కళాశాల 1980
ఎపిసోడ్ - 1
అది 1980 ల కాలం. ఆ ఊరు పేరు సిరిసిల్ల. ఒక గ్రామ పంచాయతీ. హైదరాబాద్ కు 100 కి.మీ దూరం లో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అది పల్లే కాదు పట్నం కాదు. ఆ ఊరిలో ఎక్కువ మంది చేతి వృత్తుల వారే. కాయ కష్టం తో బ్రతికే వారే ఎక్కువ. దిగువ మధ్యతరగతి కుటుంబం లో ఉన్న 16 సంవత్సరాల రాము, విమల ల జీవితమే ఈ కధ.
ఆ ఊరిలో ఒక ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీ ఉంది. ఉదయం 9:00 గంటలకు కాలేజీ మొదలయ్యే సమయం కావస్తోంది.
సీన్ -1
రాము : అమ్మా …ఏంటమ్మా ఇంకా లేటు…కాలేజీ టైం అయిపోతుంది. కారేజీ వద్దు లే , ఈ రోజు కాంటీన్ లో తింటాను. డబ్బులు ఇచ్చెయ్…
రాము తల్లి : చాలు చాల్లే…ఆ…ఏంటి కాంటీన్ లో తినేది. బయట తినడం బాగా అలవాటు అవుతుందా.. ఏంటి…….ఇందా బాక్స్, శుభ్రం గా తిను, వదిలేసినా కిందపడేసినా వీపు విమానం మోత మోగుతాది ఏమనుకుంటున్నావో.
రాము : ఆ..సరే అమ్మా. వెళ్లొస్తాను.
రాము తల్లి : వినాయకుడు కి దణ్డం పెట్టుకుని వెళ్లు.
సీన్ -2
రాము రివ్వున సైకిల్ స్టాండ్ తీసుకుని గబగబా తొక్కుతూ కాలేజీ కి బయలుదేరాడు. దారిలో మనసు లో ఇలా అనుకుంటున్నాడు. అయ్యబాబోయ్ ఈ రోజు సోమవారం మేథ్స్ మూడు పిరిడ్లు ఉన్నాయి. చచ్చాం ఎలారా బాబు… అసలే అర్దం అయి చావదు.
రాము వెనుకే విమల సైకిల్ తొక్కితూ వస్తుంది. విమల అదే కాలేజీ , రాము క్లాస్…. విమల , రాము ప్రక్కనే తొక్కుతూ….
విమల : హాయ్..రాము…మొన్న లెక్కలు సార్ ఇచ్చిన హోం వర్క్ చేశావా.
విమలను చూసి ఒక్కసారి ఖంగు తిన్నాడు రాము. సైకిల్ ఆపి తలపట్టుకుని...
రాము : అయ్య బాబోయ్…నేను హోం వర్క్ చెయ్యలేదు. నాకు అసలు గుర్తే లేదు. ఈ రోజు క్లాసులో నాకు దెబ్బలు తప్పవు. అని భయం గా , విచారం గా….మరి విమల నువ్వు చేశావా.
విమల : హ…. చేశాను….ఒక పని చెయ్యి రాము , సార్ అబ్బాయిలని బాగా గట్టిగ కొడతారు కదా…అమ్మాయిల్ని అయితే తిట్టి వదిలెస్తారు కదా…...నా పుస్తకం నీకు ఇస్తాను. నా పేరు కొట్టేసి , నీ పేరు రాసి , సార్ కి చూపించు …ఈ సారికి….
రాము పై మనసు లో ఉన్న ఇష్టాన్ని అలా చూపించింది విమల.
రాము : ధాంక్స్.. విమల…
అని పుస్తకం అక్కడే తీసుకున్నాడు.
సీన్-3
ఇద్దరూ కాలేజీ లో క్లాస్ రూం లో కి ఎంటర్ అయ్యారు. ఇంకా సార్ రాలేదు …. క్లాసు అంతా గందరగోళంగా గోల గోల గా ఉంది. లెక్కల సార్ సుందరం గారు క్లాసులో కి వస్తూనే కాస్త కోపం గా ఉన్నారు.
స్టూడెంట్స్ అందరు లేచి గుడ్ మార్నింగ్ సార్ అంటున్నారు.
సుందరం సార్ : సైలెన్స్…సైలెన్స్… గుడ్ మార్నింగ్ …. కూర్చోండి. పేజి నెంబర్ 128 probability chapter exercise 2, first theorm నోట్ చేసుకోండి.
(అని బోర్డు మీద తీరమ్ రాసారు…కాసేపు తరువాత)
సుందరం సార్ : మొన్న ఇచ్చిన హోం వర్క్ నొట్స్ one by one తీసుకురండి.
వరుసగా అబ్బాయిలు ముందు తీసుకు వస్తున్నారు.
రాము వంతు వచ్చింది. రాము కు కొంచెం చేతులు వణుకుతూ, చెమటలు పట్టాయి.
హోం వర్క్ చెయ్యని అబ్బాయిలని ఒక రకం గా కర్రతో కొడుతున్నారు సార్….
ఇక అమ్మాయిల వంతు వచ్చింది.
సుందరం సార్ : విమల…విమల…నీ బుక్ తీసుకురా…
విమల : సార్.. మరేమో .. మరేమో హోం వర్క్ చెయ్యలేదండి.
సుందరం సార్ : కోపం గా రా…ఇలాగ…బాగా చదివే పిల్లవి …ఏం పొగరు బలిసిందా… అమ్మాయిల ని ఊరుకుంటుంటే నెత్తిన ఎక్కుతున్నారు, చెయ్యి చాపు…
అని విమల రెండు అర చేతులు పై కర్ర తో చాలా గట్టిగా పది దెబ్బలు కొట్టారు.
విమల తట్టుకోలేక , అవమానం, బాథ తో ఏడుస్తూ వచ్చి కూర్చుంది.
రాము ఇదంతా గమనిస్తూ, సార్ అకస్మాత్తుగా ఎప్పుడూ లేనిది ఆడపిల్ల విమల ని కొట్టడం జీర్ణించుకోలేక , కోపం తో ,తన గుప్పెడు గట్టిగా బిగించి, తన వలనే ఇదంతా... అని బెంచి ని కొడుతున్నాడు.
మధ్యాహ్నం లంచ్ సమయం…
విమల కి రెండు అర చేతులు వాచిపోయి , కనీసం భోజనం బాక్స్ తెరిచి తినలేక అలాగే క్లాసులో కూర్చుని ఏడుస్తూ ఉంది.
రాము ఇదంతా గమనిస్తూ తనకు కూడా అన్నం తినబుద్ధి కాక, మౌనంగా కూర్చున్నాడు.
సాయింత్రం లాంగ్ బెల్ కొట్టారు. క్లాసులో అందరూ వెళ్ళిపోతున్నారు. రాము మాత్రం ఒంటరిగా బెంచి మీద కూర్చోని , విమల కు తన వలన జరిగిన అవమానానికి కృంగి పోతున్నాడు.
ఇంతలో వాచ్ మెన్ తలుపులు మూయడానికి వచ్చాడు.
వెంటనే రాము కళ్లు తుడుచుకుంటూ సైకిల్ స్టాండ్ కి వెళ్లి సైకిల్ తొక్కితూ , ఇంటికి బయలు దేరాడు.
సీన్ – 4
ఆ రోజు సాయంత్రం కాలేజీ నుండి వెళుతూ....
దారిలో విమల తన సైకిల్ తో నెమ్మదిగా నడుచు కుంటూ వెళ్తుంది.
అది చూసిన రాము సైకిల్ దిగి, విమల ప్రక్కగా వచ్చి , విమల తో సమానంగా నడుస్తూ…
రాము : సారీ విమల….నా వలనే ఇదంతా ….. సారీ…. ఏమైంది సైకిల్ నడిపిస్తున్నావు.
విమల : బొబ్బలెక్కిన రెండు అరచేతులు చూపిస్తూ….
సైకిల్ పట్టుకొని తొక్కడం నా వలన కావడం లేదు.
రాము : విమల చేతులు చూసి , దుఃఖం ఆపుకోలేక దుర్మార్గుడు మరీ ఆడపిల్ల ని కూడా ఇలా కొట్టాలా …. అని కోపం తో అరిచాడు.
విమల : తప్పు రాము…సార్ ని అలా అనకూడదు.
ఇద్దరూ సైకిళ్ళు తో అలా నడుస్తూ ఉన్నారు.
విమల కూడా తనలాగే మధ్యాహ్నం భోజనం చెయ్యలేదని ….
రాము ఒకచోట చెరకు రసం బండి దగ్గర విమల ని ఆపి రెండు రూపాయలిచ్చి చెరకు రసం ఇద్దరికీ కొన్నాడు.
గ్లాసు విమల కి ఇస్తూ…
రాము : ఇదిగో విమల .. మధ్యాహ్నం నువ్వు అన్నం తినలేదు కదా…ఇది తాగు నీరసం ఉండదు.
విమల : నీ కెలా తెలుసు….
రాము : నేను మధ్యాహ్నం అంతా నిన్నే చూస్తూ ఉన్నాను….. నేను కూడా తినలేదు.
అది విని విమల కి చాలా బాధగా అనిపించింది…
కానీ మనసు లో రాము తో అలా ఉండడం సంతోషంగా అనిపించింది…
ఇళ్లు దగ్గర అవుతుండడం తో ఎవరి దారిలో వారు వెళ్లి పోయారు.
సీన్ – 5
ఇంటికి వచ్చిన విమల నిజం చెపితే , తండ్రి తిడతాడని కాలేజీ లో జరిగినదంతా దాచిపెట్టి…..
ఇంటికి వచ్చే దారిలో సైకిల్ తో గోతిలో పడడం వలన , రెండు చేతులు నేలపై ఆన్చడం వలన చేతులు అలా వాచాయని చెప్పింది.
తల్లి వెంటనే కొబ్బరి నూనె రాసింది.
ఆ రాత్రి కి విమల కి విపరీతమైన జ్వరం వచ్చింది.
కానీ విమల కి రాము ను తలచుకున్నప్పుడల్లా ధైర్యంగా, తేలికగా, ఆనందంగా ఉండేది.
సీన్ – 6
అదే రోజు....
ఇంటికి చేరిన రాము , చాలా దిగులు గా ఉన్నాడు. ఇంతలో తల్లి...
రాము తల్లి : గట్టి గా అరుస్తూ..…
అన్నం తినకుండా తిరిగి తెచ్చావు….
రుచులు కావాల్సి వస్తన్నాయా….
అని వీపు మీద రెండు బాదింది….
మీ అయ్య.... ఎంత కష్టం సేత్తే….
ఈ ముద్ధ దొరుకుతుందో తెలుసా నీకు…
రాత్రి కి ఇదే తిను అని అక్కడే పెట్టింది.
ఆ రాత్రి రాము కు నిద్ర పట్టలేదు. అసలు తనకి చదువు మీద అంత శ్రద్ధ లేదు.
అసలు నేను దేనికి ఉపయోగం అవుతాను అని అనుకుంటూ….అంత బాగా చదివే విమల తనకు ఎందుకు ఇంత సాయం చేసింది. అని అతిగా ఆలోచిస్తూ ఆ రాత్రంతా మదన పడుతూనే ఉన్నాడు రాము.
సీన్ -6
మరుసటి రోజు ఉదయం, రోజూ కంటే ఆరగంట ముందుగా కాలేజీ కి బయలు దేరాడు రాము.
దారిలో ఒక చోట ఆగి విమల కోసం ఎదురు చూస్తున్నాడు.
విమల ఎంతకీ రాక పోయేసరికి చేసేది లేక కాలేజీ కి వెళ్లాడు.
విమల క్లాసులో కనిపించక పోయేసరికి చాలా ముభావంగానే ఉన్నాడు.
సరిగా పాఠం కూడా వినలేక పోయాడు.
రాము ఆ రోజు రాత్రి , విమల కి ఏమైందో , ఏంటో, ఎలా ఉందో అని ఆలోచిస్తూ నే పడుకున్నాడు.
సీన్ -7
ముందు రోజు లాగే, రాము తొందరగా కాలేజీ కి బయలు దేరి , విమల రాక కోసం ఎదురు చూసాడు.
విమల ఆ రోజు రాకపోయేసరికి రాము కి పిచ్చిగా, కంగారుగా, చికాకు గా అనిపిస్తుంది.
తెలియకుండా నే ఏడుస్తూ చొక్కా తో కన్నీళ్లు తుడుచు కున్నాడు....
కాలేజీ నుండి తిరిగి వెళ్లేటప్పుడు ,
విమల కనిపిస్తుందేమో అని విమల ఇంటి ముందు నుంచి సైకిల్ బెల్ కొట్టుకుంటూ వెళ్లాడు.
మరల తిరిగి వెనక్కి విమల ఇంటి ముందు కి వచ్చి సైకిల్ ఆపి ,
ఏదో రిపేర్ చేస్తున్నట్లు పది నిమిషాలు వేచి చూసాడు కానీ, విమల కనిపించలేదు.
చేసేది లేక ఇంటికి వెళ్ళి పోయాడు.
సీన్ – 8
అదే రోజు న సాయంత్రం....
అప్పటికే మూడు రోజుల నుండి జ్వరం తో ఉన్న విమలకి, ఆ రోజు తగ్గుముఖం పట్టింది.
రాము సైకిల్ బెల్ మోగించి తన ఇంటి ముందు నుంచి వెళ్లి రావడం.....
తన ఇంటి ముందు నిలబడి సైకిల్ రిపేర్ చేస్తున్నట్లు నటించడం,
రాము ముఖ కవళికలు గమనించి,
తన కోసమే వచ్చాడని తెలిసి ,
తన ఇంటి చెక్క తలుపు రంధ్రం లో నుండి అంతా చూస్తూ,
మనసు లో నే నవ్వుకుంటూ , ఆనందం లో తేలిపోతుంది విమల.
ఆ రాత్రి విమల కి నిద్ర పట్ట లేదు ఆనందం తో….
రాము కి కూడా నిద్ర పట్టలేదు విమల కనపడలేదనే బాధతో….
సీన్ – 9
ఆ తర్వాత రోజు కూడా , ముందు రెండు రోజుల్లాగే కాలేజీ కి అరగంట ముందు బయలు దేరాడు రాము….
కాలేజీ కి తొందరగా బయలుదేరడాన్ని,
అప్పటికే రోజు గమనిస్తున్న తల్లి…
రాము తల్లి : ఏం రాచ కార్యాలు యెలగ బెడతున్నావు.....
ఊరికి ముందే బయలు దేరుతున్నావు.....
సదివేది ఏమైనా ఉందా…..
లేకపోతే మీ అయ్యతో కూలి పనికి యెళ్లి…
నాలుగు రూపాయలు సంపాదించు.
రాము : ఆ..ఆ.. చదువుతున్నాను….
ప్రైవేటు క్లాస్ ఉంది,
అందుకే తొందరగా వెళ్తున్నా…
బాక్స్ ఇలా ఇవ్వు…
అని సైకిల్ మీద బయలు దేరి, రోజు ఆగే చోటే , విమల కోసం ఆగి ఎదురు చూస్తున్నాడు రాము.
ఆ రోజు, సైకిల్ మీద పసుపు పచ్చని పరికిణీ లో , నవ్వుతూ వస్తున్న విమలను , కాస్త దూరం నుంచి చూస్తే సరికి ...రాము పట్టలేని సంతోషం తో ఎగిరి గంతేసి....
విమల తన దగ్గర గా రాగానే…
రాము : విమల ఎలా ఉన్నావు….
ఏమైంది మూడు రోజుల నుండి కాలేజీకి రాలేదు.
నాకు చాలా భయం వేసింది.
నీకు ఏమయ్యిందో అని.
ఇదిగో ఈ బొట్టు పెట్టుకో…..
నువ్వు ఈ రోజు ఎలాగైనా నాకు కనపడాలని , నూకాలమ్మ తల్లి గుడి కి వెళ్లోచ్చాను.
విమల: ఆ రోజు రాత్రి నుండి జ్వరం రాము…
ఈ రోజే తగ్గింది..... నువ్వెలా ఉన్నావు....
రోజు కాలేజీ కి వెళ్తున్నావా....
ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా …
అని అనుకుంటూ ఇద్దరూ కాలేజీ కి సైకిల్ తొక్కుతూ వెళ్లారు.
విమల తో స్నేహం రాము లో చాలా మార్పు తీసుకువచ్చింది.
సీన్-10
ఒకరోజు రాత్రి రాము ఇంటి లో పెద్ద గొడవ.
తండ్రి కూలి డబ్బులు ఇంట్లో ఇవ్వక పోగా,
బాగా తాగి , తన తల్లి ని కొట్టడం చూసి తట్టుకోలేక …
బాగా ఏడుస్తూ, ఆలోచిస్తున్నాడు రాము ఇలా…..
నాకు చదువు ఎందుకు అబ్బడం లేదు,
నా కుటుంబ పరిస్థితి అంతంతే,
రేపు ఇంటర్ అయ్యాక కూలి పనులకే వెళ్లాలా…..
నేను విమల లాగా బాగా ఎందుకు శ్రద్ద గా చదువు కోలేను.
మంచి గా చదివితే ఉద్యోగం చెయ్యొచ్చు కదా, అప్పుడు నాకు నచ్చినట్టు ఉండొచ్చు కదా అనుకున్నాడు.
ఆ మరుసటి రోజు విమల కి, ముందు రోజు రాత్రి ఇంట్లో జరిగిన తండ్రి గొడవ, తన మనసు లో బాగా చదువుకుని ఉద్యోగం చెయ్యాలనే కోరిక చెప్పాడు రాము.
అది విన్న విమల, రాము లో మార్పు కి చాలా చాలా సంతోషించి ….
లో లోపల , నీ లో నాకు కావాల్సింది ఇదే.
అని తన జీవితం గురించి ఆనందం గా ఊహించుకుంటూ మనసు లో అనుకుంది విమల.
సీన్ – 11
రోజులు గడుస్తున్నాయి. రాము కి విమల మరియు మిగిలిన స్నేహితులు చదువు లో అర్దం కాని అంశాలు మరలా చెబుతూ సహాయం చేస్తున్నారు.
రాము కి క్రమేపీ చదువు పై బాగా శ్రద్ద పెరిగి, క్లాసులో జరిగే పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకుంటూ , మొదటి పది మంది లో ఒకడిగా నిలబడుతున్నాడు.
అది చూసిన విమల , రాము ఎప్పటి కైనా గొప్ప వాడు అవుతాడని అనుకునేది.
రాము లో మార్పు కి తనే కారణం అని మనసు లో గర్వం గా ఫీల్ అయ్యేది.
సీన్ – 12
బోణాల పండుగ వచ్చింది.
ఊరంతా తిరణాళ్లు తో కోలాహలం గా ఉంది.
రాము పండుగ రోజు సాయంత్రం తిరణాలకి వెళ్లాడు. అక్కడ విమల తన స్నేహితులతో ఉండడం చూసి, వెళ్లి పలకరించాడు.
అక్కడ విమల, ఆ పండుగ, ఆ కోలాహలం అంతా చూస్తూ ఉంటే రాము కి , విమల పై మనసు లో ఏదో తెలియని, ఆపుకోలేని ఇష్టం మొదలైంది.
విమల తో మాట్లాడుతున్నా గాలి లో తేలితున్నట్లు ఉంది రాము కి.
అలా రాము విమల తో మాట్లాడుతున్నా సమయం లో, విమల భుజం పై లో బనియన్ తెల్లగా కనిపిస్తుంది.
అది చూసిన రాము సరిచేసుకోమని సైగ చేసి తల దించుకున్నాడు.
విమల సిగ్గు పడుతూ సరిచేసుకుంది.
ఇంకా కలర్ సోడా కొని తాగమని ఇచ్చాడు, రాము.
ఆ రోజు రాత్రి రాము కి నిద్ర పట్టలేదు.
విమల తో ఉంటే తనలో చాలా మంచి మార్పులు వస్తున్నాయి.
చాలా సంతోషం గా కూడా ఉంటుంది. అదే విమల తనతో ఎప్పుడూ ఉంటే ఇంకా ఎంత బాగుంటుందో అని కలలు కన్నాడు.
మరో వైపు విమల స్థితి కూడా అలాగే ఉంది.
చెప్పాలంటే రాము కంటే ముందు నుంచే విమలకి , రాము అంటే తెలియని ఇష్టం ఉండేది.
అది ప్రేమో, స్నేహమో తెలియని స్థితికి ఇద్దరూ చేరుకున్నారు.
సీన్ – 13
ఇంతలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు వచ్చాయి.
రాము తన జీవితం లో ఎప్పుడూ లేనిది ఒక ఉద్యమం లా, పగలు రాత్రి చదువుతున్నాడు.
ఆ రోజు ఆఖరి పరిక్ష రాసేసిన తరువాత,
రాము , విమల కలిసి నడిచి వస్తున్నారు.
విమల : అన్నీ పరీక్షలు బాగా రాసావా..
రాము : హు…చాలా బాగా రాశాను… నీ వలనే.
విమల : ఆ.…నేనేం చేశాను బాబు…
నువ్వే చదివావు, రాసావు….
రేపటి నుంచి రెండు నెలలు శెలవులు కదా….
నీ కేమి అనిపించడం లేదా…
రాము : ఎందుకు లేదు....
నువ్వు నా కు రేపటి నుంచి కనిపించవు కదా…..
ఎలా ఉండాలో తెలియడం లేదు…దిగులు గా.
విమల : కాసేపు , ఈ గుడి పక్కన చింత చెట్టు దగ్గర కూర్చుని వెళ్దామా…
రాము : సరే…
ఇద్దరూ సైకిళ్ళు పక్కన పెట్టి…కూర్చున్నారు.
సమయం ఉదయం 11:30 గంటలు కావస్తోంది.
ఎండ పెరుగుతుంది. కానీ పల్లే గ్రామం వలన చుట్టూ పొలాలు, పెద్ద చింత చెట్టు, నీడ వలన చల్లదనం, నిశ్శబ్దం …. వాతావరణం హాయిగా ఉంది.
రాము : దిగులు గా తల దించుకుని ఉన్నాడు.
విమల : ఏంటి రాము…ఏదైనా మాట్లాడు.
రాము : ఏం మాట్లాడను…..
ఏం మాట్లాడాలో తెలియడం లేదు.
విమల : నెమ్మదిగా ధైర్యం చేసి…
నేను లేకుండా నువ్వు ఉండగలవా రాము. అంది.
అది విన్న రాము కి కళ్లలో నీళ్లు వచ్చెస్తున్నాయి…
ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు….వెంటనే
రాము : విమల వైపు చూడకుండానే….
నేల వైపు చూస్తూ....
నువ్వు అంటే నాకు చాలా ఇష్టం విమల....
నువ్వు లేకపోతే నేను ఉండలేను.....
బాగా చదివి, మంచి ఉద్యోగం వచ్చాక....
నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది…..
అని పాఠం అప్ప చెప్పినట్లు కంగారుగా, బాధతో, భయం గా చెప్పాడు.
విమల : ఏయ్…ఇలా చూడు...
రాము : నేల వైపు చూస్తున్నాడు.
విమల : ఏయ్…నిన్నే.. దిక్కులు చూస్తావేం…
ఇలా నా కళ్లల్లోకి చూడు...
రాము : చలనం లేదు….
విమల : సంతోషం ఆపుకోలేక…
ఒక్కసారిగా రాము ని దగ్గరకు తీసుకొని...
రెండు బుగ్గల పై గట్టి గా ముద్దు పెట్టుకుంది.
ఆ ఊహించని సంఘటన కి రాము కి చెమటలు పట్టాయి….
జీవితం లో మొదటిసారి ఒక అమ్మాయి స్పర్స తగలేటప్పటికి కళ్లు తిరిగినట్లు అయింది.
కాసేపు ఆగి లేచి నిలబడిన తరువాత….
ఒకరి చేతులు మరొకరు పట్టు కొని , నడిచి వెళ్లారు.
వారిద్దరి కి …..ఆ రోజు..…జీవితం లో మరచి పోలేని రోజు.
సీన్ – 14
ఆ వేసవి శెలవులంతా ఒకరిని మరొకరు చూసుకోకుండా నే గడిచిపోయాయి.
రెండవ సంవత్సరం కాలేజీ తిరిగి పునః ప్రారంభం అయింది.
అదే రోజు ఇంటర్మీడియట్ మెదటి సంవత్సరం ఫలితాలు వచ్చాయి.
అందరూ కాలేజి లో హడావుడి గా ఫలితాలు బోర్డు లో చూసుకుంటున్నారు.
మంచి మార్కులు వచ్చిన వారు గెంతులు, ఫెయిల్ అయిన వారు ఏడుపు ముఖం తో ఉన్నారు.
విమల కి 70 శాతం మార్కులు అని ఆనందంగా వచ్చి క్లాసులో చెపుతుంటే రాము విన్నాడు.
తను ఇంకా నెంబర్ నోటీసు బోర్డు లిస్ట్ లో చూసుకోలేదు.
విమల సైగ చేసింది. నీ కెన్ని మార్కులు అని.
పెదవి విరిచాడు రాము.
కాసేపు తరువాత రాము వెళ్లి తన నెంబర్ చూసుకున్నాడు.
92 శాతం మార్కులు, కాలేజీ ఫస్ట్ రాంక్ మార్కులు వచ్చాయి.
చాలా సేపు నమ్మలేక నెంబర్ తనదా కాదా అని చూసుకున్నాడు.
రాము ఆనందంగా వచ్చి విమలకి తన నోటితో చెప్పుదామనే లోపు.....
క్లాసులో క్లాస్ టీచర్ కూర్చోని ఉన్నారు.
రాము నెమ్మదిగా తన బెంచి దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు.
ఇంతలో కాలేజీ ప్రిన్సిపాల్ వచ్చి…
ప్రిన్సిపాల్ : ఈ ఏడాది, ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో మన కాలేజీ కి జిల్లాలో నే ప్రధమ స్థానం....
రాష్ట్రంలో 8 వ స్థానం లో ఉంది....
కాలేజీ చరిత్ర లో ఇదే ప్రథమం....
అది రాము ద్వారా వచ్చింది......
రాము కి 92 శాతం మార్కులు వచ్చాయి....
అని పిలిచి అభినందించారు.
అందరూ రాము ని అభినందిస్తూ ఉంటే …
విమలకి మరో ప్రపంచం లా ఉంది.
ప్రిన్సిపాల్ : రాము… ఇలాగే రెండవ సంవత్సరం మంచి మార్కులు తెచ్చుకొని.....
కాలేజీ కి రాష్ట్ర స్థాయిలో రాంక్ తీసుకురావాలని అభినందించారు.
ఆ నోటా , ఈ నోట రాము గురించి ఆ ఊరిలో, అందరి ఇళ్ళలో తెలిసింది.
న్యూస్ పేపర్ లో కూడా చిన్నగా రాసారు.
ఆ రోజు రాత్రి రాము, ఇదంతా విమల వలనే కదా…తను దెబ్బలు తినకపోతే నాకు ఇంత మేలు జరిగేది కాదు కదా.....అని అనుకున్నాడు.
ప్రిన్సిపాల్ చెప్పింది కూడా నిజం చెయ్యాలి, అంతకంటే తనకు వేరే మార్గం లేదు, అనుకున్నాడు.
రాము తల్లి కూడా ఇంతకు ముందు లా రాము ని , ఏమీ అనడం లేదు.
సీన్ – 15
ఒక రోజు , ఆదివారం నాడు రాము ఇంటి దగ్గర ఉండగా నే….
తన తండ్రి పని చేసే యజమాని, భూస్వామి రంగారావు వచ్చాడు.
తల్లి, తండ్రి, రాము ఆ సమయంలో అక్కడే ఉన్నారు.
రంగారావు : ఏ రా అప్పి (రాము తండ్రి)…ఏం టి ..
రెండు రోజుల నుండి పొలం లో పనికి రావడం లేదు…ఓపిక లేదా…
లేక చుక్క పడలేదా….
నీ వాడకం ఎంతుందో తెలుసా…
ఆరువేల రూపాయలు…
ఎవడు తీరుస్తాడు, నువ్వు పని ఎగదొబ్బితే…
ఆ….ఈడేనా…నీ కొడుకు…
ఏరా నువ్వు సాలా గొప్ప గా సదువు తావంట గదా…ఊరిలో సెపితే యిన్నాను….
ఈ సదువు, నీకు కూడు, గుడ్డ ఎట్టదు గాని.....
మీ అయ్య బదులు నువ్వు రా పనికి …
రాము తల్లి : అయ్య…ఆడు సిన్న పిల్లోడు అయ్య…
ఆడినేటి అనకండి....
రేపటి నుండి నా మొగుడు పనిలోకి వత్తాడయ్యా....
మీకు దణ్డం పెడతాను…
మీరు ఎల్లండి....
రంగారావు : ఆ ..ఆడదానివి …సెబుతున్నావు,
కాబట్టి వెళ్తున్న…
తేడా వస్తే ఊరుకునేది లేదు.
అదంతా.. చూసి.. రాము కి తన ఇంటి పరిస్థితి బాగా అర్దం అయింది.
మరుసటి రోజు కాలేజీ నుండి వస్తూ , విమల కి తన ఇంటి లో జరిగిన భూస్వామి గొడవ అంతా చెప్పాడు….. విమల నిట్టూర్చింది.
మిగిలినది.... ఎపిసోడ్ -2 లో....
యడ్ల శ్రీనివాసరావు.... 3 , 4 మార్చి 2022.
https://yedlathoughts.blogspot.com
yedlasrinivasrao@gmail.com
WhatsApp +91 9293926810
📞 +91 8985786810
No comments:
Post a Comment