Wednesday, November 30, 2022

277 . కాలం తో కాంత

 

కాలం తో  కాంత 



• కాలమా … ఓ కాలమా

  నీ  కౌగిలి లో      ఎన్ని వింత లో

  నీ  లోగిలి లో     ఎన్ని పుంత లో


• చెప్ప వే     నీ చిరునామా

  చెప్పగ  నే  చూడాలి    నీ లోని అందాలు.


• కాలమా … ఓ కాలమా

  నీ రుతు రాగాల తో    కూసిన కోయిల లా

  ఆడ పిల్ల  నై   నేను    ఈడు పిల్ల నయ్యాను.


• కరిగే   నీ కాలం

  కదలదు    నా లో    కల కాలం

• మారే   నీ రూపం

  వదలదు   నన్ను   చిర కాలం


• మల్లె ల  వసంతం తో 

  చిలిపి తనం   చిగురించింది.

• జాజుల   గ్రీ‌ష్మం తో 

  విరహ వేదన   మురిపించింది

• కాలమా ... నీ రుతువుల  రంజనాలు నాకే లే.


• చినుకుల వర్షం తో 

  చామంతి లా  హర్షం లో మునిగాను.

• వెన్నెల  శరదం లో 

  విరిసిన  పూబంతి లా  ఊగాను.

•  కాలమా ... నీ రమణీయపు  రాజసాలు  నావే లే.


• హేమంతపు   మంచు లో 

  లిల్లీ నై   తడిసి బిగిసి   ఉన్నాను.

• శిశిరం లో    పారిజాత మై 

  ప్రకృతి లో   పల్లవించి ఉన్నాను.

• కాలమా ... నీ రుజువుల  రూపం   నేనే లే.


• కాలమా … ఓ కాలమా

  నీ రుతు రాగాలతో      కూసిన కోయిల లా

  ఆడ పిల్ల నై  నేను       ఈడు పిల్ల నయ్యాను


• కరిగే   నీ కాలం

  కదలదు     నా లో   కల కాలం

• మారే   నీ రూపం

  వదలదు    నన్ను    చిర కాలం


భావం

ఒక యువతి కాలం తో తనకు జరిగిన అనుభవాలను కాలానికి  చెపుతుంది.


• కాలమా … ఓ కాలమా

  నీ కౌగిలిలో ఎన్నో వింతలు,  నీ కోట లో మరెన్నో బాటలు ఉన్నాయి.

  చెప్పు….నీ చిరునామా చెప్పగానే వచ్చి నీ అందాలను చూస్తాను.


• కాలమా….ఓ కాలమా

  నీ రుతువుల లోని రాగాలతో,  కూసే కోయిల వలే ఆడపిల్ల లా ఉండే నేను,    వయసు మనసు  పరిణితి చెంది  ఈడొచ్ఛిన   పిల్ల లా అయ్యాను.


• కాలమా … నీ లోని కాలం  సంవత్సరాలు గడిచేకొద్దీ కరిగి పోతూ ఉంది.    కానీ నాకు, నా లోని కాలం ఎప్పటికీ  స్థిరం గా  అలానే ఉంటుంది….. కాలం కరిగినా  నేను ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాను. అని అర్థం.

• కాలమా … వాతావరణాని కి  అనుగుణం గా నీ రూపం ఎలా మారినా, నన్ను చివరి వరకు వదలవు.  కాలం ఎలా మారుతూ ఉన్నా  నాతో ఎప్పటికీ ఉంటుంది. అని అర్థం.


• వసంత ఋతువు లో ని  మల్లె లతో   నాలో చిలిపి తనం  చిగురించింది.

• గ్రీష్మ ఋతువు లో ని  విరజాజులు    నాలో విరహ వేదనను  మురిపించాయి.

• కాలమా … నీ బుతువుల ద్వారా వచ్చే  సంతోషాలు నా కే.


• వర్ష బుతువు  లో ని   చామంతులు నాలో చినుకుల  వలె  సంతోషం తో  ముంచాయి.

• శరత్ బుతువు  లో ని  బంతి పువ్వు లా  నాలో నిండు వెన్నెల విరిసింది.

• కాలమా … నీ రాజరికపు అందాలు నా వే.


• హేమంత ఋతువు  లో ని  లిల్లీ పువ్వు లా రాత్రంతా   మంచులో  తడిసి బిగిసుకు పోయాను.

• శిశిర ఋతువు లో  రాలిన  పారిజాత పువ్వు నై ప్రకృతి లో  తిరిగి  చిగురించడానికి  సిద్దమై ఉన్నాను.

• కాలమా … నీ నిదర్శనాలకు , సౌందర్యం  నే నే.


యడ్ల శ్రీనివాసరావు 30 Nov 2022 11:00 pm.








Tuesday, November 29, 2022

276. ఏది పదిలం ... ఏది శిధిలం


ఏది పదిలం ... ఏది శిధిలం



• ఏది పదిలం   ఏది శిధిలం 

  నిజము ను   తెలిపేటి   నిత్యానందుడా

  సత్యము ను  చూపేటి   సదానందుడా

  ఏది పదిలం   ఏది శిధిలం


• పదిలమనుకుని  పరుగులెడు తున్న

  భౌతిక   భోగాలు   పదిలమా.

• శిధిలమనుకుని   కనుమరుగు నున్న

  సత్యత్రేత  వైభవాలు  శిధిలమా.


• ఏది పదిలం     ఏది శిధిలం

• ఏది పదిలం     ఏది శిధిలం.

 

• మాయ లోని    మనిషి కి   ఊయలూ గే

  జీవితం  పదిలమా.

• జ్ఞాన మెరిగిన   జీవి కి    నిశ్చల మైన

  జీవనం   శిధిలమా.


• విలువను  నిర్థేశించే 

  రంగు కాగితాల   హంగులు  పదిలమా.

• వలువలు లేని 

  వితరుని  బ్రతుకు  బంధాలు  శిధిలమా.


• ఏది పదిలం   ఏది శిధిలం 

  నిజము ను   తెలిపేటి   నిత్యానందుడా

  సత్యము ను  చూపేటి   సదానందుడా

  ఏది పదిలం    ఏది శిధిలం.


• పదిల మనుకొ నే      పరువం లోని  

  అందాలకు  బానిస అవుతారు.

• శిధిల మై  పోతార నే   నీతి  

   న్యాయాలకు అతీతు లవుతారు.


• ఏది పదిలం    ఏది శిధిలం

  ఏది పదిలం    ఏది శిధిలం

• దైవము పదిలం.

  దేహము శిధిలం.


ఓం నమఃశివాయ 🙏


వలువలు = వస్త్రాలు

వితరుడు = త్యాగి, వేమన


యడ్ల శ్రీనివాసరావు 29 Nov 2022 , 10:00 pm.


Sunday, November 27, 2022

275. చిగురుటాకులు

 

చిగురుటాకులు



• చీకటి లో చిగురించే 

  చిగురుటాకు లా  రా ...

  మీ వర్ణం  వెలిగేది 

  వెన్నెల లో  కాదు.


• వంగని  మీ వేదన  లే 

  జీవన వేదాలు  గా  మారాయి ...

  ఆకలి  ఆర్తనాదాలను 

  అంబరానికి  తరిమి  కొట్టాయి.


• ఈ పచ్ఛదనపు  ప్రకృతి లో 

   పల్లకీలు  లేకపోతే  నేమీ ...

   పంచభూతాల  ప్రేమతో 

   పదిలం గా  పెరుగుతుంటారు.


• రెపరెప లాడే 

  మీ  రెక్కల  రోదన ...

  చకచక తాకే 

  సుతి మెత్తని  శీతలాన.


• వేడికి  వాడని   మీ వాలకాలు

  వెలుగు కు  వన్నె  తెచ్చే  వనరులు.


• శిశిరం లోని   చైతన్యం   మీ  జీ వనం

  ఓరిమి కలిగిన  ఔషధం  మీ జీ వం.


భావం


• అర్థరాత్రి చీకటి లో చిగురించే చిగురుటాకులా రా , మీ రంగు కనపడేది చంద్రుని వెన్నెల లో కాదు.

• చీకటి బ్రతుకుల తో జీవించే అనాధ బాలలారా, మీ ప్రతిభ కు గుర్తింపు ఒంటరితనం లో రాదు.


• చిగురిస్తున్న ఆకులు సూర్యరశ్మి లేని చోట కూడా వాతావరణానికి అనువు గా ఆహారం తయారుచేసుకొని ఆకాశం వైపు గర్వంగా చూస్తాయి.

• అనాధలు వీడని కష్టాలను  వారి  జీవితానికి   రాచబాటలు గా చేసుకుని, ఆకలి కేకలను దరి చేరకుండా ఆకాశం అంత దూరానికి తరుముతారు.


• ఆకులకు ఏ రక్షణ లేకపోయినా ప్రకృతి ఒడిలో పంచభూతాల ప్రేమతో పెరుగుతాయి.

• అనాధలకు ఎవరు లేకపోయినా, సంరక్షణ సదుపాయాలు లేకపోయినా ఈ ప్రకృతి పంచభూతాల ప్రేమతో సంరక్షిచబడతారు.


• ఆకు రెపరెప కొట్టుకొని బాధతో చేసే శబ్ధం కూడా, శీతల గాలికి సుకుమారంగా అనిపిస్తుంది.

• నిర్బాగ్యులు కాయకష్టం చేస్తున్నప్పుడు పడే బాధ, ఆక్రందనలు ధనవంతులకు చాలా సున్నితంగా అనిపిస్తాయి.


• ఆకులు ఎండలో వాడిపోకుండా వేడి నుండి నీడని చల్లదనాన్నిస్తూ వెలుగుకు సొగసు నిస్తుంది.

• నిరుపేదలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎటువంటి కష్టమైన పని ని చేస్తూ ధనవంతులకు సుఖాన్ని ఇచ్చే వారుగా ఉంటారు.


• ఆకులు శిశిర రుతువు లో కురిసే మంచు చే, చైతన్యం పొందుట వలన , ప్రతికూలతలు తట్టుకునే శక్తి కలిగి స్వీయ ఔషదం గా జీవిస్తాయి.

• అనాధలు పేదరికం వలన కోరికలు కలగక , నిర్మలత్వం అనే చైతన్యం పొంది సహనం అనే దివ్యౌషధం తో జీవిస్తారు.


యడ్ల శ్రీనివాసరావు 27 Nov 2022 10:30 pm


Friday, November 25, 2022

274. బుజ్జాయి

 

బుజ్జాయి


• బుల్లి   బుల్లి   బుడతడు

  వడి    వడి     వస్తాడమ్మా

  పడి    పడి     లేస్తాడమ్మా.


• బుజ్జి  బుజ్జి   పాదాలతో

  చిట్టి    పొట్టి    రాగాలతో

  వడి    వడి     వస్తాడమ్మా

  పడి    పడి     లేస్తాడమ్మా.


• ఆదమరచి   నిదురిస్తూ   చంద్రుని లా

  పున్నమి     వెన్నెల ను     తలపిస్తాడు.


• బోసి నోటి   నవ్వుతో    చొంగ ను  కారుస్తూ

  మందారం లా   మకరంద  మవుతాడు.


• బుజ్జి   బుజ్జి   పాదాలతో

  చిట్టి    పొట్టి    రాగాలతో

  వడి    వడి     వస్తాడమ్మా

  పడి    పడి      లేస్తాడమ్మా.


• మాట   రాని   చిన్నోడు

  మౌనం గా   చూస్తాడు.

• సైగ లతో   ఏదో   చెప్పాలని

  చేతు  లూపుతుంటాడు.


• ఆకలి ని    చెప్ప లేక

  శోకము ను   పెడతాడు.

• ఆ పైన

  ఆనందం తో    ఉంగా ... ఉంగా .‌..  అంటూ

  కన్ను  కొడుతూ నే  ఉంటాడు.


• బుల్లి   బుల్లి   బుడతడు

  వడి     వడి    వస్తాడమ్మా

  పడి     పడి    లేస్తాడమ్మా.


• అమ్మ   పొత్తిళ్ళలో   తన్నుతూ

  ఎగసి   ఎగసి   పడతాడు.

• జోలపాట తో   నిదుర లో   జారుకొని

   శివయ్య తో   ఆటలే     అడుతాడు.


• అమ్మ   కౌగిలి లో   వెచ్చగా

  చలి   కాచు కుంటాడు.

• సుతి   మెత్తని   స్పర్శ తో

  గుండె లోతు  రాగాలను  వింటూ నే

• సృష్టి లోని  తొలి ప్రేమ కు

   శ్రీకారం  చుడతాడు.


• బుల్లి   బుల్లి   బుడతడు

  వడి    వడి    వస్తాడమ్మా

  పడి    పడి    లేస్తాడమ్మా.


• బుజ్జి   బుజ్జి    పాదాలతో

  చిట్టి    పొట్టి     రాగాలతో

  వడి    వడి     వస్తాడమ్మా

  పడి    పడి     లేస్తాడమ్మా.


వడి = వేగం గా


యడ్ల శ్రీనివాసరావు 25 Nov 2022 10:00 pm.









Thursday, November 24, 2022

273. కవి మంజరి

 

కవి మంజరి


• మంజరి … ఓ మంజరి

• నా మది లో  వెలసిన   ఈ కావ్యమంజరి

• ఏ సిగ లో   చేరునో

  అదియే   నా  స్వర్ణ మంజరి.


• నా  పదము ల   రూపు తో

  పరువం  నిండిన   కుసుమమా

• నీ పలకరింపు తో

  ఈ సమయం  పరిమళం .

• నా మనసే   మలయమారుతం.


• మంజరి … ఓ మంజరి

• నా మది లో  వెలసిన    ఈ కావ్యమంజరి

• ఏ సిగ లో   చేరునో

  అదియే నా  స్వర్ణ  మంజరి.


• నా రంగు ల    "కల" ము న    విరిసిన

  హంగు లే     నీ  లావణ్యం‌.

• నీ  ఊగిసలాట  తో

  ఈ  కాలం  సుందరం.

• నా   జీ "వనం"   హరివిల్లు.


• నీ  తేజం    వాడి నా

  నా  పదం   వీడ దు.


• నీ   అందం   మెరిసి నా

  నా  స్తోత్రం  తరగ దు.


• ఇలలో  వెలసిన    ప్రకృతి     నీవు

• కళతో   కొలిచిన   కావ్యము  నేను

• కలవని  కలిమి తో 

  కొలువై  ఉంటాము  కలకాలం.


• మంజరి … ఓ మంజరి

• నా  మది లో  వెలసిన   ఈ కావ్య మంజరి

• ఏ సిగ లో చేరునో

  అదియే   నా స్వర్ణ మంజరి.


మంజరి = చిగురించిన లేత కొమ్మ నున్న తొలి పువ్వు


యడ్ల శ్రీనివాసరావు 24 Nov 2022 7:00 pm .



భావం 


లేత కొమ్మ నున్న తొలి కుసుమమా ! (పుష్పం)

నా మనసు లో  ఉదయించిన  ఈ కవితా పుష్పం  నీవు.

ఏ సిగ లో   కొలువు  అవుతావో,  ఆమే నాకు బంగారు పుష్పం.

నే కీర్తించిన  పదముల తో  రూపుదిద్దుకున్న  అందమైన ఓ కుసుమమా (పువ్వు)

నీ పలకరింపు తో   ఈ సమయం   సుగంధ భరితం అవుతుంటే

నా మనసంతా  చల్లని  సేద తీరే  గాలి లా అయిపోయింది.


ఓ కుసుమమా ! (పుష్పమా)

నా కలము యెక్క సిరా రంగులే, నీ రూపు రేఖల సౌందర్యం.

నువ్వు అటు ఇటు ఊయలలా ఊగిస లాడుతుంటే

ఈ కాలం అంతా చాలా సుందరంగా ఉంది.

నా  జీ “వనమంంతా”   ఇంద్రధనుస్సు  రంగుల వలే ఉంది.


ఓ కుసుమమా ! (పుష్పమా)

నీ వికాసం వాడిపోయిన,   నా పదముు  నిను  వీడదు.

నీ అందం  ఎంత  మెరిసినా ,  నా వర్ణన  తగ్గదు.

ఈ భూమి పై   అవతరించిన   ప్రకృతి లో   పుష్పం నీవు.

కవితా  కళ నై   లిఖిస్తూ,  నిను కొలుస్తున్న   కావ్యం నేను.

పూవు  కలము  కలవవు కాని,   కలిసే  ఉంటాయి కమ్మని  కావ్యమై  కల కాలం.









Friday, November 18, 2022

272. సంపూర్ణ స్థితి Zero State (0)


  సంపూర్ణ స్థితి  Zero State (0)



• జీరో , సున్నా , శూన్యం విడిగా చూస్తే అది ఒక విలువ లేని సంఖ్య.   సున్నా ని కనుగొన్నది బ్రహ్మ పుత్ర  అయితే  సంఖ్య శాస్త్రం తో  ప్రపంచానికి విలువను  పరిచయం చేసింది  మాత్రం ఆర్యభట్ట. సంఖ్యా శాస్త్రం లో 1 నుండి 9 వరకు ఉన్న సంఖ్య లు చాలా విలువైనవి.  ఈ సంఖ్య లే   దేని విలువ నైనా నిర్ణయిస్తుంటాయి.  ఇది అందరికీ తెలిసిన విషయం. 1 నుండి 9 వరకు మధ్య లో  ఉన్న సంఖ్య ఎంత పెరిగితే అంత విలువ పెరుగుతుంది అని అనుకుంటాం. కానీ స్పష్టం గా, సూక్ష్మం గా గమనిస్తే ఇది అవాస్తవం.


• విలువ లేదు అనుకునే ఒక సున్నా ని ,  ఏదైనా సంఖ్య  చివర   చేరిస్తే నే  (1-9)   దాని విలువ పెరుగుతుంది.  లేకపోతే 1 నుండి 9 మధ్య గల ఈ సంఖ్యల విలువ చాలా అల్పం గా ఉంటాయి.    

అంటే విలువ లేదు అనుకునే సున్నా యే ఎంతైనా, ఆఖరికి అనంతమైన విలువ ను పెంచుతుంది అనేది వాస్తవం.


• అదే విధంగా. అసలు విషయం ఆలోచిస్తే మనిషి తన జీవితానికి కూడా హోదా (status) విలువ ను నిర్ణయించుకుంటాడు. చెప్పాలంటే నేటి కాలంలో పూర్తిగా ఈ హోదా (status) విలువ ని బట్టే సమాజం లో పరిచయాలు, స్నేహాలు, సంబంధాలు, బంధుత్వాలు ఏర్పడడం జరుగుతుంది అనేది పూర్తి వాస్తవం.


• మనిషి కి ఈ హోదాను (status) విలువను నిర్ణయించే వనరులు  ధనం, ఆస్తులు ,  అందం,  ఉద్యోగం , ఐశ్వర్యం ,  చదువు , విలాసాలు .  వీటినే అసలు సిసలైన సంపదలు గా భావిస్తూ,   ఇవి కలిగి ఉన్న స్థాయి ని బట్టి, మనిషి యొక్క హోదా (status) విలువ నిర్ణయించబడి relationships , కొత్త బంధాలు, పుట్టుకు రావడం అనేది నేటి కాలంలో జరుగుతుంది.


• ఈ భౌతిక ప్రపంచంలో ఒక మనిషి తన  చుట్టూ పైన పేర్కొన్న వనరులు ఎంత ఎక్కువగా ఉంటే , అంతగా ఆ మనిషి కి విలువ హొదా (status) నిర్ణయించ బడుతుంది.  ఇవి ఏమియు అంతగా లేని వారికి విలువ, హోదా  లేన్నట్లు  సమాజం లో స్థితి ఉంటుంది.  దీనిని బట్టి చూస్తే ఈ భౌతిక ప్రపంచంలో ఆడంబరాలకి  ఉన్న ప్రాముఖ్యత నిరాడంబరాలకి ఉండదు.  ఇది నిత్యం ఏదొక సందర్భంలో  అందరూ అనుభవిస్తున్న స్థితే.  

ఇదంతా మనుషుల కి  మానసిక ఆలోచనలో నుంచి ఉద్భవించిన స్థితి.  


• అంటే మనుషులు  అంతర్గత  సంపదలైన  గుణం, వ్యక్తిత్వం,  ప్రేమ,  దయ,  మంచితనం , నిస్వార్థం వంటి నిరాడంబర  లక్షణాలు   కంటే  బాహ్య  సంపదలకే  ఎక్కువ ప్రాధాన్యత  ఇస్తూ ఉంటారు  అనేది చాలా వరకు స్పష్టం.


• ఈ సృష్టికి  మూలం , తండ్రి పరమాత్మ శివుడు, అని చాలా మంది కి తెలుసు.  శివుడు ఆది పురుషుడు, మానవాళికి జ్ఞానం తెలియ చేసిన మూల గురువు ,  సర్వ శక్తి సంపన్నుడు,  కాలాన్ని అధీకృతం చేసుకుని  సృష్టి ని పరిపాలించే లోక రక్షకుడు అని  అందరూ విశ్వసిస్తారు ,  పూజిస్తూ ఉంటారు.  

కానీ ఆలోచించి చూస్తే అంత సర్వ శక్తి సంపన్నుడు  కూడా బైరాగి లా  చిన్న పులిచర్మం తో   నిండా విభూతి పూసుకుని,   చేతిలో త్రిశూలం తో,    మెడలో కాల నాగుతో ,   కపాలాలు ధరించి,   జుత్తు అంతా జడలు జడలు గా చూడడానికి  అందవికారంగా  మరియు నిరాడంబరంగా కనిపిస్తూ,    స్మశానం లో ఉంటాడు.   అంటే ఈ విశ్వాన్ని సంరక్షించే లోక నాయకుడు కి  అన్ని శక్తులు ఉన్నా ఏమీ లేనట్లు నిరాడంబరత తో  శూన్యమైన స్థితి లో    బైరాగి లా జీవితం గడుపుతూ ఉంటాడు.  ఇక్కడ  ముఖ్యంగా గమనించవలసిన విషయం శివుని యొక్క తత్వం. ఆయనకు   సర్వ  సంపదా  శక్తులు  ఉన్నా ,  అవి ప్రరదర్శించకుండా ,  శరీరానికి అంటించుకోకుండా,    ఆలోచనలను  శూన్యం చేసుకుని ,  తనకు తాను విలువ రహితమైన  లేదా  భార రహితమైన  Zero State  శూన్య స్థితి తో  నిరాడంబరంగా  ఆయన జీవిస్తూ , సమస్త మానవాళికి అయన తన రూపం తో సందేశం ఇస్తుంటాడు.  (కేవలం తప్పని సరి పరిస్థితుల్లో నే ఆయన శక్తి ని  ఉపయోగించి దుష్ట శక్తులను నాశనం చేసి లోక కల్యాణం చేస్తాడు.)


• శివుడు అనంతమైన  శూన్య స్థితిని  కలిగి  ఉండడం వలనే ఈ మొత్తం సృష్టి,  సృష్టిలో ఇతర జీవాలు విలువైనవి గా  తయారు కాబడి  ఆవాస యోగ్యం అయ్యాయి.    అంటే శివుని శూన్య స్థితి జీవనం వలన ఈ సృష్టి కి హోదా విలువ status పెరిగింది అనేది గ్రహించవలసిన విషయం.  శివుని కి  శూన్యత్వం లేకపోతే ఈ సృష్టి ఉన్నా సరే విలువలేని ది అనేది స్పష్టం.


• అదే విధంగా ఆధ్యాత్మిక జీవనము  ద్వారా నిరాడంబరంగా  శూన్యమైన స్థితి కి   చేరుకున్న వారు పరిపూర్ణ అలౌకిక శక్తి సంపన్నులు అవుతారు. ఎందుకంటే ఆలోచించి చూడండి అనాదిగా భారతీయ యోగులు, మహర్షులు ఎంత నిరాడంబరంగా ఉండే వారో.  వారిలో శక్తి  అపారం గా ఉండేది.  వందల సంవత్సరాలు జీవించే వారు. 

నేటి కాలంలో ఎంతో హోదా status విలువ కలిగి ఉన్నాము అనుకునే ధనవంతులు,   ప్రధాన మంత్రులు, అంబానీ లు అని ఆడంబరం గా చెప్పు కునే వారంతా ఎక్కడో అడవుల్లో ఆశ్రమాల్లో కాషాయం తో నిరాడంబరంగా ఉన్న సాధువుల కాళ్లు పై పడి  నమస్కరిస్తూ ఉండడం చూస్తుంటాం.

అంటే ఎంత ఆడంబరమైన  సరే  ఏదో ఒక రోజు నిరాడంబరం దగ్గర తల దించు కోవలసిందే ఎందుకంటే అది శివుని ఆజ్ఞ.   శివుడు చెప్పిన జ్ఞానం అర్దం చేసుకుంటే తాను జీవించిన నిరాడంబర విధానం మానవాళికి లోక కల్యాణానికి నిర్దేశించిన మార్గం.


• ఈ భౌతిక ప్రపంచంలో విలువైనవి గా భావించే ధనం, ఆస్తి, ఉద్యోగం, హోదా, వ్యాపారం, విలాసాలు వంటివి కలిగి ఉన్నా  సరే  వాటికి దాసోహం కాకుండా, వాటి ఉచ్చు లో పడకుండా  మనిషి తన  మానసిక స్థితి ని   వీటన్నింటి  కి  అతీతంగా ,  బురదలో కమలపుష్పం లా ఉంచుకో గలిగితే అదే మనిషి మనసు కి    భార రహిత స్థితి,  ఆత్మానంద స్థితి,  శూన్య మైన స్థితి. 


ఈ శూన్య మైన స్థితి నే సంపూర్ణ స్థితి అంటారు


ఒక్క మాటలో శూన్య స్థితి గురించి చెప్పాలంటే ఉన్నతంగా ( Positive state)  ఆలోచించే స్థితి  మరియు అల్పంగా (Negative state ) ఆలోచించే స్థితి,  ఈ రెండింటి  మధ్యలో ఉన్నదే  శూన్య స్థితి (Neutral state). 

Mathematical graph లో చూస్తే  zero కి  ఎడమ వైపు negative, కుడివైపు positive  ఉండి మధ్యలో సున్నా ఉన్నట్లే,  ఏదైనా కలిగి ఉన్నా,  లేక పోయినా  సరే  ఒకేలా స్థితప్రజ్ఞత తో  మనసు, బుద్ది, ఆలోచనలను ఉంచుకోవడమే శూన్య స్థితి.   

దీనినే మనసుకు నిశ్చలమైన స్థితి అంటారు..


ఈ శూన్య తత్వం పొందడం వలన మనిషి తాను చేయాలనుకునే పనిని వివేకంతో చేయగలడు. నిత్యం ఉత్సాహం గా ఉంటూ ఆరోగ్యం గా ఉంటాడు.  ఎక్కువ కాలం ఆనందం గా జీవిస్తాడు.  ఆందోళనలు, సమస్యలకు  కు అతీతంగా  జీవన ప్రమాణాలు పెరుగుతాయి.  భౌతిక ప్రపంచంలో అన్నీ పరిపూర్ణం గా  అనుభవిస్తూ నే   ఎటువంటి  మోహలకు, ప్రలోభాలకు  వశం కాడు.  సంపాదించిన ధనం సమర్థవంతంగా వినియోగిస్తాడు.  దైవీక గుణాలు అలవాటు అవుతాయి.  ఇది ధ్యాన సాధన తో మాత్రమే  సాధ్యం అవుతుంది.  శివ పరమాత్ముడు కూడా ధ్యానం తో నే సమస్త సృష్టి ని  చూస్తుంటాడు.


• మనిషి నిరాడంబరంగా , శూన్య తత్వం తో జీవించ గలగడం అనేది   ఎంతో  హొదా status విలువ కలిగినది.  ఈ స్థితి పొందాలి  అంటే అభ్యాసం తప్పని సరిగా చేయాలి.  ఎందుకంటే జన్మ జన్మలు గా  ఆత్మ  తన స్వశక్తి కోల్పోయి ,  దేహమే  శాశ్వతం అనుకొని , శరీరం పై మమకారం పెంచుకోని వికారాలకు, ఆడంబరాలకు అలవాటు పడిపోయి శక్తి హీనత తో దుఃఖం అనుభవిస్తూ ఉంది.


• శివుని పూజించాలి.  కాని అంతకంటే ముఖ్యంగా శివుని  తత్త్వాన్ని సహేతుకంగా అర్థం చేసుకుని ఆచరించాలి. అలా చేస్తే  శివుని చేరుకున్నట్లే.  


ఈశ్వరుని సంకల్పం తో

ఓం నమఃశివాయ 🙏


గమనిక :  నేటి కాలంలో యువత,   సరిగా ఏ విషయం పూర్తిగా అర్దం చేసుకునే సమయం, తీరిక, శక్తి లేక పూర్వీకులు, బుషులు, మహర్షులు ఇచ్చిన ఎంతో విలువైన  జ్ఞాన సంపదను  కాలదన్నుతు , పెద్ద వారు, గురువులు పట్ల గౌరవం , మర్యాద లేకుండా అయోమయంలో  ఆడంబర జీవితం గడుపుతూ , చిన్న వయసుల  లోనే  మానసిక వైఫల్యం పొందుతూ, అర్దం లేని ఆహారపు అలవాట్లు తో అదే అభివృద్ధి అనుకొని  , బయటకు చెప్పుకోలేని  అనారోగ్యాలతో అర్దాంతర మరణాలు, ఆత్మహత్యల భారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.  

వీటన్నింటినీ ఆపాలి అంటే మనిషి కి  శివుని జ్ఞానము,  దైవ చింతన ,  Inner Healing , Zero State of Mind చాలా అవసరం .

 


యడ్ల శ్రీనివాసరావు. 18 Nov 2022 10:30 pm.





Thursday, November 17, 2022

271. ఆది పురుషుడు

 

ఆది పురుషుడు



• అంత్యకాలమున  అవతరించిన   ఆది పురుషా

• సంధికాలమున    సంగమించిన    సత్వ పురుషా


• ఏమి కోరేది  …  ఏమి అడిగేది

• వీసెడు  విభూతి తో 

  విను వీధిన    విహరించే    విజయేశుడా

• ఏమి కోరేది  …  నిను ఏమి అడిగేది


• కలి మాయ తో     

  కల్లోల  మవుతున్న  జీవులం.

• కన్నీటి  లో   మునిగి 

  కరిగి  'పో'తున్న   పాపులం.


• అజ్ఞాన చీకటి లో 

  ఆశాపాశాలకు  వశమైన    అంధులం.

• సుఖశాంతి కోసం 

  శతకోటి  దండాలు  పెడుతున్న  ధీనులం.


• అంత్యకాలమున    అవతరించిన   ఆది పురుషా

• సంధికాలమున     సంగమించిన    సత్వ పురుషా


• ఏమి కోరేది  …  ఏమి అడిగేది

  ఏమి కోరేది  …  నిను ఏమి అడిగేది


• ఆది గురువై న      ఓ శివ పరమాత్మ

  సత్యము ను చూపు      జ్ఞానము ను తెలుపు.


• బూటకపు   నాటకపు

  బ్రతుకులే గా   కర్మ బంధాల   జీవితం.

• ఎత్తులు పై ఎత్తుల

  ఆట యే గా   చెదరంగపు   జీవనం.


• దుఃఖము లో    సూక్ష్మ  దివ్యత్వం

  దాగి ఉందని     ఎందరికి తెలుసు.

• సుఖము తో     చివరికి   హీనత్వం

  మిగులు నని    ఎందరికి తెలుసు.


• అంత్యకాలమున   అవతరించిన   ఆది పురుషా

• సంధికాలమున     సంగమించిన   సత్వ పురుషా


• ఏమి కోరేది  …  ఏమి అడిగేది

  ఏమి కోరేది  …  నిను ఏమి అడిగేది.


• కాష్టం లో    నిదురవుతావు

  కాటికాపరి లా  తిరుగుతావు

  నీ బైరాగి  తత్వం  ఎందరికి  ఎరుక.


• మాయలో  తేలుతూ

  మోహం లో  మునిగే  వారికి

  నీ *మర్మమేమిటో  ఎప్పటికీ  తెలిసేది.



*మర్మము = జీవన స్థితి, రహస్యం.


అంత్యకాలం, సంధికాలం అనగా కలియుగం పూర్తిగా అంతం అయ్యే సంగమ సమయంలో(ప్రస్తుతం నడుస్తున్న కాలం) అది పురుషుడు, సత్వ (బలం, భాగ్యం) పురుషుడు అయిన శివ పరమాత్ముడు ఈ సృష్టి ని లయం చేయడానికి  వస్తాడు.

కలియుగంలో మాయలో పడి మనుషులు అజ్ఞానులై ఈ రంగుల ప్రపంచం నిజమైనది, శాశ్వతమైనదని భావించి , భగవంతుడు ని అర్దం లేని స్వార్థం తో కూడిన కోరికలతో పూజిస్తారు , కానీ ఫలితం పొందక దుఃఖిలై కొట్టుమిట్టాడుతారు.   


మానవ బంధాలు,  రక్త సంబంధాలు  అన్నీ  పూర్తి గా గోతికాడ నక్కల వలె మోసపూరితమైన ఆలోచనలతో కలుషితం అయిపోతాయి.  మోహం తో  లౌకిక సుఖాలకు బానిసలై హీనత్వం పొంది, అనారోగ్యాల బారిన పడి అర్థాంతరంగా కాలం చేస్తారు. 

ప్రతీ ఒక్కరూ దుఃఖం లో మునిగి ఉంటారు కానీ, ఆ దుఃఖం లో నే, దుఃఖం తోనే భగవంతుడు తమ పాప కర్మలను దగ్దం చేసి దివ్యత్వం కలుగ చేస్తాడని గ్రహించలేరు. ఇదంతా కలి మాయ ప్రభావం వలన మనిషి సత్యం  అనేది  గ్రహించక పోవడం వలన, ధర్మం ఆచరించక పోవడం వలన జరుగుతుంది.


బాధలు భరించలేక ఉపశమనం కోసం భక్తి చేస్తారు కానీ అందులో అంతరార్థం  గ్రహించ లేక,    జీవన విధానం , మనసు, బుద్ది , ఆలోచనల ను మార్చు కోలేక నరక యాతన అనుభవిస్తూ ఉంటారు. 

శివుని పూజిస్తారు కానీ శివుని తత్వం తెలుసుకో లేరు. ఎటుచూసినా, ఏం చూసినా అంతా ఆడంబరం తప్ప సూక్ష్మ స్థితి , పరిజ్ఞానం ఉండదు. దీనంతటికీ మూలం ఆది గురువై న శివుడు చెప్పిన అసలు సిసలైన జ్ఞానం తెలుసుకోలేక పోవడం.


భగవంతుని పూజించడం  కంటే అర్దం చేసుకోవడమే అత్యంత ఉత్తమం.  (అంటే పూజ చేయ వద్దు అని కాదు,  భగవంతుడు ఆచరించ మని  చెప్పి న విధంగా ఆచరిస్తే  అది పూజ కంటే గొప్ప ది  అని అర్దం.)


యడ్ల శ్రీనివాసరావు 17 Nov 2022 11:00 pm.





Wednesday, November 16, 2022

270. శివుని హరివిల్లు

 

శివుని హరివిల్లు



• రంగు రంగుల వాడు   

  నా శివుడు‌.

  సృష్టి  రంగము ను  రంగరించే   సారంగధరుడు 

  నా హరుడు.


• మల్లె వలె   తెల్లని   శాంతము తో

  మౌన ముని లా   

  మనసులో  నిలిచేటి

  మంగళాకారుడు.


• మందార మంటి   ఎర్రని   రౌద్రుడు

  దోసెడు  జలము  కే

  సంతుష్టుడై   సంబరా  పడతాడు.


• రంగు రంగుల వాడు   

  నా శివుడు

  సృష్టి  రంగము ను    రంగరించే  సారంగధరుడు 

  నా హరుడు.


• చామంతి    ప్రియము తో  పసుపంటి

  సకల శుభములను  కురిపించే టి  

  సుమనోహరుడు.


• సంపెంగ  పచ్చ తో  పరిమళము  విరజిల్లి

  రేయి పగలు  నేలూతూ  చల్లగా  చూచేటి

  చంద్రశేఖరుడు.


• రంగు రంగుల వాడు 

  నా శివుడు.

  సృష్టి  రంగము ను   రంగరించే   సారంగధరుడు 

  నా హరుడు.


• శంఖు  పుష్ప  రూపాన 

  నీలి మేని రమ్యము తో,

  నగుమోము పై   నెలవంక ను   

  నెలకొన్న  సుందరాంగుడు.


• కనకాంబర  కమల   కాంతితో

  కనులు మూసి  ధ్యానము తో 

  జ్ఞానము  నిచ్చే  కేదారేసుడు.


• రంగు రంగుల వాడు 

   నా శివుడు

  సృష్టి  రంగము ను   రంగరించే  సారంగధరుడు 

  నా హరుడు.


• నీలాంబర మంటి   

  నీల మేఘ  *నిర్వేదం తో

  *నీరాజనములు   కొలువైన నిరంజనుడు.


• కురింజి పుష్పం  లా  

  పుష్కరాన   “ఊదా” డే   

  ఉదకము న    పుష్కరస్థపతుడు‌‌.


• రంగు రంగుల వాడు 

  నా శివుడు

  సృష్టి రంగము ను   రంగరించే   సారంగధరుడు 

  నా హరుడు.


Rainbow 🌈 

WHITE colour scattered splits into 7 colours


V iolet ఊదా రంగు - కురింజ పుష్పం

I ndigo నీలాకాశ వర్ణం - నీలాంబర పుష్పం

B lue నీలం - శంఖు పుష్పం

G reen పచ్చ- సంపెంగ

Y ellow పసుపు – చామంతి

O range నారింజ కమలా – కనకాంబరం

R ed ఎరుపు – మందారం


నిర్వేదం = అనంతమైన వైరాగ్యం, విరక్తి

నీరాజనములు = దీపము, పద్మము, వస్త్రము, మామిడి పండు, తమలపాకు

కురింజి = పన్నెండు సంవత్సరముల కొకసారి నీలగిరి పర్వతాలపై పూసే అరుదైన ఊదా రంగు పుష్పం.

ఊదాడే = చలనం, కదిలే, చలించే

ఉదకము = నీరు

పుష్కరస్థపతుడు = శివుడు.


యడ్ల శ్రీనివాసరావు 15 Nov 2022 2:30 pm


Tuesday, November 15, 2022

269. శివుడు ఎక్కడున్నాడు

 

శివుడు ఎక్కడున్నాడు


• శివుని  స్మరణ   చేయ రా

  చింతలన్ని  చితి కి  చేరు రా.


• నుదుట విభూతి   ధరించ రా

  దుష్ట శక్తు లేవి  దరికి  రావు రా.


• మూడు కన్నుల  శివుడు   

  నీలోనే  ఉన్నాడు  రా

  కనులు మూసి   మనసు తెరిచి   

  బుద్ది తో   చూడ రా.


• దేహం లో దాగిన  

  దివ్యశక్తి  రూపమే  శివుడు  రా.

  దుర్గుణాల   దారిద్ర్యం లోని  

  నీకు కాన  రాకున్నాడు రా.


• శివుని  స్మరణ  చేయ  రా

  చింతలన్ని  చితి కి  చేరు రా.


• నుదుట విభూతి  ధరించ రా

  దుష్ట శక్తు లేవి  దరికి  రావు రా.


• పిలిచిన పలుకుకి  

  పరవశమై  పలికెడు వాడు శివుడు.

  బ్రతుకు బాటలో  

  ధర్మ మనే  దారి  చూపేటి  వాడు  శివుడు.


• సుఖ దుఃఖాలు తో   

  ఓర్పు నేర్పు ల   నిచ్చేటి  వాడు  శివుడు.

  బంధనాల   “చెద”రంగం   నుండి   

  విముక్తి  నిచ్చేటి వాడు  శివుడు.


• కాల కడలి ని  

  నొసట   నిలిపిన  కాలుడు  శివుడు.

  మరణ సయ్యన  

  మృత్యువు ను   ఆపేటి   జయుడు శివుడు.


• శివుని  స్మరణ  చేయ రా

  చింతలన్ని  చితి కి   చేరు రా.


• నుదుట  విభూతి  ధరించ  రా

  దుష్ట శక్తు  లేవి    దరికి  రావు రా.


• అండ పిండ  బ్రహ్మాండాల  చైతన్యం  శివం

  ఆది అంత   కారకాల  సంయోగం  శివోహం.


• శివుని  చేరిన   జీవి  జన్మము   సార్ధకం

  శివుని సాంగత్యం   ఆత్మ శుద్ది  తోనే  సాధ్యం.


• శివుని  స్మరణ   చేయ  రా

  చింతలన్ని   చితి కి   చేరు రా.


• నుదుట  విభూతి  ధరించ రా

  దుష్ట శక్తు లేవి   దరికి  రావు రా.


• ఓం నమఃశివాయ   ఓం నమఃశివాయ.

  ఓం నమఃశివాయ   ఓం నమఃశివాయ.



చితి =  అగ్ని కాలుట, మంట


యడ్ల శ్రీనివాసరావు 13 Nov 2022 11:00 pm.




Saturday, November 5, 2022

268. శివ తాండవం

 

‌శివ తాండవం



• అహో   తాండవం         శివ తాండవం

  నిత్యం  అఖిలాండం       సర్వం బ్రహ్మాండం


• బ్రహ్మ   సర్వరీ  న      రుద్ర తాండవం

  బ్రహ్మ   అహస్సు  న   ఆనంద తాండవం


• అహో  తాండవం        శివ తాండవం

  నిత్యం  అఖిలాండం    సర్వం బ్రహ్మాండం


• శివుని  తాండవము  నే     సృష్టి గమ్యం

  శివుని  పాటవము    నే     భువన రహస్యం


• తాండవ మాడే   తడవు నే 

  తంతి గా   మారె   గోళం.

• తంతి  ‌ సఫలము  నే 

  సమయజ్ఞత  కలిగె   ఖగోళం.


• విశ్వ  ప్రకంపనల   నాదం   "ఓం"  కారం.

  నృత్య భంగిమల   సమాహారం  స్వరూపం.

  నాద భంగిమల   ఆకారం   నిరాకారం.

  అదియే అదియే శివుని రూపం.


• అహో   తాండవం         శివ తాండవం

  నిత్యం  అఖిలాండం     సర్వం బ్రహ్మాండం


భావం


• అహ ….శివుడు చేసేటి ఉద్దతమైన నృత్యం విపరీతం.  ఈ నృత్యం ప్రతి క్షణం నిరంతరం వెలిగే దీపం లా  ఈ విశ్వం అంతా  నిండి  ఉంది.


• శివుడు అర్ద కల్పం బ్రహ్మ రాత్రి అంతా ఉగ్రరూపం తో,   అర్ద కల్పం బ్రహ్మ పగలు అంతా  ఆనందం తో  నృత్యం చేస్తాడు. ప్రస్తుతం గడుస్తున్న కాలం మొత్తం బ్రహ్మ రాత్రి.  కాలాన్ని కల్పం తో కొలుస్తారు. 

ఒక కల్పం = (4,32,00,00,000) నాలుగు వందల ముప్పై రెండు లక్షల కోట్ల మానవ సంవత్సరాలు.


• ఈ సృష్టి యొక్క ఆవిర్భావం  శివుని నృత్యం లో ఉంది. ఈ విశ్వ రహస్యమే శివుని నైపుణ్యం.


• శివుని నృత్య భంగిమల ద్వారా ఉత్పన్నమైన శక్తి కి ఈ విశ్వంలో గ్రహములు, గోళములన్నీ సన్నని తీగ వలె (flexible) అనుకూలమై , ఒక నిర్దిష్టమైన సమ శక్తి వలయాలు గా అనుసంధానించ బడినవి.


• విశ్వ ఖగోళం లో  నేటికీ వినిపించే శబ్దం “ఓం”. అనేక  నృత్య భంగిమల కలయిక ఒక నిజ రూపం. ఈ శబ్దం , నృత్యము ల  కలయిక తో   ఏ  విధమైన ఆకారము కనిపించకుండా ఒక అద్భుతమైన శక్తి మాత్రమే నిండి ఉంది.   ఆ శక్తి యే  పరమ శివుని రూపం.


యడ్ల శ్రీనివాసరావు 6 Nov 2022 , 4:00 AM







Wednesday, November 2, 2022

267. నటరాజ యోగం

 

నటరాజ యోగం


• నటరాజ  నీ రాజ యోగం

  సంగీత  సాహిత్య  సాంగత్యం


• నాట్య భంగిమల  సారూప్యం

  సృష్టి   స్థితి  లయ ల   సమ్మేళనం


• కళల కు  కొలువై న   కాంతి కోవిదుడా

  కదిలేటి  నీ  అంగములు   శ్రీ చక్ర  త్రికోణాలు


• దివ్యమున  నవ్యముతో  శక్తి నిచ్చే   దార్శనికుడా

  విశ్వరంగా న  తరంగాలు   నీ చలన  స్వరూపాలు.


• ధర్మం  ఆచరణము న  అజ్ఞానం చేయు  దాడి పై

  నిర్భయత్వం  ప్రతీక   నీ అరచేతి  అభయ ముద్ర.


• త్రిగుణాలను  ఏలేటి   త్రిలోకేశ్వరా

  తమో రజో సతో  సమన్వయ   త్రిశూలుడా


భావం


• ఈ సృష్టి శక్తి మూల స్వరూపం ఓంకార శబ్దం. అదే శివుని నాదం, సంగీతం. శబ్దానికి ఆధారం సాహిత్య పదం. ఈ రెండింటి కలయిక నటరాజ రూపం లోని శివుని కి రాజ యోగం.


• శివుడు నటరాజ రూపం లో ఈ సృష్టి చక్రము లో జరిగే ప్రతీ అంశం తన నృత్య భంగిమల ద్వారా తెలియచేస్తాడు.


• కళలకు కొలువై ప్రకాశం కలిగిన విద్వాంసుడా, చలించే నీ శరీర భాగములు అన్నియు శక్తి ఉద్భవించేటి శ్రీ చక్రం లోని త్రిభుజములు మరియు వాటి కోణాలు.


• దివ్యత్వం తో ఎప్పటి కప్పుడు నూతన శక్తి నిచ్చే విధానకర్తా , ఈ విశ్వమంతా ఆవరించిన తరంగాలు శివుడు సంచరించిన ఆనవాళ్ల గుర్తులు.


• ధర్మం అనుసరిస్తున్న సమయం లో అజ్ఞానం, చెడు తప్పకుండా తిరుగుబాటు చేస్తుంది. శివుని అరచేతి ద్వారా ఇచ్చే అభయం చెడును సంహరించడానికి ఇచ్చే ధైర్యం.


• బ్రహ్మనాదం నుండి శివుడు కనిపించినప్పుడు, సత్ (దేవ‌ లోకం) , రజో( మానవ లోకం), తమో (పాతాళ లోకం) అనే గుణాలతో ముల్లోకాలు కనిపించాయి. ఈ మూడు గుణాలు త్రిశూలంగా చేసుకుని త్రిలోకాధినేత అయ్యాడు. వీటిని సమన్వయం చేయకుండా విశ్వాన్ని నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి శివుడు త్రిశూల రూపంలో ఈ మూడు లక్షణాలను కలిగి ఉన్నాడు.


యడ్ల శ్రీనివాసరావు 3 Nov 2022 10:00 AM.


481. పరిమళ భాష

  పరిమళ భాష • ఏమిటో     ఈ  భాష   ఎద కే    తెలియని   ఆశ.   అనుభవం  లేని   యాస   సృష్టి   మూలానికి    శ్వాస. • అక్షరాలు   ఉండవు  కానీ   భావం ...