకా రాజారాం భార్య కు నమస్కారం చేసి, శైలజ కు టాటా చెప్పి బయలు దేరాడు.
రాజారాం గారు …తన స్కుటర్ పై తీసుకెళ్ళి రాము ను సిరిసిల్ల బస్ ఎక్కించారు.
మిగిలినది ఎపిసోడ్ – 4 లో
యడ్ల శ్రీనివాసరావు 11 మార్చి 2022.
No comments:
Post a Comment